ఛానెల్ 24 / 7 – 4వ భాగం

స్టూడియోలో అన్ని లైట్లు గబుక్కున వెలిగాయి.

ఇంకో అరగంటలో ముగించాలి అన్నది స్వాతి. నయన తల ఊపింది.

“ఇన్నేళ్ల జర్నలిస్ట్ జీవితంలో మీకు నచ్చని అంశం ఏమిటి మేడం,” అన్నది నయన.

“నిజాయితీని నటించటం” అన్నది చప్పున స్వాతి.

“నిజాయితీని ఎలా నటించగలం మేడం” అన్నది నయన ఆశ్చర్యంతో.

“నయనా. నాలుగు రోజులు క్రితం మనం ఒక లొకేషన్‌కు వెళ్ళాం గుర్తుందా?. మన ఛానెల్  నుంచి మీడియా పార్ట్ నర్ షిప్ ఇచ్చాం. కమలాంజలి  ప్రొడక్షన్ వాళ్లతో.. ఆ రోజు మనం ఓ సెట్ చూశాం. ఒక తులసికోట.. ఇంట్లోకి వెళ్ళే దారి.. ఆ దారిపైన చుక్కల ముగ్గులు. తరువాత ఓ గడప. గడపకి పసుపు పూసి బొట్టుపెట్టి.. అటువైపునుంచి అంతా ఖాళీ..

ఇటు నుంచి చూస్తే అదొక ఆధ్యాత్మిక  ప్రపంచానికి చెందిన ఒక భక్తుని ఇల్లు. అటువైపు లోకేషన్‌లో ఒకవైపు దేవుడి ప్రతిమలు, పూజ, అలంకారాలు, ఇటువైపు సెట్‌లో వీణ, వెనగ్గా త్యాగరాజస్వామి విగ్రహం. ఈ మధ్యలో ట్రాలీ కేమ్స్. చూసే ప్రేక్షకుడి దృష్టిలో అదొక అందమైన పెంకుటిల్లు. మన కళ్లముందు ఒక వైపు చక్కని ఇంటిద్వారం. బంతిపూల తోరణం. గడపదాటి ఆ ఆర్టిస్ట్ కాలు ఇటుపెట్టే యాంగిల్ వరకే షాట్. వచ్చి దేవుడి ముందు హారతి. ఒక ట్రాలీ కెమేరా దాటి ఇటువైపు వస్తే వీణని ఉంచిన వేదిక. పైన టాప్ ఏదీ లేదు. ఎత్తుగా లైటింగ్ చేశారు. ఆ లైట్ల వెలుగులోనే దేవుడి ముందు దీపాల ధగధగ. ఆర్టిస్ట్ అందమైన మొహం, నిజంగా అక్కడ ఇల్లు, ఆధ్యాత్మికత వుందా.. లేదే..

నీ కళ్లతో నీవే చూశావు. ఆ ఆర్టిస్ట్ చేతిలో బీరు కాన్ వుంది. సిగరెట్ కాలుస్తున్నాడు. పంచెకట్టుపై పట్టు కండువా. మొహం ఎంత అందంగా వుంది. బీరు తాగుతూ సిగరెట్ కాల్చుతూ నిలబడ్డ మనిషి కెమేరా స్టార్ట్ అనగానే పరమ భాగవతోత్తముడు అయిపోయాడు. ఎడిటింగ్‌లో దీపం వెలుగులు, దేవుడి మొహం, అందులోంచి యాక్టర్ మొహం డిసాల్వ్ అవటం, తోరణం ఊగటం, బంతిపూల రేకలు చిరుగాలికి చిన్న కదలిక, తులసి చెట్టుపై పసుపు కుంకుమ, గూట్లో  ప్రమిద అన్నీ విడివిడిగా తీశాక ఎడిటింగ్ ఎఫెక్ట్‌తో ఆర్టిస్ట్ అర్ధనిమిలిత నేత్రాలతో సాక్షాత్తూ భాగవతోత్తముడిలాగ కనిపిస్తాడు. ఇది నిజమా, అబద్ధమా?”

“యాక్షన్” అంది నయన.

“దేర్ యు ఆర్” అన్నది స్వాతి.

“నిజాయితీని నటించలేమా నయనా”

నయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.

స్వాతిని చూడాలంటే  భయం వేసింది నయనకు. ఈవిడ ఇంటర్వ్యూ సెన్సేషన్ చేయాలని అన్నారు ఎం.డి. ఏది సెన్సేషన్ చేయాలి. ఈవిడ ఏకంగా ఎం.డి బతుకుని ముగ్గులోకి లాగరు కదా. ఒక్క నిముషంలో ఇదేం లైవ్ టెలికాస్ట్ కాదు కదా. ఆనక తీరిగ్గా టేప్ రివైండ్ చేసి విని అవసరమనుకొన్నవే ఉంచుతాడు డైరెక్టర్ అనుకొంది.

ఆమెనే తదేకంగా చూస్తోంది స్వాతి. ఆమె మొహంలోకి చిరునవ్వు వచ్చింది.

“ఇది లైవ్ కాదు కదా నయనా భయం లేదు,” అన్నది స్వాతి.

నయన ఉలిక్కిపడింది. స్వాతి వైపు చూసి సిగ్గుగా నవ్వింది.

“సారీ మేడం,” అన్నది.

మీకు కూడా నిజాయితీని నటించవలసిన అవసరం వచ్చిందా అని అడగాలని వుంది నయనకు. స్వాతి వైపు చూసింది. ఆమె నిర్లిప్తంగా చూస్తోంది టీపాయ్ పైన వున్న డిజైన్ వైపు.

“మీరు నటించారా ఎప్పుడైనా,” అన్నది నయన.

“నేను నటించనక్కర్లేదు నయనా. నా వృత్తి నా పట్ల ప్రపంచానికి ఆ నమ్మకం ఇస్తుంది. ఇప్పుడు ఆ లైవ్ చూడు. మన యాంకర్ మాట్లాడుతోంది చూడు. టాంక్‌బండ్ పైన జరుగుతున్న విధ్వంసకాండని అల్లరిమూకల దుందుడుకు చర్య అంటోంది. ఇలాంటివాళ్లా ఈ హైద్రాబాద్‌ని పరిపాలించేది అంటోంది. ప్రజలు ఏదయితే మనల్నించి ఆశిస్తున్నారో దాన్నే మన స్క్రిప్ట్ చెబుతాయి. వాళ్ల అభిప్రాయం ఏదయితే వుందో దాన్ని వాళ్లకంటే చక్కగా మాటల్లో చెప్పగలుగుతాం. ఈ వృత్తి ఇచ్చిన అవకాశం అది.

ఒక యథార్థాన్ని కరెక్ట్ గా  ప్రజల దృష్టికి తీసుకువెళ్లే సాధనం మీడియా. మనం కనిపిస్తూ  ప్రజల అంతరాత్మలాగా ఉంటాం. ఈ లైవ్ అయిపోయాక ఆ  యాంకర్ ఎవరి పక్షాన వుంటుందో ప్రేక్షకులకు తెలుసా? ఆ లైవ్‌ని అక్కడ నుంచి కవర్ చేస్తున్న రిపోర్టర్ దాన్ని ఏ యాంగిల్ తను నమ్ముతున్నాడో దాన్నే చూపించగలడా…? ఛానెల్ పాలసీ ఏదయితే దాన్ని చూపించాలి .

తనకే అధికారం వుంటే అతను ఈ ఉద్యమాన్ని  ప్రేమిస్తున్నాడనుకో,  ఉద్యమకారులపై పోలీసుల జులుం అంటూ పోలీసులు తన్నే సీన్లపైన దృష్టి పెడతాడు. లేదా యాంటీ అనుకో. ఆ రోడ్లపైన వీరంగాలు తొక్కుతున్నవాళ్లను, చూపిస్తూ విగ్రహాల కూల్చివేతను చూపిస్తూ దానిపైనే ప్రేక్షకుల దృష్టి వుండేలా చూస్తాడు. అతను నిజాయితీగా ఉన్నాడా అంటే ఉన్నాడు. కానీ అతను ఛానెల్ మనిషి, అతని అభిప్రాయంతో ఛానెల్ కి  పని లేదు. ఛానెల్  నుంచి యజమాన్యం ఏది చెప్పాలనుకుంటే,, ఏది యజమాన్యానికి లాభం అయితే అదే ఛానెల్  పాలసీ. ఇక్కడ పని చేసేవారంతా ఆ బోర్డర్ లైన్స్‌లో పనిచేయాలి.”
మధ్యలో అడ్డం వచ్చింది నయన.

“కానీ మనకో పాలసీ వుంది కదా మేడం”

“అదే చెబుతున్నా. ఈ ఛానెల్  పొలిటికల్ పాలసీని ఎవరు సృష్టించారు?  ఈ ఛానెల్ కి  డబ్బు పెడుతున్న యాజమాన్యం, వాళ్ల లాభాలు, వాళ్ల ఆకాంక్షలు…”

నయన దిక్కులు చూసింది. ఇది ఎడిట్ అనుకొంది.

“అవును మేడం,” అన్నది నవ్వులేని మొహంతో.

“మీడియా అంటేనే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా మేడం, ఫోర్త్ ఎస్టేట్ కదా,” అన్నది  గజిబిజిగా దిక్కు తోచనట్లు.

సబ్జెక్ట్ డైవర్ట్ చేయకపోతే మొత్తం ప్రోగ్రాం అవతల పారేయాలి.

స్వాతి నవ్వింది.

“కరెక్టే నయనా.. మొన్న నువ్వు వరల్డ్ ఎయిడ్స్ డేకి డాక్టర్ పెరుమాళ్‌ని ఇంటర్వ్యూ చేశావు. సెన్సేషన్ అనుకొన్నాం అందరం. ఆయన ముక్కు సూటి మనిషి, ప్రభుత్వ ఎయిడ్స్ కంట్రోల్ బోర్డ్ ఫండ్స్ ఎలా దుర్వినియోగం అయ్యాయో అంకెల్తో సహా చెప్పాడు. మనం దాన్నే ఉదయం నుంచి సాయంత్రం దాకా న్యూస్ బైట్స్ కింద వేశాం. ఆపేయమని ఎయిడ్స్ కంట్రోల్ బోర్డ్ స్వామి రిక్వెస్ట్‌ల మీద రిక్వెస్ట్‌లు పెట్టారు. మనకి యాడ్స్ ఇస్తానని కమిట్ అయ్యాడు. అందుకే ఆపాం. ఆ తర్వాత గంటయ్యాక పెరుమాళ్ వైఫ్ మోహినీ పెరుమాళ్ మన ఆఫీసుకు వచ్చారు. నీకు తెలుసా. వరల్డ్ నెంబర్ వన్ గైనకాలజిస్ట్ ఆమె.

ఇప్పుడు ఇంత బాగా కబుర్లు చెప్పిన పెరుమాళ్ నన్ను కొట్టి చంపేస్తున్నాడు. నాకు పైసా ఆస్తి లేకుండా అన్నీ కాజేస్తున్నాడు. ఆఫీస్ మేనేజర్ ఇంచార్జ్ లలితా అయ్యర్‌తో ప్రణయం, నా పిల్లలు, నేను మట్టి కొట్టుకుపోతాం. లైవ్ ఏర్పాటు చేయండి అని కాళ్లావేళ్లా పడింది. మనం ఇచ్చామా..? ఆవిడ హాస్పిటల్ పెరుమాళ్ గారి పెత్తనంలో వుంది. సంవత్సరానికి యాభై లక్షలు యాడ్స్ రూపంలో మనకు ఇస్తాడు. ఆ రోజు ఆయన ఎయిడ్స్ మందు ప్రచారం కోసం స్లాట్ ఇచ్చాం. ఆ మందు పని చేస్తుందో లేదో ఎవళ్లకి తెలుసు. ఎంతోమంది ఎయిడ్స్ పేషెంట్స్ ఆ మందు వాడుతున్నారు.

ఆయన  హోమియోపతి మందు కూడా అన్నింటీకీ ఇస్తాడు. అన్ని మందులు ఒకే డాక్టర్‌కు ఎలా తెలుస్తాయో ఇవన్నీ మనం ఆలోచించామా? మోహినీ పెరుమాళ్‌కు నేనూ, మన ఎండి సోపేసి పంపేశాం. ఆవిడ పురుళ్లు పోస్తేనే హాస్పిటల్‌కు అన్ని కోట్లు వస్తున్నాయి. ఆవిడ్ని పోనీయడు. ఆవిడతో కాపురం చేయడు. ఆవిడకు డైవోర్స్ ఇవ్వడు. ఆవిడను చావనివ్వకుండా ఇద్దరు పిల్లలు. నేనో గొప్ప జర్నలిస్ట్‌ని నేను నిజాయితీని నటించాను. యామై కరక్ట్?”

నయనకు చెమట్లు పడుతున్నాయి. కెమేరామెన్ వంక చూసింది. క్రేన్‌పైన వున్న కెమేరామెన్ నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. ఇది టెలికాస్ట్ అయ్యే ఇంటర్వ్యూ కాదని తేలిపోయిందతనికి.

నయన స్వాతి వైపు చూసింది.

స్వాతి మళ్లీ నవ్వింది. ఆఫ్ ది రికార్డ్ అంది.

పిసీఅర్‌లోంచి డైరెక్టర్ బ్రేక్ తీసుకుందాం అంటున్నాడు.

స్టూడియోలో లైట్ళు ఒక్కోటి ఆరిపోతున్నాయి. ప్రొడక్షన్ మేనేజర్ సెట్‌లోకి వచ్చాడు.
“మేడం స్నాక్స్ తెసుకుందాం” అన్నాడు స్వాతితో.
స్వాతి తలవూపింది. వెజిటబుల్ పఫ్స్, టీ, బిస్కట్లు వచ్చాయి. స్వాతి కప్పు అందుకొంది.
ఎందుకిలా తిక్కతిక్కగా వుంది తను. నవ్వొచ్చింది స్వాతికి. ఈ ఇంటర్వ్యూ వద్దనే అంది. ఏం చెప్పాలి. గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు వస్తున్నాయి అని బాధపడటంలో అర్ధం వుందా.. ఏం చెప్పాలి.

ముప్పై ఏళ్ళ ఉద్యోగ జీవితంలో తనేమైనా ఝాన్సీరాణిలాగ పోరాటాలు చేసిందా? ఎప్పుడూ కాంప్రమైజ్ అవటమే. ఒక్కో మెట్టు ఎక్కేందుకు ఒక్కోరకమైన కాంప్రమైజ్. అసలు తనలా ఆడవాళ్లు ఎంతమంది మంచి పొజిషన్లో వున్నారు. ఎంతమంది ఇన్‌చార్జ్‌లు ఆడవాళ్లలో వున్నారు…? అంధ్రప్రదేశ్‌లో కనీసం మొత్తం పాతికమంది కూడా లేరు. ఉన్నా స్క్రిప్ట్ రైటర్లు, ప్రోగ్రామ్స్‌లో వున్నారు. వారి విలువ ఏమిటి, కుకరీలు, ఎడ్యుకేషన్, మెడికల్ ఇవ్వే.. మెయిన్‌స్ట్రీమ్ కి మైళ్ల దూరంలో. ఎలాంటి కెరీర్ లేకుండా, దీన్నే చెప్పాలా..

ఎండితో సమానంగా తను నిలబడిందంటే ఎలా? ఏ బలంతో?.. ఎండికి భుజంగా ఆయన  పి.ఏ. సరితలాగా. ఆయన అకౌంట్‌లు, బాలెన్స్ షీట్‌లు మానేజ్ చేస్తూ ఆమె, ఆయన పబ్లిక్ లైఫ్‌కి ప్రాబ్లం లేకుండా ఆఫీస్ మొత్తాన్ని ఆయన గుప్పిట్లో వుంచుతూ తనూ. ఇన్‌పుట్, అవుట్‌పుట్ ప్రోగ్రామ్స్ ఏవీ ఆయన కనుసన్నల్లోంచి పోవు. ఏ వార్త రావాలన్నా, ఏం చేయాలన్నా కోర్ మీటింగ్‌లో ఆయనే డెసిషన్ తీసుకోవాలి. ఆయనకు ఇష్టమున్న ఎక్స్‌పర్ట్‌లే లైవ్‌కి రావాలి. ఆయన కిష్టమైన పొలిటీష్యన్లకే పవర్‌ఫుల్ రోల్స్, ప్యాకేజీలు ఇవ్వాలి. ఆయనకు వళ్ళు మండితే థర్టీ మినిట్స్ విత్ ఎస్.ఆర్.నాయుడులో ఆయన ఎదురుగ్గా కూర్చుని ఆయన క్రాస్ ఎగ్జామినేషన్‌తో ఉక్కిరిబిక్కిరి అవ్వాలి.

క్రిందటినెల  ప్రాపర్టీ కబ్జాలో దొరికిపోయిన సినీహీరో ఎంపీ కళ్యాణ్‌ను మర్యాదగా లైవ్‌కి పిలిచి, ఫేక్ ఫోన్‌లు చేయించి ఆయనతో ఎండి ఎలా ఆడుకున్నాడో! ఆయన సినిమా హీరో కనుక ఆయనకు నటనానుభవం వుంది కనుక  బతికిపోయాడు. ఏడవకుండా నవ్వుతో నెట్టుకొచ్చాడు. బయటనుంచి వస్తున్నవి ఛానెల్  వాళ్లే చేయిస్తున్నారని పసిపిల్లాడికి కూడా అర్ధం అవుతున్నాయి. సమాధానాలు చెప్పలేక కల్యాణ్ పడుతున్న అవస్థని ఎండి పాములాంటి కళ్లతో చూస్తూ  ఎలా ఎంజాయ్ చేశాడో ప్రపంచం అంతా చూసింది. రెండోసారి మీ చానల్‌కి రాను అని అందరిముందు తిట్టి మరీ చెప్పి వెళ్లిపోయాడు కల్యాణ్. ఆయన్ని అలా ఇరుకున పెట్టినందుకు ఇంకో కమ్యూనిటీ లీడర్ ఎంతో సంతోషించి చానల్‌కు రెండు కోట్లు గిఫ్ట్ పంపాడంట. అది ఆఫీస్ అకౌంట్‌లో పడిందో, ఎండి అకౌంట్‌లో పోయిందో దేవుడికి, సరితకు తెలియాలి. నవ్వొచ్చింది స్వాతికి…

( మిగతాది వచ్చే వారం)

 

మీ మాటలు

*