ఎర్ర అట్ట డైరీలు

తెల్లటి వెన్నెల. చల్లటి గాలి. చాలా రోజుల తర్వాత నాకెందుకో అలా బయట తిరిగొస్తే బాగుండుననిపించింది. అనుకున్నదే తడవుగా బయల్దేరి మా ఇల్లు దాటి అలా వీధి చివరికి వెళ్ళానో లేదో కాస్త దూరంగా కనిపించాడు వాడు. ముందు వాడేనా కాదా అని అనుమానం కలిగింది. రోడ్డు పక్కగా వున్న చెట్టు నీడలో చీకటి చూసుకోని అక్కడే నిలబడి చూశాను. వాడు ఇంకొంచెం ముందుకు రాగానే నిర్థారణ అయిపోయింది. వాడే..!! చారిగాడు..!!

చటుక్కున వెనక్కి తిరిగి గబగబ అడుగులు వేసుకుంటూ దాదాపు పరుగెత్తినంత పని చేశాను. చల్లగాలి ఎటుపోయిందో తెలియదు. వెన్నల తెల్లగా పరుచుకోని నా ఉనికిని వాడికి ఎక్కడ చూపిస్తుందో అని భయంగా వుంది. వాడు నన్ను చూడలేదనే అనుకున్నాను. చూస్తే తప్పకుండా కేకేసేవాడు కదా!

ఇంట్లోకి దూరి తలుపులు వేసేసి సోఫాలో కూలబడ్డాను.

“ఏమైంది? ఏదో ఈవినింగ్ వాక్ అంటూ వెళ్ళారుగా?” అడిగింది రాధిక. నా నుంచి ఏ సమాధానం రాకపోవటంతో మళ్ళీ తనే అంది – “శకునం బాలేదా ఏమిటి?” నవ్వుతూ అంటూనే వంటింటిలోకి వెళ్ళిపోయింది.

“దాదాపు అలాంటిదే” అన్నాను నేను నెమ్మదిగా. నా కళ్ళ ముందు వాడే కనపడుతున్నాడు. ఆ చారిగాడు..!!

అయినా ఈ వేళప్పుడు ఇటెందుకు వస్తున్నాడు? కొంపదీసి నన్ను కలవడానికి ఇక్కడికే వస్తున్నాడేమో? ఆ ఆలోచన రావటమేమిటి బయట గేటు చప్పుడైంది. అనుమానమే లేదు వాడే అయ్యింటాడనుకున్నాను.

“ఇదిగో రాధా.. ఆ చారిగాడు వస్తున్నట్లున్నాడుగానీ… నేను ఇంట్లో లేనని చెప్పు..” సోఫాలోంచి దూకి పడగ్గదిలోకి వెళ్తూ అరిచాను.

“చారిగారా? ఆయనొస్తే మీరు లేరని..??” ఏదో అడగబోయింది కానీ మధ్యలోనే ఆపేశాను నేను.

“అబ్బా.. అనవసరపు ప్రశ్నలన్నీ అడక్కు… నేను చెప్పినట్లు చెప్పు.. అంతే” అంటూ పడగ్గదిలోకి అడుగుపెట్టాను. మరుక్షణం కాలింగ్ బెల్ మోగింది.

రాధిక వెళ్ళి తలుపు తీయటం – “మీరా.. బాగున్నారా? ఆయన లేరండీ..” అంటూ చెప్పడం వినపడుతూనే వుంది. పడగ్గది తలుపు దగ్గరే నిలబడి వచ్చిన వాళ్ళు ఎవరో వినాలని ప్రయత్నం చేస్తున్నాను.

“అలాగా.. సరేలేమ్మా.. ఫోన్ చేస్తుంటే ఎత్తటంలేదు.. సరే ఒకసారి కలిసిపోదామని వచ్చాను..” వాడే.. ఆ చారిగాడి గొంతే అది.

“ఆఫీసులో పని ఎక్కువైందండీ… ఫోన్ మాట్లాడే తీరికెక్కడిదీ?” చెప్పింది రాధిక.

’ఫర్వాలేదు బాగానే కవర్ చేసింది’ అనుకున్నాను. ఆ తరువాత ఏ మాటలూ వినపడలేదు. వాడు వున్నట్లా వెళ్ళిపోయినట్లా? ఒక వేళ చొరవగా వచ్చి లోపల కూర్చోనుంటే? నేను వచ్చేదాకా వుంటానని అని అక్కడే తిష్ట వేసి వుంటే? చెవులు కిక్కరించి వుంటున్నాను.

“డాడీ..!!” పిలుపు వినిపించి అదిరిపడ్డాను. అప్పటిదాకా మంచం మీద పడుకోని వున్న బంటిగాడు కాలింగ్ బల్ చప్పుడుకి లేచునట్లున్నాడు. నేను తలుపు దగ్గర చాటుగా నిలబడి ఏం చేస్తున్నానో అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు.

“ఏం చేస్తున్నావు డాడీ..” అంటూ అడగబోయాడు.

“ఇష్షూ.. ఇష్ష్..” అంటూ అమాంతం మంచం మీదకి దూకు వాడి నోరు మూసేశాను. విషయం అర్థంకాక వాడి భయం భయంగా నా వైపు చూశాడు.

పడగ్గది తలుపు తెరుచుకుంది. ఎదురుగా రాధిక. బంటి మీద దాదాపు పడిపోయి వాడి నోరు నొక్కేస్తున్న నన్ను విచిత్రంగా చూసింది. నేను ఇంకా విచిత్రంగా నవ్వుతూ వుండిపోయాను.

“ఏమిటిది? మీ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు గానీ.. ఇంక చాలించి రండి” అంటూ హాల్లోకి నడిచింది. బంటిని వదిలిపెట్టి భయపడాల్సిన పనిలేదని నచ్చజెప్పి, వాణ్ణి మళ్ళీ పడుకోపెట్టి నేనూ హాల్లోకి వచ్చాను.

“ఏమిటి సంగతి?” అన్నట్టు కళెగరేసింది రాధిక. ఏమీ లేదన్నట్టు తలాడించి కూర్చున్నాను. అంత సులభంగా వదిలిపెడుతుందా రాధిక?

“మీ ఫ్రెండ్ గానీ ఇన్సూరెన్స్ ఏజంట్ అయ్యడా?” అంది

“అబ్బే.. లేదు లేదు…”

“అయితే మల్టీలెవల్ చెయిన్ మార్కెటింగ్ లాంటివి ఏమైనా..”

“ఊహూ..”

“మరెందుకు ఆయనొస్తే దాక్కున్నారు?”

గట్టిగా నిట్టూర్చాను. రాధికతో నిజం చెప్పాలనిపించింది. మొదలుపెట్టాను.

 ***

చారి అని పిల్చుకునే ఆచారిగాడు నాకు మంచి స్నేహితుడే. చిన్నప్పటి క్లాస్ మేట్. తర్వాత నేను వైజాగుకి చదువుకోడానికి వెళ్ళిపోయాను. ఆ తరువాత చాలా కాలానికి మళ్ళీ గుంటూరు వచ్చి స్థిరపడ్డాము. అనుకోకుండా ఒకరోజు సాయంత్రం శంకర్ విలాస్ సెంటర్ దగ్గర కనిపించాడు. వాడే గుర్తుపట్టాడు. వాడి గుండు, వాలకం చూస్తి గుర్తుపట్టడం కాస్త కష్టమే అయ్యింది. పలకరింపులు అవీ అయ్యాక “నెల క్రితం నాన్నగారు పోయార్రా” అంటూ తల తడుముకున్నాడు.

“అరెరే.. సారీ.. తెలుగు మాష్టారు కదూ ఆయన..?” అడిగాను గుర్తుతెచ్చుకోని.

“అవును.. తెలుగు సంస్కృతం చెప్పేవారు. పదేళ్ళనుంచి అది కూడా మానేసి జాతకాలు అవీ చెప్పడం మొదలుపెట్టాడు. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. మాస్టర్ గా కన్నా జ్యోతిష్యుడిగానే బాగా సంపాదించాడు. డబ్బు.. పేరు కూడా” అన్నాడు.

“అలాగా? ఆయన జాతకాలు అవీ చెప్తారని నాకెప్పుడూ చెప్పలేదే..” అన్నాను నేను. నాక్కూడా జాతకాలు వెయ్యడం చూడటం తెలుసు. ప్రావీణ్యం లేదు కానీ ప్రవేశం అయితే వుంది.

ఆ తరువత పిచ్చాపాటి మాట్లాడుకోని, అక్కడి దగ్గర్లోనే బ్రాడీపేటలో వున్న వాళ్ళింటికి తీసుకెళ్ళాడు. ఇంటి బయట “ఓంశ్రీ జోతిష్యాలయం, దైవజ్ఞ: హయగ్రీవాచారి” అని  బోర్డు వుంది. నెల క్రితం మనిషి పోయిన దుఖం ఇంకా ఆ ఇంటిని అంటిపెట్టుకోని వున్నట్లు కనపడుతోంది. ఇంట్లోకి వెళ్ళగానే వాడి భార్య వచ్చి మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళింది. చారి వెళ్ళి వాళ్ళమ్మని వెంటబెట్టుకొచ్చాడు.

“వీడు గుర్తున్నాడా అమ్మా? సుందరం.. పోస్ట్ మాస్టర్ గారి అబ్బాయి” అంటూ గుర్తు చేశాడు. ఆమె నీరసంగా చూసింది.

“బాగున్నావా?” అంది.

“బాగున్నానండీ” అన్నాను. కొంత నిశబ్దం తరువాత – “నాకు ఇప్పుడే తెలిసిందీ..” అన్నాను ఊరడింపుగా. అంతే ఆమె ఒక్కసారిగా ఏడ్చేసింది. నాకు ఏం చెయ్యాలో తెలియక ఇబ్బందిగా కదిలాను.

“ఊర్కొ అమ్మా… ఊర్కో..” అంటూ వాడు ఆమెను లోపలికి పంపించాడు. తిరిగి వచ్చి –

“పదరా.. నాన్న రూములో కూర్చోని మాట్లాడుకుందాం” అన్నాడు. ఇద్దరం ముందు వైపు వున్న గదిలోకి వెళ్ళాం.

వాళ్ళ నాన్నగారు అక్కడే జాతకాలు అవీ చెప్పేవాళ్ళని అర్థం అయ్యింది. లోపలికి అడుగుపెట్టగానే ఎదురుగా కనపడేటట్లు ఒక కుర్చీ, దాని ముందు ఒక టేబుల్. ఆ టేబుల్ మీద ఏవో పుస్తకాలు, కాగితాలు, దేవుడి బొమ్మలు వున్నాయి. ఒక మూలగా చిన్న మందిరం అందులో ఇరుకిరుగ్గా చాలామంది దేవుళ్ళు. ఒక గొడకి మొత్తం పుస్తకాల రాకు, అందులో రకరకాల పుస్తకాలు.

ఇద్దరం ఆ గదిలో చాలాసేపు కూర్చోని పిచ్చాపాటి మాట్లాడుకున్నాం. వాడు ఎక్కువసేపు వాళ్ళ నాన్న గురించే తల్చుకోని బాధపడ్డాడు.

“చాలా పుస్తకాలు వున్నాయిరా..” అన్నాను నేను అటు చూస్తూ.

“అన్నీ లైబ్రరీకి ఇచ్చేయమని చెప్పాడాయన.. రేపో ఎల్లుండో వచ్చి తీసుకెళ్తారు..” అన్నాడు.

“అరెరే.. ముందే తెలిసి వుంటే నేనే తీసుకునేవాణ్ణి..” అని వెంటనే అన్నాను కానీ, అన్ని పుస్తకాలు నా ఇంట్లో పట్టవన్న సంగతి అన్న తరువాతే గుర్తుకొచ్చింది.

“వాళ్ళకు చెప్పేశాను కదా.. అయినా నీకు ఏమన్నా కావాలంటే తీసుకో…” అన్నాడు.

వాడు అన్నదే తడవుగా ఆ పుస్తకాల దగ్గరగా వెళ్ళి ఎగాదిగా చూశాను. చాలా వరకు జోతిషంకి సంబంధించినవి, వాస్తు సంబంధిచినవీ ఉన్నాయి.  ఓ ఇరవై దాకా ఆంగ్ల పుస్తకాలు, ఓ పది ఆత్మకథలు, అరడజను దాకా కథల పుస్తకాలు.. అంతే. వాటన్నింటి మధ్యలో మూడు ఎర్ర అట్ట డైరీలు కనిపించాయి. అవి తీసి చూశాను.

అన్నీ చేతిరాతలో రాసున్నాయి. ఒక్కొక్క పేజీ తిప్పి చూస్తే అవి హయగ్రీవాచారి గారు రాసినట్లు అర్థం అయ్యింది. చాలా వరకు ఆయన దగ్గరకు వచ్చి జాతకం చెప్పించుకున్న వారి వివరాలు వున్నాయి. ఒక ఇరవై ఏళ్ళ వ్యక్తి ఆయన దగ్గరకు జాతకం చెప్పించుకునేందుకు వస్తే నలభై ఏళ్ళకు తీవ్ర అనారోగ్యం వచ్చే అవకాశం వుందని తెలుసుకోని, దానికి తగ్గట్టుగా డబ్బులు ఇప్పటి నుంచే ఎలా ముదుపు చెయ్యాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఎలాంటిది తీసుకోని జాగ్రత్తపడాలి ఇలాంటి విషయాలు వాళ్ళకు చెప్పినట్లు రాసి వున్నాయి. జాగ్రత్తగా గమనిస్తే అన్నింటిలో ఇదే తరహా వివరాలు వున్నాయి. ఒక జాతకం ద్వారా ఒక మనిషి ఆర్థిక స్థితిగతుల్ని అంచనా వేసి ఆ జాతకునికి ఏ సమయంలో ఎంత మొత్తంలో డబ్బు అవసరం అవుతుందో లెక్కలు గట్టి, ఆ రోజుకి సరిపోయేలా డబ్బు సమకూర్చుకునేందుకు సూచనలు వున్నాయి. జోతిష్యశాస్త్రానికి, ఆర్థికశాస్త్రానికి లంకె పెట్టాడా మహానుభావుడు.

సమకాలీన కథ లో బలమైన స్వరం సత్యప్రసాద్
  aripiralaనెల్లూరులో పుట్టి గుంటూరులో పెరిగిన అరిపిరాల సత్యప్రసాద్ ఇప్పుడు తెలుగు కథా లోకంలో కనిపిస్తున్న సరికొత్త సంతకం.  విభిన్న శైలి, సరికొత్త కథన పద్ధతి ఉన్న రచయిత అరిపిరాల. ఇంగ్లీష్ చదువు చదివి, కార్పొరేట్ ఉద్యోగం చేస్తున్న కూడా సాహిత్యంమీద అభిరుచితో మంచి రచనలు చేస్తున్నారు. తొలికథ “రిక్షావాడు” 1993 లో  ప్రచురితమైంది. ఇంతవరకు 60 కథలు రాసారు. చాలా అనువాదాలు చేసారు. వివిధ పోటీల్లో ఈయన కథలకు బహుమతులు లభించాయి. త్వరలో “ఊహాచిత్రం” పేరుతో కథల సంపుటి వెలువరించనున్నారు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్నారు.–వేంపల్లె షరీఫ్

నేను ఇలా చూస్తుండాగానే చారి మిగిలిన డైరీలను చూశాడు.

“నాన్న ఇలా రాసి పెట్టుకున్నాడని మాక్కూడా తెలియదురా..” అంటూ ఆ అక్షరాలను అపురూపంగా తడిమాడు. “అమ్మకి చూపిస్తా”నని లోపలికి పరిగెత్తాడు.

కాస్సేపటికి లోపలినుంచి మళ్ళీ గట్టిగా ఏడుపు వినపడింది. ఆ తరువాత మరికొంత సేపటికి వాడు తిరిగి వచ్చాడు. ఈ సారి వాడు కూడా ఏడ్చినట్లు వాడు కళ్ళు చెబుతున్నాయి.

“చాలా విలువైన సమాచారం వుందిరా ఈ పుస్తకాలలో.. నీకేమీ అభ్యంతరం లేకపోతే ఒక్క పదిరోజులు నాకిస్తావా? నేను అవసరమైనవి అన్నీ రాసుకోని మళ్ళీ ఇచ్చేస్తాను?” అడుగాను నేను కాస్త మొహమాటపడుతూనే.

“భలేవాడివే.. దానికింత అడగాలా? నీకు ఉపయోగపడుతాయంటే తప్పకుండా తీసుకెళ్ళు” అన్నాడు వాడు.

“పదిరోజుల్లో ఖచ్చితంగా తెచ్చిస్తా” అంటూ భరోసా ఇచ్చాను వచ్చేముందు.

“సర్లేరా” అన్నాడు వాడు.

అంతవరకు అంతా బాగానే వుంది. ఆ తరువాతే అసలు సమస్య వచ్చిపడింది. పదిరోజులు కాదు కదా నెల రోజులైనా ఆ పుస్తకాలను తెరిచే అవకాశమే రాలేదు నాకు. ఆ తరువాత ఇల్లు మారాము. మారిన కొత్తింట్లో సామాన్లు సర్దుకోవటం వగైరా పనులతో అదో హడావిడి. ఈ హడావిడిలో పడి ఆ పుస్తకాల సంగతే మర్చిపోయాను. నా పుస్తకాలు సర్దుకునేటప్పుడు కూడా ఆ పుస్తకాలు లేవన్న సంగతి గమనించలేదు.

ఇక ఆ తరువాత ఇంకేముంది.. కంగారు మొదలైంది. మొత్తం వెతికాను. ఇంట్లో ప్రతిమూలా చూశాను. ఎక్కడా కనపడలేదు.

పుస్తకాలు కనపడటం లేదని నిర్థారణకి వచ్చాక కంగారు స్థానే భయం మొదలైంది. చారి ఏమంటాడో అన్న భయం. చనిపోయిన తండ్రి తాలూకు జ్ఞాపకాలు కనపడకుండా పోయాయంటే చారి వూరుకుంటాడా? అన్న భయం. దాంతో భయం కాస్తా పశ్చాత్తాపంగా మారింది.

వాడు నా అజాగ్రత్తని తిట్టచ్చు, కోప్పడచ్చు, గొడవ పడచ్చు. మాధ్య ఇప్పటిదాకా వున్న స్నేహమే లేకుండా పోవచ్చు. ఈ ఆలోచనలతో సతమతమైపోయాను. రెండ్రోజులు తిండి సయించలేదు. వాడిని కలిసేందుకు ధైర్యం కలగలేదు. ఇక అప్పటి నుంచి వాడుంటే బ్రాడీపేట వైపు వెళ్ళడం మేనేశాను. వాడి ఫోన్ ఎత్తడం మానేశాను. ఎలాగైనా సరే వాడికి కనపడకూడదన్న ప్రయత్నం మొదలుపెట్టాను. తప్పించుకు తిరుగుతున్నాను.

***

“ఇదీ జరిగింది” చెప్పాను రాధికతో.

“బాగానే వుంది.. పుస్తకాలు పోయాయి నిజమే.. అలాగని ఎంతకాలం ఇలా తప్పించుకు తిరుగుతారు?” అంది.

“ఏం చెయ్యమంటావు చెప్పు… గిల్టీ ఫీలింగ్.. అసలు నేను వాడింటికి ఎందు వెళ్ళాల్సిరావాలి? పెద్ద చదివేవాడిలాగా ఆ పుస్తకాలు ఎందుకు తీసుకోవాలి? సరిగ్గా అవే కనపడకుండా ఎందుకు పోవాలి?” తల పట్టుకోని అన్నాను.

“మీరు అనవసరంగా ఫీల్ అవుతున్నట్టున్నారు..” అని ఊరుకుంది రాధిక.

ఆమెకి ఏం అర్థం అవుతుంది నా బాధ? పుస్తకాలంటే నాకు ప్రాణం. ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే నా ప్రాణం గిలగిల లాడుతుంది. అలాంటిది చారిగాడు అడాగ్గానే “దానికేం తీసుకోరా” అన్నాడు. ఎంత నమ్మకంగా ఇచ్చాడు? వాడు అంత నమ్మకంతో ఇచ్చినప్పుడు వాటి జాగ్రత్తగా చూసుకోని, భద్రంగా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత నాపైన లేదూ? అలాంటిది ఇప్పుడు ఆ పుస్తకాలు పోయాయంటే అది తప్పే కదా!

సరే నా సంగతి పక్కన పెట్టండి. వాళ్ళ నాన్నగారు ఎంతో కష్టపడి సేకరించి రాసుకున్న విషయాలు. చారిగాడికి అపురూపంగా మిగిలిన జ్ఞాపకాలు. అవి నేను వాడికి కాకుండా చేశానంటే వాడెంత బాధపడతాడు? నాతో వున్న స్నేహం కారణంగా ఏమో అనకపోవచ్చుగాక. కానీ నన్ను పురుగును చూసినట్టు చూస్తే భరించగలనా? చారిగాడి అమ్మ.. ఆమె ఏమంటుందో? “జాగ్రత్తగా వుండాల్సింది బాబూ..” అని ఒక్క మాట అంటే చాలదూ. తప్పు చేసిన ముద్దాయిలాగా ఆమె ముందు నిలబడగలనా?

పోనీ అవన్నీ పక్కనపెట్టండి. నాకు నేను సర్ది చెప్పుకుంటాను. మా స్నేహాన్ని అడ్డంపెట్టుకుంటే ఆ చారిగాడు నన్ను క్షమిస్తాడనే అనుకుందాం. కానీ ఆ సమాచారం. ఏళ్ళ తరబడి ఎన్నో పుస్తకాలు మధించి ఆయన తయారు చేసుకున్న నోట్సు. బహుశా ఒక పుస్తకంగా వేయాలని ఆయన ఆలోచన అయ్యింటుంది. అలాంటి విలువైన సమాచారం పోగొట్టానే..! దానికైనా బాధ్యత వహించద్దూ..! ఇవన్నీ రాధికకి చెప్పినా అర్థం కావు.

ఏదో పాపం చేసినవాడిలా బాధపడ్డాను. ఏదో శాపం తగిలినవాడిలా నిరాశపడ్డాను. చారిని తల్చుకుంటేనే ఖంగారు, భయం, బాధ… ముఖ్యంగా పశ్చాత్తాపం. అది అనుభవించాలే కానీ మాటల్లో చెప్పలేని భావన. ఎవరో చొక్కాపట్టుకోని నా చెంపలు రెండూ ఎడాపెడా వాయించేస్తున్నట్టు, నన్ను అతలాకుతలం చేసేసిన బాధ. అలాగే కొంతకాలం గడిచింది.

అన్ని రోజులు మనం అనుకున్నట్టు వుండవుగా! వారం పది రోజుల తరువాత ఓ రోజు ఉదయం పూట అనుకోని పరిస్థితిలో వాడికి దొరికిపోయాను. కూరగాయల మార్కెట్ లో కావాల్సినవి కొనుక్కోని బయటికి వచ్చి రోడ్డు పక్కనే వున్న షాపులో అల్లం టీ చెప్పాను. ఇంతలో నా భుజం మీద చెయ్యి వేసి బలంగా వెనక్కి తిప్పాడు వాడు.

“మొత్తానికి దొరికావురా..” అన్నాడు.

హతోస్మి. వాడే.. చారిగాడు. ఎవరికైతే నా ముఖం కనిపించకూడదని తప్పించుకోని తిరుగుతున్నానో వాడి దగ్గర తప్పించుకోలేని విధంగా దొరికిపోయాను. వాడి వైపు చూశాను. వాడి ముఖం స్థానంలో పుస్తకాలు కనిపిస్తున్నాయి. ఎర్ర అట్ట డైరీలు.. గిర గిరా తిరుగుతూ కనిపిస్తున్నాయి.

ఉన్నట్టుండి అక్కడి నుంచి పరుగెత్తి పారిపోతే? అనిపించింది. మళ్ళీ బాగుండదని వూరుకున్నాను. అసలా అవకాశం లేకుండా అడ్డంగా నిలబడ్డాడు వాడు.

“ఏమైపోయావురా ఇంత కాలం? ఒక ఫోన్ లేదు, మాటలేదు? నేను చేస్తే పలకవు, వస్తే ఇంట్లో వుండవు..” వాడిపాటికి వాడు ఏదో అడుగుతున్నాడు. నా దగ్గర సమాధానం లేదు. వాడు అడగబొయే ప్రశ్న నా దగ్గర సమాధానం లేదు. నా మనసు చుట్టూ కందిరీగల్లా ఎర్ర అట్ట డైరీలే ముసురుకున్నాయి.

“ఏంట్రా ఏమడిగినా మాట్లాడవు?” అన్నాడు వాడు.

ఏం మాట్లాడగలను? కులాసాలు అయిపోయాక వాడు ఎలాగూ అడగక మానడు. నాకు చెప్పకా తప్పదు. తప్పు చేసిన తరువాత చెప్పుకోడనికి భయమెందుకు అనుకున్నాను. గట్టిగా ఊపిరినీ, ధైర్యాన్ని పీల్చుకోని నోరు విప్పాను.

“అరేయ్ చారి.. నన్ను నువ్వు క్షమించాలిరా..” అన్నాను.

“అదేంట్రా? అలాగంటావు?” ఆశ్చర్యపోయాడు వాడు.

“నేను ఒక తప్పు చేశానురా… మీ నాన్నగారి పుస్తకాలు ఎక్కడో పోగొట్టాను… పూర్తిగా నా అజాగ్రత్తే కారణం… దీనికి నువ్వు ఏ శిక్ష వేసినా సరే… నాకు తెలుసు అవి నీకు ఎంత ముఖ్యమైనవో..” ఏదేదో సంబంధం లేకుండా మాట్లాడేస్తున్నాను.

“రేయ్.. ఏంట్రా.. ఏ పుస్తకాల సంగతి నువు చెప్పేది?” అన్నాడు వాడు. నేను తలెత్తి ఆశ్చర్యంగా చూశాను.

“అదేంట్రా.. మీ నాన్నగారు రాసి పెట్టుకున్నవి.. ఎర్ర అట్ట డైరీలు.. నాకు ఇచ్చావు కదా?”

“ఓహ్.. అవా… నాకసలు గుర్తే లేదు… సరే పోతే పొయ్యాయిలే…” అని వాడంటుంటే నాకు ఆశ్చర్యంతో పాటు కోపం కూడా వచ్చింది.

“అదేంటి చారీ అలాగంటావు… ఎంత విలువైన సమాచారం వుందో తెలుసా అందులో..”

“ఏమోరా.. నాకు ఆ జాతకాలు అవీ అర్థం కావు.. ఇంక ఆయన రాసుకున్నవి నాకేం వుపయోగపడతాయి..”

“చాలా దారుణంగా మాట్లాడుతున్నావు… కనీసం మీ నాన్న చేతి రాత కోసమైనా అవి విలువైనవి అనిపించలేదా..”

“చేతిరాత… ఎందుకూ.. వున్నాయిగా ఆయనగారు స్వయంగా రాసుకున్న దస్తావేజులు, వీలునామా… ఛస్తున్నాం వాటి సంగతులు తేలక… అన్నట్టు వీలునామా అంటే జ్ఞాపకం వచ్చింది… నీకు తెలిసిన మంచి లాయర్ వుంటే చెప్పరా.. అసలు అందుకే నేను నీ కోసం వెతుకుతున్నాను…” వాడేదో చెప్తూనే వున్నాడు, నేను మాత్రం వినడం మానేశాను.

అలాగే నిలబడిపోయాను. అన్ని రోజులు పడ్డ ఆదుర్దా మొత్తాన్ని ఆవేదన లాంటిదేదో కమ్మేసినట్లైంది.

వాడు నా కోసం ఫోన్లు చేసింది, ఇంటికి వచ్చింది వాళ్ళ నాన్న సమపార్జించిన జ్ఞానమనే ఆస్థి కోసం కాదా….?? అంతేలే చలం ఇల్లు పాడుబడితే ఎవరికి పట్టింది? గాంధీ వస్తువులు వేలంపాటలు వేస్తే ఏ వారసుడికి నొప్పి పుట్టింది? ఆస్థికి వారసులు వేరే, అత్మకి వారసులు వేరే..!!

“ఏరా ఏమంటావ్?” కదిలించాడు వాడు.

“మళ్ళీ కలుస్తారా” అని ఆటో ఎక్కేశాను.

ఆ తరువాత మరో మూడు రోజులకి అనుకోకుండా బంటిగాడి బొమ్మల బాక్స్ లో ఎర్ర అట్ట డైరీలు కనపడ్డా, ఆ విషయం చారికి చెప్పలేదు. వాడు అడగనూ లేదు. అయితే ఇప్పటి కూడా వాణ్ణి కలవకుండా వుండటానికే ప్రయత్నిస్తున్నాను.

మీ మాటలు

 1. buchireddy gangula says:

  కథ బాగుంధీ సర్
  నేటి కుళ్ళు — దోపిడీ వ్యవస్థ లో మనిషి కి కావలిసింధీ– డబ్బు ?? మరియు హోధా
  అంతేగా—-
  ——————
  బుచ్చి రెడ్డి గంగుల

 2. చక చకా కథ సాగి పోయింది.. నిజమే… మనం ఒకటి అనుకోని మధన పడిపోతే..
  అది అవతలి వారికి తృణప్రాయమ్ గా అనిపించడమ్, వాళ్లు వేరే విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వడం
  అది తెలుసుకుని నివ్వెర పోవడం మన వంతవ్వడం.. నిజ జీవితం లో జరిగే విషయాలే

  మీ మార్కు తో కథ బాగుంది ప్రసాద్ గారు

 3. సత్యప్రసాద్ గారూ

  కథ బాగుంది. నాకు ఈ మధ్య ఇలాగే జరిగింది. అయితే నేను పోగొట్టుకున్న పుస్తకం దొరకలేదు అనుకోండి.
  మనకి విలువైనవి అందరికీ ఎందుకు కావోనని ఆశ్చర్యంగా ఉంటుంది నిజమే. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు జరిగితే. చాలా బాగా రాశారు. నేను కూడా పుస్తకం పోగొట్టినపుడు ఎలా ఫీల్ అయ్యానో చెప్పినట్లుంది.

 4. మణి వడ్లమాని says:

  బావుంది కధ@ prasad గారు. పుస్తకాలు పొతే, లేక పోయాయి అనుకోవడం భాదకరమే .
  మనం ఎంతో అనుకొన్న విషయం అవతలి వాళ్ళు అతి మాములుగా తీసుకొంటే,. దాన్నిని మనం డైజెస్ట్ చేసుకోలేక పోవడం చాల బాగా రాసారు.

  మణి వడ్లమాని

 5. G.S.Lakshmi says:

  నేను ఈ కథ ఇప్పుడే చదవడం తటస్థించిందండీ. కథా విషయం, శైలీ, నడకా వీటి గూర్చి ప్రత్యేకంగా చెప్పక్కర్లేనంత బాగున్నాయి.
  ఈ కథ చదివాక నాకు మా తాతగారు గుర్తొచ్చారు. పిడపర్తి వెంకట సోమయాజులుగారని 60 సంవత్సరాల క్రితమే ఆకాశవాణిలో ఖగోళశాస్త్రంలో నక్షత్రాల మీద ప్రసంగాలు చెసేవారు. ఆయన అయనాంశాల మీద చాలా డేటా ప్రోదుపరచి, వాటిమీద జాతీయస్థాయిలో వ్యాసాలు వ్రాసి, ప్రచురించేవారు. అటువంటిది మా ఇంట్లో అద్దె కుంటున్న వాళ్ళబ్బాయి పకోడీలు కొనుక్కుందుకు ఆ కాగితాలని చిత్తుకాగితాలక్రింద తూకానికి అమ్మేసాడు. ఇది తెలిసి మాకెంత బాధేసిందో. అంతటి అమూల్యమైన ఙ్ఞానసంపదని పోగొట్టుకున్నాం.
  అందుకే నాకు ముఖ్యంగా మీ కథలో ముగింపు నచ్చింది. అంతటి అమూల్యసంపద అపాత్రుల చేతిలో పడకుండా విలువ తెలిసినవారి చేతిలో పడినట్లు వ్రాయడం వలన మనసు స్థిమితపడినట్టనిపించింది.
  ఈ కథ ఉత్తమపురుషలో చెప్పడం వల్ల కథ మరింత బాగుంది.

 6. ఏది విలువైన సంపదో చాలామంది తెలుసుకోలేరు. బావుంది.కథలో చక్కని విషయం ఉంది!

మీ మాటలు

*