పిచుకమ్మలందరు గెలిచే సమాజం మనకింకా రాలేదు: స.వెం.రమేష్

ramasundari

రమాసుందరి

“కాకికి కడవడు, పిచుక్కి పిడుకుడు” కధ మనమందరం చిన్నప్పుడు అమ్మమ్మల నుండి, నాయనమ్మల నుండి విన్నదే. పిచుకమ్మ “ఆబగూబలు అణిగిపోయేదాక; అక్కులు, చెక్కులు ఎండిపోయేదాక; ఆయిలో ఊపిరి కోయిలోకి వచ్చే దాక” చాకిరి చేసి పండిస్తే; కాకి తనకు కడివడు, పిచుక్కి పిడికెడు పంచింది. “కయ్య నాది, పైరు మీద పెట్టుబడి నాది.” అంది. పిచుకమ్మకు జరిగిన ద్రోహం విని అందరం కళ్ళనీళ్ళు పెట్టుకొన్న వాళ్ళమే. అదే అఘాయిత్యం మన ఇంట్లో జరిగితే ఆ కళ్ళనీళ్ళు రాలుతాయా? స. వెం. రమేష్ కి రాలాయి. కళ్ళనీళ్ళు రాలటమే కాదు, కళ్ళు ఎరుపెక్కి కసిగా “కాకికి కడవడు, పిచుక్కి పిడుకుడు” కధను తిరగ రాసాడు.

తన కుటుంబంలో జరిగిన ఆర్ధిక,కుల దోపిడీ, అణచివేతలను తన భాషాసౌందర్యంతో, తన విశిష్ట కధా కౌశల్యంతో తూర్పార పట్టాడు.  తన అవ్వలు, అమ్మలు చేసిన  పాపాలను వీపు మీద మోస్తూ ఈ కధ రాసాడు. అంటరానితనాన్ని నిర్ధాక్షిణ్యంగా చీల్చి చెండాడిన కర్కశత్వం ఈ కధకుంది. ఆర్ధిక దోపిడి మూలాలు చూయించిన విస్తృతత్వం ఈ కధకుంది. తరాలు మారిన కులం పునాది కదలలేదనే చేదు నిజం ఈ కధ చెబుతుంది. దళితుజనుల స్వీకరణ తమ సౌకర్యానికే  జరిగింది కాని, హృదయ పరివర్తనతో జరగలేదన్న కఠిన వాస్తవం ఈ కధ చెబుతుంది. రూపం మార్చిన అణచివేత, భూతం లాగా దళితులను ఇంకా వేధిస్తుందని చెబుతుంది.

తన ఇంటి మాలితి (పాలేరుకి స్త్రీలింగం) మంగమ్మ జామపండ్లతో బాటు పంచి ఇచ్చిన కమ్మని అమ్మతనాన్ని, నిజాయితీతో కూడిన సేవల సౌకర్యాన్ని బాల్యంలో అనుభవించిన ప్రాణం, ఆమెకు జరిగిన అన్యాయాల పరంపరను కూడ గుర్తెరిగింది. ” నిన్న నేనూ, మీ అవ్వ కొట్టిన దెబ్బలలకు దడుసుకొని జెరం వచ్చింది వాడికి. తగ్గినాక వస్తాడులే” అని కళ్ళు తుడుచుకొన్నమంగమ్మ గుండె కోతను తన గుండెలోతుల్లో గీసి దాచుకొన్నాడు. పిచుకమ్మ కధ చెబుతూ కొతుకు పడిన మంగమ్మ గొంతులో దుఃఖజీరల వెనుక, పిచుకమ్మలో తనను తాను చూసుకొన్న ఆమె అంతరంగాన్ని ఆకళింపు చేసుకొన్నాడు. పెరిగి పెద్దై ఈ కధ రాసి మనల్ని కూడ ఆత్మావలోకనం, ఆత్మ విమర్శ చేసుకోమని చెబుతున్నాడు.

Qప్రళయ కావేరి కధల్లో సామూహిక జీవన సౌందర్యం, పల్లె ప్రజల జీవానానందాలు, మానవతా విలువలు కలగలిసి దృశ్యీకరించారు. కులాల ప్రసక్తి ఉండింది కాని, కుల వివక్షత గురించి లేదు. కధలో మీరు లేవనెత్తిన అంశాల వెనుక మీ మారిన దృక్కోణం ఏమైనా ఉందా?

ప్రళయ కావేరి కధలు నా బాల్యానికి చెందినివి. బాలుడిగా నాకా అనుబంధాలే గుర్తు ఉన్నాయి. కాని ఎదిగిన మనసుతో ఇప్పుడు పరికిస్తే మా కుటుంబం పాటించిన వివక్ష నా జ్ఞానానికి అందింది. సరిదిద్దలేని, క్షమించలేని అణచివేతకి, వివక్షకి కొన్ని తరాలుగా మన పెద్దవాళ్ళు పాల్పడ్డారు. ఈ మధ్య ఒకాయన ఏదో చర్చలో “మా తాతలు చేసిన తప్పులకు మమ్మల్ని ఎందుకు భాధ్యుల్ని చేస్తారు? ” అని అడిగారు. తప్పక బాద్యత వహించాలి అంటాను నేను . అలా బాధ్యత వహించటానికి మనం సంసిద్ధంగా లేనట్లైతే మనం మారనట్లే. నేను ఎంత సంస్కర్తనైనా ‘బ్రాహ్మిణిజం’ అనే పలుకుకు ఉడుక్కొంటున్ననంటే నాలో ఆ బీజాలు మిగిలి ఉన్నట్లే. ఆధిపత్యానికి పర్యాయపదమే బ్రాహ్మనిజం.

Qప్రళయ కావేరి కధలో ఎంతో ప్రేమించి రాసిన అవ్వ పాత్రను, కధలో తీవ్రంగా తులనాడారు. ప్రళయకావేరి వరదల్లో చనిపోయిన ఆమె చావును, ఆమె పాప ప్రతిఫలంగానే కసిగా తీర్మానించారు. ఇదెలా సాధ్యం?

నా దగ్గర మిత్రులు కూడా దాన్ని ఖండించారు. నేను దేవుడు, దెయ్యాన్ని నమ్మను.  అయితే సహజ ప్రాకృతిక న్యాయం ఒకటి ఉంటుందని నమ్ముతాను. ఈ కధ ప్రధాన ఉద్దేశం తరాలు మారినా కులవివక్ష రూపం మార్చుకొన్నదే కాని, నిర్మూలించబడలేదు అని చెప్పటమే. ఒక దళిత అధికారిని, ఒక పేద అగ్రకులస్థుడిని గ్రామాల్లో స్వీకరించే విధానాన్ని పరిశీలిస్తే మనకు ఈ విషయం అర్ధం అవుతుంది. దళిత అధికారికి సపర్యలు చేయ వచ్చు. భక్తి శ్రద్ధలు ప్రదర్శించవచ్చు. కాని అగ్రకులాల హృదయపూర్వక స్వీకరణ మాత్రం తమ కులానికి చెందిన పేదవాడికే ఉంటుంది. ఈ దుర్మార్గానికి మా కుటుంబం అతీతం కాదు. కాబట్టి ఈ ఇతివృత్తాన్ని మా కుటుంబం నుండే మొదలు పెట్టాను.

Qనన్ను, మీ పాఠకులందరినీ అబ్బురపరిచేది మీ విశేష భాషా పరిజ్ఞానం. మీరు ప్రళయ కావేరీ సరస్సు ప్రాంతాన్ని వదిలి పెట్టినా ఇప్పటికీ అక్కడి మాండలికం, వాడుక వస్తువులు, అక్కడి శ్రమలు కంఠోపాఠంగా మీ కధల్లో వినిపిస్తారు. ఇది మీ జ్ఞాపకశక్తికి సూచికగా అనుకోవాలా?

అది నాకు ఆ భాష మీద, ప్రాంతం మీద అభిమానం. అమ్మ ప్రేమలో తీపి, అమ్మ భాషలో తీపి మరచిపోగలిగినవి కాదు. అయితే తెలుగు భాషకు సంభంధించి నాకు కొన్ని మనస్థాపాలు ఉన్నాయి. భాషల అభివృద్ధిలో ఆరు మెట్లు ఉన్నాయి. తమిళం ఆరు  మెట్లూ ఎక్కేసింది. తెలుగు మూడో మెట్టు దగ్గర ఆగిపోయింది.  శ్రీపాద, చలం మొదలైన వారి తరువాత తెలుగు వాక్యం ఆగిపోయింది.

ఇక్కడ భాషా సంసృతులని వెన్నంటి కాపాడుకోవాల్సిన  కవులు, మేధావులు ఉదాసీనత వహిస్తున్నారు. మనది కాని దాన్ని మోస్తున్నారు. కవితల్లో కూడ యధేచ్చగా ఆంగ్లాన్ని వాడుతున్నారు. నాకో దళిత స్నేహితుడున్నాడు. అతను బాతిక్, జానపద కళాకారుడు. పేరు పుట్టా పెంచల దాసు. ఎక్కువ చదువుకోలేదు. సాహిత్యం మీద ప్రీతి ఉన్నవాడు. అతను ఈ కవుల కవిత్వాన్ని ఆస్వాదించే అర్హత లేనివాడా? కవి, రచయిత తాను శ్రమించి పాఠకుడికి అర్ధం చేయించగలగాలి. పాఠకుడు శ్రమించాలని కోరుకోకూడదు.

భాష స్థాయి పెరగాలంటే స్థానికీకరణకి ప్రాముఖ్యత పెరగాలి. తెలుగు నాట ఎన్నోమాండలికాలు ఉ న్నాయి. ఈ మాండలికాలు అన్నిటినీ నిర్మూలించి ఒక మాండలికాన్నిమాత్రమే ‘ప్రామాణికం’ చేస్తున్నారు. ప్రపంచీకరణను ఎదిరించాలన్నా స్థానికీకరణ అవసరం ఉంది. ( ఆయా ప్రాంతాల వంటలను రక్షించుకోవటం). దళితులు మూలవాసులు కాబట్టి వారి మాండలికం, వారి జీవనవిధానం, వారి ఆహరపు అలవాట్లు సంరక్షిస్తూ, తెలుగు ప్రజలు దళితీకరణ చెందాలంటాను. ఈ కార్యం తమిళనాడులో చాలా వరకు జరిగింది. ద్రవిడ ఉద్యమం వారికి చాలా సహాయ పడింది.

Qకధలో కష్టపెట్టిన కాకి ఓడిపోయినట్లు, కష్టపడిన పిచ్చుక  గెలిచినట్లు రాసారు. అది మీ అభిలాషా? నిజంగా అలా జరిగిందా?

(నవ్వు) ఈ కధ నా జీవితంలో జరిగిందే. ఇక్కడ ఇంతే జరిగింది. కాని కాకమ్మలందరూ ఓడి పోయి, పిచుకమ్మలందరు గెలిచే సమాజం మనకింకా రాలేదు.

Qదళిత అణచివేత, వివక్షతలను మీరు పేర్కొన్నప్పుడు మీ కుటుంబంలో స్త్రీ పాత్రలకే దాన్ని మీరు పరిమితం చేసారు. పురుషులని అతీతంగా ఉంచారు. దీని వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా?

నాకు 14 మంది అమ్మమ్మలు. వాళ్ళ మధ్య పెరిగాను. స్త్రీల బలాలను, బలహీనతలను దగ్గరగా చూసిన వాడిని. కాబట్టే నా కధలన్నీ స్త్రీల చుట్టే ఎక్కువగా తిరుగుతాయి.

మీ మాటలు

  1. రహంతుల్లా says:

    “భాష స్థాయి పెరగాలంటే స్థానికీకరణకి ప్రాముఖ్యత పెరగాలి. తెలుగు నాట ఎన్నోమాండలికాలు ఉ న్నాయి. ఈ మాండలికాలు అన్నిటినీ నిర్మూలించి ఒక మాండలికాన్నిమాత్రమే ‘ప్రామాణికం’ చేస్తున్నారు. ప్రపంచీకరణను ఎదిరించాలన్నా స్థానికీకరణ అవసరం ఉంది. ( ఆయా ప్రాంతాల వంటలను రక్షించుకోవటం). దళితులు మూలవాసులు కాబట్టి వారి మాండలికం, వారి జీవనవిధానం, వారి ఆహరపు అలవాట్లు సంరక్షిస్తూ, తెలుగు ప్రజలు దళితీకరణ చెందాలంటాను”. బాగా చెప్పారు.

    • రమాసుందరి says:

      మన సొగసైన మాండలికాలను అనాదరణకు, అవమానాలకు గురి చేస్తున్నారు. తెలుగు ప్రజల దళితీకరణకు సంబంధించి స.వెం. రమేశ్ గారి దృక్పధం సరైంది అనిపిస్తుంది నూర్ భాషాగారు.

  2. “కవి, రచయిత తాను శ్రమించి పాఠకుడికి అర్ధం చేయించగలగాలి. పాఠకుడు శ్రమించాలని కోరుకోకూడదు.” – రాసే ప్రతివారు పటం కట్టించి పెట్టుకోవలసిన మాటలు.

    కొన్ని కథలుంటాయి. చదివిన తరువాత పుస్తకం గిరాటేసి ఓ గంటో రెండు గంటలో ఆ కథని ఆస్వాదిస్తూ కూర్చోవాలనిపిస్తాయి. మనకి తెలియకుండానే ఆ గంట రెండు గంటల్లో ఆ కథలోకి వెళ్ళిపోయి రెండు కన్నీటి చుక్కలు వదిల్తే తప్ప వదలని కథలు.. ఇదిగో ఇది ఒక ఉదాహరణ.

    • రమాసుందరి says:

      అవును అంత గాఢత ఈ కధకుంది అపిరాల గారు. రక్త సంబంధానికి మించిన ఆత్మబంధం కథకుడికి, మంగమ్మకూ మధ్య.

  3. స.వెం. రమేశ్ గారి గురించీ, ఆయన ఆలోచనల గురించీ తెలుసుకోవటం బాగుంది.

    ‘భాషల అభివృద్ధిలో ఆరు మెట్లు’ ఏమిటో, వాటి గురించి చెప్పివుంటే ఇంకా బాగుండేదనిపించింది.

    ‘కవి, రచయిత తాను శ్రమించి పాఠకుడికి అర్ధం చేయించగలగాలి. పాఠకుడు శ్రమించాలని కోరుకోకూడదు’ అన్న రమేశ్ గారి మాటలు సాహితీ సృజన చేసేవారందరికీ శిరోధార్యం!

    • రమాసుందరి says:

      కేవలం ఫోన్ ద్వారా జరిగిన ఇంటర్వూ కాబట్టి అంత సంతృప్తి గా అనిపించలేదు నాకు కూడ. సమాధానాలు ఆయన మైల్ లో పంపగలిగితే ఇంకా వాడి సమాధానాలు ఆయన మాండలికంలో చదవగలిగే వాళ్ళం వేణుగారు.

  4. HARITHA DEVI says:

    వినిపించే గొంతుల వెనక తలుపులుతెరవని హ్రుదయాలు,కనిపించే చిత్రం చాటున మూసుకు పోయిన కళ్ళని చూసి నమ్మకాల దారపు పొగుల తెగిపొతొన్న సమయం లో,తాను నమ్మినదాన్ని శ్వాసించి,జీర్ణించి,అనుభవించి వ్యక్తీకరించి క్రుషి చేస్తున్నాడు రమేష్. పిచుకల కధలుతోనొ,రయికముడి విప్పని బ్రతుకుల వ్యధలనో తనగొన్తుకతొ వినిపిచాడు.కొత్త వడ్లతొ చేసిన మొలక బియ్యం సారం అనుభవిస్తున్నత ఆనందం వుంది రమేశ్ కథ లలో.రమేశ్ బాధని,వ్యధని రమా బాగా వ్యక్తపరిచారు.

  5. రమాసుందరి says:

    “కొత్త వడ్లతొ చేసిన మొలక బియ్యం సారం” సరైన ఉపమానం ఆయన కధలకు. “రవిక ముడి ఎరుగని బ్రతుకు” ఎంత గొప్ప కధ. సమస్త స్త్రీ లోకం ఆయనకు సాగిల పడవచ్చు కదా హరిత ఈ కధతో. చలం తరువాత స్త్రీ ని ఇంత బాగా అర్ధం చేసుకొని వ్యక్తీకరించిన వారు నాకు కనబడలేదు.

  6. ==>‘కవి, రచయిత తాను శ్రమించి పాఠకుడికి అర్ధం చేయించగలగాలి. పాఠకుడు శ్రమించాలని కోరుకోకూడదు’

    I am in slight disagreement. రచయిత శ్రమించి ఒక లోకాన్నో, ఒక ఆలోచననో పాఠకుడి మనసు ముందర ఆవిష్కరించాలి. నిజమే. అయితే, పాఠకుడు తనదైన intellectual effort తో ఆ లోకంలోని మూలలనీ, ఆ ఆలోచనల రూపాన్నీ, తనే కనుక్కోగలిగి వుండాలి. ఆ మాత్రం శ్రమ పాఠకుడికి వున్నప్పుడే కథ చదివిన అనుభూతి సంపూర్ణమయ్యేది.
    ఎవరైనా చందమామని తెచ్చి మన చేతిలో పెడితే ఆనందమే, కానీ అందీ అందనట్టున్న చందమామని మనమే అందుకుంటే ఆ థ్రిల్లే వేరు కదా?
    నాకు రచన ఎప్పుడూ ఒక అసంపూర్ణ చిత్రంలా వుండాలనిపిస్తుంది. మిగిలిపోయిన కొద్ది భాగాన్నీ, పాఠకుడు తన ఇమేజినేషన్ తో పూర్తిచేసుకుంటాడు. ఆ మేరకు పాఠకుడికి శ్రమ తప్పదు.

    రమా సుందరి గారూ,
    ఇంటర్వ్యూ చాలా బాగుంది.

    శారద

    • రమాసుందరి says:

      శారద గారు. రమేశ్ గారు ఆంగ్లం కవితలలో వాడటం పట్ల ఆ అభిప్రాయాన్ని వెలి పుచ్చారు. మన భాష కానిది మన బుర్రల కెంత భారమౌతుందో పదవ తరగతి పరీక్షల్లో ఆంగ్లం లో వస్తున్న ఉత్తీర్ణతా స్థాయి లో అర్ధం అవుతుంది.మనది కానిది మన ఆలోచనస్రవంతి కి మధ్యలో పంటిక్రింద రాయిలా తగులుతుంది. ఒక సామాన్య పాఠకుడు ఒక కవితను అర్ధం చేసుకోవటానికి ఆంగ్లం నేర్చుకోవాలనటం ఏమి సబబు?
      ఇక భావపరంగా మేధావి పాఠకులు కావాలో, పాటక పాఠకులు కావాలనుకొంటారో అది కవి ఇష్టం.

      • రహంతుల్లా says:

        అవును.దేవుడికి అన్ని భాషలూ వచ్చు కాబట్టి అన్ని భాషల్లో పూజించుకోవచ్చు అంటే మూల భాషను అర్ధం చేసుకునే స్థాయికి భక్తుడు ఎదిగిరావాలిగానీ దేవభాషను మామూలు మనిషి కోసం దిగజార్చకూడదు అన్నారు.మూల భాషల శబ్ధ గాంభీర్యత,లయ మిగతా భాషలకు ఉండవు,దేవుడు అన్య భాషలలో చేసే పూజను అంగీకరించడు,మేము అనుమతించము అంటూ కఠినమైన నియమాలను సామాన్యజనంపైన మోపారు.నామిని మిట్టూరోడి కతల్లో అర్ధంకాని భాషా పదాలేమీ ఉండవు.కన్నీళ్ళు రప్పిస్తాయి.హృదయాన్ని కరిగిస్తాయి.అర్ధమయ్యే బాస చాలు.

Leave a Reply to రహంతుల్లా Cancel reply

*