నేను- మృత్యువు

damu


మృత్యువు కాసేపు నాతో జీవిస్తుంది
దాన్ని కౌగలించుకొని పడుకుంటాను
అది నన్ను ముద్దు పెట్టుకున్నపుడు
నా కళ్ళల్లో నీళ్ళు, పెదాలపై చిరునవ్వు
అది నన్ను రుచి చూస్తుంది


వ్యామోహంతో దానిలోకి దూకేస్తాను


కానీ, అది ప్రియురాలి వలె దుఃఖిస్తుoది


‘నీ గమ్యం నేనేరా’- అని మళ్ళీ
వెక్కిరించి నవ్వుతుంది
‘నేనే నువ్వు కదా ‘- అంటాను


అది హటాత్తుగా తల్లి వొలె నుదుటిని ముద్దాడుతుంది
దాని స్పర్శలో గతపు గాయాలన్నీ మాయమవుతాయి.


దుఃఖంతో తడిచాక కొత్త ప్రేమతో
నిగనిగలాడతాను.


మృత్యువు నాకు నేనే

గుసగుసలాడుకొనే వొక రహస్యం 

మీ మాటలు

  1. ramanajeevi says:

    అది నన్ను రుచి చూస్తుంది అనేదే కదా ఇన్దులో కవిత్వం. మిగతాదంతా ఆ కవిత్వాన్ని అందించడానికి ఉపయోగించిన పాత్ర కదా.

  2. Death of life , intimately illustrated !

  3. దామూ గారు. వో మీ ఇద్దరి రహస్యం అర్థమైంది. అర్థం కాలేదు. గుసగుసల మిసమిసలు మీకేనా?

  4. mercy margaret says:

    // మృత్యువు నాకు నేనే
    గుసగుసలాడుకొనే వొక రహస్యం
    దుఃఖంతో తడిచాక కొత్త ప్రేమతో
    నిగనిగలాడతాను…. //
    చాలా బాగా చెప్పారు దాము గారు .. అందుకే మృత్యువును మనస్పూర్తిగా ఇష్టపడే వాళ్ళు తక్కువగా ఉన్నా .. ఇష్టపడెంత దైర్యం ప్రదర్శించే కొందరి వళ్ళ దానిఫై అయిష్తమూ పోతుంది . మంచి కవిత .

  5. దడాల వెంకటేశ్వరరావు says:

    మీకు మీరే గుసగుసలాడుకొనే వొక రహస్యం
    అదే ‘మృత్యువు’ మీతో కాసేపు జీవిస్తుంది
    ముద్దులతో మిమ్మల్ని రుచి చూస్తుంది
    ప్రియురాలివలె దుఖిస్తుంది
    నీగమ్యం నీనేరా అని వెక్కిరించి నవ్వుతుంది
    తల్లి వొలె నుదుటిని ముద్దాడుతుంది
    స్పర్సతో గతపు గాయాల్ని మాయం చేస్తుంది
    దుఖాన్ని వీడి మీరు క్రొత్త ప్రేమలోనిగనిగలాడుతారు

    అంతే కదండి “దాము” గారు
    దడాల వెంకటేశ్వరరావు

  6. మ్రత్యువంత గుహ్యంగా, క్లిష్టం గా… అంతే సరళం గా వుంది కవిత

  7. మణి వడ్లమాని says:

    మృత్యువు గురించిన నిజం, బాగా రాసారు

    ‘నీ గమ్యం నేనేరా’- అని మళ్ళీ
    వెక్కిరించి నవ్వుతుంది
    ‘నేనే నువ్వు కదా ‘- అంటాను

మీ మాటలు

*