చిల్లు జేబులో నాణేలు / సతీష్ చందర్

satish-219x300
బతికేసి వచ్చేసాననుకుంటాను
అనుభవాలన్నీ మూటకట్టుకుని తెచ్చేసుకున్నాననుకుంటాను.
ఇంతకన్నా ఏంకావాలీ- అని త్రేన్చేద్దామనుకుంటాను.

 

గడించేసాననుకుంటాను.
జేబుల్లో సంపాదన జేబుల్లోనే వుండి పోయిందనుకుంటాను.
రెండుచేతులూ జొనిపి కట్టల్ని  తాకుదామనుకుంటాను.

 

అనుభవాల మూటలూ,
నోట్ల కట్టలూ, అన్నీ వుంటాయి.
కొన్ని వెర్రి చేష్టలూ, కాసిన్ని చిల్లర నాణాలూ తప్ప.
జీవితమన్నాక చిన్న చిన్న ఖాళీలూ, జేబు అన్నాక కొన్ని కొన్ని చిరుగులూ తప్పవు.

 

వెయ్యి నోటు వదలి, రూపాయి బిళ్ళ కోసం వెనక్కి వెళ్తానా?
తప్పటడుగుల్తో ముందుకు వచ్చాను. వెనకడుగుల్తో వచ్చిన దూరాన్ని కొలుస్తానా?
తిరుగు బాట తప్పదు. వెతుకులాటే బతుకేమో!

 

పొందిన ప్రేయసిని వదలి, ప్రేమలేఖ కోసం పరిశోధనా?
ఏళ్ళతరబడి  హత్తుకున్నాను. అప్పటి క్షణాల ఎడబాటు ఇప్పుడు అవసరమా?
జ్ఞాపకం అనివార్యం. జారిపోయిందే జీవితమేమో!

 

నా బుగ్గ కంటిన  ఆమె కంటి చెమ్మా,
నా మునివేళ్ళ మీది ఆమె వెచ్చటి ఊపిరీ
అంతలోనే తడిగా, ఆ వెంటనే పొడిగా…
అన్నీ చిల్లు జేబులో నాణాలే.
వాటిలో ఒక్కటి దొరికినా సరే,
కూడ బెట్టిన సంపదంతా చిన్నబోతుంది.
బతికేసిన బతుకుంతా చితికి పోతుంది.

 

ఆ క్షణాని కది బెంగ.
కానీ, ఒక యుగానికి చరిత.

 

III III III

 

నన్ను పోల్చుకోలేని నగరానికొచ్చేశాననుకుంటాను
నా మానాన నేను బతకగల నాగరీకుణ్ణయిపోయాననుకుంటాను.
ముందు వెనుకలడగని ఒక మహా ప్రపంచంలో కలిసి పోయాననుకుంటాను.

 

గట్టెక్కేసాననే అనుకుంటాను.
విజయాలన్నింటినీ వెండి కప్పుల్లో నింపేశాననే అనుకుంటాను.
అలమర అద్దాలు జరిపి మెడల్స్‌ను తడుముకోవచ్చనే  అనుకుంటాను.

 

గదుల్లో ఏసీలూ, మెడనిండా మాలలూ, అన్నీ వుంటాయి.
దాటి వచ్చిన పల్లెలూ, దండ తప్పిన మల్లెలూ తప్ప.
ప్రవాసమన్నాక కొన్ని సంచులు మరవడాలూ, పాత డైరీలు వదలడాలూ తప్పవు.

 

ఈ-బుక్కుల్ని వదలి, పిచ్చి కాగితం వెంట పరుగెత్తుతానా?
తరగతులు దాటుతూ ఎదిగాను, స్థితిగతులు దించుకుంటూ పోనా?
తవ్వాలంటే దిగాల్సిందే. లోతుకు పోవటమే ప్రయాణమేమో!

 

నగరం నడి బొడ్డు వదలి, ఊరి వెలుపలకు దిగిపోవటమా?
కలగలిసిపోయాన్నేను. కుడిఎడమల తేడాలిప్పుడు కావాలా?
తిరిగి రావటం యాత్ర. మూలాన్ని చేరడమే ప్రవాసమేమో!

 

తెల్ల పువ్వు కోసం చెట్టుకూడా ఎక్కలేని వణుకూ
బుల్లి నవ్వు కోసం పూజారి కూతుర్నే గిచ్చిన తెగువా
ముందు చలి, తర్వాత వేడి
రెండూ వద్దనుకున్న వస్తువులే.

 

కలిపి దొరికితే చాలు
ఎక్కిన అంతస్తులు కూలిపోతాయి.
నగర అజ్ఞాతం ముగిసి పోతుంది.

 

ఇప్పటికిది ఆశే
కానీ, రేపటికదే శ్వాస.

 

III III III

 

పల్లెకొచ్చాక బెంగ తీరుతుందనుకుంటాను
కవులు కలవరించే గ్రామం మురిపిస్తుందనకుంటాను.
గుడిసెల మధ్య మేడల్ని చూసి నింగి నేలకొచ్చేసిందనుకుంటాను.

 

ఊరూవాడా ఏకమయందనుకుంటాను.
సరిహద్దు రేఖ చెరిగిపోయిందనే అనుకుంటాను.
పేట విందుల్లో ప్లేటందుకునే పెదరాయళ్ళని పొగడొచ్చనే అనుకుంటాను.

 

అంటనిపించని వంటలూ, చెమట కనిపించని సెంటులూ, అన్నీ వుంటాయి.
దుబాయిలో దిగబడిపోయనా కొడుకూ, పదిరోజులక్రితం పాడె యెక్కిన తల్లీ తప్ప.
ఎదగడమన్నాక, కౌగలింతల్ని కాజేసే దూరాలూ, శవాన్ని మోసిన కలల భారాలూ తప్పవు.

 

తరగని ఎడారుల్ని వదలి, ఎరగని పొలాల కోసం వచ్చేస్తానా?
మునివేళ్ళతో మట్టిలోనే రాశాను.భూమంత గుండ్రంగా కుండను చెయ్యలేనా?
ఓహ్‌! బురద మైలపడుతుందే. ఊరికి అవతలంటే, ఉత్పత్తికి ఆవలేగా!

 

తలలు గొరిగే పనే అక్కడ, వదలుకుంటే ఇక్కడ తలారి పనేగా!
ప్రాణమున్న శిలను శిరస్సుగా చెక్కటమే . పంచ ప్రాణాలతో చేస్తాను.
ముట్టుకుంటే కేశాలు మాసిపోవూ? అంటరానితనమంటే, వృత్తిలేని తనమేగా!

 

సెలవు కొచ్చినప్పుడు గొప్పలూ
కొలువు చేసినప్పుడు తిప్పలూ
అప్పుడే మిరిమిట్లూ, వెంటనే చీకట్లు
వాడలన్నీ క్రిస్మస్‌ చెట్లే.

 

ఏటి కొక మారు చాలు
ఒక రాత్రిలో ఏడాది కాపురం
సమాధి మీదే అమ్మ జ్ఞాపకం

 

వాడ వాడే,
నేనెగిరి పోయేది గాలి ఓడే

 

మీ మాటలు

 1. జారిపోయిందే జీవితమేమో…

  అంతలోనే తడిగా, ఆ వెంటనే పొడిగా…
  అన్నీ చిల్లు జేబులో నాణాలే.
  వాటిలో ఒక్కటి దొరికినా సరే,
  కూడ బెట్టిన సంపదంతా చిన్నబోతుంది.
  బతికేసిన బతుకుంతా చితికి పోతుంది.

  చిన్న చిన్న ఆనందాల సమాహారం మర్చి పోయిన మనసు ఆర్తి..

  వాడ వాడే.. నేనెగిరిపోయేది గాలి ఓడే..

  మీమార్కు పద ప్రయోగాలు.. కవితని ఒకటి,రెండు.. మూడు.. నాలుగు.. అలా చదివిస్తూనే వుంటాయి..

 2. మొన్న ‘ప్రపంచ కవితా దినోత్సవం’ రోజున రవీంద్ర భారతి’ లో సతీష్ చందర్ గారు చదువుతూ వుంటే విన్నాను….గొప్ప కవిత!
  నవ్వుతూ/నవ్విస్తూ విషాదాన్ని పలికే చార్లీ చాప్లిన్ సినిమా లోని వ్యాకరణం ఏదో సతీష్ చందర్ గారి లోని కవిత్వంలో వుందనిపిస్తుంది ….

 3. సతీష్ చందర్ గారు,

  కవిత చాలా బాగుంది.

  మీ వచనమంటే చాలా ఇష్టం నాకు.

 4. pulipati guruswamy says:

  అనేక కోణాలను ఏకోన్ముఖంగా నడిపించిన తీరు వారికే చెల్లు. మంచి పద్యం.

 5. చాలా కాలానికి మళ్ళీ మీ కవిత చదువుకోవటం.
  సగటు తెలుగుకవిలో కనిపించని ఓపెన్ వాయిస్ తో మెరిసే మీ కవిత్వం చదువుకోవటం సంతోషాన్నిచ్చింది.

 6. buchireddy gangula says:

  జేబు అన్నాక కొన్ని చిరుగుల్లు తప్పవు ——బాగా చెప్పారు —–కవిత
  బాగుంది సర్

 7. సతీష్ చందర్ గారి మరిన్ని కవితలు, రచనలు ఆయన వెబ్ సైట్ లో చదవవచ్చు
  http://www.satishchandar.com

 8. ఒక జీవిత ప్రస్థానాన్ని అద్బుతంగా అవిస్కరించారు. తనకు ప్రత్యేక మైన శైలితో!

మీ మాటలు

*