కథ ఆయన గుండె గూటిలో దీపం!

naannaవొక్క పుస్తకం కూడా కనిపించని చిన్న వూళ్ళో రాజారాం గారు పుట్టారు. పుస్తకాలు దొరికే ఇంకో వూరిని వెతుక్కుంటూ ఆయన రోజూ మైళ్ళ తరబడి నడుచుకుంటూ వెళ్ళే వారు. పుస్తకాల్ని వెతుక్కుంటూ వెళ్ళినట్టే ఆయన మనుషుల్నీ వెతుక్కుంటూ వెళ్ళడం నేర్చుకున్నారు. దూరాల్ని దాటి మనుషుల్ని ప్రేమించడం నేర్చుకున్నారు.

వొక్క రచయిత కూడా కనిపించని పరిసరాల్లో రాజారాం గారు పెరిగారు. కానీ, తానే రచయితలని వెతుక్కుంటూ వూళ్ళు దాటారు, సీమ దాటారు. ఆ క్రమంలో ఆయన సీమకథని కూడా సీమ దాటించారు. సీమ రచయితలని బెజవాడ పత్రికా ప్రపంచ పటంలో నిలబెట్టారు. కథని తన గుండె గూటిలో దీపంగా వెలిగించుకుని ఆరాధించారు.

ఇక్కడ ఈ ఆల్బమ్ లో వొక్కో ఫోటోనీ చూస్తూ వుంటే నలుపు-తెలుపు నించి రంగుల్లోంచి మారిన చరిత్రే కాదు. వొక చిన్న పల్లెటూరి వ్యక్తి తన చుట్టూ ఎంత పెద్ద ప్రపంచాన్ని నిర్మించుకున్నాడో తెలుస్తోంది. కేవలం తపన…కేవలం ప్రేమ…కేవలం వొక అంకిత భావం…ఇదీ ఈ వ్యక్తి చరిత్రని, చరితని నిర్మించిన భావనలు.

రాజారాం గారి జీవితం వడ్డించిన విస్తరి కాదు. తన విస్తరి తానే కుట్టుకుంటూ కష్టపడి సంపాదించిన నాలుగు మెతుకులతో నాలుగు దిక్కుల నిండా ప్రేమని పంచిన రాజారాం గారి వ్యక్తిత్వాన్ని కళ్ళకి కట్టే చిత్రాలివి.

ఈ చిత్రాల్ని మాకు అందించిన ఆయన కుమారుడు, ప్రముఖ కథకుడు మధురాంతకం నరేంద్ర గారికి మా ధన్యవాదాలు.

 

మీ మాటలు

  1. రాజారాం గారిని స్మరించుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.

  2. సర్వసాధారణంగా అందరం అన్నిరకాల కథలను చదువుతాం, కంటిచూపు బాగున్నంత కాలం చదవడామనే ప్రక్రియను కొనసాగిస్తాం.కొన్నిసార్లు చదవడానికి కొన్ని అవాంతారాలవాళ్ళ చదవలేకపోవచ్చు.కథకుల్లో తమను ప్రభావితం చేసిన , సంస్కారాన్ని పెంపొందింపజేసినవారిని,సంస్కరించిన వారిని, సన్మార్గంలో పెట్టెవారిని,మార్గదర్శకులైనవారిని,గురువుగా దండించినా,ఆదండనలో తండ్రి భాధ, గురువు భోధనలు కూడా వుంటాయి. కథకుడు తండ్రిపాత్రధారిగా పరకాయ ప్రవేశం చేయడమన్నది చాలా అరుదుగా జరుగుతుంది. కాని మధురాంతకం రాజారాంగారు తమ కథల్లో పాత్రలను, సన్నివేశాలను ఏనాడూ నేలవిడిచి సాము చేయించలేదు.స్థానికతకు వాస్తవికతకు పట్టం కట్టినారు.మాండాలికలంలోని సొబగు,సొగసు దెబ్బతినకుండా కంటిని రెప్పలాకాచారు.జీవన సత్యాలను సూక్తులద్వారా, సుద్దులను వడపోసి చాలా సమస్యలకు పరిష్కారాలను తనదైన శైలిలో ఆవిష్కరించారు.వారి కథ సంపుటాలు ఎన్నొ సందేహలకు, సమస్యలకు మాత్రగుళిక ఔషదాలే మరి.మహత్మగాంధిజీ గురించి ఐన్ స్టీన్ వ్యాఖ్యానించినట్లుగా “రక్త మాంసాలతోనిండిన మహనీయుడు ఈ జగతిపై నడయాడినంటే భావి తరాలవారు నమ్మకపోవచ్చు” అన్నది మరో విధంగా మధురాంతాకంగారికి వర్తిస్తుంది కూడా. గ్రామీణ నేపధ్యం కలిగిన ఒక సాధారణ ఉపాధ్యాయుడు కథకుడుగా రూపాంతరం చెంది ఇన్ని ఆణిముత్యాలవంటి కథలను భావితరాలవారికి బంగారు కానుకగా ఇచ్చారని విస్మయం చెందక మానరు. నాపైన వారి కథల ప్రభావం మాటల్లో చెప్పరానిది.వారిని పెద్దనాన్నగారిగానే ఇప్పటికితలపోస్తున్నాను.ఆ మహనీయ మానవీయ కథకున్ని ఈవిధంగా సంస్మరించుకునే అవకాశం కలగడం మాత్రం నాకు నిజంగా వరప్రసాదమే మరి.

మీ మాటలు

*