ఆగ్రహం, ఉద్వేగం…సమంగా కలిస్తే ఈ కవిత!

saikiran

సామాజిక పరిణామ దశల్లోని మార్పులకనుగుణంగా కవిత్వంలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. ఈ పరిణామాలు కవితా వస్తువులో మార్పులకు కూడా దోహదపడ్డాయి. ఆయా పరిణామదశల్లో దిశలు మార్చుకుంటూ కవిత్వం ప్రవహిస్తూనే ఉంది. స్వరం మార్చుకుంటూ కవులు పయనిస్తూనే ఉన్నారు.

రాజకీయ, సామాజిక అవసరాల దృష్ట్యానైతే నేమి, మారుతున్న పరిస్థితులమీద ఆవేదనతో నేమి, చైతన్యాన్ని కలిగించే మిషతో కవితా వస్తువు మారటమే కాదు, భాష కూడా మారిపోతున్నది. కుహూ కుహూల కలస్వనాల నుండి, నినాద నాద ఘోషణలు, ప్రళయరావ గర్జనలు దాటుకొని తిట్లు, శాపనార్ధాలుగా అక్షరాలు రూపుదిద్దుకుంటున్నాయి, ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నాయి. సమాజాన్నో, సామాజిక వాస్తవాలనో ధిక్కరిస్తూ “మనువు నోట్లో xxxx xxx”, ”పైట తగలెయ్యాలనో” కవిత్వం వ్రాసిపడేయొచ్చు!  ఇది సహజమో అసహజమో తెలీదు. సరే ఇదంతా సామాజిక కవిత్వం మారుతున్న తీరుతెన్నులు.

అదే మరి జీవితాన్ని ధిక్కరించాలంటే? అలా కవిత్వం వ్రాయాలంటే! ఇటువంటి ప్రశ్నలు అప్పుడప్పుడు కుతూహలాన్ని రేకెత్తించేవి. అలానే, అజంతా, శ్రీశ్రీ, దిగంబర కవులు తదితరుల కవిత్వం చదివేప్పుడు వాటిలోని ఇంటెన్సిటీ  అనుభవిస్తున్నప్పుడు కూడా అలాంటి కుతూహలమే కలిగేది. దాదాపు 2004-2005 ప్రాంతాల్లో ఈక్రింది కవిత్వం కంటబడేంతవరకూ ఆ కుతూహలం కొనసాగింది. కవి కె.విశ్వ. ఇతర వివరాలు తెలియవు.

జీవితమంటే కోపం, ఆ కోపాన్ని ప్రదర్శిస్తూ ఓ నిర్లక్ష్యం, నిర్లక్ష్యానికి తగినంత రాజసం, రాజసంతోనే అక్షరాల్లో కొంత అరాచకత్వం, దానికి తోడు మరికాస్త ఉన్మాదం! వెరసి విశ్వ కవిత్వం. ఒళ్ళు గగుర్పొడించి, ఉద్వేగానికి గురిచేసే ఇలాంటి కవిత చదివి చాలా కాలమయ్యింది.

బ్రతికేస్తూ ఉంటాను (విశ్వ)

 

1

బ్రతికేస్తూ ఉంటాను

మహా జాలీగా

ఓల్డ్ మాంక్ సీసాలోనూ

సాని దాని పరుపు మీద మరకల్లోనూ..

ఎప్పటికీ పూర్తికాని కవితల్లోనూ..

 

మత్తులో కారు డ్రైవ్ చేస్తుంటే

నలభై రెండేళ్ళ నెరుస్తున్న జుత్తు

మోహపు గాలిలో క్రూరంగా ఎగురుతుంటుంది.

నా పక్క సీటు ఇప్పటికీ ఖాళీనే

నన్నెవరూ ప్రేమించలేదు

నేనెవరినీ ప్రేమించలేను

 

అసలు ఎవరు ఎవరినైనా ప్రేమించగలరా?

కనీసం ప్రేమంటే ఏమిటో తెలుసుకోగలరా?

రోడ్డు మలుపుల్లో నివురుగప్పిన ఏక్సిడెంట్లు

కుళ్ళిపోయిన కన్నీళ్ళలో తడిసి

మూలుగుతూ కుప్పలుగా పడిఉంటాయి

 

2

రైలు పట్టాలకీ చక్రాలకీ మధ్య

మృత్యువు మీసం మెలేస్తూ ఉంటుంది

మృత్యువు పెద్ద రంకుది

రోజూ లక్షలమందితో రమిస్తుంది

 

రైలులో కూర్చొని

డివైన్ ట్రాజడీలోని

మెటాఫిజికల్ ఎంటీనెస్ ని విశ్లేషించుకుంటున్న

నా పెదవులపైకి ఒకానొక నిర్లక్ష్యపు చిరునవ్వు

నాగరిక ఉన్మాదానికి చిహ్నంగా..

 

రైల్లో అందరికీ నత్తే

అందరూ నకిలీ తొడుగుల బోలు రూపాలే

ఎవడి చావు కబురు ఉత్తరం వాడే

స్టాంపుల్లేకుండా అందుకున్నవాడే

 

బ్రతుకులు ముక్కిపోయిన కంపు కొట్టే చోట

శృంగారం కూడా కాలకృత్యమే

ఇలాంటి కాలంలో

కవిత్వం గురించి మాట్లాడ్డానికి

క్షమించాలి.. నాకు గుండెలు చాలడం లేదు.

అయినా ఎందుకో ఈ పదాలు ఆగడం లేదు

కవిత్వమంటే విష కన్యకతో విశృంఖల రతీ క్రీడ

 

3

సగం చచ్చిన వాన పాముకీ

కుబుసం విడిచిన కాలనాగుకీ

తేడా ఉండొద్దూ?

 

నీకు చెప్పనే లేదు కదూ

నాటకాలన్నీ తెర వెనకే సాగుతాయి

తెరముందు అబద్దాన్ని చప్పరిస్తున్న

గుడ్డి ప్రేక్షకులు

 

నాటకానికి మధ్యలో బ్రేక్

బ్రేక్లో ప్రశ్న

అల్లాటప్పారావు అభినందనలని ఎన్ని సార్లు అన్నాడు?

సమాధానం చెబితే అమలాపురంలో 2 నైట్స్ 3 డేస్

అయ్యో చెప్పలేరా?

పోనీ ఓ క్లూ ఇవ్వనా?

అరవడబ్బింగు సినిమాలో హీరోయిన్ ఎన్ని చీరలు మార్చింది?

ఇదీ తెలీదా? ఐ యాం సారీ!

 

4

ఒకడుంటాడు

తీయని మాటల షుగర్తో బాధపడుతుంటాడు

హిపోక్రసీ గోడల్ని పగలగొట్టలేక

గుండె గదిలో గబ్బిలంలా వేలాడుతూ..

ఎవడి బ్రతుకులోనూ ధాటిగా ఒక నమ్మకాన్ని రాయలేడు

ఆవకాయ బద్దలాంటి అరిగిపోయిన వ్యాఖ్యానాలకి

జనాలు అలవాటు పడిపోయారని మురిసిపోతుంటాడు

 

వాడినని ఏం లాభం లే

ఈ దేశంలో బ్రతుకు చావు ముందు శ్రోత

Uncertainty లోని అందం చూడ్డానికి

బ్యాంకు లాకర్లో మూలుగుతున్న రంగు కాగితాలు తల్చుకుని

మురిసిపోయే వాళ్ళ కళ్ళు చాలవు

 

అందుకే

వాడిన కాగితం పువ్వులను

గాజుకుప్పెల్లో అమర్చుకోవడం వినా

అందం అంటే ఏంటో తెలీని శవాల మధ్య..

నిర్లక్ష్యాన్ని నిర్మోహంతో హెచ్చవేసి

నిషాని కూడి విషాదాన్ని తీసేసి..

మహ దర్జాగా..

ప్రపంచాన్ని దబాయించి మరీ

బ్రతికేస్తూ ఉంటాను.

 

***

 

ఏది ఏమైనా, వైయుక్తికమైన ఆవేదననైనా, సామాజిక సంవేదననైనా కవిత్వీకరించేటప్పుడు – నిరాశా నిస్పృహలతో వెలువడే ధర్మాగ్రహానికి, తిట్లు శాపనార్ధాలతో వెలువడే దురుసుతనానికి తేడా తెలుసుకోగలగాలి. కోపాన్ని వ్యక్తం చేయటానికి, అక్కసు వెళ్ళగక్కటానికి ఉన్న అంతరం అప్పుడే తెలుస్తుంది.

 – కొండముది సాయికిరణ్ కుమార్

మీ మాటలు

 1. mercy margaret says:

  హాట్స్ ఆఫ్ టూ విశ్వ గారు . అద్దంలో నెలవంకలో అర్ధ వంతమైన కవితావిశ్లేషణ .. నిజంగా అధ్బుతమైన కవిత. ప్రతి లైన్ కోట్ చేయాల్సిందే . ఒక మంచి కవితను పరిచయం చేసినందుకు .. ధన్యవాదాలు మరియు అభినందనలు సర్ .

 2. సాయి కిరణ్ గారూ.. ఒక బలమైన కవిత చదివించారు. ధన్యవాదాలు..

 3. కిరణ్ గారు రైటర్ అడ్రస్ సంపాదించండి. అతని కవితలో ఏదో బాధ కనిపిస్తుంది.

 4. “కోపాన్ని వ్యక్తం చేయటానికి, అక్కసు వెళ్ళగక్కటానికి ఉన్న అంతరం అప్పుడే తెలుస్తుంది.”
  అప్పుడే ఉత్తుత్తి అక్షరాల్లోంచి కవిత పుట్టడము తెలుస్తుంది.
  మంచి కవితని పరిచయం చేసినందుకు నెనర్లు.

 5. వావ్.

 6. నిజం, బలే పద్యం. సాయి కిరణ్ గారు! గుర్తించి పంచుకున్నందుకు అబినందనలు.

 7. Naveen kumar. Gadari says:

  రైలు పట్టాలకీ చక్రాలకీ మధ్య
  మృత్యువు మీసం మెలేస్తూ ఉంటుంది
  మృత్యువు పెద్ద రంకుది
  రోజూ లక్షలమందితో రమిస్తుంది

  nice expression..!!

మీ మాటలు

*