ప్రయాణం

lingareddiఅప్పుడప్పుడే తూర్పురేఖలు విచ్చుకుంటున్నాయి. చీకటి పూర్తిగా తొలిగిపోకుండా నల్లటి మబ్బులు బాల భానునిమీద కొంగులా కప్పుతున్నాయి.  సికిందరాబాద్‌ రైల్వేస్టేషన్‌ రణగొణ ధ్వనులతో కోలాహలంగా వుంది. వస్తున్నవాళ్ళు,  పోతున్నవాళ్ళు ఒకర్నొకరు తోసుకుంటూ హడావుడిగా నడుస్తున్నారు. రైళ్ళకోసం వేచివున్నవాళ్ళు వచ్చిపోయే రైళ్ళను చూసు కుంటూ వాళ్ళ వాళ్ళ సంభాషణల్లో మునిగి తేలుతున్నారు. రైళ్ళ రాకపోకల గురించి హిందీ, ఇంగ్లీషు, తెలుగు మూడు భాషల్లో శ్రావ్యమైన గొంతుతో అనౌన్సర్‌ అదే పనిగా చెప్తూవుంది. ఒకటో నంబర్‌ ఫ్లాట్‌ఫాం మీద కొడుకును సముదాయించడానికి శ్రీధర్‌ నానా అవస్థలు పడుతున్నాడు.

”నిన్ను వదిలేసి మేమెప్పుడైనా సమ్మర్‌టూరు వెళ్ళామా? ఇప్పుడు నేను ట్రైనింగ్‌కు వెళ్తున్నానని నిన్ను వద్దంటున్నాను,” అన్నాడు శ్రీధర్‌.
అయినా యశ్వంత్‌ మారాం ఆపడం లేదు.
”చెప్తే వినవా? నీ గొడవ నీదేనా? పద్నాలుగేండ్లు వచ్చినయి.కొంచెమన్నా అర్థం చేసుకోవా?” తల్లి శోభకోపంతో కసురుకుంటోంది.
”నువ్వెప్పుడూ ఇంతే. నాకు మాత్రం ఢిల్లీ చూడాలని వుండదా?”అంటూ ఏడ్వడం మొదలుపెట్టిండు యశ్శు.
కొడుకును దగ్గరకు తీసుకొని భుజంచుట్టు చేతులు వేసి నెమ్మదిగా బ్రతిమాలసాగిండు శ్రీధర్‌. బాధ, నిస్సహాయత అతని ముఖంలో కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నాయి. ఇంతలో,
”హైదరాబాద్‌సే నయిదిల్లీ జానేవాలీ రాజధాని ఎక్స్‌ప్రస్‌ ఏక్‌ నంబర్‌ ఫ్లాట్‌ఫాం పర్‌ ఆ చుకీ హై” అని అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. అది విన్న శ్రీధర్‌ హడావుడిగా ట్రాలీ సూటుకేసును లాక్కుంటూ, ఎయిర్‌బ్యాగ్‌ని భుజానికి తగిలించుకొని ఎస్‌ సిక్స్‌కేసి నడవసాగిండు. కొడుకు చేయిపట్టుకొని నడిపించుకుంటూ వెనుకాలే వచ్చిన శోభ, ఎయిర్‌బ్యాగ్‌ని శ్రీధర్‌
దగ్గరనుంచి తీసుకొని ముందుకు నడవసాగింది.
బోగీలోకి వెళ్ళిన శ్రీధర్‌ పర్స్‌లోంచి రిజర్వేషన్‌ టికెట్స్‌ తీసి, బెర్తు నంబర్లు సరిచూసుకొని ట్రాలీ సూటుకేసుని సీటుకిందకు తోసే ప్రయత్నం చేసిండు.
”హేయ్‌! గట్టిగా నెట్టకు.సూటుకేసు చినుగుతది” అంది శోభ.
”మరెట్లా? ఈ ట్రావెల్‌ఎజెంట్లకు చెప్తే ఇదేగోల. ఎప్పుడూ ఈ సింగిల్‌సీటర్సే ఇస్తరు”అంటూవిసుక్కున్నడు.
” ఆ త్రీ సీటర్‌ కిందకు పెట్టు. వాళ్ళు వచ్చినప్పుడు ఇటు పెట్టుకోమందాము” అని శోభ అనగానే అదేఆలోచనతో వున్న శ్రీధర్‌ సూటుకేసును ఆ సీటుకిందకు నెట్టి చైన్‌తో లాక్‌చేసి, ‘హమ్మయ్య’ అనుకుంటూ వెనక్కు తిరిగేసరికిముఖం మాడ్చుకొని సింగిల్‌సీటులో ముభావంగా కూర్చున్న యశ్వంత్‌ కనిపించాడు. ఒక్కసారిగా గుండె పిండినట్లయి, దగ్గర
కు పోయి యశ్శూ భుజంమీద చేయివేసి,”నెక్స్ట్‌ టైమ్‌ తప్పకుండా నిన్ను కాశ్మీర్‌ తీసుకెళ్తాను. ఈ ఒక్కసారికి అమ్మమ్మతో వుండు, ప్లీజ్‌,” అన్నాడు.
తండ్రి చూపించిన ప్రేమకు ఒక్కసారిగా  యశ్శు ఏడుస్తూ,
”నాకు కిటికీ పక్కన కూర్చొని రైలు ప్రయాణం చేయడం చాలా ఇష్టం నాన్నా!” అన్నాడు.
అసలే భారంగా వున్న వాతావరణం మరింత వేడెక్కింది. కొడుకు తపనను గమనించిన శోభ ఒక ఉద్విగ్న మానసిక స్థితికి లోనై యశ్శూని గుండెలకత్తుకొని,
”ప్రామిస్‌ యశ్శూ! నిన్ను తీసుకెళ్ళకుండా ఇంకెప్పుడూ వెళ్ళం. సరేనా?” అంటూ సముదాయించింది.
పరిస్థితి కొంచెం తేలికపడుతున్న సమయంలో హడావుడిగా జనం బోగీలోకి రావడం మొదలయ్యింది. ఇద్దరు చిన్న పిల్లలు,చంకలో మరో పిల్లాన్ని ఎత్తుకున్న భార్య వెంటరాగా ఒక మధ్యవయస్కుడు భారీ లగేజీతో వీళ్ళున్న కంపార్ట్‌మెంట్‌లోకి వచ్చిండు. అతని వాలకం చూస్తే మొత్తం సంసారాన్నే వెంటతీసుకొచ్చినట్టుంది. వస్తూ, వస్తూనే చిరాగ్గా,
”యే సూటుకేస్‌ కిస్‌కా హై? యహాసే నికాల్‌దో” అంటూ శ్రీధర్‌ వైపు చూశాడు.
”ఆ.. అది సూటుకేసు ఇక్కడ పట్టటంలేదు. అందుకని అక్కడ పెట్టాము. మీవి చిన్న సూటుకేసులే కదా!
ఇక్కడ పెట్టుకోండి” అని శ్రీధర్‌ ముగించే లోపునే,
”లేదు. అట్లా కదరదు. నేను, నాకుటుంబం, నా లగేజి అంతా ఒకే చోట వుండాలి. ఇక్కన్నుంచి తీసెయ్‌.
ఎక్కడ పెట్టుకోవాలనేది నీ సమస్య. నాకేంది?” అంటూ చాలా రాష్‌గా సమాధానమిచ్చిండు. మనిషిలో ఎక్కడా సున్నితత్వంలేదు. హైదరాబాద్‌లో సెటిలయిన మార్వాడిలా వచ్చీ రాని తెలుగులో మాట్లాడుతున్నడు. తెల్లని పైజామా మీద కాషాయ రంగు చారలున్న లాల్చీ ధరించివున్నాడు. వెడల్పయిన గుండ్రటి ముఖం, చిన్న కళ్ళు, ముందుకొచ్చిన పొట్ట, నోట్లో కిల్లీతోఎర్రగా పూసిన పెదవులు, అసలే ఓ మాదిరిగా నవ్వు తెప్పించే విధంగావున్న మనిషి ఆ హైరానా వల్ల మరింత వింతగా కనిపిస్తున్నాడు.అటు ఇటు తిరుగుతున్న ప్రయాణీకులతో బోగీ రద్దీగావుంది. దానికితోడు ఈ ఇద్దరు పిల్లల ఎగురుడు దుంకుడుతోఆ ప్రాంతం కూరగాయల మార్కెట్టును తలపిస్తోంది.
” చాలా దూరం పోవాలి కదా! కొంచెం సహకరించండి” అని శోభ ఏదో అనబోయే లోపునే,
”ఏం?మీకుకాదా చెప్తుంటే.”అంటూ చాలా అమర్యాదగా సూటుకేసును కాలితోతన్ని,జరిపే ప్రయత్నం చేశాడు. శ్రీధర్‌ అదాట్నలేసి”ఎక్కువ మాట్లాడకు.తీస్తానుండు”అని చైన్‌లాక్‌తీసి బర్రున సూటుకేసు తనవైపు లాక్కున్నాడు.ఇంతలో”హైదరాబాద్‌సే నయిదిల్లీ జానేవాలీ రాజధాని సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏక్‌ నంబర్‌ ఫ్లాట్‌ఫాంసే రవాణా హోనేకే లియే తయ్యార్‌ హై” అని అనౌన్సర్‌ శ్రావ్యంగా చెప్పింది.
”అమ్మా! ట్రైన్‌ కదులతది. నువ్వు యశ్శూను తీసుకొని ఇంటికెళ్ళు” అంటూ తల్లిని పురమాయించి, కొడుకునుదిటి మీద ముద్దు పెట్టింది శోభ.యశ్వంత్‌ లేచి కదలబోతుంటే,
”నాన్నకు బై చెప్పవా?” అంటూ కొడుకుకు కర్తవ్య బోధ చేసింది.
”డాడీ! బై” అంటూ యశ్వంత్‌ అమ్మమ్మతో కలిసి రైలు దిగి వెళ్ళిపోయిండు
సూటుకేసును ఏమి చేద్దామా అని మధనపడుతుంటే,
”శ్రీధర్‌! ఈ రెండు సీట్లు పరిచి సూటుకేసు దీనిమీదికి ఎక్కిద్దాము. మనమెట్లాగో సర్దుకొని కూర్చుందాము”
అని పరిష్కారం చూపించింది శోభ. పెళ్లయిన గత పదహారు సంవత్సరాలుగా శోభ శ్రీధర్‌ని పేరు పెట్టే పిలుస్తుంది. పెళ్ళికంటే ముందే ఇద్దరికి పరిచయం ఉండడం వల్లనో, ఆమెకున్న మితిమీరిన ఆత్మాభిమానం వల్లనోగాని అందరి ఇండ్లల్ల పిలిచినట్టు ‘ఏమండీ’ అని ఆమె ఎన్నడూ పిలువలేదు. ప్రగతిశీల భావాలున్న శ్రీధర్‌ ఆమె అట్లా పిలువడాన్ని ప్రోత్సహించాడే తప్ప ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు.
మధ్యతరగతి కుటుంబంనుంచి వచ్చిన శోభకు ఆత్మాభిమానం ఎక్కువ. ఏలోటులేకుండా పెంచిన తల్లిదండ్రులు, మంచిహోదా ఆర్థిక పరిపుష్ఠి కలిగిన భర్త, తనూ విద్యాధికురాలై వుండడం ఆమెలో ఆత్మాభిమానాన్ని మరింత ఇనుమడింప చేశాయి. ఎప్పుడూ నిండుగా చీర కట్టుకునే శోభ ప్రయాణాల్లో సౌకర్యంగా వుంటుందని పంజాబీ డ్రస్సు వేసుకుంది. మంచి ఎత్తు, కోల ముఖంలో కొట్టొచ్చినట్టు కనబడే చక్కటి ముక్కు, చిన్న నోరు, దొండపండులాంటి సన్నని పెదవులు ఎవరైనా ఒక్కసారి చూస్తే గుర్తుండిపోయేలా వుంటుంది శోభ. కాని, ఇప్పుడు ఆమెలో ఆ ఆత్మవిశ్వాసపు వెలుగుమీద నల్లటిమబ్బేదో కమ్మినట్టు అనిపిస్తోంది.
కనిపించినదాకా కొడుకుకు బై చెప్పుతున్నట్టుగా చెయ్యూపిన శ్రీధర్‌, రైలు వేగాన్ని అందుకోవడంతో వెనక్కి ఒరిగి కూర్చున్నాడు. రైలుతో పోటీ పడుతున్నట్టుగా శ్రీధర్‌ ఆలోచనలు వెనక్కి పరుగెత్తసాగాయి. తన ఆరోగ్యం సంగతి కొడుకుకు తెలవకూడదన్న కారణంగా యశ్శూని విడిచి వెళ్తున్నాడు. కొడుకన్నా, భార్యన్నా శ్రీధర్‌కు ఎనలేని ప్రేమ.తన అనారోగ్యం
బయటపడినప్పటినుంచి అది మరింత పెరిగి ఒక పతాక స్థాయికి చేరింది. స్వతహాగా కవి అయిన శ్రీధర్‌ బాధను వ్యక్తీకరించడానికి కవిత్వాన్ని ఆశ్రయిస్తాడు కాని, ప్రేమనెట్లా వ్యక్తీకరించాలో అతనికి తెలియదు.
ఉగాది అంటే అమితంగా ఇష్టపడే శ్రీధర్‌ జీవితంలో ఆ ఉగాది మిగిల్చిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఆరోజు కలెక్టర్‌తో పాటు జిల్లా యంత్రాంగమంతా పాల్గొంటున్న ఉగాది ఉత్సవాల్లో భాగంగా కవి సమ్మేళనం నిర్వహిస్తున్న శ్రీధర్‌ సెల్‌ మోగింది. ‘హల్లో’ అన్న శ్రీధర్‌ అవతలి వైపునుంచి అందిన పిడుగులాంటి వార్తకు నిలువెల్లా క్రుంగిపోయాడు. అయినా తన్ను తాను నిలువరించుకొని, సమావేశం ముగించుకొని ఇల్లు చేరాడు. గడపలో అడుగు పెట్టగానే శోభకు విషయం తెలిసిపోయిందనే సంగతి శ్రీధర్‌కు అర్థమైంది. అణుబాంబు పడ్డప్పటి నాగసాకిలా వుంది ఆమె పరిస్థితి. ద:ఖానికి, బాధకు అతీతమైన ఒక అవ్యక్త విషాదం ఆమె మఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. చడీచప్పుడు కాకుండా స్నానం ముగించుకొని, విస్కీ పెగ్‌ కలుపుకొని వచ్చి టీపాయ్‌ మీద కాళ్ళు చాపి కూర్చొని, టీ.వి. చూస్తూ ఒక్కొక్క గుక్క చప్పరించసాగాడు. ఇంతలో, మిన్ను విరిగి మీద పడ్డట్టు
”నేనింత బాధతో, దు:ఖంతో కాలిపోతుంటే నువ్వు నింపాదిగా మందు తాగుతావా?” అంటూ విరుచుకు పడింది శోభ.
” ఏం చేయమంటావు నన్ను?” అంటూ నిర్లిప్తంగా సమాధానమిచ్చాడు శ్రీధర్‌.
నిజానికి శోభ దగ్గర కూడా ఈ ప్రశ్నకు సమాధానం లేదు. కాని, తను అందంగా నిర్మించుకున్న కలల గూడు ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయినప్పటి  ఒక హిస్టీరిక్‌ ఆవేశం ఆమెను ఆవహించింది. రెండు చేతుల్తో తల కొట్టుకుంది, అతన్ని కొట్టింది, తలను గుండెలకత్తుకొని ముద్దు పెట్టుకుంది. విచిత్ర ప్రవర్తనతో ఆవేశం చల్లారే దాకా ఏడుస్తూనే
వుంది. రెండో పెగ్‌ పూర్తిచేసిన శ్రీధర్‌”ప్రాణం పోయేది నాది కదా! నా కంటె నువ్వే ఎందుకు ఎక్కువ రియాక్టు అవుతున్నావు?” అన్నాడు. ఆ ప్రశ్న అడిగిన శ్రీధర్‌ వైపు పిచ్చిదానిలా చూసింది. హఠాత్తుగా లేచి వచ్చి శ్రీధర్‌ ఒడిలో తలవాల్చింది. ఏడ్చింది, గొణిగింది.
”అదేదో నాకొచ్చినా బాగుండేది” అంటూ స్వగతంగా అనుకుంటున్నట్టు పలవరించింది. ఎప్పుడో సంవత్సరం కింద ఛాతిలో నొప్పివస్తే ఇ.సి.జి., టి.యం.టి తో పాటు రొటీన్‌ పరీక్షలన్ని చేయించుకున్నడు శ్రీధర్‌. దాంట్లో హీమోగ్లోబిన్‌ చాలా ఎక్కువగా వున్నట్టు తేలింది. కొన్నాళ్ళపాటు ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకున్న శ్రీధర్‌, డాక్టర్‌ సలహామేరకు ‘జాక్‌2’
అనే పరీక్ష చేయించుకున్నడు. ఉగాది రోజు ఫోన్‌లో విన్న పిడుగుపాటి వార్త ఈ ‘జాక్‌2’ పాజిటివ్‌ అనేదే. ‘జాక్‌2’ పాజిటివ్‌ అంటే ఎర్ర రక్తకణాల్లో కాన్సర్‌ సంబంధమైన జబ్బు వుండడంవల్ల హీమోగ్లోబిన్‌ పెరింగిందని అర్థం. దానికి సంబంధించినఅత్యుత్తమ సలహా ఆలిండియా మెడికల్‌ సైన్సెన్‌లో దొరుకుతుందనే ఆశతో శ్రీధర్‌ ఢిల్లీకి పయనమయ్యాడు. ఈ ప్రయాణంముఖ్యంగా శోభ వత్తిడిమేరకే జరిగింది. ఎండమావులని తెలిసినంక ఎంత దూరం పరుగెత్తితే మాత్రం లాభమేముంటుందనేనిర్వేదంలో శ్రీధర్‌ వున్నాడు. అతని మెదడునిండా తన తర్వాతి కాలంలో తన భార్యాబిడ్డలకు సంబంధించిన ఆలోచనలే ముసురుకుంటున్నాయి. పేదగ్రామీణ, నిరక్షరాస్య కుటుంబంనుంచి తను ఎదిగొచ్చిన ప్రస్థానాన్ని మననం చేసుకుంటున్నాడు.
ఈ ప్రయాణం ఇంత త్వరగా ముగిసే పరిస్థితి ఏర్పడుతుందని అతనెన్నడూ ఊహించలేదు. అతని ఆలోచనల ధారలాగానేబయట కూడ హోరున వర్షం కురుస్తోంది. ఎండాకాలపు ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వానకు కిటికీలు దించి ప్రయాణీకులు ఎవరికి వాళ్ళు మాటల్లో పడిపోయారు. అప్పుడు హఠాత్తుగా,”మేరా బచ్చా, హే భగవాన్‌! క్యా హువా మేరే బచ్చేకో?” అంటూ పక్కనున్న మార్వాడి ఏడుపు లంఘించుకుంది. అప్పటిదాకా తల్లి చంకలోవున్న పిల్లవాడు మెడకాయ తెగిన కోడిలా కాళ్ళు, చేతులు కొట్టుకుంటున్నడు. తండ్రి పిల్లవాన్ని తీసుకొని సీటుమీద పడుకోబెట్టి కాళ్ళు, చేతులు రాయసాగిండు.
”శ్రీధర్‌! ఆ పిల్లాడికి ఫిట్స్‌ వొస్తున్నయి” అంది శోభ. అతను ఏమీ మాట్లాడకపోయేసరికి, భుజం తట్టి
”శ్రీధర్‌!” అంటూ మళ్ళీ పిలిచింది. నిద్రలోంచి మేల్కొన్నవాడిలా శ్రీధర్‌ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. తలతిప్పిచూసేసరికి శ్రీధర్‌కి పరిస్థితి అర్థమయ్యింది. వెంటనే లేచి సూటుకేసుని సీటుమీద పడుకోబెట్టి ”శోభా! తాళాలివ్వు” అన్నాడు.
శోభ సూటుకేసు తాళం తీయగానే తన ఎమర్జెన్సీ కిట్‌ని బయటకు తీసి వెదకసాగాడు.
”ఫిట్స్‌ ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చినయా, ఇదే మొదటిసారా?” అని తల్లిని అడిగింది శోభ. స్త్రీగా పిల్లల మీద సహజసిద్ధంగా వుండే ప్రేమవల్ల, తన సహజ ప్రవర్తనలో భాగంగా అట్లా అడిగింది శోభ.
”రాలేదు, అయినా నీకెందుకు?” అని కసురుకుంది మార్వాడి ఆమె. శోభ ముఖం ఒక్కసారి కందగడ్డలామారిపోయింది. పుణ్యానికి పోతే పాపమెదురవ్వడం అంటే ఇదేనేమో? అనుకుంది. దాంతో శ్రీధర్‌కు కూడ విపరీతమైన కోపము, చిరాకు కలిగాయి,అయినా తమాయించుకొని బ్యాగులోంచి రెండు టాబ్లెట్లు తీసి, పిల్లవాడి తండ్రిని ఉద్దేశించి
”చూడు, పిల్లవాడికి ఫిట్స్‌ వస్తున్నయి. ఈ టాబ్లెట్‌ పెడితే తగ్గిపోతయి. పెట్టమంటావా?”అన్నాడు. ఆందోళనలోవున్న తండ్రి సరేనన్నట్టుగా తలవూపాడు. శ్రీధర్‌ చేతులకు గ్లౌజు తొడుక్కొని ఒక టాబ్లెట్‌ తీసి పిల్లవాడి ముడ్డిలోపెట్టాడు.
రెండు నిమిషాల్లో ఫిట్స్‌ తగ్గి పిల్లవాడు అచేతనమైండు.
”కండ్లు మూసిండు. కాళ్ళు చేతులు ఆడుతలేవు. ఏంకాదా?” భయంతో,ఆందోళనతో అడిగిండు తండ్రి. కంపార్టుమెంటులోని చాలా మంది ప్రయాణికులు అప్పటికే అక్కడికి చేరుకొని తలొక మాట మాట్లాడ సాగారు. ఇంతలో ఒకామె కలుగచేసుకొని,
”ఫిట్సు తగ్గినంక కొంతసేపు అట్లనేవుంటరు.ఏంగాదు. నా కొడుకుకు కూడ గిట్లనే వచ్చేటివి”అంది. శ్రీధర్‌పిల్లవాడి నాడి చూసిండు. నుదురు మీద చెయ్యిపెట్టి జ్వరం చూసిండు. ఛాతిమీద చెయ్యిపెట్టి గుండె పరీక్షించిండు. పొట్టమీద గిచ్చి కదులుతండా లేడా అని చూసిండు. పిల్లవాడు కొంచెం చేయి కదిపిండు.
”జ్వరం చాలా వుంది. తడిగుడ్డ పెట్టి ఒళ్ళంతా తుడవండి” అని తల్లిని పురమాయించిండు. తల్లి తుడవడం మొదలు పెట్టగానే పిల్లవాడు కండ్లు తెరిచి చూసిండు. బిడ్డ బతికిండన్న సంతోషంతో శ్రీధర్‌ రెండు కాళ్ళు మొక్కి”ముఝే మాఫ్‌ కరో సాబ్‌” అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది.
”భాయిసాబ్‌! నన్ను క్షమించండి. మీతో అమర్యాదగా ప్రవర్తించాను. అయినా నా బిడ్డను కాపాడిండ్రు” అని శ్రీధర్‌ రెండు చేతులు పట్టుకొని అపరాధభావంతో క్రుంగిపోయిండు తండ్రి.
”మీ దయవల్ల పిల్లవాడు బతికిండు.నువ్వు డాక్టరువా బిడ్డా?”అని అడిగింది ఎదురు సీట్లోవున్న పెద్దమనిషి.
”అవునమ్మా! నేను పిల్లల డాక్టర్ని”అని సమాధానమిచ్చిండు శ్రీధర్‌. ప్రయాణికులందరూ శ్రీధర్‌ని ఆరాధనాభావంతో చూడసాగారు. తెలుగు నవలాకారులు చెప్పినంత అందగాడు కాకపోయినా, ఎత్తుకు తగ్గ లావు, కొసదేరిన ముక్కు,
తన అంతరంగపు లోతులు బయటివాళ్ళు పసిగట్టకుండా అడ్డుపడుతూ ముక్కుమీదినుంచి అప్పుడప్పుడూ కిందికి జారుతున్నకళ్ళద్దాలు, కోలముఖం, గోధుమ వర్ణపు మేని ఛాయ, నల్లరంగు ప్యాంటులో టక్‌ చేసిన బ్లూకలర్‌ షర్ట్‌ మొత్తంగా చూడగానేలోతైన మనిషిలా కనిపిస్తాడు. మనుషుల ప్రవర్తనను బేరీజు వేసుకుంటూ, శ్రీధర్‌ చాలా నిర్లిప్తంగా ఎమర్జన్సీ కిట్‌ను యధాస్థానంలో వుంచి సూటుకేసును లాక్‌చేయసాగిండు.
”సార్‌! ఈ సూటుకేసును అక్కడ పెడతానివ్వండి” అని శ్రీధర్‌ చేతిలోని సూటుకేసును తీసుకొని తన సీటుకింద పెట్టుకుండు. ఈలోపు పూర్తిగా తెలివిలోకి వచ్చిన పిల్లవాన్ని చంకలో వేసుకొని తల్లి శోభ దగ్గరికి వచ్చి, రెండు చేతులుపట్టుకొని,
”బహన్‌! నన్ను మన్నించు” అని బ్రతిమాలింది.శోభ గుంభనంగా ఒక నవ్వు నవ్వింది.
అవసరం మనుషుల్ని ఎట్లా ఆడిస్తుందో కదా అని శ్రీధర్‌ ఆశ్చర్యపోసాగాడు. ఈ వింత మనుషుల మధ్యనుంచి ఈ ప్రయాణం ఇంకొక పన్నెండు గంటల్లో ముగుస్తుంది. ముగుస్తున్న జీవన ప్రయాణానికి సంబంధించిన శ్రీధర్‌ఆలోచనలు రైలు కంటె వేగంగా పరుగెత్తసాగాయి.
డా.కాసుల లింగారెడ్డి

 

మీ మాటలు

*