రెహ్మాన్ తుఝే సలాం!

AR-Rahman_1290837c

ఓ జనవరి మాసంలో, కాలేజి హాస్టల్లో, బయట కొంకర్లు పోయే చలినుండి తప్పించుకొనే ప్రయత్నంలో, రజాయి క్రింద పూర్తిగా దూరిపోయి నిద్ర పోతున్న ఓ ఉదయాన, హటాత్తుగా, నా రూం గోడలు కంపించటం ప్రారంభించాయి. విపరీతమైన “బేస్” తో, హార్డ్ రాక్ మెటల్ మ్యూజిక్ పెట్టి నన్ను తెగ చికాకు పెట్టే వింగ్ చివరి పామ్ గాడి పనయ్యుంటుందని ఊహించి, రజాయిని ఇంకా గట్టిగా కాళ్ళతో నొక్కి పట్టి బిగించా. పాట మొదలయ్యింది.

.

“కొంజెం నిళవు… కొంజెం నెరుప్పు…ఒండ్రాయి సీంతాల్ ఎందం దేహం..” ఒక్క సారి నిద్ర వదిలిపోయింది. ఎంత మంది తమిళులతో సావాసం చేసినా, అంతుబట్టని ఆ భాషను విసుక్కుంటూనే చెవులను రిక్కించా. మన పాటలలో పెద్దగా వినపడని ఏవో శబ్దాలతో నేపథ్య సంగీతం హోరెత్తిస్తోంది.

“కొంజెం నంజు…కొంజెం అముతం…కొంజెం మిరుగం..కొంజెం కడువల్…” ఆ బీట్ కి ఇంకా ఆగలేక రజాయి పూర్తిగా లాగి పారేశా. “చంద్రలేఖా……”, గబుక్కున మంచం మీద నుంచి దూకి, రూం డోర్ తీసి ఆ శబ్దం వస్తున్న దిశ వైపు వడిగా నడిచా. వింగ్ చివరి పామ్ గాడే! వాడి లైఫ్ లో, ఇంగ్లీషు పాటలు తప్పించి ఇంకే భాషా సంగీతం వినటం నేను చూడలేదు!
వాడి రూమ్ తలుపు నెమ్మదిగా నెట్టి లోపలికి తొంగి చుస్తే, అయిదారుగురు “ఛోమ్స్” (మా కాలేజి లింగోలో నార్త్ ఇండియన్స్ ని సంబోధించే తీరు), గాలి గిటార్లు కొడుతూ తన్మయత్వంతో ఊగిపోతున్నారు. వాళ్లనలాగే చూస్తూ పాట పుర్తయ్యేవరకూ ఆగి లోపలికెళ్ళా. అదేదీ కొత్త రాక్ బ్యాండ్ కాదు, “తిరుడా తిరుడా” అనే తమిళ్ సినిమాలో, రహ్మాన్ పాటని తెలిసి విస్తూపోయా. భాష ఏ మాత్రం తెలియని జనాలని కుడా తన సంగీతంతో ఉర్రూతలూగించగలిగిన ఈ మాంత్రికుడితో ఒక సుదీర్ఘప్రయాణం మొదలవ్వబోతోందన్న విషయం, అప్పట్లో తట్టలా.

“రోజా” చిత్రం తో అప్పటికే పరిచయమైన రెహ్మాన్ అంటే ఒక రకమైన నిరసన భావం ఉండేది. దానికి కారణం, ఆ చిత్ర దర్శకుడు మణిరత్నం ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యు నే.  రోజా పాటలు దక్షిణభారతమంతా మారుమోగిపోతున్న సమయంలో, “రెహ్మాన్ బాగా టాలెన్టెడ్. క్రొద్ది రోజులలో నే ఇళయరాజా ని మించిపోతాడు” అన్న అతగాడి మాటలు చదివి  నాకు చిరాకు తో మిళితమైన ఆవేశం వచ్చింది. అప్పటి వరకూ వచ్చిన మణిరత్నం సినిమాలన్నిటికీ అద్భుతమైన సంగీతాన్ని అందించిన రాజా ని, కేవలం ఒక్క సినిమా కి పాటలు కొట్టిన రెహ్మాన్ తో పోల్చటమే కాకుండా, అతడిని దాటి వెళ్తాడు అనేసరికి, రాజా వీరాభిమనినైన నాకు కాలదు, మరీ!

కానీ, ఒక ఆర్టిస్టు లోని ప్రతిభను అంత లోతుగా గుర్తించి, ఇంకా ఏమీ సాధించని ఆ జూనియర్ మీద అంత ధైర్యం గా జోస్యం చెప్పగలగటం, మణిరత్నం యొక్క గొప్పతనం అని నాకర్ధమయ్యింది, నా 20/20 వెనకచూపుతోనే.

“తిరుడా తిరుడా” పాటలలో రెహ్మాన్ చేసిన పెద్ద ప్రయోగం, పరిచయమున్న గొంతులను (మనోను మినహాయించి) ఏ పాటలకూ వాడకపోవటం. ఆ ప్రయోగం, మున్ముందు, అగ్ర సంగీత దర్శకులలో  రెహ్మాన్ యొక్క స్థానాన్ని మరింత పటిష్టపరుస్తుందన్న విషయం, బహుశా అతడు కుడా ఊహించిఉండకపోవచ్చునేమో! అతని “చలవ” వల్లనే, చాలా మందికి ఇప్పటికీ ఆ పాటలు పాడిన గాయనీ గాయకుల పేర్లు తెలియవు. ఆ పాటలన్నీ రెహ్మాన్ పాటలు! అంతవరకూ పాటలన్నీ చాలా వరకూ వాటిని పాడిన వారి గళాలతో తో ముడిపెట్టి గుర్తించేవారు.

రెహ్మాన్ తెలుగులో ఇప్పటి వరకూ డైరెక్టుగా చేసిన సినిమాల్లోని పాటలేవీ అంత గుర్తుపెట్టుకోదగ్గవి కావు. “సూపర్ పోలిస్”, “గ్యాంగ్ మాస్టర్” నించి రెండేళ్ళ క్రితం విడుదలైన “కొమరం పులి” వరకూ ఏవో ఒకటీ, అరా జనాదరణ పొందినా, తమిళం లో, హిందీలో చూపించిన చిత్తశుద్ది తెలుగులో చూపించలేదేమోనన్న అనుమానం రాక తప్పదు, కారణాలేవైనా. అతడి డబ్బింగు పాటలు మాత్రం, ఆ లిరిక్స్ ఎంత అతకనివైనా, విపరీతమైన జనాదరణ పొందాయి. జంటిల్మెన్ చికుబుకులూ, ఇండియన్ టెలిఫోన్ ధ్వనిలో నవ్వటాలూ, ప్రేమికుడు పేట ర్యాప్ లు, ప్రేమ దేశం ముస్తఫ్ఫాలూ, ఇలా సరదా పాటలతో నా రెండేళ్ళ జీవితం గడచిపోయింది.  మణిరత్నంతో చేసిన బోంబే పాటలు మాత్రం వీటన్నిటికీ భిన్నంగా రెహ్మాన్ లోని దాగున్న ఆ

“జీనియస్” ని, ఛాయామాత్రంగానైనా చూపించాయి.

“మెరుపు కలలు” పాటలు మార్కెట్ లోకి విడుదలైనంతనే వెళ్లి క్యాసెట్ కొనుకొచ్చి పాటలన్నీ ఒకసారి వినేశా. ఏ ఒక్కటీ నచ్చలేదు. అప్పటికీ రాజా పిచ్చ వదలని నేను, అదే సమయం లో విడుదలైన “చిన్నబ్బాయి” పాటల క్యాసెట్ కుడా కొన్నా. విన్న వెంటనే, ఒకటి రెండు పాటలు నోట్లో ఆడటం ప్రారంభించాయి. “ఎంతైనా రాజా రాజానే” అనుకొని తృప్తిపడిపోయి, ఆ రెండూ పక్కన పడేశా. కానీ ఆ సమయంలో బెంగుళూరులో ఉంటున్న నాకు, ఎక్కడికి వెళ్ళినా ఆ “మెరుపు కలలు” పాటలే తమిళం లో వినిపించేవి. విన్న ప్రతిసారీ అంతకు మునుపు కంటే ఇంకా ఎక్కువగా నచ్చటం ప్రారంభించాయి. ఆ పాటలు ఆ తరువాత ఎన్ని వందల సార్లు విన్నానో నాకు గుర్తు లేదు. కానీ రెహ్మాన్ సంగీతంలో ఒక నిశ్చితమైన మార్పుని గమనించింది మాత్రం ఈ సినిమా పాటలతోనే! ఆ పాటల తరువాత అతని ఆల్బమ్స్ అన్నిటిలోనూ దాదాపుగా అదే వైఖరి నాకు కనిపించింది. చాలా పాటలు విన్న వెంటనే నచ్చెయ్యవు; కొద్ది సార్లు విన్న తరువాత మాత్రం ఆ పాటలను వదలిపెట్టలేం; ఎన్నో ఏళ్ళు వెంటాడతాయి. “వెన్నెలవే వెన్నలవే”, “అపరంజి మదనుడే, అనువైన సఖుడులే” అవే కోవలోకొస్తాయి.

అదే సమయంలో నేను అమెరికా వచ్చెయ్యటం జరిగింది. ఎన్నో సార్లు “అపరంజి మదనుడే” అని పాడుకొని, “ఆహా ఎంత మధురమైన  ప్రేమ గీతం! ఒక ప్రియురాలు తన ప్రియుడిని ఎంత చక్కగా వర్ణిస్తోంది” అని నా మందమతి మురిసిపోయేది, ఆ తరువాత వచ్చే లిరిక్స్ ఏమీ పెద్దగా అర్థం కాకపోయినా. అప్పటికే రంగీలా పాటలతో ముదిరిపోయిన నా రెహ్మాన్ పిచ్చిని గుర్తించిన నా స్నేహితురాలొకావిడ, “సప్నే” క్యాసెట్ ను నాకు ఇండియా నించి పంపించింది.

మొదటి పాట: “రోషన్ హుయీ రాత్, ఓ ఆస్మా సే జమీ పె ఆయా.. రోషన్ హుయీ రాత్, మరియం కా బేటా ముహొబ్బత్ కా సందేస్ లాయా”. ఆ క్షణంలో నాకు రెహ్మాన్ తెలుగు పాటంటే కలిగిన విరక్తి, నా అభిమాన గీత రచయిత వేటూరి చేసిన అరాచకం పైన నాకు కలిగిన ఆగ్రహం, నన్ను పూర్తిగా రెహ్మాన్ హిందీ పాటల వైపుకి త్రోసేసాయి. ఎంతగా అంటే, “విశ్వవిధాత” అనే హిందీ సినిమాకి రెహ్మాన్ సంగీతం అందించాడని తెలిసి, ఒక డెభ్భై అయిదు మైళ్ళు, ఆదివారం రాత్రి డ్రైవ్ చేసుకెళ్ళి, క్యాసెట్ కొనుక్కొని వినేంతగా!

అదే సంవత్సరం విడుదలైన “ఇరువర్” లోని “శశివదనే శశివదనే, స్వరనీలాంబరి నీవా”, రెహ్మాన్ సంగీతంలోని ఒక కొత్త పార్శ్వాన్ని నాకు పరిచయం చేసింది. “ఓ చెలియా నా ప్రియ సఖియా” లాంటి పాటలు అడపా దడపా రెహ్మాన్ సంగీతంలో వినిపించినా, ఆతని పాటల్లో దాగున్న కర్నాటక రాగాల పోకడల గురించి ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. “ఇద్దరు” సినిమాలోని ఆ పాటలో మాత్రం ఆ రాగాలతో ఒక కొత్త ప్రయోగమే చేసాడు. ఆ పాటలో  వినిపించిన రెండు మూడు రాగాలు సాంప్రదాయ రాగమాలిక లాగా కట్టలేదు. మగ గొంతుక ఒక రాగం, ఆడ గొంతుక దాదాపుగా అదే రాగమైనా, కొద్ది పాటి తేడాలు, చరణం కొంత భాగం ఇంకొక రాగం, ఇలా అన్నమాట. శాస్త్రీయ సంగీత నేపథ్యం పెద్దగా లేకపోవటం వల్ల అవేమిటోకొన్ని ఏళ్ల తరవాత గానీ గుర్తు పట్టలేదు, అదీ గూగుల్ దయ వల్లే. కానీ రెహ్మాన్ ఈ రాగాల తో చేస్తున్న విన్యాసాలను కొంచెం జాగర్తగా గమనించాలి, ఇక ముందు, అని మాత్రం అనిపించింది, ఈ పాట తరువాతనే.

రెహ్మాన్, మణిరత్నం కలిసినప్పుడల్లా మాత్రం ఒక సంచలనమే సృష్టించారు. “దిల్ సే” ఆల్బం రెహ్మాన్ ని జాతీయస్థాయి లోని అగ్రసంగీత దర్శకుళ్ళలో చేర్చేసింది. సుఖవిందర్ సింగ్ “ఛయ్య ఛయ్య” తో దేశాన్ని ఒక ఊపు ఊపితే, “ఏ అజ్నబీ”, “జియా జలే, జాన్ జలే”, “దిల్ సే రే” పాటలు ఇప్పటికీ పాటల రియాలిటీ షోలలో తరచుగా వినపడుతూనే ఉంటాయి. సినిమా సక్సెస్ తో సంబంధం లేకుండా ఈ పాటలు సూపర్ హిట్టై, మన భారతదేశమే గర్వించదగ్గ దర్శకులలో ఒకరైన మణిరత్నం ప్రకాశాన్ని కూడా, రెహ్మాన్ వెలుగులో కప్పేశాయి. ఒక దక్షిణభారతీయుడిగా, ఒక్కసారిగా నాకు చెప్పలేని, ఆనందం, గర్వం కలిగింది, ఈ పాటలు దేశమంతటా ప్రాచుర్యం పొందగానే. ఒక ఘంటసాల, ఒక ఇళయరాజా దాటుకెళ్ళలేని ఉత్తర, దక్షిణదేశాల మధ్య ఉన్న అడ్డుగోడ అవలీలగా దాటేసి,  “యూనివర్సల్” ఆమోదాన్ని ఇతగాడు సాధించగలిగాడన్న ఆనందం అసలు కారణమేమో!

స్వతంత్ర భారతం యాభై ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా రెహ్మాన్ “వందేమాతరం” ఆల్బం చెయ్యబోతున్నాడన్న వార్త వినగానే, నా ఆశలు ఆకాశాన్నంటాయి. ఎదో, ఒక్క రోజు పని, మీద న్యూయార్క్ వెళ్ళాల్సివచ్చినప్పుడు, అక్కడ చుడాల్సినవి ఎన్నో ఉన్నా, తిరుగు  ఫ్లైటు ఎక్కటానికి ముందు మిగిలున్న నాలుగు గంటలు మాత్రం నేను ఒకే పనికి అంకితం చెయ్యాలని నిశ్చయించేసుకొన్నా.  “జాక్సన్ హైట్స్” కి వెళ్లి అక్కడ ఆ రోజే విడుదలైన ఆ ఆల్బం కొందామని. సి.డి. కొన్నప్పటినుంచీ ఎప్పుడెప్పుడు విందామా అని తెగ ఆరాటపడిపోయా. పిట్స్బర్గ్ లో ఫ్లైట్ లాండ్ అయిన ఇరవై నిమిషాలకి ఆ అవకాశం దొరికింది.

కారులోని ప్లేయర్ లోకి, సి.డి.ని తోసేసి, హైవే ఎక్కంగానే సిస్టం ఆన్ చేశా. ఆరు స్పీకర్లనించి మొదలయ్యింది, “మా తుఝే సలాం” అంటూ హై పిచ్ లో రెహ్మాన్ పాట.  ఒళ్ళు ఒక్కసారి గుగుర్పొడిచి శరీరంలో  ఒక కంపన మొదలయ్యింది. ఒక రకమైన ఆవేశంతో, ఒళ్ళు తూలిపోతూ, కారు వశం తప్పి ప్రమాదం జరుగుతుందేమో అనిపించేంతలా, కదిలించేసింది, ఆ పాట. “వందేమాతరం” అన్న రెహ్మాన్ చేసిన నినాదం తలుచుకుంటూ౦టే ఇప్పటికీ అది నా చెవుల్లో, ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఏ మూలో, నిస్తేజంగా పడిఉన్న దేశభక్తిని ఒక్కసారి ఉవ్వెత్తున లేపినందుకేనేమో, ఆ పాట అంటే అంత మోహం!

“ఇస్క్”బినా అంటూ మొదటి పాటతో బాగా ఇరిటేట్ చేసినా, “తాల్” చిత్రంలో రెహ్మాన్ పాటలలో చూపించిన నేర్పు, వైవిధ్యం, సామాన్యమైనది కాదు. “రాంఝణావే, సోణియావే, మాహియావే” అంటూ పక్కా పంజాబీ పాట, “కరియేనా, కరియేనా కోయి వాదా కిసిసే కరియేనా” అంటూ ఒక యూ.పి. పల్లె పాట, సింఫనీ స్టైల్లో టైటిల్ పాట ఇలా, ఏ పాట కా పాటే అద్భుతంగా స్వరపరిచారు, రెహ్మాన్. ఈ ఆల్బమ్ తో ఇక హిందీలో కూడా ఎవ్వరూ పట్టించుకోనంత (చేరుకొనే శక్తి లేదని గ్రహించుకొని) ఎత్తుకు ఎదిగిపోయాడు, అతడు.

ఇక “లగాన్” పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆ సినిమా ఆస్కర్ అవార్డులకి ఎంపిక అవ్వటంతో, రెహ్మాన్ పరిచయం బయట ప్రపంచానికి కూడా తెలిసిపోయింది. ఆండ్రూ ల్లాయాడ్ వెబ్బర్ సారధ్యంలో, “బోంబే డ్రీమ్స్”, మ్యూజికల్ కి రహ్మాన్ పెద్ద కష్టపడకుండా సంగీతం అందించి, అంతర్జాతీయ మ్యూజిక్ సీన్ లో తనకొక ఐడెంటిటీ ని ఏర్పర్చుకున్నాడు. ఆఫీసు పని మీద లండన్ వెళ్ళిన నేను, ఆ షో ముందరి వరస సీటు కోసం ఎక్కువ ధర చెల్లించి, నా వంతు దక్షిణని నేను సమర్పించుకున్నాను.
“స్వదేశ్” సినిమాలోని “యే జొ దేశ్ హై తేరా..”, ఇంకొక వీడని నీడ లాగా వెంటాడే పాట.

నేను అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు వచ్చిన ఆల్బం ఇది. ఈ పాట వింటున్నప్పుడల్లా, నా దేశ పౌరసత్వాన్ని కోల్పోబోతున్నానే, అని గుండె ఎక్కడో కలుక్కుమనేది. ఆ పాట నా నిర్ణయాన్ని మార్చలేదు కానీ,  నా భారతీయ ఉనికికి నేను మరింత కట్టుబడి ఉండటానికి ఎంతో కొంత దోహదపడింది. అలాగే “లెజెండ్ అఫ్ భగత్ సింగ్” లోని “సర్ఫరోష్ కి తమన్నా అబ్ హమరే దిల్ మే హై!” తీసుకున్నా, అదే సినిమాలోని “మాయే..రంగ్ దే బసంతి ఛోలా”, “రంగ్ దే బసంతి”  సినిమాటైటిల్ సాంగ్ తీసుకున్నా, ఆ పాటలు మనలో కలగజేసే అనుభూతులతో, రోమాలు నిక్కబోడుచుకోక మానవు!

భక్తి పాటలు తీసుకున్నా కూడా, రెహ్మాన్ చాలా గుర్తుండిపోయేవి అందించారు. సూఫీ శైలిలో, “పియా హాజీ అలీ”, “ఖ్వాజా మేరె ఖ్వాజా”, భజన ఫక్కీలో “ఓ పాలన్ హారే”, “మన్ మోహనా” అని శాస్త్రీయంగానూ తన ముద్ర వేస్తూనే అందరి ఆమోదాన్ని పొందగలిగారు. శాస్త్రీయ సంగీత రాగాలతో రెహ్మాన్ చేసిన ప్రయోగాలు కుడా కోకొల్లలు. “మామ” రాగాలకు ఎంతో నిబద్ధుడై తన పాటలను స్వరపరిస్తే, “రాజా” అదే రాగాలను జనాలకు బాగా తాకే రీతిలో సులువైన బాణీలు కట్టి తన వైదుష్యాన్ని ప్రదర్శించారు. రెహ్మాన్ ఆ రాగాలకే క్లిష్ఠతరమైన బాణీలు తనదైన శైలిలో కూర్చటంతో, ఎంతో పరిజ్ఞానం ఉంటే గానీ ఆ ప్రయోగాలని గుర్తించటం కష్టం. నేను రెహ్మాన్ ఆల్బమ్లు విడుదల అవ్వంగానే మన తమిళ సోదరులు ఆ పాటలలోని రాగాలను చీల్చి, విశ్లేషించి వ్రాసే బ్లాగుల కోసం ఎదురు చూసేవాడిని.
ఎంత చెప్పుకున్నా తరగదు అనిపించేలా ఉన్న  రెహ్మాన్ ఖజానా లోని పాటలను నిజంగా లెక్కెట్టి చూసి, తన సమకాలీన దర్శకులతో పోలిస్తే, ఆ సంఖ్య తక్కువే. “క్వాంటిటీ” కంటే “క్వాలిటీ” ముఖ్యమనుకొని, ప్రతి పాటనూ ఎంతో ప్రయాసతో శ్రద్ధగా చెక్కుతూ ఎక్కువ సమయం తీసుకోవటం ఒక కారణమైతే, అన్ని చెత్త సినిమాలకూ తన సంగీతాన్ని అందించటం ఇష్టం లేక, తన పని కి ఒక “ప్రీమియం” ఛార్జి చేస్తూ, అనేక “పాట్ బాయిలర్” సినిమాలకు అందుబాటు లో లేకుండా ఉండటం మరొక కారణం. రెహ్మాన్ ఆస్కార్ అవార్డు సందర్భంగా వ్రాసిన తన బ్లాగులో రాం గోపాల్ వర్మ, రెహ్మాన్ పని తీరుపై ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. దానిలో నాకు బాగా గుర్తుండి పోయిన వాక్యాన్ని ఇక్కడ యధాతధంగా కోట్ చేస్తున్నాను.
“I’ve decided that whatever goes from here has to be good”. He said it with neither arrogance nor extreme confidence.”

రెహ్మాన్ సంగీతం, కొంచెం ఎక్స్త్రాపోలేట్ చేస్తే అతని వ్యక్తిత్వం వెనకనున్న ఫిలాసఫీ, పైనున్న ఆ ఒక్క వాక్యం లో ప్రకటితమవుతుందనిపిస్తుంది.

నేను ఇంతగా అభిమానించే రెహ్మాన్ చికాగో కాన్సర్ట్ ఇవ్వటానికి వస్తున్నాడని తెలియంగానే, నేనే కాకుండా నాకు తెలిసిన వారందరి చేతా టికెట్లు కొనిపించి తీసుకెళ్లా. 2007 లో జరిగిన ఈ ప్రోగ్రాం, ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మిగిల్చింది. అప్పుడే విడుదలైన “గురు” సినిమా లోని “జాగే హై దేర్ తక్ హమే..కుచ్ ఔర్ సోనే దో”, ఒక శ్లోకం స్టైల్లో సాగే పాటతో ప్రారంభమైన ఆ ప్రోగ్రాం, “వందేమాతరం” తో పతాకస్థాయికి చేరింది. కార్యక్రమం ముగిసింది అని తెలిసినా కూడా, కొద్ది నిమిషాల పాటు ఎవ్వరూ కదలకుండా మౌనంగా ఉండిపోయారు. మరికొద్ది నిమిషాల పాటు చప్పట్లతో మారుమ్రోగి పోయిన ఆ స్టేడియం నించి బయటపడేడప్పుడు కూడా, ఎదో అసంతృప్తి, అప్పుడే అయిపోయిందే అని.

“జై హో!” – ఆస్కార్ వచ్చినా, విమర్శలు ఎన్నో, “అసలా స్థాయి పాటేనా అది!” అని. తొంభై తొమ్మిది పరుగులు ఎంతో లాఘవంగా సాధించిన బ్యాట్స్మన్, అ వందో పరుగుని, సుందరమైన స్క్వేర్ కట్ ద్వారా సాధించాడా, లేక, స్లిప్పుల లోంచి నిక్ చేసి కొట్టాడా అని విశ్లేషణ చేస్తూ కూర్చుంటే, పాయింట్ పూర్తిగా మిస్ అయినట్టే. ఎన్నో ఏళ్ళు అద్భుతమైన సంగీతాన్ని అందించటం వల్లే రెహ్మాన్ కి ఒక ఆస్కార్ స్థాయి సినిమాకి పని చేసే అవకాశం వచ్చింది, దాని కోసం స్వరపరచిన పాటలకూ, ఆ సినిమా ద్వారా గుర్తింపు వచ్చింది. కాబట్టి, “నిక్” చేసిన వందో పరుగు లాంటి “జైహో” ని గుర్తించి అవార్డు ఇచ్చినా, నేను ఆ అవార్డుకు పాత్రుడైన ఒక గొప్ప సంగీతకారుడికిచ్చి  గౌరవించారనే సరిపెట్టుకుంటాను.

గత నాలుగైదేళ్ళలో, రెహ్మాన్ చేసిన చాలా ఆల్బమ్లు నాకు నచ్చలేదు. “యవరాజ్”, “గజని”, “బ్లూ”, “రావణ్”, “పులి”, “రోబో”, “ఝూటా హీ సహీ”, “జబ్ తక్ హైన్ జాన్” లాంటివన్న మాట. కానీ మధ్యలో ఒకటి, రెండు మెరుపు తీగలు, “ఏ మాయ చేశావే!”, “ఢిల్లీ-6” లాంటివి వచ్చి, “లేదు, పాత రెహ్మాన్ ఇంకా మిగిలున్నాడు” అని గుర్తు చేస్తాయి.  ఎందుకిలా అని ఆలోచించినప్పుడు నన్ను సంతృప్తిపరచిన సమాధానం, మన సినీ సంగీతంలో ఎక్కాల్సిన శిఖరాలన్నీ ఎక్కేసి, ఒక రకంగా ఒంటరి వాడిపోయిన రెహ్మాన్ ని, మోటివేట్ చేసే సినిమాలు, ఫిల్మ్ మేకర్స్ మన దేశంలో కరువై ఈ పరిస్థితి ఏర్పడిందని. ఇక ముందు ప్రపంచ సంగీత పటంలో ఇంకెన్ని విజయకేతనాలు ఎగరెయ్యనున్నాడో నేను జోస్యం చెప్పలేను గానీ, ఇంతవరకూ అందించిన తన సంగీతవర్షధార చాలు, తను నా మనసులో ఎప్పటికీ చెరగని గుర్తుగా మిగిలిపోవటానికి.

రెహ్మాన్ తుఝే సలాం!

మీ మాటలు

 1. Subhadra says:

  కొన్ని మంచి పాటలు గుర్తుకు తెచ్చి నందుకు థాంక్స్. వినగా వినగా రెహ్మాన్ పాటలు మరింత సోంపు అనేది నేను ఫుల్ గా ఏకీభవిస్తాను. జయ హో కి ఆస్కార్ గుర్నిచి చాల రోజులు బాధ పడ్డాను, అది ఆ స్థాయి లో లేదని. మీ interpretation కొంచం ఇప్పుడు ఊరట కలిగిస్తోంది :)

  • సుభద్ర గారూ, ధన్యవాదాలు! బోంబే జయశ్రీ గారికి కనక ఆస్కార్ ఇచ్చుంటే ఇంకా పెద్ద తలనెప్పి అయ్యేది. అంత అద్భుతమైన కళాకారిణికి, అలాంటి పాట వ్రాసి/పాడి నందుకా ఆస్కార్ అని :)

 2. చాలా బాగుందండీ … the references you made in the writeup were really awesome.

  However, I am still with ఇసై జ్ణాని … though I like many a master pieces from ARR like, సర్ఫరోష్ కి తమన్నా, ఖ్వాజా మేరె ఖ్వాజా, ఓ పాలన్ హారే et al and ofcourse వందేమాతరం and several others. But when it comes to melody, touchy feeling and orchestration (not just using several instruments but using the right instrument at the right place) … I love Ialayaraja.

 3. Suryam Ganti says:

  పెండ్యాల ,రాజేశ్వర రావు గార్ల సంగీతం తో పెరిగినవాడిని మంచి బాణీ ఎవరు కట్టినా విని ఆనందిచడం అలవాటైపోయింది .ముందుగా ఇళైరాజగారు తరువాత రెహ్మాన్ గార్ల సంగీతం ఇండియా వదిలేసినా మళ్ళీ తెలుగు సినిమా పాటలు వినేటట్లు చేసాయి . మీ వ్యాసం చాలా బాగుంది ,అన్నీ విన్న పాటలైనా మళ్ళీ విని ఆనందించాను . నన్నడిగితే రాజా రాజాయే రహ్మాన్ రహ్మాన్ నే ,ఇద్దరూ దక్షిణాది వాళ్ళు కావడం మనందరికీ గర్వకారణం .

  • వ్యాసం నచ్చినందుకు ధన్యవాదాలు సూర్యం గారూ. అవును, ఇద్దరూ, ఇద్దరే!

 4. మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలన్నీ నాక్కూడా చాలా ఇష్టం. ముఖ్యంగా ‘మెఱుపు కలలు’, ‘ఇద్దరు’ పాటలు. ఇక ‘ఖ్వాజా మేరా ఖ్వాజా’ is pure bliss. But all said and done I still grade ఇళయరాజా than higher ARR for reasons mentioned by BVJ garu.

  • ఇస్మాయిల్, నేను గ్రేడింగ్ చెయ్యాల్సివస్తే అమెరికన్ పద్ధతి పాటించి, ఇద్దరికీ A + ఇచ్చేసి చల్లగా జారుకుంటా :)

 5. మీరు ఈ వ్యాస పరంపర బాగా రాస్తున్నారు.
  రహమాన్ ఇళయరాజా వెనకాతలే వచ్చాడు కాబట్టి అలాంటి పోలికలు రావడం సహజం. కానీ ఇద్దరి సంగీతాన్నీ జాగ్రత్తగా గమనించిన వారికెవరికైనా వారిద్దరూ వేర్వేరు ధృవాలని సులభంగానే అర్ధమవుతుంది. అందుకని ఇతను రాజా కంటే ఎక్కువా తక్కువా అన్న మీమాంస అనవసరం నా దృష్టిలో.
  రహమాన్ ప్రతీ పాటనూ జాగ్రత్తగా చెక్కుతాడు అని రాశారు.
  నేను విన్నంతలో అది నిజం కాదు. ఆయనకి రెండు రకాల ఉత్పత్తి పద్ధతులు ఉన్నట్టు నాకు అనిపించింది. ఒకటి ఆటోమేటిక్ మాస్ ప్రొడక్షన్, ఇంకోటి సర్వాంగసుందరంగా మలిచే చేతి కళ.
  ఒక విషయంలో ఆయనకి నేను కృతజ్ఞుణ్ణి. PhD చేసేప్పుడు లేబ్ లో ఒంటరి రాత్రుల్లో జెంటిల్మేన్ – కాదలన్ – బాంబే – ముదల్వన్ కేసెట్లు తోడుండేవి.

  • ధన్యావాదాలు నారాయణగారూ నా వ్యాసాలు చదివినందుకు! ఆయన రెండో రకం ఉత్పత్తి – ఆయన “కష్ట పడకుండా” చేసిన బోంబే డ్రీమ్స్ లాంటి వన్న మాట :) ఆయన ట్యూన్స్ నే రీ-యూజ్ చేసి ఇచ్చెయ్యటం.

 6. మంచి వ్యాసం . నాకు చాలా నచ్చిన పాటలు గుర్తుకు తెచ్చారు . రెహ్మాన్ జీనియస్. కొందరు నేర్చుకుని సంగీతం కంపోస్ చేస్తారు .కొందరు కష్టపడి సంగీతం కంపోస్ చేస్తారు .. కొందరికి సంగీతం అలా పుడుతుంది. అంటే . రెహ్మాన్ ది ఆ కోవకి చెందినది అనిపిస్తుంది .. For ARR, music just happens. He is the one of the best things that happened to Indian cinema. Period.

  రెహ్మాన్ పాట వింటే ఏ భావం పలికించాలనుకున్నాడో అది పాటలో కాదు పాట విన్న వాళ్ళల్లో పలికించ గలడు .. అది గొప్ప వరం . ఏ మాయ చేసావే పాటలు కానీ , రంగ్ దే బసంతి , ఢిల్లీ సిక్స్ , యే జో దేశ్ కానీ వందేమాతరం  కానీ వింటే అది ఒప్పుకుని తీరాల్సిందే .

  పెద్దలు నన్ను చివాట్లు పెడతారని భయం తోనే ఒక మాటంటా … నా మటుక్కు నాకు త్యాగయ్య అన్నమయ్య, పురందర దాసు, మంగళంపల్లి ఆ కోవకి చెందిన వాడని పిస్తుంది రెహ్మాన్ (పాటలు కూడా రాయగలిగితే).

  నాకు ఇళయరాజాని కామెంట్స్ లో చూడగానే ఈ బ్లాగ్ గుర్తొచ్చింది . ఈ బ్లాగర్ ఇండియన్ మెంటాలిటీ ని భలే కామెడీ చేస్తాడు . చదవగానే అది నేనే ,,, అది నేనే అనిపిస్తుంది .నాకు .. సరదాగా ఒక లుక్కెయ్యండి .

  http://krishashok.wordpress.com/2010/10/26/indianizing-the-facebook-like-button/

  “When we listen to Rahman, we have to point out that Ilayaraja had the best bass lines, …”

  • Thanks for sharing that blog link! That was hilarious and that guy has some “serious” funny and intelligent bones.

   పెద్దవాళ్ళు ఎదో అనుకుంటారని నోరు కట్టేస్కుకొనే జనరేషన్ కాదు మనది. మీకు అనిపించింది నిర్భయంగా చెప్పెయ్యటమే!

 7. చాలా బాగా రాసారండీ! రెహ్మాన్ సంగీతం మీద సమగ్రమైన సమీక్ష.
  నాకు రెహ్మాన్ హిందీ సినిమాల్లో కర్ణాటక సంగీతం రాగాలు వాడడం కూడా చాలా నచ్చుతుంది! స్వదేస్ సినిమాలో వాడిన “చారుకేశి”,
  కళావతి, ఇంకొక పాట (సినిమా పేరు తెలియదు) లో కీరవాణి, మొదలైనవి చాలా exciting ప్రయోగాలు.
  థాంక్స్ ఫర్ షేరింగ్.
  అంటే, ఇళయరాజా కూడా ఒక jIniyassE అనుకోండి…..:)

  శారద

  • కళావాతిలో కట్టిన “యే తార..ఓ తార..హర్ తారా” కుడా నా ఫేవారెట్ పాటండీ! థాంక్స్ నా వ్యాసం చదివినందుకు.

 8. వ్యాసం చాలా బావుంది శివ గారూ, “ఇక ముందు ప్రపంచ సంగీత పటంలో ఇంకెన్ని విజయకేతనాలు ఎగరెయ్యనున్నాడో నేను జోస్యం చెప్పలేను గానీ, ఇంతవరకూ అందించిన తన సంగీతవర్షధార చాలు, తను నా మనసులో ఎప్పటికీ చెరగని గుర్తుగా మిగిలిపోవటానికి” – ప్రతి ఒక్కరూ అనుకుని ఉంటారు వ్యాసం చదివాక “మీ మనసులోనే కాదండీ మా మనసులో కూడా …. అని” రాజా, రెహ్మాన్ – జీనియస్ లు ఇద్దరూ కూడా చాలా బాగా రాశారు, అభినందనలు శివ గారూ…

మీ మాటలు

*