త్యాగయ్య కీర్తన మా గడపలో….!

Sriramana1 (2)నేను నాలుగైదేళ్ల వయసులో వుండగా మాచర్లలో చెన్నకేశవస్వామి ఆలయ ముఖమండపంలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మిని చూశాను. పాట విన్నాను.

అప్పుడు నాగార్జునసాగర్ మలి నిర్మాణ దశలో వుంది. మా అక్కయ్య వాళ్లు మాచర్లలో ఒక మిద్దెలో వుండేవాళ్లు. బావ రోజూ సాగర్ వెళ్లి వస్తూ వుండేవారు. అప్పుడు ఆమె పాడిందో లేదో నాకు తెలియదు.

కాని మెరిసే రాళ్ల దుద్దులు, ముక్కు పుడక, కుంకుమ బొట్టు, నికార్సయిన కంచిపట్టు చీరలో చిగురంత నవ్వులో కర్పూరకళికలా వెలిగిపోవడం మంద్రగించని నా జ్ఞాపకాలలో ఒకటి.

పెద్దవాడిని అయ్యాక ఆమె గురించి, ఎమ్మెస్ సంగీత ప్రజ్ఞ  గురించి కొంత తెలుసుకున్నాను. కొన్ని ఏళ్లు గడిచిపోయాయి. తమిళ నాటంత కాకపోయినా తెలుగునాట కూడా ఆమెకు గొప్ప ప్రాచుర్యం వుంది.

మళ్లీ చాలా ఏళ్లకు ఎమ్మెస్ గుంటూర్ వచ్చారు. అప్పటికి ఆమె సంగీత సంస్కారలకు ప్రపంచ ప్రఖ్యాతి వచ్చింది. ఆమె గుంటూరు రావడం, ఆమె సంగీత గోష్టి జిల్లా వాసులకు మరపురాని మధురానుభూతి అవుతుందని అనుకున్నారు చాలామంది. మరీ ముఖ్యంగా ఆ కార్యక్రమాన్ని సంపూర్తిగా తలమీద వేసుకున్న రవి కళాశాల యజమాని సి.వి.ఎన్.ధన్ (చెన్నావఝుల విశ్వనాధం)  . ఎమ్మెస్ కార్యక్రమానికి లెక్కిస్తే గట్టిగా వందమంది శ్రోతలు కూడా వుంటారని నమ్మకం లేదు. నిర్వాహకులు నీరుకారిపోయారు. కొందరు సంస్కారవంతులు సిగ్గుపడ్డారు. సంగీతజ్ఞులు  బాధపడ్డారు.

ఎమ్మెస్‌కి అది దేవుడిచ్చిన వరమో, సహజంగా అబ్బిన లక్షణమోగాని ఆమె యు.ఎన్.ఓ లో పాడినా, ఆలయ వసంత మండపంలో గళం విప్పినా, కేవలం పదిమందే వున్న గోష్టిలో గానం చేసినా అదే శ్రద్ధ, అదే తన్మయత్వం, అదే ఏకాగ్రత ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. తన కోసం తను పాడుకుంటారు. శ్రోతలు విని ఆనందిస్తారు. కోయిల పాట, నెమలి ఆట యీ కోవకు చెందినవి. ఎమ్మెస్ “కురుంజి ” రాగం అత్యద్భుతంగా పాడతారని ప్రతీతి.

ms

కొన్నాళ్లు గడిచాయి. ప్రముఖ సంగీత విద్వాంసులు ఓలేటి వెంకటేశ్వర్లు విజయవాడ నుంచి తిరువాయూరు వెళుతూ, మద్రాసులో ఒక పూట మా యింటికి విడిది చేశారు. ఎమ్మెస్, సదాశివం దంపతులను కలవాలన్నారు. కర్ణాటక సంగీతంలో ఓలేటి వారిని, పినాకపాణిది ప్రత్యేక వొరవళ్లు.

ఫలానావారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, మీకు ఎప్పుడు వీలో చెబుతారా అని ఫోన్ చేశాను. మళ్లీ చెబుతానన్నారు. గంట  తర్వాత ఎమ్మెస్ దంపతులు శివపార్వతుల్లా మా గుమ్మంలో వున్నారు. రెండు పళ్ళు ఓలేటి వారి చేతిలో వుంచి వినమ్రంగా నమస్కరించారు. “మిమ్మల్ని చూడడానికి మేము రావడం మర్యాద” అన్నారు సదాశివం.

ఓలేటి వారి పుణ్యాన త్యాగయ్య కీర్తన “తపమేమి చేసినానో..” మా గడపకి వచ్చినట్లనిపించింది. మేము కొన్ని తరాలు చెప్పుకునే మా అదృష్ట విశేషాలలో యిది మేలు బంతి.

సదాశివం “కల్కి” పత్రికను గొప్ప విలువలతో నడిపేవారు.  ప్రత్యేక సంచికలకు బాపు ముఖచిత్రాలు వేసేవారు. ఆ పత్రిక చాలా డబ్బు హరించింది. కాని వారి గొప్ప నైజాలను గాని, ఎమ్మెస్ ఏకాగ్రతని గాని రేణువంత కూడా హరించలేకపోయాయి. కంచి పరమాచార్య ఆదేశం మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన అన్నమయ్య పంచరత్నాలు పాడించి రికార్డు చేశారు. దానికి కర్త నాటి తి.తి.దే కార్యనిర్వహణాధికారి పి.వి.ఆర్.కె ప్రసాద్. శ్రీనివాసుడు కానుకగా, పారితోషికంగా చాలా డబ్బు యిచ్చారు.

కాని తమ అనంతరం ఆ డబ్బు శ్రీవారికే చెందేలా  ఎమ్మెస్ దంపతులు ఏర్పాటు చేశారు. “భగవంతుడు గొప్ప గాత్రం  యిచ్చాడు. విద్వత్తు కూడా యిచ్చి వుంటే బావుండేది…” అని విమర్శించిన సంగతి కూడా విన్నాను. అందుకే నాకు ఎమ్మెస్ గానం చేసిన” భజగోవిందం మూఢమతే, మూఢమతే భజగోవిందం” అంటే చాలా ‘యిష్టం.’

 

మీ మాటలు

  1. మీ తపం ఫలించిన క్షణాలు మా కళ్ల ముందు కదలాడుతున్నాయి ! ఎమ్మెస్ మీ గడపలో కాలు పెట్టడం అంటే… సరస్వతీ సాక్షాత్కారమే !

  2. అయ్య వారూ నమోనమః

    “మెరిసే రాళ్ల దుద్దులు, ముక్కు పుడక, కుంకుమ బొట్టు, నికార్సయిన కంచిపట్టు చీరలో చిగురంత నవ్వులో కర్పూరకళికలా వెలిగిపోవడం……… ”

    ఎమ్మెస్ గారి గొప్ప వ్యక్తిత్వం గురించీ చెప్తూ ఒక్క మాట లో గొప్ప పోలిక ……

    మరో సారి నమోనమః అంతకంటే ఏం రాయగలను

    భవదీయుడు
    రామ్ ప్రసాద్

  3. లలిత says:

    శ్రీ రమణ గారు ,
    ఎంత అదృష్టవంతులో మీరు …..మేం కూడా .
    రెక్కలగుర్రం పై కబుర్ల మూటతో వచ్చి , మీరు మా గుమ్మంలో దిగినట్టే అనిపిస్తుంటేనూ !

  4. RammohanRao thummuri says:

    విషయం చదువుతుంటేనే ఆనందంగా ఉంది.ప్రత్యక్షంగా అనుభవించిన మీ గురించి ఏం చెప్పగలం.మీ అనుభవాన్ని మాకూ పంచి
    మాకొక మరచి పోలేని అనుభూతిని అందించిన మీకు కృతజ్ఞతలు

  5. దేవరకొండ says:

    ఆఖరి పేరా విపులంగా ఉంటె నా వంటి సామాన్య పాఠకులకు సౌకర్యంగా వుండేది. ఎవరు విమర్శించారు, ఎవర్ని విమర్శించారు, ఆ విమర్శకు, భజగోవిందం కు సంబంధం ఏమిటి … కాస్త వివరించి వుంటే బాగుండేదని…

మీ మాటలు

*