నామిని బహిరంగ ఉత్తరం !

చిత్తూరు జిల్లా ఎన్.ఆర్.ఐ సంఘానికి నామిని నమస్కరించి విన్నవించేది..

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో కానీ, కార్పొరేట్   పాఠశాలల్లో కానీ చదువుకునే పిల్లల పరిస్థితి నిండా అధ్వాన్నంగా వుంది. మరీ ముఖ్యంగా మన రైతాంగం పిల్లల చదువు చాలా వికారంగా వుంటోంది. పదవ తరగతి చదివే పిల్లలు (a – b)3 సూత్రాన్ని కూడా చెప్పలేక తనకలాడి పోవడమే గాక 331ని 3తో భాగించలేక 11.33 అని, 3+2×4=20 అని వేస్తున్నారు.

తెలుగులో సినిమా పేర్లను కూడా రాయలేకపోతున్నారు. బీదా బిక్కీ పిల్లలు Poverty  అనే పదానికి కూడా అర్ధం చెప్పలేకపోతున్నారు.

నేను 2003 నుంచి 2006 దాకా 10 లక్షల మంది పిల్లల్ని కలిసి మంచీ చెడ్డా చెప్పడానికి ఒక రకమైన యుద్ధమే చేశాను. ఆ యుద్ధంలో అలిసిపోయి నా యింట్లో నేను కాళ్లు చాపేసి కాలం గడుపుకొస్తున్నాను.

ఎక్కడో వున్న అమెరికాలోని మీ సంఘంవారు గానీ, మరో సంఘం వారు గానీ నన్నొకమారు అమెరికాకు దయచేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. నాకిది కుశాలే. అయితే, నేనున్న యింటి చుట్టుపక్కల వున్న స్కూళ్ల వాళ్లు కూడా నన్ను పిల్లల ముందుకు రానివ్వడం లేదు. ఇది మాత్రం నాకు దుఃఖం.

అందువల్ల్ల అయిదారేళ్లుగా నా యింట్లో నేను చెల్లని కాసునైపోయి విశ్రాంతి తీసుకుని తీసుకుని తీసుకుని ఒళ్లు పులిసిపోయే మాదిరిగా అలిసిపోయినాను.  ఈ అలసట తీరాలంటే, నాకు పనిచేస్తేనే అసలైన విశ్రాంతి దొరుకుతుంది.

మేధావులు మాత్రమే నా పచ్చనాకు సాక్షిగా, సినబ్బకతలు చదువుతారని భ్రమపడిన నాకు పిల్లలింకా యిష్టంగా చదువుతారని పిల్లల్లో పని చేసాక తెలిసింది. అట్లాగే నా ఇస్కూలు  పిలకాయ కత కానీ, పిల్లల భాషలో Algebra కానీ పిల్లలకు చాలా ఉపయోగకరం.

మీ బోటి వారు దయతలిస్తే.. నాకేదైనా పని కొంచం యిప్పించండి. నా అపుస్తకాలను (నాకు రాయల్టీ  ఏమీ కూడా ఇవ్వకుండా) తక్కువ ఖర్చుతో న్యూస్‌ప్రింట్ మీద ప్రచురిస్తే ,  ఆ పుస్తకాలను బీదబిక్కీ చదువుకునే స్కూళ్లకు వెళ్లి పని చేస్తాను. నాతోటి జర్నలిస్టులు ప్రస్తుతం 60,70 వేల దాకా జీతాలు తీస్తున్నారు. నాకు అందులో సగం నెల నెలా 30,40 వేలు ఇచ్చినా నేను రోజుకి 2 వేలమంది పిల్లల్ని కలిసి పని చేస్తాను.

ఆ పని ఎలా వుంటుందో మీరు కంటితో చూడాలనుకుంటే జిల్లాలో వున్న మీ సంఘ బాధ్యులెవరినైనా మీరు నాకు తెలియజేస్తే వారితోపాటు 2,3 పాఠశాలలకెళ్లి నా పని, పిల్లల స్పందన వీడియో తీసుకొని మీరు చూడవచ్చు. నా పని మంచిదని మీకు తోస్తే.. నాకు కొంత పని యిచ్చిన వారవుతారు. వరికోతలకు శ్రమ జీవి వెళ్ళడం ఎంత గౌరవప్రదమో.. పిల్లల్లో యింకా 4,5 సంవత్సరాలు యీ పని చేయగలిగితే నేను అంత గౌరవంగా భావిస్తాను.

ఈ పని కూడా నన్ను ఉద్ధరించడానికి అని గాకుండా సంఘ శ్రేయస్సు అనే వుద్ధేశంతోనే మీరు నాకు పనివ్వాలి. నేను చేయాలి. అప్పుడు మీ సంఘాన్ని  గానీ, నన్ను గానీ దేముడు కూడా మెచ్చుతాడు.

ఇంకొక్క మాట. చిత్తూరు జిల్లాలో మంచి కార్యవాదిని ‘కారివేది ‘ అనంటారు. కారివేదినెప్పుడూ విమానాల మీద అమెరికా రమ్మని గౌరవించకూడదు. పనివెంట పని చెప్పి ఎండల్లో వానల్లో తిప్పి తిప్పి పని చేయించాలి. అప్పుడు నేను వందసార్లు అమెరికాకు వచ్చినట్టు!

సందేశం అడిగారు గాబట్టి మీ సంఘానికైనా, ఇంకో అమెరికా సంఘానికైనా యిదే నా సందేశం.
(మీ సావనీర్‌లో ప్రచురించడానికి నా రెండు కథలను దయతో తీసుకున్నందుకు కృతజ్ఞతలు. ఆ కథలతోపాటే ఈ సందేశాన్ని కూడా వేయండి. )

నమస్కారాలతో…
నామిని

మీ మాటలు

  1. NAMINI GARU SWAGATAM. CHALANALLAKI MALEE DARSHANAM. MEE AVEDANA SABABU. MEKU AMERICA SANGHAM JOB IVVALANI KORUKUNTU

  2. కళ్లు తెరిపించే మాటలు,.ఆ దేవుడు మీకు మరింత శక్తినివ్వాలని, ఆ పిల్లల కోసం ఆశిస్తూ,.

  3. m.viswanadhareddy says:

    మీరు ఎంత ఎండల్లో కాగితే మాకు అంత మంచిది .కారిన ఆ చెవట చుక్కల్లో మెరిసే ఆ ముత్యాలని మేము ఏరు కుంటాము . చిట్టుడుకు నీళ్ళు చికాకో వాళ్లకు వద్దు . కారివేది కార్య రంగంలో వుంటే మంచి ది.
    పై మొటారెక్కి కళ్ళు తలకెక్కే పనిచేయనని మీరు మాటియ్యడం నాకు బలే కుశాలగా వుంది

మీ మాటలు

*