ఒక సావిత్రి కథ

“సావిత్రి బతికింది.. ‘గాడ్ ఈజ్ గ్రేట్;..!” అన్నాడు శీను శీను ఒకప్పుడు ఆఫీస్‌బాయ్. ఇప్పుడు ఎక్‌స్ట్రా  సప్లయర్. బాగానే సంపాదించాడనటానికి నిదర్శనం అతను “వ” ఏరియాలో కట్టుకున్న ఇల్లే.

ఆ ఇల్లుని షూటింగ్‌లకి అద్దెకిస్తున్నాడంటే ఎంత ‘పోష్’గా కట్టాడో అర్ధమవుతుంది. రోజుకి అన్నీ కలుపుకుని ఇరవైవేలు అద్దెలు. నెలకి కనీసం ఇరవైరోజులు షూటింగ్‌లు జరుగుతుంటాయిట.. ఈ ‘ట’ లన్నీ ఎవరో చెప్పినవి కాదు. శీను చెప్పినవే. నాతో అబద్ధం ఆడడు.  కారణం సుమారుగా మేమిద్దరం కొంతకాలం ‘మలర్‌కోడి మేన్షన్’లో కలిసి వుండటమే.

“నాకర్ధం కాలేదు శీను, సావిత్రికి ఏమయిందీ?” ఆశ్చర్యంగా అడిగాను.

“దేవుడా! మీరెప్పుడు బాగుపడతారు గురూజీ? ఎప్పుడు చూసినా మీ లోకంలో మీరుండడమే గాని కళ్లు తెరిచి చుట్టూ చూడరు కదా! సావిత్రి సూయిసైడ్ ఎటెంప్ట్ చేసి మూడురోజులయింది .. బతుకుతుందనే ఆశ ఎప్పుడో చచ్చిపోయింది. చిత్రంగా బతికింది” తల కొట్టుకుని అన్నాడు శీను.

“ఆత్మహత్యకి ఎందుకు ప్రయత్నం చేసిందీ?” అడిగాను.

“తెలిస్తే గొడవే వుండదుగా! బహుశా మీరడిగితే ఏమన్నా చెబుతుందేమో. నేను ఎన్నిసార్లు అడిగినా ‘బ్లాంక్’గా నా వంక చూస్తుంది గానీ పెదవి విప్పట్లేదు.”

నాకు సావిత్రి చాలాకాలం నించి తెలుసు . కుటుంబ వివరాలు తెలీకపోయినా ‘మనిషి’ గురించి తెలుసు. టి.నగర్ కన్నమ్మపేట ప్రాంతంలో వుండేది. ఆకట్టుకునే రూపం, వినయంగా, మృదువుగా మాట్లాడటం ఎవరికైనా ఆమెను గుర్తుండేట్టు చేస్తాయి. మేము చారీ స్ట్రీట్‌లో వుండగా చాలా సార్లు ఆమెని వెజిటబుల్ మార్కెట్లో చూశాను.
“ఇదేంటీ… మీరు కూరలకి రావడం?” అని ఆశ్చర్యంగా నన్ను ఓ నాడు పలకరించింది.

“నేను మీకు తెలుసా?” అనడిగాను.

“ఎందుకు తెలీదు? మీరు ఎక్కువగా డాక్టర్ గోపాలకృష్ణగారి దగ్గరుంటారనీ పాటలు రాస్తారనీ బాగా తెలుసు.అందుకే అడిగాను. రచయితలై కూడా…. ” ఆగింది. “రచయితలు తిండి తినరా? మిగతావాళ్ల సంగతైతే నాకు తెలీదు గానీ, కూరగాయలు నేను ‘ఎంచు’కుంటేనే నాకు తృప్తి.  పల్లెటూరివాడ్ని కదా.. తాజావి ఎంచుకోగలను. ఇంతకీ మీరేం చేస్తారూ?” అడిగాను.

“సినిమాల్లో హీరోయిన్ అవుదామని వచ్చాను. వచ్చాను అనేకంటే అమాయకంగా తీసుకురాబడ్డానని చెప్పాలి. అఫ్‌కోర్స్, ఇక్కడికి వచ్చిన వాళ్లంతా ఇలాగే అంటారనుకోండి. తీరా వచ్చాక హీరోయిన్ కాదు కదా హీరోయిన్ చెలికత్తెగా కూడా వేషాలు దొరకలేదు. కవిగారూ, ఇంకో విషయం తెలుసా.. ఇది ‘పద్మవ్యూహం’లాంటిది.. లోపలికి రావడమే కానీ బైటికి పోవడం కుదరదు. అందుకే ఇక్కడే ఉండిపొవల్సి వచ్చింది. నా పేరు సావిత్రి. మహానటి సావిత్రికీ నాకు పేరులోనే సాపత్యం తప్ప  మిగతా ఏ విషయంలోనూ పోలిక లేదు. ప్రస్తుతం గుంపులో గోవిందం లాగా క్రౌడ్‌లో కనిపించడమో, లక్కు దొరికినప్పుడు ఒకటో అరో డైలాగులు చెప్పే చి…న్ని పాత్రలు వెయ్యడమో చేస్తున్నా !” నవ్వుతూ అంది.

కొంతమంది నవ్వితే ‘హృదయం’తో నవ్వినట్టు వుంటుంది. సావిత్రిదీ హార్టీ స్మైలే… ‘ప్లాస్టిక్’ నవ్వు కాదు.

“మంచిది” అన్నాను. అవాళ నిజంగా నాకు పనుంది. తొందరగా ఇంటికెళ్తే గానీ పాట పూర్తి కాదు.

“మీరు చాలా బిజీ అని తెలుసు. మీరంటే నాకు చాల ఆభిమానం. ఎందుకంటే మాది మీ వూరి దగ్గరి వూరు కనుక. పేరు అడక్కండి. సీక్రెట్.. వస్తా!” అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది.

*

శారదా స్టూడియోలో పాటకి ‘సెట్’ వేసారు. మా డైరెక్టరుగారు కారు పంపి మరీ నన్ను సెట్‌కి ఆహ్వానించారు. చిత్రీకరించబోయేది నా పాటే.

లైటింగ్ ఎరేంజ్‌మెంట్ జరుగుతోంది. హీరోయిన్‌గారూ, హీరోగారూ ‘ఆత్మస్థుతి  – పరనిందా’ కార్యక్రమమలో తలమునకలై వున్నారు. హాయిగా సిగరెట్ తాగుదామని బయటికి పోతే.. ఓ చెట్టు కింద దేవకన్యలు కనిపించారు. దెవకన్యలంటే గ్రూప్ డాన్సర్లు. నిజంగా చెబితే  వాళ్ల ప్రతిభ అపారం. కాలం కలిసి రాక హీరో, హీరోయిన్ల వెనక నృత్యం చేస్తూ తెరని నిజంగా అలంకరించేది వీళ్ళే.

వాళ్లలో ఒకామె సైలెంటుగా పుస్తకం చదువుకుంటోంది. ఆ పుస్తకం పేరు చూడగానే నాకు మతిపోయింది. అయాన్ రాండ్ రాసిన “అట్లాస్ ష్రగ్డ్’. మైగాడ్ అయాన్ రాండ్‌ని చదివే డాన్సరా? పరీక్షగా చూస్తే సడన్‌గా జ్ఞాపకం వచ్చింది.  ఆమె సావిత్రి అని.

“సావిత్రిగారూ.. బాగున్నారా?” నేనే పలకరించాను. తలతిప్పి చూసి ఒక్క గెంతులో లేచి, “మీరేనా.. మీరేనా పలకరించిందీ!”

అన్నట్టు ఈ చిత్రసీమలో చాలా  హిపోక్రసీలు వున్నాయి. ఎంత పరిచయస్థులైనా కొన్ని ‘ముసుగులు’ వేసుకునే మాట్లాడతారు. ఓపెన్‌గా ఉండటం అంటే ఏందుకో ఇక్కడి పెద్దలకు గిట్టదు.

“నేనే. నేనే!” నవ్వాను.

“బస్.. రేపటికల్లా  హాట్ హాట్ న్యూస్. ఫలానా రైటర్ ఫలానా ఎక్‌స్ట్రాతో మాట్లాడింది దేనిగురించీ అని! సిద్ధంగా ఉన్నారా?” పకపకా నవ్వి అడిగింది. ఆమె అన్నదాంట్లో ఒక్కటి కూడాఅసత్యం కాదు. రూమర్లు తమట తాము పుట్టవు. పుట్టిస్తారు.

“అయాన్‌రాండ్‌వి ఇంకేమైనా చదివారా?” అడిగా.

“ద ఫౌంటేన్‌హెడ్ చదివాను. అందులో ‘టూహే’గా వెయ్యాలంటే మన గొల్లపూడివారే పర్‌ఫెక్ట్ అనుకుంటాను. అబ్బా.. భలే గుర్తుచేశారండి.” సంబరంగా అన్నది.

“ఇంకెవరి రచనలంటే ఇష్టం?” అడిగా.

“హెరాల్డ్ రాబిన్స్ కార్పెట్ బేరర్స్, వేర్ లవ్ హాస్ గాన్, నెవర్ లవ్ ఏ స్త్రేంజర్.. ఓ .. బోలెడు. అలాగే హాన్‌సు యిన్ ది  ది మౌంటేన్ యీజ్ యంగ్. సొమర్‌సెట్ మాం గారి కేంక్స్ ఎండ్ ఏల్ . ఎన్నని చెప్పనూ..” చెప్పలేనంతా ఉత్సాహగ్నా చెప్పింది.

ఓ అరగంట ఎలా గడిచిందో కూడా తెలీలేదు.

ఆమె అన్నట్టుగానే ఓ కామెడీ నటుడు (అప్పటికి వచ్చి సంవత్సరం కాలేదుగానీ బాగా పైకొస్తున్నవాడు) “ఏంటి గురువుగారూ.. ఇంతసేపు వున్నారూ! పిల్ల బాగానే వుందిగా సెట్ చేశారా?” అని అదేదో పెద్ద జోకు అన్నట్టు వంకరగా నవ్వాడు. సీరియస్‌గా అతనివంక చూసి, “పిల్ల బాగానే వుంది. ఆ పిల్ల చదివే పుస్తకాల్లో వందో వంతుకూడా చాలామంది చదివి వుండరు.. మేము మాట్లాడుకున్నది సాహిత్యం గురించి హాస్యనటులుగారూ!” అన్నా.

“అలాగా! ‘ఆ’ సాహిత్యం గురించేమో అనుకున్నాలెండి!” అన్నాడాయన. నవ్వొచ్చింది. ఎవరితోనైనా మాట్లాడొచ్చు. అతిచనువు తీసుకుని నానా చెత్త మాట్లాడేవాళ్లతో ఎవరైనా ఏం మాట్లాడగలం.

*

ఓ థియేటర్లో హాలీవుడ్ క్లాసిక్స్‌ని వరసగా వారం పాటు ప్రదర్శించారు. అక్కడా సావిత్రి కలిసింది. అప్పుడే చెప్పింది. బి.ఎ. డిస్కంటిన్యూ చేసిందనీ, స్వంతంగా చదువు మొదలెట్టిందనీ.. స్వయంకృషితో ధారాళంగా ఇంగ్లీష్ చదవటం, వ్రాయడం (వ్యాసాలు) మాట్లాడటం నేర్చుకుందనీ..

“డిగ్రీ  పూర్తి చేసి ఏ కాలేజీలోనైనా లెక్చరర్‌గా చేరొచ్చుగా. ” అన్నాను.

“అంత దురాశ లేదులెండి.. ఎందుకో చదువు ఆగింది. లెక్చరర్‌గా పాఠాలు చెప్పడంకంటే నిరంతర విధ్యార్థిగా చదవడంలోనే హాయి వుంటుంది. కాదూ?” అన్నది. ఆ ‘కాదూ’ అని కొద్దిగా దీర్ఘం తియ్యడం నాకు ఎంత మధురంగా వినిపించిందో?

*

మళ్ళీ మేం పెద్దగా కలవలేదుగానీ ఒకటి రెండుసార్లు కలిసినప్పుడు బ్రీఫ్‌గానయినా ‘ద ఫైనల్ డయాగ్నసిస్’ గురించీ, ఖుర్రాతులైన్ హైదర్ వ్రాసిన ‘అగ్నిధార’ గురించీ మాట్లాడినట్టు గుర్తు. సావిత్రి అత్మహత్యా ప్రయత్నం  నిజంగా నన్ను షాక్‌కి గురి చేసింది. ఎందుకిలా?

విజయా హాస్పిటల్లో ఉందని సీను చెప్పాడు. సాయంత్రం అక్కడీకి వెళ్లాను. బెడ్‌మీద నిస్తెజంగా పడుకుని వుంది సావిత్రి. పక్కన ఎవరో ఆడమనిషి సావిత్రి కంటే పెద్దది. నన్ను చూసి లేచి పక్కకి వెళ్లిపోయింది.

” ఏం సావిత్రి, ఎందుకిలా చేశారని అడగను. ఆ వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. మరోసారి ఇలాంటి ప్రయత్నం చెయ్యనని మాత్రం మీరు మాట ఇవ్వండి..!” అన్నాను.
బొటబొటా కన్నీళ్లు కార్చింది గానీ ఒక్క మాట మాట్లాడలేదు.

“కనీసం మిమ్మల్ని ఓ చిన్న మాట ఇమ్మని అడగటానికైనా తగనా?”చిన్నబుచ్చుకుని అడిగాను.

“క్షమించాలి. నేను చెప్పలేను. చెబితే నా గుండె పగిలిపోతుంది…!” బావురుమంది. కాస్సేపు ఏడ్చి,” సినిమాల్లోనూ, కథల్లో మా చదువుతాం, చూస్తాం. కవిగారూ.. నా వొళ్లమ్ముకుంటూ నా కన్న కొడుకుని దూరంగా పెట్టి చదివిస్తున్నాను. నా నీడ వాడి మీద పడ్డా వాడికి చెడేగానీ మంచి జరగదని పుట్టిన మూడోనెలలోనే వాడ్ని మా చుట్టాలింట్లో వుండేట్టు, పెరిగేటట్టూ ఏర్పాటు చేశా.. ఇప్పుడు వాడికి పద్ధెనిమిదేళ్లు. నా చుట్టాలుండేది తాంబరంలో. దూరంనుంచి చూడటమేగానీ, ఏనాడూ నేను వాడికి ఏమౌతానో ఎప్పుడూ చెప్పలా..

అయ్యా. నాలుగు రోజుల క్రితం వాడు ‘రమ’ ఇంట్లో వ్యభిచారం నేరం మీద పట్టుబడ్డాడు. పద్ధెనిమిదేళ్ళ వెధవ..! ఆ ‘రమ’ ఇంట్లోనే నేను చాటుమాటుగా డబ్బు సంపాయించి వీడికి పంపేది. ఎలాగోలా కేసు కాకుండా సప్లయర్ సుబ్బరాజు వాడ్నీ, రమని కాపాడగలిగాడు గానీ, నా గుండెని ఎవరు కాపాడగలరూ. ఇంకెందుకూ బతకడం? చచ్చిపోవాలనిపించింది. స్లీపింగ్ పిల్స్ వేసుకున్నాను. అటునించి అటే వెళ్ళిపోతే బాగుండేది. కానీ ఇప్పుడు బతికి క్షణక్షణము చచ్చిపోతున్నాను. నిజంగా .. నిజంగా చచ్చిపోతున్నా.. బతుకుతూ…” ఏడుస్తూనే వుంది. వెక్కుతూనే వుంది. ఏడుస్తూనే వుంటుంది కూడా.

ఈ సాలెగూట్లో చిక్కుకున్న శలభాలకి అంతులేదు. మిరుమిట్ళు గొలిపే కాంతితో యీ ‘సాలెగూడు’ సామాన్యుల్ని ఆకర్శిస్తుంది. దగ్గరికి రాగానే ఆశలదారాలతో బంధిస్తుంది. విడుదల ఏదీ?

సావిత్రి ఇప్పుడూ వుంది. మౌనంగా.. వీణలేని సరస్వతిలా. ‘పుస్తకం లేని చేతుల్తో’ కళ్లు తుడుచుకుంటూనే ఉంది.

 

మీ మాటలు

 1. buchi reddy gangula says:

  అన్ని పుస్తకాలు చదివి న సావిత్రి —చనిపోవాలని
  నిర్ణయించుకోవడం —-
  అయినా బాగుంది
  బుచ్చిరెడ్డి గంగుల

  • BHUVANACHANDRA says:

   ఆమె చనిపోలేదు బుచ్చిరేడ్డిగారూ ఆ పరిస్తితిలో ఎవరున్నా అదే నిర్ణయం తీసుకునేవారు …నేను సభ్యత కోసం కొంత నిజాన్ని దాచాను ….అది వింటే ఎవరూ తట్టుకోలేరు ……ఇక చదువు అనేది జీవితాన్ని నిర్నయించదు….అవునా….

 2. RammohanRao thummuri says:

  భువన చంద్ర గారూ
  మీ చెప్పే రీతి బాగుంది.సావిత్రి కథ హృదయ విదారకం .వీణా విహీన వాణిని పుస్తక హీన పాణి ని
  జీవితం దోషరహితమైంది మీఅనుక్త కథా కథనం తో.కన్నీటి బొట్టును మించిన ఓదార్పు లేదేమో బహుశా ప్రపంచంలో .

  • BHUVANACHANDRA says:

   థాంక్స్ సార్…. ఇతరుల కధ…రాయాలంటే బాధగా వుంది …కానీ ఇక్కడి పరిస్తితులు తెలుసుకోగలిగితే …కొందరికైనా మంచి జరుగుతుందని ఓ ఆశ……..నమస్తే …భువనచంద్ర

   • P.S.Narayana says:

    భువన చంద్రగారూ! చాలా అద్భుతంగా వ్రాసారు. గుండెల్లో ఎక్కడో గుచ్చుకుంది. వారి జీవితాల లోతులికి వెడితే, వారి నవ్వుల వెనుక దాగుండే విషాదానికి మన కళ్ళవెంట నీరు కారుతుంది. నేను 1978 సం. లో సినిమా పరిశ్రమని దృష్టిలో పెట్టుకుని “వెండితెర వెనుక” అనే పేరుతో ఒక నవలిక వ్రాసాను. ఎందుకో అప్పుడు ప్రచురణకి పంపడానికి మనస్కరించలేదు. ఆ తర్వాత “కౌముది” సంపాదకులు కిరణ్ ప్రభ గారితో జరిగిన సంభాషణలో ఈ విషయం చెబితే, “ముందు ఆ నవల నాకు పంపించండి. వీలు చూసుకుని ప్రచురిద్దాం” అన్నారు. అప్పట్లో వ్రాసిన పేజీలనే స్కాన్ చేసి పంపించాను. తర్వాత 2008 సం.లో అంతర్జాల మాస పత్రిక “కౌముదిలో” ప్రచురితమైంది. దాన్ని “కౌముది” సంపాదకులు శ్రీ. కిరణ్ ప్రభ గారు అంతర్జాల నవలగా ఈ మధ్యనే వెలువరించారు. మీ email i.d, పంపిస్తే,నవలని మీకు పోస్ట్ చేస్తాను. మీ కథ చదివిన ఇన్స్పిరేషన్ తో షేర్ చేసుకోవాలని అనిపించింది. నా email i.d: psnarayana2007@gmail.com.
    శుభాకాంక్షలతో,
    పి.ఎస్. నారాయణ (సత్తిబాబు).

 3. చీకటి వెలుగులతో ఆడే ఆటే కదా సినిమా. అయితే ఆ వెలుగు ఎన్నో రెక్కల పురుగులను ఆకర్షించి చివరికి మాడ్చిరాల్చేయడమే విషాదం.

  • BHUVANACHANDRA says:

   అరిపిరాల గారూ మీరు అన్నది నిజం …మగవాడికి ఈ పరిశ్రమలో కొన్ని కస్టాలు వుంటాయి …కానీ ఆడదాని బ్రతుకు దుర్భరం …..చిత్రం ఏమంటే …..ఇందులోని ఆడవాళ్లే …తమవాళ్ళని ….తెలిసి తెలిసీ సినిమాల్లోకి దించటం …..నమస్తే భువనచంద్ర

 4. అంత సాహిత్యం చదివినా, ఈ సావిత్రికి ఏదీ వంటబడినట్లు లేదు. కధ చదవంగానే బాధేసింది. అది తగ్గిన తరవాత కోపం వచ్చింది. ఆ సావిత్రి ఇంకా బ్రతికే ఉంది అని ఆశిస్తాను. అలాగే ఆ కుర్రాడు కుడా ప్రోయోజకుడైయ్యుంటాడని కుడా. ఐ లైక్ హ్యాప్పీ ఎండింగ్స్, ఒక మంచి కధ కోసం ఇలాంటి ఎండింగ్ ఇచ్చినా.

  • BHUVANACHANDRA says:

   ఇది కదా కాదు యాజీ గారూ ….
   సభ్యత కోసం కొంత నిజాన్ని దాచాను …..అది వింటే గుండె పగులుతుంది ….
   సావిత్రి వుంది …శవంలా బతుకుతూ ….తల్లి ప్రేమ ఎంతటిదో ….నా కళ్ళతో చూడండి అప్పుడు ఎండింగ్ గురించిన ఆలోచన రాదు …..భువనచంద్ర

 5. నాకైతే సావిత్రి బ్రతికిపోయినందుకు చాల దిగులుగా, బాధగా ఉంది. చావు అన్నిటికీ పరిష్కారం కాదనీ, ఒకరి చావుని కోరుకోవటం మనిషి లక్షణం కాదనీ తెలుసు. అయినా కూడా సావిత్రి చచ్చిపోయి ఉంటే బాగుండేదని మాత్రం అనిపిస్తుంది. ఎదుటిమనిషి బ్రతుకు కన్నా చావుని కోరుకునే అతి కొన్ని సందర్భాలు ఇవి. అలా కోరుకునేది మనుషుల మీద ద్వేషంతో మాత్రం కాదు. అందులోనూ కధ కాదని కూడా చెప్తున్నారు.

  ఓ ఏడాది క్రితం ఇలాగే, ఓ తల్లి భర్త పెట్టే బాధలు పడలేక పిల్లలని చంపి తనూ చచ్చిపోవాలనుకుంటే, పిల్లలు పోయి ఆమె మాత్రమే ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటున్నప్పుడు కూడా చాలా కోరుకున్నాను ఆ తల్లి కూడా బ్రతకకూడదని. పిల్లల్ని తనే చంపుకున్నానన్న బాధతో బ్రతికే కన్నా చావు మేలు కదా ఆతల్లికి.

  చదువు మనిషికి ధైర్యాన్నీ, విచక్షణనీ, విజ్ఞతనీ ఇస్తుందనేది అన్నివేళలా నిజం కాదు.It’s just a hypothesis.

 6. చదువు ధైర్యాన్ని ఇస్తుంది అనేదాని కంటే పెద్ద మిత్ ఇంకోటి లేదేమో!!

  పరిస్థితుల కంటే మనిషికి పెద్ద శత్రువు వేరే ఉండదు.. వాటిని ఎదుర్కునే ధైర్యం స్వతహాగా మన చర్మంలో ఇంకి ఉండాల్సిందే తప్ప ఎంత చదివినా, ఏం చదివినా అంత ప్రయోజనం ఉండదు..

  ఆసాంతం చదివాక, సావిత్రి బ్రతికినందుకు ప్రస్తుతం నాకైతే బాధ-సంతోషం రెండిట్లో ఏదీ కలగడంలేదు కానీ, మీరు దాచిన అసలు నిజం నేను ఊహిస్తున్నదే అయితే చనిపోవాలన్న ఆమె నిర్ణయంలో తప్పు లేదు అని మాత్రం అనిపిస్తోంది!

  శలభాలు — సరైన పదం! కావాలని చిక్కుకునేవి.. బలవంతంగా లాగబడేవి! అన్ని కధలూ ఇంచుమించు ఇలాంటివే అనుకుంటా..

  మనసు మాత్రం భారంగా అయిపోయిందండీ! మళ్ళీ మీ ఇంకో కధ కాని కధ చదవాలంటే చాలా స్థైర్యాన్ని పోగేసుకోవాలి!!

  • @@ మీరు దాచిన అసలు నిజం నేను ఊహిస్తున్నదే అయితే చనిపోవాలన్న ఆమె నిర్ణయంలో తప్పు లేదు అని మాత్రం అనిపిస్తోంది!
   నేను కూడా వూహించగలిగాను. అందుకే ఇంకా బాధనిపిస్తోంది. అది నిజం కాకపోతే బావుండు అని కూడా అనిపిస్తోంది.

   • మీరు ఏమి ఊహిస్తున్నారో నాకైతే సమఝైతలే. అలాగే రచయిత అంత భయంకరమైన నిజం ఏమి దాచారో!

    రచయిత మాటల్లో “దూరంనుంచి చూడటమేగానీ, ఏనాడూ నేను వాడికి ఏమౌతానో ఎప్పుడూ చెప్పలా”. అంటే ఆ సావిత్రి తన కొడుకెవరో గుర్తుపడుతుందనే కదా?

  • BHUVANACHANDRA says:

   నిషిగంధ గారూ …మీ మెయిల్ కి చాలా ధన్యవాదాలు ……దయచేసి నా మిగతా కధలను కూడా చదివి మీ అభిప్రాయం చెప్పగోర్తాను …నమస్తే ….భువనచంద్ర

  • BHUVANACHANDRA says:

   నిషిగంధ గారూ …..నిజంగా చెబితే రాయడం కూడా కష్టం గానే వుంది. ఎందుకంటే ..ఇతరుల జీవితాల్లోకి తొంగిచూడడం నాకు ఇష్టం వుండదు …కానీ కొందరు ”మా జీవితాన్నే కధగా రాయొచ్చుగా ”అంటారు ..అదీగాక ఈ చిత్ర ప్రపంచంలో జరిగే వింతలు అన్నీ ఇన్నీ కావు. నవ్వులవెనక దాగిన కన్నీటి సముద్రాలకీ లెక్కలేదు …చదివి కొందరైనా అర్ధంచేసుకుంటా రనే ఆశతో మాత్రమె రాస్తున్నా ….నమస్తే భువనచంద్ర

   • మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు, భువనచంద్ర గారు.

    నిజంగానే నిజం రాయాలంటే చాలా మనస్థైర్యం కావాలేమోనండీ! ప్రతి వ్యధాభరిత జీవితాన్నీ అక్షరాల్లోకి మార్చి ప్రపంచానికి ‘ఇదిగో ఇలాంటి శాపగ్రస్తలు కూడా ఉంటారు తెలుసా!’ అని చెప్పడం కంటే అదేదో సినిమాలో చూపించినట్టు ఒక సీసాలో మూసేసి సముద్రంలోకి విసిరేయడం చాలా మంచిదనిపిస్తుంది. ఎందుకంటే మనం చెప్పే నిజం అందరి మనసుల్లోకీ ఒకేలా ఇంకదు! వారికి సానుభూతి అందకపోయినా పర్వాలేదు కానీ నెగటివ్‌గా అనుకోకుండా ఉంటే చాలేమో!

 7. @@ అంటే ఆ సావిత్రి తన కొడుకెవరో గుర్తుపడుతుందనే కదా?

  అవును, గుర్తుపడుతుంది. బహుశా గుర్తు పట్టకూడని చోట, గుర్తు పట్టకూడని వేళా గుర్తు పట్టి ఉంటుంది. అదే రచయిత దాచిన (చెప్పలేకపోయిన) రహస్యం కావొచ్చు. ఇది నా వూహ మాత్రమే.

 8. I believe the answer to your questions some where lies in here >’రమ’ ఇంట్లో…..పట్టుబడ్డాడు… పద్ధెనిమిదేళ్ళ వెధవ< there are many such stories we will find around us, we ignore them and move on. Sometimes contemplating about such stories will give us a pause…

 9. Bhuvanachandra says:

  మీ అమూల్యమైన సమయాన్ని ఈ కదా కోసం కేటాయించినందుకు ముందుగా నా ధన్యవాదాలు ….ఇది నిజంగా కధ కాదు …
  ఒక ఆడదాని జీవితం…… ఏది ఏమైనా మనిషి బతకాలి ……చావు సమస్యకు పరిష్కారం కాదు ……మీ సలహానో…. పరిష్కారమో ఏమిటి …..ప్లీజ్ చెప్పరూ ……………ఆశీస్సులతో …భువనచంద్ర

 10. భువనచంద్ర గారూ
  ఆ అబ్బాయిని పెంచుతున్న వాళ్ళు అతన్ని హాస్పిటల్ కి తీసుకువచ్చి “ఈమె మీ అమ్మ. నువ్వు ఉన్నతంగా సమాజంలో బ్రతకాలని నీకు తను అమ్మ అని కూడా తెలియనీయకుండా పెంచుతుంది” అని చెప్తే చాలు
  వాడు మనిషైతే అమ్మ మీద కృతజ్ఞత, తను చేస్తున్న పనుల మీద అసహ్యం కలిగి అమ్మకోరుకుంటున్నట్లు
  బ్రతుకుతాడు. మృగమైతే ఆ తల్లి ఎందరో అనాధలకి తల్లి అవొచ్చు వీడిని వదిలి. ఏదో నాకు తోచింది చెప్పాను.

 11. BHUVANACHANDRA says:

  ఇది ఒక మార్గం …. బాగుంది ….ఇంకా

మీ మాటలు

*