దేశం ద్వేషించిన సిపాయి

నా పరిచయం: ఆకలికి ముందు, ఆశల వెనుక పడుతూ లేస్తూ పరిగెత్తే  ఓ అతి సామాన్యుడ్ని….

Shiva Bandaru

శివ బండారు

రోజూ పరేడ్ కోసం తెల్లవారుఝామున నాలుగున్నరకే తెల్లవారే నాకు, రాత్రి అర్దరాత్రి వరకు పంజాబ్ నుండి పక్క ఊరు స్టేషన్ వరకు షుమారు మూడు రోజులు సాగిన పొగబండి ప్రయాణం వల్లా, వర్షంలో తడుస్తూ బురదలో నాలుగు మైళ్ళు నడుస్తూ రావడం వల్లా   మెలకువ రావడం మూడు గంటలు ఆలస్యం అయింది. ఇంటి వసారా నుండి బయటకి వచ్చేసరికి బజారంతా హడావిడిగా గోల గోలగా ఉంది. వచ్చేటప్పుడు వానకి తడిసిన ఎర్రటి యూనిఫారం ఇవాళ పొద్దున్న రంగులతో మళ్ళీ తడిసిపోయినట్లుంది . నేను బయటకి బయల్దేరి రెండు అడుగులేసేసరికి బజార్లో నుండి ఇంట్లోకి పరిగెత్తుతూ వస్తున్న అన్న కొడుకు తన రెండు గుప్పిళ్ళ నిండా ఉన్న రంగుని ఎగిరి నా మీదకి విసిరి మళ్ళీ వెనక్కి బజార్లోకి పరిగెత్తాడు.
నేను బజాట్లోకి వెళ్లి పక్కనే ఉన్న అరుగు మీద కూర్చున్న వాళ్ళని అడిగాను ఈ సంబరమేంటి అని?? వాళ్ళల్లోంచి ఒక ముసలతను బదులిచ్చాడు ” తెల్ల దొరలు మన దేశాన్ని వదిలి పోతున్నారని ఇందాక రేడియో వార్తల్లో చెప్పారు”. గాంధీని నాయకుడ్ని చేసిన పోరాటం, భగత్ సింగ్ ని బలి తీసుకున్న పోరాటం చివరికి సొంత పాలనని ఆలస్యంగానైనా అందించింది సంతోషం.
కానీ  ఈ సంబరంలో మునిగి ఉన్న గుంపులోకి చేరి నేను కూడా చిందులెయ్యలా ?? అసలు వేసే అర్హత నాకు ఉంటుందా ?? నేను బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ 1 వ బెటాలియన్, పంజాబ్ రెజిమెంట్లో పనిచేస్తున్న సిపాయిని. సిపాయినని గర్వంగా చెప్పుకోడానికి నేనేం దేశం మీద ప్రేమతో శివారులో శత్రు సిపాయిలతో పోరాడుతున్న వీరుడ్ని కాదు, నా దేశంలో పరాయిదేశం వాళ్ళకోసం పనిచేస్తూ సొంత మనుషులకి తుపాకి తూటాలు పేల్చే ఓ సిపాయిని.
అలా అని శ్రీ కృష్ణుడు చెప్పినట్లు ” ధర్మ సంరక్షణ కోసం నీ సొంత వాడితోనైనా యుద్ధం చేయాల్సిందే” అనుకుందాం అంటే ధర్మం కూడా నా వైపు లేదు కేవలం దరిద్రం తప్ప. ఓ మనిషి ఆకలిని చంపుకోవాలా లేక ఆత్మాభిమానాన్ని చంపుకోవాలా అన్న సంశయంలో పడినపుడు, మన చేతిలోలేని ఆకలిని చంపడం కంటే మన ఆలోచనలో ఉన్న ఆత్మాభిమానాన్ని చంపుకోడం తేలికగా భావించి నా ఆకలి పోరాటాన్ని బ్రిటీషు వారి అధికార పోరాటం కోసం పనిచేస్తున్న ఓ సాధారణ భారతీయ సిపాయిని. ఆ నిమిషం నా ముందు రంగురంగులలో ఎగురుతున్న సీతాకోకల గుంపులో నాకు నేను గొంగళి పురుగులా అనిపించాను.
ఇంట్లోకి వచ్చి స్నానం చేసి ఊళ్లోకి బయల్దేరాను. ఊరు ఊరంతా పండగ వాతావరణం. మిఠాయిలు పంచుతున్న వాళ్ళు, రంగుల్లో మునిగి తేలుతూ గుంపులు గుంపులుగా సంబరాలు చేసుకుంటున్న వాళ్ళు. భారతదేశపు ఆత్మాభిమానపు పోరాటపు ఘట్టాల్ని కళ్ళకి కట్టినట్లు, జనాల రక్తాన్ని సల సల మరిగేటట్లు వివరిస్తూ బుర్రకథ జరుగుతుంది రచ్చబండ దగ్గర రావి చెట్టు కింద అరుగు మీద. అక్కడే ఉన్న జనాలతో పాటు నేను కూడా కలిసి విన్నాను. ఆ హడావిడి అంత అయ్యేసరికి సూర్యుడు నారింజ రంగులోకి, మేము రంగురంగుల్లోకి మారిపోయాం. పక్కనే ఉన్న గుడి ఎదురు కోనేట్లో మునిగి, వంటికి ఉన్న రంగుల్ని, బుర్రలో ఉన్న ఆలోచనల్ని వదిలించడానికి ప్రయత్నించాను  కాని రెండూ పూర్తిగా వదల్లేదు.
తిరిగొచ్చి మళ్ళీ రావి చెట్టుకింద అరుగు మీద కూర్చున్నా. ఈ సారి ఇందాకటి హడావిడి ఇపుడు లేదిక్కడ. ఎంత సంతోషమైనా, బాధైనా దాన్ని ఎక్కువ కాలం ఆస్వాదించే లేదా అనుభవించే అవకాశం జీవితం ఎప్పుడూ మనిషికివ్వదు. మన దారిలో ఏదొచ్చినా ముందుకి సాగిపోవాల్సిందేననే షరతు ఎప్పటికీ మనతోనే ఉంటుంది, దానిలో భాగంగానే ఊరు ఇందాకటి సంబరాన్ని వదిలి ముందుకు సాగింది. ఈ రోజు, ఈ నిమిషం, ఈ ఊరు, ఈ దేశం అంతా స్వేచ్ఛ దొరికిందన్న సంతోషంలో రెక్కలు విదుల్చుకుని ఎగురుతుందనేగాని,  అసలు స్వేచ్ఛ ఉంటే ఈ దేశం బావుంటుందనే ఓ ఊహ ఈ దేశంతో ఇంత పోరాటాన్ని చేయించిందే  తప్ప , షుమారు మూడొందల సంవత్సరాల ముందు ఈ దేశం స్వేచ్ఛని కోల్పోయిన మొదటి రోజుని చూసిన వాడెవడ్నీ , మూడొందల సంవత్సరాల  తరవాత స్వేచ్ఛ  దొరికిందని సంతోషించడానికి కాలం మిగల్చలేదు. ఇపుడు స్వేచ్ఛ దొరికిందని సంబరపడుతున్న మాకు అసలు ఈ స్వేచ్ఛ ఎలా ఉంటుందో అనేది తెలుసుకుని దానికి అలవాటుపడటానికి కొన్నాళ్ళు పట్టోచ్చు.
నేను పోయిన సంవత్సరం ఊరికి వచ్చినప్పటికి, బ్రిటిషు వాళ్ళ పాలనలో ఊరు ఎలా ఉందన్న విషయం పక్కన పెడితే, నన్ను చూడగానే ఎప్పుడొచ్చావని పలకరించే జనాలు, నా ముందు గౌరవంగా  నటించే కొందరు,  నా దగ్గర డబ్బులు తీసుకోకుండా అయ్యో మీ దగ్గర డబ్బులు తీసుకోడం ఏంటని మొహమాటంగా అతిగౌరవంగా నటించే టీ కొట్టువాడు , నాకు తెలుసు ఇవన్నీ నన్ను చూసి ఇస్తున్నవి కాదు. నా ఆత్మాభిమానపు తాకట్టుకి  బ్రిటీషు జీతంతో పాటు ఇవి అదనపు కానుకలని, ఇవన్నీ నేను అక్కడి నుండి వెనక్కి తిరగ్గానే అవి నేను సొంతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న స్వార్ధానికి శాపనార్థాలవుతాయని . ఇక్కడున్న కరవు పరిస్థితులకి వ్యతిరేకంగా మా ఇంట్లో వాళ్లకి రెండు పూటలా తిండి దొరుకుతుందన్న దాన్ని ద్వేషంగా మార్చుకుని, వ్యక్తిగత ద్వేషాన్ని చూపించడానికి, వ్యవస్థ మీద వ్యతిరేకంగా పనిచేస్తున్నాన్నదాన్ని సాకుగా చూపించే వాళ్ళు. ఊరి మీద అనవసరపు శిస్తులు వసూలు చేసే బ్రిటీషు సిపాయిలు మా ఇంటికి వచ్చేసరికి మన కోసం పనిచేసే వాడి ఇల్లని కొంచెం మంచిగా వ్యవహరించడం ఇలాంటివి దొరికేవి నాకు.
స్వాతంత్ర్యం లేనపుడే నాకు ఇన్ని దొరికాయంటే, కొత్తగా వచ్చిన ఈ స్వాతంత్ర్యంలో నేను ఏం పొందుతానో చూడాలి. ఈ హడావిడిలో ఓ వారం గడిచింది. మా రెజిమెంట్  నుండి ఓ ఉత్తరం వచ్చింది. పంజాబ్ 1 వ బెటాలియన్  దేశవిభజనలో  భాగంగా పాకిస్తాన్ కి చెందుతుందని. 1 వ బెటాలియన్లో ఉండి భారతదేశంలో ఉండాలనుకునే వాళ్ళు  1 వ బెటాలియన్ నుండి రాజీనామా చేసి అదే రెజి మెంట్లో 2 వ బెటాలియన్లో చేరాలని దాని సారాంశం. ఇంట్లో వల్ల ఒత్తిడి వల్లనైతేనేమీ,   , ఊరు విడిచి వెళ్ళడం ఇష్టం లేకపోడం వల్లనైతేనేమీ ఊరు విడిచి వెళ్ళాల్సినంత  కష్టాలు ఇంక ఇక్కడ ఉండవేమో అన్న నమ్మకం వల్లనేమో కానీ  నేను 1వ బెటాలియన్ కి రాజీనామా పంపాను కానే రెండో బెటాలియన్ కి దరఖాస్తు పంపలేదు. ఊళ్లోనే వానలు పడితే వ్యవసాయం లేనపుడు ఉపవాసాలు చేసుకు బతికేద్దాం అని ఉండిపోయాను.
క్రమంగా ఊళ్ళో స్వాతత్ర్యం వల్ల పరిస్థితులు కొంచెం కొంచెంగా మెరుగుపడుతున్నాయి. మనం ఏదైనా పనిలో కష్టపడితే ఇంతకు ముందులా కాకుండా ఫలితం మనకే దక్కుతుందన్న నమ్మకం, భవిష్యత్తు మీద ఆశ పెరిగాయి మనుషులకి. ప్రజలకి కలిగిన ఇదే ఆశ, నమ్మకం ప్రకృతికి కూడా బాగానే కలిగినట్లుంది. ఆ  సంవత్సరం వర్షాలు బాగానే పడ్డాయి. అందరితో పాటు నేను కూడా వ్యవసాయపు కూలీ పనులకి వెళ్ళడం మొదలుపెట్టాను.
రాను రాను నా చుట్టూ మార్పు చాల వచ్చింది, అది పరిస్థితుల మీద అయితే నేను కూడా అంతగా పట్టించుకునే వాడ్ని కాదేమో, కానీ అది నా విషయంలో కాబట్టి గుర్తించగలిగాను. పనిలో ఉండగా ఎవరినన్నా సరదాగా ఏమన్నా అంటే దానికి వెటకారంగా మాట్లాడటం, మధ్యాహ్నం  అన్నంతినే దగ్గర నాతో కలిసి కూర్చోడానికి ఆలోచించడం, పనిలోకి వెళ్ళేటపుడు పిలవకపోవడం,  ఇదివరకు నా సిపాయి ఉద్యోగం వల్ల తప్పక గౌరవం నటించాల్సి వచ్చిన వాళ్ళంతా ఇపుడు ఆ నటనని వదిలి అసలు ఉన్న అసహ్యాన్ని అలా చూపడం మొదలుపెట్టారు. కాలం గడచినకొద్దీ జనాలు నన్ను ఏదో దొంగతనాలు చేసి జైలుకి పోయి వచ్చినట్లు, అంటరాని వాడిగా చూడటం మొదలుపెట్టారు. ఇపుడు చుట్టాల ఇళ్ళలో జరిగే ఏ శుభకార్యానికి మా ఇంటికి పిలుపురాదు, ఒకవేళ దేనికి అయినా వచ్చినా వెళ్తే మాకక్కడ పలకరింపు ఉండదు.
చివరికి మా ఇల్లు ఊరిమధ్యనే  ఉండి కూడా వెలివేయబడిన ఇల్లు, నేను జనాల మధ్యన ఉండగలిగి కూడా జనం పట్టించుకోని ఓ అంటరానివాడ్ని. తెల్ల దొరల పాలన ఉండగా వాళ్ళ  తరపున శిస్తులు వసూలు చేసి, తిరుగుబాటు చేయగలిగి కూడా గులాం గిరి చేసిన దొరలు ఇపుడు కూడా దొరలుగానే చెలామణి అవుతున్నారు. నేను ఆ రోజు చేసిన సిపాయి పనిగానీ లేదా ఈ రోజు చేసిన కూలీ పనిగానీ కేవలం నా మీద ప్రతిపూటా  దండయాత్ర చేసే ఆకలి అనే శత్రువుని చంపడం కోసం అన్నం అనే విషం సంపాదించుకోడానికే. కానీ ఇపుడు నేను మూడు రంగులద్దుకున్న ఈ దేశప్రజలనే సీతాకోకల గుంపులో ఉన్న ఓ గొంగళి పురుగుని. సంబంధాలన్నీ పోగొట్టుకోవడం వల్ల వచ్చిన ఏం చేసుకోలేని ఒంటరి  స్వేచ్ఛని పోగొట్టుకుని, నా చుట్టూ నలుగురు మనుషుల్ని సంపాదించుకోవాలనుకునే “దేశం ద్వేషించే సిపాయిని ” .
శివ బండారు

మీ మాటలు

*