నింగీ, నేలా

 PrasunaRavindran

నా ఎదురుగానే ఉంటావ్
అయినా
నీకూ నాకూ మధ్య
కొన్ని జన్మల దూరం
అడ్డు మేఘాలు కరిగిపోడానికి
నా స్పర్శే కాదు
నీ వేడి నిట్టూర్పులు కూడా
చాలటం లేదు
ప్రవహించే ఏ నదయినా
ఒక్క క్షణం ఆగి
నా పాట కూడా వింటుందని
ఆశగా చూస్తూంటాను
ఇన్నేసి పక్షుల గుంపుల్లో ఒక్కటయినా
తన రెక్కల నీడ పడుతుందని
నిష్ఫల స్వప్నాలు కంటూంటాను.
నీకోసం
రంగుల ముఖాల్ని తొడుక్కుంటూ
నీ మనసుకి అద్దంలా మారిపోతూ
అమృతాన్ని వర్షిస్తూ
నేనూ  …
నాతో మాట్లాడాలని
సుడులు తిరుగుతూ
పచ్చటి సైగలు చేస్తూ
పూలను విసురుతూ
గాలిపైటనాడిస్తూ
అనేక సంకేతాల పక్షులనెగరేస్తూ
నువ్వూ …
పరస్పరం ప్రేమించుకోని క్షణముండదు
అయినా
నీకూ నాకూ మధ్య
కొన్ని జన్మల దూరం ….

మీ మాటలు

 1. రమాసుందరి says:

  చాలా బాగుంది.

 2. Saikiran says:

  సూపర్ ప్రసూన గారు.

 3. ప్రసూన గారు,
  కవిత చక్కగా ఉంది. “అనేక సంకేతాల పక్షులనెగరేస్తూ” చాలా నచ్చింది.

  రవి

 4. Padhalanu eri kori kuchina Vyjayanthi mala ee kavitha :)

 5. చాలా చాలా బావుంది, ప్రసూనా!

  “ఇన్నేసి పక్షుల గుంపుల్లో ఒక్కటయినా
  తన రెక్కల నీడ పడుతుందని
  నిష్ఫల స్వప్నాలు కంటూంటాను.” — వావ్!!!

మీ మాటలు

*