ఒళ్ళు మరిచిపోయిన చందమామ!

br passportచక్కని రాచకన్నియలు సౌధములన్ శ్రవణామృతంబుగా
మక్కువఁ బాడుచున్ లయ సమానగతిం బడఁ జెండుఁగొట్టుచోఁ
జుక్కల ఱేఁడు మైమఱచి చూచుచు నిల్వఁగ నప్పురంబునం
దక్కట చెండు తాకువడి యాతని మేనికిఁ గందు గల్గెఁగా.
శంతనుమహారాజుగారి కాలమది. హస్తినాపురం సౌధాల మీద చూడచక్కని రాచకన్నెలు సంగీతం పాడుతున్నారు. చెవులకు (శ్రవణ) అమృతమయ్యేట్టుగా పాడుతున్నారు. చాలా ప్రీతితో ఇష్టపడి (మక్కువన్) పాడుతున్నారు. కనకనే శ్రవణామృతంగా ఉంది. అలా పాడుతూనే (పాడుచున్) చెండు ఆడుతున్నారు. పువ్వుల్ని బంతిలాగా కట్టి ఎగరెయ్యడం పట్టుకోవడం, ఒకరు ఇటు కొట్టడం మరకొరు అటు కొట్టడం-ఇలా పూల చెండుతో బంతి ఆడుతున్నారు. పోనీ కొందరు పాడుతున్నారు, కొందరు ఆడుతున్నారనుకుందాం. ఆడేవాళ్ళు- పాటలో ఉన్న లయకు సమానమైన గతి పడేట్టు ఆడుతున్నారు. నాట్యగత్తెలు రంగస్థలం మీద ప్రదర్శించే బంతి ఆట చూసినవారికి ఇది బాగా తెలుస్తుంది. సరే, లయానుకూలంగా చెండు కొడుతున్నారు. ఆటా పాటా అద్భుతంగా సాగుతున్నాయి (పాడుచున్-చెండుఁగొట్టుచోన్).
పక్కనే –ఆకాశంలో పోతున్న చందమామకు ఇది కంటబడింది. అతడసలే చుక్కల ఱేడు. వీళ్ళు చక్కని చుక్కలు. అమృతంలాంటి పాట. దానికి తోడు చెండాట. ఇంకేముంది-ఒళ్ళు మరచిపోయాడు. మైమరిచి అలా చూస్తూ సౌధంమీద నిలబడిపోయాడు. వాళ్ళు విసురుతున్న చెండు వచ్చి తన బొజ్జమీదనో వీపుమీదనో థపా థపా తగులుతున్నా ఆ జీవుడికి ఏమీ తెలీడం లేదు. అయ్యయ్యో! (అక్కట) పాపం-చెండు తాకులు (తగలడాలు) పడీ పడీ అతడి శరీరం కందిపోయింది! అదే- అతడి బింబంలో ఉన్న మచ్చ. మేనుకి కలిగిన కందు (మచ్చ), -అని సానుభూతి ప్రకటిస్తున్నాడు కవి.
ఇంతకీ- చెండు ఆడటం అనలేదు. చెండు కొట్టడం అన్నాడు. కనక ఇది తెలుగునాట ప్రసిద్ధమైన ఉట్టికొట్టడమే కావచ్చు. ఉట్టి బదులుగా- చెండు. ఆటా పాటా దరువూ పరుగూ ఎగరబోవడం నీళ్ళు పోయడం ఉట్టిచెండు అందకపోవడం గాలిలో చెయ్యి విసరడం అది చంద్రుడికి తగలడం వాడి వీపు కందిపోవడం-ఆహా! ఏమి కోలాహలం!!
సౌధాల ఎత్తు, కన్నెల సౌందర్యం, సంగీత విద్యా ప్రావీణ్యం, క్రీడాకుశలత, సరసత, సంపన్నత, తీరుబాటు- ఇలా ఎన్నెన్నో వ్యంగ్యాలు స్ఫురిస్తాయి ఇందులో.

 

మ.     ప్రతి జన్మంబు సుమంగళీత్వగరిమన్ బ్రాపింప నింద్రాణి సు
వ్రత చర్య న్వరుణానికిన్ రవి హరిద్రా చూర్ణ రాశి న్నభ
స్తత శూర్పంబున వాయనం బొసఁగఁ బ్రత్యక్సింధు వీచీ పటా
వృతి యొప్పన్గొని, చల్లు నక్షతలు నాఁబెంపొందెఁ దారౌఘముల్
(తారాశశాంకవిజయము. ఆ. 4. పద్య. 110.)
ఇంద్రునిభార్య శచీదేవి (ఇంద్రాణి) ప్రతిజన్మలోనూ తనకు ఇలాగే సుమంగళీత్వం లభించడం కోసం (ప్రాపింపన్ ) ఒక వ్రతంచేసి, సువ్రతచర్యలో భాగంగా, పశ్చిమదిక్కుకు అధిపతి అయిన వరుణుని భార్య – వరుణానికి, సూర్యుడనే పసుపుపొడి ప్రోగును (హరిద్రా- చూర్ణ – రాశిన్ ) – పసుపు ముద్దను ఆకాశమనే పెద్ద చేటలో (తత శూర్పము) వాయనం ఇచ్చింది. ఇవ్వగా – వరుణాని ఏమి చేసిందంటే – పడమటి సముద్రపు కెరటాలు (ప్రత్యక్-సింధు – వీచీ) అనే తన పైట చెంగును ఆ చేట మీద కప్పి (పట – ఆవృతి – ఒప్పన్ ) ఆ వాయనం ఒప్పుగా అందుకొంది. పెద్దలు ఇచ్చే ప్రసాదాలను కొంగుపట్టి తీసుకోవడం ముత్తైదువులిచ్చే వాయనాలను కొంగు కప్పి అందుకోవడం తెలుగింటి సంప్రదాయం. అలా అందుకొని – అభీష్టసిద్ధిరస్తు – వ్రతఫల ప్రాప్తిరస్తు అని కోరుతూ – ఇంద్రాణిమీద వరుణాని జల్లే శుభాక్షతలు అన్నట్టుగా (నాన్ ) ఆకాశంలో తారల గుంపులు (తార – ఓఘముల్ ) శోభించాయి.

మీ మాటలు

  1. మధుర పద్య రత్నాలు

Leave a Reply to ijswamy Cancel reply

*