సర్వమంగళం

datla lalithaఇల్లంతా , కాలుకాలిన పిల్లిలా  తెగ  తిరిగేస్తున్నారు  అత్తగారు . కాసేపటికి ఉన్నచోటే నిలబడిపోయి వేళ్ళమీద లెక్కలేస్తున్నారు . వేళ్ళతో లెక్కలు తేలకో ఏమో , విసుగ్గా చేతులు విదిలించి వాటిని నడుoమీద వుంచుకుని సీరియస్ గా ఇంటి  వాసాలకేసి  చూస్తూ వుండిపోతున్నారు. ఆ వాలకం అదీ చూస్తే నాక్కొంచెం భయమేసి  పక్కన మరో మనిషుంటే ధైర్యంగా వుంటుందని నరసమ్మని వెతుక్కుంటూ వెళ్ళాను .

పెరట్లో , నూతి గట్టుమీదకి నుంచున్న చోటినుంచే ఢమాల్ ఢమాల్ మని అంట్లు విసిరేస్తూ కనిపించింది నరసమ్మ. దాని విసురుకి కాకులు అరవటం కూడా మర్చిపోయి  , ఉందుమా పోదుమా అని అనుమానప్పడుతూ అక్కడక్కడే తచ్చాడుతున్నాయి .  నన్నుచూస్తూనే మరింత ధుమధుమలాడుతూ  చేతిలో తపేలాతో నెత్తికొట్టుకుని ఠపీమని సామాన్లమీదికి విసిరేసింది .  తపేలా చొట్టపడిందోలేదోగానీ నేను మాత్రం తుళ్ళిపడ్డాను  .

ఇవాళ తిధీ నక్షత్రం ఏవిటోగానీ …..అక్కడ  అత్తగారూ , ఇక్కడ  నరసమ్మా నాకు అంతుపట్టకుండా ప్రవర్తిస్తున్నారు అనుకుంటూ కేలండర్ లో వెతికి చూస్తే అటు అమావాస్యకీ ఈటు పున్నమికీ మధ్యలో ఉన్నాం . అయినా ఈ విపరీతాలేంటో !  అని  నాఆలోచనలో నేనుండగానే …హటాత్తుగా వచ్చిన అత్తగారు నా చెయ్యి పట్టుకుని “ఇలారా ఓసారి “ అంటూ నన్ను కొట్టుగదిలోకి లాక్కెళ్ళిపోయారు . నేను బిత్తరపోయి తేరుకుని , ఆ చీకటిగదిలో బిక్కుబిక్కుమంటూ నిలబడ్డాను.  గొంతు పెగుల్చుకుని “ఏ…ఏ… ఏవి….” అనబోతుంటే ……”ఉష్…మాట్లాడకు” అని నోటికి వేలు అడ్డం పెట్టేసరికి  మిగతా సగం మాట గొంతులో నొక్కేసుకున్నాను .

” కళ్ళుమూసుకో ” అన్నారావిడ రహస్యంగా …

కన్ను పొడుచుకు చూడాల్సినచోట కళ్ళు మూసుకోవటమేవిటో  మతిలేని ముచ్చట ! అని లోలోపల విసుక్కుని   అత్తగారి సంతృప్తికోసం   “ ఆ ….. మూసుకున్నాలెండి “ అంటూ కళ్ళుపెద్దవి చేసి చూస్తున్నాను .

దుమ్ముకొట్టుకుపోయిన  డొక్కు హార్మనీ పెట్టె ఇరుకుల్లోంచీ  ఏదో తీసి పట్టుకుని ఇప్పుడు కళ్ళుతెరు అన్నారు .

నేను అపుడే కళ్ళుతెరిచినట్టూ నటిస్తూ “ఏవిటిదీ  ఏవన్నా నిధినిక్షేపాలా  “?అన్నాను అసక్తిగా

“నీ మొహం!  ఇలా చూడు”  అంటూ కిటికీ రెక్క కొద్దిగా తెరిచి ఆ వెలుగులో ఆవిడ చేతిలో నోట్లు చూపించారు. పైగా వాటిని ఇలా విసినకర్రలా విప్పి మొహానికడ్డంగా  పట్టుకుని జపానుబొమ్మలా నిలబడ్డ్డారు .

పాతా  కొత్తా , చిన్నా పెద్దా రూపాయలు. “అబ్బా ”!  అని నే హాశ్చర్య పోతుంటే …..

“మొన్న నువ్వు ఊరెళ్ళినపుడు  చిట్టిపంతులుగారి అబ్బాయి ఆవునెయ్యి కావాలని  వచ్చారేవ్ . ఎవరో ఏవో పూజలు  చేసుకుంటున్నారట. నెయ్యి ఎక్కడకావాలన్నా  దొరుకుంది కానీ , మడిగా చేసింది  కావాలటండీ . ధర ఎంతయినా పర్లేదు . మీ దగ్గర ఎంతుంటే అంతా  తీసుకురమ్మన్నారండీ నాన్నగారు   అంటూ పాలేర్ని వెంటపెట్టుకొచ్చారు .  ఆఫీసర్ల అభిషేకానికి, మీటింగుల్లో సంతర్పణకి  అప్పనంగా సమర్పించుకోవటం తప్ప నాలుగు ఆవుల పాడి చేసిన్నాడన్నా ఒక్క చుక్క నెయ్యి అమ్మిన పాపాన పోయామా ! అందుకే , నాలుగు సేర్లుంటుందేమో  కేనులో పోసి ఇచ్చేసాను .

దైవకార్యానికే కదా పోనీలే పోస్తే పుణ్యం వస్తుందీ అనుకున్నా… ఆయనేమో , అలా తీసుకోకూడదండీ . వచ్చేపుణ్యం మా ఖాతాలోపడాలికానీ నెయ్యిచ్చి మీరు కొట్టేస్తే ఎలా అంటూ వద్దన్నా వినకుండా డబ్బులు గడపమీద పెట్టేసి వెళ్ళిపోయేరు . గుమ్మంలోకొచ్చిన శ్రీమహాలక్ష్మిని కాదనకూడదని తీసి లోపలపెట్ట్టేనుకానీ, ఈ సంగతి ఇంట్లో మగాళ్ళకి తెలిస్తే అవమానం ఆవకాయబద్దా అంటూ  నామీద ఎక్కడ  విరుచుకు  పడతారో అని భయపడి చస్తున్నాను . అసలెవరికీ  తెలియనివ్వ కూడదనుకున్నాను కానీ,  నీకూనాకూ రహస్యాలేవిటని  చెప్పేస్తున్నానేవ్. ”  బరువు దించుకున్నట్టూ హాయిగా నిట్టూర్చి  ,  “నువ్వూ ఒకసారి లెక్కపెట్టు నేనిప్పటికే పదిసార్లు లెక్కపెట్టేననుకో” “  అంటూ ఆ నోట్లు  నా చేతిలో పెట్టి  ఆనందంతో అగులుగక్కుతూ నిలబడ్డారు.

అత్తగారి అపేక్షకి ఆనందబాష్పాలు కార్చాలనిపించినా అతిగావుంటుందేమో అని ఆగిపోయాను. కానీ అవకాశం వస్తే అత్తగారికోసం ఏమైనా చేసి ఆవిడ్ని సంతోషపెట్టాలని మాత్రం ఆ క్షణo   నిర్ణయించేసుకున్నాను .

నేను ఆ నోట్లనించీ అయిదులూ పదులూ యాభైలూ వేరుచేస్తుంటే …. కిర్రుమంటూ తలుపు తోసుకుని    “ సీకట్లో ఏం చేత్తన్నారండీ  “ అంటూ చీపురు చేత పూని గుమ్మంలో  ప్రత్యక్షమయిపోయింది  నరసమ్మ .

“ హుం…ఇదొక్కత్తి పానకంలో పుడకలా”  విసుగ్గా అంటూ  …..  నాచేతిలో నోట్లు చటుక్కున లాక్కుని హార్మనీ పెట్టెలో కుక్కేసి ఏం ఎరగనట్టూ నిలబడ్డారు అత్తగారు . నేను కంగారుగా ఖాళీ చేతులు వెనక్కి దాచేసుకుని ” “ఆ…  ! చీకట్లో దొంగా పోలీస్ ఆడుకుంటున్నాం . అయినా నీకిక్కడేం పనే….సామాన్లు చొట్టలు   పెట్టడం అయిపోయిందా ….ఇందాకా చూసాలే ఠపీ ఠపీమని ఆ విసిరేయడం అదీ…” అంటూ  స్వరం పెంచాను అత్తగారి అండ చూసుకుని

” ఏటండోయ్ ట్రాపిక్కు మార్సేత్తన్నారూ….. నాకు తెల్దనుకున్నారా  ” అంటూ అంతదూరం నుంచీ చీకట్లో బాణం వేసేసింది.

ఆ దెబ్బకి  అత్తగారు ఠపీమని పడిపోయారు  . ” ఒసేవ్ ….రాజుగారికి గానీ చెప్పకేవ్ ”  అనేసారు గాభరాగా .

“కోడలిగారికి వార్మనీ నేర్పిత్తన్నారనా …..! అందులో తప్పేవుందండీ !   సీకట్లో కూకోపోతే అరుగుమీద  కూకుని వోయించుకోచ్చుకదండీ.  వొడియాలమీద కాకులు వోలకుండా వుంటాయ్  అంది .

” నీమొహం నేర్పించడానికి నాకేం వచ్చి చచ్చు కనకా .. ! ‘పుట్టింటినుంచీ  ఉత్తచేతులతో వెళితే  అత్తారింట్లో ఏం గౌరవం వుంటుందీ’ అంటూ  మావాళ్ళు  ఈ హార్మనీ పెట్టి నా మెడకి తగిలించి పంపారు  .అసలావేళ…..”అంటూ ఆవిడ ఇంకేదో చెప్పేయబోతుంటే …..”అదే అదే….. నాకు సరళీస్వరాలు వచ్చు కదా   . రండి ఇద్దరం కలిసి వాయిస్తే అవే జంట స్వరాలయిపోతాయి  …  మనం పోయి పై గదిలో నేర్చుకుందాం సంగీతం అంటూ హార్మనీపెట్టి చoకనెత్తుకుని మా అత్తగారి  చెంగుపట్టుకుని లాక్కుపోయాను . కంగారులో కన్ఫ్యూస్ అయిపోటం మా అత్తగారి వీక్నెస్సు. అటువంటప్పుడు నేనన్నాఆదుకోకపోతే ఎలా  పాపం !

వెళుతున్న మా ఇద్దరినీ అనుమానంగా  చూసి  , చీపురు కిందా  చూపులూ పైనా తిప్పుతూ “అహా…….అబ్బో !” అంటూ వళ్ళంతా కుదిపేసుకుంది నరసమ్మ .

***

“అయితే తప్పులేదంటావా….అయినా ఆక్షేపణ కాదూ .  మీ మావగారికి తెలిస్తే ఇంకేవన్నా వుందా…..ఇలాంటి అప్రదిష్ట పన్లు మా ఇంటా వంటా లేవంటూ  సూక్తిముక్తావళి చదివేస్తారు   ” అన్నారు అత్తగారు అటూ ఇటూ తేల్చకుండా .

” భలేవారే ఇదేవన్నా దొంగసొమ్మా ..మన కష్టార్జితం కదండీ….” అన్నాను గుడ్లు తిప్పుతూ .

మన దొడ్లో కాసినవి అచ్చంగా మనసొత్తే కదండీ . వాటిమీద దాన విక్రయాది  సమస్త హక్కులూ మనకే చెందుతాయ్. వాటిని ఏట్లో పారేసుకుంటామో…..ఎవరికయినా అమ్ముకుంటామో మనిష్టం . అంటూ అత్తగారికి లా పాయింట్లు చెప్పేను.    అయినా మనకి పండుతున్నాయికదా అని  పంచుతూ పోతే ‘ అబ్బా రోజూ అవే కూరలు వండుకోలేక చస్తున్నాం ‘ అన్నా అనేస్తారు జనం  అంటూ…. బాగా అర్ధమవడంకోసం అర్ధశాస్త్రంలోని ఆపిల్ పళ్ళ సూత్రం        విడమర్చి చెప్పాను .  అక్కడితో ఆగకుండా  సహజ వనరులు -వాటి వినియోగం, మూలధనంపెంపు -ఆవశ్యకత    అంటూ మరికొంత  అర్ధశాస్త్రం  కూడా అప్పచెప్పాను. పనిలో పనిగా అరిస్టాటిల్ నీ ఆడంస్మిత్ నీ పరిచయం చేసిపారేసాను . ( హన్నా…లేకపోతే, అష్టోత్తరమయినా చదవడం రాదు  అన్నేళ్ళు ఏం చదువుకున్నావో ఏవిటో  అని అందరిముoదూ అంటారూ )

అసలేంటంటే , మాంగారికి తెలీకుండా ప్రారంభమయిన నేతి వ్యాపారంలో చేకూరిన వందలని  నా సొంత తెలివితేటల్తో వేలుగా మార్చి చూపెట్టాలని సరదా పుట్టింది  .  అందుకు నా బియ్యే బుర్రతో ఆలోచించి నేనో బ్రహ్మాండమయిన అయిడియా ఇచ్చేను  . అది విని ఆవిడ అదిరిపోయేరు . కాస్త బెదిరినట్టున్నారుకూడా !

పెరట్లో కోతకి సిద్దంగావున్న కూర అరటి గెలలు   ,అవతల మొండిగోడమీద కాసిన గుమ్మడికాయలు  , వాస్తు ప్రకారం మాకు కలవకూడదని వదిలేసిన ఉత్తరపేపు క్రాసులో మేమే ఎవరిపేరుమీదో వేసి పెంచిన కొబ్బరి చెట్ట్లు నించీ ముదిరి రాలిన  కొబ్బరి బొండాలు, గోడమీంచీ వీధిలోకి వాలిపోయే పంపరపనస, గజనిమ్మ కాయలు  ఇవన్నీ అబ్బులుగాడి అజమాయషీలో పక్కూరి సంతకి తోలేస్తే  నాలుగు పచ్చకాగితాలు  భేషుగ్గా రాలతాయన్నది నా ఆలోచన  .

అత్తగారేమో…హవ్వ గుమ్మడికాయలు అమ్ముకుంటామా …నలుగురూ చెప్పుకోరూ అంటారు.

గుళ్ళూ గోపురాలూ కట్టిoచిన వాళ్ళగురించే చెప్పుకోటం మానేసినవాళ్ళు గుమ్మడికాయలగురించి ఎన్నాళ్ళు చెప్పుకుంటారు. ఊరికే మనం భుజాలు తడుముకోవటం తప్ప అన్నది నా పాయింటు  . ఒక పక్క ఆశ పీకుతుండగా అయిష్టంగానే ‘  ఏమో బాబూ నీ ఇష్టం ‘ అనేసారు ఆఖరికి .

ఆ సాయంత్రం నరసమ్మని ఏదో పనిమీద బయటకి పంపించి , అబ్బులుగాడిని పెరట్లోకి పిలిచి …..ఇదిరా అబ్బాయ్ సంగతి అని అత్తగారూ నేనూ చెరో చెవిలోనూ విషయాన్ని నూరిపోసేసాం  . వాడు ముందు షాకయ్యి (ఆశ్చర్యంతో) తర్వాత షేకయ్యాడు ( నవ్వుతో) .

“ఊరుకోండయ్యగారూ ….మీకెక్కువయితే మాలాటోళ్ళకి పారెయ్యాలికానీ ఇదేం పనండీ “అనేసాడు ఆరిందాలా .

చూశావా చివరికి వీడితో చెప్పించుకోవాల్సివచ్చింది. అన్నట్టూ నాకేసి ఓ చికాకు చూపు విసిరేరు అత్తగారు

నాకు ఒళ్ళుమండిపోయింది ( అత్తగారిమీద కాదండోయ్….అబ్బులుగాడిమీద )

మేం పారేసేదాకా నువ్వెక్కడ ఆగుతావ్ రా ……! కొబ్బరిచెట్టు మొవ్వులో కూర్చుని బొండాలు తాగెయ్యడం , చేలోంచీ పాలకేనుతో వస్తా మధ్యలో  సూరమ్మ కాఫీ హొటల్ లో దూరడం , ట్రాక్టరు కి ఆయిల్ కొట్టించడానికని వంకెట్టి మీ  వీధిలో జనాలందర్నీ తొట్టినిండా ఎక్కించేసుకుని  సినిమాకి ఎల్లిపోటం ఇవన్నీ  మాకు తెలీదనుకున్నావా …మర్యాదగా చెప్పింది చేస్తావా . మీ ఆవిడకి కబురెట్టమంటావా ? అని బెదిరింపుగా అనేసరికీ ” అయబాబోయ్ మద్దిల మా యావిడెందుకండీ “ అన్నాడు అయోమయంగా తలగోక్కుంటూ .

” ఎందుకా …? మొన్నామధ్యన చెరుకులోడేసుకుని చెల్లూరు వెళ్ళేవా ….సాయంత్రానికి లోడు దిగిపోయినా  ఇవాళ రేపు అంటూ  మూడ్రోజులు చెల్లూరులోనే వుండిపోయేవా …..

ఎందుకూ? అనేసరికి వాడు కంగారుపడిపోయి అయబాబోయ్ సిన్నయ్యగారో  అంటూ దణ్ణం పెట్టేసాడు.

‘ చచ్చింది గొర్రె ‘  అని నేను లేడీ రాజనాలలా వంకరనవ్వు నవ్వాను.

నే వెనక్కి తిరిగి చూళ్ళేదు కానీ నా తెలివి తేటలకీ  కార్య దక్షతకీ  మా అత్తగారు మురిసి ముక్కలయిపోయి వుంటారు .

“సర్లే నువ్వు మరీ ఏడ్చి చావకు….సంతకెళ్ళినప్పుడల్లా నీకు  రూపాయో రెండురూపాయలో ఇస్తానులే ఏ షోడాకాయో తాగుదువుగాని  . కానొరేయ్ ఈ సంగతి  మూడోకంటికి  తెలిసిందా ఆ తరవాత నా అంత చెడ్డది  ఈ భూ ప్రపంచలోనే వుండదు . తెలుసుగా కోపం వస్తే నే మనిషిని గాను “  అంటూ ముందుకి వంగి గట్టిగా కళ్ళెర్రజేసి పళ్ళుబిగించారు అత్తగారు . ఆవిడని ఆ ఫోజులో చూస్తే  గుక్కెట్టి ఏడ్చేవాడుకూడా గోళీసోడాలా కిసుక్కుమనాలిసిందే  . కానీ అబ్బులుగాడు మాత్రం వణికిపోతున్నట్టూ వంగి ..వంగి ,నంగి వినయాలు చూపిస్తూ ” అయ్యగారో నా పేణం పోయినంత ఒట్టండీ పిట్టమడిసికి కూడా తెలనీనండీ   ” అంటూ సూపర్ గా ఏక్టింగ్ చేస్తూ వెళ్ళిపోయాడు .

మర్నాడు సాయంత్రం దట్టంగా పౌడర్ రాసుకుని , గంజిపెట్టిన కాకీ నిక్కరూ , పొడుగుచేతుల తెల్ల జుబ్బా , భుజం మీద గళ్ళతువ్వాలుతో తుప్పట్టిన డొక్కు సైకిలు మీద టిప్పు టాపుగా వచ్చేసాడు అబ్బులు.

హడావిడిగా అరటిగెల నరకబోతుంటే ….. “ఆగరా ముహుర్తం చూడొద్దూ “ అంటూ అడ్డుపడ్డారు అత్తగారు.

ఏవైపునించి ఎవరొచ్చిపడతారో  అని దిక్కులుచూస్తూ ‘  ఇప్పుడు రాహుకాలాలు ముహుర్తాలూ అంటారేంటీ ఈవిడా ‘ అని కంగారు పడుతుంటే,  ప్పీ….ప్పి..ప్పీ..పి…  అంటూ మంగలి పొట్టిబ్రహ్మం సాధనకోసం తన సన్నాయి శృతిచేసుకోటం వినిపించింది. “ఆహా మంగళవాద్యాలు …..ఇంతకన్నా మంచి ముహుర్తం ఏవుంటుంది కానివ్వండి కానివ్వండి “ అంటూ తొందర పెట్టేసి, అరటిగెలా…గుమ్మడికాయలూ, కొబ్బరి బొండాలూ గోనెల్లో చుట్టేసి సైకిలుకి కట్టేసాం . మా అత్తగారు  కొత్త వ్యాపారానికి కొబ్బరికాయ కొట్టి నన్ను ఎదురు రమ్మని , పెళ్ళికొడుకుని  కళ్యాణ  మండపానికి సాగనంపుతున్నంత హడావిడి తో  లోడు సైకిల్ని పెరడు దాటించారు .

సంతరోజు మధ్యాహ్నం  అబ్బులుగాడికి అర్జెంటుగా కడుపునొప్పో కాలునెప్పో వచ్చేయటం . దాంతో రాజుగారో పేణం పోయేలావుందండోయ్ అని మళ్ళీ సూపర్ గా ఏక్టింగ్ చేసుకుంటూ పని ఎగ్గొట్టి పొలం నుంచీ పడుతూ లేస్తూ ఇంటికొచ్చేయటం , మేం ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం నరసమ్మకి ఏదో ఒక పని పురమాయించి దాన్ని  ఇంటికి వీలయినంత దూరంగా పంపించేయటం ( ఇంటిగుట్టు లంకకి చేటన్న సామెత లాగా….. సంత గుట్టు శంకిణీ కి తెలియకూడదు అన్నది అత్తగారి ఆర్డరు ), దొడ్లో పండిన కాయా పండూ  అబ్బులుగాడు గోతాంలో వేసుకుని సైకిలుకి కట్టుకుని చెక్కేయటం నిరాఘాటంగా నాలుగయిదు  సంతలపాటు జరిగాయి.

ఈ వంకన అబ్బులుగాడి డొక్కు సైకిలు కొత్త సీటూ, సైడు అద్దాలూ, చక్రానికి రంగు రిబ్బన్లూ , డైమండ్ లైటూ వంటి కొత్త సోకులు చేసుకుని రాజహంసలా తయారయింది . అవసరం మాదికాబట్టి అదంతా చూసీచూడనట్టూ ఊరుకున్నాం.  అబ్బులుగారి దర్జాకర్చులన్నీ పోనూ మా చేతిలోపడ్డ ఒక్కోరూపాయినీ చిల్లర శ్రీమహాలక్ష్మి అంటూ కళ్ళకద్దుకుని  అత్తగారి ఇత్తడి మరచెంబులో సీక్రెట్ గా దాచుకున్నాం .

ఇలోగా నరసమ్మ అనుమానాలూ ….ఆరాలూ…విసుర్లూ ….కసుర్లూ ఎక్కువయ్యాయి. మేం చూస్తుండగానే నాలుగు తపేలాలు చొట్టపడ్డాయి .
ఓరోజు అబ్బులుగాడు లబలబలాడుతూ వచ్చాడు . “అయ్యగారో మీ మూలంగా నాకు  సెడ్డ సిక్కొచ్చిపడిందండీ బాబూ ……నాగాలెక్కువెట్టేత్తనావ్ , జీతం తెగ్గొట్టేత్తాన్రోయ్ అని పెదరాజుగారు  పబ్లీకుగా పాలేర్లందరిముందూ గసిసేరిపాడేసారండీ బాబూ…. నాకు సెడ్డ నామర్దాగావుందండీ బాబూ….మీకూ ఆరికీ మద్దిన నేను ఇదయిపోతనాను “ అంటూ దండకం చదివేసాడు.

“పోన్లేరా  నువ్వు మరీ అంత ఇదవ్వకు”  అంటూ అత్తగారు వాడిని ఓదార్చి, “ఎలాగూ వచ్చేది వేసవికాలం కదా . ఇక కాయా కసరా ఎక్కడనిలబడతాయ్ . మళ్ళీ వానాకాలం రాగానే మొదలెడదాం . ఈసారి నూతి వెనకాల  మళ్ళుకట్టి ఆకుకూరలు కూడా వేద్దాం  …..ఏవంటావే? “ అంటూ  ఆరాగా అడిగేసరికి  నాకు పల్లకీ ఎక్కినంత ఆనందంవేసింది.  నువ్వో వెలుగు వెలిగే రోజు దగ్గరలోనే వుందేవ్ అని మనసు పిల్లకోతిలా గంతులేసింది .  అదంతా పైకి కనిపించనీకుండా …..  “అయ్యో… మీకన్నా నాకెక్కువ తెలుసా . మీరెలా చెపితే అలానే “ అంటూ ఆవిడని ఏకంగా ఏనుగే ఎక్కించేసాను  .

‘పని పడింది పది రూపాయలివ్వండి’  అంటూ ప్రతీ రూపాయీ అడిగి తీసుకోవటానికి అలవాటు పడ్డ  ప్రాణాలకి  ఇలా అనుకోకుండా చేతుల్లో చిక్కిన శ్రీ మహాలక్ష్మిని  చూస్తుంటే భలే ఆనందగావుంది. ఆశకు అంతులేదన్నది అందరికీ తెలిసిందేకదా …..

***

బొమ్మనావోళ్ళ కొట్లో డిస్కౌంటీ పెట్టేరట. మనమూ ఓ నాలుగు చీరలు కొనేసుకుందాం  అన్నారు అత్తగారు. మా కష్టార్జితాన్ని కళ్ళెదురుగా పెట్టుకుని.

వెనకిటికో వెర్రి వెంగళమ్మ గుడ్డుకోసం బాతును కోసేసిందంట అలావుంది మీరు చెప్పేది.  మనం ఈ డబ్బుని వడ్డీకి తిప్పుదాం . అపుడు అసలు బాతులా వుంటుంది  వడ్డీ గుడ్డులా వస్తూనే వుంటుంది అన్నాను . మరో ఆలోచనకి   అంకురార్పణ చేస్తూ…

మనం వడ్డీవ్యాపరం చేయ్యడమే హవ్వ…..! ఎక్కడయినా వుందా అంటూ బుగ్గలు నొక్కుకున్నారు  అత్తగారు . ఆవిడ సంతృప్తిగా తలాడించేలా ఒక్క ఉదాహరణయినా ఇస్తే బావుంటుందని నేను చరిత్ర తిరగేసాను…..

దానాలు చేసి దరిద్రులయిపోయినవాళ్ళూ,  అప్పులు తీర్చలేక అడవులు పట్టిపోయినవాళ్ళూ  తప్ప సుబ్బరంగా వడ్డీవ్యాపారం చేసుకుని వృద్దిలోకొచ్చిన మహారాజొక్కడూ కనిపించలేదు . ఔరా …నిజమే కదా అనిపించింది. అయిననూ సరే ……అనుకొని ,

రోజులు మారిపోయాయండీ ! కూర్చుని తింటే కొండలయినా కరిగిపోతాయ్….మా అమ్మగారి ఊర్లో బొజ్జ పంతులుగారే  వడ్డీ వ్యాపారం మీద నాలుగెకరాలు కొన్నారు ట …. ఆనాడు అప్పిచ్చేవాడే  లేకపొతే ఏడుకొండలవాడి కళ్యాణం జరిగేదా   …కాబట్టి ఇదీ ఒకరకమయిన పుణ్యకార్యమే.ఇలా ఒకదానికొకటి సంభంధం లేని  నూటొక్క వివరణలు  ఇచ్చేసరికి  మెరుస్తున్న కళ్ళతో  చూసారు  అత్తగారు. చదువుకున్న కోడల్ని తెచ్చుకున్నందుకు మొదటిసారి సంతోషించి వుంటారు అనిపించింది నాకు.  హమ్మయ్యా ఓ పనయిపోయింది అనుకుని….

ఇటు ఇంట్లోవాళ్ళకీ అటు వీధిలో వాళ్ళకీ తెలీకుండా డబ్బెలా గడపదాటించాలీ ….ఈ వ్యాపారానికి ఏజేంటుగా ఎవర్ని నియమించాలీ అని ఆలోచిస్తుంటే ….పనిలేక పళ్ళుకుట్టుకుంటున్న నరసమ్మ కనిపించింది.

వసుదేవుడ్ని తలుచుకుని నరసమ్మని పట్టుకున్నాను.  దాన్ని మెల్లగా దువ్వి,  మీ ఇంటి చుట్టుపక్కల ఎవరికి డబ్బు అవసరమో కనుక్కో…..అసలెన్నాళ్ళుంచుకున్నా పర్లేదు వడ్డీ మాత్రం నెలనెలా ఖచ్చితంగా ఇచ్చేయాలి . అసలు విషయం ఈ డబ్బు మాదనీ నీద్వారా  అప్పిస్తున్నామనీ , అప్పుతీసుకున్నవాడికి కూడా  తెలీటానికి  వీల్లేదు  అంటూ అన్నీ వివరంగా చెప్పేసరికి అది నన్నూ మా అత్తగారినీ మార్చి మార్చి చూసి, ” యాండీ ….ఈ కొంపలో కాపీ గిన్ని తోమలేక సచ్చిపోతన్నాను. ఆ డబ్బులేయో నాకిప్పిత్తే …..ఎండురెయ్యలో ఉప్పుసేపలో కొనుక్కుని  మీ ఈదిగుమ్మంకాడే  యాపారం ఎట్టుకుంటాను కదండీ ”  అంటుంటే మా అత్తగారు ముక్కుమూసుకుని …..చీ…చీ…అనేసారు.

అది మొహం చిట్లించుకుని ……రోజూ రాములోరి గుడిలోంచీ క్రమం తప్పక వినిపించే ” ఏ నిమిసానికి ఏమి జరుగునో  ఒవలూఇంచెదరూ …ఇది ఇసాదమును …..” అని ఆ పైన దానికి నచ్చినట్టూ పాడుకుంటూ ఎళ్ళిపోయింది .

మర్నాడు అది పట్టుకొచ్చిన కబురు విని మా అత్తగారు అంతెత్తున లేచారు….” ఏంటే…..ఆ చాకలి పోలమ్మకా ….చస్తే వీల్లేదు. అది ఒక్కనాడన్నా వేసిన బట్టలు వేసినట్టూ తేలేదు. నావి  కొత్తమాయని మూడు చీరలు మాయం చేసేసింది. పెద్దరాజుగారి పంచలయితే లెక్కేలేదు….ఇంకా దుప్పట్లూ , తువ్వాళ్ళూ రేవుకొకటయినా ఎగరగొట్టేది అందుకే కదా దాన్ని మానిపించేశాం . అదసలే లెక్కతెలీని మనిషి . పోయి పోయి దాని చేతిలో పోస్తామా ఠాట్ వీల్లేదు అనేసారు

ఇంకోరోజు ….నరసమ్మ  అక్క  కోడలు కుట్టుమిషను కొనుక్కోటానికి  అడిగిందనీ…..మిషను కుట్టి నెల నెలా తీర్చేస్తుందనీ నరసమ్మ చెపితే …హత్తెరీ వీల్లేదన్నారు. దాని మొగుడు ఉత్త తాగుబోతు మర్నాడే ఆ మిషను పట్టుకెళ్ళి తాక్ట్టుపెట్టి తాగేస్తే మనగతేం కావాలి అన్నారు .

ఓ వారం పాటు నరసమ్మ తీసుకొచ్చిన బేరాలేవీ అత్తగారికి నచ్చలేదు.  తలనెప్పిబేరాలు అంటూ  అందరినీ తిప్పికొట్టారు  .

అనవసరంగా డబ్బులు ఇంట్లో పెట్టుకు కూర్చోటం వల్ల ఇప్పటివరకూ ఎంత నష్టం వచ్చిందీ నే కాకిలెక్కలేసి   చెప్పేసరికి మా అత్తగారు ఆలోచనలో పడ్డారు .
ఆ తరవాతరోజు మా అంతట మేవే నరసమ్మని బ్రతిమాలి సాయంత్రానికల్లా డబ్బులు ఎవరికో ఒకరికి అప్పుగా ఇచ్చేయమనీ రేపటినుంచే వడ్డీ లెక్కేసుకుంటామనీ చెప్పి  మా కష్టార్జితాన్ని (ఒకటికి పదిసార్లు లెక్కపెట్టిమరీ) నరసమ్మ చేతుల్లోపెట్టి హమ్మయ్యా అనుకున్నాం .

మర్నాటినుంచీ నరసమ్మ పనిలోకి రాగానే నేనో అత్తగారో ఒక్కోసారి ఇద్దరూనో …మా డబ్బు అప్పుగా తీసుకున్న సదరు సాల్తీ యోగక్షేమాలు క్రమం తప్పక విచారించేవాళ్ళం (అప్పిచ్చువాడు వైద్యుడు అని ఇందుకే అన్నారేమో). రోజులు లెక్కపెడుతూ నెల గడిపాం . అసలుకంటే వడ్డీ ముద్దని ఎందుకన్నారో మాకు అనుభవంలో తెలిసి  ముద్దొచ్చే మా వడ్డీకోసం ఎప్పుడెప్పుడాని ఎదురుచూసాం . నెల దాటి వారం అయింది నరసమ్మ రోజుకో కథచెపుతుంది. ఆ కథలు వింటూ ఇద్దరం చెరోపక్కా దాన్ని వీలయినంత సాధిస్తూ ఉండగానే రెండో నెలా నిండిపోయింది. ” అబ్బే…దీని పద్ధతేం బాగోలేదు ” అని ఇద్దరం రహస్యంగా విచారించాం .

ఓనాడు దాన్ని కొట్టుగదిలోకి లాక్కుపోయి గట్టిగా నిలదీసి అడిగితే …….ఏమాత్రం భయం బెరుకూ లేకుండా ,   “ “కరుసయిపోయినియ్యండి  “అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేసి  చెంగు జాడించేసింది  .అంతేనా…”నాకన్నీ తెలుసులెండి “అంటూ అదోలా నవ్వింది.  అత్తగారూ నేనూ అయోమయంలో పడి కొట్టుకుపోతూ ఒకరికొకరం ఆసరాగా లేచి నిలబడ్డాం.

“ఓసి దొంగముచ్చుకానా  ! వడ్డీకి తిప్పమంటే  ఇది  వాడుకు దొబ్బిందేవ్ ” అనేసారు అత్తగారు కళ్ళింత చేసుకుని

” అలాగేవుందండోయ్” అని నేనూ వంతపాడేను .

“విశ్వాతఘాతకీ “ కోపంగా అన్నారు

నాకు నోరుతిరక్క “అవునవును “ అనేసాను

కొన్ని వడగాల్పూలూ …మరి కొన్ని నిట్టూర్పులూ అయ్యాకా …..అది పోగొట్టిన సామన్లూ, నూతిలో వదిలేసిన బాల్చీలూ,  మేం దానికిచ్చిన పాత చీరలూ  అది మమ్మల్ని కసురుకున్న కసుర్లూ, విసుర్లూ అన్నీ తవ్వుకున్నాం . ఇక నరసమ్మకి వెంటనే ఉద్వాసన పలికెయ్యాలని ఏకగ్రీవంగా నిర్ణయానికొచ్చేశాం  .

నెయ్యి ఊరకే ఇచ్చాం  అనుకుందాం , గుమ్మడికాయలూ అరటిగెలలూ అసలు కాయనేలేదు అనుకుందాం . ఈ నరుసుకి  మనం పూర్వ జన్మలో రుణపడిపోయాం అనుకుందాం  ‘’  అనుకొని , ఇద్దరం ఒకర్నొకరు ఓదార్చుకున్నాం .  చివరికి…. పోయిన మా కష్టార్జితాన్ని తల్చుకుని ‘ మనకి ప్రాప్తం లేదు ఏం చేస్తాం’  అని వేదాంతం చెప్పుకుని మాకొచ్చిన కష్టం గురించీ,  మేం కోరి తెచ్చుకున్న  నష్టం గురించీ ఎవరికీ చెప్పుకోలేం కాబట్టి  తేలు కుట్టిన దొంగల్లా …ఉష్…గప్చుప్ అయిపోయాం

***

వీధిలోంచి వస్తూనే ” నరసమ్మని  గుమ్మం తొక్కడానికి వీల్లేదన్నారట  . అది వీధిలో మీటింగు పెట్టి మరీ ఏడుస్తుంది.   ఏం చేసిందదీ ….ఎందుకు రావద్దన్నారూ ?” ఆరాగా అడుగుతున్నారు మాంగారు .

“అవును నేనూ అడుగుదామని మర్చిపోయాను ఎందుకు రావద్దన్నారూ …. ఏం చేసిందదీ  ?” అదే ప్రశ్నని  తిరగేసి అడిగారు అబ్బాయిగారు . కుక్కుటశాస్త్రం లోంచీ తలెత్తి ….

నేను కిటికీలోంచీ చూస్తే  అత్తగారు పక్కచూపులు చూస్తూ గోవిందనామాలు పాడుకుంటున్నారు గట్టిగా …..

వడ్డికాసులవాడా గోవిందా …..
వసుదేవ తనయా గోవిందా
గోవిందా హరి గోవిందా…. గోవిందా హరి గోవిందా….

హుమ్మ్మ్… మళ్ళీ నేనే  అత్తగార్ని ఆదుకోవాలి కాబోలు అనుకుని ,

“మిమ్మల్నే…..  ఒకసారి లోపలికొస్తారా ….” అని తలుపుచాటునుంచీ గోముగా పిలిచాను .

ఏడో చేప ఎందుకెండలేదని రాజుగారు అడుగుతున్నారు .

ఏదో ఒక కథ చెప్పాలిగా మరి !

.

మీ మాటలు

  1. హహ్హహ్హా.. బావుందండీ అత్తాకోడళ్ళ వ్యాపారానుభవం.. ఎప్పట్లాగే మీ ఇంట్లో మీ వెనకాలే తిరుగుతూ జరిగే కథంతా చూసేసాం. :)

    • లలిత says:

      చూస్తే చూసావు కానీ ఎవరితోనూ అనకు .మళ్ళీ అదొక ఆక్షేపణ

  2. భానుమతిగారికి మీకు చుట్టరికం వుందా? లేకపోతే ఆవిడ లలిత అన్న కలంపేరుగానీ వాడారా?

    అయితే ఒక్కచోట పంటికింద రాయి పడింది.. అత్తకోడళ్ళ దగ్గరకొచ్చి అబ్బులుగాడు “అయ్యగారో” అంటాడేమిటి?

    • లలిత says:

      అరిపిరాల గారు మీరు శ్రమపడయినా సరే వెనక్కెళ్ళీ మా ‘ తెల్లారగట్ల ప్రయాణం’ చివర్లో చూసారంటే అయ్యగారి పద్ధతి తెలుస్తుంది .
      భానుమతి గారు తప్ప ఎవ్వరూ పట్టించుకోలేదు కదండీ అత్తగారిని . దాంతో నేను ఇదయ్యి …….ఆ పాత్రని తోమి మెరిపిద్దామనీ …….అదండీ మరి !

    • వలలుడు says:

      రాచకుటుంబాలలోనూ, రాచసంప్రదాయాలు స్థిరంగా నిలబడ్డ తూర్పు వైపు పెద్దకులాల ఇళ్లల్లోనూ ఆడవారిని అయ్యగారనీ మగవారిని రాజుగారనీ, పంతులుగారనీ అనడం సంప్రదాయ సిద్ధంగా వస్తూంది.
      దీనికి చెల్లపిళ్ల వేంకటశాస్త్రి గారు రచించిన కాశీ యాత్ర తాజా ప్రచురణలో ఓ వివరణ ఉంది. సంపాదకులు సందర్భవశాన ఇచ్చిన ఫుట్ నోట్స్ ఇలా ఉంది:
      //క్షత్రియులు, వెలమలలో రాజకుటుంబాలలో స్త్రీలకు పేర్ల చివరన పురుషుల వలెనె అయ్య చేర్చి సంబోధించే ఆచారం ఉంది. దీనికి వేంశా(వేంకట శాస్త్రి) వేరొకచోట వివరణ ఇచ్చి ఉన్నారు. రాజభార్యలను నౌకర్లు, ఇతరులు అమ్మపదంతో సంబోధిస్తే అమ్మ బాబుకు పెళ్లాం అవుతుంది అనే ఆక్షేపణ వస్తుందిట, కనుక ఆ దోషం తొలగించుకోవడానికి స్త్రీల పేర్ల చివరన అమ్మ పదం కాక అయ్య పదం వాడడం మొదలుపెట్టారట. అయితే స్త్రీల పేర్ల చివరన అమ్మ రావడమే లోకాచారం కనుక (కొందరు) ఆ అలవాటు చొప్పున అయ్య పక్కన అమ్మని కూడా చేర్చి పిలవడంతో రాజకుటుంబాల స్త్రీలు – సీతయ్యమ్మ, చెల్లయ్యమ్మ, కొండయ్యమ్మ, నరసయ్యమ్మ – ఇలా వ్యవహరింపబడుతుండేవారు.//
      అంతరార్థాల సంగతి ఎలా ఉన్నా యథా రాజా తథా ప్రజా అన్నట్టు సంస్థానాలు ఎక్కువగా ఉన్న తూ.గోదావరి(కొంత ప్రాంతం), విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఈ పిలుపులు ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నట్టు నా పరిశీలన.

      • లలిత says:

        చాలా థాంక్స్ అండీ . చక్కని వివరణ ఇచ్చారు . ఏదో లోకాచారం అన్నట్టు ఫాలో అయిపోవటం తప్పితే దీనిగురించి నాకూ తెలీదు.
        పతంజలిగారి ‘ రాజుగోరు ‘నవలలోనూ , వంశీ ‘నల్ల ఎంకి తూము ‘ కథలోనూ ఈ ‘ అయ్యగారు ‘ పద ప్రయోగం వున్నా వివరణలేదు . ఇంకో విషయం రాజుల ఇళ్ళల్లో పేర్ల చివరే కాదు వరసల చివర కూడా అయ్య చేరుస్తారు ( అమ్మయ్య- వదినయ్య అలా )

  3. శ్రీనివాస్ పప్పు says:

    కధలు చెప్పడంలో పండిపోయారండీ సెబాసో

    • లలిత says:

      మీవంటి వారి ప్రోత్సాహం ఊరకే పోతుందా చెప్పండి మాస్టారు !

  4. హహహ బాగుందండీ.. అత్తగారు వారి బి.ఎ. కోడలు గారి కూరగాయల బిగినెస్ ప్లాన్ అలా బెడిసికొట్టిందనమాట :-)

    • లలిత says:

      వేణు , మరే……తమకి నవ్వులాటగా ఉందన్నమాట :(
      ధన్యవాదాలు ….మీ వ్యాఖ్యకి, మీ నవ్వులకి

  5. నైస్… బాగా రాశారు.

  6. Vainika says:

    “ఆవిడని ఆ ఫోజులో చూస్తే గుక్కెట్టి ఏడ్చేవాడుకూడా గోళీసోడాలా కిసుక్కుమనాలిసిందే ” : soooooooper…. :-)
    చాల చాల బావుంది …

  7. భలే పదునెక్కిందండీ మీ కలం!! చాలా బావుంది లలిత గారూ. జపాను బొమ్మ దగ్గర్నుంచీ.. కుక్కుటశాస్త్రం దాకా.. ప్రతీ వాక్యం గోలీసోడాలా కిసుక్కుమనిపించింది. మరింత బావుండబోయే రాబోయే కథ కోసం ఎదురుచూస్తున్నాను. అభినందనలు!!

  8. భానుమతి గారి కన్నా మీరే ఓ డిగ్రీ ఎక్కువ చదివినట్టున్నారు………..దహా.

    • లలిత says:

      అమ్మో…..ఎంత మాట ! ధన్యవాదాలు మాస్టారు .

  9. Sirisha says:

    ” యాండీ ….ఈ కొంపలో కాపీ గిన్ని తోమలేక సచ్చిపోతన్నాను. ఆ డబ్బులేయో నాకిప్పిత్తే …..ఎండురెయ్యలో ఉప్పుసేపలో కొనుక్కుని మీ ఈదిగుమ్మంకాడే యాపారం ఎట్టుకుంటాను కదండీ “
    పడి పడి నవ్వుకున్నాను లలిత గారు :-) ఎప్పటిలాగే hilarious !!!

    • లలిత says:

      సారీ శిరీష గారు మిమ్మల్ని పడగొట్టి నవ్వించినందుకు :)

  10. బావుంది . అత్తాకోడళ్ళ నిర్వాకం.

    • లలిత says:

      నిర్వాకం ……! బాగా చెప్పారు . ధన్యవాదాలండి

  11. లలితగారూ,
    ‘కంప్యూటర్ ముందు కూర్చొని ఏంటి ఇట్టా నవ్విద్ది అక్క’ అనుకుంటోంది మా లీల (పనమ్మాయి). నెలకొకసారి కాబట్టి సరిపోయింది. అయినా కొన్నాళ్ళకి ‘ మా అక్కకి పిచ్చి పట్టింది ‘ అని అందరికీ టాం టాం వేసేస్తే ప్రమాదమే. అర్జంటుగా లీలకి మీ కథలు చదివి వినిపించాలి. లేకపోతే నా పని కూడా సర్వమంగళమే.
    చాలా బాగా రాస్తున్నారు.

    • లలిత says:

      హ..హ….థాంక్స్ రాధ గారు
      మీ పేరు కొత్తగా అనిపించి , ఎవరా అని చూస్తే ….మీ బ్లాగు దొరికింది. అబ్బ ఎన్ని కథలో !
      మా అమ్మాయికి మంచి కాలక్షేపం దొరికింది …అవన్నీ చదివించుతాను .

      • లలిత గారూ,
        మొత్తం ఇంకా 30 కథలు ఉన్నాయి. బ్లాగులో పెడతాను. చదవమనండి పాపను.
        thanks
        రాధ

  12. venkat says:

    మామూలు గానె చాలాబావునది మీ post.

  13. వొడియాలమీద కాకులు వోలకుండా వుంటాయ్ ..
    మీ కథ చదివాక నవ్వులు ఆగకుండా ఉంటాయ్?:P

    ఒక్కటేమిటీ చాలానే ఉన్నాయ్ పంచ్ డవిలాగులు…
    అన్నట్లు అప్పిచ్చువాడు ” , ” వైద్యుడు…కదండీ?

    • లలిత says:

      ఏమోనండి . నేనలాగే చదువుకున్నాను .
      థాంక్స్ అండి :)

  14. బావుంది :)) కొన్ని చమక్కులు బాగా మెరిసాయి.

  15. Absolutely brilliant. అమ్మా లలితమ్మా .. మీ బ్లాగులో ప్రదర్శించినది వామనావతారమేననిన్నీ, ఇక ఇక్కడ త్రివిక్రమ విశ్వరూపం మొదలవుతున్నదనిన్నీ భావిస్తున్నాను.
    మీకు బహుశా అలవాటు లేదేమో గానీ, నాఖు మాత్రం నరసమ్మ భాగాలు చదివినంత సేపూ, పూర్తిగా అసందర్భంగా, కంచనగంగ సీరియల్లే కళ్ళముందు కదలాడింది. I am watching Indian TV too much!!

    • లలిత says:

      నారాయణస్వామిగారు .
      కాంచనగంగ సీరియల్ చూస్తారా అ……..మ్మో !
      మిమ్మల్ని ఇండియా లాక్కొచ్చి సన్మానం చెయ్యాలండీ బాబు . వా…………..మ్మో!

  16. “గుళ్ళూ గోపురాలూ కట్టిoచిన వాళ్ళగురించే చెప్పుకోటం మానేసినవాళ్ళు గుమ్మడికాయలగురించి ఎన్నాళ్ళు చెప్పుకుంటారు. ఊరికే మనం భుజాలు తడుముకోవటం తప్ప ”

    “ఈ వంకన అబ్బులుగాడి డొక్కు సైకిలు కొత్త సీటూ, సైడు అద్దాలూ, చక్రానికి రంగు రిబ్బన్లూ , డైమండ్ లైటూ వంటి కొత్త సోకులు చేసుకుని రాజహంసలా తయారయింది ”

    “ఆవిడని ఆ ఫోజులో చూస్తే గుక్కెట్టి ఏడ్చేవాడుకూడా గోళీసోడాలా కిసుక్కుమనాలిసిందే ”

    ఈ పాలి జరాలస్యం జేస్తిన్ :)
    భలే భలే..బాగుదండి :))

    • లలిత says:

      తృష్ణ గారు మీరు జరాలస్యం జేస్తే నేను చాలా ఆలస్యం జేస్తిని మీకు రిప్లై ఇవ్వటానికి .
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  17. వేలమూరి శ్రీరామ్ says:

    “ఆవిడని ఆ ఫోజులో చూస్తే గుక్కెట్టి ఏడ్చేవాడుకూడా గోళీసోడాలా కిసుక్కుమనాలిసిందే ” మా పిల్లలచేత చదివించానండీ ,, బాగా నవ్వుకున్నాం,, బాగా రాసారు ,అభినందనలు

    • లలిత says:

      శ్రీరామ్ గారు నా రాతలు మీకు నచ్చటం నా భాగ్యం . ధన్యవాదాలు

  18. Wanderer says:

    హాస్యాన్ని ఇంత చక్కగా రాసి ఒప్పించే రచయిత్రులు తెలుగులో తక్కువే.. భానుమతి గారు, మళ్ళీ మీరు. మీరు రాసేవన్నీ అపురూపంగా మళ్ళీ మళ్ళీ చదువుకుని నవ్వుకుంటూ ఉంటాను. “ఈదేసిన గోదారి, వెయ్యి కథలు – దాట్ల లలిత” అని AVKF.org లో పుస్తకం ఎప్పుడొస్తుందా అని వెయిటింగ్.

    • లలిత says:

      చాలా సంతోషమండీ . మీ అభిమానానికి ధన్యవాదాలు .వెయ్యి కథలా అమ్మో!!!

  19. చాల బావుంది అండీ! నవ్వి నవ్వి కడుపు నొప్పి వచిందండీ . మా అబ్బాయి అయితే కంగారు పడ్డాడు అమ్మ నీకు ఏమైంది , అలా నవ్వుతున్నావు. వాళ్ళ కి రేపు చదివి వినిపిస్తాను.

    • లలిత says:

      శారద గారు చాలా థాంక్స్ అండీ . మీరిలానే పదికాలాలు నవ్వుతూ వుండాలి కడుపు నొప్పెట్టేలా

  20. pallavi says:

    మల్లి అత్త గారి కధలు చదువుకొన్నట్టు ఉందండి.. ఆఫీసు లో పని చేస్తే ఒట్టు :(
    ఇంత బాగా రాస్తే ఎలా?
    ఘోషా అంటే స్వేఛ్చ లేకుండా ఉండటం అనే కోణం లో నే చదివాను ఇప్పటి వరకు..
    కానీ సొంత ఇంట్లో పని చేసుకుంటూ ఉండే సరదా జీవితం ఉంటుందని.. అత్త గారి తో కలిసుండడం కూడా బావుంటుందని అంతర్లీనంగా కనిపిస్తుంది మీ కధల్లో.. కొంచం కుళ్ళు పుట్టింది కూడా..
    మీకు బ్లాగ్ ఉందా ? కొంచం వెతికి చూసాను కానీ కనపడలేదు..
    ఈ ఫాంట్ లో టైపు చేయడం కూడా సరదాగా ఉంది.. అంతకు ముందు ట్రై చేస్తే సరిగా రాలేదు..
    మీ బ్లాగ్ అడ్రస్ కోసం, నెక్స్ట్ కధల కోసం వెయిటింగ్ :)

  21. G B Sastry says:

    శ్రీమతి లలితగారు
    మీకధాలని కీర్తి శేషులు శ్రీ చక్రపాణిగారు ఎక్కడున్నా చదవాలని చదివి తన ప్రోత్సాహములేకున్న శ్రీమతి భానుమతి గారంతా కధకురాలు తయారయిందని ఆనందంతో పాటు కాసింత ఉక్రోష పడాలని నా కోరిక అత్తగారి కధలకు సాహిత్య ఎకాడమి బహుమతి ఇచ్చింది కనక ఈ’ కొత్త గారి కధలకి’ సాహిత్యాభిమానుల అవార్డు అందాలని ఆశ.

  22. కె.కె. రామయ్య says:

    జి.బి.శాస్త్రి గారూ, సిన్నయ్య గోరికి (దాట్ల లలిత గారికి) సాహిత్యాభిమానుల అవార్డు అందాలనే మీ ఆకాంక్షకు నా సంపూర్ణ మద్దత్తు తెలుపుతున్నా. సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావాలండి.

Leave a Reply to S. Narayanaswamy Cancel reply

*