ఎస్‌ – 11

అమర్ అహమ్మద్

 

(ఇప్పుడు నెల్లూరు జిల్లా, అల్లూరు నుంచి వినిపిస్తున్న సరికొత్త గొంతుక అమర్ అహ్మద్ షేక్. ఆగస్ట్ 28, 1992లో పుట్టారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేశారు. ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో డాక్యుమెంట్ రైటర్‌గా పని చేస్తున్నారు. మొదటి కథ “నిజంగానే నిజం మర్చిపోయాను.” 2011 నవ్య వీక్లీలో ప్రచురితమైంది. ఇప్పటిదాకా ఐదు కథలు రాశారు. మంచి రీడబులిటీ ఉన్న రైటర్‌గా గుర్తింపు పొందుతున్నారు.  —వేంపల్లె షరీఫ్. )

పుట్టినపుడు, చనిపోవడం అనేది కూడా అంతే సహజం.
ఆనందం పుట్టినపుడు బాధా , పరిష్కారం పుట్టినపుడు సమస్యా , చనిపోవచ్చు….!
ఆనంద పరిష్కారమే లేని సమస్యల బాధలు పుట్టినపుడూ, మనిషి కూడా….చనిపోవచ్చు
కానీ, ఆ మనిషి  తన చావుతో ఆ సమస్యలను కూడా చంపెయ్యగలడా ? లేక,
ఇంకొన్ని కొత్త సమస్యలను పుట్టిస్తాడా….! అన్నదే ఆ వ్యక్తిని నేను అడగాలనుకుంటున్న చివరి ప్రశ్న.

ఇంకా చీకటిగానేవుంది. సమయం ఖచ్చితంగా తెల్లారుజాము 5నుండి 6లోపు అయినట్లే. దూరంగా మసీదులో అజాం వినిపిస్తూవుంది. మన ప్రతీరోజును చీకటిలోనుంచి మేలుకుని  వెలుగులోకి నడవమనేమో.. ఆ పిలుపు యొక్క ఉద్ధేశ్యం. నేను మాత్రం చీకటిలోనుంచి ఇంకా దట్టమైన కారు చీకటిలోకి నడుస్తున్నట్టున్నాను. టీ అంగడి దగ్గరకు వచ్చి, సింగిల్‌ టీ అని సైగ చేసిన నన్ను  టీ కలుపుతున్న మాస్టర్‌ చూసాడు. దుమ్ముతో రేగిపోయున్న నా జుట్టు  వయసును రెట్టింపు చేస్తున్న మాసిన గడ్డం, ఉబ్బిన నా ఎర్రటి కళ్ళను చూసి ‘‘ ఏం, బాబూ…మందు సరిపోలేదా…? టీ సరిపోతుందా…?’’ అని నవ్వుతూ అడిగాడు. నిజమే…, దిగులుతో నిద్రలేని కళ్ళు, ఆనందంకోసం తాగిన కళ్ళు, ఒకేలా.. భారంగా, ఎర్రగా వుంటాయి. బదులు ఇవ్వాలనిపించలేదు. కానీ, నేనూ నవ్వాను. సిగరెట్‌ వెలిగించి, కాలిపోతున్న దాని వైపే నిస్తేజంగా చూస్తూవున్నాను. అప్పుడప్పుడూ నా పెదాలను కాల్చుతుంటుంది. దేనినీ మరీ ఎక్కువగా ఆశించవద్దు అన్న ఓ హెచ్చరికగా మాత్రమే.  ప్రతీసారి, తను కాలిపోతూ నాకు మాత్రం ఏదో తెలియని ఆనందాన్నిస్తుంది. బహుశా…ఇదే నా చివరి సిగరెట్‌. ఏదో గుర్తొచ్చింది. ‘సిగరెట్‌ కూడా చాలా మంచిది, అదే నీ చివరిదైనప్పుడు ’.  నవ్వించే మంచి కొటేషన్‌. ఇప్పుడు నాకు నవ్వు రావడంలేదు. తనను పట్టించుకోమన్నట్టు మొదటిసారి సిగరెట్‌ నా వేళ్ళనూ కాల్చింది….మరి చివరిసారి నన్ను పట్టించుకునేవాళ్ళు…..?
బయలుదేరుతూ చివరిసారి ఆ టీ మాస్టర్‌ను చూసాను. నవ్వుతూ అలానే నా వైపు చూసి తన పని చేసుకుంటున్నాడు. రేపు ఉదయం వార్తల్లో నా ఫోటోను చూసి ఏ విధంగా రియాక్ట్‌ అవుతాడో అని ఆలోచిస్తున్నాను. బ్యాటరీ అయిపోతున్నట్టు సిగ్నల్‌ ఇచ్చిన నా మొబైల్‌ని ఓసారి చూసుకున్నాను. ఇప్పటికీ, ఏదో తెలియని ఆశ.
ఎవరో….ఏదో….మెసేజ్‌ పంపిస్తారని. అంతకుమించి ఇప్పుడు నాకు మొబైల్‌ అవసరమేలేదు. కనిపిస్తున్న ప్రతీదాంట్లో బతకడానికి ఏదో ఆశ వెతుక్కుంటున్నానా…? ఏమో తెలీడంలేదు. నాకు కొంచెం ఓదార్పు కావాలి. నాకు ఎవరో కావాలి. ‘చావు మాత్రమే పరిష్కారం ’ అనే నా ఆలోచనలను ఆపెయ్యగలిగే  సహాయం ఏదైనా కావాలి. కానీ… ఏదీ కనిపించడమేలేదు.
కదలకుండా స్ధిరంగా నిలబడివుంటే నాలో ఆలోచనలు పరిగెడుతున్నాయని, నేను కూడా వాటికి చిక్కకుండా ఎక్కడా ఆగకుండా, కదులుతూనే వున్నాను. మనిషినైపోయాను, బాధను చాలా రకాలుగా వ్యక్తం చేయగలను. చాలా రకాలుగా నన్ను నేనూ బాధించుకోగలను. ‘ఒక ప్రేమను మర్చిపోడానికి ఇంకో ప్రేమ వుంది ’ అని నన్ను ప్రేమించే చాలా మంది స్నేహితులు నచ్చ చెప్పారు. కానీ..నాకు మాత్రం, ‘ ఒక బాధను మర్చిపోడానికి ఇంకో బాధ మాత్రమే కనిపిస్తుంది ’. అదే కావాలనిపిస్తుంది. ఎందుకో….? తెలియదు.
విజయమహాల్‌ రైల్వే ట్రాక్‌ దగ్గరకు వచ్చాను. అంతా చీకటి. ఏమీ కనిపించడంలేదు. ఇప్పుడు నిజంగా నా మొబైల్‌ అవసరమైంది. ఫ్లాష్‌లైట్‌ ఆన్‌ చేసాను. పట్టాలపై నా చెవిని ఆనించి విన్న నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు నా మెడను ఉంచుదామనుకుంటున్నాను. ఆనందం కోసం సరదాగా ఉంచిన పావలా బిళ్ళ రైలు కింద నలిగి, తన చక్కటి రూపం కోల్పోయింది ఇంకా బాగా గుర్తుకొస్తుంది. అనాలోచితంగా చేతితో నా మెడను తడుముకున్నాను. చర్మానికి, రెండు ఇనుపముక్కలకు మధ్య బలాబలాలను ఊహించుకుని ఆ పట్టాల వెంబడే నడుచుకుంటూ, ముందుకు కదులుతూవున్నాను. దూరంగా ఉన్న ఓ హైమాక్స్‌లైటు వెలుగులో, చక్కగా ఓ నిచ్చెనను పడుకోబెట్టినట్టు కనిపిస్తూ మెరుస్తున్న పట్టాలు. నిచ్చెనను పడుకోబెట్టినప్పుడు, దానిపై నడవడం చాలా కష్టం. ఇప్పుడు కూడా అంతే. ఒకే లాంటి అంగలతో రెండు పట్టాలకు మధ్యలో అడ్డంగా పరిచివున్న ఆ బండలను ఓ క్రమపద్ధతిలో దాటుతున్నాను. ఆ వెలుగులో ఎటు చూసినా కంకర, రాళ్ళు. వీటి తర్వాత ఎక్కువగా కనిపించేవి కాఫీ కప్పులు, ప్లాస్టిక్‌ కవర్లు. నిజమే…ఇవన్నీ చాలా సహజం. మనిషి ప్రయాణించే ప్రతీ దారిలో ఇవన్నీ చాలా సహజం. జంతువుల అడుగుజాడల్లో వాటి వ్యర్ధకాలు వున్నట్టు, ప్రస్తుతం ప్లాస్టిక్‌ మాత్రమే మనిషి మనుగడ యొక్క నిజమైన ఆనవాళ్ళు.  ‘ ఆధునిక వ్యర్ధ మనిషి వ్యర్ధకం ప్లాస్టిక్‌ మాత్రమే…’
నాలో తిరిగి అవే ఆలోచనలు. నేను, ఎందుకూ పనికి రాని వాడినని గుర్తుచేసే, అవే భావనలు. ఆమె లేకుండా నా జీవితం అనవసరం అని గుర్తుచేస్తున్న నా ప్రతీ అవసరం. నన్ను నడవనివ్వటం లేదు. నిలవనివ్వటం లేదు. పూర్తిగా నిస్సత్తువ.  నా ఆలోచనలకు, నా శరీరానికి విశ్రాంతి కావాలి. ఎన్నో రోజుల నుంచి నిద్రే లేదు. ఇంటి దగ్గర పడుకోనూ లేను. ఇక్కడ, ఇక ఏ మాత్రం ఆలోచించకుండా పడుకోవాలని ఉద్వేగంగా అనిపించేస్తుంది.
‘చావబోయేవాడికి తెగింపు ఎక్కువ. చావడం మాత్రమే లక్షం,  ఏ విధంగా అనేది ఆ పరిస్థితుల్లో ఆలోచించలేడు. ధ్యాసంతా లక్షం సాధించడంలో మాత్రమే….’
అలానే పట్టాలపైనే నడుచుకుంటూ నెల్లూరు సౌత్‌ స్టేషన్‌ దాటాను. ఒకచోట ఆగి, ట్రాక్‌ పై పడుకుని పైకి చూస్తుంటే ఆకాశంలో చుక్కలు మసకగా కనిపిస్తున్నాయి. పక్కనే చంద్రుడు కూడా వున్నట్లున్నాడు. చంద్రుని వైపు దృష్టేలేదు. పెద్ద విషయాలను అస్సలు పట్టించుకోవడం లేదు. చిన్నవే చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. ఏవేవో అలికిడులు, ఎక్కడెక్కడో మనుషుల ఉనికిని తెలియజేస్తున్నాయి. నాకు ఈ సమయంలో, ఇలాంటి ప్రదేశంలో, చాలా కొత్తగా ఉంది….అయినా పర్లేదు. ఒక్కసారేగా…చివరిసారేగా.
శబ్దం చేస్తూ మొబైల్‌లో అలారం మోగింది. పిచ్చి టెక్నాలజీ, యధార్ధానితో సంబంధమేవుండదు. నేను నిద్రేపోలేదని దానికి తెలియదుగా…ఆ భయంకరమైన శబ్దాన్ని ఆపాలనుకోలేదు. దేనిని ఆపాలనుకోవడం లేదు. నా ఊపిరిని తప్ప. చివరిగా, ప్రతీదాన్ని మౌనంగా అనుభవించాలనుంది. ఎవ్వరి గురించి ఆలోచించడంలేదు. నా గురించి అస్సలు…
మెత్తటి దిండ్లకు అలవాటుపడిన నా మెడ, ఆ పట్టాల ఒత్తిడిబాధను నా చివరి సుఖం కోసం భరిస్తున్నట్టుంది. గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి అంటారే, అలాంటిదే నా శరీరం మొత్తం అనుభవిస్తున్నట్టుంది. తల తిప్పి, రైలు వచ్చే మార్గం వైపే చూస్తూవున్నాను. మెడకు అతి దగ్గరగా వున్న నా చెవులకు, కంపనాలతో కూడిన ఓ హెచ్చరిక…. నా గుండె కొట్టుకునే శబ్దం నాకు చాలా స్పష్టంగా బయటికే వినిపిస్తూవుంది. ఎందుకో వద్దనిపిస్తుంది. ఇంకొంచెం సేపు బతికేద్దామనిపిస్తుంది. ఏదన్నా మెసేజ్‌ వచ్చిందేమోనని, మొబైల్‌ చూసుకున్నాను. పిచ్చి టెక్నాలజీ, అవసరానితో అస్సలు సంబంధమేవుండదు. లోబ్యాటరీతో ఎప్పుడో స్విచ్‌ఆఫ్‌ అయిపోయింది. ఆన్‌ చెయ్యడానికి ఓ రెండు సార్లు ప్రయత్నించాను. పనికిరానివాడిని అని ఆ రెండుసార్లుకూడా స్పష్టంగా రుజువయ్యింది.
పట్టాల కంపనాలు ఎక్కువవుతూ చెవులు బద్దలు కొడుతూ ఓ అతి భయంకరమైన హారను కూడా వినిపించింది. కానీ, దానికి సంబందించిన ప్రకాశవంతమైన లైటు వెలుతురు కనిపించడంలేదు. శబ్దవేగం కన్నా కాంతివేగం ముందుంటుంది అంటారే….ఏమో…పట్టాల ప్రకంపనాల శబ్దం, నా గుండె శబ్దం అంతకన్నా చాలా వేగంగా వున్నాయి.
ఇప్పుడైనా నేను లేచి పక్కకు వెళ్ళిపోవచ్చు. కానీ, ఎందుకో నాకు చావుపై గెలవాలని లేదు. ఇదీ ఓ గెలుపేనా…వద్దు అనిపించి, శబ్దాలను మాత్రమే మౌనంగా వింటున్నాను….ఓ రెండు కన్నీటి చుక్కలు వెచ్చగా కళ్ళ చివరనుంచి జారిపోతూ చెవుల పక్కగా నా జులపాలలో కలిసిపోయాయి. ఎందుకు ఏడుస్తున్నట్టు…? ఏమో…తెలియదు. ఎవరికోసం ఏడుస్తున్నట్టు…? ఏమో…అస్సలు తెలీదు.
సర్దుకున్నాను. మెడను ప్రశాంతంగా వెనక్కు వాల్చేసాను. ఎవరో రైల్లో తిని పారేసిన బిర్యాని పొట్లం వాసన ఎక్కడినుంచో కమ్మగా వస్తూవుంది. చావడానికి సిద్దపడున్నా, నా కడుపు మాత్రం ఇంకా కక్కుర్తిదే. దానికి పనిచెప్పి కనీసం రెండురోజులయింది. ఆ పొట్లాం కోసం వచ్చిన రెండు కుక్కలు, గుర్రుమంటూ దూరంనుంచే పోట్లాడుకుంటున్నాయి. ఆ పొట్లాన్ని విభజించి, వాటి సమస్యకు పరిష్కారం ఇద్దామా అనుకుని తలకిందులుగా చూస్తున్నాను. కాసేపయాక, అందులో ఒక బలమైన కుక్క ఆ పొట్లాన్ని నాకేసి వెళ్ళిపోయింది. రెండవ కుక్క ఇంకో పొట్లాంకోసం ఆశగా వాసన చూసుకుంటూ పట్టాలవెంబడి ముందుకు వెళ్ళిపోయింది. నేనూ, జంతువునయివుంటే ఆహారం మాత్రమే నా సర్వస్వం అన్నట్టు ఎలాగోలా బతికేసేవాడిని. మనిషినయిపోయాను. రకరకాల కోరికలు, ప్రతీది నా కోసమే అన్నట్టు ఊరిస్తూ కనిపించే ఈ ప్రపంచంలో సర్దుకోలేక, బతకలేక చివరికి కుక్కచావుకు కూడా సిద్ధపడ్డాను. తప్పు….కుక్క కూడా సర్దుకుని బతికేస్తుంది. కానీ, నేనే…మనిషిలా, సర్దుకోలేక తలకిందులయి లోకాన్ని చూస్తూవున్నాను.
చివరిసారిగా మా నాన్నకు ఓ మెసేజ్‌ టైప్‌ చేద్దామనుకున్నాను. కానీ..మొబైల్‌ సహకరించడంలేదు. భయంకరమైన హారన్‌తో పాటుగా, కళ్ళు మిరుమిట్లు గొలిపే ఓ ప్రకాశవంతమైన లైటుకూడా మలుపు తిరుగుతూ నాకు అతి దగ్గరకు రావడానికి పరిగిస్తుంది. ఊపిరి అతి భారంగా పీల్చుకుంటున్నాను. ఇలా ఎప్పటివరకు పీల్చుకోవాలో తెలియడంలేదు. అలా పీలుస్తూనేవుండాలో లేదో కూడా అర్ధం కావడంలేదు. కానీ, ఎంత పీల్చుకున్నా అతి కొద్దిసేపు మాత్రమే అని తెలుస్తూవుంది. జీవితపు చివరి క్షణాల్లో గతం తాలూకు కొన్ని కీలకమైన జ్ఞాపకాలు గుర్తొస్తాయి అంటారే….! కానీ, అది పూర్తిగా తప్పు. నాకు మాత్రం నా మెడ, నా శరీరం, కలగబోయే అతి భయంకరమైన బాధ గురించి మాత్రమే ఆలోచనలు…ఇంకేలాంటి ఆలోచనలు అస్సలు రావడం లేదు. ఖచ్చితంగా చెప్తాను. చనిపొయ్యేముందు ఎవ్వరికైనా అంతే…అని అనుకుంటున్నాను.
పట్టాల ప్రకంపనలు చాలా ఎక్కువవుతున్నాయి. చాలా భయంగా అనిపిస్తుంది. అందరూ కావాలని ఎలా చనిపోతారో అర్ధంకావడంలేదు. ఆత్మహత్య అంత సులభమైందేమీ కాదు. ఇప్పుడే నిజాయితీగా నాకూ తెలుస్తూవుంది. తెల్లవారే వెలుతురు ఎక్కువవుతూంది. నాకు అతి దగ్గరగా వచ్చేసిన ఆ భయంకరమైన రైలు శబ్దాలను తట్టుకోలేకపోతున్నాను. బహుశా ఆ డ్రైవర్‌గారికి నేనేమైనా కనిపించానేమో, అదే పనిగా హారన్‌ మోగిస్తూనేవున్నాడు. కొంచెం ఆశ్చర్యమేసింది. నన్నూ, నా చావును, కనీసం ఒకరు పట్టించుకుంటున్నారు.
కానీ, ఇక ఏమాత్రం అవకాశమేలేదు. మెడను విస్తారంగా చాపుకుని, పొడవైన నా కాళ్ళను మాత్రం ముడుచుకుని అతి కష్టంమీద సర్దుకుని పద్మాసనం వేసుకున్నాను. పోతే, మెడ మాత్రమే తెగిపోవాలి. కాలేజ్‌లో ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌ను. నా కాళ్ళమీద నేను నిలబడలేకపోయినా, వాటిని తెగ్గొట్టుకోలేను. మెడలేకున్నా, ఒకవేళ నేను బతికిపోతే, నడుచుకుంటూ ఇంటికెళ్ళాలిగా… ఇది కూడా జోక్‌ చేసే సంధర్భమా…? ఏమో తెలీదు. అయ్యో.. రైలూ చాలా దగ్గరకొచ్చేసింది. నాకు దేవుడిమీద నమ్మకమేలేదు. చివరిగా ఎవరిని తలుచుకోవాలి..? ఎవరో చెప్పింది తలచుకున్నాను. బాధలు మాత్రమే శాశ్వతం. సుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. అలాగే, పట్టాలు మాత్రమే శాశ్వతం. చక్రాలు వస్తుంటాయి, పోతుంటాయి అని. అందుకే, సుఖాన్ని అందించే ఆ రైలు చక్రాలనే తలుచుకుంటున్నాను. అవే, నా బాధలను, నానుంచి దూరం చేయడానికి తన వృత్తి ధర్మం నిర్వహిస్తూ, నిస్వార్ధంగా నాకు సహాయం చేయబోతున్నాయి.
అతి భయంకరమైన శబ్దంతో వచ్చేస్తున్నాయి. రైలు చక్రాలు..జగన్నాధ రధ చక్రాలు…చాలా దగ్గరకు… నా అంతిమ ఘడియలతో కలిసి…నాకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఒక నిముషం కన్నా తక్కువ సమయంలోనే నా ప్రాణం నా శరీరం నుంచి పారిపోతుంది. వచ్చే ఆ మృత్యువును నాకు చూడాలనేలేదు. నా గుండె ఆగిపోవాడానికే అన్నట్టు విపరీతంగా కొట్టుకుంటుంది. బహుశా, మనిషికి గుండె ఉన్నది ఇందుకేనా..సంధర్భానికి తగ్గట్టు, తదనుగుణంగా కొట్టుకుంటూ ఆగిపోవడానికేనా…? నా కళ్ళు, నీళ్ళతో నిండిపోయి వలికిపోతున్నాయి. చుక్కలు లేని ఆకాశం మసక మసకగా కనిపిస్తుంది.
నాకు బతకాలనుంది. కానీ, ఎందుకో బతకాలనీ లేదు. నేను అమితంగా ఇష్టపడ్డ నా ప్రేయసి, నన్ను కాదని, ఈ రోజే వేరొకడితో పెళ్ళిపీటలపై కూర్చుంటుంది. ఎందుకు..? నేను ఎందుకూ పనికిరానివాడినని మాత్రమే.. నిజమే నాకు ఉద్యోగం లేదు. ఆదాయం లేదు. ఒక్క నా శరీరం తప్ప నాకంటూ స్వంతగా ఏమీ లేనివాణ్ణి.
నా చెవులు తూట్లుపడుతున్నట్టు రకరకాలుగా భయంకరమైన శబ్దాలు ఎక్కువవుతున్నాయి. అటు చూడలేక నా ఊపిరిబిగబట్టి గట్టిగా కళ్ళు మూసేసాను. హారన్‌ శబ్దాలతో పాటుగా కీసుకీసుమంటూ ఘర్షణ శబ్దాలు, ఏదో కావాలని బలవంతంగా ఆపేసుకుంటున్నట్టు వినిపిస్తున్నాయి. మూసుకున్న నా కళ్ళను తొలుచుకుంటూ ప్రకాశవంతమైన లైటు వెలుగు చాలా స్పష్టంగా నాపై పడుతూవుంది. ఆ వెలుగుకు నా కళ్ళు మండిపోతున్నట్టు, ఉన్నట్టుండి పట్టపగలు అయిపోయినట్లువుంది. కీసుమంటున్న శబ్దాలు ఎక్కువవుతూ,  విపరీతమైన ఘర్షణతో రాసుకుంటున్నట్టు వింత శబ్దాలను పుట్టిస్తూ, ప్రకంపనాలను తగ్గించేస్తూ, నాకు అత్యంత దగ్గరకు వచ్చేసి కొద్ది అడుగుల దూరంలో బ్రహ్మాండమైన వేడిని దుమ్మునూ రేపుతూ ఆగిపొయ్యాయి. కళ్ళను గట్టిగా మూసేసుకునున్న నాకు అస్సలు నమ్మకమే కలగడంలేదు. నా ఊపిరి ఆగిపొయ్యిందో… లేక రైలే ఆగిపొయ్యిందో అర్ధం కావడంలేదు. ఆగిపోయినవి మళ్ళీ కదిలే అవకాశముందా…? ఏమో తెలీదు.
ఇక తప్పక కళ్ళు తెరిచి ఆ వైపు చూసేసాను. ఇంజన్‌ శబ్దాలు ఆగిపొయ్యాయి. రైలు పూర్తిగా ఆగిపొయ్యింది. కానీ, ఇంకేవో శబ్దాలు మాత్రం ఆగలేదు. అవి ఇంజన్‌లోంచి వస్తున్న శబ్దాలు మాత్రం కావు. అరుపులు, కేకలు, హాహాకారాలు. ఇంజన్‌ లైటూ ఆగిపొయ్యింది. కానీ, ఇంకేదో వెలుగు మాత్రం దూరంగా భయంకరంగా కనిపిస్తుంది. డ్రైవర్‌ కిందకు దూకుతున్నాడు. నా కోసమేమోనని కొంచెం భయమేసింది. కానీ, ఆ దూకినతను వెనక బోగీలవైపు పిచ్చివాడిలా అరుస్తూ పరిగిస్తున్నాడు.
చప్పున లేచి డ్రైవర్‌ వెనకాలే నేనూ పరిగెత్తాను. అతి ఘోరంగా, భయంకరమైన అగ్నికీలల్లో దూరంనుంచే భయపెడుతూ ఓ బోగీ మంటల్లో కాలిపోతూవుంది. మిగిలిన బోగీల్లోంచి ప్రయాణికులు ప్రాణభయంతో కిందకు దూకుతూ దిక్కుతోచక పరిగిస్తున్నారు. ఎటుచూసినా తోసుకోవడాలు, తొక్కిసలాటలు, అరుపులు, కేకలు, ఏడుపులు, భయాలు, హాహాకారాలు, ఆర్తనాదాలు. ఎదురొస్తున్న వాళ్ళందరినీ బలంగా తోసుకుంటూ నేనూ ఆ మంటలవైపు పరిగిస్తున్నాను. సాటి మనిషికి, అవకాశమున్న సహాయం చెయ్యడం అనే సహజంగా ఉండే మనిషి లక్షణం నన్ను కూడా ఆ వైపుకు ఆగకుండా పరిగెత్తిస్తూవుంది.
మంటలు తన తీవ్ర ప్రతాపాన్ని చూపిస్తూ, నాలుకలు చాచి అన్నింటినీ అందుకోవాలి అన్నట్టు ఎగిసిపడుతున్నాయి. బోగీకి దగ్గరగా ఎవ్వరూ అస్సలు వెళ్ళనేలేని పరిస్థితి. తెరుచుకునున్న కిటీకలనుంచి దట్టమైన నల్లటి పొగ ఆగకుండా బయటకు చిమ్ముతుంది. ట్రాక్‌పై నించున్న చాలామంది ఆ బోగీని చూస్తూ, గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. పిచ్చివాడిలా అందరితో కలిసి నేనూ అరుస్తున్నాను. ఏమి అరుస్తున్నానో, ఎందుకు అరుస్తున్నానో కూడా తెలియని గందరగోళం. నాకూ కన్నీళ్ళు కారిపోతున్నాయి. కానీ, ఆ దట్టమైన పొగకు అతి దగ్గరగా వుండడం వలన.
కొంచెం మంటల ముందుకు వెళ్ళి బోగీ తలుపు వైపు గమనించాను. మూసివేసుంది. ఆ తలుపు వెనక ఎన్ని ప్రాణాలు పోతున్నాయో… బయటినుంచి రక్షణ ఇవ్వాల్సిన తలుపులు, ఇప్పుడు లోపలేవుంచి ఖచ్చితంగా ప్రాణాలు తీసేస్తున్నాయి. మంటల వెలుగుకు కంపార్ట్‌మెంట్‌ పేరు ఉన్న బోర్డు కరిగిపోతూ కొంచెం కనిపించింది. ‘‘ తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌. ఎస్‌  11 ’’
మంటలకు అంత దూరంగా ఉన్న నాకే ఆ వేడితో మొహమంతా కమిలిపోతున్నట్టు అనిపిస్తుందే…మరి మంటలకు అతి దగ్గరగా ఉన్న వారి పరిస్థితేంటి…? నేను ఏ ఒక్కరికీ, ఏ మాత్రం సహాయం అందజెయ్యలేని అసహాయక స్థితి. మొబైల్‌ తీసాను. స్విచ్‌ ఆఫ్‌. పక్కన గమనించాను. నాకన్నా మంటలకు కొంచెం దూరంగా నిలుచున్న కొంతమంది 108 వారికి కాల్స్‌ చేస్తున్నారు. ఒకతను మాత్రం ఏదో మీడియా వారితో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఏదైనా ప్రమాదం జరగగానే ముందుగా మీడియా వారికి తెలియపరచటం అనేది ముఖ్యమో లేక అతి ముఖ్యమో నాకు అర్ధం కాలేదు.
నేను నిస్తేజంగా నించుని చూస్తున్నాను. బ్యాగులతో భారంగా కదులుతూ వెళ్తున్నవారు, ఇంట్లోని వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ, ఏడుస్తూ, ట్రాక్‌ వెంబడే నడుచుకుంటూ వెళ్తున్నవారు, వారినే అనుసరిస్త్తూ, వెనక్కు తిరిగి మంటలను చూసుకుంటూ, ఎక్కడకు వెళ్ళాలో తెలియని అయోమయంలో ఉన్న చాలామంది అన్ని దిక్కులకూ వెళ్ళిపోతున్నారు. శబ్దాలకు మేలుకొని వచ్చిన ఆ చుట్టుపక్కల నివాసమున్న కొంతమంది, అవకాశం వుంటే ఏదైనా దొమ్మీ చేద్దామా అన్నట్టు అటూ ఇటూ హడావిడిగా అన్ని బోగీలను పరిశీలిస్తూ కేకలేసుకుంటూ పరిగిస్తున్నారు.
కొన్ని నిముషాల తర్వాత….ముందుగా నెల్లూరు జోనల్‌ రైల్వే రక్షక దళం వారు వచ్చేసారు. ప్రతి ఒక్కరూ వాకీ టాకీలో మంటలకు దూరంగా నిలబడి మాట్లాడేసుకుంటున్నారు. అంతకుమించి వారూ ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఆ తర్వాతగా, అందరూ చెప్పుకుని వచ్చినట్లు, ఓ డజను మీడియా వాహనాలు వచ్చేసాయి. వెనుకగా వచ్చిన రెండు అగ్నిమాపక వాహనాలు దారి లేక ఓ పది నిముషాలు మీడియా వాహనాల వెనుక ఆగిపొయ్యాయి. ఆ తర్వాత జరగవలసిన పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. అందరితో పాటుగా నన్నూ రైల్వే పోలీసులు లాఠీలతో దూరంగా తరిమి కొట్టారు.
రైల్వే అధికారులు ముందుగా మృతుల, క్షతగాత్రుల లెక్కలు తెలిపారు. ఆ తర్వాత ఘటనా స్థలికి రావాల్సిన ప్రముఖులు వచ్చారు. సంఘటన మరియు సందర్శనాలు అన్ని ఛానళ్ళలో లైవ్‌గా చూపించారు. కేంద్ర వ్యాప్తంగా కొన్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొన్ని దిగ్భ్రాంతులు, సంతాపాలు, ఎక్స్‌గ్రేషియాలు ప్రకటించేసారు. మీడియావారు సంఘటనలోకి వీలైనంత త్వరగా ఇస్లాం తీవ్రవాదులను దూర్చేసారు. గతంలో జరిగిన ప్రమాదాలు, వాటి వివరాలు, ఈ ప్రమాదంతో పోలికలు, ఆసుపత్రుల్లో ప్రముఖుల పరామర్శలు, క్షతగాత్రుల ఇంటర్వూలు, మృతుల బంధువుల రోదనలు, అధికారుల వివరణలూ, ఇలా ఆ రోజంతా ఆంధ్రరాష్ట్రం లోని అన్ని టి.వీ లు మంటలతో నిండిపొయ్యాయి.
అలాంటి చావులను చూసిన తర్వాత,  నాకు బలవంతంగా చనిపోవాలన్న కోరిక చచ్చిపొయ్యింది. ఎంత విచిత్రం. నేను చావును కోరుకుంటూ ఎదురుచూసాను. చావలేదు. బోగీలో ఆ తలుపుల వెనక ఉన్న వారంతా, చావు వద్దూ అని దీనంగా ప్రార్ధించారు. కానీ, అతి దారుణంగా చనిపొయ్యారు. యధావిధిగా, ఆరోజు రాత్రికూడా నిద్రలేదు. ప్రశ్నలూ … ప్రశ్నలూ.. ఊపిరాడనివ్వకుండా నన్ను నిజంగానే చంపేస్తున్నాయి. నా జీవితం ఇప్పటి వరకు ఎవరికైనా ఉపయోగ పడిందా …? కనీసం నా చావు అయినా ఉపయోగపడేదా….? కాదే…! ఎందుకు బతుకుతున్నట్లు, ఎవరికోసం చస్తున్నట్లు…తగలబడుతున్న మంటల్లోంచి ఏదో జ్ఞానజ్యోతి వెలుగుతూ నాలోకి ప్రవేశించి హాయిగా నన్ను నిద్రపుచ్చింది.
రెండో రోజు అదే టీ అంగడి దగ్గరకు వచ్చి సింగిల్‌ టీ అన్నట్టు చేత్తోనే సైగ చేసి మాస్టర్‌ వైపు చూసాను. నీట్‌గా షేవ్‌ చేసిన నా గడ్డం. కుదురుగా ఉన్న నా జుట్టు. ఇన్‌షర్ట్‌ విత్‌ బ్లాక్‌ షూస్‌. అతను ఈ రోజూ అలానే నవ్వాడు.  నేనూ నవ్వుతూ పేపర్‌ తిరగేస్తుంటే కనిపించింది, రైలు ప్రమాదం తాలూకు ప్రకటన. ప్రమాద ఘటనా స్థలంలోని ప్రత్యక్ష సాక్షులను విచారణకు రమ్మంటూ అతి పెద్ద రైల్వే అధికారిగారి నుంచి విన్నపం. నేనూ అక్కడకు వెళ్ళాను.
ఒక్కొక్కరినే లోపలకు పంపుతున్నారు. లోపల దాదాపు ఓ పదిమంది వరకూ అధికారులు చాలా సీరియస్‌గా ఏదేదో రాసుకుంటూ అప్పుడప్పుడూ తలలు ఎత్తుతూ వచ్చిన వారితో ‘‘ మాకంతా తెలుసు, అయినా వచ్చారు, తప్పదు కనుక చెప్పండి ’’ అన్నట్టు అడుగుతున్నారు. నా వంతు వచ్చేవరకు ఎదురుచూసాను. నన్ను ముందుకు పిలిచారు. బయట నిండిపోయున్న జనం గోల, ఆ హాలు లోపలకు కూడా వినిపిస్తూవుంది.
మొదటగా నా పేరు. వయస్సు మొదలగు వివరాలు అడిగి ప్రమాదం గురించి ఏం చూసానో చెప్పమని ఒక చిన్న అధికారిగారు బయటి గోలకు చిరాకు మొహం పెడుతూ పెద్దగా అడిగారు.
‘‘సార్‌, ఇందాకటినుంచి మీరు ప్రమాదం..ప్రమాదం అంటున్నారే. అది ప్రమాదం కాదు…! అని నా ఉద్ధేశ్యమండి ’’ అంటూ చాలా పెద్దగా అరిచి నేనూ మాట్లాడాను.
“ ప్రమాదం కాక మరేమంటావు. తీవ్రవాదులు ఎవరయినా కనిపించారా, ఏదైనా పెద్ద పేలుడు లాంటిది విన్నావా… చెప్పు ధైర్యంగా చెప్పు, నీకు ఏమీ కాదు, నిజాయితీగా చెప్పు, వాటర్‌ తాగుతావా…’’ అంటూ కొంచెం గొంతు తగ్గించి ఒక అధికారి, చుట్టూవున్న మిగిలిన అధికారులను సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నట్లు అప్రమత్తం చేస్తూ అన్నారు. బయట జనాలతో గోలగోలగా ఉన్న హాలులో వున్న ప్రతిఒక్కరూ నన్నే గుచ్చిగుచ్చి చూస్తున్నారు.
‘‘ నా ఉద్ధేశ్యం. అది యాక్సిడెంట్‌ కాదు. పక్కా మర్డర్‌. రైల్వే శాఖ వారిని నమ్మి, భద్రంగా తమను గమ్యానికి చేరుస్తారన్న భరోసాతో టిక్కెట్టు కొన్న కొంత మందిని, అతి దారుణంగా, ఆ శాఖ వారే హత్య చేసారు అంటాను ’’ అని అందరి వైపు చూసాను.
బయట కిటికీలనుంచి లోపలికి తొంగి చూస్తున్న కొంతమంది అరుపులు ఆపమన్నట్టు బయటివారిని హెచ్చరిస్తున్నారు. ఉన్నట్టుండి అంతా నిశ్శబ్దంగా మారిపొయ్యారు.
‘‘ యూ…ఫూల్‌.. నిన్ను పిలిచింది. ఒపీనియన్‌ కోసం కాదు. విట్‌నెస్‌ కోసం. గెట్‌ అవుట్‌ ఫ్రం హియర్‌, నెక్స్‌ట్‌.. ’’ అని ఇంకో అధికారిగారు తన అధికార దర్పాన్ని ప్రదర్శించేసారు.
‘‘ చూడండి, మై డియర్‌ సర్‌. ఐ యామ్‌ ఆల్సో ద విట్‌నెస్‌ ఆఫ్‌ దట్‌ ఫ్యాటల్‌ ఇన్సిడెంట్‌. ఐ గాట్‌ ద రైట్స్‌ టు ఎక్స్‌ప్రెస్‌ ది ట్రూత్‌ ఇన్‌ఫ్రంట్‌ ఆఫ్‌ దిస్‌ బెంచ్‌ ’’ అని అతి పెద్ద అధికారి గారి వైపు మర్యాదపూర్వకంగా చూసాను. ప్రొసీడ్‌ అన్నట్టు ఆయన తలవూపారు.
మరొకసారి ఆయనకు రెండు చేతులతో నమస్కారం పెట్టి, ‘‘ థాంక్యూ సర్‌. ఈ రోజు మీరు నిర్వహిస్తున్న ఈ విచారణ, పంచనామా అనేవి తదుపరి, భవిష్యత్తులో ఇదే ఘటన పునరావృతం కాకుండా చూడడానికి. కానీ, ఇలాంటి పంచనామాలు ఇంతకుముందు ఎన్ని జరిపివుంటారు. మరి వాటి పరిస్థితేంటి. ఇంకా ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతూనేవున్నాయి. ఈ విచారణల వలన నిజంగా ఏమైనా ప్రయోజనం ఉందంటారా…? ఇది ప్రమాదం కానే కాదు సార్‌. ముమ్మాటికి ఇది హత్యే. ప్రభుత్వం మరియు రైల్వేశాఖ కలిసి చేసిన హత్య. ప్రయాణంలో ఒక ప్రయాణికుడి కనీస రక్షణ కల్పించలేనందువలన జరిగిన హత్య. నేను గమనించిన….. ’’
‘‘ చాలు, ఆపవయ్యా… నువ్వు ప్యాసింజర్‌వి కాదు అని నీ వివరాల్లో చెప్పావు. ఇంతకీ అసలు నువ్వు అక్కడ, ఆ వేళలో ఎందుకున్నావు. ఏం చేస్తున్నావు చెప్పు ’’ అని ఇంకో అధికారిగారు విరుచుకుపడ్డారు.
ఒక్క నిముషం నాకు ఏం చెప్పాలో అర్ధం కాలేదు. అయినా అబద్దం చెప్పకూడదు అన్న నిజాయితీతో గుండెనిండా గాలి పీల్చుకుని ‘‘ ఆత్మహత్య చేసుకుందామని ట్రాక్‌ పైకి వచ్చాను సార్‌ ’’ అని ధైర్యంగా చెప్పేసాను.
ఒక్కసారిగా మళ్ళీ హాలులో కలకలం రేగింది. బయటవున్న వారు ఎవరో ఈలలు వేస్తున్నారు. నేను ఏదో తమాషాకు వీళ్ళతో పోట్లాడుతున్నానని అనుకున్నట్టున్నారు. అధికారులు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని పక్కనే ఉన్న తమ పోలీసువారికి  సైగలు చేసారు. ఓ ఇద్దరు రైల్వే పోలీసువారు అమాంతం వచ్చి నన్ను పెడరెక్కలు విరిచి పట్టుకుని, తమ అధికారులను మెప్పించేందుకు తమకు చేతనైనంతగా నా పై ప్రతాపం చూపించడానికి సిద్ధపడిపొయ్యారు.
‘‘ అండర్‌ రైల్వే ప్రొటెక్షన్‌ యాక్ట్‌ సెక్షన్‌ ….కమిటింగ్‌ సూసైడ్‌….క్రింద నిన్ను కస్టడీలోకి తీసుకోవడమైనది….. ’’
చివరిగా నేను చెప్పాలనుకున్న మాటలను నాకు వీలైనంత పెద్దగా అరుస్తూ ‘‘ హెలో…సర్‌….నాకూ తెలుసు ఆత్మహత్య చేసుకోవడం నేరం అనీ… నాకై నేనుగా, బలవంతంగా మరణించడం చాలా తప్పు అనీ….అది ఎవరి దృష్టిలో.. చట్టం దృష్టిలో, సమాజం దృష్టిలో, మిగిలిన అందరి దృష్టిలో, కానీ, ఒక్క నా దృష్టిలో మాత్రం కాదు, అని అనుకున్నందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను. అందుకు మీరు, మీ ప్రభుత్వం నన్ను అస్సలు క్షమించలేరు. మంచిది. నేను అందుకు శిక్ష అనుభవించడానికి ఏమాత్రం బాధ పడటంలేదు. కానీ, హత్యను అందరి దృష్టిలో ప్రమాదం అనే ముసుగేసి తప్పు చేసిన ఎంతో మందిని క్షమించేస్తున్నారే.. ఆ బోగీలో మరణించిన వారి అర్ధాంతరమైన చావుకు కారణం ఎవరు….? దానికి కారణమైన వారందరినీ కూడా శిక్షించాలా, క్షమించెయ్యాలా…? నాకై నేను చస్తే తప్పు, అదే మీరు అతి జాగ్రత్తగా (నిర్లక్షంగా) చంపితే మాత్రం ప్రమాదమా….? చనిపోయిన వాళ్ళందరిదీ ఆత్మహత్య అనండి లేదా హత్య అనండి, అంతేకానీ, ప్రమాదం అని మాత్రం దయచేసి అనొద్దు…..’’
ఫట్‌…ట్‌ట్‌…అని బలమైన ఓ లాఠీ నా మోకాళ్ళపై విరిగింది. చేతులు వెనక్కు పట్టి ఉన్నందువల్ల ముందుకు తూలి పడ్డాను. కళ్ళు మూతలు పడ్డట్టు అనిపించింది. పెదవినుంచి, ముక్కునుంచి చిక్కగా ఎర్రగా రక్తం ప్రవహిస్తుంది. నన్ను బలవంతంగా ఈడ్చుకు పోతున్నట్లుగా అనిపిస్తూంది. బొట్లు బొట్లుగా జొల్లుతో పాటుగా నోటినుంచి కిందకు కారుతున్న నా రక్తాన్ని చూస్తూ… చిన్నగా నాకు నవ్వు మొదలయ్యింది. వికటమైన నవ్వు…. తెరలు తెరలుగా దగ్గుతో పాటుగా నవ్వు, బిగ్గరగా మొదలై ఒక్కసారిగా నాలోఉన్న బలాన్నంతా గొంతులోకి తెచ్చుకుని, ‘‘ నన్ను మాట్లాడనివ్వకుండా, బయటకు నెట్టేస్తున్నారు. మీరు తట్టుకోలేని నిజాలను, నిజాలకోసం ఎదురు చూస్తున్న వారందరిముందూ చెప్పే అవకాశాన్ని ఇస్తున్నారు…థ్యాంక్యూ సా..ర్‌…., కానీ, గుర్తుంచుకోండి.. తమ ప్రాణాలకు ఏలాంటి భరోసా ఉండదని తెలిసీ రైల్లో ప్రయాణించిన ఆ ప్రయాణికులది ఆత్యహత్య అనండి. లేదా హత్య అనండి, అంతేకానీ, ప్రమాదం అని మాత్రం అనొద్దు…..’’
పోలీసువారి భుజాలపై వాలిపోయి బయటకు బలంగా ఈడ్చేయబడ్డాను. నా కాళ్ళపై ఇప్పుడూ నేను లేను. నా గొంతు మాత్రం అలసిపోలేదు. బిగ్గరగా మాట్లాడుతూనేవున్నాను. రక్తం నా నోటినుంచి తుంపర్లుగా ఎగిరి పడుతూనేవుంది. రక్తంతో అసహ్యంగా అనిపిస్తున్న నా నోటిని వారి శుభ్రమైన చేతులతో మూసెయ్యలేక, సంశయిస్తూ, ఆ పోలీసువారు త్వరత్వరగా నన్ను అందరికీ దూరంగా లాక్కెళ్ళడానికి బయట నిలబడివున్న గుంపును చీల్చుకుంటూ నన్ను తీసుకెళ్తున్నారు.
ఎటుచూసినా అప్పటివరకూ నా మాటలు ఆసక్తిగా విన్న సామాన్య ప్రజాసమూహం. అందరూ గోలగోలగా మాట్లాడుకుంటూ, ఆ పోలీసువారి దూకుడికి ఎదురునిలుస్తూ  ఒక్కొక్కరుగా దగ్గరకు కలిసిపోతూ పోలీసువారినీ, వారి మధ్యనున్న నన్నూ ఎటూ కదలనివ్వకుండా, నాకు మద్దతు తెలుపుతున్నట్టుగా, అన్యాయానికి అడ్డుగోడలా నిలబడ్డట్టుగా నాకు తెలుస్తుంది. చాలా ఆనందంగా ఉంది. తల భారంగా వాల్చేసినా, నా గొంతులోంచి మాటలు మాత్రం బిగ్గరగా వస్తూనేవున్నాయి.
‘‘ మిత్రులారా…..ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ రూమ్‌లో దిక్కులేనట్టు, గర్తుపట్టలేనట్టు కాలిపోయున్న శవం, ఏమని అడుగుతున్నదో మీకు తెలుసా….? ’’ నా కాళ్ళపై నేను బలంగా నిలబడ్డానికి ప్రయత్నిస్తూ, తలెత్తి అందర్నీ చూస్తూ ప్రశ్నిస్తున్నాను.
‘‘ ఆ శవం మనల్ని ఏమని అడుగుతుందో తెలుసా….? వినండి… ‘ నా ఆనవాళ్ళను గుర్తించడానికీ, ఈ శరీరం నాదే అని నిర్ధారించడానికీ,  మీకు హక్కులు ఉన్నాయోమో కానీ, అసలు నా చావునే నిర్ణయించడానికి మీరెవరు ’ అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టుంది ’’. నా జుట్టులోకి బలంగా వేళ్ళు దూర్చబడి, తలను కిందకు అణిచేస్తున్నాయి.
‘‘ మిత్రులారా…. ఆ ప్రశ్నించలేని శవం మనల్ని ఇంకా ఏమని ప్రశ్నిస్తుందో తెలుసా….? ’’ భారంగా ఊపిరి తీసుకోడానికి నా కాళ్ళను నేలపై భారంగా నిలదొక్కుకుని బలంగా ఆగిపొయ్యాను.
పోలీసువారిని అస్సలు ఎటూ కదలనివ్వకుండా, నా చుట్టూ భద్రతా వలయంలా, ఓ పఠిష్టమైన రక్షణ వ్యవస్థలా, నాకు అత్యంత దగ్గరగా, నా మాటలు వినడానికేనన్నట్లు ఆ ప్రజా ప్రవాహం ఆవేశంగా దూసుకునొచ్చేసింది.
‘‘ మనుషులు ప్రశ్నించడం మానేసారు. కాబట్టి ప్రస్తుతం శవాలే ప్రశ్నిస్తున్నాయి. మిత్రులారా… ఆ శవం మనల్ని ఏమని ప్రశ్నిస్తుందో తెలుసా…? ‘ పుట్టుక నా చేతుల్లో లేదు. నా చావు కూడా అంతేనా…?, కనీసం నా చావు కూడా నా చేతుల్లో ఉండకూడదా…? పుట్టుకతో సంక్రమించే నా హక్కులలో, నా చావు అనేది కూడా చేర్పించండి. చేర్చలేరా… కనీసం ‘ బతుకు ’ అనే నా హక్కునైనా కాపాడండి ’’.

‘‘ మిత్రులారా…. ఇప్పుడు నేనూ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను.

బాధ పుట్టినప్పుడు….
కనీస ఆవేశం నా చేతుల్లో ఉండకూడదా…?
సమస్య పుట్టినప్పుడు…
కనీస పోరాటం నా చేతుల్లో ఉండకూడదా….?
అన్యాయం పుట్టినప్పుడు….
కనీస తిరుగుబాటు నా చేతుల్లో ఉండకూడదా….?
వీటిని ప్రశ్నిస్తే మాత్రం….
నా చేతులకు సంకెళ్ళు మాత్రమే ఉండాలా….? ’’

మీ మాటలు

 1. రమాసుందరి says:

  కధ బాగుంది. ముగింపు నినాదాలతో కాకుండా ఇంకోలా ముగిస్తే బాగుండేది. మీకు మంచి భవిష్యత్తు వుంది.

 2. rahulkiran says:

  కథ ఆద్యంతం బాగుంది కానీ ముగింపు లో ఏదో వెలితి కనపడుతుంది మొదట్లో ఉన్న ఉత్సకత ముగింపు వచేసరికి తగ్గినట్టుగా ఉంది

 3. అవినాష్ వెల్లంపల్లి says:

  విభిన్నమైన కథాంశాన్ని ఎన్నుకున్నారు. దానికి సామాజిక స్పృహనూ జోడించారు. ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించారు. Narration చాలా బాగుంది. ముమ్మాటికీ ఇది అద్భుతమైన కథ.

  కథలోని భావుకతా, కొటేషన్లూ చాలా బాగున్నాయి. యండమూరి తన నవలల్లో తరచుగా రాసే “ఎపిలోగ్”ను గుర్తుతెచ్చింది ఈ భావుకత్వం.

  “మనుషులు ప్రశ్నించడం మానేశారు”, “ఆధునిక వ్యర్థ మనిషి వ్యర్థకం ప్లాస్టిక్ మాత్రమే!”, “బతుకు అనే హక్కునైనా కాపాడండి” లాంటి వాక్యాలు పదునుగా ఉన్నాయి. రచయిత సమర్థులు. మంచి భవిష్యత్తు ఉంది.

  ‘పరిగిస్తున్నారు’ నెల్లూరు మాండలికం అనిపిస్తున్నది. మాండలికం పదాలు తరచూ ప్రయోగించడం ద్వారా పాఠకులకు పరిచయం చేస్తే, అన్ని జిల్లాల మధ్యా సమతుల్యతనూ, సాటి మాండలికం పట్ల అవగాహననూ పెంచడం సాధ్యం అవుతుంది.

  ఇట్లాంటి masterpieces అమర్ అహ్మద్ గారి నుంచి మరెన్నో రావాలని ఆశిస్తున్నాను.

 4. అవినాష్ వెల్లంపల్లి says:

  Website నిర్వాహకులకు,

  రచయిత పుట్టినరోజు వివరాలను తప్పుగా ఇచ్చారు, సరి చెయ్యగలరు.

 5. కథలోని విషయం బాగుంది. కథనంలో ఎక్కడో కొన్ని లొసుగులు ఉన్నాయనిపించింది. బలమైన వాయిస్ ఉంది రచయితకి. కానీ కథలోని పాత్రలోనే బలం లేదు. ఫామ్ విషయంలోనే ఇంకొంచెం కృషికావాలేమో.

 6. అబ్బాయా..
  కథ బాగుండాది. అయితే ఏందిరా అంటే… ఇంతకన్నా మంచి కథ నువ్వు రాయగలవు గాబట్టి ఈ కథకి ఎక్కువ మార్కులు ఇయ్యట్లా…

 7. బాగుంది అమర్. మీనించి ఇంకా బలమైన కథలు వస్తాయని ఆశిస్తున్నా.

మీ మాటలు

*