ఆశ ఉందిగా…

kolluri“ఇంకో 48 గంటలకి మించి ఆవిడ బతకదు” అని చెప్పేసి, మా ప్రశ్నల కోసం ఆగకుండా వెనుదిరిగి వెళ్ళిపోయారు డాక్టర్ గులాటి.

ఐ.సి.యులో నాలుగో నెంబరు బెడ్ మీద ఉన్న 70 ఏళ్ళ ముసలావిడ ఆయనకి ఓ పేషంట్ మాత్రమే. కానీ నాకు, ఆమె నా జీవితం… మా అమ్మ!

నా శరీరంలోని అణువణువు వేదనతో కేకపెట్టినయ్యింది. నలభై ఎనిమిది గంటలు. కేవలం 48 గంటలు! ఈ ప్రపంచంలో మా అమ్మ ఉండేది ఇంక 48 గంటలే. ఆ తరువాత? తరువాత ఇంకేముంటుంది? నా ప్రపంచమంతా శూన్యం, నాకో పెద్ద వెలితి.

దాదాపు పదేళ్ళపాటు నేను అమ్మతో ఒక్కసారి కూడా మంచిగా మాట్లాడలేదు. నా కష్టనష్టాలన్నింటికీ అమ్మనే నిందించాను. నాకు ఉద్యోగం లేదు, దానికి అమ్మనే నిందించాను. చదువులో గొప్ప గొప్ప ఘనతలేం సాధించలేదు, దీనికి అమ్మనే తప్పుబట్టాను. నేను ఆత్మన్యూనతా భావంతో బాధపడ్డాను, దానికి కూడా కారణం అమ్మేననుకున్నాను. నింద…నింద…నింద. ఈ పదేళ్ళలో నేను ప్రతీ దానికీ అమ్మని నిందిస్తునే ఉన్నాను.

“ఈ భూమి మీదకి రావడం నా తప్పు కాదు” అని ఒకసారి అమ్మతో అన్నాను, నా అభిమాన నటుడిని అనుకరిస్తూ. అదే డైలాగ్‌ని అతను ఏదో సినిమాలో చెప్పినట్లు గుర్తు. కానీ వెంటనే నాలిక కరుచుకున్నాను. కానీ ఒక్కసారి నోరు జారామా, మాటల్ని వెనక్కి తీసుకోలేం.

అయినా, హృదయాంతరాళాలలో ఎక్కడో నేను అమ్మని ప్రేమించాను. అత్యంత గాఢంగా ప్రేమించాను. కానీ ఎన్నడూ వ్యక్తం చేయలేకపోయాను. పాపం, ఆ నిస్సహాయురాలు మాత్రం ఏం చేస్తుంది? నేను ఇంటర్ చదువుతూండగానే నాన్న చనిపోయాడు. తన ముద్దుల కొడుకు మానసిక వైకల్యం బారిన పడడం తట్టుకోలేక, కుమిలిపోయాడు. అవును, మా అన్నయ్య…. మేమందరం మా కుటుంబపు ఐన్‌స్టీన్ అని పిలుచుకునే అన్నయ్య….. దేశంలోని ఓ ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో బి.టెక్ చదువుతున్న అన్నయ్య… ఉన్నట్లుండి మానసిక వ్యాధికి గురయ్యాడు.

చిన్నతనంలో అమ్మ కోసం ఎర్ర కారు కొంటానని చెప్పిన అబ్బాయే, మానసిక ఆరోగ్యం సరిగా లేక ఉన్మాద స్థితిలో అమ్మపై చేయి చేసుకునేవాడు. అతను జబ్బు పడ్డాడు. తీవ్రంగా జబ్బు పడ్డాడు. నాన్న అది భరించలేకపోయారు. ఆయన హృదయం తట్టుకోలేకపోయింది. గుండె ఆగిపోయింది. వెర్రి మేధావితో సహా, అయిదుగురు పిల్లల్ని సాకాల్సిన బాధ్యత అమ్మకి వదిలి నాన్న తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు.

మేమంతా అప్పటికింకా చిన్నపిల్లలమే. మా కాళ్ళ మీద మేము నిలబడి, అమ్మకి ఆసరా ఇవ్వలేకపోయాం. డబ్బుకి ఎప్పుడూ కొరతే. అమ్మ ఎంతో ఓపికగా భరించింది. ఓ కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో అమ్మ గుమాస్తాగా పనిచేసింది. వచ్చే కొద్దిపాటి జీతంతోనే మమ్మల్నందరిని పెంచి పెద్దచేసింది.

మరి కొత్త బట్టలు ఎక్కడ్నించి వస్తాయి? నాకు కొత్త బూట్లు ఎలా కొనివ్వగలుగుతుంది? అయితే ఈ చిన్నచిన్న విషయాలు నా బుర్రలో నాటుకుపోయాయి. నన్ను సరిగా పెంచలేదనే భావం నాలో కలిగింది. ఏ మాత్రం సణుక్కోకుండా అమ్మ ఆ నిందల్ని భరించింది.

ఇప్పుడు, ఐ.సి.యులో నాలుగో నెంబరు బెడ్ మీద, సగం అపస్మారక స్థితిలో పడి ఉంది. ఇక బతికేది 48 గంటలే. నేను ఆమెని ఎంతగానో బాధపెట్టినందుకు క్షమాపణ కోరనూ లేను. “అమ్మా, ఐ లవ్ యు” అని గట్టిగా అరవాలనుకున్నాను.

“అమ్మా, నేను నిన్ను నిజంగా బాధపెట్టాలనుకోలేదు. నిన్ను ఎంతగానో ప్రేమించాను. నిజం. ఇప్పటికీ ప్రేమిస్తునే ఉన్నాను…” అని చెప్పాలనుకున్నాను. కానీ అమ్మకి వినబడుతుందా? నా నోట్లోంచి వచ్చే పదాలను అమ్మ గ్రహించగలుగుతుందా? సందేహమే! ఆలస్యం అయిపోయింది…… ఓ జీవిత కాలం ఆలస్యమై పోయింది!

నా జీవితంలో తుఫాను చెలరేగింది. ఇటువంటిది మునుపెన్నడూ నేను అనుభవించలేదు. నాలోని అణువణువు నా నుంచి వేరుపడి స్వేచ్ఛ పొందాలనుకుంటున్నాయి. నేను కూడా చచ్చిపోతే  బావుండనిపించింది. అమ్మ లేకుండా నేను బతకలేను. నా అంతర్మధనం, ఆలోచనల్లో పడి బయట ఏం జరుగుతుందో అసలు పట్టించుకోలేదు.

***

ఆసుపత్రి బయట కూడా తుఫాన్ చెలరేగింది. నగరం అల్లకల్లోలంగా ఉంది. ఒక వర్గం వారికి చెందిన ప్రార్థనా స్థలాన్ని ఎవరో అపవిత్రం చేసారటచేశారట.  ఇళ్ళు తగలబెట్టారు, బడులు దోచుకోబడ్డాయి, ఆడవాళ్ళు మానభంగాలకి గురయ్యారు, జనాలు చంపబడ్డారు. కత్తులు చేతబట్తిన ముష్కరమూకలు నగరమంతా సంచరిస్తున్నాయి. బాగా డబ్బున్న వాళ్ళు చేతుల్లో రివాల్వర్లు ఉంచుకుంటున్నారు.

నాకు హఠాత్తుగా “మియా” గుర్తొచ్చాడు. ఎప్పటి మాట? దాదాపు నలభై ఏళ్ళ క్రితం సంగతి.

నేను స్కూలుకి వెళ్ళే రోజుల్లో అతను మా ఇంటికి రావడం నాకు గుర్తుంది. ఓ బుట్టనిండా చేపలు తీసుకొచ్చి మా గుమ్మం ముందు పోసేవాడు. “మియా, నా దగ్గర డబ్బులు లేవు, చేపలు తీసుకు పో” అనేది అమ్మ. కాని మియా అదేమీ పట్టించుకునేవాడు కాదు. మా బెంగాలీలం రోజూ జలపుష్పాలను ఆహారంలో తీసుకోవాల్సిందే. డబ్బుదేముంది? ఉన్నప్పుడే ఇవ్వండి అన్నట్లుగా డబ్బు ఎప్పుడిస్తామో అని అడగనైనా అడగకుండా, అతను ఈల వేసుకుంటూ నడిచి వెళ్ళిపోయేవాడు.

మియా ఓ చిన్నపాటి జాలరి. అతనికి పడవా లేదు, వలా లేదు. ఉన్నదల్లా, శిధిలమైన గాలపు చువ్వ మాత్రమే. దానికే ఎరని కట్టి రోజంతా కష్టపడితేగానీ పూటగడవదతనికి. ఆ చేపలని వేరే ఎక్కడైనా అమ్ముకుంటే అతనికి చాలా డబ్బు వచ్చి ఉండేది. అయినా…..! ఆ చేపలు మా ముందే ఉండేవి, అతను మాయమైపోయేవాడు. తన పిల్లలకి ఆ పూట భోజనం పెట్టడానికి మియా దగ్గర తగినంత డబ్బు ఉందో లేదో మాకెప్పుడూ తెలియలేదు. ఎన్నో చేపలని మాకొదిలేసేవాడు, వాటిల్లోంచి ఒక్కటి కూడా తన ఇంటికి తీసుకువెళ్ళడం నేనెప్పుడూ చూడలేదు.

మర్చిపోయిన ఇంకో వ్యక్తి… రాజు. నిజానికి అతను రజాక్.. లేదా అలాంటిదే ఏదో అతని పేరు. కాని అతను రాజు ఎలా అయ్యాడో మాకెవరికీ తెలియదు. మా పిల్లలందరం రాజు అంటే ఎంతో భయపడేవాళ్ళం. ఆ మనిషంటే భయం కాదు, కానీ అతని చేతిలో కత్తెర, దువ్వెన చూస్తే మాత్రం భయం…!

అవును. రాజు మంగలి. పొడుగ్గా ఉండేవాడు, సైకిల్ తొక్కుతూ వచ్చేవాడు. అతన్ని చూడగానే మేము జారుకోడానికి ప్రయత్నించేవాళ్లం. అప్పట్లో బాలీవుడ్‍లో హీరోలంతా భుజాల దాక జుట్టు పెంచేవారు. మేము కూడా మా హెయిర్ స్టైల్ అలాగే ఉండాలని అనుకునేవాళ్లం. అయితే ఎవరో ఒకరు బలైపోయేవాళ్ళు, తమ చిన్న కాళ్ళతో ఎక్కువ దూరం పారిపోలేక పోయే వాళ్ళు. వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తున్న కుర్రాడ్ని వాళ్ల నాన్న చెవులు మెలేసి తీసుకొచ్చి, బలిపీఠం లాంటి కుర్చీలో కూర్చోబెట్టేవాడు. దూరం నుండి నాన్న చూస్తుండంగా,అస్పష్టమైన ఉల్లాసంతో రాజు కుర్రాడికి అంటకత్తెర వేసేసేవాడు.

మంచి క్షురకులకు ఉండే ఓ విశిష్టమైన గుణం రాజుక్కూడా ఉంది. అదే ముచ్చట్లు చెప్పడం. అతనికి ఎన్నో కథలు తెలుసు. కుర్చీలో ఏడుస్తూ కూర్చున్న కుర్రాడు తొందర్లోనే ఏడుపు ఆపేసి, నవ్వులు చిందిస్తూ, రాజు చెప్పే కథలు వింటూ ఆనందించేవాడు. అతని సంతోషం చూసి, మేము కూడా చాలా మంది రాజుకి దగ్గరగా వెళ్ళేవాళ్లం. అంతే, మేమూ దొరికిపోయేవాళ్లం. రాజు కులాసాగా కబుర్లు చెబుతూ, తన పని కానిచ్చేసేవాడు.

ఆసుపత్రి బయట రెండు వర్గాల వాళ్ళు గొడవపడుతున్నారు.

ఐ.సి.యు.లో ఐదో నెంబరు బెడ్ ఖాళీగా ఉంది. ఎంతో సేపు కాదు. మా అమ్మ వయసే ఉండే ఓ ఆవిడని వీల్ చైర్ లో తీసుకువస్తున్నారు. పొడుగాటి గడ్డం ఉన్న ఓ బలిష్టమైన వ్యక్తి, బహుశా నా ఈడు వాడేనేమో, ఆమె వెనుకే వస్తున్నాడు.

దాడికి పాల్పడిన వాళ్ళు అతని మెడ నరకాలనే అనుకున్నారట. కానీ ఈ ముసలావిడ అడ్డం వచ్చిందట. అయితే విసిరిన కత్తి వెనక్కి రాదుగా, ఆమె చేతిని ముక్కలు చేసేసింది. దాడి చేసిన వ్యక్తి, అతని సహాయకుడు అక్కడ్నించి పారిపోయారట. తమ చర్యకు సిగ్గుపడి పారిపోయారో లేక మరేదైనా కారణమో ఎవరూ చెప్పలేకపోయారు.

ఆవిడ పెదాలపై చిరునవ్వు తొణికిసలాడుతోంది. తన కొడుకు ప్రాణాలని కాపాడుకుందావిడ. తెగిపోయిన ఆమె చెయ్యి, వేలాడుతోంది. ఆమెని వెంటనే ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్ళి సర్జరీ చేసారు. తెగిపోయిన చెయ్యిని బాగుచేయడానికి తీసుకోవాల్సిన తక్షణ చర్య అది. దుండగులు జరిపిన దాడిలో చేతి నరాలు, స్నాయువు పూర్తిగా దెబ్బతిన్నాయట. అవి లేకుండా చెయ్యి ఉండడం అలంకార ప్రాయమే. ఎవరైనా దాత స్నాయువు, పట్టా దానం చేస్తే ఆవిడ చెయ్యి మాములుగా అవుతుందని డాక్టర్ చెప్పారు.

నేను వార్డులోకి వచ్చేసరికి అమ్మ కళ్ళు తెరిచింది. స్పృహలో ఉంది. దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. “అమ్మా” అన్నాను. దాదాపు పదేళ్ల తర్వాత “అమ్మా” అని పిలిచాను. “బాధగా ఉందా?” అడిగాను. తల అడ్డంగా ఊపింది. నా మాటలు అమ్మకి వినబడుతున్నాయి. నేనేం చెబుతున్నానో అమ్మకి అర్ధం అవుతోంది.

అమ్మ తల నిమిరి, “పడుకో అమ్మా” అన్నాను. చిన్నపిల్లలా నవ్వుతూ, నా ఆజ్ఞ పాటించింది.  అమ్మ మంచం పక్కనే ఒంగి కూర్చుని, అమ్మ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాను. “నువ్వు అందరికంటే మంచి అమ్మవి” అన్నాను. నాకు మనశ్శాంతి లభించింది. ఇంతలో మా సోదరి రావడంతో, నేను అక్కడ్నించి బయటకి వచ్చేసాను. పేషంట్ దగ్గర ఒకరినే ఉండనిస్తారు.

సుమారుగా అరగంట తర్వాత, మా సోదరి వెక్కివెక్కి ఏడుస్తూ బయటకి వచ్చింది. “అమ్మ….” అంటూ ఇంకేం చెప్పలేకపోయింది. అమ్మ మరణాన్ని నేనే వేగవంతం చేసానేమో. తన కొడుకు తనని ఎప్పుడూ ప్రేమిస్తునే ఉన్నాడన్న గ్రహింపుతోనే ఆవిడ చనిపోయింది. ఈ గ్రహింపు ఆమెలో రక్తప్రసరణా వేగాన్ని పెంచినట్లుంది. బలహీనమైన గుండె దాన్ని తట్టుకోలేకపోయింది. ఈ ఆసుపత్రిలో చేరడానికి ఎన్నో కారణాలున్నాయి. రక్తప్రసరణహీనత వల్ల వచ్చే గుండెపోటు అందులో ఒకటి మాత్రమే.

నా ప్రపంచం స్థంభించిపోయింది. డాక్టర్‍కి నేనేం చెప్పానో నాకే అర్థం కాలేదు. నా మనసు, నా శరీరం ఒకదానికొకటి  మైళ్ల దూరంలో ఉన్నాయి. ఏవో కాగితాల మీద ఆయన నా సంతకాలు తీసుకున్నాడు. మా అమ్మ చేతి నరాలు, స్నాయువు బెడ్ నెంబరు అయిదు మీదున్న ముసలావిడకి దానం చేయమని కోరాను. లాంఛనాలు పూర్తయ్యాయి. సంప్రదాయల ప్రకారం అంతిమ సంస్కారాల కోసం అమ్మని ఇంటికి తీసుకువెళ్లాం.

***

పదేళ్ళు గడిచిపోయాయి. నేను నిత్యజీవితపు గాడిలో పడ్డాను. రోజూవారీ అవసరమయ్యే సామాన్లను ఓ పెద్ద బరువైన సంచీలో పెట్టుకుని ఇల్లిల్లూ తిరుగుతూ అమ్ముకుంటూ జీవితం గడుపుతున్నాను. ఓ రోజు ఓ ఇంటి తలుపు కొట్టాను. పొడుగాటి గడ్డం ఉన్న బలిష్టమైన వ్యక్తి తలుపు తీసాడు. గడ్డం తెల్లబడింది. “మాకేం అక్కర్లేదు, వెళ్ళిపో” అంటూ తలుపేసుకోబోయాడు. ఉన్నట్లుండి నన్ను గుర్తుపట్టినట్లున్నాడు.

లోపలికి తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టాడు. వాళ్లమ్మ, ఇప్పుడు 80 ఏళ్ళు ఉంటాయోమో, తన గదిలోంచి బయటకు వచ్చింది. కానీ నన్ను గుర్తు పట్టలేదు. ఆవిడ ఆసుపత్రిలో ఉన్నప్పుడు నొప్పి తెలియకుండా ఉండేందుకు ఆవిడకి మత్తుమందు ఎక్కువగా ఇచ్చారు. అప్పట్లో తనని చూడడానికి వచ్చిన వారిని గుర్తుంచుకోడం ఆమెకి కష్టం.

కొడుకు ఆమెకి వివరించాడు. ఆవిడని ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు ఆమె మొహంలో కనపడిన బలహీనమైన నవ్వు మళ్ళీ ఇప్పుడు ఆవిడ పెదాలపై ప్రత్యక్షమైంది. బయట ఎంతో ప్రశాంతంగా ఉంది. పదేళ్ళ క్రితం జరిగిన రక్తపాతాన్ని గుర్తు చేసే ఒక్క మూలుగు కూడా లేదు.

అయినప్పటికీ, ఆవిడని అడిగాను – “ఏమైనా ఆశ ఉందా?” అని.

ఆవిడ తన కుడి చేతిని…. మా అమ్మ చేతిని… పైకెత్తి నా తల మీద ఉంచి, “అవును నాయనా, ఆశ ఉంది” అంది.

ఆంగ్లం: ప్రణబ్ మజుందార్
తెలుగు: కొల్లూరి సోమ శంకర్

(ప్రణబ్ మజుందార్ పూనెకి చెందిన జర్నలిస్ట్. జాతీయ వార్త సంస్థ యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (UNI)లో పదిహేడు సంవత్సరాలు పనిచేసారు. న్యూస్ ఎడిటర్‌గా యు.ఎన్.ఐ నుంచి విరమించుకున్నారు. అంతకుముందు ఫ్రీ ప్రెస్ జర్నల్ గ్రూప్ వారి పక్షపత్రిక “ఆన్‌లుకర్”లోనూ, “ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్” అహ్మదాబాద్ ఎడిషన్ లోనూ, పూనెకి చెందిన “సకల్ టైమ్స్” లోనూ పనిచేసారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా వ్యవహరిస్తున్నారు.)

 Front Image: Mahy Bezawada 

మీ మాటలు

 1. రమాసుందరి says:

  హృద్యమైన కధ. అనువాదం చాలా సాఫీగా ఉంది.

 2. బాగుంది శంకర్.

 3. RammohanRao thummuri says:

  మియా ప్రస్తావన వచ్చే దాకా అనువాదం అనిపించలేదు.అక్కడైనా మా బెంగాలి అనే పదం ఆ సూచన ఇచ్చింది.అంతరంగ విశ్లేషణ చాలా బాగుంది. మానవత్వం పరిమళించే కథ .అనువాదకుడిగా కథకు న్యాయం చేకూర్చారు సోమ శంకర్ గారు

 4. రాజేశు దెవభక్తుని says:

  కధ చాలా హృద్యంగా ఉంది, నాకైతే కళ్ళు చమర్చాయి, ” మా బెంగాలిలు ” అనే పదం వరకు ఎక్కడా ఇది అనువాద కధ అని అనిపించలేదు, అక్కడి వరకు ఇదే మాతృక అన్నంతగా ఈ కధను మలచడంలో రచియుత సఫలత సాధించారు.

  పాఠకుడికి ఆసక్తి రేకెత్తించే / ఆలోచింపచేసే కధలను తర్జుమాకు ఎంచుకోవడంలో సోమశంకర్ గారు ఎప్పుడు ముందుంటారు, ఈ విషయం ఆయన ఇప్పటికే వెలువరించిన రెండు కధా సంకలనాలను చదివితే తెలుస్తుంది.

  గమనిక : పై నుండి ఐదో లైన్ లో “కేకపెట్టినయ్యింది” అని ఉంది, అక్కడ “కేకపెట్టినట్లయ్యింది” అని ఉండాలనుకుంటా..?

 5. అనిల్ గారు, రామ్మోహన్ రావు గారు, రాజేశ్ గారు,
  ధన్యవాదాలు.

  ఈ కథలో దొర్లిన టైపాట్లకు బాధ్యత నాదే. చదువరులకు కలిగిన ఇబ్బందికి చింతిస్తున్నాను. ఈ తప్పుని సరిచేయవలసిందిగా సంపాదకులను కోరుతున్నాను. ఇకపై కథలు పంపేడప్పుడు మరింత జాగ్రత్త వహిస్తాను.

 6. buchi reddy says:

  కథ బాగుంది –సర్
  బుచ్చి రెడ్డి గంగుల

 7. వస్తువు దృష్ట్యా మంచి కథ. మీ అనువాదం కూడా బావుంది, సాఫీగా. కానీ కథనం వొదులువొదులుగా ఉండడం, బహుశా మూలకథలో ఉన్నది, అది కూడా తర్జుమా అయింది అనువాదంలోకి.

 8. G.S.Lakshmi says:

  మనసుతో చదివింపచేసిందీ కథ…

 9. మానవత్వపు స్పర్శ వున్న మంచి కధ .

మీ మాటలు

*