చలం వారసత్వం నిజంగా అందుకున్నామా ?

chalam
చలం కేవలం రచయిత కాదు. ఒక సాహితీ విప్లవం. ఒక సామాజిక ఉద్యమం.
నిర్ధిష్టమైన prescribed విలువల్లో కుంచించుకుపోతున్న మానవతలోని ప్రేమతత్వాన్ని, సత్యశోధనని తన రచనలతో ఉద్దీపనం చేసిన ఋషి. ప్రపంచ సాహిత్యంలోని నవీనపోకడలతో ధీటుగా తెలుగు రచనల్ని చేసి, తెలుగువారికి కాకుండా పోయిన ఒక తపస్వి.
మనమే ఒప్పుకోలేని మనలోని నిజాల్ని మనకు పరిచయం చేసిన చలాన్ని అర్థంచేసుకుంటే మనలోని వికారాల్ని, మకిలిని మనం అంగీకరించాలనే భయంతో కావొచ్చు, అతన్నే కాదన్నాం. ఎన్నో సంవత్సరాల విమర్శలు, వ్యక్తిగత ధూషణలు,అభాండాల మధ్యన చలం ఇంకా తన రచనలతో ఒక్కోతరాన్నీ కుదుపుతూనే ఉన్నాడు. సమాజానికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నాడు.
చలం తరువాత ఎందరో రచయితలు వచ్చారు. ఎన్నో వాదాలు పుట్టాయి. సమాజంలో ఎంతో మార్పు జరిగిందని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పటికీ చలం పేరు ఒక వివాదమే. ఇప్పటికీ చలం వేడివేడి చర్చలకు మూలమే. ఈ పరిణామాల దృష్ట్యా చలం సమకాలీన సమాజానికి రిలవెంట్ అనడంలో సందేహం లేకపోయినా, “చలం ప్రస్తుతం ఎంత రిలవెంట్?” అనే ప్రశ్న ఖచ్చితంగా అవసరం. దానికి సమాధానం కావాలి.
రెండోది చలం వారసత్వం గురించి. పాఠకులుగా, వ్యక్తులుగా చలం వారసత్వాన్ని ప్రతితరంలోనూ కొందరు అందిపుచ్చుకుని చదువుతూ, అనుభవిస్తూ,ప్రశ్నిస్తూ, పోరాడుతూనే ఉన్నారు. తెలుగు సమాజం మాత్రం ఇంకా చలాన్ని ఎలా ఓన్ చేసుకోవాలో తెలీని తికమకలోనే ఉంది.
నిజానికి ముఖ్యమైన ప్రశ్న సాహిత్యానికి సంబంధించింది. చలం తత్వాన్ని, దార్శనికతని,సత్యాన్వేషణని, శోధనని, శైలిని, శిల్పాన్ని, విషయాల్ని కొనసాగించిన రచయితలు ఎవరైనా ఉన్నారా అనేది. నిన్న వడ్డెరచండీదాస్, ఈరోజు కాశీభట్ల వేణుగోపాల్ వంటివారు ఏదో ఒక రూపంలో కొంత చలాన్ని తలపించినా, చలం వారసత్వాన్ని ఆపాదించేంత విశాలత్వం రచనలద్వారా, వ్యక్తిత్వాల ద్వారా వెలిబుచ్చారా అనేది ప్రశ్నార్థకమే.
అందుకే, ఒక సమాజంగా తెలుగు వారు చలం వారసత్వాన్ని అందుకున్నారా? తెలుగు రచయితల్లో చలం వారసత్వాన్ని కొనసాగిస్తున్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అనేవి ముఖ్యమైన ప్రశ్నలు. సమాధానాలు ఉన్నాయో లేవో తెలీని ప్రశ్నలు. చర్చకు నాందిగా మాత్రం ఖచ్చితంగా పనికొచ్చే ప్రశ్నలు.
తాంబూలాలు ఇచ్చేశాం….ఇక మీదే ఆలస్యం….

మీ మాటలు

 1. “చలం తత్వాన్ని, దార్శనికతని,సత్యాన్వేషణని, శోధనని, శైలిని, శిల్పాన్ని, విషయాల్ని కొనసాగించిన రచయితలు ఎవరైనా ఉన్నారా?”
  తత్వం, దార్శనికత, సత్యాన్వేషణ, శోధన ఇంతవరకు విడిగా, శైలి శిల్పం విడిగా చూడాలనుకుంటాను. ది స్పిరిట్ ఆఫ్ చలం చాలామందిని ప్రభావితం చేసింది. కొంత అపవాదులున్నా కొ.కు. కూడా వారి ప్రభావంతో కథలు రాశారు అని విమర్శకుల అభిప్రాయం. ఇక శైలి శిల్పాన్ని అనుకరించే ప్రయత్నం చాలామంది చేశారు, కొంతమంది ఆ శైలి శిల్పాలకి కొత్త సొగసులు కూడా అద్దారు (మంచికో చెడుకో). చెప్పొచ్చేదేమిటంటే కవిత్వం రాయాలనుకున్నవాణ్ణి శ్రీశ్రీ, కథ రాయాలనుకున్నవాణ్ణి చలం ప్రభావితం చెయ్యకపోతే ఆ రాస్తున్న వ్యక్తి రాయడానికి సరిపోయినంత చదవలేదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇప్పుడున్న రచయితల్లో చలం వారసులు లేరు అనచ్చు కానీ చలం ప్రభావం పడనివాళ్ళు ఉన్నారని చెప్పడం మాత్రం కష్టమే..

 2. mythili says:

  చలం అత్యంత ప్రత్యేకమయిన ఎన్నో సౌందర్యాల ,విషాదాల సమాహారం. గంధర్వలోకం నుంచి దారి తప్పివచ్చినవాడు ..ఆ సంగీతం మనుషుల గొంతులలో ఎక్కడ పలుకుతుంది..?

 3. హ హ చలం
  చలం తెలుగు సాహితీలోకంలో ఎన్నటికీ ఆరని చందనం/కాష్టం

  చలం శైలి శతదళాలున్న పద్మం వంటిది. ఆ తరువాత సాహితీవేత్తలలో ఒకటో రెండో రేకలు కనిపిస్తాయితప్ప, చలం సంపూర్ణ వ్యక్తిత్వం కనిపించదు. ఎందుకంటే చలం చలమే కనుక. చలం సాహిత్యంలో కనిపించే భావుకత వంశీ కథల్లో, తర్కం రంగనాయికమ్మ రచనల్లో, వ్యంగ్యం రావిశాస్త్రి, పతంజలి రచనల్లో, తిరుగుబాటు బుచ్చిబాబు, గోపీచంద్ లలో “నాకు ” కనిపించాయి. యండమూరి కొన్ని చోట్ల చలం శైలిని అనుకరించినట్లుగా అనిపిస్తూంటుంది. చలం ఒక్కోసారి జనాల్ని ఉడికించటానికి చేసిన వ్యాఖ్యలు చలానికి మరో పార్శ్వం.

  ఇంతమందిని మూటకట్టుకొన్న చలం అనే ఒక వ్యక్తి ఒక Ancient Alien అంతే. (history channel to వస్తున్న ఒక సీరిస్.) యుగానికి ఒక్కరే వస్తుంటారు అలాంటి వాళ్ళు.

  బొల్లోజు బాబా

 4. sarada says:

  ఇప్పటివరకూ చలం లోని అన్ని పార్శ్వాలు స్పురుసించిన రచయితలు ఎవ్వరూ కనీసం ఆయన అంతగా కాక పోయినా ఒక 20% ఐయినా ఆయన శైలి ని ఆపాదిచుకున్నవారు ఎవ్వరూ కనిపించలేదు ఆయనకు ఆయనే సాటి ఆయనని రీప్లేస్ చేసే రచయితలు ప్రస్తుతానికి ఎవరూ లేరని అనుకుంటునాను.ముఖ్యంగా ఆయన భావుకత,విశ్వజనీనమైన ప్రేమ , దార్శనికత ప్రస్తుత రచనల్లో కనిపించటం కొంచెం కష్టమే.అసలు ఆయన వారసత్వం తెసుకోవటానికి భయపడుతున్నాం.ఎక్కడ సమాజం పలచన చేస్తుందో అనేటువంటి భయం ఈ రోజుకీ మనం చలాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేదని నా అభిప్రాయం.
  .

 5. manjari lakshmi says:

  ఇక్కడ ఈ discussion చూసే వరకూ నేను కొ.కు. కొంత, గోపీచంద్, బుచ్చి బాబులు ఎక్కువగా చలం లాగే రాసారని అనుకునేదాన్ని. ఎవరన్నా చలంతో వీళ్ళకున్న సంబంధాన్ని విడమర్చి రాస్తే చదవాలని ఉంది.

 6. చక్రి says:

  అందుకుంటాం..ఇస్తే ..:p

మీ మాటలు

*