ఆదివాసీ సంస్కారం మనిషిగా నన్ను నిలబెడుతోంది!

rajayya-150x150

నాన్నా వంశీ,

ఎట్లా ఉన్నావు? పట్నంలో చిక్కుకపోయి ఒంటరి అయ్యావా??

ఘడియఘడియకు మాటమార్చే మాయల మరాఠి, గజకర్ణగోకర్ణ టక్కుటమారా విద్యలవాళ్ళు- సృష్టికర్తల మూలుగులు పీల్చినవాళ్ళు- పట్నాలు చేరుతారంటాడు ఒక రచయిత.. జీవించదలుచుకున్నవాళ్ళు-పోరాడ దల్చినవాళ్ళు అడువులు చేరుతారట-నిత్య అనే రచయిత రాసిన లక్షణరేఖ కథలో సారాంశం…

గోర్కీ “స్వర్ణపిశాచి” నగరం అన్నాడు. అలాంటి నగరంలో నివాసం యాతనే.. ఏదో కోల్పోయినట్టు…
దండకారణ్య రచయితల కథల పుస్తకానికి ముందుమాట ఈరోజే పూర్తి చేసాను.. వివిధ పత్రికల్లో ఇదివరకు అచ్చైన కథలే..

ఈ రోజు ఏప్రిల్ 20.

ఆకాశంలో మబ్బులు అస్తుబిస్తుగా పరుగెత్తుతునాయి.. చత్తీస్ ఘర్ దండకారణ్యం మీదుగా తెలంగాణ దాకా అల్పపీడన ద్రోణి ఏర్పడి ఉక్కగా, ఉద్రిక్తంగా ఉంది..గల్లామీగా ఉంది.. పరాకుగా ఉంది.. నాయవ్వనారంభ ఉద్విగ్న విప్లవ సాహిత్యరోజులు పోటెత్తుతున్నాయి.. నేను మాత్రమే మిగిలి- నా నులువెచ్చని మహత్తర నైతిక వర్తనగల త్యాగమూర్తులైన సహచరులెందరో-అసహజ మరణాలపాలై వెళ్ళిపోయారు.. ఆ అడుగుజాడలు-వాళ్ళు నిర్మించిన త్యాగ నిరతి నా మదిలో మెదిలి తడితడిగా ముద్ద ముద్దగా రోజంతా తిరిగాను.. ఎంత చెప్పినా ఈ సుధీర్ఘ గాయాల చరిత్ర ఒడువదు.

ముప్పైరెండు సంవత్సరాల క్రితం ఇదే రోజు- ఆదిలాబాదు జిల్లా ఇంద్రవెల్లిలో-తాము తరతరాలుగా సాగుచేసుకుంటున్న అటవీ భూములకు పట్టాలు కావాలని-ఆదివాసుల మీద అటవీ, రెవీన్యూ, పోలీసు అధికారుల వేధింపులు పోవాలనీ- తమ పంటలకు గిట్టుబాటు ధరలు కావాలని- ఆదివాసేతరుల దోపుకం పోవాలనీ.. రైతుకూలి సభలు పెట్టుకోవాలనుకున్నారు. అప్పుడు  ఈ ప్రాంతంలోని యువకులందరం ఇలాంటి కార్యకలాపాల్లోనే ఉన్నాం… మేమంతా 1969 తెలంగాణ ఉద్యం మోసగింపబడి వీధుల్లోకి వచ్చినవాళ్లం-అప్పటికే కరీంనగర్ జిల్లాలో “జగిత్యాల జైత్రయాత్ర” నలభైవేలమంది రైతులతో జరిపిన వాళ్లం..

మేమంతా పేదప్రజల తరపున ఉన్నాం… నా మిత్రుల్లో అప్పటికి నా ఒక్కడికే చిన్నవయసులో పెళ్ళి జరుగుడు మూలంగా పిల్లలూ, ఉద్యోగం ఉన్నాయి… మిగతా వాళ్ళెవరూ ఈ ఝంఝాటంలోకి దిగలేదు.. అయితే ఉద్యోగరీత్యా ఆదిలాబాదుకు వచ్చిన నాకు రెండు గదుల ఇల్లు పికపికలాడేది. ఇంటినుండి బియ్యం తెస్తే, నా జీతం కూరగాయలకు సరిపోయేది కాదు..

వందలాదిమందిమి ఒకే కుటుంబంగా ఒకే మాటగ- వార౦ రోజులనుండీ ఇంద్రవెల్లి తయారి. వచ్చేవాళ్లను, అథితులను రిసీవ్ చేసుకుని ఇంద్రవెల్లికి పంపడం నా విధి. వరంగల్ నుండి వచ్చిన ఉస్మానియా విద్యార్థి నాయకుడు లింగమూర్తి, గద్దర్ తదితరులు… గద్దర్ వచ్చి రెండు రోజులముందే వెళ్ళిపోయాడు- గూడాలల్లో ఆటపాటలు చేసేందుకు.. లింగమూర్తీ తదితరులను ఉదయమే పంపాను.. అందరినీపంపి చివరివాడిగా నేను సాయింత్రం నాలుగు గంటలకు బయలుదేరాను. అప్పటికే కాల్పులు జరిగిపోయినట్టుగా గాలికంటే వేగంగా వార్తవచ్చింది.. నేను మళ్ళీ ఆగిపోయాను. కకావికలైన స్థితిలో- మళ్ళీ నా అవసరం కలగదేమోనని? అది ఒక మానని గాయం.. ప్రత్యక్ష సాక్షులు నా మిత్రులు చెప్పిన సమాచారం బట్టి, నేను వందలసార్లు అక్కడ తచ్చాడడం బట్టి నాకర్తమయ్యింది అక్కడ జరిగింది.. మీటింగు పర్మిషన్ చివరి నిమిషంలో ఇవ్వలేదు… 144 సెక్షన్ ఆదివాసులకు తెలియదు.

అడవుల్లోనుండి వందలాదిగా వేలాదిగా తరలి వచ్చిన ఆదివాసులకు ఇప్పటికీ వాళ్లకు మీటింగు ఎందుకు పెట్టుకోకూడదో తెలియదు.

స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేండ్లయినా పాలకుల భాష ప్రజలకూ-ప్రజల గోడు పాలకులకు పట్టదు.. “అందరు జమగూడి మీటింగులు పెట్టుకోంగా లేనిది తామెందుకు మీటింగు పెట్టుకోకూడదు” అనే ప్రశ్నకు ఇప్పటికీ జవాబులేదు.. అడవి దారులనుండీ, రేగడి చేండ్లనుండీ- కోసిన జొన్నచేండ్లనుండీ వచ్చే ఆదివాసులను పోలీసులు ఆపలేకపోయారు..

వాళ్ళడిగిన ప్రశ్నకు జవాబుగా లాఠీచార్జి చేశారు.. ఒక ఆదివాసీ యువతి మీద పోలీసు దెబ్బ.. తోపులాట.. దెబ్బకు దెబ్బ పోలీసుల మీద పడ్డది.. కాల్పులు షురూ అయ్యాయి.. ఇంద్రవెల్లి రక్తసిక్తమైంది.. ప్రభుత్వం చనిపోయినవాళ్లు పదమూడంది.. 60 పైన్నే చనిపోయారు.. వందలాదిమంది గాయపడ్డారు.. ఇంద్రవెల్లి మరో జలియన్ వాలా బాగ్ అయ్యింది.. అప్పటినుండీ ఆదివాసులు ఘనత వహించిన సర్కారుకు బద్దశత్రువులయ్యారు.. మానసికంగా నేను గాయపడ్డాను.. ఈ అన్యాయం, హత్యాకాండా నాకు నిద్రలేకుండా చేసిందీ..

లోపలెక్కడో కల్లోలం సుడులు తిరిగింది. అప్పటినుండి గూడాలు, ఆదివాసుల సుట్టూ తిరుగుతూనే ఉన్నాను.

1983 ఇదే రోజు నా మిత్రుడు సాహూ, నేను కలిసి రాసిన “కొమురం భీం” నవల వచ్చింది.. మాలాగే పోరాడి చనిపోయిన కొమురం భీం ను నైజాం పోలీసులు జోడేఘాట్ లో సెప్టెంబరు 9, 1940 లో కాల్చేశారు. 1983 ఆ సభలో గోండు తల్లి దాదాపు గంటసేపు మాట్లాడింది.. ఇందిరా గాంధీ కన్నా గొప్పగా..లాజిక్ గా, తాత్వికంగా..

అప్పటినుండి గత ముప్పై రెండేళ్ళుగా ఇంద్రవెల్లి సలుపుతూనే ఉన్నది..

విచిత్రంగా ఈ దిక్కుమాలిన వ్యక్తి కేంద్రంగా నడిచే ప్రపంచంలో-అప్పటినుండి నాలో భాగమైన కొమురం భీం ఆదివాసీ సంస్కారం మనిషిగా నన్ను నిలబెడుతోంది. వాళ్లు శారీరకంగా, మనసికంగా అందమైన వాళ్లు.. మట్టిని, చెట్ల పసురును, సూర్య రశ్మిని కలిపి చేసినట్టుంటారు.. విచిత్రంగా రష్యాలో కార్మికులు, చైనాలో రైతాంగం, విముక్తి సాధించారు. బహుశా ఆదివాసీలు భారతదేశంలో ఆ దిశలో పోరాడుతున్నారు.. లక్షల కోట్ల విలువైన ప్రకృతి సంపదలైన ఖనిజాలు వాళ్ళు.. వాళ్ళను కొల్లగొట్టడానికి.. అల్పపీడన ద్రోణి దండకారణ్యమ్మీద కేంద్రీకరింపబడి ఉంది.. ఉరుములు.. మెరుపులు.. వడగళ్ళ వాన…

-పెదనాన్న..

మీ మాటలు

 1. రమాసుందరి says:

  గొప్ప లేఖ. అవును మూలవాసులు మనలో భాగమైతేనే, మనుషులుగా మనం నిలబడగలం.

 2. నిజానికి ఆదివాసులు అమాయకులుగా వారికి ఏమీ తెలీదంటూ వాళ్ళని మోసగించే ప్రయత్నం చేస్తుంటారు నాగరికులుగా చెలామణీ అవుతున్న వారు. కానీ నిత్యమూ మోసానికి గురవుతున్నది మనమే..

  ఈ దేశ సహజ సంపదను కాపాడడం ద్వారా ఈ దేశ ఉనికిని ప్రపంచ పటంపై నిలిపేది ఈ అమాయక మూలవాసులే, నిబ్బరంగా నిజాయితీగా నిలిచి పోరాడుతున్నది మూలవాసులే. వారి పోరాట స్ఫూర్తికి సంఘీభావం తెలపడమే మన కర్తవ్యం.

  రాజయ్య సార్ కు అభివందనాలతో..
  సారంగకు అభినందనలతో..

 3. Allam Rajaiah says:

  వర్మ గారు నమస్కారం మీరు చెప్పినdi నిజం మూలా వాసులు ప్రకుర్తి వనరలు కాపాడుతుంటే migrate a nagarikulaku తమకు పట్టనట్టు ఉంటున్నారు Anwarul తలుసుకుంటే ఈ విద్వంసము అగ్గేది Allam rajaiah

 4. karthik ram says:

  ఆదిలాబాద్ వాడిని అయ్యుండి కూడా ఇప్పటి వరకు ఇంద్రవెల్లి లొల్లి నాకు సరిగా తెలిదు ., కాని ఈ లేఖ లో రాజయ్య విషయాన్ని వర్ణించిన విధానం బాగుంది ., ఆదిలాబాద్ వెళ్ళేప్పుడు ఇంద్రవెల్లి స్తూపం ని చూడటమే కాని దాని వెనుక ఉన్న ఆదివాసి వేదన తెలిదు ., కృతఙ్ఞతలు అల్లం రాజయ్య గారు మీకు ..

  • allam rajaiah says:

   ఆ స్తూపం మీద రాతలు చూడండి అది ఒఖ గాయం

మీ మాటలు

*