కలయో! వైష్ణవ మాయయో!

rekklagurram-1ఆయన యింత పని చేస్తారని కలలో కూడా వూహించలేదు.

ఇంతకు ఎవరాయన? ఏమిటా పని?

ఆయన మా తాతగారు.

అంటే మా అమ్మనాన్న..  సంస్కృతంలో మాతామహులు.

నేను మనవణ్ణి. దేవభాషలో దౌహిత్రుణ్ణి. మా తాతగారికి ఆరుగురూ ఆడపిల్లలే. లేటు వయసులో ఆయనకు వంశం నిలుపుకోవాలనే ఆలోచన వచ్చింది. నేను మూడో అమ్మాయి రెండో అబ్బాయిని.వాడిని దత్తత తీసుకొని మీరు అనుకున్నట్టు వంశం నిలుపుకోండని అంతా సలహా యిచ్చారు. నాకు హరిశ్చంద్ర నాటకంలో పద్యం జ్ఞాపకం వచ్చేది. “వంశం నిలపనేకద వివాహము. అట్టి వైవాహిక స్ఫురణ..” అని దీర్ఘంగా సాగేది.

నాకప్పుడు పదహారు వెళ్లి పదిహేడు వచ్చింది గాని డిగ్రీ ఫస్టియర్‌లోంచి సెకండియర్‌లో పడలేదు. మా నాన్నమ్మ ససేమిరా,మాకు మాత్రం ఏనూరుగురున్నారని మా యింటి దీపాన్నివ్వడం,పైగా వాడేమన్నా పనికిమాలినవాడా? అని అడ్డంగా తల ఊపారు.

నాకు మాత్రం వుత్సాహంగానే వుంది. హాయిగా వడ్డించిన విస్తరాకులా ఇల్లూ వాకిలీ, పొలమూ పుట్రా, కాలం చేసిన అమ్మమ్మ నగా నట్రా, నల్లమానుతో చేసిన పందిరి పట్టెమంచం యిలా బోలెడు హంగామాకి యజమానిని అయిపోవడం తమాషా కాదు. పోనీ బరువులెత్తాలా అంటే అదీ లేదు. కాకపోతే వంశం నిలపాలి. మరి కొన్ని హక్కులున్నప్పుడు కొన్ని బాధ్యతలు తప్పవు కదా. దత్తత స్వీకారోత్సవం అయిపోయింది.

చదువు జ్ఞానానికే గాని ధనార్జనకి కాదని నాకు తెలిసిన మరుక్షణం చదువుకి స్వస్తి చెప్పాను. తాతగారు కొన్నాళ్ళుండి వెళ్ళిపోయారు. ఆయన దైవభక్తుడు, దేశభక్తుడు. క్విట్ ఇండియా వుద్యమంలో బంగారం లాంటి వుద్యోగాన్ని,వుద్యోగరీత్యా సంక్రమించిన జట్కాబండిని త్యజించారని చెప్పుకునేవారు. అదేం కాదు ముగ్గురు ఆడపిల్లలు ఒకేసారి పెళ్ళికి ఎదిగి వచ్చారు. అంచేత పుల్‌టైమ్ ఆ పని మీద వుంటేగాని మూడు కన్యాదానాలు సాధ్యం కాదని నౌకరీ వదిలేశారు అని కొందru దగ్గిర వాళ్లనుకోగా విన్నాను. ఎందుకో నాకిదే సమంజసంగా అనిపించింది.

బ్యాంకు లాకర్ అంతా ఖాళీ అయింది గాని, ఒక్క రామకోటి పుస్తకం మాత్రం మిగిలింది. వదిల్తే మళ్లీ అంత పెద్ద లాకర్ దొరకదన్నినీ, స్టేటస్ సింబల్‌గా వుంటుందని దాన్ని మేపుతూ వస్తున్నాను. అమ్మమ్మ కట్టె వంకీ మార్చి అప్పట్లో మా ఆవిడకి రెండు జతల గాజులు చేయించడంతో లాకర్ రామనామంతో మిగిలింది. ఆరోజు నాకు వున్నట్టుండి, లాకర్‌ని వృధాగా మెయిన్‌టెయిన్ చేస్తున్నాననే ఆలోచన వచ్చింది. వెళ్ళి తీశాను.

రామకోటి పుస్తకం అందులో మిగిలిన స్థిరాస్థి. నిరాసక్తంగ పుస్తకం తిప్పాను. ఒక మెరుపు. అందులో ఫిక్సెడ్ డిపాజిట్ బాండ్! దాని ముఖవిలువ లక్షా నలభై వేలు. నలభై ఏళ్ళ క్రితం ఆ బ్యాంకులోనే వేశారు. గడువు తీరి ముప్పై ఏళ్లు దాటింది. నా నుంచి తప్పించుకుంది. దాని విలువ యిప్పుడు పదకొండున్నర లక్షలు దాటింది. నాకు అంతా సినిమా చూస్తున్నట్లుంది.

“మీకు చాలా సార్లు రెన్యూ చేయమన్నాం. కాని తమరు పట్టించుకున్నారు కాదు,” అన్నాడు మేనేజరు. మనం రాసే రిమైండర్లు సారుదాకా వెళ్తాయా?  ఆ గుమస్తాలు చించి పడేసి వుంటారని బ్యాంకు పెద్ద గుమస్తా నాకు దన్నుగా నిలబడ్డాడు.

ఆ బాండ్ మీద అప్పటి  మేనేజర్ సంతకం, మొత్తం ఎంత పేరుకుంది లాంటి లెక్కలు సాగిస్తుండగా ఒకాయన దూసుకు వచ్చాడు. “వడ్డీ మీద టాక్స్ పడకుండా  నే చూసుకుంటాను. మీరలా వుండండి,” అన్నాడు చనువుగా.

“టాక్స్‌లు మర్చిపోవడం మన జన్మహక్కు. మీరెందుకు వర్రీ అవుతారు. నేను కట్టనుగాక కట్టను,” అని అరిచాను.

నాకే కాదు, ఇంటిల్ల్లిపాదికి మెలకువ వచ్చింది..

Image: Mahy  Bezawada 

మీ మాటలు

  1. ఇదేదో autibiographical sketch అని చాలా కుతూహలం గా చదువుతూ కూర్చున్నా. భలే మోసం చేసేరే.
    అయినా, అభివాదములే .

  2. DrPBDVPrasad says:

    కల్లో కూడా మనం టాక్సులు కట్టం గాక కట్టం
    శ్రీ రమణ గారి సహజసుమ్దరమైన chamakku మెరుస్తూనెఉంటున్ది

  3. బాలాంత్రపు వేంకట రమణ says:

    అయ్యో కలా! చంపారు శ్రీ రమణ గారూ….మీకు లభించిన “ఆస్తికి” బోల్డు సంతోషించబోయాను ….

  4. మీ కొసమెరుపుల రుచి అనుభవమే కానీ..ఈ సారి ఆ చురుక్కు నిఝంగా చురుక్ మనిపించింది. మధ్య మధ్యలో మీ మార్క్ లడ్డూలూ..చక్కిలాలు..మరిన్ని వడ్డిస్తుండండి సార్.ఈ మధ్యే మళ్ళీ చదివాను మీ ‘బంగారు మురుగు’ కథ(రెండు దశాబ్దాల కథ-నవీన్ బ్యాచి సంకలించింది)ఎక్స్ లెంటాతి ఎక్స్ లెంట్ సార్!.

  5. లలిత says:

    హ..హ..హ..అంతా మాయ :)

  6. శ్రీరమణ గారూ!
    యథాశక్తి మళ్ళా మమ్మల్ని పరవశింపజేశారు. “కాలం చేసిన అమ్మమ్మ నగా నట్రా, నల్లమానుతో చేసిన పందిరి పట్టెమంచం”ఆహాహా కూర్చొని తినాలనుకొనేవాడికి ఎంత ఊరించే ఆస్తులు!!
    శ్రీరమణ గారి వల్ల మిథునం ప్రాణం పోసుకుంటే, మిథునంతో శ్రీరమణగార్కి అదనపు శోభ వచ్చిందని అభిమానుల మథ్య విన్నాను. ఎలా కాదనగలం. ప్రతి కథా ఇంతగా మమ్మల్ని ఓలలాడిస్తుంటే, ఎలా ఔనంటాం! శ్రీరమణ గారూ! అద్భుతః!!!
    రాజా.

Leave a Reply to బాలాంత్రపు వేంకట రమణ Cancel reply

*