తెలుగు కోసం కలవరిస్తూ… వెళ్ళిపోయిన మన ధర్మారావు

గోరా శాస్త్రి, పీ.వీ. నరసింహారావుల తో కలిసి పాల్గొన్న సభలో ప్రసంగిస్తున్న ధర్మారావు

గోరా శాస్త్రి, పీ.వీ. నరసింహారావుల తో కలిసి పాల్గొన్న సభలో ప్రసంగిస్తున్న ధర్మారావు

తెలుగు ప్రజానీకానికి నూరు మంచి పుస్తకాలు ఏర్చి, కూర్చి, వెదజల్లిన చలమాల ధర్మారావు (1934-2013) కళాప్రియుడు, సాహిత్యాభిమాని, అన్నింటికి మించి సహృదయుడు. మా యిరువురికీ వున్న ఏభై ఏళ్ల పరిచయం ఎన్నో అనుభవాలను సంతరించి పెట్టింది.

ధర్మారావుకు చదువుకునే రోజుల్లో మిత్రులుగా వున్న వెల్చేరు నారాయణరావు, ముక్తేవి లక్షణరావుతో సహా ఉత్తరోత్తర హైదరాబాదులో ఆప్త మిత్రులుగా మారిన శ్యామలరావు కోడూరి కాశీవిశ్వేశ్వరరావు శుభలేక నిర్మాత శాస్త్రిగారు, నాటక కర్త ఎ.ఆర్. కృష్ణ ఆయన్ను అంటిపెట్టుకుని విడిపోకుండా కొనసాగటం ఆయన ఆప్యాయతకూ, మానవతకూ నిదర్శనం.

ధర్మారావు మాటవరసకి ప్రభుత్వ ఉద్యోగే కాని ఆచరణలో బహుముఖ కార్యదక్షుడు. సెక్రటేరియట్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు కళానికేతన్ అనే సంస్థను స్థాపించి, ఎన్నో నాటకాలు, సాహిత్య ప్రదర్శనలు చేసారు. దానికి తొలుత బాబుల్ రెడ్డి అధ్యక్షుడుగా ధర్మరావు కార్యదర్శిగా వుండేవాడు.

ధర్మారావు వివిధ సంఘాలలో వున్న ఆసక్తికి నిదర్శనగా ఆయన హీరోగా నటించిన ‘సినిమా పిచ్చోడు’ అనే చలన చిత్రం పేర్కొనవచ్చు. రఘునాథ రెడ్డి ప్రొడ్యూసర్ గా ఉన్న సినిమాలో ధర్మారావు హీరో. వాణిజ్యపరంగా అది సఫలం కాలేదు. బి.నరసింగరావు చేసిన ‘హరివిల్లు’ సినిమాలో చిన్నపాత్ర కూడా ధర్మరావు వేశారు.

ఇవన్నీ అలా వుంచి రచనా వ్యాసంగం ఆయనకు ఇష్టమైనది. తెలుగు స్వతంత్రలో ప్రారంభించి ఎన్ని పత్రికలకు తన వ్యాసాలందించాడో లెక్కలేదు. హైదరాబాదు నుండి వచ్చిన ప్రజాతంత్ర వారపత్రికలో దేవీప్రియ సంపాదకత్వాన వెలువడిన రోజులలో నేను ధర్మారావు సీరియల్ గా రచనలు చేశాం. ‘విస్సన్న వేదం’ అనే పేరిట ధర్మారావు ఒక కాలం నిర్వహించారు. విజయవాడ నుండి వెలువడిన ‘నడుస్తున్న చరిత్ర’ కొన్నాళ్ళు ధర్మారావు సంపాదకత్వాన సాగింది కూడా. ఇక దిన పత్రికలలో, వారపత్రికలలో ఎన్నో విలువైన వ్యాసాలు రాశారు. ఈనాడులో సి.ధర్మారావు అనే పేరిట వ్యాసాలు వస్తే చాలామంది అవి రాసింది ఈయనే అనుకునేవారు. కానీ, ఆ ధర్మారావు వేరు.

చలం పట్ల ధర్మారావుకు వీరాభిమానం వుండేది. ఇంచుమించు ఈ విషయంలో రంగనాయకమ్మకు ధర్మారావుకు పోలిక వున్నది. చలం సాహిత్యాన్ని కొంతమేరకు ఎంపిక చేసి, అందులో స్త్రీలపట్ల చలం రచనలు వాటి ప్రాధాన్యతను చూపిన ధర్మారావు, చలానికి విజయవాడలో ఒక కంచు విగ్రహం వేయించి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

ధర్మారావు హాస్యప్రియుడు. సున్నిత విమర్శకుడు. మార్క్సిజం ఎక్కడ మిగుల్తుంది అంటే రంగనాయకమ్మ దగ్గర అని చమత్కరిస్తే మిత్రులు నవ్వుకున్నారు. ఆయన చేసిన వుద్యోగాలలో ఆయనకు అత్యంత ఇష్టమైనది అధికార భాషా కమీషన్ కు కార్యదర్శిగా వుండడం. నండూరి రామకృష్ణమాచార్యులుగారు అధ్యక్షులుగా వున్నప్పుడు, విధానాల నిర్ణయంలోనూ ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగును వ్యాపింపచేసే తీరుకు మార్గదర్శకత్వాలను నిర్ణయించటంలోనూ ధర్మారావు నిగర్విగా పాత్ర వహించారు.

ధర్మారావుకు సొంత నినాదం ఒకటున్నది. అదేమంటే ‘రాజ్యాంగం తెచ్చిన భారతీయ భాషలన్నిటికీ సమాన ప్రతిపత్తి వున్నది. కనుక హిందీని మాత్రం జాతీయ భాష అనటం తప్పని, అన్నిటికీ ఒకే స్థాయి సమకూర్చాల’ని అనేవాడు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆవుల సాంబశివరావుతో కలసి, తాను కార్యదర్శిగా ‘జనహిత’ అనే సంస్థ స్థాపించి, మంచి పుస్తకాల ఎంపిక కార్యక్రమం చేపట్టారు. అందులో పురాణం సుబ్రహ్మణ్య శర్మ, బొమ్మకంటి శ్రీనివాసాచార్యులుగారి సహకారంతో రాత్రింబగళ్ళు, పుస్తకాలను దుర్భిణి వేసి చూసి లిస్టు చేసి సెంచరీ కొట్టారు. ఆ వంద పుస్తకాల లిస్టు వివాదాస్పదం కాకపోవటం ధర్మారావు ప్రతిభకు నిదర్శనం.

తెలుగు భాషను అభివృద్ధి చేయటానికి అవలంబించాల్సిన మార్గాలను అన్వేషించి నిరంతర చెపుతూనే వుండేవాడు. ఒక అనధికార సంఘాన్ని కూడా తెలుగు భాషా సమాఖ్య పేరుతో ఏర్పరచారు.

భారత సాహిత్య చరిత్రలో సంచలనం సృష్టించిన కేరళ కవయిత్రి కమలాదాస్ స్వీయ చరిత్రను తెలుగులోకి అనువదించారు. కమలాదాస్ హిందువైనా ముస్లింగా మారి, అటు కవితలలోనూ, వచన రచనల్లోనూ, కొత్తదారులు తొక్కి అందరి దృష్టీ ఆకర్షించారు. అందుకే ధర్మారావు ఆమె స్వీయచరిత్రను అనువదించారు.

ఇక అతి ముఖ్యమైన విషయం ధర్మారావుకు ఇష్టమైన గోరాశాస్త్రి స్నేహం. అందులో నేనూ భాగస్వామిని. మేమిరువురం కూడబలుక్కుని మండవ శ్రీరామమూర్తిని కలుపుకుని గోరాశాస్త్రి అర్థశతాబ్ది జన్మదినోత్సవాన్ని జరిపాము. అసలు విషయం ఆ పేరిట ఆయనకు ఆర్థిక సహాయం చేయాలని సంకల్పించాము. గోరాశాస్త్రి ఎప్పుడూ ఆర్థిక మాంద్యంలో వుండేవారు. అనారోగ్యం సరేసరి. కర్నూలులో 1968లో పెద్ద సభ జరిపి నాటి విద్యామంత్రి పి.వి.నరసింహారావు జిల్లాపరిషత్ అధ్యక్షుడు కోట్ల విజయభాస్కర రెడ్డిని పిలిచి వారి చేతుల మీదుగా గోరాశాస్త్రికి పర్సు ఇప్పించాము. ధర్మారావు, నేను ఒక సంచికను వెలువరించాము.

ధర్మారావుకు బహుముఖాల మిత్రత్వం వుండేది. చాలా పెద్ద జాబితా. విప్లవ కవుల్లో ఒకరైన నగ్నముని (కేశవరావు), కుందుర్తి ఆంజనేయులు, గోల శాస్త్రి (గోపాల చక్రవర్తి), శీలా వీర్రాజు (సుప్రసిద్ధ ఆర్టిస్టు) యిలా చాంతాడువలె జాబితా దొరుకుతూనే వుంటుంది.

రావిశాస్త్రి (రాచకొండ విశ్వనాథ శాస్త్రి) హైదరాబాదు వచ్చినప్పుడల్లా నియో మైసూర్ కేఫ్ లో వుంటూ మాకు కబురు చేసేవాడు. అక్కడ గోరా శాస్త్రి, నేను, ధర్మారావు తదితరులం చేరి జోకులతో కడుపు చెక్కలయ్యేటట్లు ఆనందించిన రోజులు మరువరానివి. రిటైర్ అయిన తరువాత కూడా ధర్మారావు సాహిత్య కాలక్షేపం భాషా సేవతోనే గడిపారు.

ధర్మరావు భార్య వరలక్ష్మి నలుగు సంతానాన్ని ఆయనకందించి, చాలా పిన్న వయసులోనే చనిపోయింది. అప్పటి నుండి ధర్మారావు తన యిద్దరు కుమారులు, యిద్దరు కుమార్తెలను పెంచి వాళ్ళను ఒక ఇంటివారిని చేశారు. చాలా నిబ్బరంగా హుందాగా వుండేవాడు. కాలక్షేపానికి కుదువలేకుండా మిత్రులు కలసి పేకాడుకుంటూ కబుర్లు చెప్పుకునేవారు. ఆఖరి క్షణాలవరకూ ఆయన సన్నిహిత మిత్రుడు అమెరికాలో వున్న ప్రొఫెసర్ వెలిచేరు నారాయణరావుతో, నాతో ఫోను పలికరింపులు సాగించారు.

చివరి దశలో ధర్మారావు వుద్యోగ విరమణ చేసిన వారి నిమిత్తం ‘ఆవలితీరం’ అనే మాసపత్రిక పెట్టి కొన్నేళ్ళపాటు నడిపారు. అందులో ఆయన సంపాదకీయం వుండేది. వాటిని ‘ప్రేమించుకుందాం రండి’ అనే శీర్షికతో పుస్తకంగా వెలువరించారు. ‘రవ్వలు, పువ్వులు’ అనే మరో వ్యాస సంకలనం కూడా వెలువడింది. ఒకసారి అమెరికా వచ్చి, తానావారి సత్కారాన్ని అందుకున్నారు (2006).

చెట్టుకవి ఇస్మాయిల్ అంటే ధర్మారావుకు ఎంత యిష్టమో చెప్పజాలం. మరొక ఇస్మాయిల్ ఏలూరులో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ గా వుండేవాడు. ఆ ఇరువురి కవితలను మెచ్చుకోవటం పదిమందికీ చెప్పటం ప్రచారం చేయటం ధర్మారావు నోట అనేకమంది వినేవారు. సెక్రటేరియట్ లో అధికార భాషా సంఘ కార్యాలయంలో కూర్చొని కిటికీ ద్వారా కనిపిస్తున్న రావిచెట్టును దాని ఆకులు చేసే గలగల శబ్దాన్ని వింటుంటే ఇస్మాయిల్ గుర్తొస్తున్నాడని అనేవారు.

ధర్మారావు మిగిల్చి పోయిన సాహిత్య సంపద చాలా విలువైనది.

(తెలుగు భాషా పరిరక్షణ కోసం నడుం కట్టి తెలుగు కోసమే కడ వూపిరి దాకా జీవితాన్ని అంకితం చేసిన సీ. ధర్మా రావు గారు నిన్న కన్నుమూశారు.  ఆయనకి ‘సారంగ’ నివాళి)

మీ మాటలు

  1. sambasivarao kolli says:

    ఈనాడు ధర్మారావు గారు,ఈ ధర్మారావు గారు ఒకరీనని నేను ఈ రోజు వరకు అభిప్రాయంలో ఉన్నాను.నడుస్తున్నచరిత్రలో వారి అభిప్రాయాలు చదివినవారికి తెలుగుపయిన ఆ భాష మీద ఎంత అభిమానమో తెలుస్తుంది

    • ధర్మారావుగారు పరిణతి చెందిన మహోన్నత మానవుడు.దీక్ష దక్షత రస ప్రవణత మూర్తీభవించిన ముప్పేటలా అల్లుకున్న మల్లెచెట్టు.తెలుగుతనం ఆధునికత చిన్నపోయాయి.ధర్మం పెన్నుమూసింది.వారితో చలంగారిమీద పుస్తకం ప్రచురించిన ఒక కమిటీలో పనిపంచుకునే భాగ్యం నాకు అబ్బింది.నిత్యహాసంతో నిరాడంబరంగా వినిర్మలంగా ఉండేవారు.వారిలోటు వేరెవ్వరూ తీర్చలేరు.

  2. నేనుకూడా ‘ఈనాడు’ దినపత్రికలో ‘పుణ్యభూమి’ శీర్షికన వ్యాసాలు రాసిన సి.ధర్మారావు గారు చలమాల ధర్మారావుగారే అనుకున్నానిన్నాళ్ళూ. కాదన్నమాట.
    ధర్మారావుగారితో తన అనుభవాలను ఇన్నయ్యగారు చక్కగా నెమరేసుకున్నారు.వ్యాసం ధర్మారావుగారి స్మృతికి చక్కటి నివాళి.

    • సురేశ్ కొలిచాల says:

      ఈనాడు పత్రికలో సి. ధర్మారావు పేరుతో పుణ్యభూమి శీర్షికకు వ్యాసాలు రాసిన భాషావేత్త బూదరాజు రాధాకృష్ణ.

  3. కొన్ని మరణాలు కేవలం కొంత ఖాళీనే మిగులుస్తాయి. కానీ ధర్మారావు గారి వీడ్కోలు ఖాళీనీ ఆప్యాయతనీ వెంట తిస్కుపోయాయి…గత కొన్ని దశాబ్దాలుగా పరిచయమున్న “మానవతా వాదుల్లో” ఒకరుగా ధర్మారావు గారు ఓ వాదే. ఇందులో ఇన్నయ్య గారు చెప్పిన వ్యక్తుల్లో నాకు తెలిసిన వారూ, బంధుత్వమున్నవారూ కొంతమంది ఉండటం నాకు ఆనందమనిపించినా ఆయన లేమి గురించిన ఈ వార్త నాకెప్పుడూ బాధాకరమె

  4. నాకు
    ధర్మారావు చాల ఆప్తులు
    ఆయన ఎప్పుడు అనేవారు
    హాయిగా వెళ్ళిపోవాలని
    అంత హాయిగా వెళ్లి పోవటం నిజంగా ఆశ్చర్యమే……ఆశ్వినికుమార్
    హి ఇస్ a గ్రేట్ సోల్

  5. విన్నకోట రవిశంకర్ says:

    ధర్మారావుగారు చనిపోయారన్న విషయం ఇది ఈ నివాళి వల్లనే తెలిసింది. చాలా బాధ కలిగింది. నేను హైదరాబాదులో ఉన్నప్పుడు ఆయన్ని చాలాసార్లే చూసేవాడిని. ముఖ్యంగా, ఇస్మాయిల్‌గారు హైదరాదు వస్తే, ఆయన్ని కలిసే మిత్ర బృందంలో ధర్మారావుగారు ముఖ్యులు. నిర్మొహమాటంగా, చలోక్తిగా ఆయన మాట్లాడే మాటలు చాలా గుర్తుండిపోతాయి.ఇస్మాయిగారి షష్టిపూర్తి రాజభవన్‌లో ఏర్పాటుచెయ్యటంలోనూ, మరో పదేళ్ళ తరువాత మిత్రులతో కలిసి ఆయన సప్తతి నిర్వహించటంలోనూ ఆయనదే ప్రధాన పాత్ర. చలం శతజయంతి కమిటీ అద్యక్షునిగా శతజయంతి సభలో ఆయన చేసిన ప్రసంగం కూడా నాకు గుర్తుంది. ఆయన అన్ని వయసుల వాళ్ళతో కలిసిపోయే స్నేహశీలి. వారి కుటుంబానికి నా సంతాపం. ఆయనకు నా శ్రద్ధాంజలి.

  6. Rammohan Rao says:

    నండూరి వారు తెలుగు అధికార భాషాసంఘం అధ్యక్షులుగా ఉన్నరోజుల్లో ఒకసారి ఆదిలాబాదు వచ్చినట్లు దినపత్రికలో ఒక
    వార్త చదివాను.అందులోనే ఆరోజు రాత్రి కాగజునగరులో బస చేస్తున్నట్లు కూడా చదివి మా కాగజునగర్ తెలుగుసాహితీ సదస్సు
    సభ్యులకు తెలియజేసాను.అప్పుడు మా తెసాస అధ్యక్షులుగా డా.విజయమోహన్రావు గారు ఉండే వారు.ఆయన చొరవ తో వారెక్కడ దిగేదీ తెలుసుకొని వారు రాగానే వారిని కలుసుకుందామని వెళ్తే ముందుగా మాతో ధర్మారావుగారే మాట్లాడారుఅప్పటికి ఆయనగురించి మాకుతెలియదు.ఆయనతో మాట్లాడి అత్యవసరంగా వాళ్లు దిగినవసతిగృహం లోనే సమావేశం ఏర్పాటు చేశాం.
    మాకేవ్వరికి ఎక్కువగా తెలియనందువల్ల వాళ్లే ఒకరి గురించి మరొకరు పరిచయం చేయటం జరిగింది.మా సాహితీ మిత్రుల్లో ఒకరైన రామాచార్యులకు నండూరి కాలేజీలో గురువు .అయన శీర్ణమేఖల గురించి చెబితే మేం నండూరి వారిని విన్పించమని కోరటం ఆయన ధారాళంగా దానిని చదివి వినిపించటం జరిగింది.ఆ తరువాత ధర్మారావుగారు తెలుగు భాష గురించిన ప్రసంగం చేయటం ఇంకా నాకు గుర్తు.అప్పుడే తెలుగులో చదువదగిన నూరు మంచి పుస్తకాల గురించి కూడా మాకు చెప్పారు .అలా
    ఆయనతో గడిపిన ఒక పూటైనా ఆయనకు భాషపట్ల గల ప్రేమ గురించి తెలుసుకోగలిగాం.వారికి నానివాళి.

  7. ఎవరి దగ్గరైనా ఆ వంద పుస్తకాల పట్టిక వుందా?

Leave a Reply to Apkari Surya Prakash Cancel reply

*