డోంట్ మిస్ మీనా

Meena2

మల్టీప్లెక్స్ ఆన్ లైన్ బుకింగ్ లతో యూత్ నిలువునా బుక్ అయిపోతున్న నిస్సాయం కాలాలలో ఎంత పొగరుండాలీ తెలుగు నాటకానికి?

సాయంత్రాలను అలవోకగా చెవులు పిండీ, కళ్ళు నులిమీ కబ్జా చేస్తున్న రిమోట్లను బలదూర్ అనడానికి ఎంత బలుపుండాలి సెంట్రల్ యూనివర్సిటీకి?

వార్తలనూ వినోదాల ఫార్సుకు కుదించిన టి ఆర్ పి రేటిం’గులల్తో’ మైమరిపిస్తున్న బుల్లిపెట్టె బ్రే’కింగు’ల హవా మాత్రమే నడుస్తున్న ఈ కళా విహీన సమయాల్లో ఎంతటి దుస్సాహసం ఆ యూనివర్సిటి నాటక విభాగం మొదలుపెట్టిన ఔట్ రీచ్ ప్రోగ్రాంది?

పవర్ ప్రిన్స్ జూనియర్ రెబల్ మాస్ మహారాజాల సై ఆటలు వందకు నోచుకోకుండానే బ్లాక్ బస్టర్ నూకలు చెల్లించుకుంటున్న భారీ సందర్భాలను తూచ్ అనేందుకు ఎంత అహంకారం ఈ మిస్ మీనాటకానికి?

వగలు కాకపోతే రిలీజ్ రోజే వంద ఆటలు ఆడతానంటుందా?

అనడమేంటి ?

అలా అలా సగం ఆటలు అప్పుడే సునాయసంగా ఆడేసిందట కూడా?!

అవును ఇది నిజ్జంగా నిజ్జమే!

కారణాలు ఏమైనా చాలా కాలం నుంచీ మన నాటకాలకు పొయ్యేకాలం వచ్చిందని సర్ది చెప్పుకున్నామా?Meena3

పెదవి విరుచేసుకుని ఏదో మొగలీ, రేకూ అనుకుంటూ వున్నామా?

మిస్ మీనా మిడిమ్యాలం చూడబోతే ఇక మనమే నాటకాలకు పొయ్యే కాలం దాపురించిందేమో అనిపించింది.

మన రిమోట్ల మీద మనకే తెలియని మరో మాయా బటన్ ఒకటి మొలిచిందేమో అనిపిస్తుంది.

మన థియేటర్లలో ఆడని ఆట తాలూకు కనిపించని కొత్త పోస్టర్ ఒకటి వెలసిందేమో అనిపించింది.

మన సాయంకాలాలను మనకే తిరిగి ఇచ్చే కొత్త భరోసా ఏదో ఒనకూడిందని అనుమానమేసింది.

అందుకే డోంట్ మిస్ మీనా.

                                                                                                                              ***

వరంగల్ నేరెళ్ళ వేణుమాధవ్ కళా ప్రాంగణంలో మిస్ మీనా నాటకం తొలిసారి కెవ్వుమంది.

అప్పుడు లేబర్ రూంకి అటువైపు హెచ్ సియూ నాటక విభాగం ఔట్ రీచ్ ప్రోగ్రాం పెద్ద డాక్టర్ పెద్ది రామారావ్, ఇటు వైపు ఈ నాటకానికి  పదహారణాల దర్శకుడు ఇండ్ల చంద్ర తచ్చాడటం నేనూ చూసాను.

మిస్ మీనా నాటకం కేవలం కెవ్వు మనలేదు.

కేక పుట్టించింది.

రంగంపైని తొమ్మిది గడుల్లో సుడులు తిరిగే ఉరకలు. కోలాహలం. వేడుక. అల్లరి. కేరింతలు. సంబరం.

మిస్ మీనా నాటకం సాగిన తీరు ఇదీ.

అందుకే గంటకు పైగా సాగిన మిస్ మీనా నాటకం గంటకు అరవై కన్నా తక్కువ సెకన్లే అనిపింపజేసింది.

ఇదీ ఎక్కడా సడలకుండా సాగిన మిస్ మీనా నాటకం సాధించిన తొలి విజయం అనాలి.

ఆ క్రెడిట్ చంద్రకే దక్కాలి.

ఐమ్యాక్స్ థియేటర్లో ముందు వరసలో కూర్చున్నప్పుడు తెరకు ఆ కొసనా, ఈ కొసనా జరిగే యవ్వారాన్ని వడిసి పట్టుకునేందుకు కళ్ళు అటూ ఇటూ తిప్పడం చాలక తలకూడా తిప్పేస్తుంటామే అచ్చం అట్లాంటి అసంకల్పిత చర్య మిస్ మీనా నాటకం చూసినప్పుడూ ప్రేక్షకులకు కలుగుతుంది.

ఇంత ఎనర్జీ వేదికపైన సాంతం సృష్టించిన (ఎలాంటి అభినయ అనుభవం లేని) ఔట్ రీచ్ రిపర్టరీ నట బృందానికి ఈ క్రెడిట్ ఇచ్చేసేయాల్సిందే నూటికి నూరు పాళ్ళూ.

Meena4*

ఇంతకీ ఏంటి మిస్ మీనా నాటకం కత?

తుమ్మలపెంట అనే పల్లెటూరిలో విరిసీ విరియని ఓ మల్లి రివెంజ్ డ్రామానే ఈ నాటక కథ.

ఒక్క ముక్కలో చెబితే కాగజ్ కే ఫూల్ లాంటి యాత్రతో, సీతామాలక్ష్మి కెరీర్ ప్రగతితో, రంగీలా లాంటి అందమైన అల్లరి నడకతో సాగే మంగమ్మ శపథమే మిస్ మీనా నాటకం.
రెండో ముక్క చెప్పాల్పివస్తే అంతకన్నా ఎక్కువే మిస్ మీనా నాటకం.

మల్లి ప్రేమించి మోస పోతుంది.

కలయికలో బతకూ, కడుపులో బిడ్డా నిరాకరించబడతాయి మల్లికి.

ప్రియుడి మోసం, ఊరి కాఠిన్యం మల్లి కడుపులోని సన్న నలుసును హత్య చేస్తాయి.

అలా ఏమీ కాకుండా, ఎవరికీ కాకుండా పోయిన మల్లి ఊరి నుంచి గెంటి వేయబడుతుంది.

మోసం కారణంగా మల్లిలో ద్వేషం పుడుతుంది.

నిరాకరణ ఫలితంగా మొండి ధైర్యం, ఎక్కడ లేని రోషం, తీరని ప్రతీకారం పుట్టుకొస్తాయి.

ఊరి నుంచి బయటపడిన మల్లి జీవితం అనుకోని మలుపులకు గురవుతుంది.

వెలుగుజిలుగుల సినిమా లోకంలో మీనాగా  విరగబూస్తుంది మల్లి.

వెండితెరను ఒక ఊపు ఊపుతున్న ప్రముఖ హీరోయిన మిస్ మీనా ఇప్పుడు ఇక ఎంత మాత్రమూ మల్లి కానే కాదు.

అయితే తనపై ప్రసరించే వెలుగులు తనకు చెందవని చాలా తొందరగానే గ్రహిస్తుంది ఆమె.

మోసం, నిరాకరణ రూపంలో వున్న తన లోపలి చీకట్లే పెద్ద వెలితిలా వెంటాడతాయి మీనాను.

తనలో చీకటిగా పేరుకుపోయిన తన ప్రియుడి ప్రేమ లేమినీ, తన సొంతూరి కాఠిన్యాన్నీ జయించాలి… లేదా సంహరించాలి అనుకుంటుంది మల్లి ఉరఫ్ మిస్ మీనా.
అందుకు ఆమెకు అందవచ్చిన క్షిపణి పేరే విజయం.

మోసం ద్వేషానికీ, నిరాకరణ ప్రతీకారానికీ సహజంగానే పురుడుపోస్తుంది.

ఈ ద్వేషంతోనే, ఈ ప్రతీకారంతోనే నేరుగా తుమ్మలపెంట చేరుకుంటుంది మీనా.

ఇప్పుడు మీనా ముందున్న సింగిల్ పాయింట్ ప్రోగ్రాం తన ప్రియుడిపై ప్రతీకారం.

తన ఆత్మకథనే సినిమా తీయాలనుకున్నట్టు ఊరిని నమ్మిస్తుంది.

ఊరు మొత్తాన్నీ తన సినీమాయలో పడేసుకుంటుంది.

తన ప్రతీకార పథకాన్నేతను తీయబోతున్నసినిమాకు క్టైమ్యాక్స్ గా కూడా రచిస్తుంది.

పథకం అమలుకు తన సొంత ఊరినే ఆయుధంగా మలుస్తుంది మీనా.

తనని గతంలో మోసం చేసిన ప్రియుడి ప్రాణాన్ని కానుకగా కోరుతుంది.

గతంలో మీనా విషయంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ఊరు,  ఇప్పుడు ప్రియుడిని చంపేందుకు మాత్రం తటపటాయిస్తుంది.

విషయం తెలుసుకున్న ప్రియుడు ‘ఎప్పుడో పదైదేళ్ళ క్రితం జరిగిన సంఘటనకు ఇంత రాద్ధాంతం చేస్తావా?’ అని నిలదీస్తాడు.

గాయం పచ్చిగా వున్న మీనా అలియాస్ మల్లికి పదైదుళ్ళు అంటే ‘అప్పుడెప్పుడో’ కాదు.

అందుకే ప్రతీకారమే ఆమె తక్షణ కర్తవ్యం.

ప్రియుడి హత్యకే పట్టుపడుతుంది.

అయితే ప్రియడి హత్య జరగదు. మల్లి ప్రతీకారం తీరదు.

ప్రియుడు చనిపోతాడు. మల్లిలోపల ప్రతీకారంతో రగిలే మీనా కూడా మిస్ అయిపోతుంది.

ఊరిలో ప్రియుడి విగ్రహం వెలుస్తుంది.

పదైదేళ్ళ క్రితం తన మెడలో వరమాల వేయించుకోవాలని ఆశపడిన మల్లి ఇప్పుడు మిస్ మీనాగానే మిగిలిపోయి తన ప్రియుడి విగ్రహానికి నివాళి మాల వేయాల్సివస్తుంది.
ఇంతకీ మల్లి, మీనాలలో ఎవరు విజయవంతతం? ఎవరు విషాదాంతం?

ఇద్దరూ రెండూనేమో!

ఇదీ నేను చూసిన మిస్ మీనా నాటకం కథాంశం.

ప్రముఖ నాటక దర్శకుడు రాజీవ్ మీనన్ చాలా ఏళ్ళుగా దేశ వ్యాప్తంగా ప్రదర్శిస్తున్న నాటకానికి ఇండ్ల చంద్ర శేఖర్ తెలుగు మెరుగులు దిద్దుకున్నప్రయత్నమే ఈ మిస్ మీనా నాటకం.
నాటకంలో చంద్ర చేసిన సవరణలు, ఇంప్రొవైజేషన్లు, డిజైన్, ప్రాప్స్  మ్యాజిక్ అంతా ఇంతా కాదు.

నాటకంలో సినిమా తాలూకు యవ్వారాన్ని చాలా సునిశిత వ్యగ్యంగా, కథకు తగ్గట్టుగా మలచుకున్న తీరు చాలా అభినందనీయం.

ఇంత మందితో పట్టు సడలని అభినయం, పైగా ఒకటికి మించి పాత్రలతో(సంగీతం, నృత్యంతో సహా) ఒకే నటుడిని/నటినీ దౌడు తీయించిన చాకచక్యం విస్మయాన్నే కలిగిస్తుంది.
సీన్ చేంజ్ లో చాలా పారదర్శకత ప్రదర్శించడంతో పాటు, దాన్ని కూడా నాటకంలోని బిగువైన అంతర్భాగంలా ప్రదర్శనకు అనుగుణంగా మలచిన పద్ధతి తాజా ప్రతిభకు తార్కాణం.

ఇక మల్లిగా ఒక చిన్న పాయగా మొదలై మిస్ మీనాగా నట నయాగరా రూపం దాల్చిన అశ్విని శ్వేతది నాటకంలోని అన్ని రంగాల విజయంలో, ప్రశంసలో ఎక్కువ శాతం దక్కించుకునే అభినయం.

మీ మాటలు

 1. Ramarao Peddi

  డోంట్ మిస్ మీనా
  http://www.saarangabooks.com
  మల్టీప్లెక్స్ ఆన్ లైన్ బుకింగ్ లతో యూత్ నిలువునా బుక్ అయిపోతున్న నిస్సాయం కాలాలలో ఎంత పొగరుండాలీ తెలుగు నాటకానికి? సాయంత్రాలను అలవోకగా చెవులు పిండీ, కళ్ళు నులిమీ కబ్జా చేస్తున్న రిమోట్లను బలదూర్ అన…

  Like · · Unfollow Post · Share · 14 hours ago.

  Naresh Nunna, Kumar Varma Kayanikorothu and 3 others like this..

  It is not Rajeev Menon it is Rajiv Krishnan. Menon is film maker and Krishnan is theatre person. The play was not written by him. It was written by Rashmi Ruth Devadasan, inspired by Durrenmatt”s THE VISIT. some people told me Rajiv Krishnan directed the play. I don’t know why Hyderabad central university is claiming the writing and direction. It is very sorry to know it.

  • Ramesh Samala says:

   Yes, It was Raajiv Krishnan, May be a small confusion by Ananth, The original version directed by him. But, as I was told, Raajiv is very much impressed by his assistant director Chandu and he himself encouraged “Chandu” to direct the Telugu version. Thge Original version was written by Rashmi Ruth Devadasan, inspired by Durrenmatt”s THE VISIT. But, I think, but not sure, Telugu version is way different from the original. We can say, it is “Inspired” from the original, not just a translation.

మీ మాటలు

*