మానవ సహజాతాలు – ఒక సన్యాసి !

Sriram-Photograph“Isn’t it strange how we fail to see the meaning of things, until it suddenly dawns on us?”
-Antonia (A character from “The Monk”)

సాహిత్య స్థాయికి సినిమా చేరలేకపోయిందని దర్శకుడు శ్యాం బెనగల్ ఒక సందర్భం లో  చెప్పారు. బహుశా  “ది మాంక్” చిత్రాన్ని చూసి ఉంటే ఆయన ఆ మాట అనగలిగేవారు కాదేమో అనిపించింది. అయితే ఆయన మాటల్ని విమర్శించడానికి ఈ వాక్యాలు నేను రాయడం లేదు. ఆయన కేవలం భారతీయ చలన చిత్రాలను దృష్టిలో పెట్టుకొని ఆ మాటలు అని ఉండవచ్చు. ఇక ఇక్కడ నేను రాయబోయేవి పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయాలు. అయితే శ్యాం బెనగల్ సినిమాకి సాహిత్యాన్ని మించిన శక్తి ఉందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు.

ఆ విషయం టెరెన్స్ మలిక్, ఫెంగ్ గ్జియోగాంగ్, మజిద్ మజిదీ, ఆంద్రే తర్కోవిస్కీ, జాంగ్ ఇమో వంటి మహా దర్శకుల చిత్రాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా గొప్ప రచయితలు “ప్రపంచ సినిమా”కి ఎందుకంత విలువ ఇస్తారంటే, దాని పరిధి అనంతంగా విస్తృతమైంది కాబట్టి. అలాగే సాహిత్యంతో పాటూ అన్ని కళారూపాలనూ అది తనలో నిక్షిప్తం చేసుకుంది కాబట్టి సినిమాకి అంతటి శక్తి వచ్చిందని విశ్వసిస్తాను. వచనంలోనూ, కవిత్వంలోనూ చెప్పడానికి వీలుకాని అలౌకిక అనుభవాన్ని గొప్ప సినిమా దృశ్యాల ద్వారా, సంగీతం ద్వారా మన హృదయాల్లో ఆవిష్కరిస్తుంది.

ప్రపంచంలోని గొప్ప చిత్రాలను చూసే అవకాశంలేనివారు, ఒక పరధిని దాటి ఆలోచించడానికి ఇష్టపడనివారూ, లేదా జీవితంలో కొత్త విషయాలకి ద్వారాలు తెరవడానికి తగినంత ఆసక్తి, శక్తి లేనివారూ సినిమాని ద్వేషించడం గమనించాను. వారు సాహిత్యం మాత్రమే గొప్పదనే భ్రమలో ఒక గిరి గీసుకుని ఉండిపోతారు. కాని explorers, జీవితమంతా ఒకే చోట కూర్చుని ఉండడానికి ఇష్టపడనివారు కొత్త కళారూపాలని ఎప్పుడూ స్వాగతిస్తారు.

నా ఉద్దేశ్యంలో సినిమా, సాహిత్యమూ వేరు వేరు కాదు. కేవలం అవి వ్యక్తీకరించే రూపాలు వేరు. కాబట్టి నేను రెండింటినీ ప్రేమిస్తాను. సాహిత్యానికి కొన్ని పరిమితులు ఉన్నట్లే, సినిమాకీ కొన్ని పరిమితులు ఉన్నాయి. అలాగే రెండిటికీ వేటి సౌలభ్యాలు వాటికి ఉన్నాయి. సాహిత్య విలువలులేని సినిమా వ్యర్థమైనది. వ్యక్తీకరణకు కేవలం మాటల మీద మాత్రమే ఆధారపడవలసిరావడం సాహిత్యానికి ఉన్న శక్తిని పరిమితం చేస్తుంది.

నేను “ది మాంక్” చిత్రం గురించి మొదట తెలుసుకున్నప్పుడు, లియో టాల్ స్టాయ్ షార్ట్ స్టోరీ “సెయింట్ సేర్గియ్” గుర్తుకు వచ్చింది. సాహిత్యపరంగా ఆ కథ స్థాయికి ఒక చిత్రాన్ని తీసుకువెళ్ళడం అసాధ్యం అనే భావన కలిగింది. కాని ఈ చిత్రం చూసినప్పుడు నా ఊపిరి ఆగిపోయింది. ఆ అగాధమైన మార్మికత, అధ్యాత్మికత, కళ యొక్క ప్రబలమైన  శక్తి, సాహిత్యపరమైన లోతు నన్ను అచేతనుడ్ని చేసాయి. ఇటువంటి గొప్ప కళారూపాలు మన ఆత్మని కంపింపజేస్తాయి. మన నైతికతను బ్రద్దలు కొడతాయి. జాగ్రత్తగా జీవితమంతా ప్రోదిచేసుకున్నమన విశ్వాసాల్ని తల్లక్రిందులు చేస్తాయి. మన అహంకారాన్ని తుత్తునియలు చేస్తాయి.

మన గొప్పతనపు వలువల్ని వలిచి నగ్నంగా మన దేహాల్నిసూర్యరశ్మికి అభిముఖంగా నిలబెడతాయి. మనం ఏమీకామనే సత్యాన్ని హృదయంలో ఆవిష్కరిస్తాయి. అవును, మనం ఏమీకాదు,  మన గురించి మనం భావించుకున్నదేమీ మనం కాము. కాని మనం ఎవరం?

జీవితమంతా సత్యాన్వేషణకు వెచ్చించినవారు, ఆధ్యాత్మికంగా సాధారణ ప్రజల కంటే ఉన్నతులా? గొప్ప ప్రతిభాపాటవాలు, మేధస్సు, గొప్ప కళ సృజించగల నైపుణ్యం ఉన్నవారు, మామూలు మానవుల కంటే గొప్పవారా? ఏది సత్యం, ఏది అసత్యం, ఎవరు నిర్ణయిస్తారు? పాపం అని దేనిని అంటారు , దానిని ఎవరు నిర్ణయిస్తారు? ఏది ఉన్నతం, ఏది అధమం? ఇటువంటి ప్రశ్నలు మరింతగా మన హృదయాల్ని కలచివేయుగాక! ఇటువంటి కలతని మన హృదయాలలో అంతులేకుండా కలిగించేదే గొప్ప కళ అని భావిస్తాను. ఈ చిత్రం ఇటువంటి ప్రశ్నలతో మనల్ని బాధిస్తుంది.

ఒక తుఫాను రాత్రి నిర్భాగ్యురాలైన ఒక అవివాహ బాలిక తన బిడ్డను తనతో ఉంచుకోలేక, విడిచిపెట్టనూలేక, దారికానక పయనిస్తున్నప్పుడు ఆమెకి ఒక స్పానిష్ సన్యాసాశ్రమం కనిపిస్తుంది. ఆ ఆశ్రమ ద్వారం వద్ద శిశువును విడిచి ఆమె చీకటిలోకి నిర్గమిస్తుంది. ఆశ్రమవాసులు ఆ బిడ్డకు “ఆంబ్రోసియో” అనే పేరు పెట్టి, సన్యాసిగా పెంచుతారు. అసాధారణ ప్రతిభాశాలి అయిన అతను గొప్ప సన్యాసిగా, జ్ఞానిగా పేరు తెచ్చుకుంటాడు. అతని బోధనలు వినేందుకు ఎంతో దూరం నుండి ప్రజలు వస్తుంటారు. అతను తన పవిత్ర జీవితం పట్ల, ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల ఎంతో నిబద్ధత, క్రమశిక్షణ కలిగిఉంటాడు.

అటువంటి వ్యక్తి జీవితం క్రమంగా తల్లక్రిందులవుతుంది. జీవితాన్ని, అతని అంతరిక సహజాతాల్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఒక హంతకుని కంటే హీనమయిన వ్యక్తిగా తనముందు తాను నిలబడతాడు. అతను తన జ్ఞానంలోని, నియమబద్ద జీవితంలోని, పవిత్రతలోని బోలుతనాన్ని గుర్తించే వేళకి,  అతి క్రూరమైన అతని పతనం వెక్కిరిస్తుంది. జ్ఞానాహంకారం అతని జీవితాన్ని అథ:పాతాళానికి త్రొక్కివేస్తుంది.

పుట్టుకతో జర్మన్ అయిన ఫ్రెంచ్ దర్శకుడు డామ్నిక్ మోల్ యొక్క అసాధారణ ప్రతిభ, ఆధ్యాత్మిక జ్ఞానం, జీవితం పట్ల అవగాహన మనల్ని నివ్వెరపోయేలా చేస్తాయి. అల్బెర్టో ఇగ్లేసియా సృజించిన గంభీరమైన సంగీతం ఆత్మను ప్రకంపింపజేస్తుంది. ఈ చిత్రం ఒక అనుభవం. అది మనిషి మనిషికీ మారుతుంది, వారి అవగాహనని బట్టి.

చిత్రం: ది మాంక్ (లె మోయినె) (2012)
దర్శకత్వం : డామ్నిక్ మోల్
సంగీతం : అల్బెర్టో ఇగ్లేసియా
నిడివి: 101 నిముషాలు
భాష: ప్రెంచ్
నటులు: విన్సెంట్ కాసెల్, డెబొరా ఫ్రాన్సిస్, జోసపెయిన్ జాపే

మీ మాటలు

  1. RammohanRao thummuri says:

    ఒక మంచి చిత్రం గురించి తెలియజేసినందుకు కృతజ్ఞతలు.

  2. ns murty says:

    శ్రీ రాం గారూ,

    సినిమాని ప్రేమించేవారు సాహిత్యాన్నీ, సాహిత్యం ప్రేమించేవారు సినిమానీ కించపరుస్తూ మాటాడడం, వ్రాయడం చాలా చోట్ల చూశాను. ఇంత balanced గా, ప్రతిమాటనీ ఆచితూచి ఎక్కడా ఆక్షేపించడానికి వీలులేని ఉదాత్తభావనలతో రాయడం చూడలేదు. ఇది చాలా చక్కని వ్యాసం. నేను మీకు Instant Fan అయిపోయాను ఈ వ్యాసంతో.

    ఇంతవరకు ఈ సినిమా చూడలేదు. ఇప్పుడు తప్పకుండా వెదికి పట్టుకోవాలి .

    చక్కని వ్యాసం అందించినందుకు హృదయపూర్వక అభినందనలు.

    • శ్రీరామ్ says:

      ధన్యవాదాలు, NS.మూర్తిగారు. మీ వాక్యాలు నాకెంతో ఆనందాన్ని కలిగించాలి. మీ వంటి అభిరుచిగల వారి వ్యాఖ్యలు అమూల్యమైనవి. మరిన్ని వ్యాసాలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తాయి. సంతోషం.

  3. rama murthy says:

    మంచి వ్యాసం. ఆధునిక తెలుగు సాహిత్యం లో రావలసిన విశ్లేషణ,వాస్తవికతను అంగీకరిస్తూ సత్యాన్ని అవిష్కరిస్తు సున్నితంగా మార్పు వైపు మరల్చ గలిగే రచనా శిల్పం… ఇంకా మీ వ్యాసాలు చదవాలని ఉంది.

    • శ్రీరామ్ says:

      తప్పకుండా Rama Murthy గారు, మీ వంటి విజ్ఞులు, రసజ్ఞులు ఒక్కరు చదివి అనుభూతిచెందినా శ్రమపడి సృజించిన కళారూపానికి సాఫల్యత సిద్ధించినట్లే. మీ వ్యాఖ్య ద్వారా, ఒక్క వాక్యంతో ఎంతో ప్రేమగా, సునిశితంగా ఈ వ్యాసం యొక్క ఆత్మని, సారాంశాన్ని విశదీకరించారు. చాలా సంతోషం.

  4. మంచి వ్యాసం

మీ మాటలు

*