కొన్ని నక్షత్రాలు…కాసిని కన్నీళ్ళు

ramasundariకొన్ని నక్షత్రాలు.. కాసిన్ని కన్నీళ్ళు. …. కధ చదివాక కాసిన్ని కన్నీళ్ళా? హృదయపు పొరలు చిట్లి, దుఃఖం అవిరామంగా స్రవించినట్లు గుర్తు. మాటలు కరువై  ఆ అక్షరాలను ప్రేమతో తడిమినట్లు గుర్తు. నలభై ఏళ్ళ గోదావరీ లోయా విప్లవ పోరాటం వెనుక మనసు ఆగక పరుగులు పెట్టినట్లు గుర్తు. నాకు తెలిసిన తెలంగాణ పల్లెలు, గరిడీలు సృతిపధంలో నడచినట్లు గుర్తు. చైతన్య గనులైన పి.డి.ఎస్.యు విధ్యార్దులు గుండె గదుల్లో కవాతు చేసినట్లు గుర్తు. ఈ కధ తెలంగాణ, అందులోను కరీంనగర్ విప్లవోద్యమ నేపధ్యంలో రాసింది. రాసింది ఆ ఉద్యమంలో ఊపిరి పోసుకొని ఎదిగిన విమల గారు. మొదట పాలపిట్ట మాసపత్రిక లో ప్రచురించబడి కధ 2012 లో కనిపిచ్చిన ఈ కధ ఒక ఆణిముత్యం.

కధా స్థలం కరీంజిల్లాలోని ఒక పల్లె. కాలం తొంబ్భైవ దశకం ప్రారంభం. ఆ పల్లెలో ప్రధాన భాధ్యతలు వహిస్తున్నది ఒక మహిళ. ఎన్నికల సందర్భంగా వచ్చిన వెసులుబాటును విప్లవ రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకోవాలను కొంటారు. అప్పుడు ఆమె ముందుకు వస్తారు ఇద్దరు నవ యువకులు. ఒకరు పెళ్ళై చంటి బిడ్డకు తండ్రి అయిన తిరుపతి, ఇంకొకరు అనాధ అయి  ప్రేమ తప్ప ఇంక ఏమి లేని మాధవ. యాధృచ్చికంగా మాధవ ప్రేమ కధని వింటుంది ఆమె. ఒక గంట ప్రేమికుడిని కలవటానికి తొమ్మిది గంటలు ప్రయాణం చేసి వెళ్ళిన తన తొలి ప్రేమను జ్ఞాపకం చేసుకొంటుంది. అతను తన చేతి మీద వేయించుకొన్న  వెలుగుతున్న దీపం పచ్చబొట్టు చూసి కదిలి పోతుంది.

” నాకు మొక్కలంటే యిష్టం. ఎప్పటికన్నా పొలంగొంటె ఏటివడ్డున ఒక రెడకరాలనా- అందులో చిన్న గుడిసేసుకొని చుట్టూ పూల మొక్కలు పెట్టుకొని ఉండాల. మేమిద్దరం గల్సి చిన్న పిల్లల కోసం ఒక మంచి స్కూల్ బెడ్తం. క్లాసులు చెట్ల క్రింత- అదేంది. ఆ(… శాంతి నికేతన్ లెక్క” అంటూ అతడు చెప్పే కలలను వెన్నెల్లో నులక మంచం మీద పడుకొని వింటుంది. అతనికి తప్పక సాయం చేయాలనుకొంటుంది. “ఆ చల్లటి వెన్నెల రాత్రి, ఆ పిల్లవాడి ముఖంలో ఏదో అవ్యక్తపు ఆనందం. నక్షత్రపు కాంతి.  ప్రేమ, అది ఎంత అధ్బుత అనుభవం!”

తెల్లవారి మసక చీకటిలో, మసక కళ్ళతో వారికి వీడ్కోలు పలికి, మధ్యాహ్నానికి ఇద్దరి ఎన్ కౌంటర్ వార్త వింటుంది. ఒకరు తిరుపతి. ఇంకొకరు? ” కట్టెలు చేర్చిన ఆ చితి మధ్య-విగత జీవిగా ఎవరో పిల్లవాడు. వాడికీ కల ఉందా? ఒక ప్రేమ కధ ఉందా? ఒక వెన్నెల రాత్రి వాడూ వాడి జీవకాంక్షని- ఎవరికైనా చెప్పాడా? ఎవరా పిల్లవాడు…మాధవా నువ్వు బతకాలరా” అని రోదిస్తుంది. ఎవరు మరణించారు? ఎవరు బతికారు? ఆ క్షణం నేను కూడ మరణించానా వాళ్ళతో పాటు? అని ప్రశ్న వేసుకొంటుంది. కాని చనిపోయింది మాధవానే. కూంబింగ్ చేసి వస్తున్న పోలిసులను చూసి భయపడిన పారిపోతుంటే ఇద్దర్ని కాల్చి వేసారు. గాయాలతో తూములో దాక్కొన్న నిరాయుధుడైన మాధవాను  చంపబోమని చెప్పి బయటికి పిల్చి కాల్చేసారు.

కధ మొత్తం ఆమె జ్ఞాపకాల ఉద్విఘ్నతలతో సాగుతుంది. మానేరు ఒడ్డున కూర్చొని “మానేరా, మానేరా! నను వీడని మనియాదా” అని పలవరిస్తుంది. “చీకట్లు ముసురుతున్న అసాయంవేళ, నాల్కలు చాచుతున్న ఆ మంటల్ని నిర్ఘాంతపడి చూస్తూ, పెనుగులాడి, పెనుగులాడి నా లోపల నేనే పొడి పొడిగా రాలుతూ…”  అంటూ ఆ నాటి విషాదాన్ని  ధ్యానించుకొంటుంది . రచయిత్రికి  విప్లవం పట్ల నిబద్దత, అది అందుకోలేని బాధ కధ పొడవునా వ్యక్తం అవుతాయి. “ఏదీ ఆ మరో ప్రపంచం, ఎర్ర బావుటా నిగనిగలు, ప్రళయ ఘోషలు, ఝుంజా మారుతాలు, జనన్నాధ రధ చక్రాలు, ఆకాశపు ఎడారిలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలా , జాబిల్లు? ఏవి, ఏవి తల్లి నిరుడు కురిసి హిమసమూహలు?”

ఈ కధ ఒక ఎన్ కౌంటర్ దుఃఖాంతాన్ని వర్ణించే కరుణ రస ప్రధానమైన కధగా కనిపిస్తున్నా, కధ వెనుక అప్రకటిత భాష్యం (అన్-టోల్డ్ టెక్స్ట్) చాలా ఉంది. “ఈ కధ నాలో అంతరంతరాలలోఅనేక ఏళ్ళుగా దాగిన దుఃఖం.” అని రచయిత్రి చెప్పుకొన్నారు. ఆ దుఃఖం వైయుక్తమైనది కాదు. అది ఉద్యమాల దుఃఖం.  సమ సమాజం నిజమైన అర్ధంలో స్థాపించటానికి బలై పోయిన వందలాది యువతీ యువకుల మృత్యు కేళి కలిగించిన వగపు.

మాధవా కన్న కలలు భారత దేశంలోని ప్రతి లేబ్రాయపు యువతి యువకుడు కనే ఉంటారు. చిన్న ఇల్లు, చేయటానికి పని; ఇవి ఇచ్చిన భరోసాతో ఇతరుల కోసం ఏదైనా చేయాలనే తపన. బహుశ మాధవ లాంటి వాని ఊహలలో ఈ రాజ్యహింస తాలూకూ పీడ కలలు ఉండి ఉండక పోవచ్చు. ఈ ఎన్ కౌంటర్లు అలాంటి  కనీస కోరికలు కోరే, వాటి కోసం పోరాడే వాళ్ళకు ఈ భూభాగంలో చోటు లేదని చెప్పేతీర్పులు. కాలే చితి పై మండుతున్న శవాల తాలూకూ పొగలు అదే సందేశాన్ని మోసుకొని పోయి ఉంటాయి. తన ప్రియుడు మరణం తెలుసుకొని వచ్చి ఏడ్చి వెళ్ళిన జ్యోతి, ఈ మరణాలను ప్రశ్నించలేని, ఎవరినీ తప్పు పట్టలేని అమర వీరుల కుటుంబాల ప్రతినిధి.

ఈ కధలో ఒకప్పుడు ఉవ్వెత్తున ఉద్యమాలు ఎగసిన ప్రాంతాలలో మారిన పరిస్థితుల వర్ణన అత్యద్భుతం గా  చేసారు. క్షీణించిన సాంస్కృతిక, ఆర్ధిక జీవనాల గురించి , ముగిసి పోయిన పోయిన జమిందారీ వ్యవస్థ గురించి, కొండెక్కిన ఉద్యమాలు, ప్రపంచీకరణ సునామి ఉధృతిలో పడిపోయిన గ్రామీణ ఉపాధులు ఒక్క వాక్యంలో  దృశ్యీకరించారు.

“శిధిలమైన మట్టి గోడలు, జాజు నీలం రంగులు పూసిన దర్వాజాలు, చెదిరి పోయిన నినాదాలు, రెక్కలు చాచిన రాబందుల్లా యాంటీనాలు, కోకో కోలాలు, బిస్లరీ వాటర్లు, మద్యం సీసాలు, జిల్లెళ్ళు మొలుస్తున్న గరిడీలు, పలకని రాతి దేవుళ్ల గుడులు, చదువు చెప్పని బడులు, విరిగిన మగ్గాలు- ఆకు – తంబాకు చేటలు….”  .

మారిన సామాజిక ఆర్ధిక పరిస్థితులను అందుకొని చేయవలసిన కర్తవ్యాలను మరిచిన ఉద్యమవైఫల్యాలను కూడ ఎత్తి చూపారు. వచ్చిన మార్పులను స్వీకరించి ఉద్యమాలను పునర్నిర్మాణం  చేయని అశక్తతను కూడ పేర్కొన్నారు.  “పెరిగిన మధ్య తరగతి మనుషులు- నీటివసతి- కొత్త వ్యాపారాలు పెరిగి- ఒకప్పటి – కరీంనగర్ కాదది-  జరిగిన మార్పులను అంచనా వేసే వాళ్ళెవరు – ఏ చేయాలో ఎలా చేయాలో – మళ్ళీ కొత్తగా ప్ర్రారంభిచేది ఎవరు?”

ఈ ఘటన జరిగిన పద్దెనిమిదేళ్ళ తరువాత మాధవ ప్రియురాలు జ్యోతిని అనుకోకుండా కలిసిన ఆమె, జ్యోతి చేతిపై మాధవ గుర్తు గా వేయించుకొన్న పచ్చబొట్టును చూస్తుంది. తన రిక్త హస్తాలను చూసుకొంటుంది. ఉద్యమ వైఫల్యాలు, మిగిలిపోయిన కర్యవ్యాలు ఈ చివర వాక్యం ద్వారా మనకు వ్యక్తమౌతాయి. ఎంత ఉదాత్తమైన ముగింపు? కధ నంతటిని ఈ చిన్న వాక్యంలో కుదించి మనకు సందేశమిచ్చినట్లైంది.

***

కొన్ని నక్షత్రాలు –విమల

మీ మాటలు

 1. buchireddy gangula says:

  విమల గారి కథ చాల బాగుంది —ముగింపు చాల గొప్పగా ఉంది

  • రమాసుందరి says:

   అవును, ఆ ముగింపు, ఆ చివరి వాక్యం కధకు జీవం పోసాయి.

 2. విమల గారి గొప్ప కథకు మీ పరిచయం హృద్యమైన నివాళి.

  వ్యక్తిగతంగా, సామాజికంగా భగ్నమైన కలల విషాదాన్ని హృదయానికి హత్తుకునేలా చిత్రించిన కథ ఇది.

  జన జీవితంలోకి తుపానులా వచ్చిపడిన మార్పులను ఈ వాక్యాలు ప్రతిభావంతంగా చిత్రించాయి. >> చెదిరి పోయిన నినాదాలు, రెక్కలు చాచిన రాబందుల్లా యాంటీనాలు, కోకో కోలాలు, బిస్లరీ వాటర్లు, మద్యం సీసాలు.. >>

  మసకవెన్నెల్లో ‘రిక్తహస్తాలను’ చూసుకుంటున్న కథకురాలి మనోభావాన్ని పాఠకులూ అనుభూతి చెందుతారు, ముగింపులో!

  • రమాసుందరి says:

   విమల గారి నుండి ఇంకా గొప్ప కధలు ఆశిద్దాం వేణుగారు.

 3. వినీల్ says:

  మంచి కథకు తగ్గట్టు ప్రశంస.

 4. ns murty says:

  రమా సుందరి గారూ,

  విమలగారి కథ ఎంత బాగుందో మీ పరిచయమూ అంట బాగుంది. నిజంగా మనసు ఒకసారి గగుర్పొడుస్తుంది కథ ముగింపు చదివినపుడు. దానిగురించి ముందుగానే కొంత సూచన ఇచ్చినప్పటికీ, అందులోని ఉద్విగ్నతకీ, కదిలించే శక్తికీ ఏమాత్రం ఆగటం కలగదు. నిజజీవితంలోని అనుభవాలని కథలుగా మలచడంలో విమలగారు మునిపల్లెరాజుగారికి సమీపంగా వస్తారు. కాకపోతే ఇద్దరికీ అనుభవాలలోనే తేడా. మీకూ, విమలగారికీ హృదయపూర్వక అభినందనలు.

 5. రమాసుందరి says:

  ధన్యవాదాలు మూర్తిగారు. అంతర్లీనంగా ఆమెలో సాగిన ఘర్షణ ను , పాఠకులు శ్వాసించగలిగినంత మోతాదులో అందించగలిగారు.

 6. రమా సుందరి గారూ, కథ ఎంత కదిలించిందో మీ పరిచయమూ అదే స్థాయిలో మరింత ఊపేసింది .

  ఇలాటి కథలు చదువుతున్నపుడే “సామాజిక దృక్పథం నెపంతో ఏదో ఒక నీతి బోధే పనిగా పెట్టుకోక, ఆలోచనల్లో పడేసే కథలింకా చావలేదు” అని ఊరటగా ఉంటుంది.

  మళ్ళి ఇంకోసారి చదువుతాను ఈ కథ

  • రమాసుందరి says:

   మళ్ళీ మళ్ళీ చదవాల్సిన కధ ఇది సుజాత గారు. ఒక చరిత్ర మనకు చెబుతుంది. వర్తమానాన్ని విశ్లేషిస్తుంది. భవిష్యత్తు వేపు మన దృష్టి సారింపచేస్తుంది. నా పరిచయం నచ్చినందుకు ధన్యవాదాలు.

 7. రమ గారు కథ అంత గొప్పగా ఉంది పరిచయం . మళ్ళీ మళ్ళీ చదవాలి అనిపించే కథ .

  • రమాసుందరి says:

   అరుదైన కధ ఇది. కాలానికి నిలబడి పోగలిగిన కధ ఇది.

 8. bhasker says:

  చాలా మంచి ఉద్విగ్నభరిత పరిచయం చేసారు, రమాసుందరిగారూ… విమల గారి కథకు మల్లేనే మీ పరిచయం వుంది. చదవడం ముగియగానే గుండె బరువెక్కింది. మీ ఇద్దరికీ హాట్స్ ఆఫ్..! ఎడిటర్ గారికి అభినందలు, ఇంతమంచి కథకు ఇంత మంచి పరిచయం అందించినందుకు.

 9. asnala sreenu says:

  బాగుంది..ఉస్మానియా యూనివర్సిటీ లో చదువుతున్నప్పుడు సిరిసిల్ల జైత్రయాత్ర క్షేత్రాలను అద్యననం చేయటానికి విప్లవ విద్యార్ధి ఉద్యమం లో పని చేసే వాళ్ళమంత కొనరాపేట్ మామిడిపల్లి మానేరు.పరివాఅక ప్రాంతమంత పర్యతిన్చాము .ఈ ఎన్కౌంటర్ మాకు అతి సమీపం లో జరిగింది ..విమలక్క ఆవేదనా..ఆర్తి.విప్లోవోద్యమ సాపల్య వైపల్యాలు నా గుండె ను ….

  • రమాసుందరి says:

   గుండెను పిండి వేసే సంఘటనలు అప్పుడే చాలా జరిగాయి. ఆ ఆవేదనను పదునుగా మనకందించగలిగారు విమలగారు.

 10. chandana chittipai says:

  రామ ఆంటీ కి కథ చదివాను చాల బాగుంది.

 11. chittipati venkateswarlu says:

  రామకి ,
  కథకి మంచి పరిచయం చేసి న్యాయం చేసావు. ఈ కథ ముప్పై ఏండ్లు వెనక్కి తెసుకేల్లింది. సిరిసిల్ల, జగిత్యాల జైత్ర యాత్రలు వేసవి సెలవుల్లో గ్రామాలకు తరలండి కెంపులు గుర్తుకు వచ్చాయి. మాడవ ప్రేమకత ముగింపు కన్నీలు తెప్పించాయి. మారిన సామాజిక ఆర్ధిక పరిస్థితులను అందుకొని చేయవలసిన కర్తవ్యాలను మరిచిన ఉద్యమవైఫల్యాలను ఎతిచుపినపుడు బాద్యత వహించాల్సిన శక్తులు తగినవిదంగాలేనపుడు వొదిపొయమెమొ అని గుందేపిండుతుంది. సమీక్షలు బాగాచేస్తున్నందుకు విప్లవబివందనలు. పని వత్తిడిలో నేను చదవడం ఆలస్యం అయ్యింది. రాత్రి చందనను చదవమన్నాను. చిట్టిపాటి

 12. కధ చాలా చాలా బాగుంది. కధ స్ధాయిలో పరిచయం సాగింది. పరిచయం చదువుతుంటే కధ దాదాపు రెండో సారి చదువుతున్నట్లు అనిపించింది. ముఖ్యంగా వివిధ పాత్రలను పరిచయం చేసిన పద్ధతి బాగుంది. చాలా పరిపక్వత కనిపిస్తోంది పరిచయంలో.

  కధలు, నవలలు చదవుతూ ఏడుస్తారని విన్నపుడు ఒకప్పుడు నమ్మేవాడ్ని కాదు. నమ్మినా ‘అతి’ అనుకునేవాడ్ని. కాని ‘మట్టి మనిషి’ చదువుతుండగా నేనే ఆ పరిస్ధితిని ఎదుర్కొన్నాక నన్ను నేనే తిట్టుకున్నాను, అలా నమ్మనందుకు. ‘మట్టి మనిషి’ నవల తర్వాత మళ్ళీ ఈ కధ కన్నీళ్లు తెప్పించింది.

  జరిగింది కాబట్టే కధలో జీవం, వాస్తవికత శక్తివంతంగా వ్యక్తం అయ్యాయి. ప్రజల వాస్తవ పరిస్ధితి ఎలా ఉంటుందో ఇలాంటి కధలు దానిని మరిచినవాళ్లకు గుర్తుకు తెస్తాయి.

  ఇది నిజంగా జరిగిందని తెలిసినప్పుడు దుఃఖంతో పాటు బాధ కలుగుతుంది. ఉద్యమకారుల్ని కోల్పోయినందుకు దుఃఖం కలిగితే, వారి వారసత్వాన్ని కొనసాగించడంలో విఫలం అవుతున్న పార్టీలు గుర్తుకొచ్చి బాధ కలుగుతుంది.

  మొదట నేను పరిచయం చదివాను. ఆ తర్వాత కధ చదివి మళ్ళీ పరిచయం చదివాను. అందువల్లనేమో, కొన్ని తప్పులు దొర్లడం గమనించాను.

  కధలో దొరల గడీలని ‘గడీలు’ అనే చెప్పారు. కాని పరిచయకర్త గరిడీలు అని రాశారు.

  ‘గోదావరీ లోయా విప్లవ పోరాటం’ కాదు -గోదావరి లోయ విప్లవ పోరాటం. ‘య’ కి దీర్ఘం కూడదు.

  ‘కనిపిచ్చిన’ బదులు ‘కనిపించిన’ అని రాయాలి కదా? ‘కనిపిచ్చిన’ అనేది వ్యవహారికమా?

  కరీంజిల్లా కాదు -కరీంనగర్ జిల్లా.

  అలాగే….

  ‘తొంబ్భైవ’ – తొంభయ్యవ

  ఉద్విఘ్నతలతో – ఉద్విగ్నతలతో

  అసాయం వేళ – ఆ సాయం వేళ

  ఆకాశపు ఎడారిలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలా , జాబిల్లు? – ఆకాశపుటెడారిలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలా… జాబిల్లా? నేనా?

  నిరుడు కురిసి హిమసమూహలు? – నిరుడు కురిసిన హిమ సమూహాలు?

  ముగిసి పోయిన జమిందారీ వ్యవస్థ గురించి అనడం కంటే, ‘రూపం మార్చుకున్న జమీందారీ వ్యవస్ధ గురించి’ అంటే బాగుండేది. ఫ్యూడల్ వ్యవస్ధ అర్ధ ఫ్యూడల్ అయింది తప్ప పూర్తిగా ముగిసిపోలేదు కదా.

  చివరి పేరాను రెండు పేరాలు చేస్తే బాగుండేది. ‘ఈ చివరి వాక్యం’ అన్నపుడు దానిని ప్రత్యేకంగా చూపించి ఉండాల్సింది. అలా చేయకపోవడం వలన ఏది చివరి వాక్యమో త్వరగా అర్ధం కాలేదు.

  ఇవి ప్రధానంగా టైపింగ్ తప్పులు. తెలుగు టైపింగ్ అలవాటు లేకపోవడం వల్లా, ఏ కీ నొక్కితే ఏ అక్షరం పడుతుందో వెంటనే తట్టకపోవడం వల్లా, టైప్ చేసింది మరొకసారి సరి చూసుకోకపోవడం వల్లా దొర్లి ఉండవచ్చు. చిన్నవే అయినా కొన్ని పంటి కింద రాయిలా అనిపిస్తాయి. అయితే, రచయిత్రి రాసిన పదాలను యధాతధంగా రాయకపోవడం మాత్రం ఆక్షేపణీయం.

  టైపింగ్ తప్పులను ఎడిటర్లు సరి చేయవచ్చు. ఇతర రచనల్లో కూడా ఇలాంటి ఎడిటింగ్ జరక్కపోవడం నేను గమనించాను. చిన్న చిన్న తప్పులు కూడా సవరించకూడదని ఎడిటర్లు నియమంగా పెట్టుకున్నారా?

  • రమాసుందరి says:

   మీ విలువైన సూచనలకు ధన్యవాదాలు. ఈ డ్రాఫ్ట్ లో చాలా తప్పులు దొర్లినట్లు నేను చూసుకొన్నాను. వీలయినంత వరకూ నేను చూసే పంపిస్తాను. అయితే ఈ సారి చాలా తప్పులు వచ్చాయి. మళ్ళి చదువుతుంటే నాకే పంటి క్రింద కరకర మంటున్నాయి.

  • విశేఖర్,

   I will reply in English, if that’s ok with you. On typing mistakes. This is a BIG issue for Saaranga Editors. More specific, this is a big time consuming issue for us.

   Frankly, some of the articles we receive are so full of typing mistakes, punctuation mistakes and oversights that make me wonder if our Telugu writers spend any time editing their work. But, I will be the first one to acknowledge that editing is not an easy job.

   So far Saaranga editors are working under the operating condition of, “let’s try to fix these errors ourselves because it’ll take more time going back and forth with the writer.” We are also thinking of coming up with a Saaranga Writing Guidelines, but again, we haven’t done that yet. We all have day jobs (some even dual jobs), so whatever time we put into Saaranga Magazine, it is from our free time. So there is that.

   The only solution we can think of now, is to appeal to the writers, please clean up your Unicode manuscript before you hit that SEND button to the Saaranga editor. If we had more time, we will surely do a better job.

   Raj

   • రాజ్ గారికి,
    ఈ విషయం లో ఆసక్తి ఉన్న వారి దగ్గర నుండి సహాయం తీసుకోవచ్చు కదా! ప్రచుణార్హమ్ అయిన కథలను హెల్ప్ గ్రూప్ కి పంపి సరిచేయమనవచ్చు. నేను, మా ఆయన {రాజ పిడూరి} హెల్ప్ చేయగలము.
    బై
    రాధ

 13. రాజ్ గారికి,

  మీ ప్రతిస్పందనకి ధన్యవాదాలు. మీ అరుదైన సమయాన్ని వెచ్చించి స్పందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.

  రచయిత/త్రులు తమ రచనలను పంపేటప్పుడే తప్పులు లేకుండా పంపించాలి. అందులో సందేహం లేదు.

  నాదొక ప్రశ్న. లేదా అనుమానం కావచ్చు.

  ‘ఆంగ్ల కీ బోర్డు ద్వారా తెలుగు టైపింగ్ ఎంత కష్టమో మీ ఆంగ్ల ప్రతిస్పందన ధృవపరుస్తోంది’ అనుకోవచ్చా? మీ ఆంగ్ల ప్రతిస్పందన అర్ధం చేసుకోదగిందే అయితే, బహుశా రచయిత/త్రుల టైపింగ్ తప్పులు కూడా అర్ధం చేసుకోదగినవే కావచ్చు కదా!

  సారంగ సాహిత్య వారపత్రిక చేస్తున్నది తెలుగు సాహిత్య సేవేనా లేక ఇతర భాషల సాహిత్య సేవ కూడా చేస్తున్నదా? తెలుగు సాహిత్య సేవ మాత్రమే అయితే మీ స్పందన తెలుగులో ఉంటేనే బాగుండేదనుకుంటాను. నాకు ఓ.కె నా కాదా అన్నదానితో సంబంధం లేకుండా సంపాదకులు తెలుగుదనాన్ని ఎంతగా అన్ని సందర్భాల్లోనూ కొనసాగిస్తే పత్రిక పైన అంతగా గౌరవం పెరుగుతుందని నా భావన.

  ఇది ఎత్తి చూపడానికి కాదనీ, పత్రిక సాగిస్తున్న కృషి పట్ల ఎంతో సంతోషపడుతూ మెరుగుదల కోసం ఇస్తున్న సూచన మాత్రమేనని తెలియజేసుకుంటున్నాను. ఖాళీ సమయాల్లో, అందునా తమది కాని దేశంలో ఉంటూ, ఇంతటి బృహత్కార్యాన్ని నిర్వర్తించడం మామూలు విషయం కాదని నా అవగాహనలో ఉన్నది.

  ధన్యవాదాలు.

 14. ప్రసాద్ చరసాల says:

  ఇన్నేళ్ళు ఈ కథను చదవలేదే అని సిగ్గు పడ్డాను, చదివాక.
  అచ్చం ఇదేమాట సుళ్ళు తిరిగింది నాలోనూ..”కాసిన్ని కాదు.. కడివెడు కన్నీళ్ళు” అని. మా ఆవిడకు ఈ కథ గురించి చెబుతూ “కొన్ని నక్షత్రాలు, కడివెడు కన్నీళ్ళు” అనే పరిచయం చేశాను.

మీ మాటలు

*