మనందరి లోపలి అలజడి ‘పరాయి గ్రహం’

kolluri ఏదైనా ఒక కథ చదివాక, దాని గురించిన ఆలోచనలు మన మనసును వదలకపోతే, ఆ కథలోని సంఘటనలు మనకు రోజూవారీ జీవితంలో ఎదురయ్యేవే అయితే, ఈ కథ నా కథలానే ఉందే అనుకుంటూ పాఠకుడు తనని తాను కథలోని పాత్రలతో ఐడెంటిఫై చేసుకుంటే, ఆ కథ నిజంగానే మంచి కథ.
పాలపిట్ట మాసపత్రిక మార్చి 2013 సంచికలో ప్రచురితమైన బెజ్జారపు రవీందర్ కథ “పరాయి గ్రహం” ఈ కోవకే చెందుతుంది. కథాంశం మధ్యతరగతి వాళ్ళు సొంత ఇల్లు అమర్చుకోవాలనే కలని సాకరం చేసుకునే ప్రయత్నం, దానిలోని ఇబ్బందులు! కథనంలో కథావస్తువుని ఇమిడ్చిన తీరు రచయిత నైపుణ్యాన్ని చాటుతుంది.
మనుషుల ఆశలను, నిరాశలను రమ్యంగా ఆవిష్కరించిదీ కథ. మనుషులలోని లౌక్యాన్ని, తుచ్ఛతని ఎత్తి చూపుతుందీ కథ. ఎదగాలనుకునే మధ్యతరగతి వారి సమర్థతని హేళన చేస్తూ… ‘నువ్వింతే… నీ బతుకింతే…’  అంటూ కృంగదీసే సమాజపు కర్కశ వైఖరిని వెల్లడిస్తుందీ కథ.
వైయక్తిక ఆశలను తీర్చుకోడానికి ప్రయత్నించే వేతన జీవులను నియోరిచ్ వర్గం ఎలా పరిహసిస్తుందో, నీతి నిజాయితీల స్థానంలో అవినీతి, అక్రమార్జన సమాజంలో ఎలా వేళ్ళూనుకుపోతున్నాయో ఈ కథ వ్యాఖ్యానిస్తుంది. వర్తమాన సమాజపు ధోరణికి; జీవితపు చిన్న చిన్న కోరికలు తీర్చుకోడాని ప్రయత్నించి భంగపడి, ఉన్నదాంట్లోనే ఆనందం పొందే ఎందరో నిస్సహాయులకు ప్రతీక ఈ కథ.
పాత్రల మనోభావాలను అత్యంత సహజంగా వర్ణించారు రచయిత.  ఆయా పాత్రల ఔచిత్యం ప్రకారం వారి సంభాషణలు, వాళ్ళ ఇళ్ళ పరిసరాలు, వారి ఆహార్యం గురించి చక్కగా వివరించారు రచయిత. నిజజీవితంలో అటువంటి వ్యక్తులను ఎంతో దగ్గర నుంచి పరిశీలిస్తే గాని పాత్రలు అంత సహజంగా ఉండవు. ఈ కథ చదువరులను అంతగా ఆకట్టుకోడానికి ప్రధాన కారణం మనుషుల సహజ సిద్ధ స్వభావాలను యథాతథంగా వెల్లడించడమే. మనుషుల్లోని సున్నిత భావాల్ని, భావుకతని, ఈర్ష్యాసూయల్ని, కుత్సిత భావాల్ని అతి వాస్తవికంగా ప్రకటించడమే.
రియల్ ఎస్టేట్ బూమ్ అనగానే మనకి చాలా కథల్లో చదివిన హైదరాబాద్ రింగ్ రోడ్, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాలు స్ఫురిస్తాయి. కానీ ఈ కథకి నేపథ్యంగా కరీంనగర్, దాని పరిసర ప్రాంతాలను ఎంచుకోడంలో వైవిధ్యం చూపారు రచయిత.
మనలో చాలామంది మర్చిపోతున్న విషయం ఆదివారం ఆటవిడుపు! ఆదివారం కోసం ఎదురుచూడడంతో ప్రారంభమవుతుంది కథ. కెరీర్ల వెంటా, డబ్బు సంపాదన వెంటా పరిగెడుతున్న జనం, ‘ఆదివారాన్ని ఆస్వాదించి ఎన్నిరోజులయ్యిందో’ – అని అనుకోకుండా ఉండలేరు మొదటి మూడు పేరాగ్రాఫులు చదివాక.
కథ దిగువ మధ్య తరగతికి చెందిన ఓ పొందికైన చిన్నకుటుంబానిది.  చందూది ఓ కాంట్రాక్ట్ ఉద్యోగం. భార్య లలిత ఓ ప్రైవేటు స్కూల్లో టీచరు. పదేళ్ళ కొడుకు. కలతలు లేకుండా సాగిపోతూంటుంది వారి సంసారం. చందూకి భావుకత్వం ఎక్కువ. సామాజిక, రాజకీయ అవగాహన కూడా ఉన్నాయి.
లలితకి పిన్ని వరసయ్యే మాధవి భర్త శ్రీనివాస్‌‍కి హఠాత్తుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కలిసొస్తుంది. ఉన్నట్లుండి సంపన్నవర్గంగా మారిపోతారు. తోటివారితో ప్రవర్తించే తీరు కూడా ఎదుటివారి ఆర్థికస్తోమతని బట్టి మార్చుకుంటూంటారు. తమ ధనాన్ని ప్రదర్శించడం వారికి అత్యంత ప్రీతిపాత్రం. “కార్లు, చీరలు, నగలు, పలుకుబడి వల్ల వాళ్ళకు వచ్చే సంతోషం కన్నా, అవి ఎదుటివాళ్లకు లేవనే భావన అమితమైన ఆనందాన్ని కలుగజేస్తూంటుంది. వాటివల్ల తాము సుఖపడిపోతున్నామని ఎదుటివాళ్ళు అనుకోడాన్ని ఎంజాయ్ చేస్తూంటారు. ఇతరుల లేమిని గుర్తు చేయడంలోనే వారి సంతోషం ఇమిడి ఉంది.  పెరుగుతున్న సంపద, ఎదుటివారిపై అప్రత్యక్ష అధికారాన్ని కట్టబెట్టినట్లు అనుభూతి చెందుతుంటారు మాధవి, శ్రీనివాస్‌లు.”

మొదట్లో ఇలాంటి ప్రదర్శనలు లలితను కదిల్చేవి కావు. భర్తతో కలిసి జీవించడమే మహాభాగ్యమని భావించే ఆమెలో కొద్దికొద్దిగా విషాన్ని నింపడంలో మాధవి విజయవంతమవుతుంది.  “మాధవి మొదటి నుంచి లలితను పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ ఎప్పుడైతే లలిత ముఖంలో తన ప్రదర్శన పట్ల ఒక రకమైన అసూయను రేఖామాత్రంగా దర్శించిందో, ఆ క్షణం నుంచి మాధవి మహత్తరమైన వేడుక అనుభవించడం మొదలుపెట్టింది.”
చివరికి వీరి తాకిడిని తట్టుకోలేక ఎక్కడోక్కడ స్థలం కొనాలని మరో బంధువు కిరణ్‌తో కలిసి  బయల్దేరుతాడు చందూ.
తన తండ్రి చేసిన ఓ పొరపాటువల్ల తనకి లక్షలు పోయాయని వాపోతాడు కిరణ్. “మా అయ్య గనక శీనన్న అయ్య లెక్క జాగ్రత్త పడితే… ఇంత నాదాని బతుకు అయ్యేదా? ఏమీ లేనోళ్ళు సైతం కొంత కొంత భూమి కూడబెట్టి ఎట్లా కోటీశ్వరులైపోయిన్రు….” అంటాడు. ఆ క్షణంలో చందూకీ భయమేస్తుంది, భవిష్యత్తులో తన పిల్లలు కూడా తనని ఇలాగే తిట్టుకుంటారని.
తన బడ్జెట్‌లో సరిపోయే స్థలం ఎక్కడా లభించదు. ప్రతీ ప్లాటు తనను వెక్కిరిస్తున్నట్లుగా అనిపిస్తుంది చందూకి. తానొక అసమర్థుడిననే భావన మొదటిసారి కలుగుతుంది అతనికి. మళ్ళీ బస్సెక్కి ఇంటి ముఖం పడతాడు. పంట పొలాలన్నీ ప్లాట్లుగా, చెరువులు సైతం పూడ్చబడి, గుట్టలు కూల్చివేయబడి సమస్త భూమండలం ‘For Sale’ బోర్డు పెట్టబడిన ఓ పెద్ద ప్లాటుగా కనిపిస్తుంది చందూకి.  ప్రకృతిని కబళిస్తూ, నిర్మాణం పేరుతో విధ్వంసం సృష్టిస్తున్న వైనం రేఖామాత్రంగా వ్యక్తం అవుతుందీ కథలో.
చివరగా, కథకి ‘పరాయి గ్రహం’ అనే పేరు పెట్టడంలోని ఔచిత్యం పాఠకులని ఆలోజింపచేస్తుంది. ఎక్కడా ఓ చిన్న స్థలం కొనుక్కోలేని మధ్యతరగతి జీవి – ఇది తనది కాదు అనుకోడం వలన భూగోళం పరాయి గ్రహంగా కనిపించడం ఒక కారణం కావచ్చు; భావుకులు, పర్యావరణ ప్రేమికులు- ఇక ప్రకృతిని ఆస్వాదించాలంటే భూమి మీద అవకాశం లేదని, పరాయి గ్రహానికి వెళ్ళాల్సిందే అని అనుకోడం మరో కారణం కావచ్చు.  ఈ రెండు కారణాలలో ఏది సరైనది అనేది పాఠకుల ఊహకే వదిలేసారు రచయిత.
మొత్తం మీద చదువుతున్నంత సేపూ మానసికంగా అలజడి కలిగిస్తూ, చదివిన తర్వాత చాలా కాలం వెంటాడుతుందీ కథ.

ParayiGraphamStory

 

మీ మాటలు

  1. అఫ్సర్ గారు, సంపాదక బృందం –
    నా వ్యాసాన్ని సారంగలో ప్రచురించినందుకు ధన్యవాదాలు.
    -సోమ శంకర్

  2. సోమశేఖర్ గారూ,
    “ముఖంలో తన ప్రదర్శన పట్ల ఒక రకమైన అసూయను రేఖామాత్రంగా దర్శించిందో, ఆ క్షణం నుంచి మాధవి మహత్తరమైన వేడుక అనుభవించడం మొదలుపెట్టింది.”
    భలే చెప్పారు కదా రవీందర్ గారు.

  3. సారీ సోమ శంకర్ గారూ, మీ పేరు తప్పు టైప్ చేసాను.

  4. బి.అజయ్ ప్రసాద్ says:

    రియల్ ఎస్టేట్ పై రాసిన ఈ కథ చివరగా ఠాగోర్ కవితతో ముగియటం చాలా బావుంది.

  5. @రాధ గారు ,
    నడమంత్రపు సిరి పట్టిన వారి స్వభావాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రించారు రచయిత.
    @ అజయ్ ప్రసాద్ గారు,
    భావుకత్వాన్ని, వాస్తవాన్ని మిళితం చేసి రచయిత చెప్పిన తీరు బావుంది.
    మంచి కథ అందించినందుకు రవీందర్ గారికి ధన్యవాదాలు.

  6. కథ చదవాలి అనిపించేలా కుతూహలం కలిగించేలా బావుంది పరిచయం.

మీ మాటలు

*