వెలుగు రంగుల మంత్రగాడు చలం

veeralakshmi (2)

( నిద్రాణంగా గా ఉన్న తెలుగు సాహిత్యాన్ని తన రచనలతో మేల్కొల్పిన  గుడిపాటి వెంకటా చలం పుట్టిన రోజు  మే 19 సందర్భంగా….)

చాలా ఏళ్ళు గడిచాయి.  చాలా అంటే ముప్పై అయిదేళ్ళు.  అలా గడవక ముందు నా చేతుల్లోకి వచ్చిన చలంగారి రెండవ పుస్తకం ‘ప్రేమ లేఖలు’.  అప్పటికి అయిదారేళ్ళ క్రితం నేను ఆకస్మికంగా చదివిన చలం గారి మొదటి పుస్తకం ‘స్త్రీ’.  ఆకస్మికం అని ఎందుకన్నానో చెప్పాలి.  అది చదవక ముందు నాకు చలం గారి పేరు తెలియదు.  ఆయన గురించి ఎక్కడా వినలేదు.  మా పల్లెటూళ్ళో  పొరిగింట్లో అరుదయిన సాహితీ రసజ్నుడి చెక్క బీరువా నిండా ఉన్న పుస్తకాలే మా గ్రంధాలయం.  అందులోంచి పుస్తకాలు వెతుక్కుని తీసుకొనే స్వేచ్చ మాకు ఉండేది.  అలా వెతకడంలో ఈ పుస్తకం నా చేతికి తగిలింది.  నవలేమో అనుకుని తీసుకుని చదవడం మొదలు పెట్టాను.  తీరా నవల కాదు కాని పేజీలు కదులుతూఉంటే విస్పోటనమే.  నా లోపల తొక్కిపెట్టిన ఉక్రోషాలకు, కోపాలకు అసహాయతలకు- అవన్నీ అర్థవంత మైనవే అని చెప్పే- ఉరట.  అదీ చలంగారి మొదటి కరచాలనం.

చెప్పానుగా తర్వాత మళ్ళీ అయిదారేళ్ళకి పుస్తక ప్రదర్శనలో రచయిత పేరు, పుస్తకం పేరు, మోహావేశం కలిగించగా ఈ ప్రేమలేఖలు కొనుక్కున్నాను.  అప్పటికి పలువురు సాహితీ విమర్శకుల ద్వారా చలం గారి గురించి పలు విధాలుగా విన్నా నా హృదయం మాత్రం ఆయన వేపే మొగ్గుతూ ఉండేది.

‘ప్రేమ లేఖలు’ చదవడం ఎవరి జీవితంలో నయినా సరే ఒక అత్యంత ఆవశ్యకమయిన అవసరం.  అప్పటికే భావుకతా పక్షాలు ఏర్పడిన నా మనస్సులో  ఆ పుస్తకం నా రెక్కలకి బలాన్నిచ్చి ఎగిరేలా చేసింది.  నా రెక్కల్ని నెమలి కన్నులంత మృదువుగా సుందరంగా మార్చింది. చూడవలసిన లోకాలతో పాటు తీసుకెళ్ళి తిప్పవలసిన రెక్కలు కూడా అంత లలితంగా హృద్యంగా ఉండాలని తెలియ జెప్పింది.  నాకు ఉహామాత్రంగానే తెలిసిన లలిత శృంగార లోకాల వెలుగు రంగుల్ని అబ్బుర పరుస్తూ చూపించింది.

‘స్త్రీ’ పుస్తకం స్త్రీల తాలుకు పరమ కఠోరవాస్తవ స్థితిని వినిపిస్తే ‘ప్రేమ లేఖలు’  పుస్తకం’ అయినా సరే’ ఈ మట్టిలో ఈ నెలలోనే పూయించు కోవలసిన పూల గురించి చెప్పింది.

ఈ  రెండు పుస్తకాలూ  నా మీద తక్కువ ప్రభావం చూపలేదు. ఇప్పటికీ అప్పుడప్పుడు ‘స్త్రీ’ లోని ముందు మాటలు చదువు కుంటూ ఉంటాను.  దొంగ మాటలు, నంగిరి బుద్ధులు , టక్కరి పనులు, ఈర్ష్యా ద్వేషాలతో కుళ్ళి పోవడాలూ లేని స్వచ్చమైన, శాంతమైన జీవనం దొరికే మార్గం నాకు అందులో లభిస్తూ ఉంటుంది.  నా మాటలో, రాతలో, జీవన యాత్రలో అది ప్రతిఫలిస్తోందని ఎవరేనా, ఎప్పుడేనా చెప్పడం తటస్థిస్తూ ఉన్నపుడు అది చలంగారి ‘స్త్రీ’ పుస్తకం తాలుకు ఫలశ్రుతిగా (ఫల పఠనం అనాలేమో) భావిస్తుంటాను.

ప్రేమ లేఖలు చదివి చాలా కాలమయింది.  కానీ ఒకప్పుడు చాల ఏళ్ళ పాటు చదివాను. మళ్ళీ ఇప్పుడు తీసి అలవోకగా చదివితే నేను పరాకు పడ్డ సుందర లోకాలన్నీ కళ్ళ ముందుకు వచ్చాయి.  ఒక వ్యక్తి కోసం ప్రాణాలన్ని పెట్టి జీవితమంతా ఎదురు చూడడంతో మొదలయిన స్థితి నుంచి ఇతరులెవరి కోసమయినా మనని మనం మరచి సహాయం చెయ్యడానికి పరుగు పెట్టే లాంటి ప్రేమని ఆ లేఖలు మనసుకి అలవాటు చేస్తాయి.  అంటే  ఆ’ ప్రేమానుభూతి ‘ నిబద్దులయిన వారికి’ సహానుభూతిని’ నేర్పుతుంది.

ఇక ఆ తర్వాత చలంగారి పుస్తకాలన్నీ చదివాను.  ప్రసంగాలు చేసాను.  చలాన్ని ఇష్టపడే స్త్రీని, చలం మీద డాక్టరేట్ చేస్తాననే స్త్రీని, చేసిన స్త్రీని ఇప్పటికీ ‘అదోలా’ చూసే మనుషులున్నారు.  నాకు అలాంటి వాళ్ళ మీద జాలి కలుగుతూ ఉంటుంది.  వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఎంత కోల్పోయేరో కూడా వాళ్లకి తెలీదని.చలం గారు చూపించిన సుందరలోకాలు వాళ్ళకి యెంత దూరమో అని.

ప్రణయ సంబంధాల్లో, ప్రేమ సంబందాల్లో  ఒకరికొకరు నిబద్దులయి ఉండే కొద్దీ ఆనందం పెరుగుతుంది.  నిబద్దత అందుకోసమే.  తమ మద్య కొంత కాలం పాటు ఉన్న ప్రణయం తాలుకు ఆనందాన్నిమనుషులు  అనిబద్దులు, అసత్య వాదులు కావటం వల్ల పోగొట్టుకుంటారు.  ఇష్టాలు పోతే విషయం వేరు.  ‘దైవ మిచ్చిన భార్య’ అన్న నవల అంతటా చలంగారు ఈ అంశాన్నే రాసుకొచ్చారు.

1994 లో చలం శత జయంతి సంవత్సరంలో చలం నవలా నాయికల స్వగతాలతో ‘వాళ్ళు ఆరుగురు’ అనే రూపకాన్ని ‘నూరేళ్ళ చలం’ సంఘ సభ్యులు ప్రదర్శించారు.  అప్పుడు దైవ మిచ్చిన భార్య నవలలోని పద్మావతి పాత్రను నేను  ఎంచుకుని ఆ ప్రదర్శనలో పద్మావతి పాత్రతో నా మనోభావాలు ప్రకటించాను.  ఆ రూపక ప్రదర్శన నాకు అంత మంచి అనుభవం కాదు కానీ పద్మావతిలోనీ  ఆమె ప్రేమికుడు రాధా కృష్ణ లోనీ  తరగని ప్రేమ, దాని పట్ల వారికున్న నిబద్దత నాకు ఆదర్శం.

ఈ మధ్య ఒక మిత్రుడు పేస్ బుక్ లో ఒక ఇంగ్లీషు కొటేషన్ రాసాడు.  ప్రేమ అగ్ని, అది తగిలితే మనలో ఉన్న చెడు కాలిపోయి మంచి వెలుగుతుంది అని.  ఇది చలంగారికి సరిపోయే మాట.  అదే కింద కామెంట్ గా రాసాను.

చలాన్ని చదివిన వాళ్ళందరికీ ఇది ఎంతో కొంత అనుభవంలో ఉండే ఉంటుంది.  చలాన్ని చదివిన వాళ్ళు చెడిపోయినట్లు కనిపించినా  వాళ్ళు ఎంతో మందిలాగ దొంగతనంగా చెడిపోవడం లేదని గుర్తుపెట్టు కోవాలి

అంతిమ నిర్ణయాలలో ఎవర ఎక్కడ మిగిలేరో చూసుకుంటే లెక్కలు బాగా కనిపిస్తాయి కాలకుండా వెలగకుండా కొరకంచు ల్లాగా మాత్రం ఉండరు .

చలంగారి పుట్టిన రోజు వస్తోంది.  ఆయన ఎంత ప్రేమ మూర్తి అంటే ఆయన కోసం పని చెయ్యడం మొదలెడితే మనకి ఎన్నో వేపుల నుంచి ఎంతో ప్రేమ అందుతూ ఉంటుంది.  చలం శత జయంతి సంవత్స

రం అంతా నేను ఆంధ్ర దేశంలో అన్ని ఊళ్ళలోనూ తిరిగాను.  ఎంత ప్రేమని స్నేహాన్ని సంపాదించు కున్నానో మరువలేను.  (ప్రేమ అన్న మాటని కాస్త విశాలార్థం లోనే చదువుకోవచ్చు) చలంగారి పేరు చెప్పగానే  కాస్త స్పందన ఉన్న మనుషులు కొంత కుతూహలంతో కొంత ఇష్టంతో, ఎంతో ఆరాధనతో తొణికి పోతారు.  వాళ్ళ ముఖాలు అప్పుడు మనకి ఎంత ప్రేమాస్పదంగా ఉంటాయో!

“ఏదో అసాధారణ మార్గాన మీరు రాస్తారనీ ,తెలియజేస్తారనీ, ఏదో విశ్వాసం” అంటాడు ప్రేమ లేఖల్లో ప్రియురాలితో చలం

ఈ మాట ఆయన సాహిత్య మంతటికీ సరిపోతుంది.  అసాధారణ మార్గాన రాస్తూ వాటి ద్వారా వచ్చి మన హృదయాలను దోచుకుంటూ ఉన్న ‘ ఈదొంగకు’ మనం పుట్టిన రోజు కాన్కగా ఇవ్వడానికి ఏం మిగిలింది ? ఆనందం తప్ప .

***

                                                            

మీ మాటలు

 1. మీ “సత్యాన్వేషి చలం” చదివాను. ఎంత ప్రేమ, అభిమానం,నిబద్ధత ఉంటే అలాంటి బయోగ్రఫీరాయగలరా అనిపించింది. చలం మనసునితాకితే మనిషిలో విప్లవాలు మొదలౌతాయి. సమాజన్ని తాకితే ఉద్యమాలు పుడతాయి. కానీ మన సమాజం ఎంత స్థబ్ధతలో ఉందటే, మనం మనుషులుగా ఎంత బండబారిపోయామంటే…చలం ఇప్పటికీ అర్థంకానివాడిగా మిగిలేంత. మనమనసుల్ని మనమే రోజూ ఖననం చేసుకుని, కేరింతలు కొట్టి, అదే ఆనందం అనుకునేంత.

 2. V.Ch. Veerabhadrudu says:

  చాలా చక్కటి నివాళి.

 3. బాగుందండి వ్యాసం.
  నేనూ విజయవాడ పుస్తక ప్రదర్శనలో కొనుకున్న మొదటి రెండు పుస్తకాలూ “స్త్రీ”, “ప్రేమలేఖలు”. మీ రచనలపై అభిమానం కొద్దీ క్రిదటేడు “సత్యాన్వేషి చలం” కొనుక్కుని మొదలుపెట్టాకా తెలిసింది.. ఆ పుస్తకం చదవాలంటే ముందర చలం రచనలన్నీ చదవాలని..:) నాన్నగారి బీరువాల్లో చిన్నప్పటి నుండీ చలం రచనలని చూస్తూనే ఉన్నా, ఒకటో రెండో తప్ప మిగిలినవి చదవనేలేదు. నెమ్మదిగా ఒకోటి మొదలుపెట్టా !ఓ పుస్తకం చదవటం, తర్వాత మీ ‘సత్యాన్వేషి’ తీసి దాని గురించి మీరేం రాసారో చదవటం.. అలా చేస్తున్నా.

 4. veeralakshmidevi vadrevu says:

  మహేష్ గారూ
  చాలా సంతోషం .చలం వ్యక్తుల కోసమే రాసాడు.వ్యక్తులు మారితే చాలు.సమాజం అదే మారుతుంది అని మన అందరికి తెలియజేప్పేడు.మనం మారడం మనకీ ఆనందమే కదా.
  ధన్యవాదాలు

 5. veeralakshmidevi vadrevu says:

  డియర్ తృష్ణా
  చాలా చాలా సంతోషం .ఈ మధ్యనే మా తమ్ముడు చెప్పగా మీ బ్లాగ్ లో కి వెళ్లి నా పరిచయాలు చూసుకున్నాను.అప్పటినుంచి మిమ్మల్ని పలకరించాలని .చలం మనకోసమే ఎంతో రాసాడు. మనం చదివి తీరాలి.నా పుస్తకం సహాయపడుతోందంటే చాల బావుంది.
  మీ సాహిత్యాభిమానానికి అభినందిస్తూ.
  వీరలక్ష్మీదేవి

 6. గొప్పగా క్లుప్తంగా రాసారు

 7. పి.సత్యవతి says:

  మళ్ళీ ప్రేమలేఖలు తీసి చదవాలనిపించేలా వుంది మీ వ్యాసం .వ్యాసం చదువుతుంటే మీతో మాట్లాడుతున్నట్టే వుంది.

 8. సాయి పద్మ says:

  చలం మీద మనందరికున్నంత ప్రేమగా రాసేరు . చాలా బాగుంది .

 9. akella raviprakash says:

  “ప్రేమ లేఖలు’ చదవడం ఎవరి జీవితంలో నయినా సరే ఒక అత్యంత ఆవశ్యకమయిన అవసరం. అప్పటికే భావుకతా పక్షాలు ఏర్పడిన నా మనస్సులో ఆ పుస్తకం నా రెక్కలకి బలాన్నిచ్చి ఎగిరేలా చేసింది. నా రెక్కల్ని నెమలి కన్నులంత మృదువుగా సుందరంగా మార్చింది. చూడవలసిన లోకాలతో పాటు తీసుకెళ్ళి తిప్పవలసిన రెక్కలు కూడా అంత లలితంగా హృద్యంగా ఉండాలని తెలియ జెప్పింది. నాకు ఉహామాత్రంగానే తెలిసిన లలిత శృంగార లోకాల వెలుగు రంగుల్ని అబ్బుర పరుస్తూ ప్రణయ సంబంధాల్లో, ప్రేమ సంబందాల్లో ఒకరికొకరు నిబద్దులయి ఉండే కొద్దీ ఆనందం పెరుగుతుంది. నిబద్దత అందుకోసమే. చూపించింది”
  చాలా మంచి వాక్యాలు,
  మొదటిసారి చలం రచనలు చదివిన ఎవరికైన అదీ తోలియవ్వనం లో అవి కొత్త రెక్కలు తొడిగి జీవితం lo అద్భుత సౌందర్యాన్ని నింపుతాయి, ఆడవారయిన మగవారయిన తేడ లేకుండా,
  ఈ అందాన్ని మీ వ్యాసం సున్నితంగా స్పర్శించింది,
  వీరలక్ష్మి గారు, మీ ఫోటో చూస్తె మల్లీ
  పద్మావతి గ నటించిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ముందుకన్నా ఇంకా బాగుంటారెమొ అనే అనిపిన్స్తోంది

 10. mercy margaret says:

  ఒక మంచి ఆర్టికల్ , మంచి నివాళి , అంతకు మించి మంచి ఆత్మీయ ఆలంభన ,ప్రేమ , అందుకున్న బలం ప్రతి మాటలో కనిపిస్తుంది లక్ష్మీదేవి గారు . అభినందనలు ధన్యవాదాలు .

 11. ప్రేమలేఖలపై అద్భుతమైన్ వ్యాసం అండి
  “నీవీపాటికి రైలు దిగే ఉంటావు, లేకపోతే ఈ ఉత్తరగాలులకు ఇంతటి పరిమళం ఎలా వస్తుంది?” అంటాడు ఒకచోట ప్రేమలేఖల్లో చలం. ఎంత రమ్యమైన భావుకతా

  “సత్యాన్వేషి చలం ” —- పేరులోనే చలం తత్వాన్ని స్పష్టంగా నిర్వచించారు, పుస్తకంలో సంపూర్ణంగా ఆవిష్కరించారు. నాకు తెలిసి చలంపై వచ్చిన పుస్తకాలలో మీ ఈ పుస్తకం మిగిలిన వాటికన్నా చాలా ముందుంటుంది.

  మరోసారి చలం ప్రేమలేఖల్ని గుర్తుచేసినందుకు ధన్యవాదాలతో

 12. మీ సత్యాన్వేషి నేను సమీక్షించను అప్పుడు చాలా మాట్లాడుకున్నాం నాకెంతో గొప్పగా అనిపించింది మీరు చలం గురించి రీసెర్చ్ చేయడం …..ప్రేమతో జగతి

 13. satyanarayana says:

  మీ ఈ వ్యాసం చూడటం ఆలస్య మయినా ,
  మీ వ్యాసం చాలా బాగుందని చెప్పాలనుకుంటున్నా , నేటికీ,చలాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటున్న సమాజంలో .
  మల్లి ఒక సారి చదువుతా చలాన్ని .

 14. కె.కె. రామయ్య says:

  “సత్యాన్వేషి చలం” ని తలపోతకి తెచ్చిన కాకినాడ అక్కయ్య గారికి నెనర్లు.

  ” సంఘ దురాచారాల మీద, మూఢ విశ్వాసాల మీద, కులం మీద, మతం మీద ధ్వజమెత్తి, స్త్రీల స్వేచ్ఛ కోసం, వారికి సాంఘిక న్యాయం కోసం పరితపించిన మానవతావాదిగా చలం గారిని తెలుగువారు చిరకాలం జ్ఞాపకం పెట్టుకుంటారు ” ~ నండూరి రామమోహనరావు.

  http://pustakam.net/?p=12074

మీ మాటలు

*