మరో తీరంలో….

Scan 2

రెండు భూఖండాలను
రెండు భుజాలమీద మోస్తున్న సముద్రం
ఉచ్ఛ్వాస  నిశ్వాసలైన ఖండాంతర పవనం

ఒక చేతిలో సూర్యుడు ఒక చేతిలో చంద్రుడు
బంతాట ఆడుతున్న ఆకాశం

కదలటమొక్కటే తనకు తెలిసిన విద్య అన్నట్టు
నిద్ర నటిస్తున్న కాలప్రవాహం

గంటలను సాగదీస్తున్న గడియారం
పడమటి గాలిలో పడిలేస్తున్న పండుటాకు
మలిసంజ వలస జీవన శ్వాస –

ఒక అనల నిస్వసనం , ఒక అనిలోత్సాహం
అలల మీద తేలుతున్న ముసలి ఓడ
పడమటి నింగిలో మబ్బు పడవ

వలస తుఫాన్లలో తలమునకలౌతున్న నావ
ఇరు తటాలను ఒరుసుకుంటూ కళాసి పాట
సాగర మథనంలో సతమతమౌతున్న నాగరాజు
పవనపుత్రుని రెక్కల మీద రామయతండ్రి

ఒక కన్ను కడుపు తీపి , ఒక నయనం నాస్టాల్జియా
చూపు తీగను లాగుతున్న ఎదురు తీరాలు
కలువల కొలనులో పడ్డ గులక రాయి

అక్షరాలలో మునిగిన దుబాసి ప్రవాసి అదృష్టజీవి !

 (Sidebar painting: Mandira Bhaduri)

మీ మాటలు

  1. rammohan says:

    సార్ సారంగ రథారోహణం సంతోష కరం.కవిత గుండెను స్పర్శి.స్తుంది.

  2. నాగరాజు రామస్వామి గారు,

    కవిత చాలా బాగుంది.

    “అలల మీద తేలుతున్న ముసలి ఓడ
    పడమటి నింగిలో మబ్బు పడవ” బాగా నచ్చింది.

    అభినందనలు!

  3. అనుభూతిలో గాఢత నిండి, కవిత చిక్కగా రావటం అభినందనీయం.

  4. కవిత చాలా బావుందండి.

Leave a Reply to rammohan Cancel reply

*