సంజీవదేవ్ జీవితమే ఒక కళ!

san2

అమెరికా సందర్శించే యాత్రికులెవరైనా న్యూయార్క్ నగరంలో అప్ టౌన్ లో 107 వ వీధిలోకి వెడితే నికొలస్ రోరిక్ మ్యూజియం కనిపిస్తుంది. అందులో సంజీవదేవ్ కు రష్యన్ చిత్రకారుడు రోరిక్ కు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు భద్రపరిచారు. లోగడ ఈ మ్యూజియంను సందర్శించినవారిలో మిత్రుడు చలసాని ప్రసాద్ ఉన్నారు. ఆయన ఆసక్తిని వెతుక్కుంటూ వచ్చిన ధోరణిని గమనించిన మ్యూజియం డైరెక్టర్ ఆయనకు ప్రత్యేకంగా ‘ఆర్ట్ పిక్చర్స్’ పుస్తకాన్ని బహూకరించారు. సంజీవదేవ్ చివరి రోజులలో ఈ ఉత్తర ప్రత్యుత్తరాలను మ్యూజియంకు బహూకరించమని నేను కోరాను. ఆయన ఒక పట్టాన ఒప్పుకోలేదు. నేను పట్టు వదలక నేడు ‘మిసిమి’ సంపాదకుడుగా ఉన్న వల్లభనేని అశ్వనీకుమార్ ను తుమ్మపూడి పంపించాను. అమెరికా నుండి సంజీవదేవ్ కు ఫోన్ చేసి ఆ ఉత్తరాలు నికొలస్ రోరిక్ మ్యూజియంలో ఉంటే వాటికి భవిష్యత్తు ఉంటుందని, సరైన చోటికి చేరినట్లుంటుందని నచ్చచెప్పాను. ఆయన ఆ ఉత్తరాలను కుమార్ కు అప్పగించగా అవి భద్రంగా మ్యూజియంకు చేర్చారు. ఎంతో సంతోషించాను.

జీవిత చివరి దశలో కులు వాలీలో స్థిరపడిన నికొలస్ రోరిక్ ను కలిసి కొన్నాళ్ళు ఆయనతో గడిపిన సంజీవదేవ్ ప్రకృతిని ఆయనతో కలిసి ఆస్వాదించి, కబుర్లు చెప్పుకుని పరస్పరం చిత్రాలు వేసుకున్నారు. కళాకారుడుగా సంజీవదేవ్ కు అది గొప్ప అనుభూతి.

గుంటూరు జిల్లా తెనాలి తాలూకా తుమ్మపూడి గ్రామంలో పుట్టి, చిన్నతనంలో కొన్నాళ్ళు కృష్ణాజిల్లాలో బంధువుల దగ్గర పెరిగిన సంజీవదేవ్ చదువులో స్కూలు దాటి పోలేదు. పిన్న వయసులోనే ఉత్తరాది సాహస పర్యటన చేసి అనేక అనుభవాలతో తిరిగి వచ్చారు. ఆయనలోని ప్రతిభను పసిగట్టిన నార్ల వెంకటేశ్వరరావు ఆంధ్ర ప్రభ సంపాదకుడుగా సంజీవదేవ్ రచనలను, జీవితాన్ని దినపత్రికలో ప్రచురించి ప్రజలకు అందించారు. అంచెలంచెలుగా జీవిత అనుభవాలను రాసిన సంజీవదేవ్ ‘గతంలోకి’, ‘స్మృతిబింబాలు’, ‘తెగిన జ్ఞాపకాలు’ అంటూ గ్రంథస్తం చేశారు. బెంగాలీ ప్రభావం మరికొంత హిందీ ప్రభావం ఆయనపై ఉన్నా, రచనలలో కొత్తరకమైన తెలుగుదనాన్ని చూపారు. వాక్య నిర్మాణం, పదప్రయోగాలలో వినూత్నత కనిపిస్తుంది.

సంజీవదేవ్ కు విస్తృత పరిచయాలున్నాయి. రాహుల్ సాంకృత్యాయన్, అసిత్ కుమార్ హల్దార్, భగవాన్ దాస్ (లెన్స్ లైన్ పత్రిక సంపాదకుడు), దేవులపల్లి కృష్ణశాస్త్రి, బెజవాడ గోపాలరెడ్డి, ఆచంట జానకిరామ్, గొర్రెపాటి వెంకట సుబ్బయ్య వంటివారి పరిచయాలతో చాంతాడంత జాబితా తయారవుతుంది.  ఆయన లేఖారాక్షసుడు. ఎవరిదగ్గర నుంచైనా ఉత్తరం వచ్చిందే తడవుగా సమాధానాలు రాసి పోస్టు చేసేవారు. కొందరికి తాను గీసిన బొమ్మలు కూడా జతపరిచేవారు. ఆ లేఖలన్నీ చాలావరకూ గ్రంథాలలో తొంగిచూశాయి. సంజీవదేవ్ చేత పీఠికలు రాయించుకున్నవారు చలం దగ్గర నుండి తపస్వి వరకు ఎందరో ఉన్నారు. సంజీవదేవ్ మాత్రం తుమ్మపూడి గ్రామం వదలలేదు. పెద్దా చిన్నా అందరూ ఆయన దగ్గరకే వచ్చేవారు. కొందరు రోజుల తరబడి ఆయన భార్య సులోచన ఆతిథ్యం స్వీకరిస్తూ ఇంట్లోనే ఆయన చెప్పేవి వింటూ ఆనందించేవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ఒక దశలో డాక్టరేట్ డిగ్రీ ఇవ్వబోగా సంజీవదేవ్ నిరాకరించారు. అప్పుడు డిలిట్ డిగ్రీ ఇవ్వగా ఆయన స్వీకరించారు.

san1

సంజీవదేవ్ తో నా సన్నిహిత పరిచయ వయస్సు 35 ఏళ్ళు. కొన్నిసార్లు  ఆయన మా ఇంటికి రావడం మా పిల్లలకు బొమ్మలు గీసి ఇవ్వటం, మరికొన్నిసార్లు నేను కోమలతో సహా తుమ్మపూడి వెళ్ళి ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించి, బోలెడు కబుర్లు చెప్పుకోవడం మంచి మధురానుభూతి. 1970 ప్రాంతాలలో నేను, చీమకుర్తి భాస్కరరావు, వెనిగళ్ళ వెంకటరత్నం, శ్రీరమణగా మారిన రాధాకృష్ణ కలసి సంజీవదేవ్ పుస్తకాలు ప్రచురణకు పూనుకున్నాం. ఇంగ్లీషులో రెండు, తెలుగులో రెండు స్టేట్ బుక్ క్లబ్ పేరిట ప్రచురించాము. అంతటితో ఆ ప్రయత్నం ఆగిపోయింది.

సంజీవదేవ్ తో నేను కొన్ని విశిష్టమైన వ్యాసాలు రాయించాను. తెనాలిలో మిత్రులు సూర్యదేవర హనుమంతరావుతో కలసి తుమ్మపూడి వెళ్ళి, ఆచార్య నరేంద్రదేవ్ రాసిన ‘బౌద్ధధర్మదర్శన్’ గ్రంథాన్ని ఇచ్చి, దాని ఆధారంగా వ్యాసం రాయమన్నాను. ఆయన నిర్దుష్టమైన వ్యాసం రాసి, ‘ప్రసారిత’ సామాజిక త్రైమాస పత్రికకు అందించారు. ఆ పత్రికను నేను, పోలు సత్యనారాయణ సంపాదకులుగా హైదరాబాదు నుండి కొన్నేళ్ళు నడిపాము. సంజీవదేవ్ కు ఎవరైనా కోరితే రాసే అలవాటు ఉంది. చాలా పత్రికల వాళ్ళు అలాగే రాయించుకునేవాళ్ళు. అందులో చిన్నా పెద్దా అనే తారతమ్యం చూసేవారు కాదు. అదీ ఆయన గొప్పతనం.

సంజీవదేవ్ హైదరాబాదు వచ్చినప్పుడల్లా తెలుగు యూనివర్సిటీలో గాని, అకాడమీలో గాని చిన్న సమావేశం ఏర్పాటు చేసేవారు. సంజీవదేవ్ రంజింపజేసే ఉపన్యాసకుడు కాదు. విషయ పరిజ్ఞానం ఉంటుంది కానీ, ఆకర్షణ కనిపించదు.

ఇంగ్లీషులో కొన్ని రచనలు, కవితలు, రాసిన సంజీవదేవ్ ఒక విధంగా పరోక్ష జీవిత చరిత్రను – హర్ లైఫ్ – అనే రచనలో ప్రతిబింబించారు. నేను అది చదివి అందులోని హీరోయిన్ మానస నీ జీవితాన్ని అద్దం పడుతున్నట్లున్నదే అన్నాను. కాదనలేదు గాని సమాధానంగా నవ్వి ఊరుకున్నారు.

san3

సంజీవదేవ్ కు నాకూ కామన్ గా అనేక మంది మిత్రులున్నారు. అందులో కొందరితో కలిసి మేము తుమ్మపూడి వెళ్ళి వస్తుండేవాళ్ళం. ‘రేపు’ పత్రిక సంపాదకుడు సి. నరసింహారావు, తుమ్మల గోపాలరావు, మండవ శ్రీరామమూర్తి ఉన్నారు. నేనూ, కోమల వెళ్ళినప్పుడు  కలసి భోజనం చేస్తుండగా ఆయన ఆవకాయ పచ్చడితో అన్నం కలిపి ఎర్రని రంగును సూర్యోదయం వలె ఉన్నది కదూ అంటూ భుజించేవారు. నాకు మాత్రం చూస్తుంటేనే కళ్లలోకి నీళ్ళొస్తున్నాయి, తింటే ఎలా వుంటుందో అనే వాణ్ణి. జీవితంలో కళాత్మకంగా గడవడం సంజీవదేవ్ ఆర్ట్. హైదరాబాదు వచ్చి, నార్ల వెంకటేశ్వర రావు ఇంట్లో ఉన్నప్పుడు నార్ల ‘గ్రంథాలయంలో ఉంటున్నాడు ఇంట్లో కాదు’ అనేవారు. నార్ల ఇల్లంతా పుస్తకాల మయం కావటమే అందుకు కారణం. జగదీష్ మిట్టల్, పి.వి.రెడ్డి వంటి కళాకారులతో సంప్రదిస్తుండేవారు. తెలుగు అకాడమీ సంజీవదేవ్ ను ఆహ్వానించి, ఆయన చేత రచనలు చేయించుకున్నది. అప్పుడే శ్రీధర్ (ఆర్టిస్ట్)  వంటివారు ఆయనకు తోడ్పడ్డారు. ఒకేఒకసారి అమెరికా వచ్చి తానాలో కూడా పాల్గొన్నారు.

మేమిద్దరం కలిసి కొన్ని సందర్బాలలో ఆలపాటి రవీంద్రనాథ్ (జ్యోతి, మిసిమి పత్రికల సంపాదకులు) ఇంట్లో ఇష్టాగోష్ఠిగా కాలక్షేపం చేసేవాళ్ళం. తనకెలాంటి నియమాలూ పట్టింపులూ లేవని సంజీవదేవ్ అన్నారు. లోగడ ఆయన ఆవుల గోపాలకృష్ణమూర్తిని ఒక విందులో సరదాగా ఏడిపించారు. అది శాకాహార, మాంసాహార విషయాలలోనూ, సిగరెట్టు పీల్చే విషయంలోనూ వచ్చింది. అది గుర్తుంచుకొని ఆయనకు చిన్న పరీక్ష పెట్టాము. భోజనానికి ముందు వేదోక్తంగా కొంచెం ఔపోసన పడదాం అన్నాము. మన రుషుల సంప్రదాయంలో మనం కూడా సోమపానం సేవిద్దాం అన్నాము. మా ముందు విదేశీ విస్కీ ఉన్నది. గ్లాసులలో పోసి ఇవ్వగా, అన్నమాట తిప్పుకోలేక ఆయన కొంచెం చప్పరించక తప్పలేదు. ఈ విషయం తెలిసిన ఆయన శిష్యపరమాణువులు కొందరు గురువుగారి చేత విస్కీ సేవింపచేసిన మీ సాహసం చాలా గొప్పదని అన్నారు. మేము కేవలం చమత్కారంగా చేసిన పని అది.

సంజీవదేవ్ పై అనేక వ్యాసాలు కవికుమార్ సేకరించగా, నేను ఎడిట్ చేసిన ‘సంజీవదేవ్ రచనల సమీక్ష, విశ్లేషణ’గా వెలువరించాము.

సంజీవదేవ్ చనిపోతున్న రోజులలో నేను అమెరికాలో ఉన్నాను. ఆ తరువాత మిత్రులు భాస్కరరావు వెబ్ సైట్ (www.sanjeevadev.tripod.com) ఏర్పరచగా అందుకు నేను పూర్తిగా సహకరించాను.

Photograph (197)

ఒక సభలో ఇన్నయ్య, సినారె, సంజీవ దేవ్

సంజీవదేవ్ తన అవగాహనలోకొచ్చిన ఏ విషయాన్నయినా తెలుగులో గాని, ఇంగ్లీషులో గాని అవలీలగా రాయగలరు. ఆయన రచనలు ఇంచుమించు అన్నీ వెలుగు చూశాయి. వాటిలో కొన్ని పునర్ముద్రణ కావలసి ఉన్నది. చలం ‘గీతాంజలి’కి సజీవదేవ్ రాసిన సుదీర్ఘ పీఠికను ఉత్తరోత్తర వచ్చిన ప్రతులను ఎందుకోగాని తొలగించారు. జెన్ బౌద్ధంపై ఎంతో బాగా రాశారు. వీటన్నింటికి మించి, సుప్రసిద్ధ చిత్రాలెన్నో వేయగా ఎస్వీ రామారావు మొదలైన చిత్రకారులు ఆశ్చర్యపడ్డారు కూడా.

జుట్టుతో ఉన్న సంజీవదేవ్ ను ఎవరైనా చూశారా అని, కనీసం ఫోటోలైనా ఉన్నాయా అని నేను అడుగుతుండేవాడిని. చూశామన్నవారు నాకు కనిపించలేదు. సంజీవదేవ్ పెళ్ళి ఫోటోను సి. భాస్కరరావు సేకరించి వెబ్ సైట్లో పెట్టినట్లు గుర్తు. ఏమైనా ఒక అరుదైన విశిష్ఠ మానవుడు సంజీవదేవ్. తన తత్వాన్ని లోతుపాతులతో కూడిన ఆలోచనలను Bio symphony  అనే ఇంగ్లీషు రచనలో ఆయన స్పష్టీకరించారు.

బాలబంధు బి.వి.నరసింహారావు అత్యద్భుతంగా రాసిన పాలపిట్టలు గేయాలను సంజీవదేవ్ ఇంగ్లీషులోకి అనువదించారు. అది పునర్ముద్రణ కావలసిన అంశం. సంజీవదేవ్ కు మూఢనమ్మకాలు, మతఛాందసాలు, బాబాలకి ప్రదక్షిణలు లేవు. ఆయన స్వేచ్ఛా ప్రియుడైన కళాజీవి.

 

మీ మాటలు

  1. సంజీవదేవ్ గారి విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆయన భాషాశైలి లలితంగా, ప్రత్యేకంగా ఉంటుంది.

    ఇక్కడ ప్రచురించిన చిత్రాలు ఆయన వేసినవేనా?

  2. రమాసుందరి says:

    అరుదైన వ్యక్తుల గురించిన పరిచయాలు రావడం, ఈ నాటి తరం ఇలాంటి వ్యక్తుల గురించి తెలుసుకోవటం చాలా ఉపయోగదాయకం.

  3. సంజీవదేవ్ తో మీ అనుబంధం ఎంతో బావుంది చదువుతుంటే-
    జీవించడమే కళ గా బతికారు కాబట్టే ఎందరో హృదయాలలో ఇప్పటికీ సంజీవదేవ్ సజీవంగా ఉన్నారు.
    మీతో పరిచయం నాకూ ఉండడం నా అదృష్టం ఇన్నయ్య గారూ-

  4. rayana giridhar gowd says:

    వ్యా సామ్- చాల క్లుప్తంగా అన్ని అంశాలను స్పృశిస్తూ పెద్దవారి గొప్పదనాన్ని శ్లాఘిస్తూ మీ రాచనాపటిమను తెలియజేస్తూ నడచింది ;మరొక్కసారి మహనీయులను తలుచుకొనే సందర్భముగా ఇన్నయ్యగారికి అభినందనలు .–రాయన గిరిధర్ గౌడ్,చిత్రకారుడు

  5. @వేణు: ఈ వ్యాసంలో ప్రచురించిన చిత్రాలు సంజీవదేవ్ వేసినవే. మరిన్ని చిత్రాలు, విశేషాలకై http://sanjivadev.tripod.com/ చూడవచ్చును.

Leave a Reply to cbrao Cancel reply

*