ఒక పథికుని స్మృతుల నుండి…

Sriram-Photograph

ఒక భయంకర తుఫాను రాత్రి

తలదాచుకొనేందుకు ఏ చోటూ కానక

నీ వాకిట్లో నిలుచున్నాను

 

నీవు దయతో నీ గుడిసెలోనికి ఆహ్వానించావు

 

“పథికుడా! ఇంత రాత్రివేళ ఎక్కడకు నీ ప్రయాణం?” అని ప్రశ్నించావు

నేను మౌనంగా ఉండిపోయాను.

 

వెచ్చదనం కోసం నెగడు రాజేస్తూ

రాత్రంతా నీవు మేలుకొనే ఉన్నావు

 

నేనప్పుడప్పుడూ పిడుగుల శబ్దానికి మేల్కొని

కనులు తెరచినప్పుడు

నీ వదనం ఎర్రటి మంట వెలుగులో

విచారభారితంగా ఉంది

 

నీ పెదవులు నెమ్మదిగా, అస్పష్టంగా కదులుతున్నాయి

 

వర్షపు హోరులో నాకేమీ వినిపించలేదు

తుఫాను మందగించింది

నిశ్శబ్దం ఆవరించింది

 

అపుడు నీ పాటలో నేవిన్న చివరి రెండు వాక్యాలూ నాకింకా గుర్తే

“హృదయంలో పొంగిపొరలే ప్రేమను ఎవరికర్పించను?….

….తోటలో పూచిన ఏకైక గులాబీని ఎవరికి కానుకీయను?

తెల్లారేకా ఎర్రబడిన నీ కళ్ళలో కన్నీళ్లను చూసాను

 

నేను వెళతానని చెప్పినప్పుడు

అవి జలజలరాలాయి

చెప్పాలనుకున్నదేదో నీ గొంతుదాటి బయల్పడలేదు

 

వెళుతూ వెళుతూ వెనక్కి చూసినప్పుడు

నీవు మోకాళ్ళ పై కూలబడి రోదిస్తున్నావు

 

మీ మాటలు

  1. Madhusudan raju says:

    Bagundi sriram garu

  2. గుడ్ వన్ శ్రీరామ్.. :)

మీ మాటలు

*