ఈ కవిత చలిమంచు జలపాతమే!

vasuగుండెలపై వర్షం, కొబ్బరినీళ్ళ సువాసనా, పొలంగట్లపై తాటిముంజెల తీపీ, నీరెండలొ సరస్సులో స్నానం ఇలాంటివన్ని కలగలిపి మరీ అనుభూతిస్తే అది పులిపాటి కవిత్వం.

కవిత్వం ఆనందాన్నిస్తుందని తెల్సు, అనుభూతుల వానలో తడుపుతుందనీ తెల్సు కానీ ఆ వర్షంలో తడిసే అవకాశం వచ్చింది మాత్రం డాక్టర్ పులిపాటి గురుస్వామి కవిత్వం చదివాకనె. వృత్తిరీత్యా శారీరక రుగ్మతలకి వైద్యం చేసే ఈ డాక్టర్ మన మనసుకీ చికిత్స చేస్తాడు. ఈయన కవిత్వం చేదులేని ఔషధాలె. సున్నితంగా మనసుమీట నొక్కుతాడు దానికి మీరు లొంగారా ఇక అంతే! చదవాల్సిందె. మంచులో నానబెట్టిన అక్షరాలకి తేనె అద్ది మరీ అందిస్తాడీ స్వామి. కవితని పండించడంలొ మాటల పల్స్ తెలిసిన వైద్యుడు.

“మీరు కవిత్వాన్ని పట్టారు అది ఇప్పుడు మీకు దాసోహం అంటోంది” అన్నాను ఆయన దీర్ఘకవిత “జీవిగంజి” చదివాక. దానికాయన నిరాడంబరంగా నవ్వి “అదేంలేదు మిత్రమా! కవిత్వం దానంతటదే వచ్చి భుజంపై కూర్చుంటుంది. దాన్ని కిందకి దింపి రంగులద్దుతాను” అన్నారు.

ఈ కవిత చూడండి “చలిమంచు జలపాతంలొ…” అన్న శీర్షికతో!

మొదటి వాక్యమే మనల్ని కట్టిపడేసి మనగురించీ, మన మనసు గురించీ ఇతనికెలా తెలిసిందనే ఆశ్చర్యంలొ నుంచి బయటపడకముందే కవిత్వం ఆసాంతమూ చదివేస్తాం.

పూర్తిగా అనుభూతి ప్రధానంగా సాగే స్వామి కవితల్లొ ఇదొక ప్రత్యేక రచన.

“మంచు ముఖమల్ మనసుమీద నడిచిరా..!” అన్న మొదటి వాక్యం కవిత్వం ఇంత అందంగా ఉంటుందా అని అనుకోవాల్సిందె….ముఖ్యంగా ఆ ఎల్లిటరేషన్ బాగా అచ్చొచ్చినట్టు పండింది. మనసు సున్నితత్వాన్ని కవితాత్మకంగా చెప్పడలగడంలో “మంచులో తడిసిన మఖమల్” ప్రయోగం బాగా పండిందనడంలో ఏమాత్రం అతిశయోక్తిలేదు.

పాఠకుడి మనసుని తన స్వాధీనంలోకి తెచ్చేసుకుంటూ అలా ఓ కవితని మొదలుపెట్టడం చాలా కొంతమందికే చాతనవుతుంది. అందులో  డాక్టర్ స్వామి ఒకరు.

ఇంకా ముందుకెళ్లాక మనల్ని మనమే తట్టిలేపి గుండెలమీద కొట్టుకునే వాక్యం ఉంది “నిలువెల్లా మీటడానికి నీ నాద శరీరం సిధ్ధమేనా..!” అని. ఔను. మన శరీరం ఓ వీణో, సితారో అయితే మీటే వాద్యకారుడు ఉంటే ఎంత చందం అది. ఆ అనుభూతిని ఇక్కడ ఓ క్షణం ఆగి మరీ ఆనందించాల్సిందె…. అదికూడా “నిలువెల్లా  మీటగలిగేలా”!

“పక్షులు నేర్చుకున్న రాగాల
పరవశం నీకోసం
గుప్పెట్లో పట్టి ఉంచుకున్నాయి”

ఇది అర్ధమవ్వటానికి నాకు చాలా టైమె పట్టింది..అర్ధమయ్యాక అర్ధమయ్యిందేంటంటే ఇక్కడొక కామా (,) మిస్సయ్యందని! పక్షులు అన్నపదం తర్వాత ఆ కామా లేకపోవటం కొంచెం కన్ఫ్యూజన్ కి గురిచేస్తుంది పాఠకులని అనే అనుకుంటున్నాను.

“చలిగింతలు మాటుకాస్తున్నాయి” లో చలిగింతలంటే అర్ధంకాకపోయినా ఆ పదం గిలిగింతలుపెట్టకమానదు.

మనకి కుచ్చలిగింత మాత్రమే తెలుసు, ఇప్పుడు మరో కొత్త పదం “చలిగింత.” తెలుగులోని అక్షరాలని ఇలా వాడుకోవచ్చా అనిపిస్తుంది ఇది చదివినప్పుడు. కానీ ఈ ప్రయోగం ఏంటని అనిపించకా మానదు.

“పండు ఊహల సవ్వడి…” ఆ భాగంలో నాకుకొన్ని చోట్ల విభేదాలున్నా “చిటారుకొమ్మల చిలిపి చిగురాకులు” ఓ రసరమ్య అనుభూతే. కానీ తర్వాత వచ్చిన ఆ మూడు వాక్యాలే కవితని నిలబెట్టాయి అని అనడం అతిశయోక్తిగా అనుంటే క్షంతవ్యుణ్ణే.

“వేకువలో జారిపోయే
ఈ పచ్చని వెన్నెల తాగగలిగితె
అమరత్వం దగ్గరగా  జరుగుతుంది

ఇలాంటివి డాక్టర్ పులిపాటిని మనకు దగ్గర చేస్తాయి. ఈ వాక్యాలు అర్ధం అయితే పాఠకులకి అమరత్వం సిధ్దించినట్లే. మీరు మీ ఇంట్లో సన్నజాజి పందిరి కింద నిలబడి వెన్నెలని తాగుతుంటేనో తింటూంటేనొ ఆ అనుభూతిని ఎవ్వరికీ ట్రాన్స్‌‌ఫర్ చెయ్యలేరు. అది మీకు మాత్రమే సొంతం. ఆ వెన్నెలని భోంచేస్తూ ఇది నెమరేస్కోండి, నోట్లో పాన్ పెట్టుకుని మరీ. మీకు కవిత్వం నచ్చినట్లే. ఇప్పుడు మీకూ రాయాలనిపిస్తోందా? అలా అనిపిస్తే అది ఆయన తప్పు కాదు. మీచేత భావుకత్వం నమిలిస్తాడు ఈ డాక్టర్.
అంతా బానే ఉంది కానీ మరి ఇలా మధ్యలో ఒదిలేసి వెళ్ళిపోయాడేంటి అని అనుకుంటే అది మీ తప్పుకాదు. నాకూ అలానే అనిపిస్తుంటూంది ఈయన కవిత్వం చదువుతూన్నప్పుడు.

guru ఔను.
“గుండెని భద్రంగా/ అమలినంగా పట్టుకుని రా
ఒలకని సౌందర్యసత్వం
నిండుగా నింపుకొని పొదువు…”

అని అర్ధాంతరంగా ముగిస్తాడీయన.

అలా మనం చదువుతూ ఉండగానే హఠాత్తుగా కవిత ముగియటం మనసుకి కొంచెం కష్టమె.

నా కంప్లైయింట్స్ లో ప్రధానమైనదిదె. ఈయన కవితలు ఇలానే అర్ధాంతరంగా ముగుస్తాయి. ఓ పద్యం ప్రాంరంభమై దాన్ని చదివి ఆస్వాదించేలోపే అది ఉండదు. ఓ అద్భుతవాక్యంతో అతని కవిత మొదలవుతుంది. మనం మనకి తెలియకుండానే కవిత్వ ఫ్లోలొ కొట్టుకుపోతుంటాం (ఆనందంగానే). ఈలోపులో మాయం. దబ్బున కిందపడతాం.

ఉదాహరణగా ఈ కవితే తీస్కుందాం.

“చలిమంచు జలపాతంలొ.”

ఇదొక underdeveloped కవితగా ఉండిపోతుంది.

“మంచు ముఖమల్ మనసుమీద నడిచిరా..!”  అని మొదలుపెట్టి  ప్రేయసిని (అని అనుకుందాం కొంచెంసేపు) ఉద్దేశించి రాసాడనుకుందాం…. మరి అదే మూడ్‌‌ ని అందించే ముగింపు లేదు.

మధ్యలో చాలా భావుకత్వపు పదప్రయోగాలు నడిచాయి. అవన్నీ కవితని నడిపిస్తాయే తప్ప కవితా వస్తువేంటనే పాఠకుడి ప్రశ్నకి జవాబు నివ్వలేవు. కొన్ని స్టేట్ మెంట్స్ తప్ప.

“అమరత్వం దగ్గరగా జరుగుతుంది” అన్న వాక్యం ఓ డిక్లరేషన్లాగానె మిగిలిపోతుంది, మిగతా వాక్యాల సరళితో పొంతనలేకుండా.

ఈయన కవిత్వంతో ఉన్న పేచీ ఇదేనేమొ. చాలా వరకూ చిన్న కవితలే.

అయితే ఆ కవిత్వాన్ని ఎందుకు చదవాలంటే కొని ఆణిముత్యాల్లాంటి వాక్యాల కోసం.

మీకు ఇలాంటీ వెన్నెలని భోజనం చెయ్యాలంటే అతని బ్లాగు కెళ్ళీ అతని కవిత్వమంతా చదవండి.
http://pulipatikavithvam.blogspot.com

***

చలిమంచు జలపాతం లో…..

 

మంచు మఖమల్ మనసు మీద
నడిచి రా…!

ఇక్కడ ఆకాశం విరిసి
ప్రవహించిన గాలులు
నింపుకున్న నేరేడు ,చింత వేప సోయగాలు
నిలువెల్లా మీటడానికి
నీ నాద శరీరం సిద్ధమేనా…!

పక్షులు నేర్చుకున్న రాగాల
పరవశం నీకోసం
గుప్పెట్లో పట్టి ఉంచుకున్నాయి.

చలిగింతలు
మాటు కాస్తున్నాయి

పండు ఊహల సవ్వడి
వినటానికి
చిటారు కొమ్మల చిలిపి చిగురాకులు
నిశ్శబ్దంగా …
చూపుల్ని భద్రపరిచాయి.

వేకువలో జారిపోయే
ఈ పచ్చని వెన్నెల తాగగలిగితే
అమరత్వం దగ్గరగా జరుగుతుంది.
గుండెని భద్రంగా
అమలినంగా పట్టుకొని రా…!

ఒలకని సౌందర్యసత్త్వం
నిండుగా నింపుకొని పొదువు…

***

కవి స్కెచ్: ఎస్వీ రామశాస్త్రి

మీ మాటలు

 1. రమాసుందరి says:

  చాలా చక్కని పరిచయం ఇచ్చారు, పులిపాటి కవిత్వం మీద. నేను కవిసంగమం లోకి వచ్చిన కొత్తల్లో ఆయన ఎంచుకొన్న కవితా వస్తువులకు ముగ్ధురానయ్యేదాన్ని.

 2. గురుస్వామిగారి కవిత్వం లలితంగా, సౌందర్య స్పృహతో నిండి ఎలా ఆనందపరుస్తుందో, మీ కవిత్వ పరామర్శ అలానే ఆనందాన్నిచ్చింది. మీ ఇద్దరిలోని సమానధర్మాలే ఒక రసమయలోకాన్ని మీఇద్దరి మధ్యా ఆవిష్కరించాయనిపిస్తోంది. కవిత్వమూ, విమర్శా రెండింటిలోని సౌందర్యమూ చాలా ఆనందాన్నిచ్చాయి.

  • ప్రసాద్ గారూ మీరన్నది నిజమని నమ్మకతప్పదు. విమర్శా సౌందర్యం కూడా ఆనందాన్నివ్వటం నాకూ ఆనందంగ ఉంది, ధన్యవాదాలు

 3. మంచి పరిచయం వాసుదేవ్ గారు, స్వేచ్ఛగా, స్వచ్ఛంగా వుంటూ ప్రత్యేకతను చాటుకుంటుంది గురుస్వామి గారి కవిత్వం,..అక్కడ కామా అవసరం లేదేమో కదా,…

  • భాస్కర్ గారూ ధన్యోస్మి. మీరు ఆసక్తిగా చదివారన్న విషయం సుస్పష్టం. ఐతే నేను చదివిన కోణంలొనైనా పొరపాటు ఉండుండాలి లేదంటే “పరవశం” తర్వాతైనా ఓ కామా ఉండాలెమొ..స్పష్టతకోసం.

 4. kranthisrinivasarao says:

  అంతరంగం లోంచి లేచిన పక్షులు చిగురుటాకులు తింటూ వెన్నెల తాగుతూ మత్తెక్కి తూగుతూ కొత్తరాగాలు రుచి చూపిస్తూ …. ….

  ఆరుద్ర పురుగుల మెత్తదనం
  ఆరుద్రుని నెత్తిపై వెన్నెలదనం
  వెన్నెల మట్టి తోబుట్టువు
  అమృతత్వం
  మనసునిండా చల్లి ….. సీతకోక చిలుకల రెక్కలై …. సౌందర్యపు కనురెప్పలై …..మళ్ళెప్పుడొస్తాయాఅని ……ఎదురుచూపుల ……తియ్యదనాన్ని …మనసు పెదాల కంటించి ……మాయమవుతుంటాయి ….. …..పంజా విసరని పులి ..విడిచే .అక్షర పక్షులవి ……..వాసుదేవా ….నీవు పంచిన ప్రసాద మింకా …బాగున్నది

 5. ఇది చదివాక అనిపించింది..ఒక కవే మరొక కవిని అర్థం చేసుకోగలడు అని!

  • ధన్యోస్మి ప్రవీణ.మీరూ కవయిత్రే కాబట్టే మీకు నచ్చిఉండాలనుకుంటున్నాను…కొన్ని ప్రాతిపదికలు సామాన్యంగా ఒకే సారూప్యతని కలిగిఉంటాయన్నది అనుభవమె.

 6. సాయి పద్మ says:

  కవిత్వం దానంతటదే వచ్చి భుజంపై కూర్చుంటుంది. దాన్ని కిందకి దింపి రంగులద్దుతాను…అన్నారు గురుస్వామి గారు, ఆయన ట్రేడ్ మార్క్ , మెత్తటి ముఖమల్ కవితలా .. ఏ మాత్రం హడావిడి లేకుండా..

  ఇక్కడ విమర్శ కూడా అంత సూటిగా సహజంగా వచ్చి మన మనస్సులో కూర్చున్నట్టు రాసేరు . చాలా మంచి మరియు సహజమైన పరిచయం శ్రీనివాస్ వాసుదేవ్ గారూ.

  • ధన్యోస్మి. మీ స్పందన ఒకింత ఆశ్చర్యంతో కూడిన ఆనందమె,..నచ్చిందన్నారు కాబట్టి ఇక ఇలా
   రాయొచ్చని నిర్ణయించుకోవచ్చా….

మీ మాటలు

*