త్యజిస్తూ.. సృజిస్తూ

 jya
నిన్ను నన్ను గా చూసుకున్నాను
నాకు నేనే బందీనయ్యాను
ఒక ఖైదు వెలిసింది
వెతల వేల గదులు
నన్ను నేను త్యజించుకున్నాను
నాకైనేను సృజించుకున్నాను
గుణిస్తూ.. విభజిస్తూ..
విడదీస్తూ.. కలిపేస్తూ
గాలిపటంలా ఓ ఆశ
ఎటు పోతున్నానో తెలియని ఆకాశం
అకస్మాత్ ఆధారం లా నువ్వు
దారంగా మలుచుకోవాలని నేను
క్షణాల పయనం
నవ్వుల్లో గుండెలా నువ్వు
చప్పట్ల పసితనంలా నేను
ఊహల దారుల ఆహ్వానం
జ్ఞాపకాల నీడ ఇల్లు
పొద్దుసోకని సూరీడంటి ఆశ
చీకటి నీడలో వెలుగూ
వెలుగు వెంటే వెన్నెలా
త్యజించేతనం
సృజించుకొనే గుణం
ఎన్ని ఖైదుల్నైనా పెకలిస్తాయి
కొత్త ఆలోచనల  విత్తల్లే నువ్వు
సంతోషపు క్షణాలు మొలకలేస్తూ నేను
 త్యజిస్తూ…. సృజిస్తూ మనలోని కాలపు మడులు

 

మీ మాటలు

  1. రమాసుందరి says:

    బాగుందండి. త్యజిస్తూ, సృజించుకొనే కాంసెప్ట్.

    • థాంక్స్ రమా గారు.. కాన్ఫ్లిక్ట్ నుంచే బహుశా కాన్సెప్ట్ లు వస్తాయేమో….

  2. చాలా బాగుంది,

  3. వి . శాంతి ప్రబోధ says:

    కొత్త ఆలోచనల విత్తల్లే నువ్వు
    సంతోషపు క్షణాలు మొలకలేస్తూ నేను
    త్యజిస్తూ…. సృజిస్తూ మనలోని కాలపు మడులు

    చాలా బాగుందండీ

  4. సాయి పద్మ says:

    ఒక తలుపు , తలపు త్యజిస్తేనే గానీ .. మరో మలుపు సృజించాలెం.. సూక్ష్మంలో మోక్షంలా చెప్పారు .. బ్రేవిటీ భలే నచ్చింది. నవ్వుల్లో గుండెలా నువ్వు
    చప్పట్ల పసితనంలా నేను
    ఊహల దారుల ఆహ్వానం
    జ్ఞాపకాల నీడ ఇల్లు

    ఒక సున్నితమైన ఇమేజరీ ఆవిష్కరించారు బావుంది జయా

    • పద్మా డియర్… దృశ్యాన్ని చూస్తూ.. నేను చూసింది అక్షరానికి అందివ్వాలన్న తపనే ఇది. :) థాంక్యూ..

  5. అటాచ్డ్ డిటాచ్మెంట్ అంటే ఇదేనేమో…పరస్పర విరుద్ధమైన భావాలమధ్య జీవితాన్ని పొందడం, సాధించడం అంటే ఇదేనేమో…బాగుంది. “చప్పట్ల పసితనంలా నేను”,”పొద్దుసోకని సూరీడంటి ఆశ”లాంటి ప్రయోగాలు చాలా బాగున్నాయ్. పరిణితి కనిపిస్తోంది.

    • ఒక వేగం, ఒక కసి, ఒక పదం.. వెరసి.. మీరన్న పరిణతి.. థాంక్స్ మహేశ్ గారు

  6. జయశ్రీగారూ, కవిత్వంలో క్లుప్తత ఇంకా నేర్చుకోవాల్సిన పాఠమే! ఈ కవితలో మీరు క్లుప్తత పాటిస్తూనే లోతయిన భావనలు చెప్పుకుంటూ వెళ్ళారు. మీ నించి మరిన్ని కవితల కోసం ఎదురుచూస్తూ…

    • రెండు నెలలుగా.. పదానికీ భావాలకూ మధ్య కసరత్తు చేస్తూ..
      యేదో అన్వేషణలో పదాలను సాయం తీసుకుని అల్లుకున్న లేస్ యీ కవిత అఫ్సర్ జి ..

      మీరు పదే పదే చెప్పే.. ఇతర రచనలు కూడా చదవండీ అన్న సలహా తో కొత్త భావాలను పరిచయం చేసుకున్న క్రమం లో పరిణతి అన్న కొత్త అడుగు పడింది. క్రమం తప్పక రాయడానికి ప్రయత్నిస్తాను .

  7. ప్రతీవాక్యంలో మంచి పరిణతిని కనబరుస్తూ పకడ్బందీగా అల్లిన కవిత జయా…సాయిపద్మగారన్నట్టు ఇమేజరీ అచ్చొచ్చింది మీకు..ఇక మీ కవితలకోసం ఎదురుచూడ్డం అలవాటవుతుంది.

    • దేవ్ జీ.. మొదటి నుంచీ మీ ప్రతి స్పందన మరో పై మెట్టు చూపుతూనే వుంది..
      అచ్చొచ్చిన్దంటూ.. మీరూ, పద్మా అన్నాక తిరుగేముంది.. :) మీ ప్రతి స్పందన కోసం ఎదురు చూడటమూ మారని అలవాటే నాకూ..

  8. Mani Vadlamani says:

    చాల బావుంది జయశ్రీ గారు., హృదయాన్ని స్పృశిస్తూ వుంది మీ కవిత.

    మణి వడ్లమాని

  9. నవ్వుల్లో గుండెలా… చప్పట్ల పసితనంలా… చాలా బాగుంది :)

  10. నన్ను నేను త్యజించుకున్నాను
    నాకైనేను సృజించుకున్నాను
    గుణిస్తూ.. విభజిస్తూ..
    విడదీస్తూ.. కలిపేస్తూ
    గాలిపటంలా ఓ ఆశ
    ఎటు పోతున్నానో తెలియని ఆకాశం
    అకస్మాత్ ఆధారం లా నువ్వు
    దారంగా మలుచుకోవాలని నేను…….ఎందుకోగాని మస్తిష్కాన్ని స్పృశించాయి . … మీ కవిత చాలా బాగుంది

  11. అనుభవాల లోగిలిలో ఆసల పొద్దులు…
    ఆసల ముంగిట అడియాసల నీడలు…

    అడ్డం రూపాన్ని చూపిస్తుంది ….
    జీవితం అర్ధాన్ని రుచి చూపిస్తుంది..

    త్యజిచడం లో అమ్మతనం..
    సృజించడం లో ఆడతనం కనిపిస్తున్నాయ్…అద్భుతః…

    • థాంక్ యూ వంశి …
      ఆశలూ.. అనుభవాలూ కలగలిపిన కాలమే జీవితం అవుతుంది కదా..

  12. దడాల వెంకటేశ్వరరావు says:

    నిన్ను నన్ను గా చూసుకున్నాను కాని నాకు నేనే బందీనయ్యాను
    నన్ను నేను త్యజించుకున్నాను అయినా నాకైనేను సృజించుకున్నాను
    ఆధారంలా ఉన్న నిన్ను దారంగా మలుచుకోవాలనుకున్నాను
    నవ్వుల్లో గుండెలా నువ్వు చిలిపితనపు పసితనంలా నేను
    కొత్త ఆలోచనల విత్తల్లే నువ్వు సంతోషపు క్షణాలు మొలకలేస్తూ నేను

    నాకిలాగే ఇంతవరకే అర్ధమయ్యింది జయశ్రీ నాయుడు గారు

    • ఆలోచనా ప్రవాహం లో ఎంతవరకు ప్రయాణించామన్నదే ముఖ్యం…
      మీ స్పందనకు సంతోషం
      మరి కొన్నాళ్ళకి.. మిగితా లైన్లు మీ ఆలోచనా ప్రవాహానికి అందుతాయని ఆశిస్తాను వెంకటేశ్వర రావు గారు

మీ మాటలు

*