ఆవేశం తప్ప సందేశం లేని నల్ల మిరియం చెట్టు !

  డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ వారు నల్ల మిరియం చెట్టు నవలపై చర్చాసమీక్ష వ్యాస రూపం ఇది

నవలా రచయిత: డా|| వి. చంద్రశేఖరరావు
ముద్రణ: చరిత ఇంప్రెషన్స్, హైద్రాబాద్
ప్రచురణ తేదీ: జనవరి 2012

చర్చాస్థలం: ఫార్మింగ్టన్ హిల్స్ గ్రంధాలయం, ఫార్మింగ్టన్ హిల్స్, మిషిగన్
తేదీ: మే 12, 2013
చర్చలో పాల్గొన్నవారు: ఆరి సీతారామయ్య, మద్దిపాటి కృష్ణారావు, వేములపల్లి రాఘవేంద్రచౌదరి, మారంరాజు వెంకటరమణ, బూదరాజు కృష్ణమోహన్, అడుసుమిల్లి శివరామకృష్ణప్రసాద్, పిన్నమనేని శ్రీనివాస్

డా. వి. చంద్రశేఖర రావు రచించిన ” నల్ల మిరియం చెట్టు” నవలను ఆసాంతం చదివి, మళ్ళి చదివితే గోచరించిన కథావస్తువు(లు) మూడు సమాంతర రేఖలుగా సాగాయనిపించింది. స్థూలంగా, ఇది రాజసుందరం అవకాశవాద రాజకీయ ప్రయాణభాగం, ఇది దళిత యువతకు ఆవిష్కృతమౌతున్న రాజకీయ చదరంగం, ఇది దళిత జీవన విధానంలోను, కళల్లోను ఉన్న ఔన్నత్యాన్ని చెప్పడానికి చేసే ప్రయత్నం.

కథాకాలానికి రాజసుందరం ఒక వ్యాపారవేత్త. పుట్టింది మాదిగ కుటుంబంలో. పల్లెల్లోని మాదిగల జీవితానుభవాలు తన కొడుక్కి అంటకూడదని, క్రైస్తవ మిషనరీల సహాయంతో కొడుకుని చదివించింది తల్లి. మాదిగల జీవితానుభవాలతో పాటు, తనవారి జీవితాల్నే అసహ్యించుకునే ఎత్తుకు ఎదిగాడు చదువుకున్న రాజసుందరం. ఉపాధ్యాయ వృత్తిని వదిలి, వ్యాపారవేత్తయై, అవసరానికి తను పుట్టిన కులాన్ని వాడుకుంటూ, రాజకీయ సోపానాలు అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నంలో లోపం ఎవరివల్ల కలిగినా సహించలేడు – కొడుకైనా, కూతురైనా, భార్యైనా, తమ్ముడైనా, తల్లైనా, ఆఖరికి తనకు ఉపయోగపడే కుల రాజకీయాన్నైనా. కారాదేదీ తన ఆశలకీ, ‘ఆశయాలకీ’ అడ్డంకి!

పల్లెల్లో ఉన్నంతగా కాకపోయినా, ఎంతో కొంత తను పుట్టిన కులం పేరుతో ఎదురయ్యే అవమానాలను చూసిన యువతి గ్రేస్ కమల – రాజసుందరం కూతురు. రాజసుందరం కొడుకు రూమీకి మాదిగ దండోరా ఒక ఆకర్షణ, వయసుకూ అనుభవానికీ మించిన ఆత్మగౌరవ నినాదం. అలాగే పేర్లతోనే పరిచయమైనా, వెనుక చిన్నదో పెద్దదో కథ ఉన్న యువతీయువకులు ఇంకొందరు. పల్లెల్లో మాదిగల జీవితానుభవాలను చవి చూసి సామ్యవాద ఉద్యమం బాసటగా కుల వివక్షపై పోరాడి, చివరకు మాదిగ దండోరా ఆత్మగౌరవ నినాదంగా స్వీకరించిన రాజసుందరం తమ్ముడు కరుణ కుమార్, మాదిగ యువతకు స్ఫూర్తి, ఆదర్శం. ఒక పక్క రాజసుందరం రాజకీయపుటెత్తులతో మాదిగలకు ఆత్మగౌరవాన్ని ప్రసాదిస్తానని చెప్పినా, రెండవవైపు మాదిగ దండోరాతో ఆత్మగౌరవాన్ని సంపాదించుకునే ప్రయత్నం పైనే ఈ యువత మొగ్గు. ఈ సందిగ్ధంలో ఆత్మగౌరవానికి బదులు ఆత్మనివేదనతో సరిపెట్టుకోవలసి వచ్చింది యువతరం.

కథంతా మనకు చెప్పే కమల ఇంటర్మీడియట్ విద్యార్ధిని. ఇంచుమించుగా పుట్టినప్పట్నించీ పట్టణంలోను, ధనవంతుడి బిడ్డగానూ పెరిగిన కమలకు మాదిగపల్లె జీవనం, వాతావరణం, సంస్కృతి, ఆహార వ్యవహారాలూ ఒక కాల్పనిక ఆకర్షణ. తండ్రి చేతిలో నిత్యమూ కౄర హింసకు గురయ్యే తల్లీ, ఊర్లోకి వచ్చిన కొడుకు పలకరింపుకు కూడా నోచుకోని నాయనమ్మల అన్యోన్యానురాగం కమలకు ఒక మనోహరమైన ప్రపంచం. డొంకల్లో చెయ్యి పట్టుకున్నందుకు కామందు పీచమడచిన మేనత్తలు, పోలీసులయేది, రాజకీయనాయకుడైన బావయేది లెక్క చెయ్యకుండా నిర్భయంగా ఎదురించగలిగే పిన్ని, కమలకు వీరోచిత ఆదర్శ జీవనులు. చివరకు, తండ్రిని లెక్క చేస్తూనే లెక్క చెయ్యని తమ్ముడు రూమీ కూడా కమలకు కలల పంటే.

ఈ మూడు కథలూ ఒకదాన్నొకటి పెనవేసుకుని నడిచేలా చెయ్యాలని రచయిత ఎంత ప్రయత్నించినప్పటికీ, దేనికదే. రాజసుందరాన్ని విడదీసి చూస్తే, అతనో నియంత, అవకాశవాది, కౄరుడు, ఏ లౌకిక భావనకూ లొంగని ఒక కర్మవాది. అతను మాదిగ కావడానికి, మాదిగగా అవమానాలు పడడానికి, వ్యక్తిగా రాజసుందరానికీ ఏమాత్రం సంబంధం లేదు. ఏ కులస్తుడైనా, ఆ కుటుంబంలో ఎవరెవరున్నా లేకపోయినా, రాజసుందరం ఒక psychopathic పాత్ర మాత్రమే.

కులాన్ని వాడుకుని రాజకీయంగా ఎదుగుతున్న రాజసుందరం అవకాశవాదియై, అవసరాన్నిబట్టి మాదిగ దండోరాను వ్యతిరేకించడం ద్వారా తన కుల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా తయారయ్యాడని రచయిత చెప్పదలిస్తే అందులో ప్రత్యేకతేమీ లేదు. అలాంటి అవకాశవాదులు ఏ ఒక్క కులానికీ, దేశానికీ, ప్రాంతానికీ, జాతికీ సొంతం కాదు. పైగా అన్ని అవలక్షణాలూ ఒకే పాత్రలో ఇమిడ్చి, రాజసుందరాన్ని ఒక కుల ద్రోహిగా కంటే, ఒక మానసిక రోగిగా మాత్రమే చూపించగలిగారు.

రెండవ కథావస్తువు మాదిగ దండోరా ద్వారా ఆత్మగౌరవ చైతన్యాన్ని కలిగించడం. అక్కడక్కడా సూచన ప్రాయంగా మాదిగలకు కలిగిన/కలుగుతున్న అవమానాలను, వాటిని ఎదుర్కోవడానికి మాదిగ దండోరా ఆవశ్యకతను చెప్పడమే గానీ, తాత్వికంగా, తార్కికంగా లోతుల్లోకి వెళ్ళి విశదీకరించే ప్రయత్నం జరగలేదు. జడ్జి నాగభూషణం ఆత్మహత్య దీనికి చక్కటి ఉదాహరణ. ఎంతో తెలివైనవాడు, చదువుకున్నవాడు, జిల్లా జడ్జి స్థాయికి ఎదిగినవాడు, ఎంతో అనుభవాన్ని కలిగినవాడు, అంత వయసులో ఆత్మహత్య చేసుకున్నాడంటే అంత సామాన్యమైన విషయం కాదు. మాదిగగా అతనికి కలిగిన అవమానాలు ఆ వయసులో కొత్త అనుభవాలు కాజాలవు. ఐనా ఆత్మహత్యకు పాల్పడేంత స్థితికి అతన్ని గెంటిన పరిస్థితులను పాఠకులకు విశదీకరించడంలో రచయిత విఫలమయ్యారు.

కేవలం అవమానాలకు గురయ్యారంటే సరిపోదు. యాసలోనో, భాషలోనో, వేషంలోనో, శరీరపు రంగులోనో, రూపంలోనో ఎప్పుడూ అందరం ఏదో ఒక రకమైన అవమానాన్ని ఎదుర్కుంటూనే ఉంటాం. ఒకరి హాస్యం మరొకరికి అవమానం. కానీ అవమాన భావన సమ ఉజ్జీల మధ్య లేదా సమ ఉజ్జీలనుకునే వారి మధ్యే ఎక్కువగా ఉంటుంది. కోట్లు గడించినవాడు బిక్షగాణ్ణి ‘నువ్వు దరిద్రుడివి’ అంటే ఆ కోటీశ్వరుడి అజ్ఞానికి బిక్షగాడు ‘అలాగా’ అని నవ్వుకుంటాడే తప్ప అభిమానపడితే ఒరిగేదేమీ లేదని తెలుసు. సమ ఉజ్జీలు ఎప్పుడూ స్థిరంగానూ ఉండరు. ఆర్ధిక సాంఘిక స్థితిగతుల్ని బట్టి మారుతూ ఉంటారు. రాజసుందరానికిగాని తన కుటుంబానికిగాని ఇప్పుడు తను పుట్టి పెరిగిన పల్లెలో అభినందనే గానీ అవమానం ఉండదు. కానీ పట్టణంలో తన ఆర్ధిక స్థితిగతులతో తూగే వాళ్ళు అవమానించదలుచుకుంటే కులాన్ని వాడుకుంటారు. కుల చరిత్ర తెలియకపోతే, రంగునో, ఆకారాన్నో, లేదా మరొకటో వాడుకుంటారు. కానీ పల్లెల్లో మాదిగలు ఎదుర్కొనే వివక్షకు, పట్టణంలో రాజసుందరం లాంటి వారికి ఎదురయ్యే అవమానాలకూ మౌలికమైన భేదం ఉంది.

తిండి, గుడ్డ, ఇల్లు లేని వాడికి వివక్ష ఒక జీవన్మరణ సమస్య. ఆర్ధిక స్థితిగతుల్లో రాజసుందరం లాంటి స్థాయిలో ఉన్నవారు ఏ కులంలోని వారైనా ఎవరో ఒకరి వల్ల, ఏదో ఒక రీతిలో వివక్షను ఎదుర్కుంటూనే ఉంటారు. అది డబ్బున్నవాడి జబ్బు లాంటిది, తగ్గకపోతే అది ప్రయత్నలోపం మాత్రం కాదు. మాయావతి చెప్పులు కొనుక్కోవడానికి ముంబాయి విమానంలో వెళ్ళడం, జయలలిత లంచాల రాజకీయాలు, నెహ్రూ కుటుంబం వారసత్వంగా పరిపాలన చేయాలనుకోవడం, అన్నీ మౌలికంగా ఒకటే. కానీ మాయావతి విలాసం కులపుటద్దంలో, జయలలిత లంచగొండితనం నీచ రాజకీయంగాను, నెహ్రూ కుటుంబ అధికారకాంక్ష సహజమైనదిగాను ప్రదర్శించబడుతుంది. వీటివల్ల వాళ్ళ బ్రతుకుదెరువుకేమీ లోపం రాదు. అంతా రాజకీయ చదరంగమే.

అందులో నెగ్గగలిగిన వాడు నెగ్గుతాడు, లేనివాడు ఓడిపోతాడు. వాళ్ళకు కలిగే అవమానాలకు జాలి పడాల్సిన అవసరమూ లేదు, దానికి వాళ్ళు కృంగిపోయేదీ లేదు. కానీ, జడ్జి నాగభూషణానికి కులం పేరుతో జరిగే చిన్నచూపు అతని ఆత్మగౌరవానికి గొడ్డలిపెట్టు, కరుణకైతే అది జీవన్మరణ సమస్య. వీరిద్దరి అనుభవాలు మౌలికంగా మానవతావాదానికి సంబంధించినవి. మాదిగలకు ఆత్మగౌరవ చైతన్యాన్ని కలిగించడం నవల ఉద్దేశమైతే, వీరి జీవితాలను, ముఖ్యంగా నాగభూషణం జీవితాన్ని ఆధారంగా చేసుకుని తాత్విక చర్చ జరగవలసింది. రాజసుందరం లాంటి అవకాశవాదుల వల్ల మాదిగలకు వచ్చే రాజకీయ ముప్పుకంటే, సమాజంలో తమ వ్యక్తిత్వాన్ని అన్ని రకాలుగానూ నిరూపించుకున్నప్పటికీ ఎదురయ్యే వివక్షను జయించడం కష్టమైన పని. చంద్రశేఖరరావు లాంటి మేధావులు దృష్టి సారించవలసినది, ఈ మౌలిక సమస్యలమీద. లేక, ఇది కేవలం దళిత వర్గీకరణ సమస్య మీద మాత్రమే ఐతే, ఇదొక రాజకీయ నవల మాత్రమే అవుతుంది, వర్గీకరణను తిరస్కరించే వారి కథలకూ సిద్ధపడాల్సి ఉంటుంది. ఫలితం రాజకీయ చదరంగమే కానీ, దళితుల బాగోగులు కాదు!

పాత్రలను సృష్టించి, అవే కథను నడిపించేట్టుగా జాగ్రత్త తీసుకుని, తను ప్రేక్షకుడిగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్టు రచయిత చెప్పుకున్నారు. కానీ, కథ చెప్తున్న కమల వయసుకు, అనుభవానికి మించిన వివరణలు రచయిత ఆశయం నెరవేర్చలేకపోయాయి. కమల పుట్టింది పల్లెలో కాదు. ఆ మాటకొస్తే, రాజసుందరం కూడా పల్లెలో కమలకు రెండేళ్ళప్పుడు కొన్ని నెలలు మాత్రమే ఉన్నాడు (పేజి: 77). కానీ పల్లె గురించిన కమల వర్ణనకు, తనకు పల్లెతో ఉన్న సంబంధానికీ పొత్తు కుదరదు. కమల కలల్లో మాదిగలకు ఇతర వర్గాలకు జరిగిన పోరాటాల వర్ణన, కేవలం విన్నంత మాత్రాన వచ్చే కలలు కావు. పెంచుకుంటున్న పావురాలు చచ్చిపోయాయని (ఎవరో చంపేశారని) పదకొండేళ్ళ పిల్ల బడి ఎగ్గొట్టి పిచ్చిపట్టినదానిలా ఊరంతా తిరగడం (అదీ పట్టణంలో) వయసుకు తగ్గ పనేనా (పేజీ: 57)? సాధారణంగా చిన్న వయసులోని అనుభవాలను, అప్పట్లో నచ్చినా నచ్చక పోయినా, వాటికి దూరమైనప్పుడు గుర్తు తెచ్చుకుని గతకాలం గొప్పదనాన్ని ఊహించుకుని ఆనందించడం పరిపాటి. కమల పుట్టింది, పెరిగింది, పట్టణంలోనే. తన చిన్ననాటి అనుభవాలన్ని, పట్టణానికి సంబంధించినవే కానీ పల్లెతో కాదు (చుట్టపు చూపుగా వెళ్ళినప్పుడు తప్ప). అలాంటిది, మట్టి, పేడ, చెమట కలసిన వాసనను రొమాంటిగ్గా ఊహించుకోగలిగే అవకాశం కమలకు లేదు, రచయితకు తప్ప.

ఇక రచనా శైలిలో చాలా ఇబ్బందే ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా బ్రాకెట్లలో ఇచ్చిన వివరణలు. ఇవి కమల పాత్ర స్వగతాలో, రచయిత వివరణలో, చారిత్రక సత్యాలో తెలియని అయోమయ స్థితి. చాల వరకు, ఇవి నాటకాల్లోని ‘స్వగతముగా’ అని వ్రాసిన మాటలను పాత్ర గొంతెత్తి అరిచినట్లుగా అనిపిస్తాయి. పోనీ ఇవన్నీ కమల స్వగతాలా అనుకుందామంటే, ప్రధమ పురుషలో చెప్పే కథకు వీటి అవసరం కనిపించదు, వాక్యాన్ని తిరిగి రాయడం బద్ధకమైతే తప్ప. చాలా చోట్ల బ్రాకెట్లు తీసేస్తే, చెప్పదలుచుకున్న విషయానికి లోపమూలేదు. ‘గుండ్లకమ్మ (నది కాదు వాగు) …’ అని వివరించడంలో (పేజి: 81) ఒక అపోహను పోగొట్టే ప్రయత్నం ఉంది. కానీ, ‘వేదిక చివరన ఒక మూలన కరుణ బాబాయి (శాపగ్రస్తుడిలా) కూలబడ్డాడు.’ (పేజి: 101) అని వ్రాయాడంలో ఒరిగిందేమిటి? ఇంకొక చోట (పేజి: 170), ‘అందరూ బాలెట్ పేపరుపై దండోరా నినాదాలు రాసి వెళ్ళారు (ఆ విషయం బాలెట్ బాక్స్ లు ఓపెన్ చేసినాక తెలిసింది)’. ఇది రచయితను పాఠకులు ‘నీకెలా తెలుసు?’ అని ప్రశ్నిస్తారేమోననుకుని ఇచ్చుకున్న జవాబులా లేదూ? తొంభై నాల్గవ పేజీలో ఉపన్యాసం వ్రాస్తున్న సందర్భాన్ని గురించి వివరిస్తూ, ‘మొదటి పేరాలో నలభై ఏళ్ళ క్రితం దళితులు (కులం పేరు కావాలనే రాయలేదు) ….’ అని వ్రాయడంలో, బ్రాకెట్లలోని వాక్యం ఎవరినుద్దేశించి? రచయితనా? ఉపన్యాసాన్ని వ్రాస్తున్న వాళ్ళనా? లేక కథ చెప్తున్న కమలనా? ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అక్కడక్కడా కొన్ని వాక్యాలను తిరిగి వ్రాయాల్సి వచ్చినా, మొత్తం మీద బ్రాకెట్లన్నీ ఏరి పారేస్తే వచ్చే నష్టం లేదు సరికదా, ‘దీని భావమేమి తిరుమలేశా?’ అని పాఠకులు బుర్ర గోక్కోవాల్సిన అవసరం తప్పేది. ఇక కథా గమనంలో ముందు వెనుకలు పాఠకుణ్ణి చాలా ఇబ్బందులు పెడతాయి.

నాలుగవ అధ్యాయం మొదలు, ‘జనవరి చివరి వారంలో ….’ తో మొదలవుతుంది. ఒకటిన్నర పేజీ గడిచాక, ‘ఆ జనవరి నెలలో అనుకోకుండా మేము తాతయ్య వాళ్ళ ఊరికి బయలుదేరాము’ తో మొదలై 38 పేజీలు నడుస్తుంది, ఐదవ అధ్యాయం చివరిదాక! అలాగే, 73 వ పేజీలో, మొదటి పంక్తిలో ‘ఐదారేళ్ళ కాలంలో ఎంతో మారిపోయాడు’ అని బాబాయిని వర్ణించి, రెండవ పేరా మొదట్లో ‘పదేళ్ళలోనే ఎంత మారిపోయాడు’ కు వెళ్తుంది! రాజసుందరం తల్లి బ్రతికుండగా చేసిన వర్ణనలోనే ‘మిషన్ స్కూల్లో ఎందుకు వేశానా అని నాయనమ్మ చివరి రోజుల్లో చాలా బాధ పడేది’ అని వ్రాయడం చంద్రశేఖరరావు లాంటి అనుభవజ్ఞులైన రచయితలు చెయ్యాల్సిన పని కాదు. పైగా నవల చివరిలో నాయనమ్మ చావు కమల దగ్గర ఉండగానే జరిగింది, అప్పటివరకు నాయనమ్మతో చాలా సంభాషణలే జరిపింది. ఎక్కడా తండ్రి గురించిన ఫిర్యాదు కమల నాయనమ్మ దగ్గర వినలేదు. ఇవన్నీ రచయిత తను వ్రాసింది తిరిగి చదువుకుంటే వదిలించుకోగలిగే దోషాలే. కానీ చదువుకున్నారా అన్నదే అనుమానం! ఎందుకంటే, తన రచనలో దొర్లిన పరస్పరవైరుధ్యాలను పోల్చుకోలేని రచయిత కాదుగనక. మరొక్క మాట: పుస్తక ప్రచురణలో అచ్చు తప్పులు దొర్లకుండా జాగ్రత్త పడవలసిన అవసరం గురించి పదే పదే చెప్పడం చెప్పేవారికి, వినేవారికీ విసుగనిపించినా చెప్పక తప్పదు. ఇది ఈ పుస్తకానికి మాత్రమే కాదు, చాలా తెలుగు పుస్తకాలకు వర్తిస్తుంది. ఒకే మాటకు ఎన్నో అర్ధాలున్న తెలుగులో, తెలుగుకు ఒక ప్రామాణిక నిఘంటువు లేని పరిస్థితుల్లో, ఇవి అచ్చు తప్పులో, పాఠకుల పరిమిత జ్ఞానానికి అందని పదాలో తెలియని అయోమయస్థితి ఏర్పడుతుంది. ఈ అయోమయస్థితి నుండి పాఠకుల్ని రక్షించగలిగేది ఒక్క ప్రచురణకర్తలే!

చివరిగా, శివారెడ్డి గారి ముందుమాట మరీ నిరాశ పరిచింది. ఇది ఆషామాషీగా రాసిన ముందుమాట కాదు. చంద్రశేఖరరావు గారిని రచయితగాను, వారి రచనలను బాగా చదివి ఆకళింపు చేసుకున్న కవి శివారెడ్డి గారు. ముందుమాట విశ్లేషించి రాసే విమర్శ కాకపోవచ్చు. కానీ చంద్రశేఖరరావు గారికి పేరు తెచ్చిన రచనలతో పోల్చి చూస్తే, ఈ నవల చాలా నాసి రకమని మా అభిప్రాయం. పైన మేము ఉదహరించిన లోపాలేవీ శివారెడ్డి గారికి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పైగా ఒక పురాగాథను కథనం చేయడంలో కొట్టుకు పోయారంటూ, కళ్యాణరావు గారి ‘అంటరాని వసంతం’ నవలతో పోల్చారు. అంటరాని వసంతం ఒక చరిత్ర గానం, ఒక మాల పురాణం. ఈ నవల మాకు తోచినంత వరకు వర్తమాన రాజకీయం. ఈ రాజకీయ చరిత్రలో ఏ కులం పేరు పెట్టినా, లేదా ప్రాంతాల వివక్షలను గురించి ప్రస్తావించినా కథ మారదు. కథ చెప్పడంలో ఒక ఆవేశానికి రచయిత కొట్టుకుపోయాడనిపిస్తుంది. కానీ అది రాజకీయ ఆవేశంగా పరిణమించిందే తప్ప, మాదిగల చరిత్రను, ఆత్మగౌరవ సందేశాన్ని ఆవిష్కరించినట్లనిపించలేదు.

సమీక్షకుడు: మద్దిపాటి కృష్ణారావు

మీ మాటలు

  1. buchireddy gangula says:

    ఈ నవల చాల వరకు నాసి రకము అని మా అబిప్రాయం–???
    కాధ ను కుంటాను–మంచి నవ ల— శివా రెడ్డి గా రి
    ముం ధు మాట తో నేను ఏ కి బ విస్తాను—
    ఈ మధ్య వస్తున్న నవలా సాహిత్యం లో–డాక్టర్ చంద్ర శేఖర రావు గారు
    కాశి బ ట్ల వేణుగోపాల్ గారు– గొప్ప న వ లా రచయితులని నా అబిప్రాయం–
    ———————
    బుచ్చి రెడ్డి గంగుల

  2. ‘వర్గీకరణను తిరస్కరించే నవల’ అనే ఒక అబ్జర్వేషన్ తప్ప మిగతా సమీక్ష అంతా సిల్లీగా అనిపించింది.

  3. రమాసుందరి says:

    ఈ నవల నవ్యలో అనుకొంటాను, వచ్చేటప్పుడు చదివాను. చాలా విషయాలు ఒకే నవలలో కూర్చాటానికి ప్రయత్నం చేసినట్లుగా అనిపించింది. అందువలన కధకు సహజత్వం పోయి, కొన్ని దగ్గర్ల (మరీ చివర్లో) ప్రవచనాలు గా కనిపించినట్లు గుర్తు. మాదిగ కుటుంబాలలో కూడ స్త్రీ అణచివేత వివరణ, కమల తల్లిని అర్ధం చేసుకొన్న పద్దతి నాకప్పుడు నచ్చాయి.

  4. balasudhakarmouli says:

    nallamiriyam cettu navalaku- కే.శివారెడ్డి gaaru raaina mundu మాట.. ఒక pravaaham… nijaaniki- mundu మాట ఎంత balangaa, ఉత్సాహంగా సాగిందో- navala కూడా నాకు అలాగే అనిపించింది. mundhu మాట chadivina ఎవరైనా కథలోకి- ఒక mahaa sakthitho pravehisthaaru….

Leave a Reply to balasudhakarmouli Cancel reply

*