నేను ముందే చెప్పలేదూ?

1swatikumari-226x300“చీరండలు కొన్ని ళూ అని పాడుకుంటున్నాయి. ఎవరైనా వింటారని కాదు అవి చీరండలు, అలా పాడుకుంటాయి.” ఎలదోట వంపుల్ని వెన్నెల వెలిగించే వేళల్లో తోవ కడాకూ ఏటూ తోచనితనాల్ని సాగతీసుకుంటూ పాడుతుంటాయి. దేవుడామని లేచి దేశాలంట పోయి అట్నుండి పిలుపు
ఇట్నుండి కబురు  లేక నీమాన్నువ్వు నా మాన్నేను ఎన్నాళ్లో బతికేసి చెల్లిపోయిన క్షణాలు
చెప్పడానికి వెనక్కి కాళ్ళీడ్చుకు వచ్చినప్పుడు, అప్పుడు నీలోంచి గాలి పాడే చీరండల పాటలాంటిదే కనకప్రసాద్ గారి కవిత్వం. ఆయన కవితలు, అనువాదానికి ఎంచుకున్న కవితలు చరణానికొకటిగా కాళ్లు ముడుచుకుని గొంతు కూచున్న కథల్లా ఉంటాయి. అర్ధాల కోసం పలకరిస్తే “చెప్తుంటె మీక్కాదు? పల్లకుండండీ!” అని తిరిగి వాటి పాటికి అవి సర్దుకుంటాయి. అలా సర్దుకుకూచుని దిక్కుల్లోకి చూస్తూ గుబులెత్తిన ఒక కవిత ఇక్కడ.

నాకే గనక తెలిస్తే

రచన : కనకప్రసాద్

నీకు అవేళే చెప్పేను కానా అంటుంది కాలం,
మనం చెల్లించవలిసింది వెల ఒక్క తనకే తెలిసి తెలిసీ,
తన మాను తానూ బిగదీసుకుంటుంది వగలాడి కాలం;

నాకే గనక తెలిస్తే నీకు నిలబెట్టి చెప్తానులే.
కోణంగి చేష్టలకి బిక్కచచ్చిపోయే రోజు వస్తే,
గాయకుల పాటలకి కంకటిల్లిపోయే రోజు వస్తే,
పండుగ పూటా ఊళ్ళో పదుగురం కలిసి ఏడిస్తే
నీకు ముందరే చెప్పేను కదవై అని మిన్నకుంటుంది కాలం.

జాతకాలు చెప్పవలసిన అదృష్టాలు లేవు,
పాతకాలు చెయ్యకూడని ఆదర్శాలు లేవు,
ఐనా అలవి కానంతగా నిన్ను ప్రేమిస్తున్నాను కనక
నాకే గనక తెలిస్తే నిన్ను వెతుక్కుని వెతుక్కుని ఎదురొచ్చి …

వీచే గాలులు ఎక్కణ్ణించి రేగి వస్తాయో,
పూచే పువ్వులు ఎవ్వర్నడిగి వీగి పోతాయో,
ఆకులు రాలే కారణాలు ఏమో అంటే
నీకు అవేళే చెప్పేను విన్నా? అని సణుక్కుంటుంది కాలం.

రోజాలకు నిజంగా పెరగాలనే ఉందేమో,
కన్ను కలకాలం కనిపిద్దామనే అనుకుందేమో,
ఏమో ఋతువులు చావని దేశం ఒకటి ఉందేమో,
నాకే గనక తెలిస్తే చిటాఁమని నిన్ను నిద్దర్లేపి చెవిలోకి …

కొదమ సింహాలు దడుసుకుని తడబాటుపడి దౌడు తీస్తే,
సెలయేళ్ళు మొనగాళ్ళు బెదరిపడి వెనుదిరిగిపోతే,
నీకెప్పుడో చెప్పేను కదమ్మా అని తప్పుకుంటుందా కాలం?
నాకే గనక తెలిస్తే లెగిసొచ్చి కట్టి కావిలించుకుని నీకు బెదరు.

(Inspiration: If I could Tell You by W. H. Auden)

వ్యాఖ్యానం
ఫలితాలొచ్చే వరకూ ప్రయత్నాల్ని, అనుభవాలుగా ఋజువయ్యేవరకూ ఆలోచనల్నీ నమ్మలేని మనుషులకి కాలమే చొరవ తీసుకుని ఏవో దారులు చూపుతుంది. ఆనక అడగా పెట్టకుండా తోచినవైపుకి నెట్టి నీ బాధలు నువ్వు పడమంటుంది. ఎక్కడో ఏదో మలుపులో ’మన బేరం మర్చిపోయావా?’ అని నిలదీసి నిలువుదోపిడీ చేసుకుపోతుంది; ఏమెరగనట్టు మళ్ళీ దారి చివర నక్కి ’ప్రయాణం బాగా అయిందా?’ అని వగలమారిగా పలకరిస్తుంది. “మనం చెల్లించవలిసింది వెల ఒక్క తనకే తెలిసి తెలిసీ, తన మాను తానూ బిగదీసుకుంటుంది.”
రాయీ రాయీ రాజుకునే రోహిణి కార్తెలో ఆకతాయిగా ఎవరో విసిరి పారేసిన చుట్టపీక తాటాకు పాకల మీదగా గడ్డివాములకు తగులుకుని ఊరి ఉసురు తీసుకున్నప్పుడు, పండగ కదాని పొంగించిన పాలకుండల్ని చూసుకుని తలలు బాదుకు ఏడ్చే జనాన్ని చూసి ఏమంటుంది కాలం? నిన్న సాయంత్రం మీరంతా పరాచికాలాడుకుంటూ ఇళ్లకి తిరిగొచ్చేప్పుడు వేపచెట్ల వెర్రిగాలిలో వెంపర్లాడి “నీకు ముందరే చెప్పేను కదవై” – అనదా? “పండుగ పూటా ఊళ్ళో పదుగురం కలిసి ఏడిస్తే”  అప్పటిదాకా అక్కడ కలియ తిరిగే సరదాలూ, సంగీతాలు బిత్తరపోయి వణుకుతూ ఏటో పారిపోవూ?

చిలకజోస్యాల్నీ, చేతిగీతల్నీ చెరిపేసే హీన చరిత్రల్లో “పాతకాలు చెయ్యకూడని ఆదర్శాలు“ ఉండవని తెలిసీ ఉగ్గబట్టలేని ప్రేమతో, ఊరుకోనివ్వని తపనతో ఎన్ని రహస్యాల్ని ముందే చెప్పేస్తుంది కాలం? అది చెప్పలేనప్పుడు మొహమాటపెట్టి ఎవర్తోనో చెప్పిస్తుంది. తీరని కోరికల బరువుని మోసే సువాసన పూల తొడిమలకి వేలాడి ఎందుకిలా రేకలు రాలుస్తుందో అని అనుమానపడ్దప్పుడు, ఇంకా పండని ఆకుల్ని ఈదురుగాలి కొమ్మల పొత్తిళ్లలోంచి అదాటుగా ఎగరేసుకు పోయినప్పుడూ “నీకు అవేళే చెప్పేను విన్నా? అని సణుక్కుంటుంది.”
ఎదిగే మొక్కా, మొలిచిన ఆశా, మొగ్గ వేసిన తొడిమా పెరగాలనీ, పూర్తి రూపం సంతరించుకుని పరిపూర్ణమవ్వాలని నిజంగానే అనుకుంటాయేమో! చూపులు దృశ్యాలతో ఆగిపోకూడదనీ, కలలు కళ్ల వెనకే నిలిచిపోకూడదనీ, నడక ఎదుర్రాయి తగిలి మరలిపోకూడదనీ గట్టిగానే కోరుకుంటాయేమో! మరో కాలం రాగానే తీగలోపలికి ముడుచుకునే సమయంలో మల్లపూలు “ఏమో ఋతువులు చావని దేశం ఒకటి ఉందేమో” అని ఆశపడతాయేమో!

బూచాణ్ణి చూసి బెదిరిపోయే పసిపిల్లలాట కాదు. గుహ లోపలి గాండ్రింపులకు బెంగటిల్లే భీత హరిణాలూ కాదు. భయవిహ్వలత నలువైపులా విషప్పొగలా కమ్ముకుని యోధానుయోధుల్ని సైతం బెంబేలెత్తించే రణన్నినాదాలు మార్మోగి “కొదమ సింహాలు దడుసుకుని తడబాటుపడి దౌడు తీస్తే” ఆ భీభత్స నేపథ్యం లో నివ్వెరపోయిన సెలయేళ్ళు వెనక్కి వెనక్కి ఏ రాళ్లలోకో, కొండల్లోకో, మొదటిసారి ప్రమాద సూచనలు పొడచూపిన ఏ మూలాల్లోకో పరిగెట్టి గడ్దకట్టి నిలిచినచోట “నీకెప్పుడో చెప్పేను కదమ్మా అని తప్పుకుంటుందా కాలం?”

కాలంలాగే కవీ చెబుతాడు నిద్దర్లోని నిప్పుమండి దోసిట్లోకి రాల్చిన నివురులో ఏ కథలు రాజుకుంటాయో, కాలాలు మారని ఒకచోట గాలివాసన పట్టుకుని వెళితే ఎదురయ్యే మట్టిబాట ఏదో! ఆ చెప్పడమూ ఎలా చెబుతాడు? నువ్వెటెళ్తావో వెతికి వెతికి, దారి కాచి,  అలవి కాని ప్రేమతో నిలబెట్టేసి మరీ. ఒకవేళ నువ్వా దారంట వెళ్లకపోతే, తోవ తోచక ఏ చెట్టుకిందో తెలీనితనపు బద్ధకంతో కునుకేస్తే నిద్దర్లేపి చిటామని చెవిలో అరిచి మరీ తనకి తెలిసినంతా దాచకుండా చెప్పేస్తాడు. ఆనక రేపెప్పుడో అంతా అల్లకల్లోలమై నువ్వు భోరుమంటే “లెగిసొచ్చి కట్టి కావిలించుకుని నీకు బెదరు” పోయేదాకా వదలకుండా తోడుండి మరీ వెళతాడు.

***

మీ మాటలు

*