ఏకాంత దేశంలోకి…త్రిపురలోకి వొక సాలిలాకీ!

tripuraవొక రచయిత తన పాఠకుడి జీవితంలోకి ఎంతవరకూ రాగలడు? వాళ్ళిద్దరూ కలిసి సహప్రయాణం – సఫర్ – చేయగలరా? చేస్తే, వొకరికొకరు ఎట్లా అర్థమవుతారు?

          త్రిపురని తలచుకున్నప్పుడు ఈ మూడు  ప్రశ్నలూ నన్ను వుక్కిరిబిక్కిరి చేస్తాయి. త్రిపుర కథల వెంట, ఆయన సృష్టించిన పాత్రల వెంటా నేను సాగించిన ప్రయాణాలు వొక్కోసారి నాకు ప్రశ్నలూ, ఇంకో సారి జవాబులు కూడా! కానీ, ప్రశ్నకీ, జవాబుకీ మధ్య ఇంకో స్థితి కూడా ఏదో వుంది. ఆ స్థితిలోకి నన్ను చాలా సార్లు నెడుతూ వచ్చాడు త్రిపుర. అసలు జీవితంలో అసంబద్ధతకి ఆ స్థితే తల్లివేరు అనుకుంటా.

ఏ వాస్తవికతా నన్ను స్థిరంగా వుండనివ్వని వయసులో నా కంట పడ్డాడు త్రిపుర. ‘స్థిరతా నహీ నహీ” అని ఎందుకో పాడుకుంటున్నప్పుడు –నా పందొమ్మిదో ఏడు దాటాక-మధ్యాన్నపుటెండలో ఉద్వేగంగా  వేగంగా నడుస్తూ పోతున్నప్పుడు అకస్మాత్తుగా అపరిచితుడిలా ఎదురుపడి “ ఇవాళ నీ పేరు అలఖ్ నిరంజన్!” అనేసి వెళ్లిపోయాడు. అప్పటినించీ ఆ పేరు రకరకాలుగా మా మిత్రుల మధ్య నలిగిపోవడం మొదలయ్యింది. మా సమకాలీన అసంబద్ధతకి అలఖ్ నిరంజన్ వొక కొండ గుర్తు అయిపోయాడు. ఆ సమయంలో “అప్పుడే కలలోంచి లేచి కొత్త ప్రపంచాన్ని చూస్తున్న” అనుభూతి త్రిపుర కథలన్నీ!

1

          ఆ మొదటి సారి చదువుతున్నప్పుడు త్రిపుర నిజంగానే కొత్తగా అనిపించాడు. బయటి వాస్తవికత మీద నాలోపల పెరిగిపోతున్న నిరసనకి ఇక్కడో భాష దొరికిందనిపించింది.

“బాల్యం…బాల్యపు అనుభూతులు…బాల్యం నన్ను విరామం లేకుండా మెత్తగా వెంటాడుతుంది. ఏళ్ళు గడిచిన కొలదీ, ఎడారిలాంటి ‘యధార్థం’ గుండెల్లో బలమయిన వ్రేళ్లతో పాటుకుపోయి స్థిరపడ్డ కొలదీ…నా వెనుకనే నీడలా వచ్చి వీపు మీద పచ్చటి వేళ్ళతో తట్టి పిలుస్తున్నారెవరో…జీవితానికి అర్థం లేదు, అంతా శూన్యం అని తెలుస్తున్న కొలదీ, నా పూర్ణ శక్తితో వెనక్కి…వెనక్కి పరుగెడదామనుకుంటాను….తిరిగీ, నా బాల్యంలోకి…క్షణానికీ, క్షణానికీ, క్రియకీ, క్రియకీ సంబంధం లేకుండా బతకడం…..”

ఈ భాష మొదటిసారి విన్నప్పుడు అంతకు ముందు చదివిన బైరాగీ, అజంతా కొంత కొంత గుర్తుకు వచ్చారు కానీ, లోపల పేరుకుపోతున్న శూన్యానికి వాళ్ళెవరూ వచనరూపం ఇవ్వలేదు కదా అన్న అసంతృప్తి వుండేది. పందొమ్మిది దాటి ఇరవైలోకి అడుగుపెడ్తున్న వయసులో, విద్యార్థి ఉద్యమాలూ, కాలేజీల్లో శ్రీశ్రీ వరవరరావుల ప్రసంగాలు ఇంకా చెవుల్లో గింగిరాలు తిరుగుతున్న వేడిలో వచ్చాడు త్రిపుర వొక జెర్కిన్  వేసుకుని…శూన్యాన్ని సఫర్ గా మార్చేస్తూ…!

1980. కొత్త వాస్తవికతని చెప్పడానికి – త్రిపుర భాషలో చెప్పాలంటే- “ఇమేజ్ దొరకడం లేదు.” జీవితంలోంచి “పోయేటిక్ వెదర్” తప్పించుకుంది. బీట్ నిక్స్ కోసం ఎదురుచూపులు. “రూట్ లెస్ ఫెలోస్” గా మారిపోతున్న చెట్లు కూలిపోతున్న దృశ్యం. అవున్నిజమే, “ఎంగ్రీ యంగ్ మెన్” ఇప్పుడు అత్యవసరమనే ఆవేశం. “మాటలు దేన్నీ వ్యక్తపరచలేవు…ఇటుకల్లాగా ప్రాణం లేకుండా కట్టుకుపోతాయి” అన్న భావమూ గట్టిపడుతున్న మనోస్థితి.

అప్పుడొచ్చాడు త్రిపుర…అతని మల్లిపూవు తెల్లని కాయితాల పుస్తకంతో! దాని మీద నల్లని అట్టతో…ఆ అట్ట మీద నిర్వర్ణ ముఖాలతో..! త్రిపుర కథల్ని ఆవురావురుమని చదవలేం. ఆగి ఆగి వొక్కో వాక్యాన్ని చదవాలి. తిరగ తిరగ చదవాలి. మొదట్లో నేను రోజుకో కథ చదివే వాణ్ని. ఆ వాక్యాల్ని మననం చేసుకుంటూ…ఆ భాషలోకి వలసపోతూ చదివే వాణ్ని. చదివిన వాక్యాల వెంట తూనీగలా పరుగులు పెట్టే వాణ్ని. నన్ను క్షణం సేపు నిలవనీయని ఆ పరుగులు కావాలి నాకు.

2

          ఎందుకో తెలీదు బెజవాడ మొగల్ రాజపురం కొండ నాకు చాలా ఇష్టం. ఆ కొండ పక్కనే రెండు గదుల్లో నేను అద్దెకి వుండేవాణ్ణి. నాతోపాటు నా చెల్లి. ఇంటి పక్క కొండపల్లి కోటేశ్వరమ్మ గారూ, ఇంకో పక్క వేణుగోపాలూ, ఇంకో రెండడుగులు వేస్తే డానీ, ఖాదర్, భట్టు గారూ,  మో…సిద్ధార్థ కాలేజీ నించి స్టెల్లా కాలేజీ దాకా సాయంత్రపు నడకలూ…అదీ జీవితం! అలాంటి వొక సాయంత్రం “నీతో నేనూ నడుస్తాను పద..!” అంటూ తోడొచ్చారు త్రిపుర.

“నాకు మాటలు రావేమో!” అన్నాను.

“మాటలు అక్కర్లేదు. వచ్చినప్పుడే రానీ!” అన్నారాయన.

నిజమే…ఇప్పుడొచ్చినన్ని మాటలు అప్పుడు రావు నాకు. అసలు నా నవ్వు తప్ప నా గొంతు వినని వాళ్ళు చాలా మంది వుండే వాళ్ళు అప్పుడు.

“Do you know you’ve a pleasant voice and a singer’s face?!” అన్నారాయన.

“నేనేమిటో నాకు ఇంకా తెలీదు!” అన్నాను సిగ్గుపడుతూ. నా ఇరవయ్యో  ఏడు అమాయకత్వం!

అలా కొన్ని సాయంత్రాలు నడిచాక ఆయన వెళ్ళిపోయారు, “మనం ఉత్తరాలు రాసుకుంటున్నాం!” అని ఇద్దరి తరఫునా డిక్లేర్ చేసేసి!

కాగితాల మీద చూసిన త్రిపురకీ, ఎదురుగా నిలిచిన/ తోడుగా నడిచిన త్రిపురకీ పెద్ద తేడా లేదు. ఆ ఇద్దరూ వొక్కటే అవడం నాకు చాలా ఆశ్చర్యం.

అలా ఆయన వెళ్ళిపోయిన ఆ రాత్రి నించి మరికొన్ని రోజులు త్రిపుర కథలు చదువుతూ కూర్చున్నా. నాకు త్రిపుర తెలుస్తున్నాడో లేదో తెలియడం లేదు! నాకు చాలా తెలియడం లేదు అని మోనోలాగ్ తో నన్ను నేను కొన్ని రోజులు త్రిపురాక్షరాల అద్దంలో నిలబడి తల దువ్వుకొని కొన్నిసార్లూ దువ్వుకోకుండా కొన్ని సార్లూ అడుక్కుంటూ వుండిపోయా. యవ్వనం చాలా desperate గా వుంటుంది కొన్ని సార్లు. అప్పుడు త్రిపుర నాలోని ఆ desperate mood లోకి ప్రవేశించే వాడు.

అప్పుడే మళ్ళీ కామూ వొకడు నా ప్రాణం తోడేయడానికి! “ఒరేయ్…వాడు నీ చమడాలు తీసేస్తాడ్రా…” అని ‘మో’ బెదిరింపులు. కామూ The Myth of Sisyphus చదువుకుంటూ…గడిపిన రాత్రుల్లో త్రిపుర కూడా!

In a universe that is suddenly deprived of illusions and of light, man feels a stranger. His is an irremediable exile…this divorce between man and his life, the actor and his setting, truly constitutes the feeling of Absurdity.

ఏమిటీ Absurdity లో ఆ A capitalize అయిపోయి నా అస్తిత్వాన్ని నన్నూ కడిగి ఉతికి పారేస్తూ…గది ముందు దండేనికి వేలాడుతున్న చొక్కాలా నేను!

3

Nothing happens, nobody comes, nobody goes; it’s awful!

ఇంకో పదేళ్ళకి చాలా అమాయకంగా ఆ Samuel Becket వాక్యం దుప్పట్లా కప్పేసుకునే human condition.  “…అర్థరాత్రి స్వప్నాల్లో …ఆ కనిపించని ద్వారం తెరుచుకుంటుంది. ఎవరో పచ్చటి వేళ్ళతో తట్టి లేపుతారు. లోపలకు వెళ్తావు. తలుపు మూసుకుంటుంది. చప్పుడు చేయదు. అప్పుడే సీజర్, జీసస్…..జూడాస్ కూడా!”

త్రిపుర పాత్రలు సృష్టించాడా? లేదు. అవి నా బహురూపాలు. నా భిన్న ముఖాలు. నా వొక్కో ముఖాన్ని వొలిచి వాటికి వేరే పేర్లు పెట్టాడు త్రిపుర.

త్రిపుర వేరే జీవితం చెప్పాడా కథల్లో? కాదు. అది నేను జీవించే జీవితమే. నేను జీవిస్తున్నాను అని చెప్పుకోడానికి నిరాకరించే జీవితం!

అందుకే –

త్రిపుర నిష్క్రమించడు. వొక కనిపించని ద్వారం తెరిచి అందులోంచి మనల్ని ప్రవేశపెట్టి, కాసేపు మన సంభాషణకి మనల్ని వదిలేసి వెళ్లిపోయాడు ఇదిగో ఇక్కడి దాకే!

వచ్చేస్తాడు ఏదో వొక క్షణం, ఇక్కడే వున్నట్టుగా!

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. sreedhar parupalli says:

    త్రిపుర కథల్ని ఆవురావురుమని చదవలేం. ఆగి ఆగి వొక్కో వాక్యాన్ని చదవాలి. తిరగ తిరగ చదవాలి. మొదట్లో నేను రోజుకో కథ చదివే వాణ్ని. ఆ వాక్యాల్ని మననం చేసుకుంటూ…ఆ భాషలోకి వలసపోతూ చదివే వాణ్ని. చదివిన వాక్యాల వెంట తూనీగలా పరుగులు పెట్టే వాణ్ని. నన్ను క్షణం సేపు నిలవనీయని ఆ పరుగులు కావాలి నాకు. Goppa Nivaali Afsar.

  2. Allam Rajaiah says:

    ఏ ఏదో గుర్తులేదు గాని రాఘోతం రెడ్డి నేను మా గురు గారు కాళీపట్నం రామారావు గారు Tripura దగ్గరికి వెళ్ళాము Ayana నాకు ఎప్పటినుంచే తెలిసినట్టుగా ఉన్నాడు మేమిద్దరమూ మా ఫ్యాక్టరీ లో పని చేసే వారి బందవు జోగా రావు గురించి మాట్లాడుకున్నాము. లోలోపల రగిలే అనిచిత అసంద్ర్బ అల్లకల్లోల స్థితుల రాయడానికి ప్రయత్నమూ ….రెందోప్రపంచాయుద్దము ఆ గ్లుమినేస్స్నుండి ప్రపంచం చాల ముందుకు ముక్యంగా ఆలోచనలు ఎక్కడినున్చివస్థాయి ఆచరణ విరుద్యాలు తేటతెల్లము అయినయికడ అన్నాను నేను
    Varithoo …నిశబ్దంగా చుట్టుముగే మబ్బులఅఖసము వెయిటింగ్ ఫర్ గోడో.

  3. srinivasu Gaddapati says:

    ఆ భాషలోకి వలసపోతూ చదివే వాణ్ని. చదివిన వాక్యాల వెంట తూనీగలా పరుగులు పెట్టే వాణ్ని. నన్ను క్షణం సేపు నిలవనీయని ఆ పరుగులు….త్రిపుర నిష్క్రమించడు. వొక కనిపించని ద్వారం తెరిచి అందులోంచి మనల్ని ప్రవేశపెట్టి, కాసేపు మన సంభాషణకి మనల్ని వదిలేసి వెళ్లిపోయాడు ఇదిగో ఇక్కడి దాకే!

  4. Krishna Keerty says:

    త్రిపుర పాత్రలు సృష్టించాడా? లేదు. అవి నా బహురూపాలు. నా భిన్న ముఖాలు. నా వొక్కో ముఖాన్ని వొలిచి వాటికి వేరే పేర్లు పెట్టాడు త్రిపుర.

    గ్రేట్ అఫ్సర్. మొత్తం అంతా నచ్చినా పై వాక్యాలు చాలా నచ్చాయి

  5. mercy margaret says:

    త్రిపుర గారి గురించి మీ మాటల్లో చదువుతుంటే నిజంగానే ఎవరో పచ్చటి వేళ్ళతో తట్టి లేపుతున్నటుంది .ఆయన సాహిత్యం మిమ్మల్ని ఎంతగా ప్రభావితం చేసిందో అర్ధమవుతూనే నాలాంటి వాళ్లకి ఇంకా ఆయన రచనల్లోని వైవిధ్యాన్ని గురించి తెలుసుకోమని చెబుతున్నట్టుగా ఉంది .

  6. అఫ్సర్జీ, చాలా బాగా రాసారండి.

    “కాగితాల మీద చూసిన త్రిపురకీ, ఎదురుగా నిలిచిన/ తోడుగా నడిచిన త్రిపురకీ పెద్ద తేడా లేదు. ఆ ఇద్దరూ వొక్కటే అవడం నాకు చాలా ఆశ్చర్యం.”
    ఇలా చాలా తక్కువ మంది ఉంటారండి..

    “అప్పుడే కలలోంచి లేచి కొత్త ప్రపంచాన్ని చూస్తున్న అనుభూతి త్రిపుర కథలన్నీ!”
    చిన్నప్పుడు ఏం చదివానో తెలీదు కానీ ఇప్పుడు చదువుతుంటే మళ్ళీ కొత్తగా…
    నెమ్మది నెమ్మదిగా చదువుతు అర్థo చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నా..

  7. త్రిపుర గారి పుస్తకాన్ని మొదటిసారిగా చదవడం మొదలెట్టి ఏడాది అవుతోంది. ఆ గాఢమైన కధల్ని అర్ధంచేసుకోడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ ఈ ఏడాది కాలంగా ఈ క్రింది వాక్యాలు గుర్తుచేసుకోని రోజు బహుశా లేనే లేదు.
    “బాల్యం…బాల్యపు అనుభూతులు…బాల్యం నన్ను విరామం లేకుండా మెత్తగా వెంటాడుతుంది. ఏళ్ళు గడిచిన కొలదీ, ఎడారిలాంటి ‘యధార్థం’ గుండెల్లో బలమయిన వ్రేళ్లతో పాటుకుపోయి స్థిరపడ్డ కొలదీ…నా వెనుకనే నీడలా వచ్చి వీపు మీద పచ్చటి వేళ్ళతో తట్టి పిలుస్తున్నారెవరో…జీవితానికి అర్థం లేదు, అంతా శూన్యం అని తెలుస్తున్న కొలదీ, నా పూర్ణ శక్తితో వెనక్కి…వెనక్కి పరుగెడదామనుకుంటాను….తిరిగీ, నా బాల్యంలోకి…క్షణానికీ, క్షణానికీ, క్రియకీ, క్రియకీ సంబంధం లేకుండా బతకడం…..”

    ఎందుకంటే ఈ వాక్యాలు అతికినట్టు సరిపోతున్నాయి.

  8. త్రిపుర గారి గురించిన మీ ప్రతి వాక్యం ఎంతో సున్నితంగా వేలుపట్టుకుని పరిచయం చేస్తోంది అఫ్సర్జి
    ఆ పుస్తకాలు తప్పని సరిగా చదివి తీరాలని అనిపిస్తోంది..

  9. సాయి పద్మ says:

    There is no room

    For the sameness

    The routine..

    The soliloquy

    Stranded like a dew drop

    Unfazed by any

    Cyclonic emotions..

    Everything stopped still

    For you .. ఎప్పుడో నేను రాసుకున్న సోలిలాకీ టేల్స్ కవిత గుర్తు వచ్చింది అఫ్సర్ జీ.. ఒక్క్కొక్క మొహాన్నీ నింపాది మరణం లా కాకుండా , మనమే వలిస్తే వచ్చే భావం త్రిపుర కధలు . లోపలి మోహానికీ , మనకీ తేడా లేనట్టు ( మీరు వర్ణించిన త్రిపుర లా .. ) ఉంటె కలిగే సంతోషం .. లేకపోతే కలిగే ఉదాసీనత రెండూ ఒకేసారి చుట్ట్టుముట్టే తట్టు రాసేరు వ్యాసం .. ఇంత గొప్ప సాహితీ కారులని కలిసి సాయంత్రాలు కలబోసుకున్న మిమ్మల్ని చూస్తే , ఈర్ష్య, గర్వం రెండూ ఒకేసారి వస్తాయి ..

  10. సాయి పద్మ గారూ, బాగా చెప్పారు. అఫ్సర్, నాయుడు తదితర మితృలంటే నాక్కుడా చాల అసూయ. FB లో నరేష్ పోస్టుకు స్పందిస్తూ అనుకుంటా ఇప్పటికే అనేశానది. ‘అలఖ్ నిరంజన్’ పరిచయం కాగానే వావ్ అనిపించాడు. ఉండిపోయాడు లోలో సవాల్ చేస్తో . మంచి మెమోయిర్ అఫ్సర్.

  11. nishanth says:

    అఫ్సర్ గారు త్రిపుర మీద జ్ఞాపకాలు,కథలపై నైరూప్య అనుభూతులు తప్ప కథలపై విశ్లేషణ చేసిన వారు ఒక్కరు లేరు.త్రిపుర గారు ఘాడంగా ఫీలైన అబ్సర్డిటీ కి ఇదీ ఓ రుజువేమో.జీవితం అబ్సర్డ్ అనుకున్నవారు,గమ్యం లేని ఎదురుచూపు ,అన్వేషణ అనుకున్నవారు ,దేముడు మరణిస్తే అన్నీ సాధ్యమే,మంచి చెడుల వివేచనా మృగ్యం,ఎథిక్స్,నీతి నియమాలు భూమిక లేనివని బావించే వారు చిరు సమస్యలకే అల్లాడి పోవడం,సుఖమయ ఏకాంతంలో అపురూప మానవులుగా భావించుకు బతుకు రుచులన్నీ అనుభవిస్తూ ఉత్తమ వ్యక్తులుగుల కీర్తించా బడటం ఎంత అబ్సర్డ్.లోకంలోని చెడు మీద నిస్పృహలోంచి ఈ ఆరాధనలేమో.

  12. Sreedhar Parupalli says:

    త్రిపుర కథల్ని ఆవురావురుమని చదవలేం. ఆగి ఆగి వొక్కో వాక్యాన్ని చదవాలి. తిరగ తిరగ చదవాలి. మొదట్లో నేను రోజుకో కథ చదివే వాణ్ని. ఆ వాక్యాల్ని మననం చేసుకుంటూ…ఆ భాషలోకి వలసపోతూ చదివే వాణ్ని. చదివిన వాక్యాల వెంట తూనీగలా పరుగులు పెట్టే వాణ్ని. నన్ను క్షణం సేపు నిలవనీయని ఆ పరుగులు కావాలి నాకు. అఫ్సర్ రాసిన ఈ మాటలు అనేక పర్యాయాలు అనుభవ పూర్వకం. త్రిపుర కథలు ఇన్స్టంట్ కథల్లా వుండవు. భావ సాంద్రతని అర్థం చేసుకోవటానికి అఫ్సర్ కే టైం పడితే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? త్రిపుర ని ఎంత మంది అక్షర ప్రేమికులు తలచుకుంటున్నారు? త్రిపుర ఆఖరి నిష్క్రమణం పై అఫ్సర్ అక్షర నివాళి అద్భుతం.

  13. kamaraju pulugurtha says:

    with a reference to your write-up on Malathi Chandur.I feel that she wielded a greater influence on our generation.There were days when she became a certain trend.Her answers in Prabha had a regular fan following.She used to publish critical summaries of novels also.It was due to her influence I had read Rebecca and Tess.She was a feminist of sorts.Unfortunately, the great writers of those days were gone because of the general degeneration in the society,with the advent of TV and Chiranjeevi.

  14. విలాసాగరం రవీందర్ says:

    త్రిపుర గారి గురించి గొప్పగా చెప్పారు

  15. Venu udugula says:

    Great writ up Anna

Leave a Reply to తృష్ణ Cancel reply

*