ఏది ప్రధానస్రవంతి సాహిత్యం?

‘2012 ప్రాతినిధ్య కథ’  సంపాదకులు అస్తిత్వవాద సాహిత్యం గురించి, ఈ సంకలనం తీసుకురావడానికిగల ఆదర్శాలను చెబుతూ “బలమైన ఈ గొంతుకలకు స్పేస్ కల్పించడము, ప్రధాన స్రవంతి సమాజంలోకి ప్రమోట్ చెయ్యడము” ప్రాతినిధ్యకథల ఎంపికలో ప్రాతిపదికగా నిలుస్తాయని చెప్పుకొచ్చారు. పుస్తకావిష్కరణలో ఆవిష్కర్త ‘అంటరాని వసంత’ నవలా రచయిత జి.కళ్యాణరావు గారు దీంతో విభేదిస్తూ “ఏది ప్రధాన స్రవంతి సాహిత్యం?” అనే ఫండమెంటల్ ప్రశ్నను లేవనెత్తారు.

మైనారిటీ ప్రజల సాహిత్యాన్ని హెజిమోనిక్ తంత్రాలద్వారా ప్రధానస్రవంతి అని తరాలుగా నమ్మించిన ఐడియాలజీని దళితులు, మైనారిటీలు, ప్రాతీయవాదులు, బహుజనులు, స్త్రీలు అంగీకరించనఖ్ఖరలేదని. నిజానికి ప్రధానస్రవంతి ప్రాతినిధ్యం కోసం పోరాడుతున్న విభిన్నమైన, వైవిధ్యమైన అస్తిత్వసాహిత్యాలదే అటూ వివరణ ఇచ్చారు కూడా. కొంత ఆలోచించాల్సిన విషయం ఇది.

మరో వైపు చూసుకుంటే, సాహిత్యాన్ని సాహిత్యంలా చూడకుండా ప్రాంతీయ తత్వం, జెండర్ వాదాలూ, కులం రంగులూ, మతం ఐడెంటిటీలు కలగలిపి కుంచించుకుపోయేలా చేశారు. అనేది మరో వాదన.

ఈ సందర్భంలో మన ముందు ఉన్న ప్రశ్న ఏది ప్రధాన స్రవంతి సాహిత్యం? అస్తిత్వవాద సాహిత్యమా? మైనారిటీ సాహిత్యమా?

మీ మాటలు

 1. సాహిత్యాన్ని సాహిత్యంలా చూడకుండా ప్రాంతీయ తత్వం, జెండర్ వాదాలూ, కులం రంగులూ, మతం ఐడెంటిటీలు కలగలిపి కుంచించుకుపోయేలా చేశారు. అనేది మరో వాదన. ______________________ I’m with this

  • హితంకోరేదే సాహిత్యమైతే అస్తిత్వవాద సాహిత్యం మరింతగా నిర్వచనంలోకి ఒదిగిపోయే సాహిత్యమే అనుకుంటాను. జీవితం సాహిత్యమైతే మరింత వైవిధ్యాన్ని, భిన్నత్వపు రెప్రజెంటేషన్ని తీసుకొచ్చిన అస్తిత్వవాదసాహిత్యం తన వంతు జీవితాన్ని సాహిత్యానికి యాడ్ చేసిందనే అంటాను. ఇక సాహిత్యం సాహిత్యం అవుతుంది కాబట్టే అన్ని వాదాలూ సాహిత్యంలో ఉండాలంటాను.

 2. ns murty says:

  ఏది మంచి సాహిత్యమో నిర్ణయించుకుని చదువుకుని ఆనందించే హక్కు పాఠకుడి దగ్గరనుండి లాక్కుని, వాదాలగందరగోళంతో సంకుచితం చేయడమే కాకుండా, ఒక సంస్కృతిగా, ఒక సంఘంగా సంఘటితపరచగల సాహిత్యప్రయోజనాన్ని దెబ్బతీసారని నా అభిప్రాయం.

  • వాదాల సాహిత్యం మరింతగా విశాలత్వాన్ని అందిస్తున్నాయేమో ! సంఘంగా సంఘటిత పడాలంటే అన్ని అస్తిత్వాలనీ అర్థం చేసుకోవాలేమో ! సహానుభూతి కలిగి ఉండాలేమో !

   • ns murty says:

    అస్తిత్వవాదాల మీద నాకు ఎంతమాత్రం విరోధంలేదు. మనపూర్వీకులు చేసిన తప్పులే మనం చేసుకుపోవడం ప్రగతి కాదుకూడా. అయితే. ఈ అస్తిత్వవాదాలు, మనతప్పుల్ని ఎత్తిచూపి వాటిని సరిదిద్దుకునే మార్గంలో కాకుండా, మనల్ని విడదీసుకునే మార్గంలో సాగుతున్నాయని నా అవగాహన. వాదాలు ఖచ్చితంగా మనం మరచిపోయిన/ గుర్తించలేని/పార్శ్వాలు తట్టిచూపిస్తాయనడంలో సందేహం లేదు. పర్యవసానంగా, మన దృష్టి వర్తమానం మీద కాకుండా గతంలోనే ఉండిపోతున్నాయని నా బాధ.

 3. సాహిత్యాన్ని “మొత్తం” సాహిత్యంగానే చూడాలి తప్ప టాగులు తగిలించడం పాఠకులను వర్గీకరించడమే అవుతుందని నా అభిప్రాయం. ఇవాళ ఏ రచన గురించి ప్రత్యేకించి మాట్లాడాలన్నా, నేను స్త్రీనో, లేక ఒక ప్రాంతానికి చెందిన దాన్నో,మరోటో అయి ఉండాలి. దృక్పథం అంతర్లీనంగా ఉండటం వేరు, దాన్నే గ్లోరిఫై చేస్తూ, అదే ప్రధానంగా పెట్టుకుని రచనగా మలచడం వేరు.

  అందుకే వాదాల సాహిత్యానికి నేను దూరం. కుటుంబరావు కాని, రావి శాస్త్రి , గోపీ చంద్,బుచ్చి బాబు.. వీళ్లంతా రాసిన రచనలు ఇవాళ్టికీ మనకు ఒయాసిసిస్సుల్లా కనపడి చదువుతున్నాం అంటే..వాటిలో జీవితం తప్ప, వాదం కనపడదు. సామాజిక దృష్టో,మరో కోణమో ఉన్నా.. అది నేల విడిచి సాము చెయ్యదు .

  అందువల్ల ఇది “ఫలానా వాద సాహిత్యం” అని ముందే ముద్ర వేసేసి ఉంటే.. నేను చచ్చినా దాని జోలికి పోను. మళ్ళీ మళ్ళీ పాత సాహిత్యమే చదువుకుంటూ కూచుంటాను కానీ

  అలాగే పాఠకులు తమ పరిజ్ఞానం మేరకు, అవగాహన మేరకు, తాము అనుసరించే వాదాల ప్రకారం రావి శాస్త్రికి, కొ.కు కు టాగ్స్ కడితే అది పాఠకులే పనే తప్ప, ఆ టాగులు రచయితలకు, రచనలకు వర్తించవు. వాళ్ల సాహిత్యం కాలాతీతం. అది టాగులకు అంటదు. దాన్ని టాగుల్లోనో, వాదాల ఫ్రేముల్లోనో ఇరికించాలని చూడ్డం అవివేకం

 4. “ప్రాతినిధ్య” మొదటి సంకలనమే! ఆ సంకలనం సంపాదకుల నిర్ణయించుకున్న కొన్న పరిమితులకు లోబడి, ఎన్నుకున్న కొన్ని అస్థిత్వ వాదాలను ప్రతిఫలించే కథల సంకలనమే అది.

  పైన NSMurty గారు అన్నట్టు తో ఏకిభవిస్తూ, కత్తి మహేశ్ కుమార్ కోరుకుంటున్న “సహానుభూతి” తో భవిష్యత్తులోకి కాకుండా భూతకాలంలోకి తీసుకెళ్ళే “బూచీ” సాహిత్యాని పరిపుష్టం చేస్తున్నది నేటి అస్తిత్వ వాద సాహిత్యం. వీటిలో కొన్ని పోకడలు, ప్రస్తుత దేశ కాల మాన పరిస్థితులను ప్రతిఫలిస్తున్నవి.

  అందుకనే కొందరు పాఠకులు, ఇజాలకి, వాదాలకి దూరంగా ఉన్న సాహిత్యాన్ని కోరుకోంటున్నారు. అలా కోరుకోవడంలో తప్పుకూడా లేదు.

  తను చదవాల్సింది నిర్ణయించుకునేది పాఠకుడే! కడదాక నిలబడేది ఆ సాహిత్యమే!

 5. dr.gunti.gopi says:

  సాహిత్యం లో వాదాలు ఎనీ ఉన్న వాటి అంతరాగములు ఒకటే వాటిని దృష్టిలో పేతుకొని మనమందరం చూడాలి అపుడై సాహిత్యం మనగలుగుతుంది

 6. karthik ram says:

  నాకు కథ ఏదైనా , రచయిత ఎవరు అని చూడకుండా చదవడం అలవాటు , కథ చదవడం అందులోని పాత్రలతో ,ఆ రచయిత శైలీ లోనే మస్తిష్కం లో ఒక దృశ్యాన్ని ఊహించుకొంటాను , ఆ కథ మూలం ఏమైనా కాని ఒక చదువరి గా చదువుతాను ., కథ కాలం , అందులోని అంశం రచయిత నేర్పరితనం ,తను ఊహించిన విదానం లోనే మనం చదివి ..ఏం రాసాడు రా ! అని అనుకుంటేనే అది నాకు నచ్చిన కథ అంటాను ., మన ఇష్టాలు కొన్ని సార్లు కొన్నింటిని మంచి కథ లంటే , కొన్నింటిని పర్లేదు అనేలా చేస్తాయని నా నమ్మకం ., కానీ కొందరి కథ లు మనకు చాల దగ్గర గా వున్నట్టుగ్గా అనిపిస్తాయి ., అప్పటి నుండి కథ వస్తే రచయిత పేరు చూసి చదువుతాను ., అది అంతవరకే కానీ మళ్లీ మరొక రచయిత కథ మీద ఆ ప్రభావం వుండదు ., కానీ ఈ మధ్య నాకు ఒక చిన్న సందేహం కలిగింది….ఈ మధ్య కొందరు కొన్నింటిని గొప్ప కథ లు అని అంటున్నారు ., మంచిదే … కాని ఈ మధ్య కొన్ని విషయాలలో కథకుడి కథ ల మీద విమర్శ లు కొంచం బాధాకరం గా ఉంటున్నాయి ., ఒక్కరికి ఒక కథ నచ్చవచ్చు వేరొకరికి అది మామూలు కథే అని అన్పించ్చొచ్చు …అంతమాత్రాన కథ కథ కాకుండా పోతుందా …..కాని ఇంకా కొత్త కథ లు రావాలి పాత కథకుల నుండి మరియు సీనియర్ కథకులు కొత్త వాటిని సహృదయం తో ఆదరించాలి ., కథ ఏదైనా చదివించేదే గొప్పది …

 7. మణి వడ్లమాని says:

  నిజం చెప్పాలంటే కధలంటే కధలే గాని. అవి వర్గికరించుకొంటూ పొతే అసలు కధ యొక్క అస్తిత్వమే పోతుందేమో? అని భయం వేస్తోంది.
  కధలలో ఇన్ని రకాల వర్గీకరణ లున్నాయని ఇపుడిపుడే తెలుస్తోంది.
  కథ ఏదైనా గాని పాఠకులను చదివించేది గ వుండాలి,వాద రహితమైన .సాహిత్యం అందరికి నచ్చుతుందేమో అని నా భావన.

 8. వర్గాల సంకెళ్ళలో భావాల్ని బంధిస్తున్న ఓ మేధావుల్లారా, మనసులోంచి పుట్టే ఒరిజినల్ భావాలకు వర్గం తెలీదు. అమ్మ కడుపులోంచి పుట్టే బిడ్డకి కులం తెలీనట్టే!!.. కధను చదివే మా లాంటి మామూలు పాఠకులకి కూడా తెలీదు. మాకు తెలిసిందల్లా, మంచి కధకి, కధలోని విషయానికి స్పన్దించడమే. రచయితలు అందరూ ఇలా వర్గీకరణ లో ఇరుక్కుని, స్వచ్చమైన కధలు పండించి పంచడం మర్చిపోతున్నారు. పస ఉన్న కధకి వర్గం లేదు. పస లేని కధ ఎన్ని జండాలు పట్టుకున్నా ఫలితం లేదు. దయ చేసి, మనం కధని కధగా, కవిత్వాన్ని కవిత్వం గా చూద్దాం.

  గడచిన గతాన్ని వర్గాలతో కొలవడం వరకూ ఓ.కే . వర్తమానాన్ని స్వచ్చంగా వదిలేద్దాం. అప్పుడే, పసి పాపలాంటి స్వచ్చమైన కధలు కవితలు వస్తాయి. మన మేధాత్వాన్ని మరో మంచి పనికి వినియోగిద్దాం. For Example, Writing a good story …

 9. కల్యాణి says:

  సాహిత్యాన్ని వర్గీకరించడం, సాహిత్య విద్యార్థులకి లాభించే అంశం. అది వారి పరిశోధనలకి పనికి వస్తుంది. కానీ రచయితలని వర్గీకరించడం ఎంతమాత్రం మంచిది కాదు. ఒకసారి ఒక ముద్ర పడిన తరువాత ఆ రచయితకి మొదట్లో అది తియ్యగా ఉంటుంది. అది తనకి లభించిన గుర్తింపుగా భావించడం జరుగుతుంది. దాంతో అదే విధమైన మరి కొన్ని రచనలు చేస్తారు. అవి మరింత గౌరవాన్ని ఇచ్చాయనుకోండి. అప్పుడా రచయిత క్రమంగా దాన్ని నిలబెట్టుకోవడానికి మరింతగా ప్రయత్నిస్తారు. చివరికి రచయిత నత్తగుల్లగా మారి నత్తగుల్లలో తలదాచుకుంటారు. ముద్ర మిగులుతుంది. అందులో రచయిత మిగలరు. అదే తెలుగు సాహిత్యానికి పట్టిన దుర్గతి. అరసమా విరసమా సరసమా లేక సాహిత్యమా ?
  – కల్యాణి

మీ మాటలు

*