హోసూరులో తెలుగు కథ హోరు!

మధురాంతకం రాజారాం సాహిత్య సంస్థ తరఫున, మధురాంతకం నరేంద్ర  కథావార్షిక 2012 ఆవిష్కరణకు, మే  18, 2013 న, శనివారం, హోసూర్ కు రావలసినదిగా పంపిన ఆహ్వానం అందగానే ఇది ఒక చక్కటి రచయితల సదస్సు కాగలదనిపించింది. నేను వస్తున్నట్లుగా వారికి ఒక విద్యుల్లేఖ పంపాను. హోసూరు తమిళ్ నాడు లోనే ఉన్నా, బెంగళూరు కి దగ్గరిగా 40 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాదు నుంచి వెళ్ళాలంటే బెంగళూరు మీదుగా వెళ్ళటం సులువు. మిత్రులు అనిల్ ఆట్లూరి తాను హోసూర్ వెళ్తున్నట్లుగా ఫేస్ బుక్ లో సందేశం ఉంచారు. హోసూర్ వెళ్ళాలనే ఉత్సాహం పెరిగింది. దీనికి తోడుగా హైదరాబాదులో ఎండలు మండిపోతున్నాయి. హోసూర్ లో రచయితల సాన్నిహిత్యం లో ఎండల నుంచి కూడా తప్పించుకోవచ్చు అనుకున్నాను.
కథావార్షిక ఆవిష్కరణ సభ నిర్వహిస్తున్న కృష్ణగిరి  జిల్లా తెలుగు రచయితల సంఘం (కృష్ణ రసం) ప్రతినిధులు మాకు స్వాగతం చెప్పి, ఉపాహారం, కాఫీ, టీలు అందించారు. కాఫీ తాగుతుండంగా  కథా వార్షిక సంపాదకులు మధురాంతకం నరేంద్ర కనిపించారు. పుస్తకావిష్కరణకు తీసుకున్న ఏర్పాట్లకు వారిని అభినందించాను. నరేంద్ర తాను కూడా మాలాగే అతిధి లా వచ్చానని శ్రమంతా కృష్ణ రసం వారిదేనని అన్నారు. ఇంతలో విశ్వేశ్వరరావు  వచ్చారు. వీరు కవితా (సమకాలీన కవితల కాలనాళిక) పత్రికకు  నిర్వాహక సంపాదకులు. ఎల్లలు లేని సాహితీమిత్రుల విలాసమైన శ్రీ శ్రీ ప్రింటర్స్, విజయవాడ వీరిదే. చిటుక్కు పటుక్కు చెనిక్కాయలు, కథావార్షిక 2012 వీరి ముద్రణశాలలోనే అందంగా అచ్చయినవి. పరస్పర పరిచయాల తరువాత తాజాగా వారి ముద్రణాలయం లో అచ్చయిన కొత్త పుస్తకాలు చూపారు. వాటి ముద్రణ బాగుంది.
సభాస్థలి  హోసూరు వారే కాకుండా బెంగళూరు, హైదరాబాదు, బోధన్ లాంటి దూర ప్రాంతాల నుంచి వచ్చిన సాహితీ అభిమానులతో నిండింది. ఆ రోజు కార్యక్రమంలో ఉదయం పుస్తకావిష్కరణ , సాయంత్రం తుమ్మేటి రఘోత్తమ రెడ్డి కి కేతు విశ్వనాథ రెడ్డి -2012 పురస్కార ప్రదానం ఉన్నాయి. అయితే కొన్ని కారణాలవలన రెండో కార్యక్రమం రద్దయినది. కృష్ణరసం గౌరవ అధ్యక్షుడు కలువకుంట నారయణ పిళ్ళై  స్వాగత పలుకుల తర్వాత కథ సంపాదకులు వాసిరెడ్డి నవీన్, మధురాంతకం నరేంద్ర సంపాదకత్వంలో వెలువడిన కథావార్షిక 2012 పుస్తకావిష్కరణ చేశారు.
నవీన్ మాట్లాడుతూ, మధురాంతకం రాజారాం పట్ల ఉన్న గౌరవం, అనుబంధం వలన ఈ పుస్తకావిష్కరణకు అంగీకరించామన్నారు. తన సంపాదకత్వంలో వస్తున్న కథ 2012, కథావార్షిక 2012 లలో కథలు పునరావృతం కాకుండా, తాను మధురాంతకం నరేంద్ర తో సంప్రదిస్తూ జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
విమల కథ “కొన్ని నక్షత్రాలు కాసిని కన్నీళ్ళు”,  రెండు సంకలనాలలో   చోటుచేసుకుని, విశిష్ట కథయ్యింది. ఈ కథ ఆలోచింపచేస్తుంది.ఈ కథలో ప్రధాన పాత్రగా రచయిత్రి ప్రథమపురుషలో మనకు కథ చెప్తారు. 12 ఏళ్ళ తరువాత ఒక పెళ్ళికి వేములవాడ వెళ్ళిన రచయిత్రి, విరసం సభ్యురాలిగా అప్పటి కార్యకర్తలు, కార్యక్రమాలను నెమరువేసుకుంటుంది. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న మాధవ, అక్కా అంటూ రచయిత్రి దగ్గర కొస్తాడు. అతనితో మాట-మంతీ సందర్భం లో అతను జ్యోతి అనే అమ్మాయి ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. అందరి కార్యకర్తలుకూ చెప్పినట్లే అతనికీ కొన్ని గ్రామాల పనిచెప్తుంది. అయితే రామడుగు అనే ఊళ్ళో జరిగిన చిన్న పొరపాటు వలన పోలీస్ ఎన్ కౌంటర్లో, మాధవ చనిపోతాడు. వర్తమానానికొస్తే, రాత్రి జరగబోయే పెళ్ళికి, ఒకామె వచ్చి తనను తాను జ్యోతిగా పరిచయం చేసుకుంటుంది. తన మేన బావతో పెళ్ళయిందని, తనకు ఇద్దరు పిల్లలని చెప్తుంది. గాలికి ఆమె చేతిపై ఉన్న వస్త్రం తొలిగినప్పుడు కనిపించే దీపం బొమ్మ పచ్చబొట్టు, అప్రయత్నంగా మాధవ్ జ్ఞాపకాలు తెస్తాయి. రచయిత్రి కథ చెప్పిన తీరు ఆసక్తికరంగా నడిచింది. నక్సలైట్ ఉద్యమ బాటపట్టి ఎన్ కౌంటర్ లో బలైన వాళ్ల గురించి, ఈ కథ గట్టిగా ఆలోచింపచేస్తుంది. సాంప్రదాయ పద్ధతులలో పనిచేస్తే పోలీస్ ఎన్ కౌంటర్ తప్పదు. ఆరోగ్యం బాగా లేకపోయినా ఉద్యమాన్ని వీడి, జనజీవన స్రవంతిలో కలవాలి. లొంగుబాటు తప్పట్లేదు. కనుక ప్రజాసామ్య పద్ధతిలోనే సామాజిక విప్లవం వచ్చేలా ఉద్యమంలో మార్పులు తీసుకురావాలి. తద్వారా ఎందరో యువకుల అమూల్య ప్రాణాలు గాలిలో కలవకుండా నివారించవచ్చు.
తెలుగు సాహిత్య పరిషత్ గౌరవ అధ్యక్షుడు ఎం.ఎస్.రామస్వామి రెడ్డి మాట్లాడుతూ తెలుగుభాషలోని అణిముత్యాలైన పుస్తకాలను ఇతర భాషలలోకి తర్జుమాచేయటంలో కేంద్ర సాహిత్య అకాడెమి సవితి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. హోసూర్ ఎం.ఎల్.ఎ. గోపీనాథ్ మాట్లాడుతూ ఇక్కడి మాండలీకంలో వ్రాసిన రచనలను ప్రోత్సాహించాలన్నారు. తద్వారా ఇక్కడి రచయితలకు మరిన్ని రచనలు చేయటానికి కావలసిన ప్రేరణ ఉండగలదన్నారు. తరువాత బహుమతి గ్రహీతలకు పురస్కారాలను అందచేసారు. ప్రఖ్యాత రచయిత సింగమనేని నారాయణ మాట్లాడుతూ తన కథలలో ముస్లిం పాత్రలు లేవన్నారు. ముస్లింల జీవన పరిశీలన ఖదీర్ బాబు కథలలో తెలుస్తుందన్నారు.
మహమ్మద్ ఖదీర్ బాబు న్యూ బోంబే టైలర్స్ పుస్తకానికి కథాకోకిల పురస్కారాన్ని అందుకున్నారు. స.వెం. రమెష్ ప్రళయకావేరికథలు కు కథాకోకిల పురస్కారాన్ని అందుకున్నారు.కథావార్షిక -2011 లోని కథల సింహావలోకనం చేసిన అఫ్సర్ కు కథాకోకిల పురస్కారాన్ని ప్రకటించారు. అఫ్సర్ అమెరికా లో ఉంటుండటం వల్ల అవార్డ్ అందుకోవటానికి రాలేకపోయారు.
డా వి చంద్రశేఖర రావు కథావార్షిక 2012  కథల విశ్లేషణ చేశారు. సింహావలోకనం కై కధాకోకిల పురస్కారాన్ని అందుకున్నారు. మన్నం సింధుమాధురి కథ “కాళాపు” కథావార్షిక 2012 లో ప్రచురణయ్యింది. కథా రచయిత్రిగా తెలుగు సాహిత్య పరిషత్ గౌరవ అధ్యక్షుడు ఎం.ఎస్.రామస్వామి రెడ్డి చేతుల మీదుగా కథావార్షిక 2012 పుస్తకాన్ని సింధుమాధురి అందుకున్నారు. వీరి ఉళేనూరు క్యాంపు కథలు పాఠకుల దృష్టికెళ్ళాయి. గంగావతి కాంప్ (కర్ణాటక) లో పుట్టి పెరిగిన మాధురి, క్యాంపుల లోని జీవన సరళి  నేపధ్యంలో ఈ కథలు వ్రాశారు.కథావార్షిక 2012 సంపాదకులు మధురాంతకం నరేంద్ర, చిటుక్కు పటుక్కు చెనిక్కాయలు కథా రచయిత  అమరనారా బసవరాజులను ఎం.ఎల్.ఎ. గోపీనాథ్  దుశ్శాలువా కప్పి సన్మానించారు.

రచన, చిత్రాలు: సి.బి.రావు

 

మీ మాటలు

*