అంతరంగం

వసంతం వచ్చినా శిశిరం ఇంకా వీడ్కోలు చెప్పలేదంటూ చల్లటిగాలి విసురుగా ముఖాన్ని పలకరించింది.ఎటుచూసినా విరగబూసిన పూల గుత్తులే..ఒక్క క్షణం మనసు ఒకలాంటి తన్మయత్వంలో మునిగింది. చిన్నప్పుడు చదువుకున్న చందమామ కధల్లో రాజకుమారి ఉద్యానవనం గుర్తొచ్చింది. సడనుగా రాజకుమారి ఎందుకు గుర్తొచ్చిందా అనుకుంటే ఎదురుగా పూపొదలు. అచ్చంగా చందమామ కధలో బొమ్మ లాగే…కారు పార్క్ చేసి ముందుకు నడుస్తూ నిట్టూర్చింది రజిత.

మనసునిండా ఆలోచనలు…అంతర్ముఖం ఫరవాలేదు, చిన్నప్పటినుండీ అలవాటేగా!ఎందుకో ఈమధ్య మరీ పరాకైపోయింది.పదే పదే వెనక్కి తొంగి చూసుకోవడం.సెల్ఫ్ పిటీనా?? మరీ ఎడారిలాంటి జీవితం.ఎలాంటి అనుభూతి గుర్తులేదేం? ఎందుకంత జడత్వం ఆపాదించుకున్నాను. ఏమో? అందరికీ నచ్చే ఏవీ తనకెందుకు ప్రత్యేకం అనిపించవు? చెట్టునిండా విరగ్గాసిన మల్లెపూలను 20 మైళ్ళు డ్రైవు చేసి మరీ వచ్చి కోసుకెళ్ళిన దీప గుర్తొచ్చింది. కుదిరినా కుదరక పోయినా ఎగబడి మోతీచూర్ లడ్డు తినే అనంత్, ఎక్కడ సేల్ అంటే అక్కడ ప్రత్యక్షం అయ్యే రూప,పట్టుచీరలకు ప్రాణం ఇచ్చే లలిత, కవిత్వం తో చంపే మధు, ఎక్కడా లిస్ట్ లో లేను..ఎందుకని?

అనవసరంగా లీవు వేస్ట్ చేసుకోవద్దని భర్తని వారించడం గుర్తొచ్చింది. పేచీలు పేచీలతో చిన్నాణ్ణి స్కూల్లో వదలడం గుర్తొచ్చింది..తెలీకుండానే ఓ నిట్టూర్పు..మెట్రోరావడంతో ఎక్కి కూర్చుంది.ఎందుకో ఇవ్వాళ శాంఫ్రాన్సిస్కో ఇంకా అందంగా కనిపిస్తుంది.మనసు వద్దన్నా గతం తోసుకొస్తూనే ఉంది.బహుశా మొన్నే విజిట్ కని వచ్చి కలిసిపోయిన క్లాస్మేట్ ప్రభావమేమో …..

ఆడపిల్లగా పుట్టడం శాపమా??వరమా? వరమైతే ఖచ్చితంగా కాదు.ఎందుకని? వివక్షను సహించాలిసి వచ్చినందుకా? ఎక్కడ లేదు వివక్ష? చదువురాని అమ్మమ్మ, కొద్దో గొప్పో చదువుకున్న అమ్మ, అందరూ భరించినవారే.అందుకే అప్పుడే నిర్ణయించుకుంది.

జీవితంలో ఓడిపోకూడదు అని. మరి గెలిచానా? గెలిచాను కానీ ….ఆగిపోయింది ఆలోచన అక్కడితో…

నిజంగా ఆలస్యంగా వివాహం వల్ల శారీరక సమస్యలుంటాయని ఎవరూ అనుకోగా వినలేదే?ఏమో? అందువల్లనే కాన్సరు వచ్చిందా? 30 ఏళ్ళు ఆలస్యమా?

ఎక్కడ పరుగాపాను? ఆడపిల్లనని గుర్తుంచుకున్నది ఎక్కడ? పదో తరగతి స్కూల్ ఫస్ట్.విజయపు రుచి తెలిసిన తొలి క్షణం…గుంటూరు జిల్లాలో వెనకపడ్డ చిన్న పల్లెటూరు. ఇంగిలీషు మీడియం అంటే పక్కనున్న టవును ఖర్చు..కనుక నాన్న వద్దనే అన్నాడు. తెలుగు మీడియమే ఐతేనేం ఇంజినీరింగ్.వెంటనే ఎంటెక్.భవిష్యత్ గురించి గంపెడాశ.దానితో పాటే పెరిగిన అహం..ఉద్యోగం రాని నిర్లిప్తత భాగ్యనగరం అక్క ఇంటికి చేర్చింది.బ్రతుకు పోరాటం…

ఏదో సాధిస్తానన్న గొప్ప నమ్మకంతో అందరూ కిరీటం నెత్తిన పెట్టి మామూలు ఆడపిల్లగా అలోచించనివ్వలేదు.మనసులో ఉక్రోషాన్ని ఆపుకోవటం మించి మార్గం లేదు.నోరు విప్పేలోపే పూలు పెట్టుకోననీ, గోరింటాకు వాసన చూడననీ, నగలు ఇంటరెస్ట్ లేదని ఒకటేమిటి సగటు ఆడపిల్ల కు అని సంఘం నిర్ణ్యించిన ఏ పనీ చెయ్యకూడదు అని వాళ్ళే నోరిప్పేలోపు ఓ స్టాంప్ వేసేసారు…పళ్ళబిగువున ఒప్పుకోవాలిసి వచ్చింది.

ఎర్రగా, మొహం నిండా చిన్న చిన్న గుంతలు, బిగించి కట్టిన కాటన్ చీర, జడా ఇవి చాలేదు ఆడపిల్లగా అబ్బాయిలు తిరిగి చూడ్డానికి…చిరుద్యోగిగా అంతవరకూ చదివించిందీ, కన్నదే గొప్ప పొమ్మన్న తండ్రీ…జీవితం మీద ఆశ చచ్చినవాడు చేసుకోవాలిసిందేరా ఈవిడగారిని పక్క మగపిల్లల కామెంట్లూ..రోషం.. పొట్ట చేతపట్టి వీధిలోకి తరిమింది. వరదొచ్చినట్లు కంప్యూటర్ అవకాశాలు..దానితో పాటే సంపాదన.పెళ్ళి గురించి అమ్మ కలలు తను అనుకున్న మిస్టర్ పర్ఫెక్ట్..కులం అక్కరలేదని ప్రకటించి మరీ వడపోసినా దొరకని అభ్యుదయం.. ఉద్యోగం తో అవకాశాలూ అమెరికా చేర్చాయి….

అమ్మ చూసిన సంబంధాలన్నిటిలోనూ ఆర్ధిక లెక్కలే కనపడ్డాయి..ఎంత చిత్రం!డబ్బు లేనప్పుడు డబ్బున్న మగవాడు అవిలేని ఆడపిల్లను ఎందుకు పెళ్ళాడరాదన్న సమభావన
స్వంతంగా డబ్బు చేరేసరికి ఎదుటి మనిషి మీద చిన్న చూపుగా మారింది..ఇష్టం లేకుండానే డిపెండెంట్గా వస్తానన్న కుర్రవాని సంబంధం…

అసంతృప్తి…భరించలేక పెళ్ళైన రెండు గంటలకే వదిలేసి తెగతెంపులు…మనసు మూలుగుతూనే…నా తప్పేమీ లేదని మనసుతో ఎన్నిసార్లు పోరాడినా ఓదార్పు లేదు..నిజంగానే తప్పు లేదా? అవును నన్నొక ఆడపిల్ల అనే అనుభూతిని కలిగించలేదు అతను నన్ను అడ్డు పెట్టుకుని నేను సంపాదించే డాలర్లతో తను కెర్రెరు ప్లాన్ చేసుకున్నాడు అందుకే వదుల్చుకున్నాను. ఛ…నిజమా? మరి ఈ పెళ్ళి తరువాత నువ్వెన్నాళ్ళు ఉద్యోగం చేసావు?నిన్నెంత నీ భర్త సపోర్ట్ చేసాడు? లోపలనుంచి వెటకారం. మరదే నువ్వు చెయ్యాలిసివస్తే ఎన్ని లెఖ్ఖలు వేసావు? మరి నీ లెఖ్ఖలు తప్పాయిగా?

ఇప్పుడు నవ్వొస్తుంది అన్ని లెఖ్ఖలూ బాగానే ఉన్నాయి…ఆయువు లెక్కే తప్పింది. ఎవరినడగాలి? దేవుడి మీద నమ్మకం కూడా లేదే ?పరిచయస్తులందరి దగ్గరనుండీ పారిపోయి, చుట్టాలను పలకరించకుండా ఎన్నాళ్ళు?తెలిసి పిట్టపురుగుకు సాయపడలేదు.

చిత్రంగా ఆన్లైనులో కలిసాడు…దెబ్బ తిన్న జీవితం మళ్ళీ చిగురు వేయాలని ఆశ…అయ్యో మళయాళీ మనసు మూలిగింది….షట్ అప్..పెళ్ళీ, ఇద్దరు పిల్లలు…ఏ కెరీర్ చూసి మిగిలిన ప్రపంచాన్నినిర్లక్ష్యం చేసానో ఆ కెరీరు మూణ్ణాల ముచ్చటే ఐంది.ఆరోగ్యం సహకరించక, ఆనూ, ఆఫూ…

నర్స్ రిమైండ్ చెయ్యడం తో ఇహలోకంలోకి వచ్చింది…దాక్టర్ వచ్చే లోగా చుట్టూ చూస్తూ ఇండియాలో ఎంత క్రేజూ ఈ దేశం గురించీ ..అనుకోగానే పలుచటి నవ్వొచ్చింది..కళ్ళుమూసుకుని ప్రొసీజర్ కోసం ఎదురు చూస్తూ…

చూసినవీ, విన్నవీ గుర్తు తెచ్చుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఊహూ…రెండు సార్లు సర్జరీలూ, కీమోలూ, అంతా బాగానే ఉంది
అనుకున్నాక మరలా ఈ తిరగబెట్టడం ఏంటో? మగత కమ్మేసింది….శరీరం గాల్లోకి లేస్తున్న ఫీలింగ్. భళ్ళుమంటూ రక్తం…దానితో పాటే కొంచం తెలివీ…సడుంగా గుర్తొచ్చింది.
పిల్లలు స్కూల్లో, భర్త ఆఫీసులో.ఇదేంటి ఇక్కడ? ఏమవుతుంది నాకు…ఒక్కసారి కన్ను మూసిన తండ్రీ, ముడుతలు పడ్డ ముఖంతో తల్లీ గుర్తొచ్చారు..చిత్రంగా అక్క,అన్నలు…ఏమవుతుంది. ఇల్లూ, ఇంట్లో క్లాకు, ఇస్త్రీ చెయ్యాలిసిన దుస్తులూ, తల తిరుగుతుంది.

అంటి? ఇవేనా ఆఖరి క్షణాలంటే? నేనేమి తప్పు చేసాను? 40 ఏళ్ళు చనిపోయే వయసు కాదు. చూడాలిసిన జీవితం ఇంకా ముందే ఉంది. ఎప్పుడన్నా, ఇగోతో, యాటిట్యూడ్తో జనాలను బాధపెట్టానేమో?
అంతే? నేనే పాపం చెయ్య లేదు…ఆ తెగతెంపుల పెళ్ళి కొడుక్కే నేను జవాబు చెప్పాలి..నేను ముందే చెప్పాను నాకు ఈ పెళ్ళి తంతు నచ్చదని.నగలు పెట్టుకోనని ఐనా వాళ్ళు ఎందుకు వెంటపడాలి?
ఏంటి? అదేనా కారణం?అందుకేనా తెగతెంపులు. మరి ఇంట్లో వాళ్ళు,ఊళ్ళోవాళ్ళు, చెప్పారని ఇవ్వాళ్ళ రేపు అమ్మనీ, అక్కనీ, సొంత ఆలోచన లేని వాడు….

ఆలోచనల పూసలు పేర్చుకుంటూనే ఉన్నాయి మధ్యలో దారం తెగి రాలుతూనే ఉన్నాయి.మొదటిసారి జేఎఫ్కేలో కాలు పెట్టడం..ఎదురొచ్చిన ఫ్రెండ్…జీవితమ్మీద బోలెడన్ని ఆశలూ, ఎవరూ లేకుండా నే జరిగిన పెళ్ళి…మొదటిసారి పుట్టిన పసికందును చేతిలోకి తీసుకున్న క్షణం…బుగ్గలమీద వెచ్చగా భర్త స్పర్శ…నా జీవితం నేననుకున్నట్లు ఎడారికాదు అని అరవాలనిపించింది..నోరు పెగల్లేదు…

దేవుడా, పాపాలూ, పుణ్యాలూ నేను లెఖ్ఖ కట్టుకోలేదు.నా జీవిత పోరాటమే నాకు సరిపోయింది.దయ చేసి నన్ను బ్రతకనివ్వు..మనసు వేడుకుంటూనే ఉంది. రైల్వే స్టేషన్ లో పార్క్ చేసిన కారు  గుర్తు కొచ్చింది.ఇవే ఆఖరి క్షణాలా? ఎక్కడ పుట్టాను? ఏడు సముద్రాల చివర ఈ ఒడ్డున ఎవరూ నన్ను కన్నవాళ్ళు, నేను కన్నవాళ్ళు, నా తోడబుట్టినవాళ్ళూ, నేను తోడు చేసుకున్నవాళ్ళు ఎవరూ ఒక్కరైనా తోడు లేకుండా ఎందుకింత శిక్ష? చిత్రంగా ఏమీ గుర్తు రావడం లేదు.. పిల్లలు అనుకునే లోపు అంతా చీకటైపోయింది.ఆఖరుగా మాటలు…మైగాష్…షి ఈస్ నో మోర్..కాల్ హర్ హస్బెండ్….అంతులేని నిశ్శబ్దం…..

మీ మాటలు

 1. వావ్! ప్లెజంట్లీ సర్ప్రైజ్‌డ్ సునీత గారూ! అంటే, మీరు రాయడం గురించి కాదు.. కధ రాయడం గురించి!

  చాలా బావుందండీ!

  ఇది చదువుతూనే ఒక్కసారిగా మీ బ్లాగ్‌ పోస్ట్స్ మీద బెంగ పుట్టుకొచ్చేసింది! :)

  Hope to see you more!

 2. Speechless Sunita garu. ఓ అంతర్ముఖాన్ని భలే చూపెట్టారు. మీరు ఇంకా వ్రాయాలండి.

 3. good..good !మీ నుండి మరిన్ని రచనలు కోరుకుంటున్నాం…

 4. Rajkumar says:

  స్పీచ్ లెస్.. కధ ఆవ్వగానే నా మైండ్ లోకి వచ్చిన మాట…

 5. Chandu S says:

  సునీత గారూ, చాలా బాగుంది. నేను గట్టిగా మీతో చెప్పాలని అనుకున్న మాటలు మనవాళ్ళు పైన చెప్పారు. మీలోపల మేము చదవాల్సినవి ఎన్నో ఉన్నాయనిపిస్తోంది. ఇంకా రాయండి.

 6. నిషీ, వరూధినిగారూ, తృష్ణగారూ,రాజ్ బాబూ, శైలజ గారూ, అందరికీ ధన్యవాదాలు.

 7. హ్మ్.. ఏమన్నా చెప్దామంటే మాటల కోసం వెతుక్కునేలా చేసారు.
  మీ నెరేషన్ unique గా ఉంటుంది. మీరింకా బోల్డు రాయాలని నా విన్నపం కూడా..

 8. సునీత గారూ, ఎంత బాగా రాసారండీ! ఏ ఒక్క వాక్యాన్నీ వదలకుండా చదివించారు. తరచూ రాయండీ..

  “వాళ్ళే నోరిప్పేలోపు ఓ స్టాంప్ వేసేసారు…పళ్ళబిగువున ఒప్పుకోవాలిసి వచ్చింది” ఆమె గురించి ఒక్క మాటలో చెప్పేశారసలు!
  “రైల్వే స్టేషన్ లో పార్క్ చేసిన కారు గుర్తు కొచ్చింది.ఇవే ఆఖరి క్షణాలా?” ఇదండీ ఆలోచనా స్రవంతి అంటే.. బావుంది అనడం అల్పోక్తి.

  నెరుసులూ ఉన్నాయండీ. మొదటి పేరా కూడా ఆమె మాటల్లోనే, అంటే ఉత్తమపురుషలోనే చెప్పేయాల్సింది. లేదా “కారు పార్క్ చేసి ముందుకు నడుస్తూ నిట్టూర్చింది రజిత.” ఈ లైన్ తీసేసినా సరిపోతుంది. కార్ పార్క్ చేసిందన్న విషయం మరోలా చెప్పేస్తే సరిపోయేది. ఇక టైపోస్ ఉన్నా వాటిని కళ్ళు గుర్తించనంత బావుంది మీ కథనం.

 9. సునీతా
  చాలా బావుంది ఓ అంతరంగ మధనం. చాలా చోట్ల ఆ ఆలోచనలు సాగిన విధం సహజంగా ఉంది.
  నీ రాతలెప్పుడూ ఏకబిగిన చదివించడమే కాకుండా, మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్లి ఆలోచించేలా ఉంటాయి కొన్ని భావాల ప్రకటన. I always cherished them and looking forward for more.

  ఒకటి రెండు చోట్ల వాక్యాలు మరికొంత క్లారిటీ ఉంటే ఇంకా బాగుండేది అనిపిచింది నాకు. అలానే కొంచెం స్పేసింగ్, పేరాలు కలపడం లాంటివి రచయితో, ఎడిటింగ్ వాళ్ళో చూస్తే బాగుండేది.

 10. Kumar N says:

  మీ రచనలెప్పుడూ నన్ను ఓ ఉద్వేగంలో వదిలేస్తాయి సునీత గారు.
  ఈ కథ చివరకొచ్చేప్పటికి, నన్నుకిటికీలోంచి కొద్దిసేపు బయటకి దూరంగా చూస్తూ అంతర్ముఖుణ్ణి చేసింది.
  తక్కువ వ్యాక్యాల్లో ఎక్కువ కమ్యూనికేట్ చేయటం మీ స్ట్రెంగ్త్.
  మీరు బ్లాగ్ / జి+ పోస్టుల్లో రాసినవి ఇష్టంగా చదివేవాణ్ణి. మరీ పూర్తిగా మానేసారు మీరు, అప్పుడప్పుడూ అయినా రాయమని మనవి.

 11. చాలా చాలా బాగుంది సునీత గారూ

 12. సునీత గారు.. కథ చాలా బావుంది. అక్కడక్కడ వెనక్కి వెళ్లి చదువుకోవాల్సి వచ్చింది అంతరంగం ఇంకా క్లారిటిగా ఉంటె బావుండును అనిపించింది.
  మంచి కథలు ఇంకా ఇంకా వ్రాయాలని కోరుకుంటూ

 13. రమాసుందరి says:

  సునీతగారు, కధ కొద్దిగా లేట్ గా చదివాను. ఇది నాకు తెలిసిన అమ్మాయి జీవితం. ఆమె జీవితంలో ప్రతి మలుపు నాకు తెలుసు. మీరు అంత బాగా రాసి మళ్ళీ నన్ను ఏడిపించారు.

 14. సాయి పద్మ says:

  Ambitions Sometimes Is Like A Candle Burned From Two Sides… Before You Realize, It Will Come To An End..Silently Throwing Unfinished Tasks Into Darkness..!!
  ఈ కధ చదవగానే గుర్తొచ్చిన ఎప్పుడో రాసుకున్న వాక్యం.. చాలా బావుంది సునీత గారూ.. ముఫై అయిదేళ్లకు , మెనో పాజ్ ఎఫెక్ట్ ఉంది ..చేస్తున్న స్ట్రెస్ వదలక పోతే , కష్టం అని ఏడ్చిన నా క్లయంట్ గుర్తొచ్చి .. కళ్ళూ , మనసూ తడి అయ్యాయి ..

 15. మధురా…ఇంకా రాయడమే…చూద్దాం:))

  కోవాగారు…నెరసులు నోటెడ్:))

  పద్మా…థాంక్ యూ:))

  కుమార్ గారూ…రాయడం చాలా కష్టమైన పని అండీ:))

  ఎన్నెల…ధన్యవదాలు..

  రమగారూ… నా స్నేహితురాలు ఒకరి నీడ కొంచం ఉందండీ ఇక్కడ…

  సాయిపద్మగారూ…ధన్యవాదాలు…

 16. శ్రీనివాస్ పప్పు says:

  కొంచం ఆలస్యంగా చదివానండీ,అంతర్ముఖం మీ పద్ధతిలో బాగా రాసారు.మిగతా విషయం గురించి పైన అన్ని కామెంట్లూ కాపీ పేస్ట్.ఇంకా తరచూ రాయాలని కోరుకుంటున్నా.

 17. ఈ మధ్యకాలంలో చాలామంది ఆడపిల్లల జీవితాలు ఇలాగేవుంటున్నాయి.కధ చదువుతున్నట్టుగాలేదు.జరుగుతున్న విషయమే! బాగారాశారని అనడం చాలాతక్కువచేసి చెప్పడమే!

మీ మాటలు

*