బతుకు క్రితం ఓ కల క్రితం

1. బర్వుగా జారిపోతాం. జరాస జర్దా జల్దీ జిందగీలో. బాబా రత్న రంగుని పులుముకుంటూ నములుకుంటూ. తేలు కొండెం చీకటిలోకి ఆలోచనలు లేని ఆలోచనలలోకి. మనసుని గోక్కుంటూ.

2. బర్వుగా తేలిపోతాం. ఏ ఊరెళ్ళావో ఎవరికీ చెప్పకే. tabula rasa. తబలా తలల జ్ఞాపకాలు, హార్మోనియం నేర్చుకోవటాలు, బొమ్మలు గీయటాలు, spells of tranquilityని పట్టుకోవటాలు తేలిపోయిందెక్కడకో. యిపుడెవరికి కాపలా యీ వుత్తరాలూన్నూ. ఎవరికైనా చెప్పి తిరిగొచ్చేయ్ మొగల్ సరాయ్ లో కలుసుకుందాం. ఓ గోధుమ రంగు స్నేహంలో. గో. గో. ఇళ్ల కప్పుల్నీ, కప్పల్నీ, కాళ్లనీ, కన్నీళ్ళనీ, కాకి ఇంద్రధనుస్సుల్నీ విడిచి. ఇడిచి.

3. బర్వుగా నానిపోతాం. నాన్న కొట్టారా. భార్య చనిపోదెప్పటికీ. అమ్మే మిగిలి. మిగిలి. నాన్నే రగిలి. పగిలి. గిలి గిలి సిల్లీ చలి. గిల్టీ గాలిబ్ ల లబ్ డబ్ లు యిక వినిపించవులే. రబ్బరు రెక్కల రక్తం తొంగిచూడదులే. రేపటి గురకలు గుర్రమెక్కాయా. వలస కలవరింతలే కనికరించాయా. అసలు పక్షులు యెగురుతాయా.

4. బర్వుగా కాలిపోతాం. నలుపు మంచు ఉరుముల ఊపిరిలో. ఎప్పటి రాత్రైనా వొహప్పటి జ్ఞాపకమేనా. దీపానికి తెలుసా సమయమెంతైందని. దేహానికి తెలుసా మరణమెంతైందని. ఆర్పు. ఆర్పు. నిద్రనదిలో మరుగుతున్న మంటల్ని.

5. బర్వుగా చూస్తుంటాం. గది లోపలి లోపలి గదిలో గది గది గది లోపల లోపల లోపల గదిలో. కాళ్ళీడుస్తూ చూపులు. వొళ్లు విరగ్గొట్టుకుంటూ చూపులు. cosmic consciousnessలోకి ‘నన్ను’ని వెతుక్కోవాలని చూస్తూ స్తూచూ చూస్తూ స్తూచూ వెళ్ళావా. నీ లోపలి గాలిలోకి. వీధిలోకి.

6. బర్వుగా గడ్డకడతాం. ‘ ఊదా నీలి జాలి – / “నిబద్ధతే” ఇదంతా ‘ అంటూ నన్ను నడుస్తున్న నీడల్తో, తాటిచెట్టంత రంగులతో నడుస్తున్నప్పుడు, ఎవరో నన్ను పీక బిగించిన నాలుకతో, నాలుకంత పీకని బిగించిన చీకటిలో గడ్డకట్టలేదూ. ‘కోరతనపు అమాయకత్వం తెరలతో కప్పబడిన వికటాట్టహాసంలాగా, తలనరకబడిన కొబ్బరి బొండాంలాగా, మాసిపోయిన మొన్నలాగా,’ ఓ వెర్రినవ్వు గడ్డకట్టలేదూ.

7. బర్వుగా ఖలరవుదాం. ‘ గోళీసోడా కొట్టినపుడు ఖయ్యిమంటూ మొదలుపెట్టి కీచుమంటూ దిగిన శబ్దపు ఖలరుందే, ఆ ఖలరండీ… ఒక నయంకాని ఏకాంతంలోకి… అంతటి అర్థరాత్రిలోనూ దూరంగా ఒక మిత్రుణ్ణి కలుసుకోవాలని ఉంటుంది అతనెలా ఉన్నాడో కనుక్కుందామని… ఆ ఖలరండీ… ఇంతకీ, ఆ ఖలర్లోని వేడి, వెలుతురు సరిపడ్డాయా?

img625(1)

సిద్ధార్థ, త్రిపుర, ఎం. ఎస్. నాయుడు, నున్నా నరేష్, గుంటుకు శ్రీనివాస్

మీ మాటలు

  1. నాయుడూ : త్రిపుర అంటే నీకెంత ఇష్టమో తెలుసు. ఈ ఏడు త్రిపురాత్మక శకలాల్లొ నువ్వు త్రిపురతో నీకున్న వ్యక్తిగత/ వాక్యగత ఆత్మీయతని తడిగా పట్టుకొచ్చావ్! ఇందులో ప్రతి సెగ్మెంట్ గురించీ విడివిడిగా ఎంతయినా రాయవచ్చు. ఎంతయినా వివరించవచ్చు. కాని, వొక్క ముక్కలో చెప్పాలంటే త్రిపుర జాడ నీకు కాస్త తెలిసింది!

  2. బి.అజయ్ ప్రసాద్ says:

    ఏం. ఖలరు నాయుడూ.. బర్వుగా ఉంది. జారిపోవడం, తేలిపోవడం, నానిపోవడం, కాలిపోవడం.. ప్రతిదీ Dali painting Persistence of memory లా ఐపోడం. సరే. మిత్రుడిని కలుసుకోవాలని ఉంటుంది.. అతడెలా ఉన్నాడో కనుక్కుందామని.. ఆ ఖలరు… ఆ ఖలరులోని వేడి, వెలుతురు.. బాగుంది నాయుడూ.. బర్వుగా కూడా ఉంది..

  3. mercy margaret says:

    వండర్ఫుల్ నాయుడు గారు , ఒక్కో పేరా నిజంగా బరువైన భావాలతో తేలికగా మనసుని సున్నిత్తంగా హత్తుకునేంత . అభినందనలు .ఎంతందంగా రాసారు

  4. డియర్ నాయుడు
    త్రిపుర పొట్రైట్ ని వేశావు

  5. raareddy says:

    అద్బుతమైన కోల్లెజ్ పద్య శకలాలు నాయుడూ ,
    స్మృతి చితి చిరంతన వెలుగు గతి సాగి కళ్ళు కారవు బరువెక్కుతై………

  6. గుడ్ వన్ నాయుడు

  7. రంగుల ఖలర్స్.

  8. Mitrudu says:

    నాయుడూ,
    మంచి పద్యం అనడానికి నోరు రావడం లేదు. బర్వుగా,చిక్కగా జారుతున్న నీ దుఃఖాన్ని బావుంది అని ఎలా అనగలం ?
    ఇంకా,ఈ ఎలిజీ కేవలం త్రిపురకేనా , మరణింఛిన, బ్రతికున్న, మిత్రులు, ఆత్మీయులు, అందరికీనా ?

    బహుశా ఈ దుఃఖ్ఖసందర్భం మా అందరిదీ కనుకేమో, పద్యం అర్ధం కాలేదనడానికేమీ మిగలలెదు.

Leave a Reply to anil Cancel reply

*