ఈ కర్రే తమ్ముడు నా కొద్దు

prabodha

 

ది పల్లె కాదు.  అట్లాగని పట్నమూ కాని ఊరు.  ఓ చిన్నపాటి ఇంగ్లిష్ మీడియం బడి ఆవరణ.  ఆ బడి లాగే ఆ ఆవరణలో  ఎదుగుతున్న చిన్న చిన్న చెట్లూ .. వాటి నీడనో , స్కూల్ బిల్డింగ్ నీడనో వెతుక్కొని   తమతో తెచ్చుకున్న లంచ్ బాక్స్ లతో కుస్తీ పడుతూ గుంపులు గుంపులుగా పిల్లలు.   కొందరు తల్లులు తాము తెచ్చిన బాక్స్ లు విప్పుతూ.  మరి కొందరు పిల్లలకి తినిపిస్తూ.  తిననని మారాం చేసే పిల్లలని బతిమాలుతూ.. కోప్పడుతూ ..భయపెడుతూ.. అంతా కోలాహలంగా ,  సందడిగా ఉంది అక్కడి వాతావరణం.

కొందరు తమ వారి రాక కోసం ఆకలితో బిక్కమొహాలేసుకొని ఎదురుచూస్తూ .. మరి కొందరు హడావిడిగా లోనికి బాస్కెట్తో  వస్తూ …

ఎండావానా పట్టని  కొందరు  పిల్లలు ఎండలోనే కూర్చొని  తింటూ ఉంటే   నీడలో కూర్చోండి అంటూ వాళ్ళని విజిల్ వేసి లేపుతూ పి.ఇ.టి. ప్రభాకర్.

ఇంకా ఫిబ్రవరి నెల కూడా రాలేదు.   ఎండ మండి పోతోంది మనసులో అనుకోని బాదాం చెట్టు నీడన కూతురిని కూర్చో బెట్టి తెచ్చిన లంచ్ బాక్స్ తెరచింది  రేఖ.   “ఛి ..గిదేందే..గీ కూర గిట్ల కర్రెగున్నది ..? ” ముఖం చిట్లించి అసహనంగా ప్రశ్నించింది ఆరేళ్ళ హానీ.  వాళ్ళమ్మ నీ .. అమ్మ తెచ్చిన లంచ్ బాక్స్ లోని కూరనీ  మార్చి మార్చి చూస్తూ..

“ఏమయింది మంచిగనే  ఉన్నది  కద”  అంది రేఖ తను తెచ్చిన అన్నం, పుంటికూర పప్పు ప్లేట్ లో పెట్టి కలుపుతూ

“హూ..కర్రె..గ.. యాక్, నాకొద్దు” అంటూ పెదాలు బిగించి నోరు రెండు చేతులతో గట్టిగ మూసుకుంది హానీ.

“పుంటికూర  పప్పు ఇట్లనే ఉంటది రా . అయిన ఇది కర్రెగ లేదు .  పచ్చగ ఉన్నది. ఆకులు పచ్చగ ఉంటయి నీకు తెలుసు కదా..! పుంటికూర  ఆకులు ఉడికినయి కదా అందుకే ఇట్లా కనిపిస్తాంది .. దా . తిందువు” కలిపిన అన్నం ముద్ద హానీ నోటి దగ్గరకు తెస్తూ..అనునయిస్తూ చెప్పింది రేఖ.

అమ్మ అనునయిస్తూ చెబుతున్న మాటల్ని ఏ మాత్రం చెవి కెక్కించుకోని హానీ తల్లి చేతిని పక్కకు తోసేసింది.  బడి ఆవరణలో ఉన్న అందరి కేసి అటూ ఇటూ చూసింది. తన ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ కుర్చున్నారో కళ్ళతో వెతికింది.  అంతలోనే  దూరంగా కూర్చొన్న మాలతిని కొడతానని చూపుడు వేలితో బెదిరిస్తూ.. చెట్టు మీద ఉన్న కాకిని రా రమ్మని చేతివేళ్ళు ఉపి  ఆహ్వానిస్తూ ..

ఈ పిల్ల ఒక్క క్షణం కుదురుగా ఉండదు మనసులో అనుకున్న రేఖ “మా హానీ గుడ్ గర్ల్ కద! మంచిగ అందరి కంటే ముందు తింటదట ” కూతురిని బుజ్జగిస్తూ .

“ఆ…  నేను తిన.  నీకు తెల్సు గద ..! కర్రెగుంటే నేను తిననని.  ఎర్క లేనట్టు మల్ల  ఈ కూర చేసినవ్?”  తల్లి కేసి కోపంగా చూస్తూ ఆమె చేతిలోని ప్లేట్ ను పక్కకు తోసేసింది హానీ .
“అది కాదురా బేటా, ఈ కూరల మస్తు బలమున్నది.  నువ్వు పెద్దగ ,  అగో ఆ చెట్టు లెక్క పెద్దగ అవుత  అంటవు కద.  అందుకె నువ్వు పెద్దగ కావాల్నని ఈ కూర చేసిన.” వస్తున్న కోపాన్ని తమాయించుకుంటూ రేఖ.

” ఊహు .. కాదు  ..ఈ చెట్టుకంటే చా..న పెద్దగయిత” అని రెండు చేతుల్నీ ఆకాశంకేసి సాగదీసి చూపుతూ చెప్పింది.   ” కానీ గీ కూర ..కర్రే కూర అస్సస్స్ ..లుకే తిన.” ఖచ్చితంగా తల్లి కళ్ళలోకి చూస్తూ అని,   అక్కడి నుండి లేవబోయింది హానీ.

“ఏమయింది రేఖా ,   హానీ తిన్టలే.” కొంచెం ఆవలగా కూర్చున్న స్నేహ వాళ్ళ అమ్మ సరళ.  ఆ దగ్గరలో ఉన్న మిగతా పిల్లలూ, వాళ్ళ వాళ్ళు హానీ కేసి చూస్తూ

“ఈ రోజు పప్పుల కొంచెం ఆకు ఎక్కువ అయింది. కూర నల్లగా ఉందని తినదట.  పేచీ పెట్టింది” చెప్పింది తనేదో తప్పు చేస్తున్నట్లుగా లో గొంతుకతో  రేఖ.

“నల్లగానా..?” ఆశ్చర్యంగా అంది సరళ.

“అవును ..ఈ మధ్య ఇట్లనే  చేస్తాంది. ఏదయినా నల్లగ ఉన్న, ముదురు రంగుల్లో ఉన్న కర్రెగ ఉన్నయ్..  కర్రెగ వున్నయ్.. నా కొద్దు అంటది. ఎట్ల తిన బెట్టల్నో తెలుస్తలేదు ”  బాధగా విషయం చెప్పింది రేఖ.

“అవునా!” మరింత ఆశ్చర్యంగా చూసింది స్నేహ వాళ్ళ అమ్మ సరళ.

లేచి నుంచొని అటు ఇటు చూస్తూ ఉన్న హానీని చేయి పట్టి లాగి కూర్చోపెట్టి ” ఎట్లరా..తినకుంటే .. కొంచెం పెరుగన్నమన్న తిను” కొంచెం కటువుగా  అని పెరుగన్నం తినిపిస్తూ, ” నేరేడు పండు తినది. బీట్రూ ట్ దగ్గరకు రానీయది.  డార్క్ చాక్లెట్ తినది.  వాటి రంగు తనకి అంటుకుంటది అంటది”  కూతురి ప్రవర్తన గురించి బెంగతో చెప్పింది రేఖ.

“అట్లా అనద్దు.  అన్ని తినాలె.  అగొ ఆ నల్ల  కుక్క చూడు నీ కెల్లి చుస్తాంది. నీ అన్నం గుంజుక పోయి  తింటదట .  లేకుంటే అగో అటుజూడు చేట్టుమిది కాకి అన్నం కోసం కావు కావు అనుకుంట దాని దోస్తు లందరినీ పిలుస్తాంది. అవచ్చినయంటే నీ కింత గూడ తిననికి ఉండది ” సరళ

‘ఆ తినని. కర్రెగున్నయ్ తింటే నీ లెక్క, ఆ కాకి లెక్క, కుక్క లెక్క  కర్రేగనే  అయితరు.” సరళకేసి అసహనంగా చూస్తూ అని,

“నువ్వు తినకే.. ఆ .. ”  స్నేహకి  సలహా ఇస్తూ పెరుగన్నం గబగబా మింగేసింది హానీ.

ఆ మాటలకి తలకొట్టేసినట్లయింది రేఖకి.  చిన్నపిల్ల తెలియక అట్లా మాట్లాడింది ఏమనుకోవద్దని సరళకి చెప్పి అక్కడినుండి బయట పడింది రేఖ.  స్నేహితులతో కలసి ఆటల్లో మునిగి పోయింది హానీ

                                                            ***

 పిల్లలకి కాలేజ్ టైం అవుతోంది.  దోశ వేస్తోంది శారద.   ” అన్నయ్యల కంటే నేనే ముందు తయారయిన కదా ఆంటి”  అంటూ వచ్చింది  స్నానం చేసి స్కూల్ కి రెడీ అయిన హానీ.

“ఆ … ఏమి కాదు. మేమే ముందు” అంటూ శారద చిన్న కొడుకు హానీని ఉడికిస్తున్నాడు.

“ఆంటీ నేను ఎట్ల ఉన్న?” శారద చేయి పట్టి లాగుతూ అడిగింది హానీ.

“ఎట్లుంటవ్?  హానీ పాప లెక్క ఉంటవ్ ” తన పనిలో నిమగ్నమైన శారద.

” ఆ.. అట్ల కాదు మంచిగ చెప్పు గద.. ” గోముగా అన్నది హానీ శారద చీర కొంగు పట్టి లాగుతూ .

“ఓ యబ్బో!  చాలా సోగ్గా ఉన్నావ్ ” అన్నది శారద హాని కేసి చూసి నవ్వుతూ

“ఉహూ .. సోగ్గా కాదంటి, చా..నా తెల్ల..గ, అందంగ ఉన్నకద” కిటికీ అద్దంలోంచి తన రూపాన్ని అటు ఇటు తిప్పి చూసుకుంటూ హాని.

” ఆ చాలా అందంగా ఉన్నవ్, తెల్లగా ఉన్నవ్ గనీ దోశ తిన్డువ్ రా “తన పిల్లలకి దోశ పెడుతూ హానీ ముందు కూడా ప్లేట్ పెట్టింది శారద.

“ఛి..చీ గిదేం దోశ?  ఇట్ల.. గింత కర్రెగ.. చీ.. అసలు ఇది దొశనెన ? ఈ కర్రెటిది నాకొద్దు” అంటూ ప్లేట్ ను   తన దగ్గర నుండి అవతలికి తోసేసింది.  అది కాస్తా మంచి నీళ్ళ గ్లాసుకు తగిలి కింద పడింది.

“ఏయ్ దయ్యమా , నీళ్ళు పడేసి మా అమ్మకు డబల్ పని పెడతవ ?” చెయ్యి లేపి కొట్టినట్టు చేశాడు రవీంద్రనాథ్

“ఆ చూడు ఆంటీ, చిన్నన్న ఏమంటున్నడో , నేనేమన్న దెయ్యాన్న, అట్ల కర్రేగున్నన..” కోపంతో మింగేసేలా చూస్తూ

“అరె, ఎందుకుర దాన్ని ఏడిపిస్తరు. చిన్నపిల్ల ” హానికి వత్తాసుగా శారద.

“మా దోశ తెల్ల..గ మాం.. చిగ ఉంటది తెల్సా..”  తినే  వాళ్ళని  కవ్విస్తూ చేతులు ఊపుతూ, కళ్ళు తిప్పుతూ హాని.

“మా దోశ చాల బలం అందుకే నేను ఇంత పెద్దగ అయిన ” అన్నాడు శారద పెద్ద కొడుకు మంజునాథ్ .

“మీ అమ్మకి చెప్తా, మీకు కూడా మా దోశ అసొంటిదే చెయ్యమని” హానీ ని ఉడికిస్తూ చిన్న కొడుకు రవీంద్రనాథ్.

“ఆ.. మాకేమొద్దు.  గా..కర్రే దోశలు నేనసలే ముట్ట. నువ్వే తిను బగ్గ తిను. ఇంకా బగ్గ కర్రెగవ్వు” ఉక్రోషంతో హాని.

మినపపప్పు, రాగులతో చేసే దోశ దానికి కర్రేగా కనిపిస్తోంది. అదే కాదు ఏది నల్లగా ఉండడం ఇష్టపడని హానీ గురించి  స్నేహ వాళ్ళ అమ్మ నిన్న కలిసినప్పుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి శారదకు.  ఆవిడ అన్నట్లు ఇది ఒక డిజార్డరా ..! ఆలోచనలో శారద.

మంజు ఏమన్నాడో గాని..”మీరే బ్లాక్ ..మీ బాయ్స్ అంత బ్లాక్.. చూడు కర్రెగ ఆ గడ్డం”  ఉడికి పోతూన్న హానీ.

నిజానికి మంజునాథ్ తెల్లగా ముట్టుకుంటే మాసిపోయేట్లు ఉంటాడు కాని అది ఒప్పుకోదు ఆలోచన నుంచి బయట పడ్డ శారద.

“గర్ల్స్ వైట్ ..ఇంకా వైట్ కావాల్నని , నేనయితే రోజు పొద్దున్న, సాయంత్రం క్రీం రాసుకుంట తెల్సా..” గొప్పగా టేబుల్ ఎక్కి నుంచుంటూ హానీ .

దాన్ని ఇంకా ఆట పట్టిస్తూ “ఛీ . యాక్ ..పెండ ..  పెండ పుసుకున్నావా ..మేమట్ల పూసుకోం ”  మొహమంతా అసహ్యించుకున్నట్లు పెట్టి రవీంద్రనాథ్

“హూ..నీకేం తెల్వది…టి.వి.ల చూడలేదా? చూడు టి.వి.ల మంచిగ కండ్లు పెట్టి చూడు ఆ క్రీం రాసుకుంటే కర్రేగున్నోల్లు తెల్లగా అయితరని తెలుస్తది నీకు.  ఇంక వైట్ గ కావాల్నని నేను, మా అమ్మ రోజు పూసుకుంటమ్.  కావాల్నంటే చూస్కో..నా కాడ  ఎంత మంచి వాసన అస్తున్నదో ..” గొప్పగా చెప్పి రవీంద్ర దగ్గరికి జరిగింది హాని.

“యాక్.. పెండ కంపు.” ముక్కు మూసుకుని  అన్నాడు మరింత ఏడిపిస్తూ.

“చూడు ఆంటి .. రవి అన్నయ్య ..” కంప్లైంట్ చేస్తుండగా..

“హానీ .. ఎక్కడున్నవ్ .. బడికిపోవ..?  టైం అయితాంది. జల్ది రా ”  తల్లి కేక. బడి నుండి వచ్చాక నీ పని చెప్తానుండు అన్నట్లు మంజునాథ్, రవీంద్రనాథ్ లను చూపుడు వేలుతో బెదిరిస్తూ .. హానీ పరుగెత్తింది .

***

రేఖకి నొప్పులోస్తున్నాయి. హానిని పక్కింటి వాళ్ళ  దగ్గర ఉంచి అంతా హాస్పిటల్ కి బయలు దేరారు.   తనూ వెంట వస్తానని మారం చేసింది హాని.  పుట్టగానే తమ్ముడినో చెల్లినో  ఎత్తుకోవాలని అనుకుంది .   ఇప్పుడు కాదు బుజ్జి తమ్ముడో , చెల్లొ  పుట్టగానే తీసుకు వెళతానని తండ్రి బుజ్జగించడంతో పాటు తల్లి అలా బాధపడటం చూడలేక పోయింది హాని.  అందుకే  సరే నని  ఒప్పుకుంది.   తమ్ముడు పుట్టాడని తెలియగానే హాస్పిటల్ కి వెళ్తానని చాలా గొడవ గొడవ చేసింది.  తెల్లవారే వరకూ చూడకుండా ఉండాలా అని వాపోయింది.  ఆ రాత్రంతా తమ్ముడితో మాట్లాడుతున్నట్లు , ఆడుకుంటున్నట్లు, వాడు తనని అక్కా అని పిలిస్తున్నట్లు, తమ్ముడిని ఎత్తుకున్నట్లు కలలు కంటూ కలత నిద్ర పోయింది.  లేవడంతోనే తమ్ముడి దగ్గరకి బయలుదేరింది.  వాడిని ఎప్పుడెప్పుడు చూడాలా అని తహ తహ లాడింది.  ప్రెండ్ నీలిమతో నీకే కాదు నాకూ తమ్ముడున్నాడని గర్వంగా చెప్పాలనుకుంది.  లేక పోతే తన తమ్ముడిని ఎత్తుకుంట అంటే పడేస్తవ్ వద్దంటదా అనుకుంది.

రేఖ ఉన్న రూం ముందు హాని ని దింపి లోపలి వెళ్ళమని చెప్పి నర్సు చెప్పిన మందులు తేవడం కోసం ఫార్మసీ కి వెళ్ళాడు హాని తండ్రి.   ఎన్నో ఉహలతో, ఆలోచనలతో పరుగు పరుగున తల్లి ఉన్న రూం లోకి వెళ్ళిన హాని అట్లానే స్థాణువై నిలబడిపోయింది.  తల్లి ఒడిలో ఉన్నది తన  తమ్ముడా ..  ఉహు ..కాదు . తన తమ్ముడు టి. వి .  లో హగ్గీస్ యాడ్ లో ఉన్నట్లు లేడు. చ్చీ .. కర్రెగా  .. ఆ మొహం మీద ఇంకా కర్రె మచ్చలు .. ఉహూ వీడు నా తమ్ముడు కానే కాదు అనుకొంది. మరి ఎవరు మదిలో ప్రశ్నలు రేగుతుండగా

‘ వీడు  నాకద్దు..  వీడు నా తమ్ముడా ..  కాదు’  అరుస్తూ  తల్లి ఒడిలోంచి పసివాడిని తోసేసింది. తల్లి వొడిలో హాయిగా, వెచ్చగా నిద్రపోతున్న ఆ పసికందు  క్యార్.. క్యార్ అంటూ  ఏడుపు.    హాని ప్రవర్తనకు షాక్ అయింది రేఖ.  తమ్ముడిని తన వొడిలో చూసి అసూయ పడుతోందేమో అనుకుంది రేఖ .

” ఒరే బేటా !  అట్ల జేస్తవెందిరా ..వీడు నీ తమ్ముడురా.. ద..  దగ్గరకు వచ్చ్చి చూద్దువు’ అంటూ దగ్గరకు తీసుకోబోయింది.  ఆమె చెయ్యి విసురుగా లాగి ‘ ఈ కర్రోడు నాకొద్దు ‘ విసురుగా అంటూ మళ్లీ తల్లి దగ్గర నుండి తోయబోయింది హాని.  కోప్పడింది రేఖ .   వీడు నా తమ్ముడు కాదు.  నా కొద్దు అంటూ  ఏడుస్తూ ఒక్క ఉదుటున బయటకు పరుగెత్తింది.  మందులతో లోపలికి రాబోతున్న ఆమె తండ్రి ఏమైందిర హాని అని పిలుస్తున్నా పలకకుండా పరుగెత్తింది.  మందులు అక్కడ పెట్టి గబగబా బయటికి వెళ్ళాడు కూతురి కోసం.   అప్పుడే టాయిలెట్ నుండి బయటికొచ్చిన హాని అమ్మమ్మకి ఏమి అర్ధం కాలేదు.  మనుమరాలి కోసం కళ్ళతో వెతికింది.  దూరంగా ఏడుస్తూ కనిపిస్తూన్న మనుమరాలికేసి తనూ కదిలింది.

హానికి  ఆశనిపాతంలా తమ్ముని రూపం మెదులుతోంది కళ్ళలో.  అది జీర్ణించుకోలేక పోతోంది. నాకీ కర్రె తమ్ముడు వద్దు.  మచ్చల కుక్కలాగా ఉన్నడు. చ్చీ…  నాకొద్దు .  ఇంటికి తేవద్దు అని గోల గోల చేస్తోంది. ఏడుస్తోంది.   తండ్రి బతిమాలుతున్నా వినడం లేదు.  ఏడుపు ఆపమని  చెప్పి చెప్పి విసిగి ఒక్కటిచ్చాడు.  రెక్కబట్టి లోనికి లాక్కెళ్ళాడు. ఎవరు  ఏమి చెప్పినా  తమ్ముడిని అంగీకరించలేకపోతోంది.   పుట్టిన పిల్లాడినిచూసిన దాని కంటే కర్రే తమ్ముడు వద్దని హానీ చేస్తోన్న  గొడవ అందరినీ ఆందోళన పరుస్తోంది.  అప్పటి వరకు, ఏదయినా సరే బ్లాక్ వద్దు. వైట్ ముద్దు అనే హానీ,  బ్లాక్ వద్దు అంటుంటే సరదాగా తీసుకున్నారు.  దాని మాటలకు నవ్వుకున్నారు. కానీ, ఇప్పుడామె ప్రవర్తన చాలా  బాధ, ఆందోళన కలిగిస్తోంది ఆ తల్లిదండ్రుల్ని.

హానీ, వాళ్ళ అమ్మ, నాన్నఅంతా  చామన ఛాయలో ఉంటారు. కానీ, పుట్టిన తమ్ముడు మాత్రం మంచి నలుపు.  శరీరం పై చాల చోట్ల నల్లటి  చిన్న బిస్కెట్ అంతవి, శనగ బద్ద అంతవి మచ్చలతో చూడడానికి ఇబ్బంది కలిగిస్తూ వికారంగా.   నుదుటి పైన కుడి వైపు, ఎడమ వైపు దవడకు  పావలా బిళ్ళ అంత నల్లటి మచ్చలు  దట్టంగా ఉన్న వెంట్రుకలతో.  మంచి రాక పోయినా ఇవి వచ్చేస్తాయి ఎవరో పిలిచినట్లు అని గొణిగింది హానిని ఎత్తుకుంటూ  అమ్మమ్మ.    మా ముత్తాత లాగ  నలుపు, మచ్చలూ వచ్చాయన్నాడు హాని తండ్రి.  పిల్లాడిని చుసిన క్షణం రేఖ కూడా నివ్వెర పోయింది .  పుట్టిన పిల్లాడి రూపం  చూసి అందరికీ బాధగానే ఉన్నా, మగపిల్లాడు ఫరవాలేదులే అని సరి పెట్టుకున్నారు.  కానీ, హానీ మాత్రం సమాధాన పడలేక పోతోంది.  ఏడుస్తోన్న హానిని తీసుకుని అమ్మమ్మ వంట చేసి తెద్దామని ఇంటికి వెళ్ళింది.

“కర్రెగుంటే ఏమయితది?  నీ తమ్ముడు కాదా ,  నిన్ను అక్కా అంటడు .. నీ ఎనక ఎన్క  తిరుగుతడు. ముచ్చట్లు చెప్తడు.  మంచిగ ఇద్దరు ఆడుకోవచ్చు”  అంటూ నచ్చ జెప్పజుశారు అంతా.

“ఆ..నాకేమొద్దు  ఆ.. కర్రె తమ్ముడు” కోపంగా హానీ

“అట్ల అనోద్దురా..బేటా ..నీ తమ్ముడు నీ దగ్గరకు రాక ఎటువోతడు.    అక్క, అమ్మ, నాన్న అనుకుంట మనతోనే ఉంటడు.  మన ఇంట్లనే ఉంటడు.” అని నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తోంది అమ్మమ్మ.

“ఆ..మరి గప్పుడు మీరే అన్నరు కద… ఆ పిల్ల కర్రెగ కాకి లెక్క ఉన్నది.  వద్దని అన్నారు కద.” అమ్మమ్మని ఎదురు ప్రశ్నించింది హానీ.

“ఎన్నడన్ననే ..నాకేం సమజ్ గాలే.” తల గోక్కుంటూ , గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ అమ్మమ్మ.

“అవునే ..గా పొద్దు మనం మామ కోసం పిల్లను జూడ బోయినం గద.. అప్పుడు ఇంటికొచ్చినంక నువ్వు అన్లే..” అమ్మమ్మ కళ్ళలోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ దొంగను పట్టుకున్న పోలీసులా రెట్టించింది హానీ.

బాల్కనీలొ నిల్చొని తల దువ్వుకుంటున్న శారద చెవిన పడ్డాయి ఆ మాటలు.  హాని మాటలకి కారణం బోధపడినట్లనిపించింది శారదకి.  అయినా !  రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు,  అంతా నలుపే. అంటే  వెనుకటి రోజుల్లో నలుపు రంగుకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది కావచ్చు.  అందుకే దేవుళ్ళు నలుపు రంగులో, దయ్యాలూ -భూతాలూ తెల్లటి రంగులో …  మరి తెలుపుకు ప్రాధాన్యత ఎప్పుడు, ఎలా మొదలయిందో.. శారద ఆలోచనల్ని భంగపరుస్తూ

“ఆ నువ్వయితే నీ ఇంటికి కర్రె కోడల్ని తెచ్చుకోవు గానీ నేను కర్రె తమ్ముడ్ని తేచ్చుకోవాల్నా..” ఏడుస్తూ హానీ అమ్మమ్మ కేసిన సూటి  ప్రశ్న అందర్నీ ఆలోచింపచేస్తూ..

 

వి. శాంతి ప్రబోధ 

మీ మాటలు

  1. మంచి కథ. రాజకీయ కథ. విప్లవ కథ. కథనం, ఎడిటింగ్‌ వగైరాల్లో పరిమితులు కనిపిస్తున్నప్పటికీ, ముగింపులో వాస్తవికత పరిధిని దాటినట్టు అనిపించినప్పటికీ ఇది అవసరమైనది. ఇది కొత్త కథ. చాలా మందికి అందని కథ. కొంతమంది చెప్పకుండా వదిలేసే కథ. తెలుగు సాహిత్యంలో ఈ కోణాన్ని సృజించిన వారు అరుదు. గుడ్‌ వర్క్‌ ప్రబోధ గారూ!

  2. చాలా బాగుంది.
    అయితే, మీరు ఎంతో లోతైన సమస్యని పై పైన మాత్రమే స్పృశించినట్టనిపించింది.
    ఇంకా లోతుగా విశ్లేషిస్తే చాలా విలువైన కథ అయుండేది.

    ఏ మాత్రమూ ప్రీచింగ్ టోన్ లేని కథనానికి అభినందనలు.
    శారద

మీ మాటలు

*