స్వాతి వాళ్ళ అమ్మ

క్రొత్తగా పెళ్లి చేసుకుని  విదేశానికి వచ్చి  బయటకి  కదలకుండా ఎప్పుడూ ఇంట్లోనే ఉండాల్సివచ్చినందుకు  విసుగ్గా ఉంది  స్వాతికి.   అనుకోకుండా  ఒక ఆహ్వానం అందింది. ఆటవిడుపుగా ఆ కార్యక్రమానికి  హాజరైంది. అక్కడ అనేకమంది తెలుగు వారిని చూసి సంతోష పడింది. అందరినీ పరిచయం చేసుకుంది.  అంతా తెలుగు వారే కావడంతో అది  ఆంధ్రదేశంలో ఒక  ఊరులాగా తోచింది.
అదొక కమ్యూనిటీ హాలు.   ఆ రోజు అక్కడ ఒక కార్యక్రమం జరగబోతోంది. ప్రత్యేకించి స్త్రీలకి సంబంధించిన కార్యక్రమం. పరాయిభావనలో మూలాలు గుర్తుకు రావడం మూలంగానేమో దేశంలో జరిగే ప్రతి చిన్నవిషయాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి  అలవాటు పడిపోయిన వారికి అదొక అవకాశమే!

వారానికి అయిదు రోజులు యంత్రాలలా పనిచేసి ఆటవిడుపు కోసం వెతుక్కుని నలుగురూ కలిసే సందర్భం  కోసం ఎదురు చూస్తున్న  వారికి కందుకూరి జయంతి గుర్తుకు వచ్చింది.  స్త్రీల పునర్వివాహాలు జరిపించడానికి విశేషంగా కృషి చేసిన విధం గుర్తుకు వచ్చింది.   వెంటనే  ఒక కార్యక్రమం వారి ఆలోచనలలో రూపుదాల్చింది. నాటి కాలానికి నేటి కాలానికి వచ్చిన మార్పులు గమనిస్తూ పునర్వివాహాల  వల్ల  కలిగే మంచీచెడుల పరిణామం గురించి ఒక చర్చా కార్యక్రమం నిర్వహించదలిచారు.

‘ఒంటరి స్రీలు – పునర్వివాహం అనే అంశంపై  ఎవరైనా మాట్లాడవచ్చు  వారి వారి అనుభవాలని చెప్పవచ్చు’ అని ప్రకటించారు. రోజంతా అదే విషయం పై కార్యక్రమం జరుగుతుంది  కాబట్టి చాలా మంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

స్వాతి కార్యక్రమాన్ని ఆసక్తిగా  చూస్తూ ఉంది.
కొందరు చక్కటి తెలుగులోనూ, మరి కొందరు ఇంగ్లీష్  లోను వారి అనుభవాలనీ, అభిప్రాయాలనీ చెబుతున్నారు.  చాలా మంది పునర్వివాహం చేసుకోవడం  చాలా మంచి ఉద్దేశ్యం అనీ, ఒంటరి జీవితాలకి తోడూ-ప్రేమా దొరుకుతాయని, మనిషి ఆనందంగా బ్రతకడానికి వివాహం చాలా అవసరం అని చెపుతున్నారు. వారి వారి మాటలు వింటున్న స్వాతికి  కోపం ముంచుకొస్తోంది.
ప్రక్కనే ఉన్న భర్త అనిల్ స్వాతి చేయి పట్టుకుని వారిస్తూనే ఉన్నాడు అయినప్పటికీ భర్త మాటని లక్ష్య పెట్టకుండా లేచి గబా గబా నిర్వాహకుల దగ్గరికి వెళ్లి  తనకీ మాట్లాడటానికి అవకాశం ఇవ్వమని కోరింది.  నిర్వాహకులు ఆమె పేరుని నమోదు చేసుకుని వరుస క్రమంలో ఉంచారు.
” స్వాతీ .. ఏం  మాట్లాడ దల్చుకున్నావ్ ? ఆంటీ గురించి చెప్పాలనుకుంటున్నావా ? అలాంటి బుద్ది  తక్కువ ఆలోచన మానుకో ! మన గురించి మనమే చాటింపు వేసుకోవడం అవసరమా ? ” అన్నాడు అనిల్. “మన అనుభవాన్ని ఇతరులతో పంచుకుంటే తప్పేమిటి?   ఆ అనుభవం ఇతరులకి మంచి చేయవచ్చు కదా! ” అంది స్వాతి.
“ఇక్కడ ఉన్నంత మాత్రాన స్వేచ్ఛ గా ఎవరికీ తోచింది వారు చేసేయవచ్చు అనుకోకు. మనకి అక్కడ ఉన్నట్లే ఇక్కడ వారిలో కూడా చాలా విషయాలలో మూర్ఖత్వం ఉంది. పై పైకి అందరూ నాగరికులే, చదువుకున్న వారే, సంస్కారం ఉన్నవారే, కాని మన జీవితాలలో ఉన్న చిన్న లోపం కనిపెట్టినా చెవులు కొరుక్కుంటారు. వెలివేసినట్టు చూస్తారు.   ఎవరికీ కూడా  మనం అనుకున్నంత విశాల హృదయం ఉండదు. ముందు ‘అయ్యో ! అలాగా!’అని సానుభూతి చూపించి మన వెనుక మళ్ళీ తాటాకులు కడతారు. ఇతరులు మన గురించి తక్కువగా చూడటం, హీనంగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు.  నాకు ఇష్టం లేని పని నువ్వు చేస్తావని నేను అనుకోను. ఇకపై నీ ఇష్టం.”అని  చెప్పాడు అనిల్.
స్వాతి మౌనంగా ఉండి పోయింది. “అక్కడొక ఫ్రెండ్ విష్ చేస్తున్నాడు. వెళ్ళి వస్తాను. నువ్వు వస్తావా? “అని అడిగాడు.
“నేను రాను మీరు వెళ్లి రండి” ముభావంగా చెప్పింది. కార్యక్రమంలో పాల్గొనడానికి  తన వంతు వచ్చేటప్పటికి  స్వాతి లేచి వెళ్ళింది.  వెళ్ళేటప్పుడు భర్త వైపు చూడను కూడా చూడలేదు. చూస్తే మరొక సారి చూపులతో అయినా తనని హెచ్చరిస్తాడని.  స్వాతి వేదికపైకి వెళ్లి మైక్ తీసుకుని గొంతు విప్పింది.  ఒకసారి బలంగా గుండెల నిండా గాలి పీల్చుకుని వదిలింది.
“నేను నా అనుభవాన్ని చెప్పాలంటే ఎక్కువ సమయం పడుతుంది” అని – అందుకు అనుమతి ఇవ్వాలని అడిగింది. నిర్వాకుల అనుమతి లభిండంతో  స్వాతి చెప్పడం మొదలెట్టింది.
“నా పేరు స్వాతి. నాకు నా  తల్లి అంటే చాలా ఇష్టం. అందరికి అమ్మ అంటే ఇష్టమే, కానీ నాకు  మరీ ఇష్టం. నేను  పుట్టి నాలుగు నెలలైనా కాక ముందే నాన్న చనిపోయాడు. భర్త పోయిన బాధని, తనలో ఉబికే  దుఃఖాన్ని తనలోనే దాచేసుకుని బిడ్డే ప్రపంచం అన్నట్లు  బతికింది. అత్తమామలకి, కన్నవాళ్ళకి మధ్య తలలో నాలుకలా మెలుగుతూనే ఆగి పొయిన  చదువు కొనసాగించి  లెక్చరర్ అయింది  అమ్మ.
సన్నిహితులు ఎవరైనా  ‘ఎన్నాళ్ళు ఇలా మోడులా ఉంటావమ్మా ! స్వాతిని చూసుకోవడానికి మేమంతా లేమూ ! నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో’ అని  చెవిలో ఇల్లు కట్టుకుని మరీ చెప్పేవారు.
” స్వాతి కి నాన్న ఎలా ఉంటారో తెలియదు.  నేను  పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయి తనకి అమ్మని దూరం చేయమంటారా?  అప్పుడు నేను అమ్మని కాను మర బొమ్మని అవుతాను. నా బిడ్డ తోడిదే నాకు లోకం. అమ్మని అనిపించుకొవడమే  నాకు గొప్ప కానుక. మరిక ఏ కానుకలూ వద్దు ” అని సున్నితంగా తిరస్కరించేది.
నాన్న గురించి అమ్మ చెప్పేటప్పుడు  చూడాలి ఆమె ముఖం. నవ్వుతో మెరిసిపోయేది.  నాన్న నాకు స్వాతి అని పేరు పెట్టడం వెనుక కూడా ఒక విశేషం ఉందట. స్వాతి సినిమా వచ్చినప్పుడు నేను పుట్టానట. స్వాతి సినిమా నచ్చి నాకు స్వాతి అని పేరు పెట్టారని అమ్మ చెపుతుంటే విని స్వాతి సినిమాని ఎన్నిసార్లు చూసి ఉంటానో !  సినిమా చూసిన ప్రతి సారీ మా అమ్మకి మళ్ళీ పెళ్లి చేయాలి అనిపించేది.  మా నాన్నకి తను చనిపోతానని ముందే తెలుసేమో!  అందుకే నాకు ఈ పేరు పెట్టారేమో! అని తెగ ఆలోచనలు ముంచుకొచ్చేవి. అమ్మని ఆ మాటే అడిగితే   చప్పున పెదవులపై చూపుడు వేలుంచి ‘తప్పు అలా మాట్లాడ కూడదు.  ఎవరు ఎప్పుడు చనిపొతారో ఎవరికీ తెలియదు. చనిపోయేలోగా మంచి పనులు చేయాలని అనుకోవాలి’ అని చెప్పేది.
మరి నీకు పెళ్లి చేయడం మంచి పనే కదా !  నాకు నాన్న కావాలనుకోవడం మంచి పనే కదా అని అమ్మని విసిగించేదాన్ని. నేను, అమ్మ నాయనమ్మ  వాళ్ళింట్లో ఉండేవాళ్ళం. నాయనమ్మ, తాతయ్య అమ్మని కూతురులా చూసేవాళ్ళు. మా ఇంటి ప్రక్కనే రాజేశ్వరి టీచర్ ఉండేవారు. ఆమె భర్త కూడా టీచర్.  కానీ ప్రమోషన్ పై ఆ ఊరి స్కూల్ కి హెడ్మాస్టర్ అయ్యారు.  ఆయన పేరు మోహన కృష్ణ. పేరుకు తగ్గట్టు మోహనంగా ఉండేవారు. ఎప్పుడూ నలగని ఖద్దరు సిల్క్ దుస్తులతో పాటు నలగని నవ్వు, కళ్ళకి  నల్లద్దాల చలువ కళ్ళ జోడుతో  చాలా హుషారుగా కనిపించేవారు.  స్కూల్లో పిల్లలకి ఆయనంటే ఎంత భయమో అంత ఇష్టం కూడా.  భార్యభార్తలిద్దరూ  ఒకే స్కూల్ లో పని చేసేవారు. రాజేశ్వరి టీచర్ మాత్రం లావుగా, నల్లగా ఎత్తు పళ్ళుతో ఉండటమే కాదు ఎప్పుడు దిగులు ముఖంతో కనబడేది.  స్కూల్,  వంట ఇల్లు తప్ప ఆమెకి మరో ప్రపంచం ఉండేది కాదు.
రాజేశ్వరి టీచర్ కి  ఇద్దరు  మగ పిల్లలు.  వాళ్ళు ఇద్దరూ కూడా మా ఊరి హై  స్కూల్ లోనే  చదువుకుంటూ ఉండేవారు. అమ్మ రేడియో వింటూ, పుస్తకాలు చదువుతూ, నాతో ఆడుకుంటూ, నన్ను చదివిస్తూ ఉండేది.  నేనేమో మోహన కృష్ణ మాస్టారు వంక అదేపనిగా చూస్తూ ఉండేదాన్ని.  మా నాన్న ఉంటే అచ్చు ఇలానే ఉండేవారేమో అనుకునే దాన్ని.  మోహన కృష్ణ అంకులేమో  మా అమ్మ వంక దొంగ చూపులు చూస్తూ ఉండేవాడు. ఆ వయసులో అలా ఎందుకు చూస్తున్నాడో అర్ధం కాకపోయినా కూడా ఆ చూపులలో  ఏదో తప్పు ఉందని నాకు తెలిసిపోయేది.
మోహన కృష్ణ మాస్టారి చూపులని గమనించిన అమ్మ బయటకే వచ్చేది కాదు.  నేను సెవెంత్ క్లాస్ కి వచ్చేటప్పటికి తాతయ్య చనిపోయారు. అమ్మకి మా ఊరి నుండి  వేరే చోటకి బదిలీ  అయింది మాతో పాటు నానమ్మ, నానమ్మ వాళ్ళ అమ్మ జేజమ్మ కూడా మాతో వచ్చేసారు.  అలా  ఏడెనిమిది ఏళ్ళు మేము మా ఊరి వైపుకి  రాకుండానే గడిపేశాము.
నేను ఇంజినీరింగ్ చదువుతూ ఉండగా మా జేజమ్మ  చనిపోయింది.  ఆమె అంత్యక్రియల కోసం   మళ్ళీ మా ఊరు రావాల్సి వచ్చింది. నా చిన్నప్పటిలా ఆరాధనగా కాకపోయినా ఆసక్తిగా మోహన కృష్ణ మాస్టారు వంక చూస్తూ ఉండి  పోయాను.  వాళ్ళు మా ఇంటి ప్రక్కనే ఒక పెద్ద బిల్డింగ్ కట్టేశారు. వారి అబ్బాయిలు  ఇద్దరూ  విదేశాలలో స్థిర పడ్డారని, పెళ్ళిళ్ళు కూడా అయిపొయ్యాయని చెప్పారు.  మేము ఒక నెల రోజులు ఉండి తిరిగి అమ్మ వర్క్ చేస్తున్న ఊరికి వచ్చేశాము.
కొన్ని నెలలకి మోహన కృష్ణ మాస్టారు భార్య ఉరి వేసుకుని చనిపోయింది అని నానమ్మ చెప్పింది.  ఎందుకు అంటే ఏమో తెలియదు అని చెప్పింది.  అప్పుడు నాలో ఎక్కడో అణచి ఉంచిన   ఊహలు  మళ్ళీ నిద్ర లేచాయి. నానమ్మ ప్రక్కన చేరి ‘నానమ్మా!  నాకు నాన్న కావాలి’  అని చెప్పాను.
ఇరవై రెండేళ్ళ పిల్ల నాన్న కావాలి అంటే అర్ధం చేసుకోకుండా ఉంటుందా?
‘నీకు నాన్న కావాలని మీ అమ్మకి ఎప్పుడో చెప్పాము తనే వద్దని భీష్మించుకుని కూర్చుంది . తను కావాలంటే నేను వద్దంటానా? మీ అమ్మని ఒప్పించు. అయినా ఈ వయసులో ఎక్కడని మీ నాన్న కోసం వెతుకుతావు వెర్రి మొహం నువ్వూనూ!’  అని చీవాట్లు పెట్టింది.
‘ఎక్కడో వెతకక్కరలేదు. మన ఇంటి ప్రక్కన మోహన కృష్ణ మాస్టారు అమ్మకి తగిన జోడు’  అని చెప్పాను.   నానమ్మ ఆశ్చర్యంగా చూసి  ‘అతనా! అతనైతే పర్వాలేదు.  వ్యక్తి కూడా మంచి వాడే ననుకుంటాను.  పాపం ఎందుకో ఆ రాజేశ్వరి టీచర్ ఆ వయసులో అలా ఉరేసుకుని చనిపోయింది ” అంది.
నాయనమ్మ దగ్గర ఆమోదం లభించడంతో  నాకు ఏనుగు ఎక్కినంత ఆనందం  కలిగింది.  ఇక అమ్మ దగ్గర నా ఆలోచనలని కార్య రూపంలో పెట్టడానికి ప్రయత్నించాను.  అమ్మ
ససేమిరా ఒప్పుకోలేదు. నేను అలిగాను. తిండి తినకుండా బెట్టు చేసాను. ఆఖరి అస్త్రంగా ‘నాకు పెళ్లి చేసినప్పుడు కన్యాదానం చేయాలి.  నాకు ఆ లోటు లేకుండా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి.  నాకు నాన్న కావాలి’ అని చెప్పాను.
నాన్న లేకపోడం వల్ల  ఆస్తుల వాటాల విషయంలో, అయినవాళ్ళ వైఖరిలతో విసిగి పోయిన అమ్మ  బంధులంటే విముఖత పెంచుకుంది.  అమ్మకి  నా పెళ్లి విషయంలో బంధువుల  అండ దండ వీసమెత్తు అయినా  తీసుకోవడం ఇష్టం లేకపోయింది. పదే  పదే అదే విషయాన్ని నేను అడగడం,  నానమ్మ కూడా నాకు వత్తాసు పలకడం చూసి ఆలోచనలో పడింది.   అమ్మ ఆలోచనలని గ్రహించి నేను కార్యాచరణలోకి దిగాను.
మోహన కృష్ణ మాస్టారుతో మాట్లాడి ఆయనని ఒప్పించాను. ఆయన సులభంగానే ఒప్పుకోవడంతో పాటు వెంటనే కొడుకులిద్దరికీ ఫోన్ చేసి మాట్లాడాడు. వాళ్ళు కూడా సుముఖంగానే ఉన్నారు అని చెప్పారు  రెండు నెలలలో పెళ్ళికి తేదీని నిర్ణయించాము.  అమ్మ పెళ్లి రంగ రంగ వైభవంగా చేయాలని అనుకున్నాను. కానీ అమ్మ సున్నితంగా తిరస్కరించి  గుడిలో సింపుల్ గా దండలు మార్చుకుంటే సరిపోతుందని,   అలాగే తనకి ఇష్టమని కూడా  చెప్పింది.  పెళ్ళికి రెండు మూడు రోజుల ముందు మోహన కృష్ణ మాస్టారు పిల్లలు ఇద్దరూ వచ్చారు. నేను వాళ్ళని అన్నయ్యా అంటూ సంతోషంగా పిలిచాను.  వాళ్ళూ  చెల్లెమ్మా..  అంటూ  ఆప్యాయంగానే ఉన్నారు   అన్నయ్యలగా నాకు ఒక వడ్డాణంని బహుకరించారు. అమ్మకి కొన్ని గిఫ్ట్ లు ఇచ్చారు  అమ్మ నాన్నల  పెళ్లి అయిన తర్వాత ఒక పది రోజులు వరకు ఉన్నారు. మా ఇల్లంతా సందడి సందడిగా ఉంది.   ఆనందానికి అవధులు లేకుండా  అంతా నేనై తిరిగాను. మోహన కృష్ణ గారిని  ‘నాన్నా- నాన్నా’  అంటూ వదలకుండా తిరిగాను.
అన్నయ్య లిద్దరూ అమ్మని ‘ఆంటీ’ అంటూ పిలిచారు. అమ్మకి అది కష్టంగా అనిపించింది ‘అదేమిటి బాబూ! స్వాతి నాన్న గారూ అని పిలుస్తుంది మీరు కూడా  నన్ను అమ్మా అని పిలవచ్చు కదా!’  అని అడిగింది.
‘ సారీ అంటీ ! స్వాతికి అంటే వాళ్ళ నాన్న ఎవరో తెలియదు కనుక అలా తేలికగా పిలవగలుగుతుంది.  మాకు మా అమ్మ అంటే ఏమిటో తెలుసు. ఆమె ప్రేమ తెలుసు, అట్లాగే  ఆమె కష్టాలు తెలుసు. మా కోసం మా అమ్మ పెదవి విప్పకుండా ఎన్ని బాధలు భరించిందో మాకు తెలుసు’ అని అన్నారు.  అమ్మే కాదు ఆ మాటలు వింటున్న నేను కూడా స్థాణువులా నిలబడి పోయాను.
అన్నయ్యలు ఇద్దరూ వాళ్ళ అమ్మ కష్టాలు అంటూ చెపుతున్నారు అంటే మోహన కృష్ణ మాస్టారు మంచి వ్యక్తి కాదా! – అనేక అనుమానాలు మొదలయ్యాయి. అన్నయ్యలిద్దరూ తిరిగి వెళుతూ నా పెళ్లి బాధ్యత  అంతా వాళ్ళే చూసుకుంటాము అనీ,  నాన్న రిటైర్  అయిన తర్వాత  వచ్చే డబ్బు కాని ఆయన పెన్షన్ డబ్బు  కానీ ఏవి తమకి ఇవ్వనవసరం లేదనీ, అన్నీ మాకే చెందుతాయననీ  చెప్పి వెళ్ళారు.
రోజులు గడుస్తున్న కొద్దీ చాలా విషయాలు నాకు అవగతమయ్యాయి.  నాన్న అట్టే మంచాడు కాదని భార్యని   అనాకారి అని నిత్యం వేధించుకు తినేవాడని,  ఏ వంట చేసినా నచ్చ లేదని పేర్లు పెట్టేవాడని,  స్త్రీ లోలత్వం ఉందని అర్ధమయి పోయింది. నాకు చచ్చేంత దిగులు ముంచుకు వచ్చింది.  హాయిగా పువ్వులా బ్రతుకుతున్న అమ్మని తీసుకు వచ్చి వ్యసన పరుడికి   జత చేసానేమో అని దిగులు కలిగింది.
అమ్మ ఏమి చెప్పేది కాదు. ‘నాన్న మంచి వాడేనా అమ్మా!’ అని అడిగేదాన్ని. ‘మంచివాడు అనేగా బలవంత పెట్టావ్’  అని నవ్వేది.  ఆ నవ్వులో నాకు అనేక అర్ధాలు కనిపించేవి.   ఒక సంవత్సర కాలంలోనే నాన్న  రిటైర్మెంట్.   ఆ ఫంక్షన్  కి వెళ్ళాము. అక్కడ అందరూ  మోహన కృష్ణ మాస్టారు భార్య చాలా అందంగా ఉంది కదూ అని మెచ్చుకుంటూనే  కాసేపటి తర్వాత  గుసగుసలాడుకుంటున్నారు. వీరిద్దరికీ అదివరకే పరిచయం ఉంది అంట. ఇద్దరి ఇళ్ళూ  ప్రక్కనే కదా! వీళ్ళ గ్రంధసాంగం తెలిసే  రాజేశ్వరి టీచర్ ఉరి వేసుకుని చనిపోయిందని చెప్పుకుంటారంట’ అనే మాటలు నా చెవిన పడ్డాయి. నాకు దు:ఖం ముంచుకు వచ్చింది. ఉన్నత చదువులు చదువుకుని గురువుల  స్థానంలో ఉన్న వీరు కూడా  ఎంత నీచంగా ఆలోచించగలరో ! అనుకున్నాను. నిజాలు ఏవిటో తెలియ కుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు  అనిపించింది,  అసహ్యం వేసింది. నాన్నని  ‘అన్నయ్య వాళ్ళ అమ్మ ఎందుకు చనిపోయింది’ అని  అడిగేశాను .
ఆయన నవ్వుతూ  ‘ఆమెకి అందంగా లేనని ఇన్ఫీరియారిటీ  కాంప్లెక్స్.  వంట  చేయడం సరిగ్గా రాదు. ఇతరులతో  స్నేహాన్ని  అర్ధం చేసుకునేదే  కాదు.  నాపై అనుమానం ఎక్కువ. అందుకే అలా చేసింది’  అని చెప్పారు. నాన్న రిటర్మెంట్ అయ్యాక వచ్చే డబ్బుతో అమ్మ పేరు మీద  ఉన్న స్థలంలో ఇల్లు కట్టారు. నాన్నతో పాటు నాన్న వాళ్ళ అమ్మ, నాన్నమ్మ నేను. నాన్న, అమ్మ అందరం కలసి ఉండేవాళ్ళం . నానమ్మలిద్దరూ బాగా కలసి పోయారు. వారితో  ఏ ఇబ్బంది ఉండేది కాదు.  ఉదయాన్నే నేను,  అమ్మ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే నాన్న ఇంట్లో ఉండేవారు. నాన్నతో పరిచయం ఉన్నఅనేక మంది టీచర్స్ మా ఇంటికి వచ్చి పోతూ ఉండేవారు.  అమ్మ వచ్చేసరికి వంట ఇల్లు అంతా  కాఫీలు తయారుచేసుకుని, టిఫిన్స్ తయారుచేసుకుని  తిని వంట వస్తువులు అన్నీ  అడ్డదిడ్డంగా  వాడి పడేసే వారు. డైనింగ్  టేబుల్ పైన తిన్న కంచాలు అలాగే పడి ఉండేవి.  ఎక్కడ పడితే అక్కడ కూర్చుని ప్లేయింగ్ కార్డ్స్ ఆడటం లాంటివి  అన్నీ కనబడుతూ  ఉండేవి. అదేమిటి అని అడిగితే  సరదాగా ఫ్రెండ్స్ మి  కూర్చుని ఆడుకుంటున్నాం అనేవారు నాన్న.
ఆయన చేసే రకరకాల విన్యాసాలని నాకు కనబడకుండా చేయడానికి అమ్మ నాకు మేడపై గది కేటాయించింది . నాన్నమ్మలిద్దరూ ఓ మూల  గదిలో ఉండేవారు. ఒక రోజు నేను నా గదిలో నుండి బయటకి  వచ్చి క్రిందికి చూశాను.  నాన్న తను తినే అన్నం పళ్ళెం ని అమ్మ ముఖం పై విసిరి కొట్టాడు. అన్నం అంతా చెల్లాచెదురు అయిపొయింది  పళ్ళెం విసరడం వల్ల అమ్మ కంటి పైభాగంలో దెబ్బ తగిలి వెంటనే బొప్పి కట్టి పోయింది.
‘నీకు ఎంత దైర్యం ఉంటే  ఉదయం వండిన కూర వేసి  నాకు అన్నం పెడతావు.  సిగ్గు లేదా? మొగుడుకి వేడి వేడిగా చేసి వడ్డించాలని తెలియదా!?’  అంటున్నాడు.
అమ్మ సంజాయిషీగా  ‘ఈ రోజు రావడం ఆలస్యం అయింది. తలనొప్పిగా కూడా ఉంది. అందుకనే ఈ పూట కూరలు  చేయలేకపోయాను’ అని చెపుతోంది .
‘నువ్వు మాత్రమే ఉద్యోగం  చేస్తున్నావా?  రాజేశ్వరి కూడా ఉద్యోగం చేసేది. అయినా నాకు ఏనాడూ  లోటు చేసేది కాదు. ఎలా చేసినా ఏది పడేసినా తిని ఊరుకుంటాడు లే అని అనుకుంటున్నావేమో’ అంటూ  ఇంకా ఏదేదో మాట్లాడబోయి నన్ను చూసి ఆగి పోయాడు.
ఆ రాత్రి అమ్మని పట్టుకుని నేను ఏడ్చేసాను.  అమ్మ మౌనంగా కన్నీరు కార్చింది.
అమ్మ ప్రతి రోజూ  కాలేజ్ కి వెళ్ళాలంటే రాను పోను నూటముఫై  కిలోమీటర్లు ప్రయాణం చేయాలి.  కనీసం ఇంటి దగ్గర నుండి రెండు గంటల ముందు బయలు దేరితే తప్ప సమయానికి చేరుకోలేదు. తెల్లవారుఝామునే  లేచి ఇంటి పనులు, వంట పనులు అన్నీ చేసుకుని నాన్నకి అన్నీ హాట్ ప్యాక్ లలో సర్ది  అమ్మ బయటకి వెళ్ళాలి. అమ్మ ఒక్కటే ఒంటరిగా బయటకి వెళ్ళకూడదు. ఆయనతోనే బయటకి వెళ్ళాలి. జనన మరణ పెండ్లి విందు వినోద కార్యక్రామాలు అన్నిటికి ఆయనతో ఠంచనుగా వెళ్లి తీరాలి. అక్కడ అందరికి అమ్మని గర్వంగా చూపాలి. అమ్మ వెళ్ళడం కుదరదంటే, ఆ రోజు ఇంట్లో మరో యుద్ధం జరిగేది.
ఇవన్నీ చూస్తూ బాధ పడుతున్న నన్ను ఎక్కువకాలం అక్కడ ఉంచడం అమ్మకి ఇష్టం లేక పోయింది. అన్నయ్యలతో చెప్పి ఫారిన్ సంబంధం చూసి నిశ్చయం చేసి పెళ్లి జరిపించారు. నాకు ఎలాంటి  భర్త వస్తాడు అనే దానికన్నా అమ్మ జీవితం ఎలా గడుస్తుందో అనే నాకు దిగులుగా ఉండేది. నేను అమ్మకి పెళ్లి చేయాలనుకోవడమే చాలా పొరబాటు పని అనిపించింది. హాయిగా ఉన్న అమ్మ బ్రతుకుని  కష్టాల పాలు చేసినట్లు అయ్యింది.
స్త్రీ కి పునర్వివాహం అనేది అందరికీ  సంతోషాన్ని ఇవ్వదు.  అసలు సంతోషాన్నే ఇవ్వదు అంటాను నేను. మొదటి వివాహం విఫలమై రెండో వివాహం చేసుకుంటే వాడితో ఎందుకు తేడాలు వచ్చాయి?  వాడు నాలా ఉండేవాడు కాదా?  వాడు నీకు నచ్చలేదా? అనో,  లేదా వాడిని ఎందుకు వదిలేశావు? ఎవరినైనా ఉంచుకున్నావా? అనో,  మొదటి  పెళ్ళైన ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకి  పెళ్లి అయ్యింది,  ఇన్నాళ్ళు మడి  కట్టుకునే ఉన్నావా?  అనో అవమానకర ప్రశ్నలు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది.  మళ్ళీ  ఎందుకు పెళ్లి చేసుకున్నామా ? అని పశ్చాత్తాప పడుతూ   పెనం మీద నుండి పొయ్యిలోకి పడేసినట్లుగా తమ పరిస్థితి అయింది అని అనుకునే వాళ్ళు తక్కువ ఏమీ కాదు.
అమ్మ తన బాధలు అన్నింటిని కాకపోయినా కొన్ని అయినా నాతో చెప్పుకుంటుంది. ఆమెకి నేను తప్ప ఎవరున్నారు? ఎవరితో నైనా పంచుకున్నా పలుచన అయిపోతాము అంటుంది . అందరి  దృష్టిలో మోహనకృష్ణ  మంచివాడు.  అమ్మకి జీవితం ఇచ్చాడు. ఇల్లు కట్టాడు  నాకు బోలెడు నగలు చేయించారు. పెళ్లి చేశాడు అని చెప్పుకుంటారు తప్ప.  ఆయన కొడుకులు కూడా ఆయన బాధ్యతని తెలివిగా అమ్మ పై వేసి తప్పుకున్నారు అని అర్ధం కావడం కష్టం.  జీవితం లో అవసరాల కోసమే పెళ్లి అనుకునే వారే ఎక్కువ. ఇలాంటి పెళ్ళిళ్ళలో
ఏ మాత్రం ప్రేమకి, అనుబంధానికి తావే ఉండదు.  అందుకు ఉదాహరణ మా అమ్మ వివాహమే.
మగవాడికి  ఏ వయసులో అయినా వంట వండి  పెట్టడానికి, ఇంటి  అవసరాలు చూడటానికి,  ఇంకా శారీరక అవసరాలు తీర్చుకోవడానికి స్త్రీ అవసరం కావాలి. అందుకు పెళ్ళి అనే అందమైన ముసుగు వేస్తారు.   పురుష అహంకారాన్ని ప్రదర్శిస్తారు. అలాగే ఒంటరి తనంతో బ్రతుకున్న స్త్రీలు ఆర్ధిక అవసరాల కోసమో, అండ కోసమో తోడు కోరుకుంటారన్నమాటే కానీ వారికి ఏ మాత్రం ప్రేమానురాగాలు లభింపక పోగా ఎన్నో అవమానాలు, అనుమానాలు ఎదుర్కోవాల్సి  వస్తుంది. ఆ వివాహాన్ని తెగతెంపులు చేసుకునే ధైర్యం రాదు. ఒకవేళ అలా తెగింపు నిర్ణయం తీసుకున్నా  మరొకసారి  విఫలమైన వివాహంతో సగం చచ్చి ఉన్న వారిని  చుట్టుప్రక్కల వారు వారి మాటలతో పూర్తిగా చంపేస్తారు.  స్త్రీ జీవితం అడుగడుగునా వేదనాభరితమే!  అలాగే అంతకు ముందు వివాహం వల్ల పిల్లలు ఉంటే స్త్రీకి  అనేక సర్దుబాట్లు ఉండాలి. ముందు వివాహం వల్ల కల్గిన  బిడ్డలని  పూర్తిగా  వదులుకోవాలి. పురుషుడికి ఉండే పిల్లలకి  అలాంటి ఒప్పందాలు ఉండవు .  ఎంత బాగా చూసుకున్నా సవతి తల్లి అనే ముద్ర  ఉండనే ఉంటుంది. ఒక్కో వివాహంలో భర్త మొదటి పిల్లలకి   రెండో భార్యగా వచ్చిన ఆమె పై సదభిప్రాయమే ఉండదు.  కనీస గౌరవానికి అనర్హురాలన్నట్లు చూస్తారు.  ఇలాంటివి అన్నీ ఉన్న చోట పునర్వివాహం విజయవంతం కావడం  కష్టం అని నా అభిప్రాయం. మళ్ళీ మా అమ్మకి మునపటి జీవితం తిరిగి రాదు.  ఇవ్వాలంటే కష్టం కూడా.  సంవత్సరానికి ఆర్నెల్లు అయినా మా అమ్మని నాదగ్గరకి పిలిపించుకుని ఆమెకి విశ్రాంతి ఇవ్వడం తప్ప మరో దారి కనబడటం లేదు.   అలా అమ్మని పిలిపించుకుందామన్నా అతను  తయారవుతాడు”  అంది అతనిని   నాన్న అనడానికి కూడా ఇష్టం లేనట్టుగా.
“ఇది  నా ఇంట్లో జరిగిన విషయం . ప్రపంచానికి ఏమి తెలియకుండా  అమ్మ గుంభనంగా  దాస్తుంది కాబట్టి ఆమె జీవితం హాయిగానే సాగి పోతుంది అనుకుంటారు.  చాలా మంది జీవితాల్లో కూడా ఇలాంటి  సమస్యలు ఉంటాయి.  మళ్ళీ జరిగిన పెళ్లి విఫలం అయితే తమలోనే లోపం ఉందని అనుకుంటారని స్త్రీలు అన్నీ భరిస్తారు.  మగవారు సాధిస్తారు.  అది వారికి పుట్టుకతో వచ్చిన హక్కుఅనుకుంటారు.   స్త్రీకి  ప్రేమ, తోడు-నీడ కావాలనుకునే తపన కూడా ఉంటుంది. కానీ అవన్నీ  గుర్తించని స్థితిలో ఇరుకు మనస్తత్వాల మధ్య బతుకు వెళ్ళదీయాలనుకోవడం  నరకం కదా !   ఇప్పుడు చెప్పండి పునర్వివాహాలు మంచివేనంటారా?  ఎంతమంది  నిజమైన తోడు కావాలనుకుని పెళ్లి చేసుకుంటారంటారు ” అని అడిగింది స్వాతి.
సమాధానంగా  అప్పటివరకు నిశ్శబ్దంగా  ఉన్న హాలంతా  చప్పట్లతో దద్దరిల్లింది
ఆ చప్పట్ల  మధ్యలోనే  “నాలా  ఎవరూ  కూడా ఎవరినైనా  పునర్వివాహం చేసుకోమని బలవంతం చేయకండి.  పెళ్లి అనే బంధంలోకి బలవంతంగా నెట్టకండి. స్వేచ్ఛగా  వారికి నచ్చిన విధంగా వారి బ్రతుకుని వారి చేత బ్రతకనివ్వండి. మీరు అలా ఎవరినైనా బలవంతం  చేయాల్సి వస్తే , అలా చేసేముందు “స్వాతి వాళ్ళ అమ్మ” ని గుర్తుకు తెచ్చుకోండి. తర్వాత నిర్ణయం తీసుకోండి ” అని ముగించి ధన్యవాదములు చెప్పి క్రిందికి దిగి వస్తూ ఉంటే తల్లి  గుర్తుకు  వచ్చింది్ స్వాతికి.  ఆమె పడే అవస్థ  కళ్ళ ముందు మెదిలింది. కన్నీళ్లు ముంచుకొచ్చాయి  బాధ గొంతులో తారట్లాడుతుండగా చేతి రుమాలు తీసుకుని కళ్ళు తుడుచుకుంటూ  వచ్చి తను అంత  క్రితం కూర్చున్న కుర్చీలో కూర్చుంది స్వాతి.

వనజ వనమాలి  (వనజ తాతినేని)

మీ మాటలు

 1. Rama Krishna madala says:

  మీ స్వాతి వాళ్ళ అమ్మ కధ చదివాను చాల బాగుంది, పాత్రల ద్వార మీ అభిప్రాయం,కధ నడిపిన విధానం చాల బాగుంది మీ కధల్లో, ఇతర మీ అభిప్రాయాల్లో ఎక్కువగా స్త్రీ ని బాదిస్తున్న పురుషులే ఎక్కువ కనపడుతున్నారు, రచయిత్రిగా ఎప్పుడు ఒకే కోణం లో చూస్తుంటే రచయిత తన స్తాయిని విస్తృత పరచుకొలేదు.

  • రామకృష్ణ మాదల..గారు కథ నచ్చినందుకు ధన్యవాదములు
   మీ సూచన కి ధన్యవాదములు. మన చుట్టూ వ్యదాభారితమైన స్త్రీ మూర్తులే కనిపిస్తున్నారు.అందుకే ఆ కథలు వ్రాయాల్సి వస్తుంది. ఎ వాదంలోనూ ఇమడకుండా కథలు వ్రాయడం నాకు ఇష్టం .కానీ ఇవే కథలు వ్రాయాల్సి వస్తుంది :) మరో మారు ధన్యవాదములు

 2. vaishnavi says:

  “స్వాతి వాళ్ళ అమ్మ” కథ పునర్వివాహం చేసుకోవాలనుకునే వాళ్ళని తప్ప కుండా ఆలొచింపజేస్తుందండీ.
  కథ చదువుతున్నంత సేపు కథ లోని పాత్రలు మాత్రమే కనిపించాయి. ఇది ఒక కథ అని అనిపించలేదు. అలా కథని నడిపించారు.
  స్త్రీల జీవితాలలో సంఘర్షణ ని అద్బుతంగా మలిచిన మీకు అభినందనలు.

  • వైష్ణవి కథ నచ్చినందుకు ధన్యవాదములు వివాహమనే ఒప్పందంలో చిక్కుకున్నాక ఏదైనా భరించగల్గాలి. అందుకే పునర్వివాహం చేసుకునేటప్పుడు బాగా ఆలోచించుకోవాలి ఎవరిని బలవంతపెట్టకూడదు. అసలు వారికి ఏం కావాలి ? నాకు వివాహం ద్వారా ఏం లభిస్తుంది అనే ప్రశ్నలు వేసుకునే తీరాలి వ్యాపార దోరణిలా అనిపించినా ఇది తప్పదు పునర్వివాహంలో ప్రేమ ,ఆప్యాయతలు లభించవు అని స్వాతి చెప్పింది.అది ఆమె అనుభవం.

   ఇలాంటి అనుభవాలుని అందించింది ఈ కథ.
   కథని నేను వ్రాసిన తీరు నచ్చినందుకు మరీ మరీ ధన్యవాదములు

 3. వనజ వనమాలిగారికి మీ కథ ఇప్పుడే చదివాను. కథ చాలా బాగు౦ది. మీరు చెప్పిన విధాన౦ చాలా చక్కగా ఉ౦ది. ఈ నాటికీ స్త్రీ కి స్వాత౦త్ర్య౦ లేదన్నది నిజ౦. ఆడది గుప్పెట ముయ్యబట్టే చాలా మ౦ది దురాగతాలు బైట పడడ౦లేదు. పుణ్య పురుషులు కూడా ఉన్నారు. కానీ వారి శాత౦ చాలా తక్కువ. కథ స్వాతి కాకు౦డా వాళ్ళ అమ్మ ఎ౦దుకు చెప్పలేదన్నది సమ౦జస౦గా లేదు. ఆమె చెప్పగలిగేదైతే అది స్వగత౦ అవుతు౦ది. కన్న కూతురికే చెప్పనిది ప్రప౦చానికి ఎలా చెప్పగలుగుతు౦ది. ఈనాటికీ చాలా కాపరాలు నిలిచి ఉన్నాయ౦టే ఆడవారే కారణ౦ మీరు రాసిన్ట్లు ఆర్థిక స్వాత౦త్ర్య౦ ఉన్నా అమ్మతన౦ ఆమెను స౦కెళ్ళ కు గురిచేస్తు౦ది. చక్కని కథ. మీ కల౦ ను౦చి ఇ౦కా మ౦చి కథలు రావాలని కోరుతూ
  సుజల( అనూరాధ)

  • సుజల గారు మీ స్పందన అమూల్యం. కథని అర్ధం చేసుకున్నందుకు మరీ మరీ ధన్యవాదములు .

   • నేనూ ఓ చిన్నపాటి రచయిత్రిని ఎ౦తో మధన పడితే కానీ ఒక కథ కు జన్మను ఇవ్వలేము. ఆడవారి మనసు మగవాడు ఊహి౦చి రాస్తారు. ఆడది అనుభవి౦చి రాస్తు౦ది. నెను అనూరాధ అన్న కల౦ పెరు తో రాస్తాను. ఈ మధ్య నే నాఅసలు పేరు తొ రాయడ౦ మొదలు పెట్టాను. లేటెస్ట్ కథ ఎల్లలు లేని మమత రచన మయ్ లో పడి౦ది వీలు౦టే చదివి మీ అభిప్రాయ౦ చెప్ప౦డి.

  • సుజల గారు … మంచి విషయం చెప్పారు. చాలా సంతోషం . తప్పకుండా చదువుతాను . థాంక్యూ !!

 4. అనూ says:

  బాగా రాసారండీ. స్వాతి పాత్రలోని ఆవేదనని చక్కగా చెప్పారు.

 5. వనజ గారూ- ఏ రాయి అయినా ఒకటే నెత్తి బాదుకోవడానికి-
  అలాగే ఎన్నో మొగుడయినా కథ ఒకటే-
  ఇక వయసు వచ్చాక మళ్లీ పెళ్లి మగవాళ్ళకు పనిచేసే పెట్టే వాళ్ళని సమకూరిస్తే, ఆడవాళ్లని ఉన్న స్వేచ్ఛ కోల్పోయి పనివాళ్లుగానూ మారుస్తుంది.
  మీ కథ లోని బాడ్ ఛాయిస్ కి కూతురు ఒక్కతే బాధ్యత వహించి బాధ పడనవసరం లేదు. లెక్చరర్ గా ఉద్యోగంచేస్తున్న తల్లి తనకి నచ్చనపుడు భరించాల్సిన అవసరమూ లేదు.
  కథ చెప్పిన విధానం బావుందండీ-
  -కె.గీత

  • కె.గీత గారు .. మీ వ్యాఖ్య తో .. నేను పూర్తిగా ఏకీభవిస్తాను. మీ స్పందన అమూల్యం.
   హృదయపూర్వక ధన్యవాదములు

 6. వనజ గారు చాలా బాగా వ్రాయగలరు అందులోసందేహం లేదు. చాలా కోణాలు పరిచయం చేస్తున్నారు తమ కథల ద్వారా. ఎవరో అన్నట్టు స్త్రీల కోణం నుంచి మాత్రమే వ్రాస్తారని అనిపించలేదు నాకు ఆమె గురంచి ఎప్పుడూ. ఆమె పరిచయం చేసే కోణాలలో కూడా నేను చూసే కోణం కొంచెం వేరుగా ఉంటోంది.
  ఈ కథలో భార్య ఉరి వేసుకుని చనిపోయిందని తెలిసినా అతనిని పెళ్ళి చేసుకోమని కూతురు పోరడం, తర్వాత తప్పు అంతా పునర్వివాహం మీద మోపెయ్యడం కొంచెం అసమంజసంగా అనిపిస్తోంది నాకు.
  “ఈనాటికీ చాలా కాపరాలు నిలిచి ఉన్నాయ౦టే ఆడవారే కారణ౦.” ఈ మాటలని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. నన్ను కోప్పడకండి. నా అభిప్రాయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆడా, మగా అన్నది కూడా అప్రస్తుతం. బాధితులు బాధని సహించడం వల్ల బంధం నిలిచి ఉండడం అనేది నిజమూ కాదు, ఆరోగ్యకరం కూడా కాదు. బాధించేవారికి వెసులుబాటూ, చెల్లుబాటు ఉన్నంతకాలం బంధం నిలిచి ఉంటుంది. అది నిలిచి ఉండడానికి బాధితుల సహనం తోడ్పడుతోందన్న భావం బాధించేవారికి లాభం చేకూరుస్తుంది, బాధపడుతున్న వారికి పరిస్థితి మీద లేని control ఉన్నట్టు భ్రమిపంపజేసి, బంధం ఎలాగూ పోయేదే కనుక పోయినప్పుడు అది వారి తప్పేనేమో అనిపించేలా చేస్తుంది. సెక్యూరిటీ కోసం స్వేచ్ఛని త్యాగం చేస్తే రెండూ పోతాయన్నది అర్థం చెసుకోవడం బాధితులకే కష్టం. బయటి వారికి ఇంకా కష్టం. కానీ అది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తేనే మనం ఆరోగ్యకరమైన పరిష్కారం అన్వేషించగలం.
  అనేవాళ్ళు ఏ పరిస్థితిలోనైనా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అర్థం చేసుకునే వాళ్ళు ఎటువంటి నిర్ణయానికైనా అండగా నిలుస్తారు.

  • లలిత గారు .. మీ సునిశిత పరిశీలన నాకు బాగా నచ్చింది
   ఈ కథలో స్వాతి కి నాన్న కావాలి అనే బలీయమైన కోరిక వల్ల తల్లిని ఒత్తిడి చేయడం,తొందరపాటు తనం స్పష్టంగా కనబడుతుంది. ఆ అమ్మాయికి వివాహ బంధాన్ని బాగా అర్ధం చేసుకోగల్గిన పరిణితి కానీ, నాన్న గా రాబోయే వ్యక్తి గురించి తెలుసుకోవాలని ఆలోచన కానీ లేదు. కేవలం నాన్న కావాలి .. అనే ఇష్టం . అంతే! ఆ ఇష్టమే ఈ కథని నడిపింది తన అనుభవాన్ని పంచుకుంది.

   మీరన్నట్లు “సెక్యూరిటీ కోసం స్వేచ్ఛని త్యాగం చేస్తే రెండూ పోతాయన్నది అర్థం చెసుకోవడం బాధితులకే కష్టం” .

   స్వేచ్చగా నిర్ణయాలు తీసుకోలేని వారి కోసం, మగ్గిపోతున్న వారి కోసం, పునర్వివాహం చేసుకునే వారిని ఆలోచింపజేయడం కోసం స్వాతి ఈ కథ చెప్పింది

   కథ నచ్చినందుకు ధన్యవాదములు. అర్ధం చేసుకుని విలువైన వ్యాఖ్య ఇచ్చినందుకు మరీ మరీ ధన్యవాదములు

 7. కధ చదివిన తర్వాత అసలు మన భారతదేశంలో వివాహ వ్యవస్థ కొన్ని సంకుచిత భావాల అవస్థ అని చెప్పుకొని తీరాల్సిందే . చ్హదువుతుంటే , మోహనక్రిశ్ణ చూపులు , అతని భార్య ఉరి వేసుకున్నది అనగానే అతని నడవడిని పాఠకులకు అతి సులభంగా అర్ధమైపోతున్నాయి . స్వాతికి సరస్వం అయిన తల్లి ( ఆసరికి స్వాతి పెద్దమనిషై ఉండి ఉంటుంది ) లోకమ్ పోకడ , పక్కింటి మోహన క్రిష్ణ ఎటువంటివాడో చెప్పి ఉండాల్సిమ్ది . ఆ తల్లి పాత్ర అలాంటిది . సరే ఏది ఏమైనా మన వివాహ వ్యవస్థ లోపాల వల్ల ( కె . గీత గారు చెప్పినట్లు ) ప్రధమదైనా అధమంగానే భావించాలి . అది మారిన నాడే మనుషులకు ( లింగభేదమ్ లేదు ) అసలైన జీవితం ( వాళ్ళూ అనుకున్నట్లు స్వేఛ్చగా )లభిస్తుంది. అంతవరకు ఈ భారతీయుల జీవితాలకు ఆహ్లాదకరమైన స్వేఛ్ఛ లభించదు అన్నది జీర్ణించుకోలేని వాస్తవం .

  • శర్మ గారు మీ స్పందనకి ధన్యవాదములు

   “మన భారతదేశంలో వివాహ వ్యవస్థ కొన్ని సంకుచిత భావాల అవస్థ అని చెప్పుకొని తీరాల్సిందే .”

   అవునండీ!! ,

 8. sasikala says:

  nijam vanaja garu .andaru manchollu anukonakkarledhu.
  asalu preminche vishla hrudayam leni vaallu pelli chesukovadam
  yenduku.vaallaku narakam choopadam yenduku?
  kadha chala baaga vraasharu

 9. మళ్ళీ జరిగిన పెళ్లి విఫలం అయితే తమలోనే లోపం ఉందని అనుకుంటారని స్త్రీలు అన్నీ భరిస్తారు. మగవారు సాధిస్తారు. అది వారికి పుట్టుకతో వచ్చిన హక్కుఅనుకుంటారు. స్త్రీకి ప్రేమ, తోడు-నీడ కావాలనుకునే తపన కూడా ఉంటుంది. కానీ అవన్నీ గుర్తించని స్థితిలో ఇరుకు మనస్తత్వాల మధ్య బతుకు వెళ్ళదీయాలనుకోవడం నరకం కదా !

  కథ ఎక్కడా ఆగకుండా చదివించింది వనజ గారూ. నిజానికి అందరికీ వివాహబంధమే గొప్పదన్న భావముంది. ప్రస్తుత వ్యవస్థలో అది ఏ మతమైనా కులమైనా అవసరాల మేరకు జరిగే ఓ బలవంతపు ఒప్పందంగా పరిణమించింది. సమాజం యొక్క గుర్తింపు కోసం గౌరవం అన్న ముసుగు కోసం తప్పని సరి పరిస్థితులలో స్త్రీలు ఇలా బంధిఖానాకు గురవుతున్నారు. మొత్తంగా స్త్రీ పురుషుల మధ్య అవగాహన మారాలి. పునర్వివాహం అన్నది మరో మారు పలుపు తాడు కాకూడదు. ‘స్వాతి వాళ్ళ అమ్మ’ లాంటి వారి పట్ల సహానుభూతిని పెంపొందింపజేసేలా కథను చెప్పిన తీరు బాగుంది. ఆలోచింప చేసే ఇలాంటి మరిన్ని కథలు మీ కలం నుండి ఆశిస్తూ. అభినందనలతో..

  • వర్మ గారు … కథ నచ్చినందుకు ధన్యవాదములు

   కథకి ప్రయోజనం ఉంటుందని ఆశించి లేదా ప్రయోజనం చేకూర్చాలని ఈ కథ నేను వ్రాయలేదు

   ఊహా జనిత ప్రపంచంని పరిచయం చేయడం లేదా ఆశయాలు వల్లించడం లాంటి కథల జోలికి నేను వెళ్ళను. మనం నిత్యం చూస్తున్న అనేక అంశాలని ఇతివృత్తంగా తీసుకుని అనుభవాలని,నేర్చున్న పాఠాలనే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ అలాగే చేపాను

   మీరన్నారే ..”స్వాతి వాళ్ళ అమ్మ” లాంటి వారి పట్ల సహానుభూతిని పెంపొందింపజేసేలా కథ చెప్పిన తీరు బావుంది ” అని ..

   అది చాలండీ, “పాఠకుల సమయాన్ని నేను నా కథని చదివించడం ద్వారా నిష్ప్రయోజనం చేయలేదు.” అని
   హృదయపూర్వక ధన్యవాదములు

 10. priyanestam sanjai says:

  మీ కధ చాలా బాగుంది కొన్ని వ్యక్తిత్వాలు గురించి మీరు చేసిన వర్ణన పరిశోధన చేసి రాసినట్లు ఉంది.
  మీరు కథలో పాత్రలని మలచిన తీరు ఎంత అమోఘంగా ఉందంటే చదినవాళ్ళు అందరు మగాళ్ళని అసహ్యించుకునెంతగా ఉంది. కాని అందరు అల ఉండరేమో వారి వారి పరిస్తితుల్నిబట్టి స్త్రీ అయిన పురుషుడు అయిన అలా ప్రవర్తిస్తారేమో…..
  ఛా……… మీ కథలో పాత్ర వల్ల నేను సంజాయిషీ ఇవ్వవలసి వస్తుంది అంటే అర్ధం చేసుకోండి స్వాతి తన అమ్మ గురించి చెప్పిందో కాదు కాదు మీ తోటి స్త్రీ బాధని మీరి స్వాతి తో చెప్పించారు అనిపిస్తుంది.

  • సంజయ్ గారు కథ నచ్చినందుకు ధన్యవాదములు. సమస్త పురుష లోకాన్ని నిందించే విధంగా నేను వ్రాయలేదు అక్కడ అవసరమైన మేర వ్రాసాను. అంతేనండీ!
   మీ స్పందనకి ,మీలో ఆలోచనలో ఈ కథ నిలిచినందుకు సంతోషం. మరీ మరీ ధన్యవాదములు

 11. anaamika veni says:

  వనజ గారు కథ చాలా బావుందండీ ! నేనెప్పుడూ మీ బ్లాగ్ చదువుతుంటాను.

  ఈ కథ లో స్వాతి పునర్వివాహం చేసుకున్న వారి సమస్యలు, చెప్పిన మాటలు లో ప్రతి అక్షరం నా జీవితంలో జరిగినవే, ప్రేమించి వేరేమతానికి చెందినా వ్యక్తిని వివాహం చేసుకుని ఒక బిడ్డకి తల్లి అయి అనేక కష్టాలు పడ్డాను బిడ్డని కూడా వదిలేసి రావాల్సి వచ్చింది . గత ఆరేళ్ళుగా నా ఇంట్లో మళ్ళీ పెళ్ళి చేస్తామంటూ నెలకొక సంబంధం తెస్తారు వయసు 60 -45 మధ్య ఉంటాయి వాళ్ళకి పిల్లలు ఉంటారు . పెల్లైయిన పిల్లలు ఉంటారు నా బిడ్డతో సంబంధం లేకుండా చేస్తున్న ఉద్యోగం కూడా మానేసి రెండో భార్యగా ఇంటికే అంకితం అయ్యేందుకు సిద్దమైతే నాకు వెంటనే పెల్లిపోతుంది మా వాళ్లకి నా బరువుతీరుతుంది నా వయసు 34. నాలాంటి వాళ్ళు ఎదుర్కునే మాటలని ఈ కథలో అక్షరం అక్షరంలో నింపారు నాలాంటివాళ్ళు చెప్పుకోలేని బాధని స్వాతితో చెప్పించారు .కథ చదివి నాకు దుఃఖం వచ్చింది స్వాతి చెప్పింది నిజం . ఎవరూ బలవంతంగా వివాహం చేసుకోమని ఒత్తిడి పెట్టకూడదు. పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లే. మగవాళ్ళ ఆలోచను మారాలి. స్త్రీల సమస్యలని ఆలోచనలి చెప్పే కథలు మీరు మరిన్ని వ్రాయాలి . కృతజ్ఞతలు . పేరు చెప్పలేని అనామిక.

  • అనామిక వేణి గారు మీ స్పందన చూసాక నేను ఈ కథ ని వ్రాయడంలో సఫలీకృతం అయ్యాననిపించింది
   మనసారా ధన్యవాదములు.

 12. వనజ గారు ,మీ కధ ఇప్పుడే చదివాను .మీరు తీసు కున్న సబ్జెక్టు భర్త నుంచి వేరై పునర్ వివాహం చేసుకోవాలి అనుకునే వాళ్ళను ఆలోచింప చేసేదిగా ఉంది .కొందరు సోదర పాఠకులు చెప్పినట్టు సెక్యూరిటీ కోసం ఉన్న స్వేఛ్చ ని వదులు కోవటం పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్టే. పునర్ వివాహ ఆలోచన ఉన్న వాళ్ళు మీ కధ చదివితే పునరాలోచనలో పడటం ఖాయం .

  • రత్న గారు మీ స్పందనకి ధన్యవాదములు . మన మిత్రులు చెప్పినప్పుడు “సెక్యూరిటీ కోసం ఉన్న స్వేఛ్చ ని వదులు కోవటం పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్టే.” నిజమేనండీ ! స్త్రీలు మరింత చైతన్యవంతంగా ,బలోపేతంగా మారాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం . ధన్యవాదములు .

 13. వనజ గారు మీరు రాసిన కధ ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది.అలోచించేలా ఉంది. ఇంకొన్ని రచనలు మీ నుంచి ఆశిస్తున్నాను.

మీ మాటలు

*