బొమ్మల చక్రం!

(కోనసీమ లోని అమలాపురం లో పుట్టిన సాయి బ్రహ్మానందం గొర్తి ప్రస్తుతం కాలిఫోర్నియా లోని cupertino లో నివసిస్తున్నారు. దాదాపు 40 కి పైగా కథలు రాశారు. ఆయన కథల పుస్తకం ” సరిహద్దు” 2012 లో విడుదల అయింది. బ్రహ్మానందం రాసిన కొన్ని కథలు ఇంగ్లీష్, హింది, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లోకి అనువాదమయ్యాయి. కథలతో పాటు 15 కు పైగా నాటికలు కూడా రాశారు. బ్రహ్మానందం రాసిన ” నేహాల” నవల కౌముది వెబ్ మాగజైన్ లో, మరో చిన్న నవల యథార్ధ చక్రం ప్రచురితమయ్యాయి. కర్ణాటక సంగీతం మీద రాసిన వ్యాసాల పుస్తకం ” త్యాగరాజ” త్వరలో విడుదల కానున్నది.} 
పిల్లలకి వేసవి శలవలిచ్చారు. రాత్రి పదిదాటింది. పగలంతా ఆడాడి అలసిపోయిన పల్లూ, బాబీలు మంచం మీద ఓళ్ళు తెలీకుండా పడుక్కున్నారు. బాబీ నిద్రలోకి  జారుకున్నాడని గ్రహించీ, మెల్లగా ఆ పిల్లాడి  చేతుల క్రిందనుండి పక్కకి జరిగింది రేసుకారు. ఒక్కసారి టైర్లు విదిలించుకుని, మెల్లగా భారీ కాయాన్ని తోసుకుంటూ అక్కడనుండి బయటకు జారుకుంది.
రేసుకారు ఇలా ప్రతీ రాత్రీ జారుకోవడం బార్బీకి కొత్త కాదు. మెల్లగా తనూ పల్లూ గుండెల మీదనుండి క్రిందకి జారి, ఒక్క అంగలో మంచం దూకి రేసు కారుని అనుసరించింది.
“బంగారు కోడిపెట్టా..హే హే” అని హుషారుగా పాడుకుంటూ వసారాలో తిరుగుతోంది రేసుకారు.  బార్బీ తన వెనకే ఉందన్న ధ్యాసే లేకుండా ఓ మూల నుండి మరో మూలకి రయ్యి రయ్యిమని వెళుతూ హఠాత్తుగా గుమ్మదగ్గర సడెన్ బ్రేకేసి ఆగిపోయింది. గుమ్మానికానుకొని ఎదురుగా బార్బీ కళ్ళెగరేస్తూ కనింపించింది.
“ఏంటి ఈ హుషారు?” అన్నట్లుగా కనుబొమ్మలెగరేసింది.  బార్బీని చూడగానే చిర్రెత్తుకొచ్చింది రేసు కారుకి.
“ఒక్క రోజయినా నా వెంట పడకుండా వుంటావేమోనని చూస్తాను. ఇవాళ కూడా..” అంటూ పళ్ళు కొరికింది.
“ఇదేమయినా నీ మేనమావిల్లా? ఈ ఇంట్లో నీకెంత హక్కుందో నాకూ అంతే ఉంది. ఇంకా చెప్పాలంటే నీకంటే కాస్త ఎక్కువే వుంది. అద్సరే గానీ, ఏంటి? రోజూ లేనిదివాళ ఇలా ఈ పాటలూ..పరుగులూ…?” విసురుగా అంది బార్బీ.
“ఓ అదా! నేను రెండ్రోజుల్లో హైద్రాబాదు వెళుతున్నాను, తెల్సా?” తలుపులెగరేస్తూ చెప్పింది రేసుకారు.
“హైద్రాబాదా? ఎందుకు?”
“ఎందుకేవిటి? నేనూ, బాబీ వెళుతున్నాం. నీకు తెలీదా? అమెరికానుండి బాబీ వాళ్ళ మావయ్య వస్తున్నాడు. ఆయన్ని రిసీవ్ చేసుకోడానికి బాబీ వాళ్ళ నాన్న వెళుతున్నాడు. అదీ సంగతి!” గెంతుతూ చెప్పింది రేసుకారు.
“బాబీ వాళ్ళ నాన్నెళితే, నీ కేంటి?”
“నీ బుర్రకి మేకప్పెక్కువయ్యి ఆలోచించన తగ్గిపోతోంది. బాబీ వాళ్ళ నాన్నతో వస్తానని గోల చేసాడు. నేను తోడు లేకుండా బాబీ ఎక్కడకీ కదలడు కదా?”
“అదా నీ బడాయి! ఒక్క పూట భాగోతానికి హైద్రాబాదు వరకూ ఒళ్ళు హూనమవ్వడం తప్ప ఏమీ లేదు. నేను చూడు. వచ్చే నెలలో పల్లూతో కలిసి వాళ్ళ పెద్దమ్మగారింటికి రాజమండ్రీ వెళుతున్నాను.”
బార్బీ చెప్పింది విని నవ్వాపుకోలేకపోయింది రేసు కారు.
“ఏంటి రాజమండ్రీకింత బిల్డప్పా? గొప్పలు చెప్పుకోడం మీ ఫారిన్ వాళ్ళకి అలవాటే కదా? ఇంతుంటే అంత చెప్పుకుంటారు. నేను మీ రాజమండ్రీ మీదుగానే ట్రైన్లో హైద్రాబాదెళుతున్నాను. నువ్వెప్పుడయినా ట్రైన్ మొహం చూసావా? నీకో విషయం తెలుసా? ట్రైన్లో ఏ.సీ ఉంటుంది,” రేసుకారు వెటకారంగా అంది.
“అబ్బో! ఏం తిరిగాడండీ ఈ డొక్కు చెక్రాలేసుకొని. మాకీ ట్రైన్లూ, బస్సులూ కాదు. ఏకంగా విమానంలో ఇరవై గంటలు ప్రయాణం చేసి అమెరికానుండి వచ్చాను. అన్నట్టు నీకు విమానం అంటే తెలుసా? గాల్లో ఎగురుతుంది. అందులో కూడా ఏ.సీ ఉంటుంది! ” బార్బీ వెక్కిరింతలు చూసి ఉడుకుమోత్తనం వచ్చింది రేసుకారుకి.
“ఉండు. నీ పని చెప్తా?” అంటూ బార్బీనీ వెంబడించింది. బార్బీ రేసుకారుకి దొరక్కుండా ఆగదంతా అటూ, ఇటూ పరిగెడుతోంది.
వీళ్ళిద్దరి గొడవా ఎంతో శ్రద్ధగా, నిశ్శబ్దంగా వింటున్నాయి షోకేసులోవున్న కొండపల్లి బొమ్మా, లేపాక్షి బొమ్మా, ఏటికొప్పాక బొమ్మలూ.  రాత్రి పది దాటితే చాలు ప్రతీరోజూ ఈ రేసుకారు రణగొణ ధ్వని వీళ్ళకి మామూలే! గతిలేక అలా గుడ్లప్పగించి చూస్తాయి. ఒకప్పుడు ప్రతీ ఇంటా తమ ఆధిపత్యమే ఉండేది. ఇప్పుడా పరిస్థితీ, వైభోగమూ లేదు. గాజు గోడల మధ్య జీవితం బందీ అయ్యింది. బాధగా తలదించుకుంది కొండపల్లి బొమ్మ.
ఇది గమనించిన లేపాక్షి బొమ్మ – “రోజూ చీకటి పడుతోందంటేనే చికాకేస్తోంది. వీటి గోల భరించలేకుండా ఉన్నాం. ఎప్పుడు చస్తారో ఏమిటీ? ఈ పీడ విరగడయ్యేట్లా లేదు,” పళ్ళు కొరుకుతూ అంది.
“నీ కోపం అర్థమయ్యింది. మనమేం చెయ్య గలం చెప్పు? ఈ గాజు తలుపు దాటి వెళ్ళలేం. బ్రతికున్నన్నాళూ ఈ గోల తప్పదంతే!” నిరాశగా అంది కొండపల్లి బొమ్మ.
ఎప్పటికయినా ఆ రేసుకారూ, బార్బీలపై పగ తీర్చుకోపోతామా అని ఎదుర్చూస్తున్నాయా బొమ్మలు.
రేసుకారుకి అందకుండా బార్బీ ఆ గదంతా తిప్పిస్తోంది. పరిగెత్తే ఓపిక లేక హాల్లో టీవీ పైన చతికిలపడింది బార్బీ. నేలమీద వెంబడించిన రేసుకారు టీవీ టేబులెక్కలేక అక్కడే కూలబడింది.
ఇదంతా చూసి కిసుక్కున నవ్వాయి, షోకేసులో బొమ్మలు. ఒక్కసారి విసూరుగా తలతిప్పి చూసింది రేసుకారు. వేంటనే షోకేసి బొమ్మలు తలదించుకున్నాయి.
“ఏంటా పకపకలూ?  ఒక్క సారి బయటకి రండి తడాఖా చూపిస్తాను.”
“అత్త మీద కోపం దుత్త మీదన్నట్లు బార్బీ మీదున్న ఉక్రోషం మామీద చూపిస్తావేమిటి? మీ ఆట చూసి నవ్వొచ్చింది. ఆ మాత్రం నవ్వకూడదా?” కొండపల్లి బొమ్మ నవ్వాపుకోలేక అంది.
“భలే చెప్పారు. ఏదో ఈ ఇల్లంతా వాడి బాబు సొత్తన్నట్లు మాట్లాడతున్నాడు. హక్కుల గురించి మాట్లాడాల్సొస్తే అందరికీ ఉన్నాయి…”
“అబ్బో హక్కులట హక్కులు. ఎంతసేపూ మేకప్పు చేసుకోవడమే ప్రపంచమనుకునే నువ్వూ, నాలుగ్గోడల మధ్యా బందీలా ఆ షోకేసే ప్రపంచమనుకునే మీరా హక్కుల గురించి లెక్చర్లిస్తున్నారు. ఈ టీవీ పైనుండి బార్బీ ఎలా దిగుతుందో చూస్తాను? ఈ రాత్రంతా ఇక్కడే ఉంటాను,” కోపంగా ఊగిపోతూ అంది రేసుకారు.
“హలో! నాకేం పరవాలేదు. హాయిగా ఇక్కడ పడుక్కోగలను. తెల్లారితే నీ సంగతే చూసుకో! ఇంట్లో వాళ్ళ కాలికడ్డం వస్తే ఓ తన్ను తన్నుతారు.” బార్బీ అంది.
“ఏవిటర్రా?ఎందుకొచ్చిన గొడవలు?మనంఉన్నదినలుగురం.ఇలా కొట్టుకుంటూ…” లేపాక్షి బొమ్మ అనునయించబోయింది.
“చ! ఆపండెహా! మీ సూక్తిముక్తావళి.. మీరెవరు నాకు చెప్పడానికి? ”  కటువుగా అంది రేసుకారు.
“నీకెందుకొచ్చింది చెప్పు. వాళ్ళ గొడవేదో వాళ్ళు పడతారు. మనం ఈ షోకేసి దాటి వెళ్ళనప్పుడు ఎవరెలా చస్తే మనకేంటి చెప్పు? అనవసరంగా వాళ్ళ మధ్య తలదూర్చద్దు.” కొండపల్లి బొమ్మ మెల్లగా లేపాక్షి బొమ్మతో అంది.
“పోనీ మనవాళ్ళేనని చెప్పానంతే?” లేపాక్షి బొమ్మంది.
“మనవాళ్ళేంటి? వాళ్ళు పరాయి దేశం నుండి వలసొచ్చారు. వాళ్ళకి మన సంస్కృతీ అవీ తెలీవు. అయినా మనం ఎక్కడుంటున్నాం? ఇదంతా తెలుగు గడ్డ మహత్యం! ఇహ నోరెత్తావంటే నాలుగిచ్చుకుంటాను,” కొండపల్లి బొమ్మ గట్టిగా హెచ్చరించింది.
“హలో! వలసా, గిలసా అంటూ ఏంటో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? మీరు మాత్రం వలసగాళ్ళు కాదా? అయినా తెలీకడుగుతాను? ఈ భూమ్మీద అందరవూ వలసొచ్చినాళ్ళే! కాబట్టి నోరు మూసుక్కూచోండి. లేదంటే..?” ఆవేశంగా అంది రేసుకారు.
“ఎందుకు ప్రతీ దానికీ అలా పెడర్థాలు తీస్తావు?” లేపాక్షి బొమ్మకి కోపం వచ్చింది.
“ఏంటి? మాటంటే మాటని రెచ్చిపోతున్నావు? నా సంగతి నీకు తెలీదు.” అంటూ పక్కనే నేల మీదున్న బంతిని బలంగా తన్నింది. ఆ అదురుకి అది ఎగురుకుంటూ వెళ్ళి షోకేసు అద్దమ్మీద పడింది. ఆ విసురుకి షోకేసులో ఉన్న లేపాక్షి, కొండపల్లి బొమ్మలు పక్కకొరిగాయి.
ఆ చప్పుడు విని పక్క గదిలో పడుక్కున్న బాబీ వాళ్ళ తాత “ఎవరూ?” అంటూ గట్టిగా అరుస్తూ వసారా వైపుగా వచ్చి లైటు వేసాడు. షోకేసులో బొమ్మలు పడిపోవడం చూసి పిల్లి వచ్చిందేమో అనుకుంటూ, అటూ ఇటూ పరికించి లైటార్పకుండానే తనగది వైపుగా వెళిపోయాడాయన, లైటు వేసుంటే ఎవరయినా మరలా వచ్చే అవకాశముందని ఆ బొమ్మలన్నీ మౌన ముద్ర వహించాయి.
***
తెల్లారగానే గదులన్నీ వూడ్చడానికొచ్చిన పనిమనిషి పొరపాటున రేసు కారు బొమ్మమీద కాలేసింది. గబుక్కున పడబోయి పక్కనే ఉన్న సోఫాని ఆనుకుంది.. రేసుకారు ఒక చక్రం విరిగి పక్కన పడిపోయింది.
చక్రం విరిగిన బాధతో ఒక్కసారి హారన్ కేక పెట్టింది రేసు కారు. ఆ కేకకి ఉలిక్కిపడ్డాయి షోకేసులో బొమ్మలు. నిద్రలేస్తూనే కారు కోసం వెతుకుతున్న బాబీ హాల్లో చక్రం ఊడిన కారుకేసి చూస్తూ బావురుమన్నాడు.
ఆ విరిగిన కారుబొమ్మనే చేతిలో పెట్టుకు తిరిగాడు. ఆ రాత్రి రేసుకారు వసారాలోకి రాలేదు. బార్బీ కూడా. రోజూ ఎంత కొట్టుకున్నా రేసుకారు కుంటుతూ నడవలేక నడవడం చూసి బాధ కలిగింది బార్బీకి.  చక్రం విరిగిన కారుని తీసుకొని హైద్రాబాదు బయల్దేరడానికి సిద్ధమయ్యాడు బాబీ.
***
ఆ రాత్రి బార్బీకి నిద్ర పట్ట లేదు. రేసుకారెలా ఉందోనన్న దిగులే ఎక్కువయ్యింది. ఓ రాత్రి వేళ ఏం చెయ్యాలో తోచక దిగాలుగా వసారాలోకి వచ్చి, నేల మీద కూలబడింది బార్బీ! కొంతసేపయ్యాక పక్కగదిలో చప్పుడయితే అటుగా వెళ్ళింది.
చీకట్లో ఏదో కదిలినట్లయ్యింది.  అక్కడ రేసుకారుని చూసి  ఆశ్చర్యపోయింది బార్బీ. చక్రం ఊడిన రేసుకారు  రేసుకారు బాధగా మూలుగుతూ వుంది.  చూసి జాలిపడింది బార్బీ!
“ఎలావుందిప్పుడు?”
“బానే వుంది.” ముక్తసరిగానే జవాబిచ్చింది రేసుకారు.
“నువ్వేటిక్కడ? హైద్రాబాదు వెళ్ళలేదా?”  గుర్తుకొచ్చి అడిగింది బార్బీ. రేసుకారు నెమ్మదిగా చెప్పింది.
“బయల్దేరబోయేముందు బాబీ నాన్న మాట విని నన్ను వీధి గుమ్మం వద్దే వదిలేసాడు. మీరనుకున్నట్లు నేను హైద్రాబాదు వెళ్ళలేదు.” తలదించుకొని నెమ్మదిగా చెప్పింది రేసుకారు.
“మరి ఇంతసేపూ ఎక్కడున్నావు?” బార్బీకి సందేహమొచ్చింది.
“గుమ్మం దగ్గర మెట్లదగ్గరే కూలబడిపోయాను. బాబీ నన్ను వదిలి వెళ్ళాడన్న బాధొకవైపూ, చక్రం విరిగిందన్న బాధ ఇంకోవైపూ – ఉదయం నుండీ అక్కడే ఉండిపోయాను….ఈ చక్రం మరలా వచ్చి మరలా మీ మధ్య తిరుగుతానా అనిపిస్తోంది” రేసుకారు గొంతు మారింది.
నడవడానికి ప్రయత్నిస్తూ, మూడు చక్రాలతో కుంటుకుంటూ నడవలేక ఓ మూల చతికిలబడింది.
ఇదంతా గమనిస్తూ ఉన్నాయి షోకేసులో బొమ్మలు. వాటికీ రేసుకారు పరిస్థితి అర్థమయ్యింది. ఇదే మంచి అదననుకొని కొండపల్లి బొమ్మ చొరవతీసుకొని ఇలా అంది.
“రేసుకారూ, నీ పరిస్థితి చూస్తే బాధ కలుగుతోంది. నేను నీకు సహాయం చెయ్యగలను. నీ చక్రం సరి చేసి, నువ్వు మామూలుగా తిరిగేలా చెయ్యగలను.”
ఈ మాటలు విని రేసుకారుకి అంత దుఃఖంలోనూ నవ్వొచ్చింది.
“ఉన్న చోటునుండి కదల్లేరు కానీ, నాకు సాయం చేస్తారా? ఎవరైనా వింటే నవ్వి పోతారు. మీరేదో నా మీద కక్ష సాధిద్దామని ఇలా దెప్పి పొడుస్తున్నారు. లేకపోతే మీరు సాయం చెయ్యడమెమిటి? “
“లేదు. లేదు నీ మీద కక్ష అలాంటివి కాదు. నిజంగానే నీకు సాయం చేద్దామనే చెప్పాను..” కొండపల్లి బొమ్మ మరోసారంది.
“పోనీ వాళ్ళేదో సాయం చేస్తామంటే,  ఆ పొగరేమిటి? అయినా నువ్వెవర్నీ నమ్మవు. ఇలాగే కుంటుకుంటూ ఈ వసారాలోనే పడుండాలి. బాబీ వచ్చాడంటే నిన్నో మూల పారేసి వేరే బొమ్మ కొనుక్కుంటాడు,” రేసుకారుతో అంది బార్బీ.
రేసుకారు ఏమనుకుందో ఏమో, కొండపల్లి బొమ్మ సాయానికి అంగీకారం చెప్పింది.
“మీరిద్దరూ ఎలాగయినా ఈ షోకేసు డొరు పక్కకు లాగితే మేం బయటకొస్తాం. ఆ పక్కగది అటకపైన పెట్టెలో మా వాళ్ళు చాలామందే ఉన్నారు. మా అవయవాలకి గాయమయితే  అతికే మందు వాళ్ళ దగ్గరుంది. అది రాస్తే చిటికలో అన్నీ సర్దుకుంటాయి. ఆ మందు పేరంటబ్బా? నోట్లో నానుతోంది కానీ గుర్తు రావడంలేదు…!” అనంటూ మధ్యలో ఆగిపోయింది,  కొండపల్లి బొమ్మ.
“అదే…దాన్ని క్విక్‌ఫిక్స్ అంటారు.” చటుక్కున అందిచ్చింది లేపాక్షి బొమ్మ.
“అవును. ఆ క్విక్‌ఫిక్సే!  ఇప్పటికే దెబ్బ తగిలి చాలాసేపయ్యింది. వేంటనే మందు వేసి కట్టు కట్టకపోతే  కష్టం. “
షోకేసు తలుపులెలా తీయడామని ఆలోచనలో పడింది రేసుకారు. బార్బీ, రేసుకారు ఎంతో శ్రమపడి మొత్తానికి స్టూలుని షోకేసు దగ్గరగా జరిపారు. చివరకి బార్బీ షోకేసు తలుపులు తెరిచింది.  ఒక్క ఉదుటున కొండపల్లి బొమ్మా, దానివెనుకే లేపాక్షి బొమ్మా, వారి తోటి బొమ్మలూ బయటకి దూకాయి.
వడి వడిగా అడుగులేసుకుంటూ పక్క గదిలో అటకవైపు చూసాయి. అటకమీదున్న బొమ్మల్ని గట్టిగా  పిలిచింది కొండపల్లి బొమ్మ.  అటకమీద పెట్టె తెరుచుకొని బొమ్మలూ,  వెనుకనే లక్క పిడత సైన్యమూ బిల బిలా వచ్చి క్రిందకి చూసాయి. కొండపల్లి బొమ్మ విషయం చెప్పింది. వేంటనే కొయ్య గుర్రం బొమ్మ పెట్టెలో వున్న క్విక్‌ఫిక్స్తెచ్చింది. దాంతో రేసుకారు చక్రం అతకడం ఆపరేషన్ మొదలెట్టారు. ఓ గంట తరువాత ఎలాగయితేనే ఊడిన చక్రాన్ని అతికించారు.
“ఇప్పుడే మందు రాసాను. ఇది ఆరి చక్రం అతుక్కోడానికి చాలా సేపే పడుతుంది. అంతవరకూ నువ్వు కదలకూడదు. తరువాత కదిలినా మెల్లగా నడవాలి కానీ, ఈ గాయం మానే వరకూ జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడా పరుగులూ అవీ తీయకూడదు. తెలిసిందా?” కొండపల్లి బొమ్మ చెప్పింది. వాళ్ళు చేసిన సాయానికి రేసుకారు మనసు ద్రవించింది.
“మీరు నా చక్రం అతికించి నాకెంతో సాయం చేసారు. మీ మేలెప్పటికీ మరవలేను. ఇన్నాళ్ళూ మిమ్మల్ని కించపరుస్తూ తక్కువ చేసి మాట్లాడాను. క్షమించండి,” అంటూ కొండపల్లి బొమ్మవైపు చూసింది.
“పరవాలేదు. చెప్పానుగా మనందరం ఒకే జాతికి చెందిన వాళ్ళం. మనం ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకోపోతే ఎలా? ఒక్క విషయం రేసుకారూ?నువ్వనుకున్నట్లు మాది ఆవారా జాతి కాదు.  ప్రస్తుతం నీకు పిల్లలమధ్య పాపులారిటీ, డిమాండూ ఉండచ్చేగాక!  గతంలో మాది పెద్ద వంశమే! ఈ వైభవాలూ అవీ మేమూచూసాం. నీకు తెలుసో తెలీదో పూర్వం దసరాకీ, సంక్రాంతికీ బొమ్మల కొలువు పెట్టేవారు. మేము లేని ఇల్లుండేది కాదు. మమ్మల్ని జనాలు ఎగబడి చూసేవారు. వయసుతో సంబంధంలేకుండా మాపై ప్రేమ చూపించేవారు. ఆ రోజులే వేరు. ఓడలు బళ్ళు అవుతాయి;బళ్ళు ఓడలవుతాయి. ఇదే కాల చక్ర మహిమ!,” అంటూ మనసులోమాట చెప్పింది కొండపల్లి బొమ్మా. మిగతా బొమ్మలూ తమ తమ పూర్వ చరిత్రని చెప్పాయి.
“చెప్పానుగా! నాకు మీ గురించి తెలీదు. మాది ప్లాస్టిక్ వంశం. మేం పక్క దేశాల్నుండి వలస వచ్చాం. మాదే గొప్ప జాతీ, మేమే ఎంతో ఆధునికంగా బ్రతుకుతామన్న భ్రమలో ఉన్నానిన్నాళ్ళూ! మాకు మీ చరిత్ర తెలీదు. తెలిసిందల్లా, మీకు ఈ సమాజంలో ఎక్కడా చోటు లేదన్న విషయమొక్కటే.  అది చూసే మిమ్మల్ని తక్కువగా మాట్లాడాను,” అంటూ కంట తడి పెట్టుకుంది రేసుకారు.
“జరిగిపోయింది కదా? ఇహ బాధపడడం అనవసరం. ఏదేమయినా మనమందరం ఒకటే! రేసూ! ఒక్క విషయం గుర్తుంచుకో! ఈ మనుష్యుల్ని నమ్మొద్దు. ఎప్పుడు దేని మీద ఇష్టపడతారో, ఎప్పుడు తిరస్కరిస్తారో వాళ్ళని పుట్టించిన దేవుడు కూడా చెప్పలేడు. అతిగా నమ్మడం మనకే మంచిది కాదు,”  అనంటూ కంటనీరు కారుస్తున్న రేసుకారుని కొండపల్లి బొమ్మ అక్కున చేర్చుకుంది.
మిగతా బొమ్మలూ రేసుకారు భుజం తట్టాయి. బొమ్మలన్నీ షోకేసులోకి తిరిగి వెళ్ళడానికి సిద్ధపడ్డాయి.
***
రెండ్రోజుల తరువాత బాబీ వాళ్ళ మావయ్యతో కలిసి ఇంటికి తిరిగొచ్చాడు. అమెరికానుండి బాబీ మావయ్య ఒక రేడియో కంట్రోలు కారు బహుమతిగా ఇచ్చాడు. పల్లూకి మాట్లాడే మరో బార్బీ బొమ్మా, ఇంకా చాలా బొమ్మలు పట్టుకొచ్చాడు. బాబీ కొత్త కారు మోజులో రేసుకారుని పట్టించుకోడం మానేసాడు.
‘ఈ బాబీయేనా తనని ఎంతో అపురూపంగా చూసుకున్నది? ఒక్క సారి చక్రం వూడితే నేను పనికి రాకుండా పోయానా?’  అని వాపోయింది రేసుకారు.
రేడియోకంట్రోల్ కారు ముందుకీ వెనక్కీ వేగంగా తిరగడమూ, ఏదైనా అడ్డొస్తే చటుక్కున పక్కకు తిరగడమూ, ఎత్తైన వాటిపైకి బలంగా ఎక్కడమూ – ఇవన్నీ చూసి అవాక్కయ్యింది రేసుకారు. మిగతా బొమ్మల్లా కాకుండా తను ఎంతో వేగంగా ఎక్కడకి కావల్సివస్తే అక్కడకి వెళ్ళగలను అని అనుకునేది. ఈ రేడియో కంట్రోల్ కారు తనకంటే మించి పోయింది. దీన్ని చూస్తే తన మొహం ఏ పిల్లాడూ చూడడు. మెల్లగా తనూ కొండపల్లి బొమ్మల్లా తయారవుతుంది. ఇదంతా తలచుకుంటేనే భయమేసింది రేసుకారుకి.
రేడియో కంట్రోల్ కారుకి మిగతా బొమ్మలంటే చులకన.  అమితమైన వేగంతో మిగతా బొమ్మల్ని ఢీకొని వాటికి నరకం చూపించేది. ఆ కారొచ్చాక పాత బార్బీకి, రేసుకారుకీ చాలా సార్లు గాయాలయ్యాయి.  కొండపల్లి బొమ్మా, మిగతా బొమ్మలకీ అదే పరిస్థితి. వసారాలో అడుగుపెట్టడం మానేసాయి.
ఎలాగయినా ఈ రేడియో కంట్రొలు కారు ఆటకట్టించాలని మిగతా బొమ్మలన్నీ  కృత నిశ్చయంతో, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాయి. దానికి రాకాసి కారని నిక్‌నేం పెట్టాయి.
“మనం తొందరపడి ఏమీ చెయ్యద్దు. ఆ రాకాసి కారుతో గొడవ పడకుండా గడుపుదాం. అందరూ దాని ప్రతి చర్యా గమనించండి. . ఈలోగా ఈ రాకాసి కారు పీడ ఎలా వదిలించుకోవాలన్నది మేం ప్లాన్ చేస్తాం. సరేనా?” కొండపల్లి బొమ్మ ఆదేశించింది.  అందరూ సరే నన్నారు.
కొండపల్లి బొమ్మ ప్రతిపాదన అందరికీ నచ్చింది. రేసుకారూ, బార్బీ ఏం చెయ్యాలని ప్లాన్ వేసుకున్నాయి.
***
కొత్త బార్బీ వచ్చాక పాత బార్బీ కేసే చూడ్డం మానేసింది పల్లూ. ఎలాగయినా కొత్త బార్బీ పని పట్టాలని నిశ్చయించుకుంది బార్బీ. రేసుకారు సాయం కోరింది. నాలుగు రోజుల తర్వాత పల్లూ రాజమండ్రీ ప్రయాణానికి సిద్ధమవుతుండగా మెల్లగా ఎవరూ చూడకుండా బేక్‌పాక్ లోకి చేరాయి బార్బీ, రేసుకారూ. పల్లూ వాళ్ళ పెద్దమ్మ ఇంట్లో ఎలాగయినా మాట్లాడే బార్బీని హత మార్చాలి. ఇదీ ప్లాను. కొండపల్లి బొమ్మ, మిగతా బొమ్మలు వారించినా బార్బీ వినలేదు.
కానీ  వెళ్ళిన రెండ్రోజులకే తిరిగొచ్చేసింది పల్లూ. వస్తూనే పెద్దమ్మిచ్చిన బొమ్మలన్నీ వాళ్ళమ్మకి చూపించింది.
“అమ్మా! ఈ చైనా బొమ్మలు చూడు. ఎంత బావున్నాయో! పెద్దమ్మ నాకోసం తెప్పించిందట. ఈ రైలు బొమ్మా చూడు. ఎంత బావుందో? ఈ సీతారాముల విగ్రహాలూ భలే బావున్నాయి. వీటికి డ్రెస్సులు కూడా బాగా నప్పాయి.” అంటూ మొత్తం తెచ్చిన బొమ్మలన్నీ అక్కడ పరిచి బ్యాగ్ ఖాళీ చేసింది పల్లూ.
ఇది చూసి షోకేసు బొమ్మల మొహాలు మారిపోయాయి. ఎక్కడా రేసుకారూ, బార్బీల జాడే లేదు. ఏమీ అర్థం కాలేదు వాటికి. ఒకటికి రెండు సార్లు పరికించి చూసాయి. బార్బీ, రేసుకారూ రాలేదా? అంటే పల్లూ వాళ్ళ పెద్దమ్మా ఇంట్లోనే చిక్కుకుపోయారా?
ఇంతలో షోకేసు తలుపు తీసినట్లు చప్పుడయితే తలెత్తి చూసాయి. ఎదురుగా పల్లూ! కొండపల్లీ, లేపాక్షీ మిగతా బొమ్మల్ని షోకేసు వెనక్కి నెట్టి, ముందు వరసలో పెద్దమ్మిచ్చిన సీతారాముల బొమ్మలు పెట్టింది పల్లూ.
ఈ చర్యకి ఒక్కసారి అవాక్కయ్యాయి షోకేసు బొమ్మలన్నీ.
కొత్తగా వచ్చిన సీతారాముల బొమ్మల్ని చూసి మనవాళ్ళే అనుకున్నాయి. తీరాచూస్తే అవి వేరే భాషలో మాట్లాడుకుంటున్నాయి. వాటిని చూసి నవ్వాగింది కాదు లేపాక్షి బొమ్మకి. ఆ నవ్వుకి కారణం ఏమిటని మిగతా బొమ్మలడితే, “ఆ రాముడూ, సీతా బొమ్మలు చూడు. చిన్న చిన్న కళ్ళూ, చవిటి ముక్కూ! చూడ్డానికి ఇక్కడి వాళ్ళల్లా లేరు.” అంటూ పగలబడి నవ్వుతూ అంది.   మిగతా బొమ్మలూ గట్టిగా నవ్వాయి.
ఆ చైనా బొమ్మలు కోపంగా కళ్ళెర్ర జేస్తే, వచ్చే నవ్వుని ఆపుకున్నాయి ఆ బొమ్మలు.
***
చైనా బొమ్మలూ, రాకాసి కార్ల రాకతో తమ బ్రతుకులన్నీ మారిపోయాయి. రేసుకారూ, బార్బీ ఇహ ఈ ఇంటికి రావు. పాతబడిపోయాయని వాళ్ళు ఏ చెత్తబుట్టలోనయినా పారేసుండచ్చు. లేదా పల్లూనే ఆవతల విసిరేసుండచ్చు. ఏ విషయమూ తెలీదు. వీటికంతటికీ కారణం ఆ రాకాసి కారూ, మాట్లాడే బార్బీ! తమ అస్తిత్వానికే ఎసరు తెచ్చాయి ఈ చైనా బొమ్మలు. ఎలాగయినా వాటి అంతం చూడాలని నిర్ణయానికొచ్చాయి కొండపల్లీ, లేపాక్షి బొమ్మలు. అలా చేస్తేనే బార్బీ, రేసుకారు ఆత్మలకి శాంతి లభిస్తుందనుకున్నాయి.
ఆ రాత్రి టీవి చూస్తున్న బాబీకి వాళ్ళమ్మ పాల గ్లాసివ్వడం చూసింది కొండపల్లి బొమ్మ. పొరపాటున చేయిజారి పాలన్నీ పక్కనే ఉన్న రాకాసి కారు మీద పడ్డాయి.
“టీవీ చూస్తూంటే నీకస్సలు ఒళ్ళు తెలీదు. ముందా కారుని గుడ్డ తెచ్చి తుడు. తడి తగిలితే బాటరీలు చస్తాయి!” అంటూ బాబీ అమ్మ  విసుక్కోడం వింది కొండపల్లి బొమ్మ.
ఇది చూడగానే చటుక్కున బుర్రలో వెలిగింది. వేంటనే అటకమీదున్న బొమ్మలకి కబురంపింది. అందరూ ఓ మూల సమావేశమయ్యాయి.  ఏం చెయ్యాలో మిగతా బొమ్మలన్నింటికీ చెప్పింది.
“రేపు రాత్రి బాబీ పడుక్కునే సమయానికి అందరం అతని పడగ్గది చేరుకోవాలి. ఈలోగా ఈ లక్క పిడతలన్నీ శక్తి కొద్దీ నీళ్ళు మోసుకొస్తాయి. అందరం ఆ తలుపు వెనకాల  వేచుందాం. రాకాసి కారు మంచం దిగి రాగానే ముందు గుర్రం బొమ్మ  ఢీకుంటుంది. వెనుకనుండి ఈ లక్క పిడతలు రాకాసి కారుపై నీళ్ళొంపేయాలి. ఆ దెబ్బకి దానికి ఊపిరాడకూడదు. ఈలోగా మేమందరం వెనుకనుండి వచ్చి ఎదుర్కుంటాం.”
“ప్లాను అంతా బానే వుంది. అంత పెద్ద కారు ఈ నీళ్ళు పోస్తే చచ్చిపోతుందా?” అనుమానం వెలిబుచ్చాయి లక్కపిడతలు.
“తప్పకుండా! బాబీ వాళ్ళమ్మ పాలొలికితే ఈ రాకాసి కారు పాడవుతుందని చెప్పగా విన్నాను. పాలంటే ఏవిటి? తడే కదా? తడంటే నీళ్ళే కదా? కాబట్టి నీళ్ళు తగిలితే చచ్చే అవకాశముంది. అందుకే మన లక్కపిడతలు ఎంతమంది వుంటే అంతమందిని తరలించుకు రండి,” అని తన ప్లాను చెప్పింది.
వాళ్ళందరూ ఆ మర్నాడు పగలంతా భారంగా గడిపారు. ఎప్పుడు రాత్రవుతుందాని ఎదురుచూస్తున్నారు.
***
ఓ రాత్రి వేళ రాకాసి కారు ఎప్పటిలాగే మంచం దిగి హాల్లోకి బయల్దేరింది. తమ పధకం ప్రకారం కొయ్య గుర్రం ఎదురొచ్చి ఢీకుంది. వెనుకనుండి లక్కపిడతలు నీళ్ళొంపాయి. ఈ హఠాత్పరిమాణానికి ఒక్కసారి ఉలిక్కిపడింది రాకాసి కారు. వళ్ళంతా తడిసిపోయింది. ఊపిరాడక గిలగిలా కొట్టుకుంది. ఆలా కొట్టుకుంటూ పక్కనే ఉన్న గ్లాస్ టేబుల్ని కొట్టుకుంది. ఆ శబ్దానికి ఒక్క సారి ఉలిక్కిపడి లేచాడు బాబీ! చీకట్లో అతనికి ఏమీ కనిపించలేదు. చూసుకోకుండా లక్కపిడతల్ని తొక్కు కుంటూ హాల్లోకి వెళ్ళాడు. తలుపు బలంగా తీయబోయి వెనక్కి నెట్టాడు. దాని వెనుకే కొండపల్లీ, లేపాక్షి బొమ్మలున్నాయి.
అది ఆ పిల్లాడు గమనించలేదు.
***
ఆ మర్నాడు ఉదయం బాబీ వాళ్ళ పెద్దమ్మ దగ్గర పనిజేసే నౌకరొచ్చాడు. వస్తూ పల్లూ బొమ్మలు మర్చిపోయిందంటూ బార్బీనీ, రేసుకారుని తీసుకొచ్చాడు. పల్లూ వాళ్ళమ్మ ఆ బొమ్మల్ని వసారా టేబిల్ మీద పెట్టింది.
బయటకి రాగానే రేసుకారూ, బార్బీ షోకేసు వైపు చూసి ఆశ్చర్య పోయాయి. కొండపల్లీ, లేపాక్షి బొమ్మల స్థానంలో కొత్తగా వేరే బొమ్మలొచ్చాయి. తమ మిత్రులేమయ్యారాని ఆత్రంగా బాబీ గదివైపు పరిగెత్తాయి. అక్కడా కనిపించలేదు. అటక గది వైపూ వెళ్ళి చూసాయి. అక్కడా లేరు.  చివరకి పెరటివైపున్న చెత్త కుండీ దగ్గరకెళ్ళి చూసాయి.
అక్కడ ముక్కలైపడున్నాయి లక్క పిడతలూ, మిగతా బొమ్మలూ! కొండపల్లీ, లేపాక్షి బొమ్మలు మాత్రం కనిపించలేదు.
ఇల్లంతా గాలించాయి. చివరకి వసారా గదిలో చేరుకొని దీనంగా షోకేసు వైపు చూసాయి. కొత్త చైనా బొమ్మల కేసి చూడలేకపోయాయి.
రేసుకారుకీ, బార్బీకీ ఏం జరిగిందో అస్సలు అర్థం కాలేదు. ఏం జరిగిందో అడుగుదామనుకున్నా మిగిలిన చైనా బొమ్మలకి భాష తెలీదు. ఎప్పటికయినా షోకేసు బొమ్మలు తిరిగొస్తాయని ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నాయి! ఇద్దరికీ కొండపల్లి బొమ్మ మాటలు గుర్తుకొచ్చాయి – “…కాలం శక్తి ఇంతా అంతా కాదు…”.
నెల్లాళ్ళ తరువాత మాట్లాడే బార్బీ, రాకాసి కారూ, బార్బీ, రేసుకారు గుంపులో చేరాయి.
“గేమ్ బోయ్” వీడియో గేమ్ చేతిలో ఉంటే కాలమే తెలియడం లేదు, బాబీకీ, పల్లూకీ.

***

మీ మాటలు

  1. Indian Toystory? చెప్పాలనుకొన్న సంగతి బాగుంది. కానీ సంభాషణల నిడివి ఎక్కువై చదివించే గుణాన్ని తక్కువ చేసింది. పనికట్టుకొని కథ చదివినా పూర్తిగా అనుభూతి చెందలేకపోయాను. This is my honest opinion and I am sharing it because I know you don’t take it personally:-)

  2. ఈ కధ పూర్తిగా చదవాలంటే చాలా సహనం కావాలి. ఇప్పటికి మూడు సార్లు ప్రయత్నించా. ప్రతి సారీ కొద్ది కొద్దిగా ముందుకెళ్ళా గానీ, పూర్తిగా చదవలేకపోయా. రీడర్ గా నేను ఫెయిల్.

మీ మాటలు

*