ఇవాళ ఏమి రాయాలి, ఎలా రాయాలి?

varalakshmi

(ఈ వ్యాసం వరలక్ష్మి గారు విరసం కథా రచయితల వర్క్ షాప్ కోసం రాసారు. కాని, ఇందులో ప్రస్తావించిన అంశాలు వర్తమాన కథకు అవసరమని భావించి ఈ వ్యాసాన్ని పునర్ముద్రిస్తున్నాము. ఇందుకు అనుమతించిన ‘అరుణ తార ‘పత్రిక సంపాదక వర్గానికి, వరలక్ష్మి గారికి ధన్యవాదాలు)

ఒక చీమ రోజూ ఆఫీసుకు పోయేది. ఆడుతూ పాడుతూ పని చేసేది. అది పని చేసే చోట మంచి ఉత్పత్తి వచ్చేది. సిఈవో సింహం చీమను చూసి సంతోషించేవాడు. ఒక రోజు అతను ఇలా ఆలోచించాడు. చీమ దానంతటది పనిచేస్తేనే ఇంత బాగా చేస్తోందే, దీని పైన ఒక మంచి సూపర్‌వైజర్‌ను పెడితే ఇంకెంత బాగా పనిచేస్తుందో అన్న ఆలోచన వచ్చిందే తడవుగా ఒక బొద్దింకను సూపర్‌వైజర్‌గా నియమించాడు. బొద్దింక అప్పటిదాకా లేని టైమ్‌ షీట్‌లు, అటెండెన్స్‌లు ప్రవేశపెట్టింది. వీటిన్నిటినీ చూసుకోడానికి ఒక సాలీడు సెక్రెటరీని అది నియమించుకుంది. సింహంగారు మెచ్చుకుంటూనే ఈ మార్పుల వల్ల ఉత్పత్తి ఎంత పెరిగింది, పనివిధానానికి సంబంధించిన రిపోర్టులు వగైరా అడిగారు. ఇవన్నీ చేయడానికి బొద్దింక కంప్యూటర్‌ను, ప్రింటర్‌ను  తెప్పించుకుని, వాటిని ఆపరేట్‌ చేయడానికి ఈగను నియమించింది. మరోవైపు ఆడుతూ పాడుతూ పనిచేసే చీమ నీరసించడం మొదలైంది. అది చేసే పనికితోడు పైఅధికార్లతో మీటింగులు, ఎప్పటికప్పుడు అందేయాల్సిన రిపోర్టులు దాని నెత్తిమీదికొచ్చి పడ్డాయి. ఈలోగా బొద్దింక అధికారికి తోడు మరో మేనేజరు, వీళ్ళ హోదాకు తగినట్లు ఆఫీసుకు కొత్త హంగులు, ఆర్భాటాలు తయారైనాయి. క్రమంగా చీమకే కాదు ఆఫీసులో ఎవరికీ పని పట్ల ఆసక్తి లేకుండాపోయింది. ఉత్పత్తి పడిపోయింది. సీఈవో సింహంగారు ఈ సమస్యను పరిష్కరించే పని కన్సల్టెంట్‌ గుడ్లగూబకు అప్పగించారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవడంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గుడ్లగూబగారు ఆఫీసు స్థితిగతుల్ని అధ్యయనం చేసి అక్కడ అనవసర సిబ్బంది చాలా ఎక్కువగా ఉన్నారని తెల్చారు. వెంటనే సింహం, బొద్దింక మీటింగ్‌ పెట్టుకుని కొంతకాలంగా పనిపట్ల అలసత్వం ప్రదర్శిస్తున్న చీమను పనిలోనుండి తొలగించాలని తీర్మానం చేశాయి.

ఇదొక ఈజిప్టు కథ. ఈ కథ రాసిన రచయితను దేశం నుండి బహిష్కరించారట. గత ఆరేడేళ్లుగా క్రమం తప్పకుండా జరుగుతున్న విరసం కథావర్క్‌షాపుల్లో వర్తమాన విప్లవ కథ గురించిన లోతైన సమాలోచనలు సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా గత రెండుమూడు వర్క్‌షాపుల్లో ఏం రాయాలి, ఎలా రాయాలి అనే చర్చ ప్రధానంగా సాగుతోంది. వర్తమాన సమాజాన్ని, సంక్షోభంలో కూరుకపోతున్న జీవితాన్ని, అందులోంచి నిర్మాణాత్మకంగానూ, స్పాంటేనియస్‌గానూ పెల్లుబుకుతున్న పోరాటాలను ఎలా కథలుగా మలచవలసి ఉన్నది? వీటన్నిటినీ చిత్రించవలసిన దృక్పథం, ఈ సంక్షోభాలను, పోరాటాలను పట్టివ్వగల శిల్పం ఈ సమావేశాల్లో ఎక్కువ చర్చనీయాంశం అవుతున్నది.  సమాజంలో మార్పులు వేగవంతమవుతున్న కొద్దీ వాటిని పట్టుకోడానికి సాహిత్యంలో ఎప్పుటికప్పుడు కొత్త పరికరాల తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఉన్న పరికరాల్ని చాకచక్యంగా వాడాల్సి ఉంటుంది. ప్రొద్దుటూరు కథావర్క్‌షాపులో (సెప్టెంబర్‌ 8,9- 2012) ఈ చర్చ జరుగుతుండగా  అల్లం రాజయ్య పైన చెప్పిన  చీమ కథను పరిచయం చేశారు. పెట్టుబడిదారీ వ్యవస్థలోని అసంబద్ధతను, దుర్మార్గాన్ని చాలా అలవోకగా, అద్భుతంగా ఆవిష్కరించిన కథ అని చెప్పారు.  అలాంటి మరో అద్భుతమైన శిల్పంతో మార్క్వెజ్‌ రాసిన డెంటిస్ట్‌ అనే కథను  కూర్మనాథ్‌  పరిచయం చేశారు.

944430_182879141874436_2064579889_n

మన కథలో మార్పుకు సంబంధించిన అంశం కీలకంగా ఉండాలి. అట్లాగే మారుతున్న సామాజిక పరిస్థితుల్ని చిత్రీకరిస్తున్న క్రమంలో సాహిత్యం కొత్త కొత్త వ్యక్తీరణల్ని తీసుకొని రావాలి. జీవన స్థితిగతులు మారినట్టే సాహిత్యంలో కాలానికి తగిన ఎక్స్‌ప్రెషన్‌ తీసుకోవాలి. ఈ మధ్య గాన్‌ విత్‌ ద విండ్‌ తెలుగులో చదివుతున్నప్పుడు మార్పుకు సంబంధించిన అద్భుతమైన వ్యక్తీకరణ అందులో కనపడింది. అట్లాంటాలో జరిగిన అనేక సంఘర్షణలు భూస్వామ్య సమాజం నుండి పెట్టుబడిదారీ సమాజానికి మార్పులు కనిపిస్తాయి.  తెలంగాణ సాంస్కృతిక వ్యక్తీకరణను పోలినవి అందులో చాలా ఉన్నాయి. మాలాంటి వాళ్ళం స్కార్లెట్‌తో, బట్లర్‌తో (గాన్‌ విత్‌ ద విండ్‌ నవలలో పాత్రలు) పోల్చుకోవలసిందే. ఇక్కడా అనేక కోటలు కరిగిపోయాయి. పరిణామాలు చాలా జరుగుతున్నాయి…అంటూ అల్లం రాజయ్య ప్రారంభించిన చర్చలో గ్రామీణ సమాజం నుండి ప్రపంచ రాజకీయాల వరకూ అనేక ఆసక్తికరమైన విషయాలను హాజరైనవాళ్లు ప్రస్తావించి విశ్లేషించారు.

సమాజంలో ఒక ఘటన జరిగేలోపే ఇంకో ఘటన జరిగిపోతూ ఉంది. ఇంత డైనమిక్‌గా సమాజం మారుతూ వస్తున్నప్పుడు ఏ కథ రాయాలి? ఏ ఇతివృత్తం రాయాలి? వ్యక్తం కాని విషయాలను ఎట్లా వ్యక్తం చేయాలి? అనే సమస్యలు సీరియస్‌ రచయితల ముందు ఉన్నాయి. మన సాహిత్యంలో ఎక్స్‌ప్రెషన్‌కు సంబంధించి చాలా ఇబ్బందులున్నాయి. శిల్పపరంగా చాలా నేర్చుకోవాల్సే ఉంది. లాటిన్‌ అమెరికన్‌ సాహిత్యంలో మంచి ప్రయోగాలున్నాయి. మనం ఇక్కడ చేయవలసిన ప్రయోగాలు ఏమిటి? విప్లవ దృక్పథంతో ఎలా ఆ వస్తువులన్నింటిని అర్థం చేసుకోడానికి ఎలా విస్తరించాల్సి ఉంది? అనే దిశగా ప్రొద్దుటూరు వర్క్‌షాపులో మొదటి రోజంతా చర్చ జరిగింది. ఈ విషయంలో వర్క్‌షాపులన్నిటిలో ప్రతిసారీ జరుగుతున్న చర్చ ఈసారి మరింత ముందుకు తీసికెళ్లగలిగామని అందరికీ అనిపించింది.

ఈ చర్చ కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా విప్లవ కథా రచనలో చాలా వరకు వ్యక్తమవుతూనే ఉంది. నిజానికి విరసం 1980ల నుంచి నిర్వహిస్తున్న కథా వర్క్‌షాపులన్నీ ఈ కోణంలో  చాలా మంచి ఫలితాలను ఇస్తూనే వచ్చాయి. ప్రతి థలోనూ ఆ సామాజిక, ఉద్యమ సన్నివేశానికి అనుగుణంగా విప్లవ కథను తీర్చిదిద్దడానికి దోహదపడుతున్నాయి. దృక్పథం, శిల్పం వగైరాల్లో మెళకువలు అందిస్తున్నాయి.  ఇంతే ముఖ్యమైన విషయం మరొకటి ఏమంటే- విప్లవ కథా రచనలోకి మూడు నాలుగు తరాల రచయితలను ఈ వర్క్‌షాపులే తీసుకొని వచ్చాయి. విరసం సభ్యులతోపాటు ఈనాడు సుప్రసిద్ధ కథకులుగా గుర్తింపు పొందిన మార్క్సిస్టు రచయితల్లో చాలా మంది విరసం వర్క్‌షాపుల్లో పాల్గొన్నవాళ్లే. నిర్దిష్టంగా విరసంలో ఈ తరం  కథా రచయితలందరూ చాలా వరకు ఈ సమావేశాల్లో మెళకువలు నేర్చుకున్నవారే. వర్క్‌షాపులే కథలకులను తయారు చేయకపోవచ్చుగాని,  రచన పట్ల ఆసక్తి ఉన్నవాళ్లను  మేలైన కథకులుగా తీర్చిదిద్దడంలో ఈ వర్క్‌షాపులు గణనీయమైన ఫలితాలను ఇస్తున్నాయి. సీనియర్‌ కథకులనుంచి ఔత్సాహిక రచయిత దాకా.. విరసం సభ్యులు, సోదర రచయితలు పాల్గొంటున్న ఈ సమావేశాల్లో  కథా పఠనం జరిగాక  ఆ నిర్దిష్ట కథ విశ్లేషణేగాక,  సాధారణస్థాయిలో కథా సాహిత్యంలో రావలసిన మార్పుల దాకా విస్తరిస్తాయి. ఇవి  ఆ తర్వాత కథలు రాయడానికి  ఉపయోగపడుతున్నాయి.

ఆరేడేళ్ళుగా ఈ సమావేశాల్లో వర్తమానంలో  ఏం రాయాలి, ఎలా రాయాలి అని జరుగుతున్న చర్చ  అనుత్పాదకంగా మిగిలిపోలేదు.  కొత్త కథకుల్ని తయారుచేయడమే కాక, ఈ చర్చల సారాంశం  ప్రయోగాల్లో, దృక్పథ స్పష్టతలో వ్యక్తమవుతోంది. దీనికి ప్రొద్దుటూరు, మిర్యాలగూడ (మార్చి 9,10- 2013) వర్క్‌షాపుల్లో వచ్చిన వైవిధ్యభరితమైన కథలే ఉదాహరణ. ఈ రెండు సమావేశాల్లో చదివిన ప్రతి కథ దానికదే ప్రత్యేకమైనదీ, అవసరమైనదీ అయినా ఇక్కడ కొన్నిటి గురించే ప్రస్తావిస్తాను. ఇక్కడ చదివి, చర్చించి సవరించిన కథల్లో కొన్ని ఇప్పటికే అచ్చయ్యాయి కూడా. అందు వల్ల వర్తమాన కథ కోసం జరుగుతున్న ప్రయత్నానికి ఉదాహరణగా కొన్ని వివరాలు రాస్తాను.

ఒకే ఇతివృత్తం మీద రెండు కథలు (దోషులు, రాజుగారి పులిస్వారీ) తీసుకొచ్చారు కూర్మనాథ్‌. సత్యం ఐటి కంపెనీ పేకమేడలు కుప్పకూలడం కేంద్రంగా తీసుకొని రాసిన కథలు ఇవి. ఫైనాన్స్‌ వ్యవహారాలు రాసే జర్నలిస్టులు అబద్ధాలపై, భ్రమలపై ఆధారపడి రాయడం గురించి, కార్పొరేట్‌ శక్తులు, రాజకీయ వ్యవస్థ, మీడియా కలగలసిపోయి పత్రికా వ్యవస్థను భ్రష్టుపట్టించడం మొదటి కథలో కనపడుతుంది. రెండోది ఫైనాన్స్‌ కాపిటల్‌ వలయంలో పడి పులిస్వారీ చేస్తున్న వ్యాపారవేత్త గురించిన కథ. నిజానికి రెండూ వేరువేరు కథలు. ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇట్లా భిన్నకోణాల్లో వ్యక్తీకరించే ప్రయత్నం చేయడం అరుదైన విషయమే.

ఒక కార్పొరేటు కంపెనీ అట్టహాసంగా జరిపిన తెలుగు మహాసభలను, గ్రామంలో జరిగే తిరుణాలను పోలుస్తూ రుక్మిణి రాసిన కంపెనీ తిరుణాల కథలో చివరికి తెలుగుభాషను, సంస్కృతిని ఉద్ధరిస్తున్నామని చాటుకుని, రచయితల, భాషాపండితుల చేత ప్రశంశలందుకున్న కంపెనీ ప్రాణాంతక రసాయనాలను వదిలి ప్రజల ఎదుట ద్రోహిగా నిలబడుతుంది. భాషాసంస్కృతులు పుస్తకాల కందే మామూలు విషయాలు కావని, అవి ప్రజల జీవనంతో పెనవేసుకున్నవన్న సత్యాన్ని విస్మరించి, పైపై ఆర్భాటాలకు లొంగిపోయే సాహిత్యకారులను చూసి రచయిత్రి ఈ కథ రాశారు. సమకాలీన సాహిత్యరంగానికి, కార్పొరేట్‌ శక్తులకు ఉన్న సంబంధాన్ని చాటే తాజా ఇతివృత్తం ఇది. రుక్మిణి  మిర్యాలగూడ వర్గషాపుకు మరో భిన్నకథాంశంతో వచ్చారు. ఒకప్పుడు విప్లవ విద్యార్థి ఉద్యమ రాజకీయాలతో ప్రభావితమైన తెలుగుసమాజం చాలా మార్పుల గుండా ప్రయాణం చేసింది. ఒక తరం గడిచాక, ప్రపంచ మార్కెట్‌కు మన సమాజం ప్రయోగశాల అయ్యాక విలువలూ, ఆదర్శాలూ మారిపోయాయని తల్లిదండ్రులు విచారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ ఆదర్శాలను పిల్లలకు అందించలేకపోయామని, లోపం ఎక్కడో జరిగిందని వాళ్లు తర్కించుకోవలసి వచ్చింది.  తల్లిదండ్రుల సామాజిక ఆచరణలోనే ఉన్న లోపం, కుటుంబం లోపల ఉన్న పరిమితులు, బైటి ప్రభావాలు.. ఏవి ఏ స్థాయిలో  పిల్లలను ప్రభావితం చేస్తున్నాయో ఆలోచింపజేస్తూ సాగిన కథ ఇది. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నవాళ్లలో  ముఖ్యంగా మధ్యవయస్కులు ఈ కథతో మమేకయ్యారు.

విజయలక్ష్మి ప్రొద్దుటూరు సమావేశంలో నెల్లూరుజిల్లాలోని ఒక పల్లెటూరులో వీథి అరుగుమీద కూర్చున్న పెద్దాయన కేంద్రంగా నడిపిన కథను ప్రొద్దుటూరులో చదివారు. నిజానికి ఈ కథలో ఆయన చుట్టూ గ్రామీణ సమాజమంతా  పరిభ్రమిస్తుంటుంది. కుటుంబ సమస్యలు, గిట్టుబాటుకాని పంటలు, పట్నంలో చదువులు, పల్లె జీవితంలో సంక్లిష్టమైన కదలికల్ని గమనిస్తూ, వ్యాఖ్యానిస్తూ సాగిన ప్రయోగాత్మక కథ. హాస్యం,  ఎత్తిపొడుపులు, సామెతలు గ్రామీణ పలుకుబళ్లు నిండుగా ఉన్న కథ ఇది.

కథా ప్రక్రియలోకి తాజాగా ప్రవేశించిన పావని అంతే తాజా వ్యక్తీకరణతో పట్టణ మధ్యతరగతి విద్యార్థుల సరదా సరదా సంభాషణలతో రాసిన కథ కొన్ని రంగులూ.. ఒక కల. రాజకీయాలు, ఉద్యమాలూ, స్నేహాలూ, ప్రేమలూ, ఆదర్శాలూ ఇప్పటి తరంలో ఎట్లా వ్యక్తమవుతున్నాయో ఈనాటి భాషలో, సంస్కృతిలో వ్యక్తం చేసిన కథ ఇది.  ఈ తరంలో ఎంత పరిణతిగల మనుషులు ఉన్నారో కూడా ఆశావహంగా ఈ కథ నడిచింది. మిర్యాలగూడాలో ఇంకొన్ని మంచి కథలు వచ్చినా పావని చదివిన కథ విన్నాక అందరూ చాలా తాజాగా  ఫీలయ్యారు. ఇవాల్టి జీవితంలో ఎంత సంక్లిష్టత ఉన్నా ఆశారేఖ కూడా అందులో ఉందని చాటే కథ ఇది.

వస్తువ్యామోహం వల్ల ఈ తరం పిల్లల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో సుభాషిణి ఒక కథ వినిపించారు. పిల్లలను మన ఆదర్శాల ప్రకారం పెంచాలనుకున్నా వాస్తవానికి వాళ్లను రూపొందిస్తున్న వ్యవస్థ ఒకటి ఉందని, ఈ తరహా పౌరులు లేకుండా అది బతకలేదనే లోతైన అర్థం పలికే కథ ఇది. సరిగ్గా ఈ సమస్యనే వి. ప్రతిమ చదువుల వైపు నుంచి డీల్‌ చేశారు. పిల్లలకు కనీసం తమ పేరుకు ఉన్న అర్థం ఏమిటో కూడా తెలుసుకునే వీలు లేని విధంగా  ఈ చదువులు తయారైపోయాయనే సున్నితమైన విమర్శ ప్రకటించే కథను చదివారు. సుభాషిణి, ప్రతిమ కథలు ఈ స్థితికి ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటుందా? అనే ఆశతో ముగుస్తాయి.

ఈ స్థితిని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రగతిశీల కథకులు దీని మీద ఎలాంటి కథలు రాయాల్సి ఉంటుంది? అనే చర్చ జరిగే క్రమంలో పాణి దండకారణ్య కథలను  క్లుప్లంగా ఇలా పరిచయం చేశారు.

తెలుగుసాహిత్యంలో ఇప్పుడొస్తున్న కథల గురించి, రావాలసిన కథల గురించి చర్చింవలసింది చాలనే ఉంది. అయితే మన పక్కనే   ప్రధాన స్రవంతి పత్రికలుగాని, తెలుగుసాహిత్య సమాజంగాని పట్టించుకోని కథలు కూడా ఉన్నాయి అవి దండకారణ్యం నుంచి వస్తున్నాయి. వాటిలో అద్భుతమైన ప్రయోగాలు ఉంటున్నాయి. ముఖ్యంగా ఈ నాలుగైదేళ్ళుగా యుద్ధం, ఉత్పత్తి, నిర్మాణం మధ్య అల్లకల్లోలంగా  ఉన్న దండకారణ్యం నుండి నూతన సమాజాన్ని, నూతన మానవుడ్ని ఆవిష్కరిస్తున్న కథలు వస్తున్నాయి. ఇక్కడ మన జీవితంలో సంక్లిష్టమైన సమస్యలు ఆవరించి ఉన్నాయి.   పరిష్కారం తెలీని  సందిగ్ధత,  స్టాగ్నేషన్‌ ఆవరించి ఉన్నది. ఇక్కడ నడుస్తున్న పోరాటాలు ఈ స్థితి మీద ఒక ఆచరణాత్మక విమర్శ పెడుతున్నా, పరిష్కారాలు ఇలా ఉంటాయని చెబుతున్నా.. మొత్తం మీద ఒక సందిగ్ధ స్థితి ఉన్న మాట వాస్తవమే. అయితే దండకారణ్య కథల్లో ప్రతి కథకూ ఒక పరిష్కారం ఉంటుంది. దీనిని మామూలు సాహిత్యకారులు అంగీకరించకపోవచ్చు. ఇది మూస వ్యవహారమని ఈసడించుకోవచ్చు. కానీ దండకారణ్యంలో జరుగుతున్న పోరాటం, నిర్మాణం ప్రతి సమస్యతో ఆచరణాత్మకంగా  ఎదుర్కొంటున్నాయి.  ఈ క్రమంలో చైతన్యవంతులవుతున్న ఆదివాసులు దానికి ఒక పరిష్కారాన్ని కూడా  వెతుక్కుంటున్నారు. ఈ క్రమం అక్కడి కథా వస్తువులో, దృక్పథంలో, శిల్పంలో  కనిపిస్తుంది.  ఈ కథల్ని  ఎక్కువగా మహిళలు రాయడం కూడా ఒక ప్రత్యేకత. ఆదివాసీ తెగలు  పితృస్వామ్యాన్ని, రాజ్యహింసను ఎదుర్కొంటూ యుద్ధంలోనూ, ఉత్పత్తిలోనూ, నూతన సమాజ నిర్మాణంలోనూ పాల్గొంటున్నాయి. ఇది ఒక సామాజిక రాజకీయ పరివర్తనా క్రమం.  అందువల్ల అరుణతార ఈ తరహా రాజకీయ కథలకు వేదికవుతున్నది. వీటికి విస్తృత ప్రచారాన్ని ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది… అంటూ చాలా వైవిధ్యమైన వస్తువులు, శిల్ప పద్ధతులు ఉన్న ఆరు కథల్ని తీసుకొని పరిచయం చేశారు.  సల్వాజుడుం, ఉద్యమం నేర్పుతున్న ప్రత్యమ్నాయ చదువులు, విలువలు,  యుద్ధం, రాజ్యనిర్బంధం, జైలుజీవితం, వీటన్నిటి  నేపథ్యంలో మానవసంబంధాలను తీర్చిదిద్దుతున్న వర్గపోరాటం గురించి ఆ కథలు ఎలా చిత్రించిందీ విశ్లేషించారు.  (కొన్ని దండకారణ్య కథలతో  త్వరలో విరసం సంకలనం తేబోతున్నది)

మిర్యాలగూడా సమావేశంలో స్కైబాబ  తెలంగాణ ఉద్యమ సమయ సందర్భాల్లో రాసిన కథ చదివారు.  తన ఊరికి దూరంగా, గతంలో తానున్న స్థితికి దూరంగా ఉన్నత స్థాయి జీవితం గడుపుతున్న వ్యక్తి వైపు నుంచి కథ నడుస్తుంది. అతడికి ఇప్పటికీ గ్రామంలో ఆనాటిలాగే బతుకుతున్న మిత్రుడితో స్నేహం కొనసాగుతూ ఉంటుంది. తన జీవన విధానంపట్ల అసంతృప్తితో ఆ మిత్రుడ్ని కలవడానికి గ్రామానికి వెళ్తాడు. అక్కడ కనిపించే వాస్తవికత అతడిని సంక్షోభంలో పడేస్తుంది. అక్కడ మిత్రుడి కొడుకు గ్రామాల్లో చేస్తున్న కార్యకలాపాలను తెలుసుకున్నాక అంత వరకు తాననకున్న జీవన ప్రమాణాల విచికిత్సకు గురవుతాడు. వర్తమాన పరిణామాల్లోని వాస్తవికతను ఈ కథ ప్రతిబింబించిందనే కోణంలో చర్చ జరిగింది. తెలంగాణ గ్రామ వాతావరణం, భాష కథలో బాగా కనిపించింది. అయితే మిత్రుడి కొడుకు ఎంచుకున్న మార్గంలో సమస్యలు పరిష్కారమవుతాయా? మొత్తంగా ఇలాంటి పరిణామాలకు ఒక ఆశావహమైన ముగింపుఎలా ఉంటుంది? అనే దిశగా చర్చ సాగింది.

కథా వస్తువుకోసం అన్వేషిస్తున్న రచయితకు ఊరి నుండి కాసిన్ని పండ్లు తెచ్చుకుని అమ్ముకునేందుకు జాగా కోసం వెతుకుతున్న మనిషి కనపడతాడు. అతను జాగాకోసం ఎన్నెన్ని తిప్పలు పడతాడో, ఎన్ని శక్తులతో ఘర్షణ పడతాడో అసక్తికరంగా ఫాలో అయిచూస్తుంటాడు. రచయితకు కథా వస్తువు దొరుకుతుంది కాని ఆ మనిషికి జాగా మాత్రం దొరకదు. రియల్‌ ఎస్టేట్‌, భారీ నిర్మాణాల వల్ల ఒక వైపు విస్తరిస్తున్నట్లు కనిపించే నగరాలు నిజానికి ఎంతగా కుంచించుకుపోతున్నదీ, సామాన్యుడికి నిలబడటానికి కాసింత నీడ కూడా ఎట్లా కరువైపోతున్నదీ మిర్యాలగూడా సమావేశంలో ఉదయమిత్ర  ‘జాగా’ అనే కథ చదివారు. అలాంటిదే మరో కొత్త ఇతివృత్తంతో చిన్న కథ చదివారు. బహుశా అన్ని ప్రాంతాల్లో నదుల్లో, వంకల్లో జరుగుతున్న ఇసుక దొంగతనం గురించి రాసిన కథ ఇది. ఇసుక మాఫియా తక్షణ సమస్యగానేగాక, దీర్ఘకాలంలో పర్యావరణ సమస్యగా కూడా ఎట్లా మారబోతోందో వాస్తవికతా శిల్పంలో ఈ కథ చిత్రించింది. ఒక రకంగా గ్రామస్థాయి నుంచి లుంపెన్‌ సెక్షన్‌ ఇసుక రవాణాతో ఎలా తయారవుతున్నదీ, పట్టణీకరణ నేపథ్యాన్ని కూడా ఇది చిత్రించింది.

పాణి రాసిన రాజకుమారుడు.. కార్పేటమ్మ అనే కథ ప్రత్యేకమైన శిల్పంలో సాగింది. వ్యంగ్యం, ఫాంటసీ, వాస్తవికతలతో మూడు విభాగాలుగా గనుల రాజకీయార్థిక మూలాలను తడిమిన కథ ఇది. తాజా ఇతివృత్తంతో, కొత్త శిల్పంలో సాగింది.

ముస్లిం జీవిత నేపథ్యంలో పితృస్వామ్య ఆధిక్యాన్ని ధైర్యంగా ఎదిరించిన మహిళ గురించి మహమూద్‌ ప్రొద్దుటూరులో ఒక కథ వినిపించారు. ఈ తరహా కథల్లో వర్క్‌షాపులకు వచ్చిన కథల్లో ఇది అందరినీ ఆకట్టుకుంది. ఈ సమస్య ముస్లిం కుటుంబాల్లో ఎలా ఉండేదీ ఇది చిత్రించింది. అక్కడే బాసిత్‌ మబ్బులు తొలిగిన ఆకాశం అనే కథ చదివారు. ఇది కూడా మారుతున్న మానవ సంబంధాల్లోకి, విలువల్లోకి అందం, రంగు అనేవి కూడా ఎట్లా ప్రవేశించిందీ చెప్తూ వీటన్నిటికంటే జీవన విలువలపట్ల మనిషి అంతిమంగా మొగ్గు చూపుతాడనే కోణంలో ఈ కథ సాగింది. పైకి చాలా చిన్న ఇతివృత్తాలుగా కనిపించినా సామాజిక నేపథ్యంపట్ల రచయితలకు దృష్టి ఉంటే వీటినే ఎంత లోతుల్లోంచి వివరించవచ్చో ఈ కథలు నిరూపిస్తాయి.

ఇంతకూ ఇటీవల సమాజంలో మన కంటికి కనిపిస్తూ, అనుభవంలో భాగమవుతూ, జ్ఞానానికి అర్థమవుతూ ఎన్ని రకాల మార్పులు జరుగుతున్నాయి? కథకులు వీటిలో ఎన్నిటి గురించి ఎంత శ్రద్ధగా, సరైన దృక్పథంతో రాస్తున్నారు? అసలు కథల్లోకి రాకుండా ఉండిపోయిన పరిణామాలు ఏమిటి? అనే దిశగా ప్రొద్దుటూరులో వెంకటకృష్ణ ఒక ఆసక్తికరమైన పరిశీలనాత్మక ప్రసంగం చేశారు. ముఖ్యంగా గ్రామ స్థాయిలో వ్యవస్థ ప్రజలను తనలో భాగం చేసుకోడానికి ఎన్ని రూపాల్లో, ఎన్ని పథకాలతో ప్రయత్నిస్తోందో చెప్పి, అవి అక్కడి జీవితాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నాయని విశ్లేషించారు. అయితే వీటి గురించి మన కథకులకు అంతగా పట్టలేదనే చెప్పాలి. కొన్ని మార్పులు కథా వస్తువులుగా స్వీకరించినా అంత బలంగా కథలు రాలేదనే చెప్పాలి.. అని విశ్లేషించారు. అట్లాగే విప్లవ కథకులు ఏ రకమైన వస్తువులపై ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నదీ ఎత్తి చూపి, అంతగా పట్టించుకోని ఇతివృత్తాల గురించి  గుర్తు చేశారు. ప్రత్యేకంగా విప్లవోద్యమం మీద విమర్శనాత్మక వైఖరితో విరసం సభ్యులు ఎందుకు రాయకూడదు? అని ప్రశ్నిస్తూ.. ఇటీవలి విప్లవ కథలోని వైవిధ్యాన్ని స్థూలంగా అంచనా వేశారు.

వెంకటకృష్ణ వేసిన ప్రశ్నపై కూర్మనాథ్‌ స్పందిస్తూ.. విప్లవోద్యమం మీద ఎవరికైనా విమర్శనాత్మక అభిప్రాయాలే ఉండవచ్చు. అయితే నేను మాత్రం అవి కథల్లో  రాయను. వాటి గురించి నేను చర్చించే పద్ధతి వేరేగా ఉంటుంది. అవి కథల్లోకి తేవాలని అనుకోను. అసలు  దానితో కలిసి నడవకుండా, దాని మార్పులేమిటో సన్నిహితంగా తెలుసుకోకుండా విమర్శనాత్మకంగా రాయడం ఎలా సాధ్యమవుతుంది? అన్నారు.

ఇదంతా ఈ రెండు సమావేశాల్లోని కొన్ని కథల గురించే. అన్నిటి గురించీ ఇలాంటి విశ్లేషణలే ఇవ్వవచ్చు. మొత్తం మీద ఈ రెండు సమావేశాల్లో వర్తమాన జీవితాన్ని.. దాని మొత్తంలో భాగంగా, దాని సంక్లిష్ట సారాంశంలో భాగంగా ఎలా కథలు రాయాలి? అనే చర్చ ప్రధానం. కొత్త పరికరాలతో, కొత్త శిల్ప పద్ధతులతో గాఢంగా విప్లవ కథను ఎలా అభివృద్ధి చేయాలనేదే వర్క్‌షాపుల ఇతివృత్తం. మారుతున్న సమాజాన్ని.. మారుతున్న విప్లవోద్యమాన్ని, ప్రజాపోరాటాలను దృష్టిలో పెట్టుకొని కథ అభివృద్ధి చెందాల్సి ఉంది. పరివర్తనాథలో ఉన్న మొత్తం సమాజాన్ని ప్రతిబింబించడం, అందులోని మార్పు క్రమాలను చిత్రించడం ఇవాళ్లి విప్లవ కథలకుల లక్ష్యం. ఆ దిశగా సాగడానికి ఈ సమావేశాలు స్ఫూర్తిని ఇస్తున్నాయి.

మీ మాటలు

  1. Sai Padma says:

    చాలా చక్కటి వ్యాసం. చాలా ఆప్ట్ గా ఉంది. థేంక్ యు

  2. Mercy Margaret says:

    ఒక మంచి వ్యాసాన్ని పరిచయం చేసారు .. ధన్యవాదాలు

  3. bhasker says:

    చాలా చక్కటి, లోతైన ఇన్ఫర్మేటివ్ వ్యాసాన్ని అందించిన వరలక్ష్మి గారికి, సారంగ సంపాదకులకు ధన్యవాదాలు!

Leave a Reply to bhasker Cancel reply

*