‘గుడివాడ’ వెళ్ళానూ…అను టెంపుల్ టెక్సాస్ సాహిత్య యాత్ర!

56_TX_30th State Telugu Sahithee Sadassu_03302013_Group Photo

మార్చి చివరలో మనందరం టెంపులులో జరగనున్న సాహితీ సదస్సుకి మన బృందం వెళ్ళాలండీ?” అని మా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం 2013 సంవత్సరానికి సాహిత్యవేదిక సమన్వయ కర్త  శారదా సింగిరెడ్డి గారు చెప్పిన వెంటనే నా కాలెండరులో మార్కు పెట్టుకున్నాను. గత సంవత్సరం టెంపులుకి చెందిన వై.వీ.రావు గారు మా సభకి ముఖ్య అతిథిగా వచ్చాక తెలుగు సాహిత్యానికి రావు గారు చేసిన కృషి నాకు తెలిసింది, నేను డాలస్ కి కొత్త కాబట్టి. వై.వీ రావు గారిని టెంపులు రావు గారు అని కూడా అంటారని తెలిసింది. మాకు వారి ఊరు వెళ్ళే అవకాశం ఇలా దొరికింది, ఇంకేముంది ఎగిరి గంతేసి బయలుదేరడమే.

కుటుంబంతో ఈ కార్యక్రమానికి వెళ్దామనుకున్నా కానీ మా అమ్మాయి స్కూలు పిల్లలతో సినిమా కార్యక్రమంలో ఇరుక్కుపోయింది. చిన్నపుడు నేను పొదలకూరులో స్కూలు పిల్లలతో కలిసి ‘కోడెనాగు’ సినిమా చూసిన జ్ఞాపకం. ఒక్క సినిమానే అయినా ఆ జ్ఞాపకం మాత్రం బాగా ఉండి పోయింది. మా అమ్మాయికి కూడా ఇలాంటిది ఒకటి ఉంటే బాగుంటుంది కదా! టెంపుల్ దాకా వెళ్తున్నాము, పక్కనే మన అఫ్సర్ గారిని కూడా కలిసి వద్దామని మా యాత్రని ఒక రోజు పెంచాను. అఫ్సర్ గారితో పాటూ మా కాన్సాస్ రూమ్మేటు రాం పులికంటిని కలిసి వద్దామని నేను, సోదరుడు ప్రశాంత్ కలిసి శనివారం ఉదయం ప్రయాణం మొదలుపెట్టాం.

ఉదయం 10.30కు టెంపులుకు చేరుకున్నాము. అప్పటికే అక్కడకు చేరుకున్న తుమ్మూరి రామ్మోహనరావు గారితో పార్కింగ్ లాటులోనే ముచ్చట్లు మొదలుపెట్టాము. ఇంతలోనే మద్దుకూరి చంద్రహాస్ గారు, జువ్వాది రమణ గారు మాతో కలిసి ముచ్చట్లలో పాలుపంచుకున్నారు.

“ఎంతో వ్రాయాలనుకుంటున్నాం కానీ, వీలు కావడం లేదు!” అని అందరూ అనుకుంటూ ఉంటే “వారానికి ఒక రోజు కొంత సమయం మనం వ్రాయడానికి కేటాయించుకోవాలి” అని చంద్రహాస్ గారు చెప్పారు.

అందరం లోపలకి నడిచి డాలస్ సాహిత్య వేదిక బృందం  సింగిరెడ్డి శారదా, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉరిమిండి నరసింహా రెడ్డి, సతీష్ పున్నం, రొడ్డా రామకృష్ణా రెడ్డి గార్లను కలిసాం. టెంపుల్ కి చెందిన వై.వీ.రావు, గిరిజా శంకర్ గారిని పలకరించాము. సత్యం మందపాటి గారు వ్రాసిన “అమెరికా వంటింటి పద్యాలు” ఆవిష్కరణ కూడా ఉంది. వారితో కూడా కాసేపు కబుర్లాడుతుండగా భోజనం పిలుపు వచ్చింది.

పులిహోర, అప్పడాలు, గుత్తి వంకాయ కూర, వడలు, సాంబారు, పెరుగు ఇలా నోరూరించే వంటకాలతో కడుపు నిండా తింటూ సభకు వచ్చిన వారితో కబుర్లు చెప్తూ, లొట్టలు వేస్తూ పెళ్ళి భోజనం లాంటి విందు భోజనం పూర్తి చేసాము. ఈ సభకు సమన్వయ కర్త సుమ పోకల గారు అందరికీ వంటకాలు సమకూర్చిన వారి లిస్టు పంచారు. ఈ భోజన కార్యక్రమంలో ఆస్టిన్ నుంచి వచ్చిన ఇర్షాద్ గారితో మాటలు కలిపాం. భోజనాలు పూర్తి అవగానే అందరం భుక్తాయాసంతో కూర్చున్నాం.  చింతపల్లి శకుంతల గారి ప్రార్థనా గీతంతో సభ మొదలయింది. సుమ పోకల గారు సభకు విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ కార్యక్రమ వివరాలను తెలిపారు. దేవగుప్తాపు శేషగిరిరావు గారు సభకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ప్రసంగించేవారికి ఎంత సమయం కేటాయించారో అంతే సమయం వాడుకోవలసిందిగా కోరారు. మధ్య,మధ్యలో చెణుకులు విసురుతూ సభని అలరించారు.

చింతపల్లి గిరిజాశంకర్ గారి దర్శకత్వంలో “పులిని చూసి నక్క” నాటకం అందరినీ బాగా నవ్వించింది. ఆంధ్రదేశంలో మదర్స్ డే, ఫాదర్స్ డే ఇంకా వాలంటైన్స్ డే ప్రభావం పిల్లలపై ఎలా ఉందో చక్కగా చూపించి, నవ్వించి అలోచింపజేసారు. స్వీయ కథా పఠనం శీర్షికన రాయుడు గారు “తాజ్ మహల్” చదివి వినిపించారు. “చెప్పుకోండి చూద్దాం” కార్యక్రమాన్నిసుమ పోకల, మాస్టర్ మర్యాల రిత్విక్ కలిసి నిర్వహించారు. ఎపుడో చిన్నపుడు చదువుకున్న ప్రకృతి-వికృతి పదాలను అందరూ గుర్తు చేసుకుని మరీ ఇందులో పాల్గొన్నారు. చింతపల్లి గిరిజా శంకర్ గారు అన్నిటికీ ఠకీమని సమాధానాలను చెప్పేసారు. ఆస్టిన్ కి చెందిన కాకి ప్రసాద్ గారు “అవనీ నా మనసులో నిరంతరం మెదులుతూనే ఉంటాయి” అని తమ స్వస్థలమైన విజయవాడను గుర్తు చేసుకున్నారు. వింటున్న అందరం “గుర్తుకొస్తున్నాయి” పాటను మనసులో పాడుకుంటూ ప్రసాద్ గారి జ్ఞాపకాలను పంచుకున్నాం.

ఇర్షాధ్ గారు “నిలబడే హాస్యం” గురించి మాట్లాడుతూ అందరినీ పడీ,పడీ నవ్వేలా చేసారు. “మీరు తెలుగులో స్టాండ్ అప్ కామెడీ చేస్తే బాగుంటుందని” చాలామంది ఇర్షాద్ గారిని కోరారు. “మా ప్రాంతీయ దేవాలయాలు” గురించి ఏలేటి వెంకటరావు గారు ఉభయ గోదావరి జిల్లాలలోని దేవాలయాలను సభకు గుర్తు చేసారు. తెలుగులో అవధానం, సంగీతం, సాహిత్యం కలిపి “సంగీత గేయధార” అన్న ప్రక్రియను ప్రారంభించిన వేంకటగిరి రాజా శ్రీ యాచేంద్ర సాయికృష్ణను చొరగుడి రమేష్ కొనియాడారు.

తరువాత కార్యక్రమం పుస్తక ఆవిష్కరణ, మందపాటి సత్యం గారు వ్రాసిన “ఆమెరికా వంటింటి పద్యాలు” పుస్తకాన్ని అర్షాద్ గారు ఆవిష్కరిస్తూ తెలుగులో తనకు నచ్చిన రచయితలలో మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు అని చెప్పారు.  అమెరికాలో ఉండి ప్రవాస జీవితాలను మనకు పరిచయం చేస్తున్న మందపాటి సత్యం గారు అంతే కూడా తనకు ఎంతో ఇష్టం అన్నారు. తన అభిమాన రచయిత పుస్తక ఆవిష్కరణలో భాగమయినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పుస్తకంలో తనకు నచ్చిన కొన్ని పద్యాలను ఇర్షాద్ గారు చదివి వినిపించారు. కీర్తిశేషులు శ్రీ ఆరుద్ర గారు వ్రాసిన “వంటింటి పద్యాలు” తన “అమెరికా వంటింటి పద్యాలు”కి ప్రేరణ అని రచయిత మందపాటి సత్యం గారు చెప్పుకొచ్చారు.

భారతదేశంలో ఈ పుస్తకావిష్కరణ జరిగినపుడు ప్రముఖ కవి సీ.నారాయణరెడ్డిగారు ఈ పుస్తకంలో కొన్ని పద్యాలు నచ్చి అవి చదివారట, వాటిని మళ్ళీ సత్యం గారు మాకు చదివి వినిపించారు. “పూరించండి చూద్దాం” అంశంపై సత్యం గారు ఒక కథని కొంత భాగం వినిపించి మిగత సగాన్ని పూర్తి చేయమని సభలో ఉన్న కథ రచయితలను ప్రోత్సహించారు. కథను వింటున్నపుడే నా పక్కన కూర్చుని ఉన్న తుమ్మూరి రామ్మోహనరావు గారు అర్థమయినట్లు తల పంకించారు. తేనీరు విరామంలో పూర్తి చేసిన కథని నాకు వినిపించారు. సత్యం గారు ఇచ్చిన క్లూని రామ్మోహన్ గారు అలవోకగా పట్టేసుకున్నారు, ఇదే విషయాన్ని సత్యం గారు తర్వాత చెప్పుకొచ్చారు.

విరామం తర్వాత రెండో భాగాన్ని శానాంటోనియో కొ చెందిన తుర్లపాటి ప్రసాద్ గారు,  సింగిరెడ్డి శారదగారు నిర్వహించారు.. గుడివాడ ప్రముఖులు వై.వీ.రావు గారు “ఆధ్యాత్మిక రామాయణం” పుస్తకాన్ని పరిచయం చేస్తూ రాముడు గురించి కొత్త విషయాలను చెప్పారు. వాల్మీకి రామాయణం, తులసీ రామాయణం నుండి కొన్ని సంఘటనలను వివరించారు.

మొన్న ‘గబ్బర్ సింగ్’ సినిమాలో అంత్యాక్షరి బాగా పండింది, తెలుగు పద్యాలతో అంత్యాక్షరి మీరు ఎపుడన్నా విన్నారా? నేను వినలేదు. తుర్లపాటి ప్రసాద్ గారు నిర్వహించిన పద్యాల అంత్యాక్షరి చాలా సరదాగా జరిగింది. సభలో ఉన్న వారిలో చాలా మంది పద్యాలు పాడడంలో దిట్టలే! తరువాత ఇర్షాద్ గారు రచించిన “గోయింగ్ బాక్ టూ ఇండియా” అన్న హాస్య కథను చదివి వినిపించారు.

తానా సాహితీ సభలలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా తానా సాహిత్యవేదిక సమన్వయ కర్త మద్దుకూరి చంద్రహాస్ గారు సభికులని కోరారు. ఉగాది సందర్భంగా నెల నెలా తెలుగు వెన్నెల సదస్సులో ఏప్రిల్ 12న కవి సమ్మేళనం జరుగనందని ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కార్యదర్శి జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారు తెలిపి, అందరినీ ఆహ్వానించారు. తెలుగు చలనచిత్ర రచయితలను ఉద్దేశిస్తూ చంద్రహాస్ గారు మాట్లాడారు.

ప్రవాస భారతీయులు తెలుగు సాహిత్యానికి చేస్తున్న సేవ గురించి తుమ్మూరి రామ్మోహనరావు గారు తన స్వీయ గేయం “పడమటి ఉగాది రాగం” పాడారు. స్వీయ రచనలో భాగంగా చింతపల్లి గిరిజాశంకర్ గారు “న్యూ స్వీయ రచనలో భాగంగా చింతపల్లి గిరిజాశంకర్ గారు “న్యూ గిరీశం లెక్చర్లు” చదివి అందరినీ నవ్వించారు. జువ్వాడి రమణ గారు ఖడ్గ సృష్టి నుండి కొన్ని గేయాలను తియ్యగా పాడారు.

కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిని గుర్తు చేసుకుంటూ తుర్లపాటి ప్రసాద్ గారు కొన్ని పద్యాలనూ, కవితలనూ పాడారు. చివరగా శ్రీమతి కల్లూరి జయశ్రీ గారు తన కథ “వై దిస్ కొలవరి” చదివి వినిపించారు.  సుమ పోకల గారు వందన సమర్పణ చేస్తూ సభకు విచ్చేసిన సాహిత్య ప్రియులకు వందనాలు అందజేసారు. గుడివాడ వాస్తవ్యుల అతిథి సత్కారాలకు మేము మిక్కిలి సంతోషించి వారి దగ్గర సెలవు తీసుకున్నాము.

ఆస్టిన్ నుండి మమ్మల్ని కలవడానికి వచ్చిన మిత్రులు రాం పులికంటి, గోపీలతో కలిసి ఆస్టిన్ బయలుదేరాము.సాయంత్రం కబుర్లతో కాలక్షేపం చేసి ఆదివారం ఉదయం ఆస్టిన్ లో ఉంటున్న అఫ్సర్, కల్పనా రెంటాలగారిని కలవడం కోసం బయటపడ్డాం.మబ్బులు పట్టిన ఆస్టిన్ వాతావరణంలో స్టార్ బక్సు కాఫీ తాగుతూ చెట్ల కింద కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకున్నాం. అఫ్సర్ గారిని ఇంతకు ముందు ఇండియానా పోలీసులో జరిగిన తెలుగు మహాసభలలో కలిసాను, కొన్ని సంవత్సరాల తరువాత మళ్ళీ ఇపుడే కలవడం! కల్పన గారిని కలవడం ఇదే మొదటిసారి! కానీ మాతో ఎంతో చక్కగా మాట్లాడారు. వారి దగ్గర సెలవు తీసుకుని మా తమ్ముడి చిన్ననాటి స్నేహితుడిని కలవడానికి మళ్ళీ రోడ్డెక్కాం.

ప్రశాంత్, అతని స్నేహితుడి దిలీప్ ఎనిమిదవ తరగతి నుండి కలిసి చదివారు. ఇపుడు ఇద్దరూ అమెరికాలో మాస్టర్స్ చివరి అధ్యాయంలో ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి “తూనీగ, తూనీగ” పాడుకుంటూ నన్నూ వాళ్ళ జ్ఞపకాలలోకి లాగారు. నాకు కుడా గుర్తుకొస్తున్నాయి ఇంకొక భాగం చూసిన అనుభూతి కలిగింది. ఆస్టిన్ లోని దావత్ రెస్టారెంటులో చాయ్ తాగి డాలస్ వైపు ఉల్లాసంగా తిరుగు ముఖం పట్టాం.

ఫోటో: జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, డాలస్

మీ మాటలు

 1. RammohanRao thummuri says:

  మిత్రమా !
  సరదాగా కబుర్లు చెబుతున్నట్లుగా కార్యక్రమం పొల్లుపోకుండా చక్కగా సమీక్షించారు.ఆ శైలిని అలాగే కాపాడుతూ వాడుతూ ఉండండి.

 2. So so jealous!

  • శ్రీ says:

   గుడివాడలో మిమ్మల్ని మిస్ అయ్యాం అండి !

 3. మీ ‘గుడివాడ’ వెళ్ళానూ కబుర్లు బాగున్నాయి. ఇర్షాద్ గారు రచించిన “గోయింగ్ బాక్ టూ ఇండియా” అన్న హాస్య కథ ఎక్కడ లభ్యమవుతుంది?

మీ మాటలు

*