మంచికి కాస్త చోటు…!

kalpana profile“ఈ కాలం లో ఒక పుస్తకం వ్రాయడం ఒక నేరం చేసినంత పని. రాస్తే, ప్రింట్ కావడం కష్టం. ఎవ్వడో పబ్లిషర్ వేటగాడి వలె కాచుకొని ఉంటాడు. ఇక మనమే అమ్ముకోవాలంటే హత్యానేరం చేసినవాడు తప్పించుకోవడానికి చేసేంత ప్రయత్నం చేయాలి. ఈ బాధలు ప్రతి రచయితా అనుభవిస్తున్నవే.”

ఇది తెలుగు సాహిత్యంలో వొక అరుదయిన కావ్యంగా నిలిచే “శివ తాండవం” సృష్టికర్త పుట్టపర్తి నారాయణాచార్యులు గారు 1985 లో ఆ పుస్తకం పునర్ముద్రణ సందర్భం గా రాసుకున్న ముందుమాట లో ఉదహరించిన అంశాలు. ఇవి  ఇప్పటికీ అక్షర సత్యాలే అని చెప్పుకోక తప్పదు. ఈ గురువారం సారంగ వారపత్రిక రెండో నెలలోకి అడుగు పెట్టబోతూ ఆ మహాకవి  గుండె ఘోషని తలచుకుంటోంది.

సారంగ సాహిత్య వార పత్రిక ప్రారంభించి నెల రోజులయింది. అంటే,  ఇది నాలుగో సారంగ వారం.

“సారంగ” కి తెలుగు సాహిత్య లోకం నుంచి వచ్చిన అపూర్వ స్పందన కి, ఆదరణకు  వెయ్యి వందనాలు. మంచి ప్రయత్నానికి ఎప్పుడూ ఆదరాభిమానాలు ఉంటాయని మరో సారి నిరూపించారు రచయితలు, పాఠకులు.  హిట్ లు, పరస్పర పొగడ్తల  మాయ వలలో చిక్కుకోకుండా నాణ్యత మాత్రమే ప్రమాణం గా ఎంచుకొని, పెద్దా, చిన్నా అనే తారతమ్య భేదం లేకుండా, మంచి సాహిత్యాన్ని మాత్రమే కొలమానంగా ఎంచుకుంటూ “సారంగ సాహిత్య వార పత్రిక” ను మీ ముందుకు ప్రతి వారం తీసుకురావాలన్నది మా ప్రయత్నం.

ప్రింట్ సాహిత్య, ప్రచురణ రంగాలకు కొందరు “పెద్దలు” పీఠాధిపత్యాన్ని” వహిస్తున్నారన్నది  జగమెరిగిన సత్యం. ఆ పీఠాధిపత్యాల బాధ లేకుండా , రచయితలకు వెన్ను దన్నుగా నిలబడి వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలన్నది సారంగ ఆకాంక్ష. ఇవాళ తెలుగు సాహిత్యపు దుస్థితి ఏమిటంటే ఒక కథో, కవితో రాసి పత్రికా నిర్వాహకుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగి, బతిమిలాడి బామాలి, వాళ్ళు చెప్పిన “ఎడిటింగ్” లు, ముగింపు లు చేసి, ఆ తర్వాత కూడా కత్తిరింపులు చేయించుకొని ఎదురుచూస్తే, రాసిన ఆరు నెలలకో, ఏడాది కో ఆ రచన అచ్చు రూప భాగ్యాన్ని పొందుతుంది. మార్పులు , కత్తిరింపులు తప్పు అని కాదు. అది రచన నాణ్యత ను మెరుగుపరిచేందుకైతే తప్పనిసరిగా అవసరమే. అయితే, కేవలం “స్పేస్” కోసం రచన ను కుదించమని అడగటం తప్పే.  రోజువారీ పత్రికల్లో, వార పత్రికల్లో సాహిత్యానికి ఇస్తున్నది చిన్న స్పేస్. పత్రికల వాళ్ళు కథకు రెండు పేజీలు, కవిత కు అర పేజీ కేటాయిస్తే రచయిత ఆ పేజీల పరిధి లో కథలు, కవిత్వం రాయటం నేర్చుకోవాలి. ఇదీ ఇవాల్టి తెలుగు సాహిత్యపు దుస్థితి. వర్తమాన రచయితల ఈ కష్టాలే సారంగ సాహిత్య వార పత్రిక ఆలోచనకు నాంది పలికింది .

అలాగే సాహిత్య విమర్శకుల ఇష్టాయిష్టాల ఆధారంగా రచనలకు లేని గొప్పతనాన్ని ఆపాదించటం తెలుగు సాహిత్య రంగం లో ఎంతో కాలం గా వస్తున్నదే. దాన్ని ‘బ్రేక్’ చేయాలన్నది  కూడా సారంగ ప్రయత్నం. మీరు మంచి రచన చేస్తే చాలు, దానికి సారంగ ఎప్పుడూ వేదిక గా నిలుస్తుంది. ఇక్కడ వ్యక్తి ఆరాధన లేదు. ఏదో ఒక వాదమో, ఎవరి మీద బురద చల్లటమో, ఇంకెవరినో మోసుకు తిరగటమో మీ రచన కు లక్ష్యం కానక్కర లేదు. స్వేచ్ఛగా, నిజాయితీగా రాయండి. మాకున్న అవగాహన మేరకు అది మంచి రచన అయితే చాలు, దాన్ని మేము ప్రచురిస్తాము. ‘సారంగ’ కి మీ సహకారం తెలుగులో మంచి సాహిత్యానికి మంచి వాగ్దానం.

కల్పనారెంటాల

మీ మాటలు

 1. BHUVANACHANDRA says:

  …..కల్పనగారూ &అఫ్సర్ గారూ ….
  నమస్తే
  ఆద్యంతం చాలా బాగుంది .మీ శ్రమ ప్రతి అక్షరం లోనూ తెలుస్తోంది ……ఇదే స్టాండర్డ్ ని కొనసాగిస్తారని తెలుసు ……మనస్పూర్తి గా అభినందిస్తూ ….సారంగాను ఆశీర్వదిస్తూ ……భువనచంద్ర

 2. చాల విలువైన సమయం వెచ్చిస్తూ, శ్రమకోర్చి “సారంగ” ని తీర్చి దిద్దుతున్నారు. మీ అందరికి అభినందనలు.

  పోతే, ఒక్క నవలతోనే ప్రచురితమవుతున్న చతుర , ఒక (నవలిక అందామా) తో స్వాతి తప్ప మరో పత్రిక ఏది కనపడటం లేదు అని మొన్న ఓ నవలకారులు వాపొయ్యారు. సారంగ లో అటువంటి అవకాశం ఉంటుందేమో చూడండి.

  కథకులున్నారు. కథలు ఉన్నవి. చాలా కథలున్నవి. కాని నవలలు, (సీరియల్స్ కాదు) లేవు. అమరేంద్ర గారన్నట్టు ‘అంతరీక్షం’ లో నవలు కూడా ఉండవచ్చు కదా, “స్పేసు” ఇబ్బంది లేదు కాబట్టి ?! దాని కష్ట నష్టాలు పెద్దగా తెలియవు కాని నవల అనాధ ఐపోతుందా అని పిస్తుంది.

  వాదాలకు ఇజాలకు దూరంగా ఉన్న సాహిత్యం కొరకు చాలమంది వెతుక్కుంటున్నారు. సారంగ వారిని కూడ దృష్టిలో ఉంచుకుంటుందని ఆశిస్తూ ,
  శుభాకాంక్షలతో..
  అనిల్ అట్లూరి

  • అనిల్ – థాంక్స్! This was one of the ideas that was on the list when we started the Saaranga Magazine. It is still on the list, now near the top:- )

   Raj

  • అనిల్ గారు, సారంగ వెనుక ఉన్న శ్రమ ను మీరు గుర్తించినందుకు ధన్యవాదాలు.

   నవలలే సీరియల్స్ కదా.. నవల మొత్తం ఒక్క సారి గా ఇవ్వడం లో పత్రిక కు ఇబ్బంది లేదు కానీ రచయితలు అందుకు సిద్ధంగా ఉన్నారో లేదో తెలియదు. ఇప్పుడు ప్రచురిస్తున్న సీరియల్ ” ఛానెల్ 24/7 ” నవల నే. సీరియల్ పూర్తి అయ్యాక అది నవల గా వస్తుంది. తన్హాయీ కూడా అంతే కదా. నిజానికి నవలలకు మంచి రోజులు రావటానికి ఈ సీరియల్ విధానం మంచి మార్గం అని నేననుకుంటున్నాను. మీకు ఇంకా వేరే ఏమైనా ఆలోచనలు ఉంటే చెప్పండి. మెరుగు పర్చుకుందాము.

   ఇక వాదాలు, ఇజాలు లేని సాహిత్యం…ఈ పత్రిక ఏ వాదానికి, ఏ ఇజానికీ కొమ్ము కాయదు. రచయితలు వాదాలతో రాస్తుంటే మనం చేయగలిగిందేమీ లేదు. పాఠకుల్లాగానే మేము కూడా మంచి సాహిత్యం రావాలనే ఆశపడుతున్నాము. ( అది వాదాల సాహిత్యమైనా..కాకపోయినా) ఇదే సందర్భం లో అస్తిత్వ వాదాలు అనేవి సమకాలీన సాహిత్యం లో ఒక ముఖ్యమైన పార్శ్వం అయిపోయింది. వాదాలే కావాలని, లేదా అసలు వాదాలు లేకుండా సాహిత్యం రావాలని అనుకోవటం సరి అయిన అంశం కాదేమో ! ఏమంటారు?

  • Thirupalu says:

   ఏ వాదాలు, ఏ ఇజాలు లేని సాహిత్యం ఉంటుందాండి? ఏ వాదాలు, ఏ ఇజాలు లేని సాహిత్యం మీరు రాసినా, మీకు తెలియకుండానే అందు ఏదో ఒక వాదం ఉంటుంది. ఇంతెందుకు, ఏ వాదం ఉండ కూడదు అంటున్న ఈ మాట లోనే మీకు తెలియ క పోయినా ఒక్‌ వాదం ఉంది. – వాదాలకు ‘అతీతం ‘అంటున్న వాదం.

 3. RammohanRao thummuri says:

  ఉదాత్తమైన ఆశయాలతో ప్రారంభించిన సారంగ వార పత్రిక ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ ,ముఖ్యంగా వాదాల కతీతంగా కేవలం
  సాహిత్య విలువలకు మీరిచ్చే ప్రాధాన్యతను అభినందిస్తున్నాను.-వాధూలస

 4. కల్పన గారు నమస్తే! అఫ్సర్ గారు,రాజ్ గారు ,& వేంపల్లి షరీఫ్ గారు ..మీ నలుగురు మూలస్తంభాలు గా నిలిచి వారం వారం సారంగ ని అత్యంత శ్రద్దగా తీర్చి దిద్దుతున్నారు పాఠకురాలిగా నాకే సమయం కుదరక చదవలేకపోతున్నాను.

  తెలుసు వెబ్ సాహిత్యం లో వార పత్రికగా “సారంగ” ఒక అద్భుత ప్రయోగమే! అలాగే నాణ్యమైన సాహిత్యం కి మీరు ప్రోత్సాహం ఇవ్వడం నిజంగా అభినందనీయం . తెలుగులో ప్రింట్ మీడియాలో ఉన్న పత్రికలు వారి ప్రచురణా తీరు తెన్నులు గురించి మీరు చెప్పినది అక్షరాలా నిజం

  “ఇవాళ తెలుగు సాహిత్యపు దుస్థితి ఏమిటంటే ఒక కథో, కవితో రాసి పత్రికా నిర్వాహకుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగి, బతిమిలాడి బామాలి, వాళ్ళు చెప్పిన “ఎడిటింగ్” లు, ముగింపు లు చేసి, ఆ తర్వాత కూడా కత్తిరింపులు చేయించుకొని ఎదురుచూస్తే, రాసిన ఆరు నెలలకో, ఏడాది కో ఆ రచన అచ్చు రూప భాగ్యాన్ని పొందుతుంది.”

  విసిగి పోయిన రచయిత్రులు రచయితలూ నిరాశ లో మునిగిపోతున్నారు మంచి రచనలని ముందుకు తీసుకు రావాలనే మీ సంకల్పం “సారంగ ‘ వేదిక పై మరికొంత కొత్తవారిని పరిచయం చేయాలనే మీ ప్రయత్నం అభినందనీయం .

  ధన్యవాదములు

 5. AMBALLA JANARDHAN says:

  ఈ మధ్యే సారంగ చదవడం మొదలుపెట్టాను. సారంగకి రచనలు పంపడం గురించి ఈ క్రింది సందేహాలు తీర్చగలరు
  1. రచనలు అప్లోడ్ చేసే విధానం.
  2. సొంత సంపుటిలో ప్రచురితమైనా వేరే ఏ పత్రికలో గానీ, బ్లాగులో గానీ, అంతర్జాల పత్రికలో గాని ప్రచురింప బడని రచనలు పంపవచ్చా?
  3. సారంగకు వేరే ఈ మెయిల్ ఐడీ ఉందా?

మీ మాటలు

*