చలంతో నా ప్రయాణం మొదలయింది అపార్థంతోనే!

  (తెలుగు సాహిత్యానికి ఒకే ఒక్క చలం పుట్టిన రోజు మే 18 వ తేదీ సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం )

“ఒక రోజు ఒకరు నాకెంతో ఆప్యాయంగా ఇచ్చిన మల్లెమొగ్గను వదల్లేక , జేబులో వేసుకుని మరచిపోయాను. సాయంత్రం కాలవగట్టు దగ్గర మల్లెపూల వాసనవేసి చుట్టూ వెతికాను , తోటలో ఉందేమోనని . చివరకు నా జేబును గుర్తుపట్టి చూస్తే , తెల్ల్గగా పెద్దదిగా విచ్చుకుని నా వేళ్ళను పలకరించింది  ! నా జేబులో మరచిపోయిన నా మల్లెమొగ్గ ? కళ్ళంబడి నీళ్ళుతిరిగాయి.”

ఒక వానాకాలం సాయంత్రం రోడ్డమ్మట రాలిన పూవులు చూసుకుంటూ తడిచి ఇంటికొచ్చాక , కిటికీ అవతల ఇంకా కురుస్తున్న వానను చూట్టానికి విసుగొచ్చాక  , ఇంట్లో కరెంటు లేకపోవడం మూలాన టీవీ , టేప్ రికార్డ్రర్ పెట్టలేక చేతికి అందిన పుస్తకం ..యాధృచ్చికంగా ” మ్యూజింగ్స్ ” . అందులో యాధృచ్చికంగా నేను తెరచిన పుస్తకంలో పై పంక్తులు.  మొట్టమొదటిసారిగా చలంపై ఇష్టాన్ని పుట్టించాయి.

అంతకుమునుపు రెండు నవలలూ , కొన్ని కథలూ చదివినప్పటికీ వాటితో పెద్ద relate అవలేదు.  అందుకు కారణం ఆ రచనల్లోని అంశాలు కులమతపరమైన వివక్షలూ , స్త్రీలను అణగదొక్కిన , హింసించిన కథలు  ,  కష్టాలు కన్నీళ్ళే అధికంగా ఆగుపించాయి. తెలుగు రచయితల్లో చాల గొప్ప రచయిత అదీఇదీ అని వింటే , నాన్ననడిగి ఆ పుస్తకాలు తీసుకున్నా. నీకివి పెద్ద నచ్చకపోవచ్చు అని తను ముందే ఒక statuatory warning ఇచ్చాడు. అదే నిజమైంది.

ఈ మనిషేమిటి తెలుగు కథల్లో మధ్యమధ్యలో ఇలా ఇంగ్లీష్ పదాలు వ్రాసేస్తాడు అని అడిగితే , అదే అతని revolutionary style అన్నారు.  ఓహో నాక్కూడా ఎప్పుడైనా సరైన తెలుగు పదాలు దొరక్కపోతే ఇలా ఇంగ్లీషు వాడి cover చేసుకోవచ్చన్నమాట అనే అడ్డదారి తట్టింది.  పోన్లే పనికొచ్చే విషయం ఒకటి దొరికింది అని ఇంకొన్ని కథలు చదివితే వాటిల్లో అక్కడక్కడా పాత్రధారులే చలం అనే వ్యక్తిగురించి మాట్లాడటం  , కథనంలో తనకుతనే “చలం ఒప్పుకోడు , చలం ఎవడు చెప్పడానికి , చలం చెప్పినట్లు.. ” ఇలా సోత్కర్ష కనిపించి ఇదేమిటీ మరీ SD ( S=సొంత D =డబ్బా..  కాలేజ్లో ర్యాగింగ్ అప్పుడు మొదటగా చెప్పమనేవారు..

కొందరు లెక్చరర్లు క్లాసులో “క్లాసులు” పీకేటప్పుడు అనేవాళ్ళం  )అనిపించి అదే విషయం నాన్నను అడిగితే..  ” అలా వ్రాసుకోవడానికి ఎంత దమ్ము ఉండాలో తెలుసా” అన్నాడు. “దమ్ము ఏమిటి నాకైతే గర్వం , అహంకారం అనిపిస్తోంది ” అన్నాను.  ” నా దగ్గర అంటే అన్నావు ఇంకెవ్వరిదగ్గరైనా అనేవు , మీ అబ్బాయికి ఏమీ తెలీదండీ అని నన్నే వెక్కిరిస్తారు. ఆయనంత సౌమ్యుడు ఎవరూ లేరు , ముందా పుస్తకాలు నాకిచ్చేయ్ ” అని తగువేసుకున్నారు. ”

మ్యూజింగ్స్ అంట ఏంటా పేరుకు అర్థం ? ” ” ఇంగ్లీషు మహా తెలిసినట్లు మాట్లాడుతావ్ ? musings తెలీదా. muse , amused.. ” అని చెబుతుంటే అప్పుడు అర్థమైంది ఆ టైటిల్. ” ఆ musings  అయితే తెలుగులో మ్యూసింగ్సని కదా వ్రాయాలి ” అనుకుంటూ  ఆ పుస్తకం తీసుకున్నా.  చదవకుండా కొన్నాళ్ళు అలానే నాదగ్గర ఉంచేసాను.  ఆ వానాకాలం సాయంత్రం అనుకోకుండా తెరిచిన ఆ మ్యూజింగ్స్ తో కొత్తగా పరిచయం అయ్యాడు చలం.

పుస్తకం మొదటినుంచి మొదలెట్టాను.  దూరంనుంచి తనకు ఎన్నో మధురోహలనూ తత్వాలను రేకెత్తించిన ఒక అందమైన గులాబీపువ్వును స్పృశించేందుకు పరుగెత్తుకెళ్ళి , తీరా ముట్టుకున్నాక అది ఎవరో నలిపి పారేసిన గులాబీ కాగితం మాత్రమే అని తెలిసి అతని నిస్పృహ ఎన్నో ఆలోచనలను రేకెత్తించింది. అంతకు మునుపు మామూలే అని వొదిలేసిన కథలు మళ్ళీ కొత్త దృక్పథంతో చదివితే , ఈ సారి కథల్లోని ప్రకృతి వర్ణనలూ , మధ్యమధ్యలో కొన్ని పాత్రల తీరుతెన్నులూ నచ్చాయి , కానీ కథావస్తువులు మాత్రం పెద్దగా ఉత్సుకత రేకెత్తించలేదు.  అప్పటికి నాకు ప్రేమ కథలు అంటే మహా అయితే హాలీవుడ్ సిన్మాలు తెలుసు , ముఖ్యంగా సుఖాంతం అయ్యేవి.

ఆఫ్హ్ట్రాల్ ఒక మనిషి ప్రేమ కోసం వేదన , సంఘర్షణ పడిన కథలూ , వ్యక్తులు , అనుభవాలు నాకప్పటివరకూ తెలీవు . మరి చలం కథల్లో అధికశాతం అవే. అందుకే పూర్తిగా రిలేట్ అవలేకపోయాను.   జేబులో మరచిపోయిన మల్లెమొగ్గ తన ఉనికిని అందాన్ని గుబాళించడానికి కొంత సమయం అవసరం అయింది – మల్లెకు. రచన / సాహిత్యం పువ్వులు కావు , అవి విచ్చుకోవు , వాటిని అర్థం చేసుకోవలంటే చదివేవాళ్ళు పరిపక్వత చెందాలి.

2

కొన్నేళ్ళు fast forward .

ఫిలిమ్ మేకింగ్ నేర్చుకుంటున్న రోజులు . సినిమాల ద్వారా ప్రపంచ దేశాల్లోని ప్రముఖులు చరిత్రలూ , వాళ్ళ ప్రేమకథలూ వ్యధలూ , ప్రేమకోసం కరిగిపోయిన జీవితాలూ , ఆత్మార్పణలూ , వాటిని తెరకెక్కించిన ఆర్ఠిస్టులు , మళ్ళీ ఆ క్రమంలో వాళ్ళ భావోద్వేగలూ వీటన్నిటినీ “చూస్తున్నప్పుడు” అప్పుడప్పుడూ చలం కథలు గుర్తొచ్చేవి . మిగతా రాష్ట్రాల స్నేహితులతో ఆ కథలు పంచుకుంటుంటే ” సెక్సీ ” ” బ్యూటిఫుల్ “అని మెచ్చుకునేవాళ్ళు . ఈ చలం ఎవరూ , ఇంగ్లీషు తర్జుమాలు ఎక్కడ దొరుకుతాయి అని అడిగేవారు . “ఒక పువ్వు పూచింది ” కథకు ఒక పరదేశి విపరీతమైన ఫ్యాన్ అయిపోయి , దాన్ని ఎలా అయినా ఏనిమేషన్ చిత్రం చేయాలని అనేవాడు.  Antonioni , Bergmann , Bertulluci , Lors Von , Ki Duk , Wong kar wai , Bunuel , Truffaut , Fellini , Haenke , Fassbinder.. ఇటువంటి ప్రఖ్యాత సినీ దర్శకుల సినిమాలు చూస్తుంటే కొన్ని పాత్రలూ , సన్నివేశాలు , భావోద్వేగలు అంతకు మునుపు చలం కథల్లో చదివినట్లు అనిపించేవి.

ఒకసారి బ్రూక్లిన్ నుంచోచ్చిన  కొందరు ఫిలిం స్టూడెంట్స్ తో ఇలాంటి సినిమా కబుర్లు , సాహిత్యం గురించి పంచుకుంటుంటే , ” ఇండియాలో ఇంత బోల్డ్ కథలున్నాయా ? మరి సినిమాల్లో కనబడవేం ? మీకు తెలుసా ఫ్లైట్ దిగినప్పటినుంచి ప్రతి ఊళ్ళూ చూస్తున్నాం ప్రేమించుకునే జంటలు రోడ్లపై పాటలూ డ్యాన్సులూ చేస్తూ తారసపడతారేమో . నిజజీవితంలో అలా ఏం ఉండదని తెల్సుకున్నాం , మరి ఇలాంటి ఎమోషన్స్ మీ లిటరేచర్లో ఉండి కూడా ఎవరూ తెరకెక్కించరేమిటి ? ప్రేమ , స్త్రీ పురుష సంబంధాలు ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే. కానీ దేశాన్ని , అక్కడున్న సామాజిక కట్టుబాట్లు , కులమతాచారాలను బట్టి  ప్రవర్తన మారుతుంది . సమాజంలో కట్టుబాట్లను ప్రశ్నించే ప్రేమ , అది సమాజం ఒప్పుకోనిదైనా , సమాజానికే అవసరం . అటువంటి ఉద్దేశ్యంతోనే ఎవరైనా ఇలాంటి రచనలు చేస్తారు , కానీ మీ సిన్మాల్లో అలాంటి ప్రయత్నాలేవీ ఉండటం లేదు ” అనే మాటలు వొచ్చాయి.

చలం కథలే కానీ , ఆత్మకథను , జీవితచరిత్రను చదవని నాకు అప్పుడే వాటినీ చదవాలి అనిపించింది .  ప్రపంచాన్ని తమ కళలతో జయించిన కొందరు కళాకారుల జీవితచరిత్రలు చాలా నీచంగా  , క్షుద్రంగా ఉండటం తెలిసి అయ్యో ఇలాంటిమనిషినా ఇంతగా అభిమానించింది అని బాధపడటం , ఆ తర్వాత సదరు కళాకారుని కళను మనస్ఫూర్తిగా ఆస్వాదించలేక ఇబ్బందిపడటం అప్పటికి అనుభవమే కనుక కాస్త భయపడుతూనే చలం ఆత్మకథను తెరచాను .

చాలా చిన్నవయసులో తండ్రితో విభేదాలు , బాల్య వివాహంతో తన జీవితంలోకి వొచ్చిన అమ్మాయిని సైకిలు మీద పెట్తుకుని స్కూలుకు తీసుకెళ్ళి చదివించడం , ఇష్టంలేని పెళ్ళికి గురైన చెల్లెలిని శోభనంగదినుంచి రక్షించాలని పడిన తాపత్రయం… ఇలాంటివన్నీ చూసి చాలా ముచ్చట వేసింది . అభిమానం పెరిగింది. అంతలోనే , దేశభక్తి కంటే వ్యక్తిగత శ్రేయస్సూ , సుఖమే ముఖ్యమనే వాదనలూ , అక్రమ సంబంధాలూ , వాటి గురించి కూడా వ్రాయడమూ కొంత చిరాకు కలిగించి అబ్బే ఇలాంటి మనిషినా అభిమానించేది అనిపించేది .

తర్వాత్తర్వాత సమాజం పట్ల విసిగి ఆయన పారిపోవడం , మిత్రుల ఆత్మహత్యలూ , ఆయనలోనూ అలాంటి ఆలోచనలూ , ఆదరించిన అభాగ్య స్త్రీలు పిల్లలను కని వొదిలేసి వెళ్ళిపోతే ఆ శిశు సంరక్షణలూ వంటి ఘట్టాలు చదువుతూ ఉంటే , దాదాపు అర్థ శతాబ్దం దూరంగా ఉండి ఆ మనిషి వ్యధను అర్థం చేసుకోవడం కష్టమని , ఇరవయ్యో శతాబ్దపు కాన్వెంటు మైండుతో అప్పటి సామాజిక పరిస్థ్తితులను విశ్లేషించడం సరి కాదేమో అనిపించింది.

నేను ఒదిలేసుకున్నట్లు ఆయనా తన ఆలోచనలతో తనే అలసిపోయాడేమో అన్నీ వొదిలేసి దేవుడూ ,  బాబాలూ , ఆశ్రమాలకెళ్ళిపోయాడు .  ఇప్పటికీ నేను కలిసే చలం అభిమానులూ , దురభిమానులూ కూడా ఆయన అలా చేసి ఉండాల్సింది కాదని అంటారు కానీ నాకయితే అది చాలా ఊహించిన గమ్యమే అనిపించింది .

మొట్టమొదటి నవలల నుంచి ఆయన పాత్రలూ పదే పదే దేవుడి గురించి మాట్లాడటం , కష్టంలో దేవునితో మొరబెట్టుకోవడం , సుఖాన్ని దైవ సన్నిహిత్యంతో పోల్చడం  ,  శారీరిక వాంఛల గురించి కూడా ఉపనిషత్తుల , భాగవతాల  ప్రస్తావనతో వ్రాయడం గమనించితే , దేవుడు అనే ఆలోచనలోనే అయన ఎక్కువగా బ్రతికాడు . కాబట్టి ఆయన చివరి రోజులలోని ఆధ్యాత్మికత జీవనశైలి చాలామంది అన్నట్లు నాకెంతో వింతగానూ , వేలలక్షలమంది మనసులను రచనలతో ప్రేరేపించి తను మాత్రం పారిపోయినట్లు అనిపించలేదు.  కానీ , నాలోనూ ఒక అసంతృప్తి.

ఆయన ఇంకాస్త బలంగా నిలబడి , సమాజంలోనే ఉండి , ఇలాంటి ఆరోపణలు తలెత్తకుండా జాగ్రత్త పడి ఉంటే బావుండేది కదా అనిపించింది.  ” నేను పరిపూర్ణ పురుషుడ్ని కానంతవరకూ నాకు పరిపూర్ణ స్త్రీ దొరకదు ” అని చలమే చాలా చివరిదశలో గ్రహించినట్లు వ్రాసుకున్నా నన్ను ఓ ప్రశ్న వీడలేదు . సమాజం , వ్యవస్థ , ప్రపంచం అన్నిటిలోనీ perfection కోరుకునే మనిషి తాను మాత్రం perfect ఉండలేడెందుకు అని . సమాధానం  Tolstoy జీవిత చరిత్ర చెప్పింది .2009 THE LAST STATION  సినిమా చూస్తుంటే చాలా వరకు చలం జీవితం చూస్తున్నట్లే అనిపించింది . అందులోని ఒక డైలాగ్ : He is a better Tolstoyan than I am.    మరో సందర్భంలో టాల్ స్టాయ్ సిద్ధాంతాలను బాగా అభిమానించి ఆయనతో బ్రతకడానికి వొచ్చిన ఒక శిష్యుడు , ఒక అమ్మాయికి ఆకర్షితుడైనా Do not lust అనే టాల్ స్టోయ్ నియమానికి భయపడుతూ ఉంటే , అతనితో వాహ్యాళి వెళుతూ ఆయన తాను యవ్వనంలో ఉండగా ఒక స్త్రీతో కలిగిన శారీరిక సంబంధాలను నెమరు వేసుకుంటాడు . నివ్వెరపోయి చూస్తున్న అతనితో టాల్ స్టోయ్ ఇలా అంటాడు ” Let me assure you I am not a good Tolstoyan myself.  You should think twice before you ask my advice on anything. ”  “శరీరం , అందువల్ల కలిగే సుఖం మిధ్య అని అంటారు కదా అని శిష్యుడు ప్రశ్నిస్తే , నేను ఎన్నో చెబుతాను , ప్రతిపాదిస్తాను , కానీ నీ మనసు ఏం చెబ్తుంది ” అని సమాధానం వొస్తుంది. చలం చరిత్రా అటువంటిదే.

ఓ రెండు సంవత్సరాలు fast forward .

చలం నవలలో ఏదో ఒకదాన్ని సినిమా తీద్దాం అనుకున్నాను.  హక్కులు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసుకుందుకు చలంను ఏదో ఒక దశలో చూసిన , ఆయన ఆలోచనలకు ప్రభావితం అయిన కొందరిని కలవాల్సి వొచ్చింది . వారి సహకారం వలన ఒక నవల హక్కులు పొందగలిగాను. కానీ ఒక అసంతృప్తి మొదలు. అందరూ చలం వీరాభిమానులే . ఆయన ప్రతి పనినూ , రచననూ ఆహా ఓహో అనేస్తున్నారు . ఆయన తత్వాలను , పాత్రలను అప్పట్లో చాలా మంది ద్వేషించారు అని చదివానే . మరి ఆ ద్వేషం ఎలా ఉంటుందో కూడా తెలుసుకోనిదే నవలలో పాత్రలు భరించాల్సిన ఒంటరితనం , భయం , తిరస్కారం ఎలా సినిమాలో ఆవిష్కరించగలను అనుకుంటూ , మెల్ల్గగా కథను నాకు తెలిసిన , చలం ను మునుపు చదవని , ఆయనంటె ఎవరో తెలియని వ్యక్తులతో చెప్పడం మొదలెట్టాను. అన్ని రకాల ప్రతిస్పందనలూ వొచ్చాయి . ఇక్కడ కొంతమంది మాటలు నన్ను ఎంతగానో ప్రేరేపించి , చలాన్ని కొత్త రకంగా అర్థం చేసుకోవడానికి సహాయపడితే మరి కొందరి మాటలు , చర్యలు చాలా చవకబారుగా సాగాయి . చవకబారు వ్యక్తుల గురించి ధైర్యంగా వ్రాసేంత చలం నాలో లేడు కనుక , పేర్లకు ముసుగువేస్తున్నాను.

” ఛీ మీరేదో సంస్కారవంతులు అనుకున్నాను , పోయిపోయి ఇలాంటి కథలు సిన్మా తీస్తారా ? ”  అని ఒక స్నేహితుడు చిరాకు పడితే

“చలం గొప్ప రచయిత అండీ , కానీ ఇప్పుడు వాటి అవసరం ఏమిటి ? చలంకే సెక్సు గురించి చెప్పేంతగా ఉన్నారు ఇవ్వాళ ఆడపిల్లలు ” ఇద్దరు కూతుళ్ళున్న ఒక లెక్చరరు అనాలిసిస్

” ఓహ్..చలం నవలా.. సుపర్. అవార్డు గ్యారెంటీ.  వెంటనే ఒక కమర్షియల్ సిన్మా కూడా తీయాలి లేకపోతే ఆర్టు డైరెక్టరని ముద్రేసేస్తారు ఇక్కడ ” ప్రతిపనిలోనూ లాభం నష్టం చూసే ఒక శ్రేయోభిలాషి సలహా
” చలం అద్భుతం అండీ. ఈ సినిమాకు పని చేసే అవకాశం నాకివ్వండి ” ఒక సంగీత దర్శకుడి అభ్యర్థన ” మీకు ఏం నచ్చిందండీ చలంలో , ఆ నవలలో” అని ప్రశ్నిస్తే ” అద్భుతం అండీ , చెప్పడానికి మనం ఎక్కడ సరిపోతాము. కొన్ని అలా అద్భుతం అంతే ” తనకేమీ తెలియదని అందంగా చెప్పేసాడు .

” నువ్వు తీయగలవా? ఎందుకు రిస్క్ ? మన తెలుగువాళ్ళు బాగా అపార్థం చేసుకున్న మహా రచయిత చలం.   వొదులుకోవడం వాళ్ళ ఖర్మ. ఆ ఖర్మనలానే ఉంచెయ్ , our telugu audience dont deserve such great stories ” ఎంతో పాండిత్యం ఉన్నా అప్పుడప్పుడూ చెత్త పాటలు వ్రాయాల్సి వస్తున్నందుకు విసిగిపోయిన ఒక ప్రముఖ పాటల రచయిత కోపం.

“ఇలాంటి సిన్మా తీస్తున్నాం అని తెలిస్తే , నాకు ఇంట్లో అన్నం కూడా పెట్టరు ” సినిమాటోగ్రఫీ చేస్తానని వొచ్చినా తన ఇంట్లోవాళ్ళకు కథ చెప్పకుండా దాచిన ఒక మిత్రుడి భయం

” ఈ కథ చెయ్యాలని ఎంతో ఇష్టంగా ఉంది . కానీ నా బోయ్ ఫ్రెండ్ ఒప్పుకోడు , వెరీ సారీ ” కథను ఎంతో ఇష్టపడినా అందువల్ల తన వ్యక్తిగత జీవితం ప్రభావితం అవుతుందేమోనని ఒక నటి అభద్రతాభావం

” ఈ కథలో ఆ మతం , సెక్స్ ఎలిమెంట్స్నే హైలైట్ చేస్తూ ప్రొమోట్ చేద్దాం. సెన్సార్ ఒప్పుకోనట్లు తీసేసి ట్రైలర్ రిలీజ్ చేద్దాం . ఇక చూస్కో ,  ఎక్కడ చూసినా మన సిన్మా పేరే , తప్పులన్నీ చలంపై తోసేసి మనం సేఫ్ అయిపోవచ్చు , సిన్మాకు భీభత్సమైన కలెక్షన్స్ , మనకు ఫుల్ పబ్లిసిటీ ” నీఛాతినీఛమైన మార్కెటింగ్ ఐడియాలు ఇచ్చే ఒక కుహనా మేధావి.
” ఇలాంటి కథలు సిన్మాలు తీయకూడదండీ . గుట్టుగా ఉండే స్త్రీలను చెడగొడతాయి . సమాజానికి హానికరం ”  self-appointed social guardians కొందరు ఇలాంటి మాటలు , భిన్న ప్రవర్తనలూ సర్వసాధారణం అయిపోయాయి . పేరు చెప్పుకుంటే తమకేదో విశాలభావాలున్నాయి అని కొందరు స్త్రీలు దగ్గరవుతారనే దురుద్దేశాలతో చలాన్ని ఒక pheromoneలా వాడుకునే కాముకులూ , చలాన్ని తిడితే / పొగిడితే తమకు ఫేస్బుక్ లైకులు వొస్తాయి అనేంత మూర్ఖులూ , చలం జాతక చక్రంతో ఆయన జీవితాన్ని పోల్చి చూసే ఛాందసులూ ,  స్వంతంగా డబ్బులు పెట్టుకుని తమ ఊర్లలో చలం పుట్తినరోజు / వర్ధంతి ఉత్సవం చేసి ఆయన గొప్పదనాన్ని ఇప్పటి యివతకు చెప్పాలను యత్నించే సాహితీ ప్రియులు , అలాంటి చోట్ల తమ సొంత టాలెంట్ ప్రదర్శించే ( ఎంతగా అంటే…చలం గొంతును ‘మిమిక్రీ’ చేయడం లాంటి వింత పనులుఅన్నమాట ) ఆత్రగాళ్ళు , చలం అంటే ఎంతో ఇష్టం ఉన్నా ఆ ఇష్టం ప్రదర్శిస్తే తమకు విలువలు లేవనో , సంసార సుఖం లేదనో అపోహ పడ్తారని గాభరాపడే సున్నితమనస్కులు ..ఇలా రకరకాల మనుష్యులు.  తాను చచ్చిపోయి దశాబ్దాలు దాటుతున్నా ఒక రచయిత తన గురించి ఇందరిలో ఇన్ని భిన్నాభిప్రాయాలను , వివిధ ధృక్కోణాలను రేకెత్తించాడు అంటే అది నిస్సందేహంగా తెలుగు సాహితీ చరిత్రలో చాలా గొప్ప విషయం. అన్నా కరేనినాలూ , మేడమ్ బోవెరీలూ నిలబడినన్నాళ్ళు నిలుస్తున్న చలం స్త్రీ పాత్రలు ఇంకో శతాబ్దమైనా అలానే వాదోపాపవాదాలకూ , తర్కాలకూ గురికాక తప్పదేమో.

ఇదంతా ఆయన రచనలు చదివి అభిమానించే ఒక సామాన్య పాఠకుడిగా నా మనోగతమైతే , ఆయనతో బ్రతికి , ఆయన జీవితంలోని ఒడిదుడుకులు కళ్ళారా చూసి సిద్ధాంతాల మార్పులూ  , ఆథ్యాత్మికతా గ్రహించిన ఆయన true followersను మాత్రం నేను ఎవరినీ చూడలేదు. ఒక నెల  క్రితం వరకూ..
ఒక షూట్ పని మీద  భీమిలి వెళితే , ఆ సముద్రాన్ని చూడగానే జీవితాదర్శం గుర్తుకొచ్చింది. చలం అంతగా వర్ణించిన ఆ భీమిలీ బీచ్ చూసాక అక్కడే ఇంకా ఉన్నారేమో చలం భక్తులెవరైనా కొంత వెదగ్గానే , సౌరీస్ నగర్ , సౌరీస్ రోడ్డు అనే బోర్డులు కనిపించాయి. రోడ్డు పక్కన ఉన్న టీ కొట్టులో అడగ్గానే లోపల ఉండే ఆశ్రమం గురించి చెప్పారు.

” రోజూ పూజలూ అవీ చేస్తుంటారు సార్ , బావుంటుంది వెళ్ళి చూడండి ” అని చెప్పాక ఇక ఆగలేదు.  వెళ్ళేటప్పటికి అప్పుడే ఏదో పూజ ముగిసినట్లుంది , చాలా మంది స్త్రీలు బయటకు వొస్తున్నారు.  ఇలా చలం కథను సిన్మా తీస్తున్నవాళ్ళం అనగానే సాదరంగా ఆహ్వానించారు. సౌరీస్ సమాధిని ఒక పూజ మందిరం చేసి నిత్యం సత్సంగాలు , ధర్మోపన్యాసాలు , పునస్కారాలు చేస్తున్నాం అని చెప్పారు.

చలం వాడిన వస్తువులను , ఆయన పుస్తకాలను పవిత్రంగా , పదిలంగా చూసుకుంటున్నారు. ఆయన అభిరుచి మేరకు ఇంటి చుట్టూ పూదోట. లోపల నిద్రపోతున్న , తిరుగాడుతున్న పిల్లులు. అప్పుడప్పుడూ వినిపించే సముద్రపు హోరు.  వారి ముఖాలలో చాలా ప్రశాంతత. ఆ మాట ఈ మాటా మాట్లాడుతూ అన్నాను  ” ఇవాల్టికి కూడా ఆయనను నిందిస్తూ , ఆయన చెప్పింది సమాజానికి హానికరం అనీ , ఆయనదంతా తప్పు అనీ ద్వేషించేవారు ఉన్నారు. ఆయన జీవితాన్ని , వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కొందరు వేరే రచనలూ , వ్యాసాలూ వ్రాస్తూనే ఉన్నారు , మరి మీరేమీ సమాధానం చెప్పరా ? ” అని అడిగితే ,
” ఎవరిష్టం వాళ్ళదండీ . నచ్చినవాళ్ళకు నచ్చుతాడు , తిట్టాలనుకునే వాళ్ళను తిట్టుకోనివ్వండి , మాకు ఏమిటి తేడా ? ఆయనేమితో మాకు తెలుసు.. కాఫీ తీసుకుంటారా ? ” చిరునగవుతో సమాధానం.
అక్కడ  చలం ఇంకా సజీవంగా ఉన్నాడనే అనిపించింది .viplove

 

విప్లవ్

మీ మాటలు

 1. ” ఎవరిష్టం వాళ్ళదండీ . నచ్చినవాళ్ళకు నచ్చుతాడు , తిట్టాలనుకునే వాళ్ళను తిట్టుకోనివ్వండి , మాకు ఏమిటి తేడా ? ఆయనేమితో మాకు తెలుసు.” సింపుల్.

  • Kolluru Siva nageswararao says:

   చలం ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం పిచ్చి పిచ్చి గా చదివాను మళ్ళి ఇప్పుడు నెట్ లో చూస్తున్నాను ఇంకో సారి చదవడం మొదలు పెట్టాలి ఇప్పుడు ఎలా ఉంటాయో ….

   ]
   i

 2. చలం గురించి, ఆయన రచనల గురించి చాలా వివరంగా చెప్పారు. మూడేళ్ళ క్రితం నేను “మైదానం” తీద్దామనే అనుకున్నాను. అప్పటికే మీరు ఆ ప్రయత్నాల్లో ఉన్నారని తెలిసింది. అప్పటి నుంచి మీ సినిమా చూసేందుకు ఎదురుచూస్తున్నాను. త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను. :)

  • Viplove says:

   నేను కూడా

  • SIVARAMAPRASAD KAPPAGANTU says:

   మైదానం నవలను దూరదర్శన్ వారు చాలా కాలం క్రితం టెలిఫిల్ము గా తీశారు కాని అంత బాగా రాలేదు. కారణం నటీనటులకు దర్శకునికి పాత్రల మీద అవగాహన లేకుండా తీశారు.

 3. Fazlur Rahaman naik says:

  చలాన్ని పరిచయం చేసింది మీరు. మ్యూజింగ్స్ అనగానే నాకు మొదట గుర్తుకు వచ్చేవి మీరు వ్యాసం లో మొదట్లో వ్రాసిన పంక్తులు …. ప్రకృతి వర్ణన … ఆహ … ఆ వర్ణనని ఊహించుకున్నా కూడా, ఇంట్లో ఆహ్లాదంగా ఉంటుంది మనసుకి … :-).

  • Fazlur Rahaman naik says:

   ^^నాకు చలాన్ని పరిచయం చేసింది మీరు …

   • Viplove says:

    ఇంకొన్నాళ్ళు ఆగితే తనే పరిచయమయ్యే వాడేమో :)
    థాంక్యూ

 4. m s naidu says:

  ఇవాల్టికీ చలాన్ని enigmaticగానే ఎందుకు చూస్తారో.

  • Viplove says:

   మనం దేన్ని ఎలా చూడాలి అనుకుంటే అలానే చూసే సౌకర్యం ఉంది మరి

 5. SIVARAMAPRASAD KAPPAGANTU says:

  “…ఓహో నాక్కూడా ఎప్పుడైనా సరైన తెలుగు పదాలు దొరక్కపోతే ఇలా ఇంగ్లీషు వాడి cover చేసుకోవచ్చన్నమాట అనే అడ్డదారి తట్టింది…”

  అడ్డదారి కాదది అదే సరైన దారి. తెలుగులో లేని పదాలకు సమానార్ధాన్ని ఇచ్చే పదాలను వాడి దాని అర్ధం ఇది అని బ్రాకెట్లో అంగ్లంలో వ్రాసే బదులు, అదే ఆంగ్ల పదాన్ని తెలుగులోకి ఆకారమో ఉకారమో తగిలించి తీసుకువస్తే అదే తెలుగు అవుతుందని నా భావన. ఉదాహరణకు రోడ్డు, చెక్కు వంటివి. చెక్ అనే పదానికి తెలుగు ఏమని వ్రాయాలి. వాడుకలోకి చెక్కు అని వచ్చేసింది. ఇలాంటి సులువును మొట్టమొదటిగా గ్రహించినది చలం గారే అనుకుంటాను. తెలుగును గ్రాంధికపు కోరల్లోంఛి రక్షించి వాడుక భాషలోకి తీసుకు వచ్చిన మొదటి తరం రచయితల్లో అగ్రగణ్యుడు చలం. ఆయన ఆత్మకథలోనే తన శైలి గురించి వ్రాసుకున్నారు.

  ఇప్పుడు తెలుగులోకి పదాలను తయారు చెయ్యాలన్న ఆత్రంలో కొంతమంది (తెలుగు పద గుంపులట, బృందాలు కాదు!) ఆంగ్లంలో ఉన్న పదాలకు యధాతథ అనువాదాలు చేసేసి ఏదో అద్భుతం చేసేశాం అనుకుంటున్నారు. వీళ్ళు ఇంకా “డ్రాయింగ్ రూం” కు తెలుగు పుట్టించలేదు. అదృష్టం బాగుండి “యు ట్యూబ్” జోలికీ పోలేదు. వెళ్లి ఉంటే ఎంతటి ఎబ్బెట్టు తెలుగు పదాలు వచ్చేవో కదా!!

 6. SIVARAMAPRASAD KAPPAGANTU says:

  “లాస్ట్ స్టేషన్” సినిమా గురించి తెలియచేసినందుకు ధన్యవాదాలు. ఆ సినిమా సంపాయించి చూడటానికి ప్రయత్నం మొదలుపెట్టాను.

మీ మాటలు

*