డాయీ పాపాయీ

Geeta

K. Geeta

వాళ్లిద్దరూ
ఈ ప్రపంచంలో ఇప్పుడే కొత్తగా ఉద్భవించినట్లు వాళ్ల ప్రపంచంలో వాళ్లుంటారు
చెట్టు కాండాన్ని కరచుకున్న తొండపిల్లలా
ఆ పిల్ల ఎప్పుడూ “డాయీ ” ని పట్టుకునే ఉంటుంది
పిల్లకు డాయీ లోకం
డాడీకి పాపాయి ప్రాణం
ఉన్నట్లుండి పిల్లని గుండెకు హత్తుకుని
ముద్దుల వర్షం కురిపిస్తూ
నిలువెత్తు వానలో పూల చెట్టు కింద నిలబడ్డట్లు
హర్షాతిరేకంతో మురిసి పోతుంటాడా నాన్న
అమ్మ కడుపు నించి పుట్టలేదా పిల్ల
నాన్న పొట్ట చీల్చుకుని ఉద్భవించినట్లుంది
పాల గ్లాసునీ, నీళ్ల గ్లాసునీ నాన్న పట్టుకుంటే తప్ప తాగదు
ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే అతడు
పాపాయితో గల గలా కబుర్లు చెబుతాడు
పాపాయి వచ్చీ రాని ఊసులేవో బాగా అర్థమైనట్లు
తల పంకిస్తూ పిల్ల తలనిమురుతాడు
ఎప్పుడూ వెనక్కి చూడని వాడు
ఆఫీసుకెళ్తూ
తలుపు జేరేస్తూ
రోజూ మళ్లొక్కసారి వెనక్కి వచ్చి పాపాయిని చూసుకుంటాడు
నాన్న గుండెపై నిద్రించే
పసిదానికి నిద్రాభంగం కాకూడదని
మడత కుర్చీలోనే కునికి పాట్లు పడతాడు
“డాయీ” అని పిల్చినప్పుడల్లా “అమ్మా పాపాయి”
అని గబుక్కున పరుగెత్తుకెచ్చే అతడు
పిల్లకాలువల్ని ఎత్తుకుని ఉప్పొంగిన నదీ ప్రవాహంలా
నాన్న భుజమ్మీద ఆనందంగా ఒరిగే పాపాయి
నదీ కెరటాల్ని కప్పుకుని స్థిమితంగా నిద్రోయే పిల్లకాలువలా
కనిపిస్తారు
పాపాయికి జ్వరం వచ్చినప్పుడు పొద్దుటికి లంఖణాలు చేసినట్లు
పీక్కుపోయిన నాన్న ముఖం
చిర చిరలాడే ఎండలో నెర్రెలు చాచిన నేలలా కళ్లలో దు:ఖ జీరలు
పిల్ల కి నయమయ్యేంత వరకు బాధతో గర గరలాడే నాన్న గొంతు
పాపాయికి అర్థమైనట్లు ఆత్రంగా నాన్న భుజాన్ని అల్లుకుని
చెవులు చీకుతుంది
పిల్ల బాధ నాన్నకు ప్రాణ సంకటమయ్యినట్లు
తనలో తను గొణుగుతూ పిల్లని హత్తుకుని ప్రార్థిస్తూంటాడు
అంతలోనే అంతా నయమయ్యి హుషారు వచ్చిందంటే
బువ్వాలాటలు
బూచాటలు
ఏనుగాటలు
వీళ్లే కనిపెట్టినట్లు
గొప్ప ఉత్సాహంతో నవ్వులు వినిపిస్తూంటాయి
వాళ్లిద్దరి సంతోషాలు ఇల్లంతా ఇంద్ర ధనుస్సులై దేదీప్యమానం చేస్తాయి
నక్షత్రాలు బిలా బిలా పక్షులై రెక్కలారుస్తూ
ఇంట్లో వాలతాయి
చురుకైన పాపాయి కళ్లే
నాన్న పెదవులై మెరుపై మెరిసినట్లు
నాన్న ప్రేమంతా
స్పర్శై గుండెల్లో పులకింతై మొలిచినట్లురెండే మాటలు
ఇంట్లో ప్రతిధ్వనిస్తూంటాయి
డాయీ- పాపాయీ

మీ మాటలు

  1. వండర్ఫుల్ గీత. గ్రేట్ దెస్చ్రిప్తిఒన్. ఐ లవ్ ఇత్.

    యువర్ అంకుల్ – సోమయ్య కాసాని
    ఎద్మోన్టన్ – కెనడా

  2. buchi reddy says:

    బాగుంది గీత గారు —- బుచ్చి రెడ్డి

  3. హృదయానికి హత్తుకుంది . ఎంత బాగా చెప్పారు వండర్ఫుల్ గీత గారు . దృశ్యంలో చూసాను నేను

  4. naresh nunna says:

    పాపాయికి అర్థమైనట్లు ఆత్రంగా నాన్న భుజాన్ని అల్లుకుని
    చెవులు చీకుతుంది….
    గీత, మీరు నన్నూ, మా అమ్మాయిల్నీ ఎప్పుడు చూశారు? మా గురించి మీకెలా తెలుసు? మా విషయాలన్నీ దొంగచాటుగా చూసి, మా కబుర్లన్నీ eavesdropping తో విని, ఇలా రాసేస్తున్నారని మీ మీద కేసు బనాయించాలా? దివ్య చక్షువు అనబడే మూడో కంటితో, అద్దం వెనక వార్నిష్ ని గీకి బింబం ఆనుపానులు తేల్చే గడుసుదనంతో మీరు చేస్తున్న ఆగడాలు మరీ మితిమీరుతున్నందుకు మీ మీద ఫిర్యాదు చేయాలా?

    • దివ్య చక్షువులు వున్నాయని ఒప్పుకుంటా.. కానీ ఈ కవిత బహుశా నన్ను మా అమ్మాయిని చూసి రాశారోమో కనుక్కోవాలి..

  5. Beautiful

  6. wilson sudhakar says:

    it is a nice poem

  7. wilson sudhakar says:

    కవిత బాగుంది గీతగారు

  8. kranthisrinivasarao says:

    గీతగారు

    దేశం బయటున్న చాలామంది తండ్రులకు తన్మయత్మం కలిగేలా ….దేశం లో ఉన్న నా బోటి చాలామంది కి ఏం కోల్పోయామో …గుర్తుచేసి …గుండెలవిసేలా చేసారు …..బావుందండి …..

  9. mercy margaret says:

    గీత గారు .. మా నాన్న ప్రేమను , నా బాల్యాన్ని మళ్లొసారి గుర్తుచేశారు .. బాగుందండి

  10. Wonderful lines . మీ లైన్స్ అప్పు తీసుకుని నేను customize చేసుకున్నా. పర్లేదా గీత గారూ.
    Check this out http://geethoo.wordpress.com/2013/04/18/డాయీ-పాపాయీ/

  11. రమాసుందరి says:

    ఎంత బాగుందో! బహిరంగ ప్రదేశాలలో నాన్న కాళ్ళు పట్టుకొని వేలాడే పాపలు, ముద్దారా పాపలకు కొత్త విద్యలు నేర్పే నానలు కళ్ళముందుకు వచ్చేసారు.

  12. వండర్ఫుల్ పోయెమ్ గీత గారు.

  13. చదువుతూ చదువుతూ అలా గతంలోకి వెళ్ళి మళ్ళీ చిన్నప్పటి మా పాపాయిని చూసుకోని, అప్పుడు ఆమె దగ్గర వచ్చే బేబీ పౌడర్ సువాసన పీల్చి, మెత్తని అరికాలి పైన ముద్దు పెట్టి, బుగ్గ చుక్క పైన పలకరించి, బోసి చిరునవ్వుల్ని అందుకోని వాటిని పదిలంగా దాచుకుంటూ తిరిగొచ్చాను…

  14. అందరికీ ధన్యవాదాలు- మా చిన్న అమ్మాయి ఈ మధ్యే మాటలు నేర్చుకుంటూంది- మొదటి మాట “డాయీ”-
    విచిత్రంగా నాన్న తప్ప చుట్టూ ఎవరూ లేరన్నట్లు ఎప్పుడూ అదే మాట-ఇక ఆ నాన్న సంతోషానికి అవధులు ఉంటాయా! వీళ్లిద్దరి అనుబంధం చూస్తూ నాకు పదాలు ఆగలేదు-
    పాపని హత్తుకున్నపుడు ఆ నాన్న ముఖం, నాన్న ఒళ్లో పాపాయి తాదాత్మ్యం చూసి నేనూ మా నాన్నగార్ని ఎంతో గుర్తు చేసుకుంటా-

  15. కూతురి ఆనందమయ లోకంలోకి తప్పిపోయే ఏ నాన్నైనా ఇలాగే ఉంటాడేమో!
    మిత్రులు నరేష్ నున్న వేసిన ప్రశ్నే నాకూ వేయాలనిపిస్తోంది, నన్నూ, మా అమ్మాయిల్నీ ఎప్పుడు చూసారా అని! :)
    గీతగారూ చాలా సంతోషాన్నిచ్చారు మీ డాయీ పాపాయీ :)
    మీరూ వాళ్లలోకి ఎంతగా ప్రవేశించకపోతే ఇంత అందంగా, అనాయాసంగా రాస్తారు..

  16. వంశీ says:

    చాలా చాలా బాగుంది మేడం.. :)

  17. ఆత్మీయ బంధాల అద్భుత ఆవిష్కరణ. బహుశ తల్లిదండ్రులు గా రచయితలు ఎదో ఒక సమయంలో వాళ్ళ పిల్లల గురించి ,బిడ్డలుగా తల్లిదండ్రుల గురించి రాస్తారు. దాంట్లో ఒక గాడమైన అనుభూతి వుంటుంది .అది పూర్తి వైయక్తికం కాబట్టి. అయితే కవిత్వపరంగా సాంద్రత లోపించే ప్రమాదమూ వుంటుంది .ఇది జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుందేమో అనుకుంటాను. ఎనీ హౌ అ గుడ్ పోయెమ్

  18. ఆద్యంతం అద్భుతమైన ఆత్మీయ ప్రవాహం గీత గారు

  19. ఈ కవితని ఇప్పుడే ఆలస్యంగా చదివాను. ఇది చదివితే నన్ను మా అమ్మాయి గురించి రాసినట్లు ఉంది. ఇలా తండ్రులు అందరికీ అనిపింప జేయడమే కవిత్వానికి ఉండవలసిన ఉత్తమ గుణం. దీనిపైన బోలెడంత సిద్ధాంత చర్చ కావ్యశాస్త్ర చర్చ చేయవచ్చు. మాయాబజార్ లో మాట ఇక్కడ చెప్పాలి. ఏమంటే రసపట్టులో తర్కం వద్దని. చాలా మంచి కవిత. అభినందనలు. ఇలాంటి మానవ స్పృహని అనుభవిస్తేనే రాయగలరు.
    పులికొండ సుబ్బాచారి

Leave a Reply to బివివి ప్రసాద్ Cancel reply

*