ఒక సగటు మనిషి అంతరంగ చిత్రం- క్రాంతి శ్రీనివాస్ కవిత్వం

రమాసుందరి

క్రాంతి శ్రీనివాస రావు కవిత్వం నాకు ఫేస్ బుక్ ద్వారానే పరిచయం. ఆయన కవిత సంపుటి “సమాంతర ఛాయలు”  విడుదలకి ముందు వచ్చిన సమీక్షలు పేపర్లలో, వివిధ లింకుల్లో చదివాను. పుస్తకం తెప్పించుకొని, ముందుమాటలు, వెనుక మాటలు చదివేశాను. ఈయన కవితలు ప్రాచుర్యం పొందటానికి కారణాలు ఇంతకు ముందే రాసేసారు. ఈవెంట్, మెమెరీ, మెటాఫర్ ని కలిపి కుట్టాడన్నారు (అఫ్సర్). మట్టిలో కవితా సేద్యం చేసాడన్నారు(అరుణ్ సాగర్). ఈయన కవితలు “పాప్ బీజింగ్స్ స్వరాలకు నినాద రూపాన్నిచ్చిన ట్రేసీ చాపమెన్ లాగ ఉన్నాయన్నారు (కవి యాకోబ్). “శ్రీనివాసరావు గారి ప్రధాన భావప్రవాహం మానవాళిని నడిపించే ప్రయత్నంగా ఉందన్నారు” (బి.వి.వి. ప్రసాద్). “రైతులు, రైతుకూలీలు, మహిళలు, దళితులు, బహుజనుల అస్తిత్వ సమస్యలను ఒక పేషన్ (ఫేషన్ కాదు) తో పట్టించుకొన్నాడన్నారు” (ఖాదర్ మొహియుద్దీన్). ఈయన కవిత్వం “చనుబాలుకు బదులు కనుబాలు” కార్చింది అన్నారు (సీతారాం). ప్రసేన్ గారు ఈయన రాతల్లో ట్రెడీషనలిజం , మోడ్రనిజం, పోస్ట్ మోడ్రనిజం మూడు కలిసి ఉన్నాయని అంటారు. (మనలో మాట ఇందులో చాలా పదాలు నాకు తెలియవు)

ఇంతమంది మేధావులు వాళ్ళ పరిజ్ఞానాన్ని అంతా వెచ్చించి ఈయన కవితలను విశ్లేషిస్తే, కవిత్వం గురించి అ ఆ లు తెలియని నేను రాయబోవటం సాహసమే అవుతుంది. అయినా ఒక  పాఠకురాలిగా నాకు కూడ హక్కు ఉందని, ఈ కవితల గురించి నా దృక్కోణం నేనూ రాసి చూద్దాం అనిపించి మొదలెట్టాను.

అసలీయన ఇన్ని కవితలు ఎలా రాయగలిగాడు ఇంత తక్కువ కాలంలో?  ఆలోచనలకు అక్షర రూపం కవులు అంత సుందరం గా ఎలా ఇవ్వగలరు? అనే నా ప్రశ్నకు ఆయన ఏ కవి ఇవ్వనంత సరళంగా సమాధానం ఇచ్చాడు. ఇలాంటి కవులు కవిత్వంలోనే ఆలోచిస్తారు. కవిత్వంలోనే శ్వాసిస్తారు. దానికి కావలిసిన ముడి సరుకు పద సంపద, ఈయన ముందే పుష్కలం గా సముపార్జించుకొని కవితా సేద్యం మొదలు పెట్టాడనిపించింది.

“జ్ఞాపకాల ప్రవాహం లోంచి కొట్టుకొచ్చి/ఆలోచనల సుడిగుండాల్లో చిక్కుకున్న/ నాలుగు వాక్యాలను ఏరుకొన్నానీపూట. గణుపులున్న చోట/ వంకర్ల వద్ద/ పొయ్యిలోకి వంట చెరుకును విరిచినట్లు/విరిచేశాను మాటల్ని. ఆనందం పంచాల్సినప్పుడో/ అర్ధం చెప్పాల్సిన దగ్గరో/ ప్రశ్నను సంధించాల్సిన చోటనో/ వాక్యాలను జాగ్రత్తగా తుంచిపెట్టాను. ప్రతీకలతో పదిలంగా చుట్టాను.” అంటూ అరటి పండు వలచినట్లు  పాఠం చెప్పేసాడు. (క్షతగాత్రం)

మనసులోని భావాలు పుటలలో అక్షరాలు గా మారాలంటే మా బోటి వాళ్ళు తల క్రిందులుగా తపస్సు చేయాలి. అహర్నిశలు శ్రమించాలి. కాని ఈయన అలవోకగా ఆ పని సాధించటమే కాకుండా, అంతే సులువుగా భోధించేస్తున్నాడు. ” మనసును మాటల్లో పోసి/ అవసరమైనప్పుడు మార్మికత ఇచ్చాను. అవి వంతెనల్లా/ మెట్ల వరుసల్లా/ వీణా తంత్రుల్లా/ బాణా సంచుల్లా/ ఆయుధాల పాదుల్లా మారి భావాలను పండిస్తున్నాయి.” అని గర్వంగా తన సాహిత్య పంటను మనకు ప్రదర్శిస్తాడు.

అంతే కాదు అస్పష్టమైన తన ఆలోచనలకు ఒక రూపాన్ని ఇచ్చి, తను నేర్చుకొన్న జీవిత పాఠాలను మనకు వినిపించాలని అతి నిరాడంబరంగా అభిలషిస్తాడు.  “ఆకార నిరాకారాల మధ్య/ సంధి కుదిర్చి/ నిన్నటి రేపును ఈ రోజుతో కట్టి పడేసి/దర్శించిన జీవిత సత్యాలకు అక్షర రూపం సమకూర్చాలనివుంది/కవిసంగమంలో నిత్య కచేరీ చేయాలని వుంది.”   (సౌండ్ షేడ్)

కాని మళ్ళీ తనే, అర్ధవంతమైన మాటలు అందమైన కవితలుగా మారాలంటే అంత సులభం కాదని, చాలా శోధన జరగాలని కూడ చెబుతున్నాడు. ( మీ కవితలు చదువుతుంటే మీరంత కష్టపడ్డట్టు అనిపించటం లేదండి)

“అర్ధాలు మోస్తూ మాటలు/ వేల మైళ్ళూ/ మనసు తీరం వెంబడి నడవకుండా/ భావాల అలల్లో తడవకుండా/ వాక్యమై వొళ్ళు విరుచుకోవు. తెల్లకాగితంపై/ కవిత్వం కళ్ళూ తెరుచుకోదు, తీరిక సమయాలు కవిత్వపు కోరికలు తీర్చలేవు.” అని తీర్మానిస్తాడు. (ఖాళీ పాళీ) .

కవితలలో వ్యక్తీకరించిన అన్ని సంగతులు ఆణిముత్యాలు కాలేవు. మంది, మజ్జిగ చందాన సంఖ్య పెరిగే కొలది గుణ దోషాలు అనివార్యమౌతాయి. అయినా సరే “డోంట్ కేర్ ” అట.

“మనసు చెంబుకు/భావాల అరచేతులడ్డు పెట్టి/ఎంత అక్షర కళ్ళాపీ చల్లినా/అంతగా నా అజ్ఞానం రికార్డ్ చేయబడుతూనే ఉంది./అయినా ఆపాలని లేదు/ఒకప్పటి వాక్యాలుగానన్నా/వ్యాఖ్యానించబడతాయని/ అక్షర కాళ్ళాపీ ఆపకుండా చల్లుతూనే ఉన్నా/మనసును మాటలుగా మార్చి రువ్వుతూనే ఉన్నా.” (ఫైర్ బాక్స్) అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తాడు.

కవి తాత్వికత, అంతర్గత ప్రపంచ దృక్పధం ఆయన కవిత్వానికి వనరులు అంటారు. ఈ విషయలో ఈయనది “అంతా … లెక్కే.”  “కొలవటం రానివాడు/ కొలువుకు పనికి రాడు. లెక్కలు రాని మనిషి, రెక్కలు తెగిన పక్షి ఒకటే. జరగబోయే సంఘటనలు అంచనా వేయటం రావాలి, ప్రకృతి ప్రమాదాలను ముందే కనిపెట్టే పశుపక్షాదుల్లా” అని మనల్ని గంభీరంగా హెచ్చరిస్తాడు. జీవితగమనానికి సంబంధించిన దృఢ నిర్ణయాలు వ్యక్తమవుతాయి ఈ కవితలో.

అంతలోనే మనసుకు, శరీరానికి జత కుదరటం లేదని సగటు మనిషి లాగా తెల్ల ముఖం వేస్తాడు. “సందేహాలతో మనసు/తీరని దాహంతో దేహం/ సమాంతర రేఖలుగా సాగిపోతున్నాయి. ఇప్పుడెందుకో/ దేహానికి సందేహం/ మనసుకి దాహం వేస్తోంది. మనసూ దేహం/ వెలుగు చీకట్లలా/ ఎప్పుడూ విరహాన్నేఅనుభవిస్తున్నాయి.” అంటూ మనసు విప్పుతాడు. (జతలేని జంట)

ఒక కవి పదే పదే తన కవితల మీద అభిప్రాయాలు పలువురి నుండి అడుగుతున్నాడంటే అతను తనను తాను సంపూర్ణం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడని అర్ధం చేసుకోవాలి. కళాకారుడు ఎవరికైనా  ఆ నిబద్ధత ఎంతో అవసరం. మన ప్రజా కవి శ్రీనివాసరావు గారికి ఆ ఆదుర్దా మరీ ఎక్కువ.  “గెలుపంతా ఆమెదే” కవిత చదివి నేను అసంతృప్తి వ్యక్తం చేసాను. ఆ కవిత ” కార్యేసు దాసి” శ్లోకానికి ఆధునిక రూపం లాగా ఉంది, మీరు స్త్రీల మీద నైతిక వత్తిడి పెంచుతున్నారని” చెప్పాను. బుద్దిగా విని ఒప్పుకొన్నారు. సహేతుకమైన విమర్శను ఆహ్వానించటమే కాదు, అన్వేషిస్తాడు ఈయన. తన పాఠకులతో ఇంకా అంటాడు “ప్రియ నేస్తమా/ నాతో మాట్లాడు కాసేపు/ మనసంతా ఆలోచనలే/తూర్పారబట్టుకోవాలొకసారి. నేస్తమా/ వాదులాడవా నాతో ఒక్కసారి భావాలను జల్లెడ పట్టుకోవాలి. తిరిగి తర్కించవా నాతో/ అందులో/ పనికొచ్చేవేవో/ లెక్కించుకోవాలి. ప్రియ నేస్తమా/ సాయం నిలబడవా/ హృదయానికి చిల్లు బడి హోరు గాలి వీస్తోంది.” అని తన అంతర్గత ఆవిష్కరణకు సాయం మనల్ని అర్ధిస్తాడు. (అన్వేషణ)

కవి జ్ఞాని. కవి తత్వవేత్త. కవి అనుభవశాలి. ఈ కవి కూడ జీవితాన్ని కాచి వడపోసి మనకందరికి కరతలామలకం చేయ బూనాడు. వదిలించుకోలేని బంధాల్ని,కాలాన్ని వెనక్కి తిప్పలేని అసాధ్యాన్నిలఘువుగా వివరిస్తాడు “జీవితమంటే/కాలం చెట్టుపై/ నీవు చెక్కిన /హృదయపు బొమ్మలోంచి  కారిన/ జిగురు బంక. జీవితమంటే/ కాలప్రవాహ వాలుపై/ ఒకే ఒక్కసారి ఆడే/ జారుడు బండాట.”. (చంద్రుని పై పాదముద్ర)

కవిత్వం వ్యాపారపరం అవటం కవులందరికి శోకావేశమే. అక్షరాలు అమ్ముడు పోవటం అంటే రక్తమాంసాలు కోసి ఇచ్చిన  నొప్పి నిజమైన కవికి ఉంటుంది. ఈయన తన వేదనను ఈ రకంగా అక్షీకరించాడు. ” వ్యాపార ప్రపంచం వీసాలిస్తుంటే/ కవితా కన్యలు అష్టదిక్కులా పాలిస్తున్నాయి. యాడ్ మాడ్ ప్రపంచమే/ కవిత్వకర్మాగారమై వింతవిపణిని నడిపిస్తుంది. మార్కెట్ మురికితో మాసిన కవితలను/ పేదల కన్నీటి తో కడిగి జలశీల ఉద్యమాలే కవితా వస్తువులుగా అక్షరసేనలు కదలాలిప్పుడు” అంటు తన కళాకారుడి గా తను ఎటో  ప్రకటించుకొన్నాడు.

ఈయన ప్రకృతి ప్రేమికుడు. చాలా మంది సూర్యుడు, చంద్రుడు, చుక్కల మీద కవితలల్లినా, ఈయన స్కూలు వేరు. తను చదివిన విజ్ఞాన శాస్త్రాన్ని కవితల్లోకి అనువదిస్తాడు. అందులోనూ సూర్యుడు తన కవితల్లో ప్రియవస్తువు. ఒకసారి “ఎత్తుకు పోయిన నిద్రను/ వెదుకుతూ ఉంటే /రోజు ఎదురయ్యే దూరపు చుట్టం/ రానే వచ్చాడు/దొర్లటం ఆపి/ పరిగెత్తటం మొదలెట్టమన్నాడు,” అని విసుక్కొంటాడు.( పడక.. నడక) “ఒరేయ్/ నాలుగు నిప్పులు పోయండ్రా/ సూర్యుని నెత్తిమీద. వాడికేమొచ్చిందో/పొడ అగ్గి రూపంలో/కొంపలో జొరబడి/ఉన్న కాస్త చాటును/ చెరుకు గడలా మంటల దవడలతో నమిలేస్తున్నాడు” అని శాపనార్ధాలు పెడతాడు. (సూర్యుడ్ని పొయ్యిలో పెడదాం). “ముగించే లోపు/ అనేక / ప్రారంభాలుండే జీవన సర్కసుకు/ కిరణాల గడలేసుకొని/ పోల్ జంప్ చేస్తూ/ నిత్యం/ గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఉన్నాడు సూర్యుడు.” అని   ప్రశంసించగలడు కూడ.(అనిత్యం)

ఆకలి చావులను జనాభాలెక్కల పట్టికలో మరణాలుగా చూడగలుగుతున్న మన ఉదాశీనతను చెంప దెబ్బ కొట్టి, వాటి వాస్తవిక తీవ్రతను మనకు పదాలతో దృశ్యీకరించి చూపించాడు. ఆకలి చావుల అంతిమ  దశను “ఒక్కో అవయవం కూలి/అణువణువూ చీలి/ తనువంతా తగలడి/ చితిని చేరకముందే/ మా కపాలం పగిలిన శభ్ధం/ మేమే వింటూ/ ఊహల కందని వేదన/ ఊదర పెడుతుంటే ఊపిరి వదులుతుంటాం.” అని వర్ణించాడు. (బాబోయ్) “మిగతా జంతువులకు మల్లే/ సహజాత సంతోషాలు దొరకవు/సహజ మరణాలు ప్రాప్తించవు. ఆకలి చావులు కావట మావి/ అసలవి లేనే లేవట.” ఇక్కడ ఆయన పద, భావ లయలకు మురిసిపోయే సంతోషాన్ని కూడ ఇవ్వకుండా ఏడిపించేసాడు. (ఆకలి…కొలత).

‘దొరసానుడు’ కవితలో “గడీలకు గడియలేస్తే/ గంగలో కలిసిపోయాయనుకొన్నా/ మారు వేషాలేసుకొని మన మధ్యే తిరుగుతున్నాయని/ ఈ మధ్యే తెలిసింది. రంగు మార్చిన గడీ/ రాజకీయ గారడి  రహస్య ఎజెండాతో /రాజదర్బార్లు రోజూ చేస్తూనే ఉంది.” అంటూ భూసామ్య పెత్తందారీ రాజకీయ ప్రస్థానాన్ని భావగర్భంగా బట్ట బయలు చేసాడు.”

అక్షరాలు ఈయన వేసే భావాల ముగ్గుల్లో బుద్దిగా గొబ్బెమ్మల్లా కూర్చుంటాయి. పిలిస్తే వచ్చే చుట్టాల్లా కాకుండా ఇంటి ఆడబడచులంత సహజంగా ఈయన కవితల్లో అమరిపోతాయి.మార్మికత ఈయన కవితల్లో ముగ్ధంగా ముడుచుకొని ఉంటుంది. గాఢత పాఠకుడు శ్వాసించినంతగలిగినంత దొరుకుతుంది. ఈయన పదాలు సజీవ సాహిత్య ఊటలు. వాక్యాలు వొళ్ళు విరుచుకొన్న సత్యాలు. భావాలు తాత్వికత, తార్కికత సమ్మేళనాలు. ఎంచుకొన్న సందర్భాలు పూర్తిగా సమయోచితాలు. వెరసి శ్రీనివాసరావు గారి కవితలు డాంబికాలు పోని హఫ్ చేతుల చొక్క వేసుకొన్న సగటు మనిషి అంతః చిత్రాలు. ఇవి సాధారణ పాఠకుడికి అందుతాయి. సుద్దులు చెబుతాయి, ప్రేరణనిస్తాయి.

 

 

మీ మాటలు

  1. buchireddy gangula says:

    ర మా సుందరి గారు —అఫ్సర్ గారి రివ్యూ చదివాక నేను అ పుస్తకం
    తెప్పించుకొని చదివాను –చదువుతున్నాను
    వారి కవిత్వం గురించి నేను ఎలా ఫీల్ అవుతున్నాన్నో అదే మీరు చెప్పారు —
    మీ ఒపీనియన్ తో –నేను కూడా —-
    ————————————————-
    బుచ్చి రెడ్డి గంగుల

    • రమాసుందరి says:

      బుచ్చి రెడ్డిగారు, ఆయన పదప్రయోగాలు, తీసుకొనే వస్తువు నాకు బాగా నచ్చుతుంది.

  2. Hemasri Chava says:

    సాంకేతిక విప్లవానికి
    సిలికానే
    సర్వసైన్యాద్యక్షుడు ఇప్పుడు

    అష్టమ గర్బంలో పుట్టి
    కృష్ణుడు అనంతాన్ని చూపెట్టినట్లు
    ఎనిమిదో మూలకం
    సిలికానిప్పుడు
    సమస్తాన్నీ అంగు్ళంలో
    బంధించింది

    కానీ
    ప్రపంచమంతా ఒకే ఊరుగా
    కొత్త పాలకులు పుట్టారిప్పుడు

    సిలికాం హార్డ్వేర్ బొందిలోకి
    సాఫ్ట్ వేర్ పోసి చాకిరీ చేయుంచుకొంటున్నారు

    మా నాన్నగారికి కూడా క్రాంతి గారు ఇలా కవిత్వం తో పరిచయం అయ్యారు…ఆయన ఉదయశ్రీ లో మహాకవి పోతన పద్యాలనూ గుర్తుకు తెచ్చుకున్నారు

    గంటమో చేతిలోది ములుగార్రాయో? నిలకడ ఇంటిలోననో
    పంతపోలానో? చేయునది పద్యమో సేద్యమో? మంచమందు గూ
    ర్చున్తివో మంచేయందో? కవివో గడిదేరిన కర్షకున్దవో?
    రెంటికి చలిఉన్తివి సరే కలమ హలమ ప్రియం బగున్

  3. gajulamallik says:

    బాగుంది మడమ్జి!

  4. gajulamallik says:

    బాగుంది మేడమ్జీ!

    • రమాసుందరి says:

      మల్లిక్ గారు, హమ్మయ్య. మీరు తెలుగు టైప్ చేయటం నేర్చుకొన్నారు. ధాంక్స్ అండి.

  5. వాసుదేవ్ says:

    మిత్రులిద్దరికీ (రమా గారికీ, క్రాంతన్నకూ) అభీనందనలు.ముఖపుస్తక పరంగా పరిచయమైన క్రాంతి రాయటం మొదలుపెట్టినప్పట్నుంచీ టచ్ లొ ఉన్నా. అతని కవితలు ఇంతకుముందు చదివి, చిదిమి ఆస్వాదించి, స్పందనని వెంటనే అక్కడే ఎఫ్బీలోనె చెప్పెవాణ్ణి. ఈ పుస్తకం విడుదలయ్యే సమయానికి ఇండియాలొ లేకపోవటమె ప్రధానకారణంగా అది నాకు దొరకలేదన్న బాధని కొంతవరకూ తగ్గించె పనిలొ భాగంగా పోస్ట్ లొ పంపాడు క్రాంతి. ఈ మధ్యనే ఇండియాకి తిరిగి వస్తూ ట్రాన్సిట్ లొనె చదివేశాను. కొన్ని కవితలూ వాటిలొని పదప్రయోగాలూ ఇంకా వెంటాడుతూనె ఉన్నాయి. ఇక నాకు పని తగ్గించిన రమా సుందరి గారికి టన్నులకొద్దీ ధన్యవాదాలు. ఇంతకంటే అందంగా, హత్తుకునేట్టుగా క్రాంతి కవిత్వం గురించి చెప్పగలనని అనుకోను. మంచి విశ్లెషణ. రమా గారూ మీ వ్యాసాలూ, పోస్ట్ లూ చదవటం దినచర్య అవుతుందని గ్యారంటీగా చెప్పగలను. క్రాంతీ మరో పుస్తకాన్ని ప్లాన్ చెయ్యొచ్చు మీరు.

Leave a Reply to Hemasri Chava Cancel reply

*