ఆమె

bhuvanachandra

భువనచంద్ర

బెజవాడలో సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాను. మద్రాస్‌క్ వెళ్లాలి. రిజర్వేషన్ దొరికింది. ఇది ఇప్పటి మాట కాదు. అప్పుడు సినిమా వాళ్లెవరో పెద్దగా తెలిసేది కాదు. సినిమాలు చూడ్డం తక్కువే. ఓ ముప్పై ఏళ్ల ఆయన వచ్చి, “మీరు ఆ చివర వున్న బెర్త్‌లోకి వెళ్ళండి!” అన్నాడు. “ఎందుకు వెళ్ళాలి? నా బెర్త్ ఇదే!” చికాగ్గా అన్నాను. మర్యాదగా అడిగితే వెళ్లి వుండేవాడ్ని.

“నేను ఎవర్నో తెలుసా? అసిస్టెంట్ డైరెక్టర్‌ని.. ఫలానా సినిమాకి” అన్నాడు పొగరుగా. “నేనెవరో తెలుసా? ఇండియన్ ఏర్‌ఫోర్స్ వాడ్ని.. నువ్వు అసిస్టెంట్ డైరెక్టరువైతే నాకేంటి, హీరోవైతే నాకేం, డోంట్ డిస్టర్బ్ మి!” అని అరిచాను. అది అప్పటి కథ. నా వంక కోపంగా చూస్తూ వెళ్లి ఇద్దరు ముగ్గురు మనుష్యుల్ని పెద్ద రౌడీలా తీసుకొచ్చాడు గానీ. యీలోగా టిటి రావడం, టిటికి నేను విషయం వివరించడం జరిగింది. టిటికి సినిమా వాళ్లంటే మంటేమో,  అతన్ని బాగా తిట్టి, మొత్తం గ్యాంగ్‌నే దింపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఆ గుంపులో ఓ పాతికేళ్ళ స్త్రీ కాస్త సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసింది.

ఎందుకైనా మంచిదని నా జాగ్రత్తలో నేనున్నా. ఆ అసిస్టంట్ డైరెక్టరు లైట్లు తీసేశాక ఆ పాతికేళ్ల స్త్రీని వేధించడం, ఆవిడ మింగాలేక కక్కాలేక చాలా ఇబ్బంది పడుతూ “అందరూ మేలుకునే వున్నారయ్యా. దండం పెడతా వొదిలెయ్” అనడం, వీడు నీళ్ల బాటిల్ (సీసా)లో మందు కలిపి తాగటం చూసి లైట్లు వేశాను. మొత్తానికి ఏ గొడవా జరక్కుండా మద్రాసు చేరాం.
చాలా ఏళ్ల తర్వాత ఆ అ.డైరెక్టర్ నేను పాటలు రాస్తున్న చిత్రానికి కో డైరెక్టరుగా వున్నాడు. చూడగానే నేను గుర్తుపట్టా గాని ఆయన గుర్తుపట్టలేదు. కొన్నాళ్ళకి ‘ఆవిడ్నీ’ చూశా. కనీసం ఎనభై సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసింది.
పాటలు వ్రాయడానికి కొన్నిసార్లు షూటింగ్ స్పాట్స్‌కి వెళ్ళాల్సి వచ్చేది. ఒక్కోసారి ఇతర వూర్లకి కూడా. అలా వెళ్లినప్పుడు  ఓ షూటింగ్‌లో “ఆవిడ్ని” చూడటం తటస్థించింది. ” మీ ముఖం మీద మచ్చ చూస్తే ఎక్కడో చూసినట్టు వుంది” అని అన్నది. ట్రెయిన్ ఇన్సిడెంట్ గుర్తు చెయ్యగానే “చీ.. వాడా.. గుంటకాడి నక్క. అందుకే అట్టా మిగిలాడు.” ముఖం అదోలా పెట్టి అన్నది. ఇప్పుడు చెప్పబోయేది ఆవిడ కథే.
నా పని పూర్తి చేసుకున్నాక మద్రాస్ తిరిగి రావడం కోసం రైల్వే స్టేషన్‌కి వెళ్లా. ప్రొడక్షన్ మేనేజర్ బండిలో నా సూట్‌కేస్ దగ్గర్నుండి ఎక్కించి శెలవు తీసుకున్నాడు.

అది జంక్షన్ కావడం వల్ల ట్రైన్ బయలుదేరడానికి ఇంకో ఇరవై నిముషాలుంది. పుస్తకాల షాప్ (హిగ్గిన్‌బాదమ్స్)కి వెళ్లి కొన్ని పుస్తకాలు కొన్నా.

“ఈ ట్రైనుకే వెళ్తున్నారా?” ఆమె గొంతు. పక్కకి తిరిగి చూస్తే ఆవిడే.

“అవును. మీరూ?” మర్యాద కోసం అడిగా.
“నేనూ మద్రాస్‌కే వస్తున్నాను. వేసింది పేరంటాల వేషమేగా..! ఏదో నాలుగు డైలాగులు దొరికినై..” నవ్వింది.

“మంచిది” అన్నాను.

“మీరు ఎక్కువ మాట్లాడరనుకుంటా?” నవ్వి అడిగింది.

“అదేం లేదు. నేను నిజంగా మాట్లాడ్డం మొదలెడితే, వినడానికి ఎవ్వరూ మిగలరు. అందుకే నోరు కట్టేసుకోవడం !”

నేను మెల్లగా నా కంపార్ట్‌మెంట్ వైపు నడవడం మొదలెట్టాను.

“పదిహేనేళ్ల తరువాత కూడా నన్ను గుర్తుపట్టారంటే నాకు ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ వుంది..!” నా వెనకాలే వస్తూ అన్నది. నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. “మీలో పెద్ద మార్పు లేదు గనక గుర్తుపటాననుకుంటున్నాను.!” ఏదో ఓ జవాబు ఇవ్వాలిగా మరి.

“అందరూ అలాగే అంటుంటారండి.. మీకో విషయం తెలుసా?   నన్ను మొదటిసారి మద్రాసుకి పిలిపించింది ఫలానా స్టార్ ప్రొడ్యూసర్.. రావుగారు.!” ఉత్సాహంగా అన్నది.
“ఊ.!”
“కానీ ఆయన నన్ను ఆఫీసుకి పిలిచాక ఏమన్నారో తెలుసా? సినిమాలో ‘కేరెక్టర్’ కావాలంటే ముందు ‘కేరెక్టర్’  పోగొట్టుకోవాలి. OK అంటే నువ్వే హీరోయిన్ అన్నారు.!”
“ఊ…!”
“అప్పటికప్పుడు లేచి బయటికి వచ్చేశాను.”కొంచెం గర్వం ఆవిడ స్వరంలో నాట్యమాడింది.
“ఊ..!”
“మళ్లీ మా వూరెళ్లి పోయానుకానీ, నా ఫ్రెండ్స్ అందరూ ‘ ఏం నువ్వు సినిమాలకి పనికి రావన్నారా?’ అని ఎగతాళి చేసేసరికి ఇహ అక్కడ ఉండలేక మద్రాసు వొచ్చేశాను. ఏదైతే అదే కానీ అని ఆ ప్రొడ్యూసర్గారి దగ్గరికే వెళ్ళాను గానీ ఆయనెందుకో నన్ను లోపలికి రానీలేదు.”

“అదేం?” అడిగా. కొన్ని నిముషాలు గడిపితే బండి బయల్దేరుతుంది. యీ సొద వినే  బాధ తప్పుతుంది అనుకున్నా.

“అప్పుడే ఆ అసిస్టెంటు డైరెక్టరు నాకు పరిచయమయ్యాడు. ‘మనవాళన్’ స్ట్రీటులో ఓ చిన్న గదిలో నన్ను ఉండమని అడ్వాన్సు ఇచ్చాడు. గుళ్ళో పెళ్ళి అని ఆశ పెట్టాడు. అయితే బైట ఎవరికీ చెప్పొద్దన్నాడు. చిన్న చితకా వేషాలు ఇప్పించేవాడు. దానికితోడు నాకు ఊరగాయలు పెట్టటం బాగా వొచ్చు. దాంతో కాస్త వేన్నీళ్లకి చన్నీళ్లు తోడయ్యాయి..!”
బండికి సిగ్నలిచ్చారు.

“సర్లెండి.. ఇంకోసారి కలిసినప్పుడు మిగతా కథ చెబుతాను..!”
హడావిడిగా ఆవిడ తన కంపార్ట్‌మెంట్ వైపు పరిగెత్తింది. ఇప్పుడామె వయసు నలభై ఉంటుందేమో.

ఈ ‘కథలు’ సినిమావాళ్లకి కొత్తకాదు. పాండీ బజార్లో నిత్యం వినేవే. కొత్తగా మద్రాసు వొచ్చినప్పుడు ఇలాంటి కథలు విని చాలా బాధపడేవాడ్ని. ఏ పేరున్న ప్రొడ్యూసరో, దైరెక్టరో మమ్మల్ని ‘పిలిపించారు’ అని చెప్పుకోవడమే కాక, వాళ్లు మా ఒంటిమీద చెయ్యి వెయ్యబోతే ‘చీ’ కొట్టాం అనో,  ఆ తరవాత తప్పని పరిస్థితుల్లో పరిశ్రమలో వుండాల్సి వచ్చిందనీ చాలా మంది ఆడవాళ్లు చెప్పేవాళ్లు.

అలాగే, “నేను గొప్పగా యాక్ట్ చేస్తుంటే’ అది చూసి ఓర్వలేక ఫలానా నటుడు నా పాత్ర మొత్తం ఎడిటింగ్ రూంలో కట్ చేయించేశాడు… లేకపోతేనా..” అని పాండీబజారుకి కొత్తగా వచ్చిన వాళ్లతో గొప్పలు చెప్పుకుంటూ, “టీ, కాఫీ టిఫిన్‌లకి’, ‘ఎర’ వేసే సినీజీవులూ నాకు సుపరిచితమే. మొదట్లో అన్నీ నమ్మేవాడ్ని. అయ్యో అని బాధా కలిగేది. తర్వాత్తరవాత అర్ధమైంది. ఎందుకు ఇలా కాలాన్ని వెళ్లదీస్తారో.

వీళ్లకీ ఆశలున్నాయి. చాలామందిలో ‘వర్త్’ కూడా వుంది. కానీ కాలం కలిసిరాక ఓ రకమైన నిర్లిప్తతతో నిస్తేజానికి గురై.. తమలో వున్న ‘టాలెంట్’ని తామే ‘గుర్తించు’కుంటూ అదే నిజమని అనుకుంటూ రోజులు గడిపేస్తారు. ఓసారి ఓ సింగరు పరిచయమయ్యాడు. ఘంటసాలగార్ని డైరెక్టుగా గాత్రంలో ‘దించేస్తాడు’. జనాలు ఆహా, ఓహో అనటంతో మద్రాసు వచ్చాడు. గాయకుడిగా స్థిరపడదామని. రెండేళ్ళయినా  చాన్స్ దొరకలా. చివరికి ఓ మ్యూజిక్ డైరెక్టరు దయతలిచి ‘కోరస్’లో పాడటానికి అవకాశమిస్తే కోరస్ సింగర్‌గా మిగిలిపోయాడు. నిజానికి అతని గొంతు బాగానే వుంటుంది. ఘంటసాలగారిని ‘ఇమిటేట్’ చెయ్యడంతో,  పాట ఎత్తుకోగానే ‘ఫాల్స్’ వాయిస్ అనిపిస్తుంది. ఎవరు మాత్రం ఏం చెయ్యగలరూ? అతను మాత్రం తప్పు ‘తనది’ అని గ్రహించకుండా పెద్ద పెద్ద సింగర్లని అసూయతో తిడుతూ వుంటాడు.

ఇదంతా ఎందుకు చెప్పడం అంటే, చిత్ర పరిశ్రమ నిజంగా గొప్పదే, నిజంగా మంచిదే, అయితే ఇక్కడికి వచ్చే వాళ్లందరూ అర్జంటుగా పేరూ, డబ్బు సంపాయించేద్దాం అని వచ్చేవారే గానీ, తమకున్న ‘ఆర్ట్’కి పదును పెట్టుకుని మరింత నేర్చుకుందాం అని దృష్టితో మాత్రం రారు. ఓ ఆర్నెల్లు గడిచేసరికి ఓపికా, ఓరిమీ రెండూ పోయి, ‘కృష్ణబిలం’ లాంటి నిరాశలో కూరుకుపోతారు.

ట్రైన్ స్పీడుగా మద్రాస్ వైపు పోతోంది. ఆలోచిస్తూ అలా పడుకుండిపోయాను. ఏవేవో శబ్దాలు. మెలకువ వచ్చి చూస్తే విజయవాడ. ఆకలివేసింది. లేచి ప్లాట్ ఫాం  మీదకి దిగబోయేంతలో ఆమె.

“మీరేమో పడుకున్నారు. ఆకలవుతుందేమోనని పూరీలు, రెండు దోశలూ పేక్ చేయించుకుని వచ్చాను.!” నా చేతికి పెద్ద కాయితం పొట్లం ఇస్తూ అన్నది. వాటర్ బాటిల్స్ అమ్మకానికొస్తే రెండు కొని ఒకటి ఆవిడకిచ్చాను. “ఇస్తి వాయనం.. పుచ్చుకుంటి వాయినం” అన్నది నవ్వుతూ.

“మీరు తిన్నారా?” అడిగాను.
“ఉహూ! ఆ పేకెట్లోనే నాకోసం తెచ్చుకున్న పూరీలూ, దోశలు వున్నై !”

“సెపరేట్ చెయ్యడం ఎలాగా? సరే. లోపలికి రండి.. ఏదో ఓ మార్గం చూద్దాం ” మళ్లీ కంపార్ట్‌మెంట్‌లోకి వచ్చా. ఆవిడా వచ్చింది. ఎదుటి సీటు ఖాళీగా వుంది. అయితే ఇది ఫస్టుక్లాసు. కాని అడిగితే మారుస్తారేమో. ఎదుటి సీట్లో కూర్చుంటూ”ఇందాకటిదాకా సెకెండు క్లాసులోనే వున్నాను. ఇప్పుడే ఫస్టుక్లాసుకి మారాను. టి.సి బాగా తెలిసినవాడేకాక బంధువు కూదా. నా సామాను ఇక్కడ పెట్టడానికి వచ్చినప్పుడే మీరు నిద్రపోవడం చూశా..!” నా సందేహాన్ని ‘చదివి’నట్టు అన్నది. “నేను TTని అడిగి మీ టికెట్టు మార్పిద్దామనుకున్నా ఎనీవే.. మీరే వచ్చారు.”అన్నాను.

ట్రైను బయలుదేరింది. బజ్జీలు అమ్మేవాడి దగ్గర్నించి రెండు పేపర్ ప్లేట్లు తీసుకుని టిఫిన్ తినడం ముగించాం.

“ఊరగాయల దగ్గర కథని ఆపారు. ఇప్పుడు మిగతాది చెప్పండి” అన్నా.

“భలే గుర్తుందే మీకు.. ఊ. ఆ తర్వాత మూడు అబార్షన్లు,  ముప్పై సినిమాల్లో ఉలుకూ పలుకూ లేని వేషాలూ..! లాభం లేదని బర్కిట్ రోడ్ బాలానందం స్కూల్ దగ్గర టిఫిన్ బండీ పెట్టాను. పచ్చిమిరపకాయ బజ్జీలూ, పునుకులూ, వడలు, సాయంత్రం దోశలూ, ఇడ్లీలూ ఇలా బతుకు ప్రారంభించాను. టినగర్ అంతా తెలుగువాళ్లేగా. బ్రహ్మాండంగా వ్యాపారం ఊపందుకుంది. నమ్మరుగాని సాయంత్రం నాలుగు నించి రాత్రి ఎనిమిది గంటలలోపులో మూడు నాలుగువేలు పోగయ్యేవి. బజ్జీలకో అసిస్టెంటూ, దోసెలకో అసిస్టెంటూ ఉండేవాళ్ళూ!” ఆగింది.

“తరవాత?” అడిగాను.

“ఏవుందీ.. ఎంతొచ్చినా ఆ చచ్చినాడు పట్టుకుపోయేవాడు. సొమ్మునాదీ, సోకు వాడిదీ…” యీసడింపుగా అన్నది.

“ఏం  చేసేవాడూ?”

“తరవాత తెలిసింది. ఆ ముందా వెధవకి ఆల్రెడీ పెళ్ళాం, పిల్లల్లున్నారని. నా దగ్గర దోచుకెళ్లింది వాళ్లకి వెలగబెడుతున్నాడని. !”
నాకు నిజంగా జాలేసింది. గడవని రోజుల్లో చాలా మంది ఆడవాళ్లు ‘వేరే’ వృత్తికి పోతారుగానీ, యీమెలాగా ‘బండి’ పెట్టుకుని చెమటోడ్చరు.
“తరవాత?”

“వాడ్ని వదిలేశా. ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్‌తో కొంతకాలం వున్నాను”
“అదేంటీ?”

“పోలీసు ‘దన్ను’ లేకుండా ఎంతోకాలం ‘బడ్డీ కొట్టు’ నడపటం కష్టమని తెలిసొచ్చాక తప్పలేదు. అతను మంచివాడేగానీ, వేరే వూరికి ట్రాన్స్‌ఫరై వెళ్లిపోతూ, అతనికి తెలిసిన వాళ్లింట్లో ఔట్‌హౌస్ ఇప్పించాడు. అక్కడికి మారాను. ఇప్పుడు నాకు  వున్న కొడుకు ఆ పోలీసాయనకి పుట్టినవాడే.”

“అదేంటి? బిడ్డని కూడా వదిలేసి పోయాడా?”ఆశ్చర్యంగా అడిగా.
“అతను వెళ్లినప్పుడు నేను గర్భవతినని నాకే తెలీదు. తెలిశాక నా బిడ్డ నాకోసమే ఉండాలనిపించింది..!”
“మరి తండ్రి ఎవరూ అని మీ అబ్బాయి అడగలేదా?”
“మిలటరీలో వుండేవాడు, ఏక్సిడెంట్‌లో పోయాడు అని చెప్పాను..”
“తరవాత?”

“మాస్టారూ.. నా బిడ్డ పుట్టాక నేను ఏ వెధవ్వేషాలూ వేయ్యలేదు. ఎక్స్‌ట్రాగానే బతికాగానీ ఏనాడూ తప్పుడు పనులు చెయ్యలేదు. చిన్నప్పుడు నేర్చుకున్న ఊరగాయల విద్యే నన్ను ఆర్ధికంగా ఆదుకున్నది. తెలుగువాళ్ల ఇళ్లకి ఊరగాయలు సప్లై చేస్తూ, సినిమాల్లో వేషాలు వేస్తూ, ఇంకా టైముంటే ఓ టైలర్ దగ్గర అసిస్టెంటుగా పనిచేస్తూ ఆ అవుట్‌హౌస్‌లోనే ఉండి మావాడ్ని పద్మాశేషాద్రి స్కూలులో చేర్చాను.”

నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. పద్మాశేషాద్రి స్కూలంటే చాలా కాస్ట్లీ స్కూలు. ఓ విధంగా చెప్పాలంటే చాలా గొప్పవాళ్లు తమ పిల్లల్ని చదివించే స్కూలు అది.

“మీ ఆశ్చర్యం నాకు అర్ధమైంది కవిగారూ.. నా జీవితం ఎలా గడిచినా పరవాలేదు. బాబు పుట్టకముందు ఎలా తిరిగినా, బాబు పుట్టాక ఒక నిర్ణయం తీసుకున్నాను. నన్ను చూసి నా బిడ్డ గర్వపడాలేగానీ, నా బతుకుని అసహ్యించుకోకూడదని. అందుకే నిప్పులాగా నిలిచా..”
“గ్రేట్…! నిజంగా మీరంటే కొండంత గౌరవం  కలుగుతోంది. ఇపుడు ఏం చదువుతున్నాడు?” అడిగాను.
“ఇంటర్.. ఆ తరవాత నాకో కోరిక ఉంది. అది నా కొడుక్కీ తెలుసు!” నవ్వింది.
“ఏమిటీ?”
“బాబు తండ్రి సరదాగా నాతో అనేవాడు. నేను IPS ఆఫీసర్ని కానుగానీ నా కొడుకుని IPS చెయ్యాలని… ఇపుడు వాడ్ని ఓ ఆఫీసర్‌గా చూడాలి.”
“IPSగానా?”
“కాదు. తండ్రి మిలటరీ అని చెప్పానుగా వాడికి, అందుకే నా బిడ్డని మిలటరీ ఆఫీసర్‌గా చూడాలి..!” ఆమె కళ్ళల్లో ఓ నమ్మకం. ఓ నిర్ణయం.
నా చాతీ పొంగిపోయింది. నేనూ ఒకప్పుడు I.A.Fలో ఉన్నవాడ్నేగా.
“అమ్మా నేను మిలటరీవాడ్నే. నీ నిర్ణయం అద్భుతం.. నీ బిడ్డ నిజంగా గొప్ప ఆఫీసర్ కావలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నా..” అన్నాను.
ఎక్కడో చదివాను. ఎంత గొప్ప మాట. “నువ్వు పేదవాడిగా పుట్టి వుండొచ్చు. పేదవాడిగా మాత్రం చావకు. నువ్వు బురదలో జీవితాన్ని ప్రారంభించి వుండొచ్చు. కానీ ఓ పద్మంలా వికసించి చూడు..అప్పుడే ఈ ‘మనిషి’ జన్మ సార్ధకం అవుతుంది..” అని.
ఆమె ఎంతటి ఆత్మగౌరవం కలిగినదంటే ఓ ‘చెక్కు’ పిల్లవాడికి చదువు నిమిత్తం ఇవ్వబోయాను. “డబ్బు వద్దు. నా బిడ్డని మామయ్యలా ఆశీర్వదించండి. అన్నది. ఇంకేం చెప్పను.

మళ్ళీ కలుద్దాం
భువనచంద్ర.

మీ మాటలు

  1. వెల్లంపల్లి అవినాష్ says:

    కథ చాలా బాగుంది. ఎంచుకున్న కథావస్తువూ బాగుంది. శైలి ఆసక్తిగా చదివించింది. కాకపోతే మంచి బిగువుతో నడుస్తున్న కథ ఉన్నట్టుండి ఐపోయినట్టు అనిపించింది. :)

  2. buchireddy gangula says:

    చంద్ర గారు
    కథ బాగుంధీ—
    రాజకీయాల్లో వారసత్వం— సినిమా రంగం లో వారసత్వం— ఉన్న
    తీరులో– నాడు అయినా– నేడు అయినా–ఆమె కాలు జార క తప్పధు
    కులం- మతం- ప్రాంతీయ బే ధ౦—ఎన్ని అడ్డంకులు– ని ల తొక్కు కొ డా ని కి??
    —————–
    బుచ్చి రెడ్డి గంగుల

  3. ముగింపు చాలా బావుంది. తప్పులు చేయడం సహజం. కాని ఆ తప్పుని తెలుసుకుని మనిషిగా మారడమే గొప్పతనం. ఆమె జన్మ సార్థకమైంది.

  4. Bhuvanachandra says:

    మీ అందరికీ కృతజ్ఞతలు …ఆశీస్సులు ……..మీ అభిప్రాయాల్ని స్వాగతిస్తూ …..మీ భువనచంద్ర

మీ మాటలు

*