నన్ను అక్షరాలుగా విచ్ఛిన్నం చేసుకోవడమే నా కవిత్వం : దామూ

damu

 చాలా విషయాలు మనల్ని జీవితంలో ఇన్‌స్పైర్‌ చేస్తూ ఉంటాయి. కొన్ని భయపెడతాయి. ఆనందపెడతాయి, అయోమయంలోకి, నిశ్శబ్దంలోకి కూడా నెడతాయి. జీవితానికి ఒక disclaimer ఉంటే, అది దామూలా ఉండొచ్చేమో. బహుశా…. జీవితానికి ఉందో లేదో తర్వాత చర్చించినా, ఈ ఇంటర్వ్యూకి మాత్రం ఒక disclaimer ఉంది. అది దామూ మాటల్లో ఇలా ఉంటుంది.

‘‘మీరడిగిన ప్రశ్నలకి జవాబులు యివ్వటానికి ముందు వొక విషయం…. యిది నా తొలి యింటర్వ్యూ. ‘ప్రవాహగానం’ వచ్చినప్పుడు కొన్ని పత్రికలు అడిగినా యివ్వలేదు. నన్ను నేను వెదజల్లుకోవటం embarrassing గా వుంటుంది. అయితే యిప్పుడు యెందుకు వొప్పుకున్నానో నిజంగా తెలియదు. May be my stupid narcissistic behaviour వ్యాకోచించటం వల్ల కావచ్చు. యిందుకు అఫ్సర్‌, సాయి పద్మ బాధ్యులు’’

hmmm………………………………

మొదటి బాధ్యతదారు అఫ్సర్‌ మాటల్లో ` ‘దామూ కవిత్వంలో స్వచ్చమైన ప్రవాహగానం కన్నా ‘‘ప్రభావ గానం’’ కూడా ఎక్కువే. వ్యక్తీకరణలో దామూది ‘మో’ నుంచి నాయుడు దాక విస్తరించిన ‘‘విధ్వంస’’ శిల్పుల వంశం. అయితే, వాళ్ళలో లేని ఒక రకమైన అరాచక విధ్వంసక ధోరణి దామూలో అదనంగా కొద్దిపాటి తేడాని తీసుకువచ్చింది. ఇంత నిర్లిప్తత, అస్పష్టత, అరాచకత్వం, ఉన్మత్తత…. ఇవన్నీ విప్లవ కవిత్వ లక్షణాలేనా….? దామూని ఏ కోణం నుంచి అర్థం చేసుకోవాలి? పీఠికాసురులు అరువు తెచ్చుకున్న కొత్త సైద్ధాంతిక కవిత్వ సూత్రాల రంగుటద్దాలలోంచా? కవితను స్వయంగా మరుగుపరుచుకున్న తిరుగుబాటు వ్యక్తిత్వం లోంచా?’

(‘ప్రవాహగానంపై చర్చ’ పుస్తకంలో ప్రచురించిన అఫ్సర్‌ వాక్యం ` ఆంధ్రభూమి 15-7-96)

రెండవ బాధ్యతదారు సాయి పద్మ మాటల్లో ` దామూ నాకు మంచి స్నేహితుడు, నా పనికి హితుడు, ఇష్టమైన మనిషి, హమ్మయ్య… హీరో కాదు. కవిగా నాకు చాలా రీసెంట్‌గా తెలిసిన వాడు, తెలిసినంత వరకూ….. మానవత్వం, కరుణ, ప్రేమ (ప్రేమ అనే మాటని అస్సలు వొప్పుకోడు ` ప్రేమంటే ఒక ఇల్యూజన్‌ అంటాడు.!) ఉన్నవాడు. ఒక ఆశావహ దృక్పథంతో, ప్రస్తుతంలో బ్రతుకుతున్న మాజీ నక్సలైట్‌ పిల్లాడు. కవిగా చదివిన తర్వాత, వీరత్వం మీద నాకున్న పిచ్చి పిచ్చి అపోహలను పోగొట్టినవాడు. ఒక రచయితగా మంచి విజ్యువలైజేషన్‌ ఉన్నవాడు. తను తీసే లేదా తీయబోయే జీవితపు/మరణపు పలవరింతని దృశ్య రూపంలో చూడాలనుకునే వాళ్ళల్లో నాది మొదటి బెంచీ టికెట్‌…. కర్చీఫ్‌ వేసేశాను…..

ఇప్పుడు ఇక ఇంటర్వ్యూలోకి వెళ్లిపోదామా….

Qదాము ఎవరు? మీ జీవితం, కవిత్వ నేపధ్యం కొంచెం చెప్తారా?

దాము యెవరనే ప్రశ్న నిరంతరం వెంటాడే వొక అస్తిత్వ దుఖం వంటిది. హ్మ్మం…… తాత్వికతలోకి వెళ్ళటానికి యింకా కొంచెం సమయం వుంది కాబట్టి, నా నేపధ్యం చెపుతాను.

నా నేపధ్యం చాలా మామూలుది. కోట్లాదిమంది అనామకుల్లో నేనొకడిని. చిత్తూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దుల్లో వొక పల్లెటూరు, శ్రీరామాపురం. సాధారణ కమ్మకుల రైతు కుటుంబం. అంతకన్నా యేం వుంది? యేంవుందో తెలియదు. Wonderful childhood.

కవిత్వం విషయానికొస్తే, బహుశా మా నాన్న వూరి జనాలకు రాత్రుళ్ళు రాగాలు తీసి వినిపించే, కవిత్రయ భారతం లోంచి కవిత్వం నాలోకి చొరబడి వుండవచ్చు. రూఢీగా తెలియదు.

టీనేజ్‌లో తొట్టతొలిగా వొక అమ్మాయిని మోహించినపుడు తిలక్‌ కవితను కాపీ కొట్టి, ఆ పిల్లకు యిచ్చాను. అందుకో, మరెందుకో ఆ పిల్ల నాకు పడిపోయింది. ఆ పిల్లకు poetic letters రాసేందుకు ఫుల్‌ లెంగ్త్‌ కాపీ కవిత్వం నుండి, స్వంత పైత్యపు కవిత్వంలోకి కూరుకుపోయాను. నా ప్రవాహగానంలో వున్న ‘‘ఎక్కడ గడ్డి పరక శిరము వాల్చినా, అచట నీ అడుగు జాడలకై అన్వేషణ’’` ఆ పిల్ల కోసం రాసిందే.

మా నాన్న భారత రామాయణాల పఠనం, మా పెద్దమ్మ గోవిందమ్మ జానపద గాథలు చెప్పే తీరు, వీటి మూలంగా విపరీతంగా కథల పుస్తకాలు చదవటం బహుశా 7`8 యేళ్ళ నుండే మొదలైంది. జానపద కథల నుంచీ, పోర్నో దాకా కథల లోకంలోకి వుద్విగ్న భరిత ప్రయాణం యిచ్చే కిక్కు యిప్పటికీ వదలలేదు.

కవిత్వం నా రహస్య ప్రేయసి. అది నా క్లోను. నన్ను అక్షరాలుగా విచ్ఛిన్నం చేసుకోవటమే నా కవిత్వం. అది నాలోపలి వాడితో నేను జరిపే వున్మత్త ప్రేలాపన, నాలో నేను దిగబడుతున్న చప్పుడు.

Qఉద్యమాల పట్ల ఆసక్తి ఎలా కలిగింది? ఎన్నాళ్లున్నారు? ఎందుకు బయటికి వచ్చారు?

శ్రీకాళహస్తిలో యింటర్‌ చదువుతున్నప్పుడు హేతువాద వుద్యమంలో చురుకుగా పని చేసాను. కానీ హేతువాదం కూడా వొక మతం వంటిదే అని అర్థమయ్యి వదిలేసాను.

విద్యార్థి ఉద్యమాలు, పుస్తకాలు, ముఖ్యంగా రంగనాయకమ్మ కేపిటల్‌ పరిచయం, ఆ తర్వాత డిగ్రీలో మా తెలుగు లెక్చరర్‌ త్రిపురనేని మధుసూదనరావు స్నేహం, బాలగోపాల్‌ ఆచరణ, రచనలు…. నా భగ్న ప్రేమ వల్ల వచ్చిన తీవ్ర స్వీయ నిరసన… బహుశా యిలాంటి మరికొన్ని కారణాల వల్ల పౌరహక్కుల, విప్లవోద్యమాల్లోకి వెళ్ళాను. ఈ రెండు ఉద్యమాలలో సుమారు 10యేళ్ళు పని చేసాను. CPI ML (పీపుల్స్‌వార్‌)లో అయిదేళ్ళు PR (professional revolutionary)గా పనిచేసాను. రాడికల్‌ విద్యార్థి సంఘం (RSU) రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పని చేసాను. మదనపల్లిలో కార్మిక ఉద్యమంలో చురుకుగా పని చేసాను.

వొక రకంగా, యిప్పుడు పునరాలోచిస్తే, నేను నక్సలైట్‌ వుద్యమంలోకి పోవటానికి, అప్పటికి నాకు వుద్యమాల పట్ల వున్న వొక romantically adventurous perception  కారణం. వుద్యమాల్లో పూర్తిస్థాయి కార్యకర్తగా పనిచేయటం మొదలు పెట్టాక, ఆ కాల్పనిక మేఘాలు కరిగిపోయాయి. భ్రమలు తొలగిపోయాయి. Question every answer అన్నట్టుగా ప్రశ్నలు… ప్రశ్నలు… ఈ ప్రశ్నలు… సందేహాలు, కోరికలు, వూగిసలాట, వొంటరి దుఖం, నమ్మకాలు కోల్పోయినప్పుడు వుబికే నిరాసక్తత, జీవితపు అర్దహీనత ` వీటన్నిటినీ అక్షరాలుగా డైరీల్లో రాసుకుంటూ వుండేవాడ్ని. కొద్దిమంది మిత్రులతో మాత్రమే నా ప్రశ్నల్ని, సందేహాల్ని పంచుకొనే అవకాశం వుండేది.

అలాంటి ఒక సందిగ్ధ సమయాన 1996 ఏఫ్రెల్‌ 11న పలమనేరులో పోలీసులు నన్ను అరెస్ట్‌ చేసారు. సుమారు 8 నెలలు జైల్లో వున్నాను. అప్పుడే ప్రవాహగానం వచ్చింది.

నేను వుద్యమాల్లోకి పోవటానికి, వాటి నుంచి బయటికి రావటానికీ, నా లోపలి కాల్పనికత, అది మాయమవటం కారణాలుగా చెప్పచ్చు. కానీ ఆ వుద్యమ జీవితం అద్భుతమైనది. I always miss it. Now .. and always.. want to relive it…!

Q ప్రవాహగానం చదివితే, వొక మనిషిగా మీ వత్తిడి అర్థం అవుతుంది. అందులో మీకు నచ్చిన కవిత, లేదా రాత ఏది? ఎందుకు?

వొత్తిడి నిజమే. Suffocated, agitated soul of a lone wounded animal వుంటుంది అందులో. నచ్చిన కవితేంటో చెప్పలేను నేను. నా పొయమ్స్‌ గుర్తుండవు నాకు. నిల్‌ బ్యాలన్స్‌, వొంటరితనం కవితలు గుర్తున్నాయి. కొన్ని వాక్యాలు… ‘బోర్లించిన ఖాళీ కుండ…. వెల్లకిలిన యవ్వనం… లాక్‌ చేసిన నైన్‌ ఎం.ఎం.పిస్టల్‌లా మౌనం…. సర్కారు చెట్ల దగ్గర విలపిస్తున్న కామసూత్ర తొడుగు’ ` వంటివి నన్ను హంట్‌ చేస్తూ వుంటాయి. సముద్రుడు, MSR  మీద రాసిన కవితలు గుర్తొచ్చి, వందలాది సహచరుల   హత్యలు తీవ్రంగా దుఖితుడ్ని చేస్తాయి. Whenever I revisit  ప్రవాహగానం` – it’s a painful experience. గాయాలు గాయపడే క్షణాలు కమ్ముకుంటాయి. జీవితమంటే వాయిదా పడిన మృత్యువే కదా అనిపిస్తుంది.

Q ప్రవాహగానం ఒక సంచలనం అయితే, దాని ముందుమాట ఒక సునామీ. ఆ మాట రాసిన మునికృష్ణ గారి గురించి, నేపధ్యం గురించి చెప్పరూ.

ప్రవాహగానం సంచలనం అనీ, ముందుమాట సునామీ అని నేనుగానీ, మునిక్రిష్ణ గానీ అనుకోవటం లేదు.

మునికృష్ణ నా డిగ్రీ కాలేజ్‌మేట్‌. యిద్దరం కలిసి కవిత్వం చదువుకొనే వాళ్ళం. అనేక badboyish పనులతో పాటు, అరసం నుండి పౌర హక్కుల వుద్యమం వైపు, విప్లవ రాజకీయాల వైపు పయనించాం. మాటల కన్నా చేతల పట్ల సీరియస్‌నెస్‌ వున్న proxy youth మేమప్పుడు.

నేను పౌరహక్కుల వుద్యమం నుండి నక్సలైట్‌ వుద్యమంలోకి వెళ్ళాను. అతను హక్కుల వుద్యమంలో క్రియాశీలంగా వున్నాడు. నా కవిత్వం అతనికిష్టం. అందువల్ల పుస్తకం తేవాలనుకున్నాడు. ముందుమాట గురించి చర్చ వచ్చింది. అప్పుడు పీఠికలు చాలా ఎక్కువ వుండేవి. అలాంటి పీఠికాధిపతుల చేత పీఠిక రాయించటం నాకిష్టం లేదు. అందువల్ల ముందుమాట అతన్నే రాయమన్నాను.

రెండవది ‘‘విప్లవ కారులు వీరులు కారు, మామూలు మనుషులే’’ అనే కాన్సెప్ట్‌లో నమ్మకం వుండటం వల్ల, వొక విప్లవకారుడిగా నేను నా గురించి హానెస్ట్‌గా చెప్పదలచుకున్నాను. నా గురించి తనకి ఏం తెలుసో అదే రాయమని అడిగాను. అలానే రాసాడు.

అలాగే నాకు కవిత్వాన్ని రాజకీయ కారణాల వల్ల యెడిట్‌ చేయటం నచ్చదు. అందుకని నేను రాసిన కవితల్ని as it is గా మునికృష్ణ ప్రచురించాడు.

వొక conviction తో ప్రవాహగానాన్ని మేం తీసుకువచ్చాం. సంచలనం కోసం కాదు, స్వంత డబ్బా కోసం కూడా కాదు. నిజానికి మేమిద్దరం పరమ అనామకులం. చాలామంది స్నేహితులకు కూడా నేను ‘దాము’ అనే కవి అని తెలీదు. అజ్ఞాతంలో కూడా అజ్ఞాత కవిని అప్పుడు.

పుస్తకం వేసినప్పుడు మునికృష్ణ 1500 కాపీలు వేస్తే వాటిని తూకానికి అమ్ముకోవాలి, కవిత్వాన్ని ఎవడు కొంటాడు? అనుకున్నాం.

అయితే అప్పుడు విప్లవ సాహిత్యంలో జరుగుతున్న చర్చలు, ఆయా నిర్మాణాలలో ఉన్న contexts  మూలంగా ప్రవాహగానం, దాని ముందుమాట కొన్ని నెలల పాటు చర్చకు కారణమయ్యాయి.

‘‘వీరులెవరూ లేరు, అందరూ మనుషులే’’ అని మేము చెప్పదలచుకున్నాము. అయితే ironically కొంతమంది దామూని వీరుడన్నారు. అల్లం రాజయ్య వంటి గొప్ప కథకుడు ‘ఒక వీరుడైన కవి’ అని రాసిన రోజున నేను చాలా సిగ్గుపడ్డాను.

అయితే దామూ వీరుడు కావటానికి బీజాలు ముందుమాటలోనే వున్నాయని మేమిద్దరం గ్రహించాం. రష్యన్‌ రచయిత ‘‘లెర్మంతోవ్‌’’ రాసిన ‘‘మన కాలం వీరుడు’’ మా తరాన్ని బాగా ఇన్ప్లుయెన్స్‌ చేసింది. ఆ ప్రభావంతో, దామూ మీద ప్రేమతో, మునికృష్ణ దామూని ‘‘ఈ కాలం వీరుడు’’ అని రాసాడు. అప్పటి విప్లవ కవిత్వానికి ‘ప్రవాహగానం’ కొంచెం భిన్నంగా వుండటంతో అది కొంతమందిని ఆకట్టుకుంది.

యే వుద్యమ సాహిత్యమైనా, ఆ వుద్యమాన్ని మరింత పై స్థాయికి తీసుకొని పోవడాని కోసం వుద్దేశించబడుతుంది. అయితే నా కవిత్వం అలాంటిది కాదు. అది నన్ను నేను వ్యక్తీకరించుకున్న వొక మీడియం. విప్లవోద్యమంలో పనిచేసే వొక యువకుడి లోపలి ధ్వనుల ప్రకంపన అది. estabilshed నిర్వచనాల ప్రకారం అది వుద్యమ కవిత్వమో, విప్లవ కవిత్వమో కాదు.

వొక వస్తువు మీదో, యితివృత్తం మీదో, ప్లాన్‌ చేసుకొని కవిత్వం రాయటం అనే అర్థంలో నేను కవిని కాను. Non-poet ని బహుశా anti-poet ని కూడా. అందువల్ల కొన్ని సార్లు నా పొయెట్రీలో coherence వుండదు. Subtle గా వుంటూ abrupt గా break అయిపోతూ వుంటుంది.

ప్రవాహగానం చర్చ వొక కాంటెక్ట్స్‌ది. దామూ ఒక aషషఱసవఅ్‌aశ్రీ ష్ట్రవతీశీ. నిజ జీవితంలో యే మందలోనూ కలవని అశక్త గొర్రె.

Q దామూ హీరోనా, ఈ అక్సిడెంటల్‌ హీరోయిజం వెనకాల పరిస్థితులేంటి? ఒక మాజీ నక్సలైట్‌, కవి, ఫిలింమేకర్‌గా మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారు?

దామూ హీరో కాదు గానీ, వొక neo-noir సినిమాలో protagonist లాంటివాడు. అతని పర్సనాలిటీ టైంలో two conflicted selves గా చీలిపోయి వొకడి కోసం మరొకడు చేసే అన్వేషణే అతని కవిత్వం.

He is looking for himself as the other. Nietzschean madness  వున్నవాడు హీరో కాదు. అతని లోపలి unconscious  భాష తడబడినప్పుడు, వైఫల్యం చెందినపుడు తనని తాను కవిత్వంగా వ్యక్తపరచుకుంటుంది.

The unconscious is the unknown that lies beyond doubt. The unconscious is the discourse of the other – Lacanaian paradigm లో.

హీరోయిజం ఒక కఫన్‌. శవపేటిక మీద కప్పిన గుడ్డ. మనుషుల కల్చరల్‌ పావర్టీ హీరోలను ప్రొడ్యూస్‌ చేస్తుంది. ఆయా సమాజాలు ట్రూత్‌ని ప్రొడ్యూస్‌ చేసినట్టుగానే హీరోలను ప్రొడ్యూస్‌ చేస్తాయి. చాలాసార్లు ఈ హీరోలు నియంతలవుతారు.

ప్రవాహగానం వచ్చినప్పుడు దామూని కొంతమంది హీరోగా భావించి వుండవచ్చు. అతను జైలు నుండి underground మూవ్మెంట్‌లోకి వెళ్ళుంటే యింకా చాలా మందికి హీరో అయి వుండేవాడు. పోలీసుల చేత హత్య చేయబడి వుంటే మరింత పెద్ద హీరో అయి ఉండేవాడు. హీరో కాకపోవటం పెద్ద రిలీఫ్‌.

మాజీ నక్సలైట్‌, కవి, ఫిలిం మేకర్‌` నిజానికివన్నీ కలసిపోయి వుంటాయి. సరిహద్దులు చెరిపివేయబడి mixed and blurred identities వుంటాయి. నా నక్సలైట్‌ జీవితం చాలా ఫ్రెష్‌గా వుంటుంది నా మెమరీలో – every moment.

వొక film maker గా నన్ను నేను చూసుకోవటం యిష్టం నాకు. నా identities అన్నీ యిందులోనే వుంటాయి. సినిమా మీద నాకున్న fascination దేని మీద లేదు….. అమ్మాయిల్ని మినహాయిస్తే.

Qఫిలిం మేకింగ్‌ మీద ఆసక్తి` ఎప్పుడు, ఎలా?` మీరు మాత్రమే తీయగల సినిమా గురించి, మీ అభిప్రాయం, అది రావాల్సిన అవసరం గురించి కాస్త చెప్పండి.

సినిమాల మీద బాల్యం నుండే వ్యామోహం వుండేది. ఆ మంత్రవాస్తవిక స్వప్న జగత్తు నన్ను సమ్మోహితుడ్ని చేసింది. మా వూరి దగ్గరున్న టూరింగ్‌ టాకీస్‌లో వచ్చిన ప్రతీ సినిమా చూసేవాడ్ని, ఆ అబ్బురం ఇప్పటికీ అలానే వుంది.

నేను డిగ్రీ చదివేటప్పుడే సినిమా డైరక్టర్‌ అవాలనే కోరిక వుండిరది. అది యెలా వచ్చిందో తెలీదు. తమిళనాడు సరిహద్దు కావటం వల్ల bi-lingual culture మాది . భారతీరాజా, బాలచందర్‌, మహేంద్ర, శ్రీధర్‌ వంటి తమిళ దర్శకుల ప్రభావం అప్పట్లో నా మీద చాలా యెక్కువ. తర్వాత internet వచ్చాక ప్రపంచ సినిమా చూడటం ప్రారంభం అయింది. దానితో పాటే cine craft అధ్యయనం కూడా.

నేను మాత్రమే తీయగల సినిమాలు వున్నాయనే అనుకొంటున్నాను. ఉదా॥ నక్సలైట్‌ సినిమా. నక్సలైట్‌ వుద్యమాన్ని రియలిస్టిక్‌గా represent చేసే సినిమాలు యిప్పటి వరకూ రాలేదు. నేను తెలుగులో నక్సలైట్‌ సినిమాల మీద పరిశోధించి వొక పేపర్‌ రాశాను. సినిమాలే కాదు, సాహిత్యం కూడా నక్సలైట్ల జీవితాన్నీ, పోరాటాన్నీ, all-dimensions లో చిత్రించలేదు.

నక్సలైట్‌ జీవితంలో భిన్న కోణాలకు సంబంధించిన కథలు నా దగ్గర స్క్రీన్‌ ప్లే రూపంలో వున్నాయి. అవి పాపులర్‌ సినిమా ఫార్మేట్‌లో వున్నాయి.

నాకు ఇంటిన్సిఫైడ్‌ డ్రామా తీయటం యిష్టం. సినిమా craft కి సంబంధించి రెవల్యూషనరీ చేంజ్‌ వచ్చింది ఇండియాలో. కానీ కంటెంట్‌కి సంబంధించి యింకా ‘వీధి నాటకం’ దశలోనే ఉంది. యిది మారాల్సిన అవసరం ఉంది. యిక్కడ నాలాంటి వారి కృషి వుపయోగ పడుతుందనుకుంటాను.

Q మీ కవిత్వం ఒక స్క్రీన్‌ ప్లే లా ఉంటుంది. మీలో ఉన్న ఆ దాము గురించి చెప్పండి.

నాకు visual imageries లో కవిత్వం రాయటం యిష్టం. చాలా visuals వస్తుంటాయి నాకు. అదే సమయంలో వాటిలో ఒక సినిమా స్క్రీన్‌ప్లేకి ఉన్న స్ట్రక్చర్‌ ఉంటుంది.

నాకు స్క్రీన్‌ ప్లే రాయటం యిష్టం. చాలా హాలీవుడ్‌ స్క్రీన్‌ ప్లేలు చదివాను. ఆస్కార్‌ అవార్డు వచ్చిన ప్రతి సినిమా స్క్రిప్ట్‌ చదువుతాను. మొదట స్క్రీన్‌ ప్లే చదివి తర్వాత సినిమా చూస్తాను. ‘స్క్రీన్‌ ప్లే రాయటం ఎలా?’ అని తెలుగులో 250 పేజీల పుస్తకం రాసాను. ఆ వర్క్‌ చేస్తున్నప్పుడు, స్క్రీన్‌ ప్లే మీద విస్తృతంగా పరిశోధించాను.

Character driven, theme driven screenplays యిష్టం నాకు, plot-driven వాటి కన్నా.  multi layered వున్నవయితే మరింత మజా వుంటుంది. చదువుతున్నపుడు. అలాగే closed narratives వున్నవి కాకుండా open narratives యిష్టం. ఉదాహరణ… honesty is the best policy  అనేది వొక closed narrative. దాన్ని ప్రూవ్‌ చేసే స్క్రీన్‌ ప్లే వుంటుంది a narrative లో. “is honesty the best policy?” అనేది open narrative. యిందులో exploration  వుంటుంది. చాలాసార్లు honesty పనికి రాకపోవచ్చు లేదా ప్రాణాంతకమవచ్చు. యిలా unknown possibilities ని explore చేయొచ్చు. యిందులో lateral థింకింగ్‌ వుంది.

స్క్రీన్‌ప్లేలో, కవిత్వంలో లాగే – words, images ను evoke చేస్తాయి. పదాల మధ్య express చేయని space visual montages మధ్య కనిపించని space ని create చేస్తుంది. స్క్రీన్‌ప్లే రాయటం వొక wonderful creative experience.

Q మరణం` మీ వాస్తవాలు, అందులో గ్లోరిఫికేషన్‌ ఏమన్నా ఉందా?

నక్సలైట్లకు మృత్యువు వొక దైనందిన వాస్తవం. సినిమా భాషలో చెప్పాలంటే అది వొక మూడ్‌ అండ్‌ atmosphere. Poetic గా చెప్పాలంటే గాలిలో తేలే మృత్యు పరిమళం. మృత్యువుకు సంబంధించి గతమూ, వర్తమానమూ, వాస్తవమూ, కల్పనా కలసిపోయి unconscious drives లో మృత్యు అస్తిత్వం వొక నదిలా ప్రవహిస్తూ వుంటుంది.

Philosophical గా చూసినపుడు death is more fascinating than life. నా poetic moods లో డెత్‌ తప్పకుండా వుంటుంది. లైఫ్‌ మొత్తం డెత్‌ వైపు చేసే జర్నీనే. Death is actually the liberation from the inevitable human existential suffering.  It purifies the human heart from the murky muds of so many original sins.

అయితే వుద్యమాలు డెత్‌ని గ్లోరిఫై చేస్తాయి. టైం, స్పేస్‌ అండ్‌ కాంటెక్ట్స్‌ని బట్టి కొన్ని మరణాలు more equal than others. అవి అమరత్వంగా మారిపోతాయి. యెక్కువ నక్సలైటు మరణాలు పోలీసు లేదా పారా మిలటరీ బలగాల హత్యలే కాబట్టి ఆ మేరకు అవి గ్లోరిఫై అవుతాయి. ఆ వుద్యమ స్వభావం, లక్ష్యం, అంతర్‌ నిర్మితి రీత్యా death glorification అవసరం. డెత్‌ వొక యెమోషనల్‌ డ్రైవ్‌గా పనిచేస్తుంది. న్యూ రిక్రూట్మెంట్స్‌కి మోటివేషన్‌ ఫాక్టర్‌గా పనిచేస్తుంది.

నేను చావుకు అతి సమీపంగా వెళ్ళాను. నాకు తెలిసిన వుద్యమ కార్యకర్తలు వందల సంఖ్యలో చంపబడ్డారు. వీరి మరణాల వివరాల్లోకి వెళ్తే భీభత్సంగా ఉంటాయి. యిప్పటికీ యిలాంటి టార్చరస్‌ మెథడ్స్‌ వుపయోగిస్తున్నారా అనిపిస్తుంది. డ్రాకులాస్‌లో ఉండే డెత్‌ డ్రైవ్‌ కన్నా రాజ్యపు క్రూరత్వం యెంత అమానుషంగా వుంటుందో అర్థమవుతుంది.

ఈ మరణాల మీద పాటలు, ఎలిజీల కన్నా death narratives  రావాల్సిన అవసరం ఉంది.

Q మీకు ఇష్టమైన కవులు, రచయితలు, తెలుగు, ఇంగ్లీష్‌ కూడా?

జీవితంలో వొక్కో phase లో వొక్కో రకమైన రచయితలు నచ్చుతారు, లేదా ఇన్ల్పుయెన్స్‌ చేస్తారు. నేను నా infancy లోనే భారత రామాయణాలు, వేయి శిరస్సులు ఖండించిన అపూర్వ చింతామణి, భట్టి విక్రమార్క కథలు విన్నాను. మా నాన్న చెంగమనాయుడు తన లిమిటెడ్‌ ఆడియన్స్‌కి అద్భుతంగా narrate చేసేవాడు. చాలా గ్రాండ్‌ visual  స్టైల్‌ ఆయనది.

తర్వాత జానపద గాథలు, వీరులు, రాకుమారులు, యువరాణులు, రాక్షసులు… ఈ wonderful స్టోరీస్‌ ప్రభావం యే స్థాయిలో అంటే infact  నేను కూడా ఇంటర్‌లో ‘రూపవంతుడు’ అనే నవల రాసి పడేసాను. 7`8 తరగతుల కొచ్చేసరికి మా కజిన్స్‌ ప్రభావం వల్ల నవలలు చదవటం అలవాటైంది. చందమామ, బాలమిత్ర, షోడో, యుగంధర్‌ వంటి డిటెక్టివ్‌ నవలలు, యింకా యుద్దనపూడి, మాదిరెడ్డి లాంటి రచయిత్రుల కలల నవలా సాహిత్యం, మరోవైపు ‘రేపు’ మేగజైన్‌తో పాటు మా వూరి హాస్టల్‌ పిల్లల స్నేహం వల్ల బూతు సాహిత్యం రహస్యంగా చదవటం. అలా ఎర్లీ ఏజ్‌లోనే చెడిపోయాను.

ఇంటర్‌ కొచ్చాక, యండమూరి, సమరం, శ్రీశ్రీ, చలం, తిలక్‌, శరత్‌, టాగూర్‌, రంగనాయకమ్మ, గోర్కీ…. అలా ప్రపంచ సాహిత్యం… రష్యా, చైనా, లాటిన్‌ అమెరికా, ఆఫ్రికన్‌ జపనీస్‌ సాహిత్యం` వేలాది పుస్తకాలు చదివాను, చదువుతున్నాను.

నేను కవిత్వం చదవను. చాలా చాలా తక్కువ. నవలలు యిష్టం. కథలు సెలెక్టివ్‌గా చదువుతాను. నాన్‌ ఫిక్షన్‌లో రియాలిటీ ఫిక్షన్‌ చాలా యిష్టం. తత్వ శాస్త్రం చాలా యిష్టం. యిటీవల psycho analysis మీద బాగా చదువుతున్నాను.

చలం, శరత్‌లు బాగా ఇన్ఫ్లుయెన్స్‌ చేసారు నన్ను. కవుల్లో బైరాగి, తిలక్‌. కాఫ్కా, హరకు మురకమి వంటి రచయితలు ఇష్టం. రచనల్లో మిస్టిసిజం…. sub-text ఉన్నవి ఇష్టం. Under current గా తాత్వికత ఉండాలి. అది లేకపోతే అస్సలు చదవలేను. ఇప్పటికీ బూతు సాహిత్యం చదువుతాను. చాలా కథల్లో మంచి క్రియేటివిటీ ఉంటుంది.

అయితే సాహిత్యం కన్నా సినిమాలే యెక్కువ యిష్టం నాకు. average గా రోజుకి వొక్క సినిమా అయినా చూస్తాను.

Q సహచరికి రాసిన ఉత్తరం సంచలనం. అప్పటికీ, ఇప్పటికీ మానవ సంబంధాలపై మీ అభిప్రాయం.

జైలు నుండి సహచరికి చాలా లేఖలు రాసాను. నా ఆలోచనలు, దిగులు, దుఖం, జ్ఞాపకాలు, స్వప్నాలు, జైల్లో జీవితం, సహచర ఖైదీలు, etc విషయాలు వుంటాయి వాటిల్లో. సుమారు 150 పేజీలు వుండవచ్చు. అయితే వొక లేఖ మాత్రమే అచ్చయింది. యీ అనుభవాల్ని బేస్‌ చేసుకొని ఒక స్క్రిఫ్ట్‌ తయారుచేసే పనిలో ఉన్నాను.

యిక మానవ సంబంధాల గురించి పుస్తకం రాయాల్సిన ప్రశ్న అడిగారు… preachy గా ఉండకుండా జస్ట్‌ రిప్లెక్షన్స్‌ అఫ్‌ mine చెపుతాను.

ప్రపంచంలో అనేక విషయాల్లాగే, మానవ సంబంధాలు మారుతాయి. వుత్పత్తి – వినియోగం చుట్టూ మానవ సంబంధాలు తిరుగుతాయి. ఆధునికత వచ్చిన తరువాత మానవ సంబంధాల్లో తీవ్రమైన మార్పులు వచ్చాయి.

ఆధునికతలో రెండవ దశని సోషియాలజిస్ట్‌ జిగ్మంట్‌ బౌమన్‌ ద్రవాధునికత (లిక్విడ్‌ మోడర్నిటీ) అంటున్నాడు. వుత్పత్తి కేంద్రంగా వున్న సమాజం, వినియోగ కేంద్రంగా మారటంతో ఈ లిక్విడిటీ మానవ సంబంధాలలో ప్రవేశించింది.

కమ్యూనిటేరియన్‌ humanbeingness  పోయి దాని స్థానంలో atomic, individual humanbeingness  ప్రవేశించింది. Disposable, use and throw  రిలేషన్షిప్స్‌ ఏర్పడ్డాయి. ప్రపంచ వ్యాప్త వలసలు పెరగటం వల్ల, multiple మైగ్రేషన్స్‌ వల్ల మనిషి జీవితం నిరంతరం flux లో, fluidity లో వుండటం వల్ల మానవ సంబంధాల పైన తీవ్ర ప్రభావం పడుతోంది. simulcrum రియాలిటీని రీప్లేస్‌ చేసింది. వర్చ్యువల్‌ కమ్యూనిటీస్‌, సంబంధాలు పెరిగాయి. వున్నచోట వుండటం కోసం, నిరంతరం పరుగులెత్తాల్సిన పరిస్థితి మూలంగా మనలో సింహావలోకానికీ, సాలిట్యూడ్‌కీ తావు లేకుండా పోయింది.

మరోవైపు meta narratives పోయాయి. దేవుడు, ప్రేమ, కమ్యూనిజం, సైన్సు వంటి మహా కథనాలు  మాయమయి పోయాయి. అందువల్ల యివాల్టి ప్రపంచంలో యేది తప్పు? యేది వొప్పు? యేది మంచి? యేది చెడు? యెలా జీవించాలి? అని గైడ్‌ చేసే మహాకథనమేదీ లేదు. యివన్నీ individual హ్యూమన్‌ బీయింగ్స్‌ నిర్ణయించుకోవాలి. వొక మహా థృక్కోణం లేనందువల్ల వేనవేల వ్యక్తిగత ధృక్కోణాలే వుంటాయి. వీటిల్లో యేది యెక్కువో, తక్కువో నిర్ణయించే ప్రమాణమేదీ లేదు. One way of life is morally superior to the other way of life అని చెప్పలేం యిప్పుడు. They are just different . అంతే.

అందువల్ల chaotic relationships  వున్నాయి యిప్పుడు. నెక్స్ట్‌ phase ఆఫ్‌ international capitalism ను బట్టి యివి యెలా మారుతాయో- అనేది వుంటుంది.

Q ఒక కవి ఫిలిం డైరక్టర్‌గా మారినప్పుడు, మీరు చేయగలిగిన కాంట్రిబ్యూషన్‌ గురించి మీరేమనుకుంటున్నారు?

మంచి కవులు లేదా రచయితలు మంచి సినిమా దర్శకులు అవుతారనే గ్యారంటీ యేమీ లేదు. కవిత్వ రచన పూర్తి వ్యక్తిగతం. బోలెడు ఫ్రీడం వుంటుంది. యే మార్కెట్‌ సూత్రాలు వుండవు.

సినిమా team craft, managerial skills నీ, leadership skills నీ అది డిమాండ్‌ చేస్తుంది. ఆయా మార్కెట్‌ సూత్రాలూ అనేక invisible నియమాలూ ఉంటాయి. కానీ యివన్నీ పక్కన పెట్టి ఒక ప్యూర్‌ question  లా సమాధానం చెప్పాలంటే` – సినిమా poetry on screen. లైట్‌ అండ్‌ షాడో తో సెల్యులాయిడ్‌ మీద రాసే కవిత్వమే సినిమా. They mystery, all that poetically mystic imagination completes and enlarges the tangible reality in cinema.

వొక poet గా నేను సినిమాని పోయెటిక్‌ మీడియంగా చూస్తాను. సినిమాలో use చేసే metaphor and metanomy లను వొక poet గా నేను బాగా చేయగలననుకొంటాను. As a poet I can incorporate in a film, with full of visual cues, symbols, allusions and playful  imagery.

చాలా చెప్పచ్చు గానీ, అంతకంతకూ స్వంత డబ్బా మోత యెక్కువవుతుంది. లకాన్‌ చెప్పిన ది సింబాలిక్‌, రియల్‌ అండ్‌ metanomy ఇమేజినరీ` యీ మూడూ సినిమాకి ప్రాణం. యివి కవిగా నా పోయెట్రీ లోంచి సినిమాలోకి ట్రాన్స్లేట్‌ అవుతాయని అనుకొంటున్నాను.

ఇదంతా post factor analysis అవ్వాలి తప్ప, కవిగా నేను పుడింగ్‌ సినిమా దర్శకుడ్ని అయిపోతాను   అని చెప్పటం వృధా ప్రయాస.

Q మీ కవిత్వం ఒక యుద్ధం, వొంటరితనం, ఒక వొత్తిడి ఒక జైలు కూడా…. దానికీ బయట పరిస్థితులకీ ఏమన్నా పొంతన ఉందా?

నక్సలైట్‌ వుద్యమం ఒక యుద్ధమే. ఆ మాట కొస్తే sounding cliché, I say life itself is a war.. అయితే వుద్యమంలో, condensified, intensified war వుంటుంది. యుద్ధంలో వున్నావన్న స్పృహ వుంటుంది. నిరంతరం చావును తప్పించుకుంటూ వుండాలి. డెత్‌ని ప్రివెంట్‌ చేస్తూ వుండాలి. దీనిలో చాలా వత్తిడి వుంటుంది. యింకా అనేక వత్తిడులు వుంటాయి. పర్సనల్‌ space తక్కువ. ఇన్నర్‌ ఫీలింగ్స్‌ షేర్‌ చేసుకోవటానికి యెవరూ వుండరు. రహస్యాల్ని పాటించాలి కాబట్టి తోటి కామ్రెడ్స్‌తో కూడా యేమీ షేర్‌ చేసుకోలేం. సందేహాల్నీ, skepticism ని వ్యక్తం చేస్తే, మన మీద ముద్ర పడిపోతుందేమో – వీక్‌ అవుతున్నాడనో, దిగజారి పోతున్నాడనో అంటారేమో అనే భయం. ప్రవాహగానంలో ‘వొత్తిడి’ కవితలో ‘వినేందుకు హృదయం దొరకదు’ అని రాసాను. యీ కవితలో ‘యుద్ధేతర వత్తిడులు’ ఉంటాయి. వొంటరితనం, పోటెత్తే సముద్రం లాంటి యవ్వనపు వెంటాడే సెక్స్‌ కోరికలు వంటివన్నీ ఒక suffocation ని యిస్తాయి.

వొక్కోసారి మనం నమ్మని దాన్ని యెదుటివారికి బోధించాలి. లోపలి మనిషి అశాంతిగా కదులుతున్న ధ్వని మనల్ని కుదిపేస్తుంది. బయట జీవితానికీ, వుద్యమ జీవితానికీ చాలా తేడా వుంటుంది. విలువలు మారిపోతాయి. ఉదా…. నమ్మకం ఒక పాజిటివ్‌ విలువ బయట. కానీ వుద్యమంలో belief is death, disbelief is life. నీ సహచరుడు కోవర్టు కావచ్చు. యే తెల్లవారుఝాము పొగమంచులోనో అతను నీపై మృత్యువై విరుచుకుపడవచ్చు. బయట మామూలు కోరికలు కూడా ప్రాణాంతకమవుతాయి వుద్యమంలో.

యుద్ధాన్ని ధరించిన కవి` రాయని కవితలే యెక్కువ. రాయలేని తనం, చెప్పలేని తనం కూడా వత్తిడిని పెంచుతాయి. వీటన్నిటి ఫలితంగా chronic loneliness. దాన్ని కూడా తుపాకీలా మోయాల్సిందే. శత్రువుతో డీల్‌ చేయటం యెంత కష్టమో, నీతో నువ్వు డీల్‌ చేయటం, ముఖాముఖీ తలపడటం అంతే కష్టం.

జైలు`జైలుకు వెళితే గానీ బయటి జీవితపు క్రూరత్వం అర్థం కాదు. బయటి జీవితపు సమాజానికి జైలు వొక నమూనా, ఒక microcosm.. బీయింగ్‌ హ్యూమన్‌ అంటే యేంటో జైల్లో తెలిసినంతగా యింకెక్కడా తెలియదు.

అయితే మీరడిగిన ప్రశ్న` నిజానికి లోపలా, బయటా అనేవేవీ లేవు. నక్సలైటు ఉద్యమం, జైలు` యివన్నీ మన సమాజంలో భాగమే. బట్‌ మనం ఏ టైం, స్పేసులో వున్నామన్న దాన్ని బట్టి ఆ జీవన పార్శ్వాలు మనకి అందుబాటులోకి వస్తాయి. మిగతావి ప్రయత్నించి తెలుసుకోవాలి. నేరుగా అనుభవం లోకి రావు.

రియాలిటీ అనేది మిత్‌. వేనవేల రియాలిటీస్‌ వుంటాయి. జీవితానుభావాలని బట్టి అవి మారుతుంటాయి. No person can speak authoritatively from a space which is being continually cut into pieces of unknown entities..

సో, మీ ప్రశ్నకి సింపుల్‌ జవాబు` పొంతన వుంటుంది. పొంతన వుండదు.

Q మీరెందుకు రాయటం లేదు (మీ స్క్రీన్‌ ప్లే గురించి, ప్రక్రియ ఏదైనా, కవిత్వం ఒక దృశ్యమే కదా) లేదా ఏం రాస్తున్నారు?

నేను మొదటి నుండీ రాయటం తక్కువే. కవిత్వం మరీ తక్కువ. deliberateగా పొయెమ్స్‌ రాయను కదా. కవిత దానంతట అది వస్తే, వచ్చినట్టు లేదంటే లేదు. రాసిన కవితల్ని ప్రచురణ కోసం పత్రికలకు పంపటం కూడా చాలా అరుదు. ప్రవాహగానం తర్వాత నేను రాసిన కవితలు వొక 50 ఉంటాయి. 5-6 కూడా ప్రచురణ కాలేదు.

ఇటీవల వొక మిత్రురాలు నా పేరుతో బ్లాగ్‌ ఓపెన్‌ చేసింది. అందులో కొన్ని కవితలు ఉన్నాయి. స్క్రీన్‌ ప్లేలు మాత్రం చాలానే రాశాను.

గత 2`3 యేళ్ళ నుండీ ‘మనసు పౌండేషన్‌’ రాయుడుగారితో అసోసియేట్‌ అయి కొన్ని డాక్యుమెంటరీ ఫిలిమ్స్‌ తీసాను. ముగ్గురి బయోగ్రఫీస్‌ రాసాను.

కొన్ని కథలు అసంపూర్తిగా రాసేసి వదిలేసాను. నవలలు రాయాలని కోరిక వుంది. ఇంకొన్ని non-fiction రచనల స్కీం ఉంది. చాలా వున్నాయి ఇలాంటి స్కీములు. ‘నువ్వు రాయాలనుకున్నవన్నీ చెబుతూ పోతే, ఒక బుక్‌ అవుతుంది. చెప్పటం ఆపేసి రాయండి సార్‌’ అన్నాడు ఒక మిత్రుడు యిటీవల.

అయితే, సినిమా రైటింగ్‌ మాత్రం కంటిన్యూ చేస్తున్నాను. అక్షరాలతో visualise చేస్తుంటే, ఆ మజానే వేరు.

Q దాము ఒక తాగుబోతు, ఆశపోతు, వంటరి, కవి – ఇన్నింటిలో మీరు ఎక్కువ దేనితో ఐడెంటిపై అవుతారు?

ఒకసారి నేను, మునికృష్ణ వొక చిలిపి పని చేశాము. ఖలీల్‌ జిబ్రాన్‌ కవితలు కొన్నింటిని అనువాదం చేసి, చివర్లో మాది ఒకటి కలిపేసాము. అది:  ‘వొక మనిషిలో అనేకమంది… యెవరైనా వొకరే అయితే అది శవం మాత్రమే…!’

దామూలోనే కాదు. ప్రతీ మనిషిలో అనేక ముఖాలు, అంతర్ముఖాలు ఉంటాయి. స్క్రీన్‌ ప్లే టెక్కిక్స్‌లో ‘character orbit’ అనే వొక టెక్నిక్‌ ఉంది. పాత్రల కక్షలో ఒక ప్రోటోగనిస్ట్‌లో అనేక ముఖాల్నీ లేదా dimensions ని చూపించాలంటే మిర్రర్‌ charactersనీ, మిర్రర్‌ situations నీ సృష్టించాలి. ఉదా: వొక స్త్రీలో తల్లి angle చూపించాలంటే బిడ్డ అనే మిర్రర్‌ character కావాలి లేదా అలాంటి situation వుండాలి.

సో, దామూలో కూడా మునికృష్ణ చెప్పినవే కాదు, చెప్పని కోణాలు కూడా ఉన్నాయి. దామూకి కూడా తెలియనివి వుంటాయి. ఆ రెలెవెంట్‌ మిర్రర్‌ పాత్రో, పరిస్థితో వస్తే గానీ ఆ కోణం బయటకు రాదు.

నేను దేనితో ఐడెంటిపై అవుతాను? అసలు నేను అంటే యేమిటి? ‘నేను’ వొక animal residue అండ్ social construction.. యిందులో మగ నేను, కుల నేను, వర్గ నేను, ప్రాంత నేను, దేశ నేను, వయసు నేను… యివేవీ కాని అనేక నేనులు… సో  ఈ ప్రశ్న అర్థం లేనిది లేదా కాంప్లెక్స్‌ question .

సో, to be freank.. I don’t know… ‘నేను’ లో socially constructed moralities and ethics  మూలంగా కొన్ని సార్లు కొన్ని ముఖాలతో నేను comfortable గా వుండను.

నా దేహం` నా హృదయం ఈ రెండూ నిరంతర ఘర్షణలో ఉంటాయి. సో, highly agitated condition లో వుంటాను… దీని మీద వొక కవిత రాశాను.

హృదయం:

యీ నచ్చని ముఖాన్ని దాచలేను

తప్పుడు దేహంలో ప్రవేశించాను

కవిత్వం తప్ప కప్పుకోవటానికి ఏమీ లేదు

దేహమే చెఱశాల

దేహం:

ఆగంతకుడ్ని మోస్తున్నాను

గుర్రం రౌతును తోలటమే దుఖం నాకు

బేతాళుడి నుండి విముక్తి లేని చెట్టువలె నాటుకుపోయాను

చెఱశాలకు స్వేచ్ఛ లేదు

ఐడెంటిఫికేషన్‌ సాధ్యం కానందువల్లే దాము అనే వొక కవి creates phantasmagoric  transformations of realities. He converts inner demons of multitudes into images of tumultuous words. In this process he is touched by the devil, he is touched by himself.

Q దాము అలియాస్‌ బాలాజీ మాజీ నక్సలైట్‌, ప్రస్తుత ఫిలిం మేకర్‌ భవిష్యత్‌ ఏమిటి?

సినిమాలు తీయటమే నా భవిష్యత్తు. ‘నక్సలైట్‌ డెత్‌ థీమ్‌ని బేస్‌ చేసుకొని వొక స్క్రీన్‌ ప్లే రాస్తున్నాను. యిది outward గా వొక fast paced thriller లా వుంటుంది. Full ఆఫ్ ఏక్షన్, inward గా హ్యూమన్‌ predicament వుంటుంది. Character driven screenplay . దీన్ని సినిమా చేయటానికి ప్లాన్‌ చేస్తున్నాను. ప్రధానంగా హిందీలో వుంటుంది.

యిది కాక మరికొన్ని ప్రాజెక్ట్స్‌ వున్నాయి.

వరుసగా సినిమాలు చేయటమే ప్రస్తుత నా లక్ష్యం.

భవిష్యత్‌కి సంబంధించి మరికొన్ని hidden agendas ఉన్నాయి. అవి ప్రస్తుతం చెప్పకూడదు.

ఇంటర్వ్యూ : సాయిపద్మ

 

 

 

మీ మాటలు

 1. “కవిత్వం నా రహస్య ప్రేయసి. అది నా క్లోను. నన్ను అక్షరాలుగా విచ్ఛిన్నం చేసుకోవటమే నా కవిత్వం. అది నాలోపలి వాడితో నేను జరిపే వున్మత్త ప్రేలాపన, నాలో నేను దిగబడుతున్న చప్పుడు.”
  మనసులోని మాటని బయటకుతెచ్చే ఈ ఇంటర్వ్యూలొ ఓ ప్రొఫెషనలిజం సుస్పష్టం. కంగ్రాట్స్ సాయిపద్మగారు

  • సాయి పద్మ says:

   థేంక్ యు శ్రీనివాస్ గారు, భావన లో డెప్త్ లేకపోతే ఎన్ని ప్రశ్నలు అడిగినా లాభం లేదు కదా.. కవిగా దామూది ఆ క్రెడిట్ .

 2. Nice to know many things about Damu…….. Sai Padma………..Good extraction :)

 3. sujanaramam says:

  హృదయం:

  యీ నచ్చని ముఖాన్ని దాచలేను

  తప్పుడు దేహంలో ప్రవేశించాను

  కవిత్వం తప్ప కప్పుకోవటానికి ఏమీ లేదు

  దేహమే చెఱశాల

  దేహం:

  ఆగంతకుడ్ని మోస్తున్నాను

  గుర్రం రౌతును తోలటమే దుఖం నాకు

  బేతాళుడి నుండి విముక్తి లేని చెట్టువలె నాటుకుపోయాను

  చెఱశాలకు స్వేచ్ఛ లేదు

  దాము గారి ప్రవాహ గానాన్ని మొత్తం ,వారి జీవితాన్ని
  దేహం హృదయం ఈ కవితే అధ్బుతంగా తెలుపుతోంది

 4. క్రియాశీలకంగా ఉద్యమాలదారి పట్టడం వదిలేస్తే, దాదాపు నా జీవితమూ ఇలాగే ఉందేమో అనిపించేలా ఐడెంటిఫై అయ్యాను.

  • సాయి పద్మ says:

   ఒక పాషన్ కోసం , జీవితంలో సర్వ శక్తులూ పెట్టె వల్ల జీవితాలు , దగ్గరగా ఉంటాయి , అనుకుంటున్నాను.

 5. మంచి ప్రయత్నం దాము ని ఆంగ్లం లోకి అనువదించి మ్యూస్ ఇండియాకు అందించిన అవకాశం , ఇవాళిలా దాము హహ కారణాలెమైతేనేం బాహ్య జగతిని పలకరించడం ఒక మంచి కవి హృదయానికి తీసిన తలుపు అభినందనలు

 6. చాల…చాలా బావుంది! నెమ్మదిగా నేను మీ fan ని అయిపోతున్నాను… :)

  • సాయి పద్మ says:

   మంచి కవిత్వానికి ఫ్యాన్ అవటం ఎప్పుడూ మంచిదే ..అపర్ణా

 7. ns murty says:

  పద్మగారూ ,

  మీ interview బాగుంది. Youthful Days లో ఉండే Infatuation గురించి, Death ని Glorify గ్లోరిఫై చెయ్యడం గురించీ, Communities పోయి వాటి స్థానే Nuclear Families, Epics స్థానే Episodes రావడం వంటి సందర్భాలలో దామూ గారి సమాధానాలు కూడా చాలా సూటిగా, నిజాయితీగా ఉన్నాయి. నాకు దామూ గారు ఉటంకించిన కవిత మరీ నచ్చింది.
  మీకూ, దామూ గారికీ హృదయపూర్వక అభినందనలు.

  • సాయి పద్మ says:

   థేంక్ యు మూర్తి గారూ.. అతని జీవితానుభవాలు గొప్పవి, గాఢమైనవి . నా గొప్పతనం ఏమీ లేదు ఇందులో .

 8. సారంగా బిస్మిల్లాహ్ ….
  గత పదేళ్ళుగా నేను ఎదురుచూసే ఫలితాలలో దాము సినిమాలు ఒకటి
  నాకు తెలిసి ,నేను చూసి ,నేను కలిసిన సికందర్ లలో దాము ఒకరు
  త్వరలో ఆశించిన ఫలితాలు కళ్ళముందు కనిపించాలని .అమెన్
  మీకు షుక్రియాలు .

 9. ‘వొక మనిషిలో అనేకమంది… యెవరైనా వొకరే అయితే అది శవం మాత్రమే… says everything about you , Daamu :)

  Pretty good work Sai Padma garu, excellent.

 10. attada appalanaidu says:

  chala kaalam tarvata Damu garni choosanu,interview lo.Happy.interview baagundi.please give me Damus phone number

 11. బాగుంది. కొన్ని కొన్ని అర్థం కావడానికి కొంత కొంత తెలిసి ఉండాలని అనిపిస్త్హోంది. దాము గారు తో ఒక సారి మాట్లాడాలి. నెంబర్ ఉంటె ఇవ్వండి…థంక్ యు.

 12. veldandi Sridhar says:

  జీవితానికి ఉప నది లాంటి ఇంటర్వ్యూ . చాలా బావుంది. సమాధానాలు కూడా అంతరంగాన్ని అక్షరాల్లో పరిచినట్టుగా ఉంది. ఏ ముసుగు వేయకుండా అంతర్ముఖం యొక్క అనేక ముఖాల్ని చూపెట్టింది.
  దాము గారికి, సాయి పద్మ గారికి అభినందనలు.

  వెల్దండి శ్రీధర్

 13. కవిత్వం నా రహస్య ప్రేయసి. అది నా క్లోను. నన్ను అక్షరాలుగా విచ్ఛిన్నం చేసుకోవటమే నా కవిత్వం. అది నాలోపలి వాడితో నేను జరిపే వున్మత్త ప్రేలాపన, నాలో నేను దిగబడుతున్న చప్పుడు.

  ** నిజమే ఆ రహస్య ప్రేయసి లేకపోతే ఎవరికీ చెప్పుకోవాలి..
  కొత్త విషయాలు.. అద్భుత జీవితాలు పరిచయాల్లో పరిచయమైనపుడు జీవితం పట్ల మరింత ప్రేమ కలుగుతుంది
  పద్మా… గ్రేట్ వర్క్ డియర్ !

 14. దామూ, మీ వాక్యాలలోని నిజాయితీ, ఆలోచనల్లోని డైమెన్షన్స్ ఆకర్షిస్తున్నాయి.
  పద్మగారూ.. ప్రవాహగానం నాటి నుండీ దామూ గురించి మరింత తెలుసుకోవాలని..
  మీ ప్రశ్నలతో బాగా స్కాన్ చేసారు.. :) మీకూ, అఫ్సర్ కీ ధన్యవాదాలు..

 15. lakshmi says:

  పద్మగారు మీ interview చాలా బాగుంది . దాముగారి సమాధానాలు చాలా ఆలోచింపజేసేవిగా ఉన్నాయి .
  మరణాన్ని గురించిన ఆయన నిర్వచనం ఎంతగానో నచ్చింది .i liked des lines

  Philosophical గా చూసినపుడు death is more fascinating than life. నా poetic moods లో డెత్‌ తప్పకుండా వుంటుంది. లైఫ్‌ మొత్తం డెత్‌ వైపు చేసే జర్నీనే. Death is actually the liberation from the inevitable human existential suffering. It purifies the human heart from the murky muds of so many original sins.

  తాత్వికతతో కూడిన దాముగారి జవాబులని మళ్ళీ మళ్ళీ చదివితే గాని బోధపడలేదు .
  మీకు దాముగారికీ నా అభినందనలు

 16. m.viswanadhareddy says:

  దామును స్కాన్ చేసారు … దాదాపుగా

 17. చందు తులసి says:

  దాము గారి గురించి ఆలస్యంగా తెలుసుకున్నందుకు సిగ్గుగా ఉంది. మొన్న పాతికేళ్ళ కథ సభలో కలిశాను కూడా..
  వీరప్పన్ సినిమా గురించి వివరిస్తుంటే ఎవరో సినిమా అనుకున్నాను..
  దాము గారి గురించి తెలుసుకోవాలి.

  పద్మగారూ….ఇంటర్వ్యూ బావుంది.

మీ మాటలు

*